పకీరమ్మ ప్రమాణ స్వీకారం

“హలో వన్..టూ..త్రీ.. హ్మ్! బాగానే పని చేస్తుంది. కాసేపు అందరూ సైలెంట్‌గా ఉంటే మన ఓట్ల లెక్కింపు అధికారి భుజంగరావు సార్ మాట్లాడతారు” అని మైక్ దగ్గర నుంచి పక్కకి తప్పుకున్నాడు వీఆర్వో రమణ. 

కొత్తూరు బడి ప్రాంగణం మొత్తం పంచాయతీలో ఉన్న ఐదూళ్ల జనంతో నిండిపోయింది. ఈసారి క్రాకుటూరు పంచాయితీ ప్రెసిడెంటు ఎవరా అని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ‘ఈసారి మా జయ్యమ్మే ప్రెసిడెంటు’ అని చెయ్యి గుర్తు పార్టీ మద్దతుదారులు అంటుంటే, ‘లేదు..లేదు..మా నాయుడమ్మే ప్రెసిడెంటు’ అంటూ సైకిల్ గుర్తు పార్టీ మద్దతుదారులు వాదించుకుంటున్నారు. పది నిమిషాల ముందు దాకా చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో చెప్పే సమయం రావడంతో అందరూ ఆత్రుతగా, ఆశగా ఎదురుచూస్తున్నారు.

“అందరికీ నమస్కారం! రెండ్రోజుల ముందు జరిగిన మన క్రాకుటూరు గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఓట్ల లెక్కింపు చేయడం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే..” అని ఇంకా అధికారి ఇంకా ఏదో చెప్పబోతుంటే జనంలోంచి ఒకడు, “ఆ ఇషయం ఇక్కడున్న అందరికీ తెలుసుగానీ, ముందు ఏ పార్టీ గెలిచిందో సెప్పండి” అని అరిచాడు. తాను ఎంతగానో శ్రద్ధగా రాసుకుని వచ్చిన స్పీచ్ తాలూకా పేపర్‌ని జేబులోంచి బయటకి తియ్యకుండా, ముందు టేబుల్ మీదున్న పేపర్ అందుకుని, గొంతు సవరించుకుంటూ “ఈ ఎన్నికల్లో భాగంగా అధికారంలో ఉన్న సైకిల్ పార్టీ అభ్యర్థి నాయుడమ్మ గారు..” అని ఇంకా చెప్తుండగానే, ఆ మాట విన్న సైకిల్ పార్టీ అభిమానులు ఒక్కసారిగా గోల చేసి జనంలోంచే జువ్వలు కాల్చారు. అది చూసిన చెయ్యి గుర్తు అభిమానులు కోపంతో, నిరుత్సాహంతో సైకిల్ పార్టీ మద్దతుదారులను నెట్టుకుంటూ గొడవకు దిగారు. ఇదంతా స్టేజీ పైనుంచి చూస్తున్న పోలీసులు ఏమీ చేయలేక అలా నిలబడిపోయారు. 

మైక్ ముందున్న భుజంగరావు “ఇంకా నేను చెప్పడం పూర్తవ్వలేదు. నేను చెప్పేది పూర్తిగా విన్న తరువాత మీ సంబరాలు మొదలుపెట్టండి” అని అరిచాడు. అందరూ తమ గోల ఆపి ఆయన వంక చూశారు. “ఈ ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్షంలో ఉన్న చెయ్యి పార్టీ అభ్యర్థి జయ్యమ్మ గారు…”  అని వినగానే చెయ్యి పార్టీ అభిమానులు ఒక్కసారిగా గోలగోల చేసి, జనంలోంచే ఔట్లు పేల్చారు. ఈసారి సైకిల్ గుర్తు అభిమానులు కోపంతో, నిరుత్సాహంతో గుంపులోంచి బయటకు వచ్చారు.

మళ్ళీ భుజంగరావు “ఇంకా నేను చెప్పడం పూర్తవ్వలేదు” అని ఇంతకుముందు కంటే గట్టిగా అరిచాడు. టక్కున రమణ మైక్ అందుకుని “మీరందరూ కాసేపు ఓపిగ్గా ఉండండి. సార్ చెప్పేస్తారు” అని చెప్పి, మైక్‌కి చెయ్యడ్డం పెట్టి “సార్! మీరు నాన్చకుండా తొందరగా చెప్పెయ్యండి, మావాళ్లసలే మూర్ఖులు” అని చెప్పి మళ్ళీ వెళ్లి తన స్థానంలో నిలుచున్నాడు.

“ఈ పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని ఇద్దరినీ వెనక్కి నెట్టి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మొక్కా పకీరమ్మ గారు అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు” అని పెద్దగా అరిచి చెప్పాడు భుజంగరావు.

అది విన్న జనంలో ఎటువంటి కదలిక, ఉత్సాహం లేదు. ఆ గుంపుకు దూరంగా నిలబడి ఎవరు గెలుస్తారో అని ఎదురుచూస్తున్న పకీరమ్మ మద్దతుదారులు కొంతమంది మాత్రం సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అక్కడే కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న పకీరమ్మ మొగుడు మొక్కా గంగయ్యకు మాత్రం ఎవరు గెలిచారో తెలియదు. ఆయనకి చెవుడు. సైకిల్ పార్టీ మద్దతుదారుల గోల చూసి నాయుడమ్మ గెలిచిందని కాసేపు, చెయ్యి పార్టీ మద్దతుదారుల గోల చూసి జయ్యమ్మ గెలిచిందని కాసేపు అనుకున్నాడు. కానీ గెలిచింది ఎటువంటి అభిమానులు లేని, కూలీపనులకు వెళ్లే మహిళ పకీరమ్మ కాబట్టి జనంలో ఎటువంటి హడావుడీ లేదు. దాంతో ఎవరో ఒకరు గెలిచి ఉంటారులే అనుకుంటూ, జనం వైపు చూస్తూ చుట్ట పీలుస్తున్నాడు గంగయ్య.

చుట్ట తాగుతున్న గంగయ్య దగ్గరకి ఒక పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చి “తాతా! పకీరవ్వ గెలిసింది” అని చెప్పాడు. అదేమీ వినిపించని గంగయ్య “ఆ…ఏందో గెట్టిగా సెప్పరా!” అని చుట్ట నోట్లోంచి తీసి పొగ ఊదుతూ అన్నాడు. ఆ పిల్లోడు నెత్తి గీరుకుంటూ “ఈ ముసలోడికి సెవుడు కదా, మర్సిపోయిన” అని అనుకుని, “యలచ్చన్లో పకీరవ్వ గెలిసింది తాతా” అని చెవి దగ్గరకెళ్ళి గెట్టిగా అరిచి చెప్పాడు. అది విన్న గంగయ్య ఆశ్చర్యంగా “ఏంద్రా? నువ్వు సెప్పేది నిజామా?” అని అడిగాడు. “అవును తాతా! కావాలంటే ఆడికెల్లి సూడు, అవ్వ పేరు సెప్తా ఉండ్రు” అని చెప్పి గంగయ్య చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు.

గంగయ్యను చూసి జనాలందరూ “ఏం గంగయ్యా! ఎట్టాలకి పకీరమ్మని గెలిపించినావ్” అంటూ అతణ్ని చూసి నవ్వుతున్నారు. అదేమీ వినిపించుకోని గంగయ్య నేరుగా స్టేజీ ముందుకెళ్ళి, స్టేజీ మీదున్న వీఆర్వో రమణని “సారూ..సారూ..” అని పిలిచాడు. అది విన్న రమణ “ఏది గంగన్నా? వదినేది? పొయ్యి తీసుకోన్రాపో!” అన్నాడు. చుట్టూ అంతా గోలగా ఉన్న ఆ మాటలు గంగయ్యకి బాగా వినిపించాయి. గెలుపు గౌరవాన్ని ఎలా తెచ్చి పెడుతుందో గంగయ్యకి అర్థమైంది. అంతకుముందెప్పుడూ తనని వీఆర్వో అలా పిలవలేదు. గెలుపుకి ముందు వరకు గంగయ్య అని పిలిచిన మనిషి ఇప్పుడు ‘గంగన్న’ అనే వరకూ వచ్చాడు. ఆ గౌరవం గంగయ్యకి బాగా నచ్చింది. 

“ఇప్పుడే నేనేల్లి మా ఇంటిదాన్ని తీసుకొస్తా”  అని చెప్పి ఆనందంగా నవ్వుకుంటూ, ఆ గుంపులోంచి రోడ్డు మీదున్న తన పాత ఎక్సెల్ బండి దగ్గరకు లగువు లాంటి నడకతో వెళ్ళాడు.

ఎప్పుడూ ఒక్క కిక్కుతో స్టార్టవని ఆ బండి ఇప్పుడు ఒకే ఒక్క కిక్కుతో స్టార్టయ్యింది. మట్టిరోడ్డు మీద గంగయ్య పాత ఎక్సెల్ బండి రాకెట్‌లా దూసుకుపోతోంది. గెలవడానికి ఒక్క క్షణం ముందు వరకు తమను ఎగతాళి చేసి మాట్లాడిన జనం అందరూ ఆ దుమ్ములో కొట్టుకుపోయారు. బండి కొత్తూరు నుంచి మిట్టకైలు కాడికి పోతోంది. బండి మీదనున్న గంగయ్యకి నామినేషన్ వేసే రోజు నుంచి కొంచెం ముందు వరకు జరిగిన సంఘటనలు లీలగా గుర్తొచ్చాయి.

నామినేషన్ ముందు రోజు సాయంత్రం గంగయ్య గొర్లను పెందలాడే తోలుకొచ్చాడు, గంగయ్య వచ్చేసరికి పకీరమ్మ వాకిట్లో కూర్చోనుంది. పక్కనే మధ్యాన్నం అన్నం తీసుకుపోయిన టిఫిన్ డబ్బా, బురద కొట్టుకుని ఉన్న కండువా, కాళ్ళకి గిరకల పైకి ఎండిపోయిన బురదతో పకీరమ్మ దిగాలుగా, భయంగా ఉంది.

గొర్లను దొడ్లోకి తోలి, తడిక కట్టి వచ్చి పకీరమ్మ పక్కనే కూర్చున్నాడు గంగయ్య. ఆమె ముఖంలో వందల ప్రశ్నలను చదివిన గంగయ్య “ఏందిమ్మే! ఏందదోలున్నావ్? ఏవైంద్యా…” అని అడిగాడు. “ఇంకా అవడానికేముందని? గొర్లుగాసుకుని, గెంజినీల్లు తాగేటోల్లం మనకేందుకయ్యా ఈ రాజకియ్యాలు? వాటికి చెందినోల్లు వాళ్ళున్నారు గదా!” అంది మొగుడికి వినిపించేలా గట్టిగా, కోపంగా.

“ఎవురుమ్మే వాటికి చెందినోళ్ళు? వాళ్ళంట వాళ్ళు! వాళ్ళేమన్నా పైనించి వొచ్చిండ్రా ఏంది? అయినా వాళ్ళే మంచోల్లైతే ఊరంతా లైట్లున్నై, కానీ మన కాలనీలో ఒక్క లైటన్నా ఉందా జెప్పు? ఆ బోసుబాబు సెప్పబట్టి తెలిసింది నాకు, ఈసారి మనకే అంట అవకాశం ఇచ్చింది పెబుత్వం. అది గూడా ఆడోల్లకే! అందుకే రేపు మనం పొయ్యి నామినేషన్ యేద్దాం. మనోల్లని రేపు మనతో రమ్మని పిలిసొస్తా. నువ్వేమీ ఆలోచనలు పెట్టుకోకుండా ఉండు” అని చెప్పి వాళ్ళ కాలనీలో మనుషుల్ని పిలవడానికి వెళ్ళాడు గంగయ్య.

గంగయ్య ముందు అందరూ మొహమాటానికి ‘అట్నే వస్తాం గంగన్నా’ అని చెప్పినా, అతనటు వెళ్ళాక ‘ఈడికెందుకు లేనిపోని ఆశ? పెళ్ళాన్ని పెసిరెంటును చేసి కోట్లు సంపాదించాలనేమో?’ అని చెవులు కొరుక్కున్నారు. పొద్దున్న బయల్దేరేసరికి ఎవరికి వాళ్ళు పనుల్లోకి వెళ్లిపోయారు. పక్కనోళ్ళను నమ్మడం కంటే పెద్ద తప్పు మరొకటి లేదని అప్పుడు తెలిసింది గంగయ్యకి. వాళ్లతో లాభం లేదని తమని తామే నమ్ముకున్నారు ఆ ఆలుమగలు. నామినేషన్ రోజు కాలనీల్లోంచి, ఊళ్లో రోడ్డు మీద ఎక్సెల్ బండేసుకుని ఇద్దరూ వెళ్తుంటే అందరూ నవ్వులాటగా చూశారు. ఆఖరికి వీఆర్వో కూడా ‘నీకెందుకురా ఈ యవ్వారం?’ అనే మాటల్లాంటి చూపులు చూశాడు. అన్ని అవమానాల మధ్యనే ఇద్దరూ తమ పట్టుదలను వదలకుండా ఇక్కడిదాకా వచ్చారు. ఎగతాళి చేసినోళ్ళే ఇప్పుడు తన భార్యని పొగుడుతుంటే, స్టేజీ పైనుంచి పేరు పెట్టి చివరన ‘గారు’ అని పిలుస్తుంటే గంగయ్య మనసు ఉప్పొంగిపోతోంది. ‘గారు’ అనే రెండక్షరాల పదం తెచ్చి పెట్టే విలువ, ఇచ్చే ఆనందాన్ని గంగయ్య మనసారా ఆస్వాదిస్తున్నాడు.

ఎక్సెల్ బండి మిట్టకైలు చేరింది, బండిని రోడ్డు మీద ఆపి, పకీరమ్మ పనిచేసే కైలోకి బురదను తొక్కుకుంటూ వెళ్లాడు గంగయ్య. ఎనిమిది గజాల చీరను మోకాళ్ళ పైకి గోచీ పెట్టి కట్టుకుని, పైన గంగయ్య పాత చొక్కా వేసుకుని, వానొస్తే తడవకుండా వాన కవరు వేసుకుని, అది జారిపోకుండా పురుకొస తాడు నడుంకి కట్టుకుని, ఎడం చేత్తో వరినారు పిడికిట్లో పట్టుకుని, కుడిచేత్తో నాలుగైదు వరి గెరికలు తీసుకుని, బురదలో అడుగులు లాగి అడుగులేసుకుంటూ వరి నాటుతోంది పకీరమ్మ. గంగయ్య వరికైలకు అడ్డం పడి తొక్కుకుంటా ఆదరాబాదరా రావటం చూసిన లచ్చువుడు “ఒమే పకీరా! అన్నేంది లగుదోల్తుండు? ఏందో కంగారుగా వస్తుండు? ఏందో సూడు పొయ్యి” అంది.

గంగయ్య లగువు చూసిన పకీరమ్మ ఆదరాబాదరాగా కైలోంచి బయటికొచ్చి గంగయ్యకు ఎదురుబోయింది. “నువ్వు గెలిచినావ్. నువ్వు గెలిచావ్‌మ్మే” అని నవ్వుతూ అన్నాడు గంగయ్య. ఆ మాటలు విన్న పకీరమ్మకి ఎలా స్పందించాలో తెలియక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. “ఇప్పుడు నువ్వు గొర్లు కాసుకునే మొక్కా గంగయ్య పెళ్ళాం మొక్కా పకీరమ్మవి కాదు, కాగుటూరు పంచాయితీలో ఉండే ఐదూర్లకు పెసిరెంటువి, పెసిరెంటు పకీరమ్మవి” అని చెప్పి అక్కడే అందరి ముందు ఎత్తుకుని తిప్పాడు.

అక్కడ కయ్యల్లో పనిచేసే అందరూ అది చూసి పెద్దగా నవ్వుకున్నారు. గంగయ్య భార్యని దింపేసి అందరి వైపు చూసి సిగ్గుపడ్డాడు. “సాళ్ళే! అందరూ సూస్తుండ్రు. ఏంది నీ స్యాష్టాలు అందర్లో” అని మెత్తగా కసురుకుంది పకీరమ్మ. పెళ్లాం మాట వినపడకపోయినా, ఆమె ముఖంలో భావం అర్థమై “అదిగాదుమ్మే…” అని ఏదో చెప్తుండగానే, “ముందు బండికాడికి పా” అంది. ఇద్దరూ కయ్యల్లోంచి రోడ్డు మీద ఆపి ఉన్న ఎక్సెల్ బండి దగ్గరకు వచ్చారు. 

మిట్టకయ్యల్లోంచి ఇద్దరూ బండి మీద ఊళ్ళోకి బయలుదేరారు. వెనకాల మొగుణ్ని పట్టుకుని కూర్చున్న పకీరమ్మ తర్వాత ఏం జరగబోతుందో అని ఆలోచనలో పడింది. గంగయ్య మాత్రం తన భార్య విజయానికి లోలోపల పొంగిపోతున్నాడు. బండి మట్టిరోడ్డు మీద నడుపుతున్నా ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉంది అతనికి. గంగయ్య భుజాన ఒక చెయ్యి వేసి, రెండో చేతిలో వరినారుతో వెనకాల కూర్చున్న పకీరమ్మ తొందరగా మళ్ళీ తిరిగి పనికెళ్లకపోతే కూలీ సగమొస్తుందని, ఎలాగైనా అక్కడ పని తొందరగా ముగించుకుని తిరిగి కయ్యలోకెళ్లాలని ఆలోచిస్తూ “ఏవయ్యో! బండిని కొద్దిగా తొందరగా తోలు. మళ్ళీ పొద్దుగూకిందనుకో సగం కూలే వసద్ది” అని గంగయ్యని తొందరపెట్టింది. 

“నువ్వు సాధించింది సూసిన తరవాత సగం కాదుమే, అసలియ్యాల కూలీకపొయ్యినా పరవల్యా” అన్నాడు గంగయ్య బండి వేగం పెంచి. “నీదేంబోయా! మోకాళ్ళ లోతు బురదలో కాల్లీడ్సుకుంటూ పంజేసింది నేను గదా! గెట్టున కూసున్నోడివి, ఎన్నైనా మాట్లడతావ్. ముందు బండిని కొత్తూరు బడికాడికి పోనీ” అని కొంచెం ఘాటుగానే చెప్పింది పకీరమ్మ.

బండి కొత్తూరు బడి దగ్గరకు చేరుకునేసరికి ఆ ప్రాంగణం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మామూలుగా అయితే, ఎన్నికల్లో గెలిచిన తరువాత వాతావరణం అలా ఉండదు. గెలిచిన వ్యక్తి తాలూకు మద్దతుదారుల కోలాహలంతో, ఓడిపోయిన వ్యక్తి తాలూకు మద్దతుదారుల అసహనంతో బాగా వేడిగా ఉండేది. ఈసారి మాత్రం అంతా చల్లగా ఉంది. దానికి కారణం ఎప్పుడూ కాలనీల్లో ఉంటూ,  ఓటు వేశాక కనీసం ప్రెసిడెంటు ఇంటివైపు కూడా చూడని జనంలోంచి ఒకరు గెలిచారు. ఎక్కువ శాతం పెద్ద మనుషులకి ఈ గెలుపు మింగుడు పడలేదు. మన్ను తిన్న పాములా పైకి గుంభనంగా ఉన్నా, లోపల మాత్రం కుబుసం విడుస్తూనే ఉన్నారు. ఆ సెగ వాళ్ళు చూసే చూపుల్లో పకీరమ్మకి, ఆమె మద్దతుదారులకు తగులుతూనే ఉంది.

పకీరమ్మ బండి దిగి స్టేజీ వైపు నడుస్తూ వెళ్తుంది. ఆమెకు దారి కూడా సరిగ్గా ఇవ్వకుండా నిలుచున్న జనాన్ని ముందు వెళ్తున్న గంగయ్య తన చేతికర్ర సాయంతో అలా పక్కకు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఒకరిద్దరు గంగయ్య వైపు చూసిన చూపుకి మరొకరైతే పంచెలోనే పోసుకునేవాళ్ళు. కానీ అక్కడ ఉంది గంగయ్య. నల్లడివి లాంటి చోట పగలు, రాత్రి తిరుగుతూ గొర్లను కాసిన మట్టి మనిషి, కాబట్టే ఆ ధైర్యం. ఇద్దరూ స్టేజీ పైకి చేరుకున్నారు. వీళ్ళు రావడం గమనించి, అక్కడే ఉన్న వీఆర్వో రమణ “పకీరమ్మ గారూ..కూర్చోండి” అని వినయంగా పక్కనే ఉన్న ఒక కుర్చీ తీసి వేశాడు. పకీరమ్మకి అంతా కొత్తగా అనిపించింది. ఒక్కసారి వెనకాల ఉన్న భర్త గంగయ్యని చూసింది. ఆ చూపుకి సమాధానంగా గంగయ్య తనవైపు ఓ చూపు చూశాడు. ‘ఇందుకే నేను నీకు చెప్పింది, ఈ గౌరవం కోసమే’ అని దాని అర్థం. 

కుర్చీలో కూర్చున్న పకీరమ్మ దగ్గరకు వచ్చిన భుజంగరావు ఆమె చేతికి ఒక కాగితం ఇచ్చి సంతకం పెట్టమని అడిగాడు. “నాకు సంతకం రాదు సార్” అని అమాయకంగా అంది పకీరమ్మ. భుజంగరావు నవ్వుతూ ఇంకు పెట్టె తెచ్చి ఇచ్చాడు. పకీరమ్మ తన బొటనవేలిని అందులో ముంచి మట్టి, బులుగు రంగు ఇంకు కలిసిన వేలిముద్రను కాగితంపైన వేసింది. అది చూసిన గంగయ్య, అతని కాలనీ జనాల ముఖాల్లో వెలుగు నిండింది. ఆ రంగంటే వాళ్లకంత ఇష్టం. స్టేజీపై నుంచి పకీరమ్మ కింద జనంలో నిల్చుని ఉన్న బోసుబాబుని పిలిచింది. స్టేజీపైకి వచ్చిన బోసుతో “అయ్యా! ఇప్పుడు నేనేం సెప్పాలి?” అని అడిగింది. బోసు పకీరమ్మ చెవిలో ఏదో చెప్పాడు. అది విని బోసు వైపు చూసి నవ్విన పకీరమ్మ మైకు దగ్గరకు వెళ్ళి, పక్కనే నిలుచుని ఉన్న భర్త గంగయ్య వైపు చూసి నవ్వింది. “మొక్కా పకీరమ్మ అనే నేను…” అని ప్రమాణ స్వీకారం చేసి అప్పటివరకు ఆ ఊరి పంచాయతీలో వస్తున్న ఆనవాయితీకి అడ్డుకట్ట వేసింది.

*

వాస్తవ జీవితమే నడిపిస్తోంది 

  • హాయ్ వినోద్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది నెల్లూరు జిల్లా కావలి దగ్గర్లో ఉన్న క్రాకుటూరు. నేను బీటెక్ చదివాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు సినిమాల్లో పని చేస్తున్నాను. 

  • సాహిత్యం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?

మా నాన్న నాటకరంగ కళాకారుడు. బ్రహ్మంగారి నాటకంలో కక్కయ్య పాత్రకు ఆయన ప్రసిద్ధి. ఆయన చదువుకోలేదు. చిన్నప్పుడు నా చేత ఆ నాటకంలో డైలాగులు చెప్పించుకొని వింటూ ప్రాక్టీస్ చేసేవారు. ఒకరకంగా అక్కడే నా దృష్టి సాహిత్యం వైపు మళ్లింది. మా స్కూల్లో లక్ష్మి అనే టీచర్ ఉండేవారు. ఆమె కథల పుస్తకాల తెచ్చి పిల్లల చేత చదివించేవారు. మా సీనియర్ల ద్వారా సాహిత్యం గురించి మరిన్ని విషయాలు తెలిశాయి. అప్పుడే సాహిత్యంపై ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక పుస్తకాలు కొని చదివేవాణ్ని. 

  • మొట్టమొదట ఏం రాశారు?

సినిమాలో రాయాలన్న ఆశతో అప్పట్లో కథలు, పాటలు రాసేవాణ్ని. ఆ తర్వాత బెంగళూరులో ఉన్నప్పుడు ‘అనగనగా ఓ జ్ఞాపకం’ అనే నవల రాశాను. నా ఫ్రెండ్‌కి రాజకీయాల మీద మంచి అవగాహన ఉండేది. అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు 1975 ఎమర్జెన్సీ గురించి చెప్పాడు. ఆ కాలం నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య జరిగే అంశాలుగా నవలగా రాశాను. ‘బ్లూ రోజ్ పబ్లికేషన్స్’ ద్వారా ఆ నవలను నేను సొంతంగా ప్రచురించుకున్నాను. ఆ తర్వాత శ్రీశ్రీ గారి ‘మహాప్రస్థానం’ చదివిన ప్రభావంతో ‘మరో మనిషి ప్రస్థానం’ అనే కవితా సంపుటి రాశాను. అది ప్రచురించుకునే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర మోసపోయాను. ఆ తర్వాత రాసింది ‘సొంతవూరు’ కథల సంపుటి. అది ఝాన్సీ పబ్లికేషన్స్ వాళ్లు ప్రచురించారు. 

  • ‘సొంతవూరు’ కథల నేపథ్యం ఏమిటి?

ఆ పుస్తకంలో పది కథలున్నాయి. అందులోని పాత్రలు, వారు చేసే పనులు, అక్కడి వాతావరణం అంతా మా ఊళ్లోనిదే. అయితే కథల్లోని అంశాలు మాత్రం నేను ఊహించిరాసినవి. ఏడెనిమిది నెలల పాటు వాటిని రాశాను. ఆ తర్వాత ఝాన్సీ పబ్లికేషన్స్ వారికి చూపిస్తే, బాగున్నాయని చెప్పి పుస్తకంగా తీసుకొచ్చారు. 

* మీకు నచ్చిన రచయితలు, రచనలు?

కేశవరెడ్డి గారు నా ఆల్‌టైమ్ ఫేవరేట్ రచయిత. మొదట ‘అతను అడవిని జయించాడు’ నవల చదివి, అది నచ్చి ఆ తర్వాత ఆయన రాసిన నవలన్నీ చదివాను. వి.ఆర్.రాసాని గారి ‘ఒలుకుల బీడు’ అనే నవల కూడా చాలా బాగా నచ్చింది. ఇటీవలకాలంలో రచయిత సురేంద్ర శీలం రాసిన ‘పార్వేట’, ‘నడూరి మిద్దె’ పుస్తకాలు చాలా నచ్చాయి. నాకు రియలిస్టిక్ రచనలంటే ఇష్టం. దర్శకుల్లో బాలా నా ఫేవరేట్. ఆయన సినిమాలు వాస్తవికంగా ఉంటాయి. అలా రియలిస్టిక్ వాతావరణాన్ని ప్రతిబింబించే రచనల్ని ఇష్టపడతాను.

*ముందు ముందు ఇంకా ఏమేం రాయాలని ఉంది?

ప్రస్తుతం ఓ నవల రాసే పనిలో ఉన్నాను. దాన్ని పూర్తి చేయాలి.

*

మొక్కా వినోద్ కుమార్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పకీరమ్మ చరిత్ర ను తిరగ రాసింది

    • అవును సార్…నిజ జీవితంలో కూడా అటువంటి మనుషులు చరిత్ర సృష్టించాలి…Thanks for reading

    • అవును సార్…నిజ జీవితంలో కూడా అటువంటి మనుషులు చరిత్ర సృష్టించాలి…Thanks for reading

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు