నేల అతని నిరంతర చిరునామా!

నాకు  దేవీ ప్రియ గురించి దాదాపుమూడున్నర దశాబ్దాలుగా తెలుసు. ‘ఉదయం’ దిన పత్రికలో లో ఆయనతో పాటు పనిచేసిన సంపాదక వర్గసభ్యుడుగా మాత్రమే కాదు, ఆయన కవిత్వంతో  నా ప్రయాణం సాగింది. ఆయన కవిత్వం ఒక సామాజిక రాజకీయ ప్రయాణం అని చెప్పగలను. కారణం ఏమిటంటే ఆయన  సమాజంతో నడవకుండా కవిత్వం రాసే వ్యక్తి కాదు. ఎక్కడో జరిగిన ఊచకోతకు, మరెక్కడో జరిగిన యుద్ద భేరీకి, ఇంకెక్కడో జరిగిన హత్యాకాండకు స్పందించే కవి. సమాజంలో జరిగే సామాజిక రాజకీయ పరిణామాలను గమనించకుండా, సామాజిక పరిణామక్రమంలో భాగం కాకుండా, చుట్టూ జరుగుతున్న దారుణాలకు స్పందించకుండా, తాము నడుస్తున్నది నెత్తురు దారుల్లో అని గమనించకుండా, అసలు ప్రశ్నే వేయకుండా, ప్రతిఘటించడానికి మనసొప్పకుండా కవిత్వం రాసేవాడు కవే కాదని నా అభిప్రాయం. దేవీ ప్రియ నిరంతరం అనుభవిస్తూ, బాధ పడుతూ, సంఘర్షిస్తూ తపిస్తూ కవిత్వం రాయలేకుండా ఉండే కవి.

1990లో  హైదరాబాద్ లో రాంనగర్ సమీపంలో ఉన్న ఉదయం ఆఫీసు వెనుక ఆయన ఇంట్లో టీవీలో ఒక కాసెట్ వేస్తే చూశాం. అది అయోధ్యలో రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొనేందుకు వెళ్లిన కరసేవకులపై ములాయం సింగ్ ప్రభుత్వం జరిపిన కాల్పులపై ‘ఆర్ ఎస్ ఎస్’ రూపొందించిన క్యాసెట్ అది. దీని ప్రభావం చాలా ఏళ్లు పాటు ఉంటుంది.. అని దేవీ ప్రియ  ఆరోజు అన్నట్లు గుర్తు.  ఆ తర్వాత జరిగిన బాబ్రీమసీదు కూల్చివేతను నేను కళ్లారా చూసి వార్త రాస్తున్నప్పుడు దేవీప్రియే గుర్తుకు వచ్చారు.  అవే మతఘర్షణలను ఆసరాగా తీసుకుని బిజెపి దేశమంతటా విస్తరించింది. తొలుత వాజపేయి నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం, ఇప్పుడు నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పడిన మెజారిటీ బిజెపి ప్రభుత్వం. ములాయం సింగ్ తర్వాత కల్యాణ్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే గుజరాత్ హింసాకాండ నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని బలోపేతం చేయగలిగింది. ఆ రోజే దేశంలో జరుగుతున్న ఘటనల గురించి అధ్యయనం చేసి మాలాంటి వారికి ఒక అవగాహన కల్పించేందుకు పూనుకున్న కవి దేవీప్రియ.  ఆతర్వాత ఎప్పుడో కాని బాబ్రీ మసీదుపై ఆయన

బాబ్రీ మసీదు

ఇప్పుడొక రెక్కలు విరిచిన

 బూడిదరంగు పావురం,

కుప్పకూలిన చోటే కునారిల్లుతున్న

 శతాబ్దాల శిథిల శకలాలు

రాజకీయ చరిత్రగా మారిన ఆధ్యాత్మిక పరంపర..

అని రాసిన కవితావాక్యాలు చదివితే కాని ఆయన ఆలోచన ఎంత లోతైనదో అర్థం కాలేదు. నేను పాతికేళ్లకు పైగా ఢిల్లీలో ఉండి దేశరాజకీయాల్నీ, ప్రపంచపు పోకడల్నీ అవగాహన చేసుకునే ప్రయత్నం ఇప్పటికీ చేస్తుండగా, దేవీప్రియ హైదరాబాద్ లో ఉండి తన కవిత్వంలో స్పృశిస్తున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాల్ని గమనిస్తే ఆయన అవగాహన ఎంత విస్తృతమైనదీ, విశాలమైనదీ అని నాకు ఆశ్చర్యం కలుగుతుంది.  ప్రతి వారం నేను రాసే ఇండియాగేట్ కాలమ్ ను చదివి సుదీర్ఘంగా చర్చించి సూచనలు చేసే దేవీ ప్రియలో నాకు ఆయనలోని  కవి వెనుక ఉన్న బలమైన  రాజకీయ, తాత్విక దృక్పథం గురించి ప్రగాఢమైన అవగాహన ఉన్నది.

మేము ‘ఉదయం’లో పనిచేస్తున్న రోజుల్లో తెలుగులో మహా రచయిత అన దగ్గ పతంజలి ఆ రోజుల్లో దేవీప్రియను ‘మహా కవి’ గా అభివర్ణిస్తుంటే మాకేమీ తెలిసేది కాదు. ఆయన రాసే రన్నింగ్ కామెంటరీలకు మోహన్ తో కార్టూన్లు వేయించడమే మా పని. కాని కాలం గడుస్తున్న కొద్దీ, ఆయన కవిత్వం చదువుతున్న కొద్దీ, శివారెడ్డి ద్వారకా హోటల్ లో జరిపే సమావేశాల్లో పాల్గొంటున్న కొద్దీ, మాలో కూడా ఒక కవి నిద్రలేస్తున్న కొద్దీ మేమొక నిత్వస్వాప్నికుడితో, అక్షరాలతో ఆడుకుని వాటిని అపురూపమైన కవిత్వంలోకి మళ్లించగల, నిరంతరం తడితో తపించే కవిత్వం మూర్తీభవించిన ఒక మనసున్న కవితో మేము ప్రయాణం సాగిస్తున్న విషయం మాకు అర్థమైంది.

ఆయనకు  నేల తెలుసు. మట్టి వాసన తెలుసు. దౌర్జన్యాలూ తేలుసు. తాటికొండలో బాల్యంలోనే ఆయన అన్నీ చవిచూశారు. జీవితం కోసం నగరానికి పరుగెత్తుకొచ్చారు. ఆ నగరంలో నిత్య సంఘర్షణ అనుభవించారు. ఆదే దేవీప్రియ అని కవిలో బీజం పోసింది. ఆ తర్వాత చచ్చుపడిపోయిన సమాజాన్ని చూశారు. ప్రపంచ వ్యాప్తంగా పోరాటాల్నీ సామాజిక సంఘర్షణల్నీ గమనించారు. ఉవ్వెత్తున లేస్తూ, పడిపోతూ, మళ్లీ లేస్తున్న ఉద్యమ కెరటాల్లో ఆయన తడిసిపోయారు. మానవసంబంధాలు కోల్పోయిన వైనాన్ని గ్రహించారు. మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు తెగిపోతున్న దృశ్యాల్నీ ఆయన తిలకించారు.

ఆయన ఎవరో తెలుసుకోవాలంటో ఇం..కొకప్పుడు  పేరుతో రాసిన ఆయన కవిత్వంలో ‘లక్ష్యగానం ‘ శీర్షికతో రాసిన కవిత్వం చదవాలి.

కాశీ విశ్వనాథుడిని చుట్టుముట్టిన

చాతుర్వర్ణ్య నినాద శంఖనాదాల హోరులో

బిస్మిల్లాఖాన్ అమృత షెహనాయ్ ఆలపిస్తున్న రాగం

ఆర్థమృత గంగ తరంగాల్లో

కాశ్మీర్ కుంకుమ వాసనై కలిసి పారుతుంది..

 అని రాశారు ఆయన.

దేవీప్రియకు కనపడ్డ గంగానది సగం చచ్చిపోయిన నది.  మిగతా నది ఎందుకు సజీవంగా ఉన్నదో, ఎవరి వల్ల సజీవంగా ఉన్నదో ఆయనకు తెలుసు.

ఆయన కాశీ, కాశ్మీర్ తో ఆగలేదు. ఇండోనేషియా దీవుల దేదీప్యమాన జ్వాలాముఖులవైపూ చూశారు. ఆస్టేలియాలో అబోరిజనుల ఆదిమూలాలను అన్వేషించారు. అక్కడినుంచి ఉన్నట్లుండి ఆయన దండకారణ్య సంతాప సంకేతాల అంబుల పదును చూడాలనుకున్నారు.

అక్కడితో ఆగారా.. లేదు ఆయన ఉన్నట్లుండి

కరాచీ భూగర్బ మురుగు సొరంగాల్లో

మునకలేస్తున్న నిరుపేద ముస్లింల విముక్తి  

ఎంతకోరుకుంటారో .

 స్వాతంత్ర్యం సాక్షిగా ఇంకా

తలమీద మానవ మలం మోస్తున్న

అణగారిన భారత హైందవసంతానం

కళ్లనిండా ఆత్మగౌరవ ఆనందమూ

అంతే  కావాలి ఆయనకు

నేటి సమాజంపై  గొప్ప, పదునైన, నిశితమైన దాడి ఇది? నికృష్టమైన జీవితం గడుపుతున్న అణగారిన సమాజం గురించి ఇంతకంటే సమర్థవంతంగా చెప్పిన కవులు చాలా అరుదు.

దేవీ ప్రియ ఈ సమాజం యదాతథ స్థితిలో కొనసాగకుండా ఉండాలంటే శాంతి మంత్రం పఠిస్తే చాలదని తెలుసు. ‘సకల జనుల సమస్త జాతుల శాంతీ కావాలి. శాంతి కోసం అనివార్యంగా జరిగే యుద్దం కావాలి..’ అని ఆయన రాశారు. ఆయన ‘చేపచిలుక’ కవితాసంపుటిలో యుద్దమే శరణ్యం ..అన్న కవిత్వంలో ఆయన ప్రపంచమంతా యుద్దం చూస్తాడు…

 అక్కడైనా, ఇక్కడైనా

మనిషిని బతికి ఉంచేది

నిత్య రాజకీయ, దైనందిన

 జీవన యుద్దమే..

అని ఆయన అభిప్రాయపడతారు.

అంతిమంగా ఆయనకు ఏం కావాలి.. బతుకుకోసం నిత్యం  కష్టించి, చెమటోడ్చే మానవుడు కావాలి.

 విరగపండిన జొన్నచేను మధ్యలో

మంచెమీద నిలువెత్తున నిలబడి

రివ్వున వడిసెల తిప్పుతున్న మనిషి కావాలి

అని ఆయన ‘లక్ష్యగీతం’ ముగుస్తుంది.

ఈ కవిత్వం చదివినవారెవ్వరూ దేవీ ప్రియను ఎలాంటి కవో, ఎవరి కవో తెలీక అస్పష్టంగా ఉండలేరు.

ఆయన ‘అరణ్య పురాణం’ ఆయన రాజకీయ, సైద్దాంతిక నేపథ్యాన్ని స్పష్టంగా అవగతం చేస్తుంది.

ముఖం మీద పులిపంజా పడినట్లు

అమృత్ సర్ నుంచి అయోధ్య

భగల్ పూర్ నుంచి భాగ్యనగరం,

రక్తసిక్త రహదారులన్నీ కలగాపులగంగా కలిసిపోయి

పౌరాణిక శూద్ర ఘోష

మంత్రమధుర దళిత భాష..

అని ఆయన రాశారు.

నిజానికి శివారెడ్డి, దేవీప్రియ వేర్వేరు దేహాలైనా ఒకే ఆత్మ, ఒకే మనిషి. ఇరువురూ బురదలో కాళ్లు పెట్టి నడిచిన వారే. మిట్టమధ్యాహ్నం ఎండలో చెమటోడ్డి నడిచిన వారే. ఇద్దరి భూమ్యాకాశాలు ఒక్కటే, చెప్పే తీరే వేరు. శివారెడ్డి కవిత్వం ప్రారంభించి మనను తనతో పాటు నడిపిస్తారు. దేవీప్రియ కవిత్వంలోతానే ప్రవేశించి, తానే స్పందిస్తూ మనను ఎక్కడికక్కడ మంత్రముగ్దులు చేస్తారు. తామిద్దరికీ తేడాలేదని చెప్పే దేవీప్రియ రాసిన ‘ఒక నువ్వు- ఒక నేను’ ఒక గొప్ప మార్మిక కవిత.

నువ్వు పైరగాలివి

నేను నాగులేటి వడగాలిని

నువ్వు పంటపొలానివి

నేను చేను గట్టుని

నువ్వు మట్టి పెళ్లవు

నేను ఇటుకరాయిని..

అని ప్రారంభించి..

అయినా శివా..

లోలోన మనం పలచబడిన గుండె గోడల వెనక

ఇంకా కుతకుతలాడిన జ్వాలాముఖులమే

అంటారు.

తమ జీవన సారాంశం ఒక వేడి కన్నీటి చుక్క

ఒక వాడి కరవాలపు అంచు..

అని దేవీప్రియ చెబుతారు. వారిద్దరి అపురూపపు స్నేహానికి ఆ స్నేహాన్ని పెనవేసుకునేలా చేసిన భావజాలానికి అద్భుతమైన నిదర్శనం ఈ కవిత.

దేవీప్రియను వరవరరావు, శివసాగర్ లతో పోల్చలేం. వివి, శివసాగర్  రాజకీయ కవులు. విప్లవం లేకపోతే వారు లేరు. వారు యుద్దాన్ని శ్వాసించిన కవులు.  ‘వారిలాగా తన గొంతు విచ్చుకోలేదు.. ‘అని దేవీ ప్రియ బాధపడతారు. కాని ఆయన మనసు మాత్రం గొంతులోనే కొట్లాడింది.  దేవీ ప్రియ యుద్దానికి ముందూ, యుద్ద సమయంలోనూ, యుద్దం తర్వాత పరిస్థితులను గమనించి, ఆ పరిస్థితుల్లోకి తాను కవిగా ప్రవేశించి, అనుభవించి రాసే కవి. దేవీప్రియకు ఒక అపరిమిత కాన్వాస్ ఉంది.

ఆయన రాసిన ‘పిట్టకూడా ఎగిపోవల్సిందే’ అన్న కవితా సంపుటి ఆయన తాత్విక చింతనకు అద్దం పట్టిన సంపుటి. గోరీమీద గడ్డిపరకల్లా పరచుకున్న చేతి వ్రేళ్లు, గుహల గోడలకు వేళ్లాడే సామూహిక మారణాయుధాలు, గాలిలో తేలివచ్చే రసాయన మరణ దుర్గంధాలు, కాళ కరాళమూర్తులైన కథాపురుషుల జన్మస్థానాలు, ఉత్తుంగ ఉన్మాద తరంగాలు, మతిభ్రమణలో మహామేధోవలయాలు, ఎర్రబారిన ధూళి రేణువుల వెర్రిబాగుల మౌన భ్రాంతులు ఇవన్నీ ఆయన కవిత్వంలో తచ్చాడుతాయి. ఎక్కడ చూసినా రక్తపు వాసన వేస్తున్న పాదముద్రలు. అని ఆయనఆవేదన చెందుతారు.

ఇక ‘గాలి రంగు’.. ఆయన నిన్నటికీ, నేటికీ, రేపటికీ మధ్య కొట్టాడుతున్న మనిషిలా రెపరెపలాడుతూ కనిపిస్తారు.. గాలిరంగునైనా ఊహించగలనేమో.. కాని రానున్న రేపటి రూపే చూపుకందడం లేదు. ..అని ఆయన వాపోతారు.

దేవతలకి స్వర్ణకలశాలతో

పంచామృతాలతో అభిషేకాలు చేశాం..

 కాని సోదరా..

మనిషి మాలిన్యాన్ని

 అన్నీ నులివెచ్చని కన్నీళ్లతో

కడిగి శుభ్రం చేయలేకపోయాం..

అని ఆవేదన వ్యక్తం చేశారు.

నీ నులివెచ్చని క్షణ పరిమళ స్పర్శకోసం పరితపించిన స్వప్న పరంపర నేటికీ కొనసాగుతున్నట్లే స్ఫురిస్తోంది.. అని ‘ఒంటరి ఇద్దరు’ పేరుతో రాసిన దేవీప్రియను  చూస్తే ఆప్యాయంగా హత్తుకోవాలనిపించింది. ఆయన ఒంటరితనాన్ని ఎవరూ పంచుకోలేరు. కాని ఆయన తాను ఒంటరి వాడిని కానన్న భావన మనం కలిగిస్తే చాలు.. అనిపించి సాధ్యమైనప్పుడల్లా ఆయనతో మాట్లాడేవాడిని

దేవీప్రియ ఇంతకీ ఏ కవి?  తనను తాను పైగంబరకవిగా ఆయన చెప్పుకున్నారు. దిగంబర కవిత్వం వచ్చి తెలుగుసమాజాన్ని ఒక ఊపు ఊపుతున్న రోజుల్లో ఆ స్ఫూర్తితో పైగంబరకవులు గా దేవీప్రియ, సుగమ్ బాబు, ఓల్గా తదితరులు అవతరించారు కాని వారిలో దేవీప్రియ ఒక్కరే రచిస్తూ రచిస్తూ ముందుకు సాగారు. వరంగల్ లో వచ్చిన చేతనావర్త కవిత్వం కూడా అలాంటిదే. వారిలో అందరూ తర్వాతి కాలంలో కవులుగా మిగలలేదు. దిగంబర కవిత్వం కుళ్లుసమాజంపై వెలువడ్డ విద్వేష కవిత్వం కనుక ఆ భాష, ఆ విద్వేషం ఆ కవిత్వంలో ఇమిడిపోయాయి. అది ఒక చారిత్రక సందర్భం. ఆ స్ఫూర్తితో నే ఆ ఆవేశం మరో వైపు మళ్లి విప్లవకవిత్వం వైపుకు దూసుకెళ్లింది. అందువల్ల పైగంబర, చేతనావర్త కవిత్వం చరిత్రలో చిరుజ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.

మరి దేవీప్రియది ఎటువంటి కవిత్వం? ఆధునిక కవితా చరిత్రలో ఆయన స్థానం ఏమిటి? అని ప్రశ్నించుకుంటే ఆయన తనకు తాను ఒక చరిత్రను సృష్టించుకున్నారని చెప్పక తప్పదు. ఆయన కాలంతో పాటు పయనించారు. దిగంబర, పైగంబర, అభ్యుదయ, విప్లవ కవిత్వాలను గమనిస్తూ, జీర్ణించుకుంటూ సమాజం నిరంతరం తనను ఆధునిక కవిగా భావించే స్థితికి ఆయన ఎదిగారు. దేవీప్రియ ఒక సామాజిక పరిణామంలో భాగం. ఏ ఒక్క కవితాఉద్యమమూ ఆయన కవితా స్థాయిని నిర్దేశించలేదు. ఆయనలో రకరకాల భావావేశాల వెల్లువలు ఉన్నాయి. ఒక సూఫీ తాత్విక ధోరణి ఉన్నది. సమాజంలో అన్యాయాలపై తిరగబడాలనే వాంఛ బలంగా ఉన్నది. ప్రతిఘటిస్తూ పోరాడుతున్న వారిపై అమితమైన ప్రేమ ఉన్నది. పోరాడుతూ విరమిస్తూ కాలం వెల్లువలో కొట్టుకుపోయిన వారిపై జాలి ఉన్నది. దేవీ ప్రియ సమాజంలో ఒకే పార్శ్వాన్ని చూడలేదు. ప్రపంచమంతటా జరుగుతున్న సంఘర్షణల్నీ, మనిషికీ మనిషికీ వ్యాపార సంస్కృతి పెంచుతున్న దూరాన్ని ఒక సైద్దాంతిక దృక్పథంతో గమనిస్తూ ముందుకు సాగారు. ఒక విశ్వజనీన, సార్వత్రిక కవిత్వాన్ని సృష్టిస్తూనే ఆయన నేల విడిచి సాము చేయలేదు.

నేల విడిచి పోగలదా..

 చెట్టు ఎంత ఎత్తుకెదిగినా..

గూడు విడిచిపోగలదా..

 పక్షి ఎంత పైకి ఎగసినా..

నీరు విడిచిపోగలదా..

చేప ఎంత ఈదినా..

అని ఆయన రాసిన వాక్యాలు ఆయనకే అన్వయిస్తాయి.

ఏ ప్రగతిశీల భావజాలమైనా, ఏ విప్లవ దృక్పథమైనా దేవీప్రియను విస్మరించలేని పరిస్థితిని కల్పించుకున్నారు. గద్దర్ గళంతోనూ, గూడ అంజయ్య కలంతోనూ ఆయన తన కలం పంచుకున్నారు. యువకవులతో కూడా పోటీ పడి ఆయన నిజంగా యువకుడేమోనన్న అభిప్రాయాన్ని కల్పించారు. అయినా

‘చెప్పకుండా ఉన్నవే ఎక్కువ..

రెప్పలు విప్పిన కళ్ల

 కన్నీటి మెరుపుల మీద

 ఇంకిపోయినవే ఎక్కువ’

అని ఆయన బాధపడ్డారు. తన దిగులంతా

‘భుజాలమీద బరువు గురించి కాదు,

పొంచి ఉన్న మరణం గురించి కాదు,

సగంలో ఉన్న రణం గురించే.. ‘

అని ఆయన ఆవేదన చెందారు.

కవి శరీర నిర్మాణం ( ఎనాటమీ) అని ఆయనే రాసిన కవిత్వంలో తన ఎనాటమీ గురించి ఆయనే చెప్పుకున్నారు. తన శరీరాన్ని తెరిస్తే.. తన కంఠాన్ని కత్తిరిస్తే.. తన చర్మాన్ని ఒలిస్తే.. తన గుండెను పెరికితే.. బరువుతూ ఒంగిపోయి నేలను తాకుతూ.. నా ప్రజలు..స్త్రీలు, పురుషులు, పిల్లలూ, తల్లులూ, తండ్రులూ. శ్రమిస్తూ.. మరిగిపోతూ. కరిగిపోతూ కనిపిస్తారు.. అని ఆయన రాసుకున్నారు.

అవును ఆయన ఎలాంటి కవి.? ఆయన ప్రజాకవి.. శివసాగర్, గద్దర్, దేవీప్రియ ఈ ముగ్గురికీ తెలుగుసాహిత్య క్రమంలో ఘోరమైన అన్యాయం జరిగిందని పతంజలి అనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. ఈ ‘కవితా మహావచన శిల్పి’కి  ఎన్నో ఏళ్ల తర్వాత   కేంద్ర  సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ఒక సాంత్వన కలిగించే విషయం.

పాటలు పాడే

పెంపుడు పసిరిక పాముని

 మెడలో వేసుకుని

కాళ్లకు చుట్టుకున్న

 నా వాగుతో కలిసి

కుంకుతున్న పొద్దులోకి

సముద్రం మీద అడుగులు వేసుకుంటూ నడిచిపోతాను.

-అని రాసిన దేవీప్రియ ఇక లేడని తెలిస్తే గుండె బరువెక్కుతోంది….

*

 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

10 comments

Leave a Reply to జియా Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మహాకవికి నీరాజనాలు. దేవీప్రియ దేవీప్రియగానే ఉండడం తెలుగు సమాజ అవసరం. అందుకే ఆయనను ఏ బిరుదులూ అవార్డుల అనకొండలు మింగకుండా స్వచ్ఛమైన ప్రజాకవిగా మిగిల్వాయి. అలాగే కాపాడుకుందాఙ.

 • దేవిప్రియ గారిపై కృష్ణుడు రాసిన వ్యాసం లో….. శతాబ్దాల అని ఆరంభం లో రాశారు…దశాబ్దాల అయి వుంటుంది…సరి చూడండి..

 • అవును ఆయన ఎలాంటి కవి.? ఆయన ప్రజాకవి.. శివసాగర్, గద్దర్, దేవీప్రియ ఈ ముగ్గురికీ తెలుగుసాహిత్య క్రమంలో ఘోరమైన అన్యాయం జరిగిందని పతంజలి అనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.
  చాలా బాగా వివరించారు.అభినందనలు.

 • నేను 2018 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం స్వీకరించేందుకు ఢిల్లీ వచ్చినప్పుడు మోతహతిసారి చూశాను. డెల్లి లో సాహిత్యప్రియులు తరపున వారికి సత్కారసభకి మిత్రులు కృష్ణరావు గారు సహాయ పడ్డారు.
  ఆ రోజు ప్రత్యక్షంగా దేవీప్రియకు శివారెడ్డి గారికి ఉన్న అన్యోన్య స్నేహన్ని చూశాం.
  ఈ రోజు రాతలలో కృష్ణరావి గారు దేవీప్రియ గారిని, వారి భావాలను, వారి కవిత్వాన్ని విస్తృతంగా పరిచయం చేశారు. చాలా కొత్త విషయాలు తెలిసాయి. దేశం ఉన్న ఈ గడ్డుకాలం లో దేవీప్రియ గారి ఉత్తేజపరిచే కవిత్వం మనకు ఆసరాగా లేకపోవడం చాలవిచారకరం.

  కృష్ణరావు గారికి అంతటి గొప్ప కవిని చాలా వివరంగా పరిచయం చేసినందుకు కృతజ్జ్ఞతలు .

 • దేవీప్రియ గారిని ఆసాంతం పరిచయం చేయడం బాగుంది కృష్ణారావు గారు. కృతజ్ఞతలు

 • దేవిప్రియ గారి సాహితీ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారు.. ధన్యవాదాలు కృష్ణారావు సార్ గారికి..

 • దేవిప్రియ సామాజిక నిర్మాణంతో నడిచిన కవి. ఏ కవిత్వ ఉద్యమమూ ఆయన కవితా స్థాయిని నిర్దేశించలేదు.. అనే వాక్యాలు అక్షర సత్యాలు. సమకాలికుల మధ్య ఆయన ఆధునికుడిగా ఎలా నిలిచాడో చెప్పిన విశ్లేషణ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా, అతిశయోక్తికి తావు లేకుండా సాగింది. జీవితంలోని భి్్న్న పార్శ్వాలను ఆయన తన కవిత్వంలో దర్శనం చేయించగలిగాడు. కుడోస్ కృష్ణుడుగారూ.

 • మూగ గా వర్షించిన దిగులు మేఘం…
  కొనగోట విదిలించిన కన్నీటి చుక్క చప్పుడు,
  పాతబడిన ఆల్బం లోఉల్లిపొర కాయితం కింద తడి కళ్లతో తడిమి చూసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో..

 • ఐదు దశాబ్దాల పాటు ప్రముఖ కవిగా, పాత్రికేయుడిగా సేవలందించిన దేవీప్రియ ( ఖ్వాజా హుస్సేన్‌ ) కాలంతో పాటు పయనించారు. దిగంబర, పైగంబర, అభ్యుదయ, విప్లవ కవిత్వాలను గమనిస్తూ, జీర్ణించుకుంటూ సమాజం నిరంతరం తనను ఆధునిక కవిగా భావించే స్థితికి ఆయన ఎదిగారు. 2020, నవంబరు 21వ తేదీన హైదరాబాదులో కన్నుమూశారు. దేవిప్రియ మృతి తెలుగు సాహిత్యానికి తీరనిలోటు.

  ‘అమ్మచెట్టు’, ‘తుఫాను తుమ్మెద’, ‘నీటిపుట్ట’, ‘చేప చిలుక’, ‘సమాజానంద స్వామి’, ‘గాలిరంగు’, ‘గరీబు గీతాలు’, ‘గంధకుటి’ తదితర కవితా సంపుటిలతో పాటు పలు రేడియో, రంగస్థల నాటికలు, సినిమా పాటలు రచించారు. ‘గాలిరంగు’ కవితా సంకలనానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.

  1977లో దేవిప్రియ గారి సంపాదకత్వం లో వచ్చిన ‘ప్రజాతంత్ర’ వారపత్రిక లెఫ్ట్ భావజాలం ఉన్న యువతని ఒక ఊపు ఊపాయి. సమాజానంద స్వామి, ఆ తరవాత ‘ఉదయం’ దినపత్రికలో రన్నింగ్ కామెంటరీలు కొన్ని మచ్చు తునకలు.

  రంగులకల సినిమాలో “జమ్ జమ్మల్ మర్రీ” పాటలో ’ధారలు కట్టిన చెమటే జరి పైట నీకు, చల్‘ అన్న దేవిప్రియ నేల తన చిరునామా అని చెప్పకనే చెప్పారు. దాసి, రంగులకల మొదలైన సినిమాలకు స్క్రీన్ ప్లే, పాటలు వ్రాశారు. ప్రజాగాయకుడు గద్దర్ ఆంగ్లంలో పూర్తి నిడివి డాక్యుమెంటరీ ఫిలిం మ్యూజిక్ ఆఫ్ ఎ బ్యాటిల్‌షిప్ పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు.

  శివసాగర్, గద్దర్, దేవీప్రియ ఈ ముగ్గురికీ తెలుగుసాహిత్య క్రమంలో ఘోరమైన అన్యాయం జరిగిందని పతంజలి గారు( తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు కె. ఎన్‌. వై. పతంజలి) అనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.

  దేవిప్రియ గారు గొప్ప కవి మాత్రమే కాదు.. గొప్ప మానవతావాది, గొప్ప స్నేహశీలి కూడా. వారి ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినప్పుడు ఫోనులో మాట్లాడే అదృష్టం పొందాను.

  వారి సుదీర్ఘ సాహితీ యానాన్ని తలపోస్తూ ప్రజాకవి దేవిప్రియను ఆవిష్కరించారు… ఆర్తితో కూడిన నీరాజనాలు అర్పించారు కృష్ణుడు గారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు