నువ్వు మాత్రమే లేవు

‘చెప్పండి నా…’
రాత్రిపూట అక్షరం కాలేక నిన్ను తడిమితే
మెత్తటి గొంతు…
ఆపైన రేపటి ఉదయం చిలుకకొయ్యకు తగిలించడానికి
నువ్వు నేసే వార్తల వంతు

*   *   *

యుద్ధంలానూ… శాంతిలానూ…
ఏకకాలంలో ఎలా సాధ్యమో అసలు
చల్లటి చిరునవ్వు మాత్రమే చూశాము కానీ
లోలోపలే తెగి ముక్కలుముక్కలుగా రాలుతున్న చప్పుడు
నీ భార్యాబిడ్డలైనా వినగలిగారా?

*   *   *

ఇంతగా ఏకాంతాన్ని కౌగిలించుకున్నావని
లోలోపలే ఉండలుఉండలుగా చుట్టుకుని పోయావని
నీ చుట్టూ ఆవరించిన సమూహత పసిగట్టే ఛాన్సే ఇవ్వలేదు కదా
పువ్వు మెత్తగా విచ్చుకోవడం చూడలేదు నేను
కత్తిలా దిగబడ్డప్పుడు మాత్రం నువ్వై కనిపించావు

*   *   *

నిన్ను నీలోకి దాచేసుకుని
ఎవరెవరివో కన్నీళ్ళు భుజాన మోసుకుని
నడుస్తూ నడుస్తూ రోడ్డు మలుపులో మాయమైపోతావని
ఇక ఎదురుచూపులు లేనేలేవని తెలిసే వుంటే…
ఆయమ్మ కన్నీళ్ళు నిలబెట్టి వుండేవేమో

*   *   *

అవును, నువ్వొక పరిచిత అపరిచితుడివి
అందరూ వున్న అనామకుడివి
సుపరిచిత దారుల్లో కదులుతున్నట్టే అనిపిస్తూ
విడిచిపెట్టిన వొయాశిస్సుకోసం వెదకులాడే ఎడారి పథికుడివి

*   *   *

ప్రతి సాయంత్రమూ అక్షరాలు వార్తలుగా మారుతూనే ఉన్నాయి
ఉదయాలన్నీ వార్తాపత్రికలను మోసుకొస్తూనే ఉన్నాయి
రాజకీయాలు.. . కుట్రలు… కుతంత్రాలు…
యథాతథంగా బతుకుతూనే ఉన్నాయి
నువ్వు మాత్రమే లేవు…

*   *   *

మిత్రమా!
నిట్టనిలువునా కూలిపోయావు కదా
ఆ కత్తిపోట్లను నీ చిట్టచివరి ఊపిరి అడిగే వుంటుంది
‘నేనేం పాపం చేశాను?’
‘సాటి మనిషికి సాయపడడం నేరమా?’ అనికూడా
సమాధానమయ్యే శక్తి ద్వేషం కక్కిన రక్త ధారలకే కాదు
మాకు కూడా లేదు… క్షమించు!

(ఏప్రిల్ 28, 2026 న హత్యకు గురైన ఆత్మీయ స్నేహితుడు, చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆంధ్రజ్యోతి దినపత్రిక జర్నలిస్టు వి.జగన్మోహన్ రెడ్డి స్మృతిలో- రచయిత)

చిత్రం: చిట్టత్తూరు లాస్య

చిట్టత్తూరు మునిగోపాల్

పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం: తిరుపతి జిల్లా), శ్రీకాళహస్తి సమీపంలోని తిమ్మసముద్రం అనే చిన్న గ్రామం. చదివింది శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిత్వం. సుదీర్ఘకాల సాహిత్య పఠనమే నన్ను రచనలవైపు మళ్లించింది. రచనలు చేయడం ఈమధ్య కొన్నేళ్ళ నుంచే. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ఆదివారం ప్రత్యేక అనుబంధాలు, సారంగ, ఈమాట, నెచ్చెలి, సంచిక, కౌముది, గోతెలుగు. కామ్ వంటి ప్రముఖ వెబ్ పత్రికల్లో రచనలు ప్రచురితం.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.