నిరలంకార సాంద్రకవి ప్రసాదమూర్తి

Everything will past, and the world will perish but the ninth symphony will remain – Mishail Bakunin

బితోవిన్ 9వ సింఫనీని పిండితే వచ్చే అంతిమ సారమంతా … సమానతలోని, దాని స్వేచ్ఛలోని గాఢానుభవమే కదా.. జీవితం అనే ఎరుక వస్తుంది. ’ప్రసాదమూర్తి‘ కవిత్వం అంతా అదే.  కవిత్వం రాయడానికీ, కవిత్వాన్ని చేరువ కావడానికీ వొక ప్రత్యేకమయిన దారి అంటూ ఏమీ ఉండదు. ఏ దారి ప్రత్యేకత దానికే. వొక కవి నడిచి వచ్చిన దారి, ఆ కవికి మాత్రమే పరిమితం. ఒక్కొక్కసారి గొప్పకవుల అడుగుజాడలు కూడా మసక మసకగా కాలంలోకి జారిపోతుంటాయి. కొత్త కవులు అనుసరించిన కొద్దీ అవి ఇంకా ఇంకా మసకబారి పోతుంటాయి. అనుభవాలు సాంద్రపడుతున్న కొద్దీ, చిక్కనవుతున్న కొద్దీ కవి, తన అడుగుజాడల్ని తానే చెరిపివేసుకుంటూ… జీవితపు అంచుల్ని చేరటమే తన లక్ష్యంగా పెట్టుకుంటాడనిపిస్తుంది. అసలైన కవిత్వం రుచి మంచి కవికి ఎప్పుడు తెలిసి వస్తుందంటే .. స్పష్టతలో.. అస్పష్టతని పట్టుకోగలిగినప్పుడు మాత్రమేనేమో? ఆ రుచిలో అసలు సిసలైన స్వేచ్ఛ మనకు అర్థమవుతుంది. అస్పష్టత రుచి మరిగిన కవిని.. మృత్యువూ హింసా.. physical annihilation లాంటి మామూలు విషయాలు ఏమీ చేయలేవు. అటువంటి అస్పష్టత తాలూకు రుచిని పాఠకుడికి చాలా సారవంతంగా.. పరానుభవ స్థాయిలోకి వెళ్ళి మరీ అందివ్వగల కవిత్వం ప్రసాదమూర్తిది.

తనను తన ఏకత్వం నుంచి విడగొట్టుకుని.., తనను నిర్మూలించుకుని.. పూర్తిగా అనేకతలోకి, సామూహిక ఏకాకితనంలోకి, multiple beingఅయ్యి.. దేశాలు లేని, సరిహద్దులు లేని, వివక్షలు లేని, అసమానతలు లేని మనిషిలోకి వెళ్ళి ఇంకిపోయి ప్రాణ సంచారం చేస్తూ వుంటాడు.

(గుండె కొల్లేరు కవిత చదవాలి, పూలండోయ్ పూలు – వాస్తు శిల్పి – నదితో నడక – కవితలు చదవాలి)

ఒకే జన్మలో అనేకానేక జన్మల్ని జీవించడమే కదా కవి జీవితం అంటే.. ఇంతకంటే ఏమివ్వగలడు కవి. ప్రపంచానికి. అందుకు నాకు కవిత్వం రాయడం కంటే వినడమూ.. చదవడమే ఇష్టం. ఒక అద్భుతమైన పదమో దాని చిత్రంతో మన కళ్ళ ముందు వాలిపోయినప్పుడు కలిగే క్రియేటివ్ ఆర్గాజమ్ ఎంత బాగుంటుంది.  తన book shelf లోని పుస్తకాలను నోరు అప్పగించి చూసినప్పుడల్లా,  మో అనేవాడు.. చాలా సార్లు.. ‘’ రాయడమెందుకురా, ఈ పుస్తకాలన్నింటినీ చదివి చనిపోవాలి గాని‘‘ అని.  అదెంతో నిజం.  ప్రసాదమూర్తి కవిత్వం క్రియేటివ్ ఆర్గాజం కి గురి చేస్తుంది. చేతివేళ్ళలోంచి నీళ్ళలాగా జారిపోయే మాటలు చెబుతున్నట్టే ఉంటాయి చాలా కవితల్లోని పదాలు. కాని ఊహించని విధంగా అవే మాటలు మంచునిప్పులై జారిపోవడమూ తెలిసివస్తుంది. ఇది ఎలా సాధ్యమని కవిని అడిగితే.. ఏమీ ప్రయోజనముండదు? మంచి కవిత్వం ఏ మర్మానికీ చిక్కదు అంతే.

దేశం లేని ప్రజలు సంకలనంలోని నానమ్మ కవితలో మనసులో పేర్కొని పోయిన బురద గురించి చెప్పినా.. , ఎందుకే నానమ్మా కల్లో కూడా ఆడుకోనివ్వవా…, చింత చిగురు, ఏట మాంసం, ఏదీ నీ చేత్తో ఓ ముద్ద పెట్టవే నానమ్మ, జీవితమంతా ఆకలేనే, ఏ జీతమూ, ఏ కౌగిలీ తీర్చలేని ఆకలి ఇది… అన్నప్పుడు కరిగి.. చెరువై.. పారిపోమా మనం పాఠకులుగా! ఇటువంటి Performanceకి ముగ్ధులమైపోయి ఎంతో ఎత్తులోకి.., అంతకంటే ఎత్తైన లోతుల్లోకి జారిపడిపోమా? అటువంటి ద్రవస్థితి పొంది ఆవిరైపోయి అనుభవ అనేకతను సాధించడం మంచి కవి వల్లనే పాఠకుడికి సిద్ధిస్తుంది. పాఠకుడి సంస్కారాన్ని సంస్కరిస్తుంది. ప్రసాదు కవిత్వంలాగ. కవి నుంచి హృదయ సంపదనూ, అనుభవ సంపదను పొందడమే పాఠకుడికి నజరానా‘. అటువంటి కానుకని అలవోకగా సింపుల్ గా ఇస్తాడు ప్రసాదమూర్తి. సింప్లిసిటి అన్నది అంత తేలికగా సాధించే గుణం కాదు. ఎంతో ప్రయాసనూ, సాధననూ పొందితే తప్ప మామూలుతనాన్ని సాధించలేము కవిత్వంలో.  చలంగారి – Economy of words తత్వాన్ని unconscious గానో కామన్ గానో .. తన దృష్టిలో వంపుకున్న వైనమే ఈ కవిత్వమంతా.

    జపేనీయ కవులు, సూఫీ  కవులు, పాలస్తీనియన్ కవులూ, భారతీయ బహుజన ఆధ్యాత్మిక (రాజకీయ) కవులూ సాధించిన నిరలంకార అభివ్యక్తిని ప్రసాదమూర్తి తన కవిత్వం ద్వారా అదుకున్నాడని అతని ఎన్నుకున్న కవితలను చదివితే తెలిసింది,  లేదా.. పాఠకునిగా అనుభవంలోకి వచ్చింది.

ఎంత చదివిన పండితుడికయినా.. మేధావికయినా.. అకడమీషియన్ కైనా, పాఠకుడికయినా.. కవిత్వం.. ముందుగా హృదయం ద్వారానే మన స్వానుభవంలోకి వస్తుంది. ఏ వ్యాకుల వాక్యమయినా, తన్మయ పదమయినా, హృదయభాష ద్వారానే పాఠకుల చేరువలోకి వస్తుంది. ఒక కవి కవిత్వాన్ని మనకు చేరువ చేసేది .. ఆ కవిలో వుండే ’గుండె గుడిశె‘ భాష వల్లనే.. ప్రసాదమూర్తి తన కవిత్వ సంకలనాల్లో సాధించిన పరిణతి ఈ హృదయ కవిత్వ తత్త్వమే అని నాకనిపిస్తుంది.

’’రాత్రికి పుస్తకాలు కలలై, కలలు పడవలై

నన్ను మాటలుగా కట్టి, ఇంకా ఎవరూ కనుక్కోని

మానవ సుఖతీరాలవైపు, మోసుకుపోతుంటే

జీవితమే సఫలమూ.. అని పాడుకుంటాను.‘‘

(చిన్ని ఆశ కవితలో)

(చేనుగట్టు పియానో సంకలనం నుంచి)

అని ఎంతో సింపుల్ గా గాఢంగా ఎవరనగలరు. మన ఊపిరికి ఉన్నంత సింప్లిసిటీ వున్న ప్రసాదమూర్తి మన స్వరానికి మార్దవం ఉన్నంత జీవ లక్షణం ఉన్న ప్రసాదమూర్తి అనగలడు.

ఎందుకంటే తనలో .. మామూలు, సహజ, నిసర్గ సాంద్రత వున్నందువల్ల.. ఆ Openness సాధ్యమయ్యింది. Jaques derrida.. సాధికారికంగా చెప్పిన Institutionalize అవ్వని అస్తిత్వం వల్లనే అంత simpleton expression, pure interiority లోంచి బయటికి వస్తుంది.

ప్రసాదమూర్తి తన కవిత్వం ద్వారా.. ఒక స్వయం అస్తిత్వం వున్న ఏ ఆధిపత్య భావదాష్టీకానికీ లొంగని సౌందర్య తీక్షణత, హృదయ వాస్తవికత.. గురించి చెబుతున్నాడు. చల్లగా.. నల్లగా.. మెల్లగా.. గాఢనీలంగా.. మైమరపుగా..

అతని కవిత్వ చెరువులో పచ్చాపల్లా.. ఈతలు కొడితే ఈ విషయం తెలిసి వస్తుంది.

*

Avatar

సిద్ధార్థ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ” అంతులేని కవితా సంపుటాల మధ్య తప్పకుండా వెతికి సంపాదించి, చదువుకోవాల్సిన కవితా సంపుటాల్లో పరిమళం , పదును రెండూ వున్న ప్రసాదమూర్తి కవితా సంపుటి ʹచేను గట్టు పియానో ʹ ముందు వరసలోనే వుంటుంది. ”

    ” జీవితం పట్ల, ప్రేమల పట్ల, ప్రపంచం పట్ల, మానవ సంబంధాలు, అనుభూతులు, స్పందనల పట్ల ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పట్లా, మనిషితనం పట్లా కవికి గౌరవం, విశ్వాసం వున్నాయని ఈ కవితలు చెపుతాయి. ”

    ~ పలమనేరు బాలాజీ

    http://virasam.org/article.php?page=383

    మో, అజంతా, శివసాగర్, శ్రీశ్రీ, ఇస్మాయిల్, చలం, రంధి సోమరాజు అంతరంగంలోకి వీళ్ళని తెచ్చుకుని నింపుకున్న తర్వాత నా రక్తంలోంచి, నా భాషలోంచి, నా వ్యవహారంలోంచి బయటకొచ్చింది నా కవిత్వం …. ‘దీపశిల’ ‘బొమ్మలబాయి’, ‘మల్లెల తీర్థం’ సంపుటాల్లో అన్న కవి సిద్ధార్థ గారికి నెనర్లు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు