నాకు కులాలపై వ్యతిరేకత లేదు,
పల్లెలపై పరాయితనం లేదు…
కానీ నా ఆత్మ పెరిగిన నేల
వేరుగా ఉంది అంతే.
మా ఇంట్లో
పండుగలు పెద్దగా తలుపు తట్టలేదు,
దేవుళ్లు గోడలపై వేలాడినా
భయంగా గానీ, భక్తిగా గానీ
మా జీవితాన్ని నడిపించలేదు.
సందడి అంటే
వందమంది మధ్య నవ్వులు కాదు,
మేము ఆరుగురం ఒకే గదిలో కూర్చొని
నిశ్శబ్దాన్ని పంచుకోవడం.
బంధుత్వం అంటే
వంశ వృక్షాలు కాదు,
మనసు అలసినప్పుడు
ఎవరి దగ్గరికి పరుగెత్తుతామో వాళ్లు.
అందుకే నాకు ప్రేమ అనేది
ఇంటిపేరు కలవడం కాదు ,
ఆలోచనలు ఒకే దారిలో నడవడం.
ప్రతి ఆదివారం ఫంక్షన్లలో గడిపే మనిషితో
నా ప్రశాంతత బతుకుతుందా?
ప్రతి నిర్ణయాన్నీ
“మన వాళ్లు ఏమంటారు?” అని కొలిచే ఇంట్లో
నా స్వేచ్ఛ ఊపిరి పీల్చుకోగలదా?
నేను ఎవ్వరినీ చిన్నచూపు చూడట్లేదు…
గ్రామాన్ని కాదు,
సంప్రదాయాలను కాదు,
కులాన్ని కాదు.
కానీ నేను పెరిగిన విలువలు
నా ఎముకల్లో కలిసిపోయాయి.
నిశ్శబ్దాన్ని ప్రేమించే మనసు,
తక్కువ మందిలోనే ప్రపంచాన్ని వెతికే అలవాటు,
ప్రశ్నించడానికి భయపడని ఆలోచనలు,
ఇవి నేను విడిచిపెట్టలేని నా నిజాలు.
ఎలా చెప్పాలి మీకు
నాకు వ్యతిరేకం కులం కాదు,
నా ఆత్మను అర్థం చేసుకోలేని జీవితం.
ఎందుకంటే
ప్రేమ అనేది ఒకే రక్తం కాదు కదా…
ఒకరి ప్రపంచంలో
మరొకరు ఊపిరి పీల్చుకోగలగడం.
*








nice