నాగలక్ష్మి

“ఎంత సంపాదించావే  ముండా ఈ రకంగా? ఆశకి హద్దుండక్కర్లా? ఊ అంటే కోటయ్య మీద ఒట్టంటావు? అరే? టిపినీ నిండా  బాంబుల్తో దొరికి ఇంకా బుకాయిస్తుండావే?”  కానిస్టేబుల్ అలరాజు నోరు పట్టని బూతులు చెరిగాడు

గోడవారగా గొంతుక్కూచుని ఉంది నాగలక్ష్మి.  అలరాజు తిట్లు చెవులకి చేరుతున్నాయి కానీ మెదడు దాకా పోనీకూడదనుకున్నట్టు మొండిగా మొహం పెట్టి కూచుంది. ఎవరు పంపించారో చెప్పమంటున్నాడు . ప్రాణం పోయినా ఆ పేరెట్టా చెప్పుద్ది ?? అమ్మా … ఈళ్ళ పప్పులు ఉడికినట్టే  ఇంగ

ఒక పావుగంట సేపు నానా రకాలు గా తిట్టి”ఏమే  లంజా, ఇన్ని తిట్టినా నీ బతుక్కి రోసం లేదంటే? కళ్లెమ్మడి  సుక్క గూడ నీళ్ళు రాట్లేదే?” వేగంగా  దగ్గర కొచ్చి చెయ్యెత్తాడు

కళ్ళెత్తి చూసింది, అప్పటికే చేతి మీద కదుము గట్టిన లాఠీ దెబ్బ మీద ఉబ్బరిస్తున్న ఎర్రటి చెమ్మని ఊదుకుంది . గొంతుకేదో అడ్డం పడబోతే మింగేసింది

“యోవ్, నా కళ్ళెమ్మట నీళ్ళు తెప్పియ్యాలని బో ట్రై జేశావు లే గానీ మూసుకో! చాతగాని పెతి మొగోడూ సెయ్యెత్తే వాడే? శా!
శాతనైతే నన్ను గాదు, ఆట్ని ఎవుడు జేసేదీ జూసి పట్టుకోవాల. అదీ మగతనం. ఓయబ్బ, పేద్ద దొంగని పట్టినట్టు తెగ సించుకుంటున్నావ్ గానీ, ఇంగ జాల్లే పాయ్యోవ్ ”

ఒక్క ముక్కలో పూచిక పుల్ల కంటే హీనంగా తీసి పడేసి నింపాది గా చతికిల బడి సర్దుకుని కూచుంది.

“ఎంత బలిసిందే నీకు లేబర్ ముండా! డూటీలో ఉన్న పోలీసుని దిడితే ఏమయిద్దో తెల్సంటనే నీకు?

“నువ్వు డూటీ లో ఉండా, బట్టలిడిసేసి ఉండా,  నాకేం తేడా లేదయ్యో . ఏం జేత్తావయ్యా నన్నూ? నాలుగు తంతావు, అంతేగా! అయ్యి నాకెట్టాగూ తప్పపు. ఆడదాన్ని కదా వొయిసులో ఉండానని ఏదైనా జేద్దావనుకుంటే, మొగోడిగా మిగుల్తావా నువ్వు నా మీద సెయ్యేసీ? యేసి చూడు, నీ పెళ్లానికి ఆపరేసన్ అయిందో  లేదో నాకు తెలవదయ్యో.నా జోలికొస్తే మాత్ర ఇంగ జేయిచ్చే పన్లా”

నాగలక్ష్మి మాటలకి స్టేషన్లో ఉన్న మిగతా వాళ్ళు నవ్వు బిగపట్టుకోలేక సతమతమై పోతున్నారు
“అల్రాజు తల దీసి చేతిలో బెట్టింది గదరా ఈ ఆడది”  నాగేస్రావు  సత్తెనాణా

ఇద్దరూ ఏదో పనున్నట్టు అక్కర్లేని కాయితాలు చూస్తూ పెదాలు బిగించి నవ్వాపుకుంటున్నారు

అప్పుడే లోపలికొస్తున్న మరియమ్మ “మేయ్, ఏందా మాట్లు? సార్ తో అట్టగేనా మాట్టాడేది”  కోపంగా అంది

“మోవ్ పోలీసమ్మో, నన్ను ముండా లంజా అన్నప్పుడు యాడ బోయినవమా నువ్వూ? ఆడదానివేగా? నిన్ను ముండా అంటే నువ్వూరుకుంటవా?”

“ఏందే గుడిసేటి ముండా ? ఏదో దేశ్శేవ జేసి జైలుకొచ్చాననుకుంటున్నావా? బాంబులు సరఫరా జేస్తా దొరికావు నువ్వు. కేసు రాసి లోపలేస్తే, బయిటికే రావు దెల్సా నువ్వు?”

మగతనం మీద దెబ్బ కొట్టేసిన నాగలక్ష్మి మీద మండి పోతోంది  అలరాజుకి

” యోవ్ , మాటలు జాగర్త ! గుడిసేటి దాన్నా నేను ?

అవునయ్యా, దొరికాను. బాంబులు దీస్క పోతానే దొరికాను.  ఆడికేదో మీరెప్పుడూ బాంబులు దీస్క బొయ్యే వాళ్ళని సూణ్ణట్టూ, నాతోనే మొదలెత్తుకున్నట్టూ .. వాయ్యో, ఏం నాటకాలాడతన్నారయ్యో మీకు గత్తర తగలా ! సెప్పేదినకుండా పట్టుకోని లాక్కొచ్చావే, నీ జేతుల్లో జెట్ట పుట్టా..! నీకు వాయవ రానూ ”

మరియమ్మకి అలరాజుని చూస్తుంటే  నవ్వూ , జాలీ రెండూనూ

“మేయ్ నాగమ్మా, ఆపెయ్ ఇంగ ! ఏందా తిట్లు? తెలీక తిడతన్నావు గానీ నిజంగా కేసు రాస్తే ఏమైద్దో దెల్సా? ఇరగ దంతా “

“ఓయబ్బ, ఏమైద్దమ్మా ! ఎవుడు బాంబులు జేయిత్తన్నాడో ఆ నా బట్టని పట్టుకోలేరు గానీ , నాలుగు డబ్బులొత్తయ్యని నేను దీస్క బోతన్నానని నన్ను పట్టకొచ్చారు . అంతేలే ? సిగ్గు లేని నా బట్టలు , మీకంతకంటే ఏం శాతయిద్ది లే . లాఠీ తో కొట్టేదే కానీ ఎన్నైడైన తినేది ఉంటే తెలుసుద్ది నెప్పి ” మోచేతి కిందుగా వచ్చిన చోట ఉమ్ము రాసుకుని, ఉఫ్ ఉఫ్ మని ఊదింది  మళ్ళీ

డుగ్ డుగ్ మంటూ యేజ్దీ  బండి శబ్దం బయట. కానిస్టేబుళ్ళు చేసే సైగలు నాగలక్ష్మి కి చేరలా

“అంత  —–  లో దమ్ముంటే రాస్కోండి. సవ్వాల్ మరి! కూలి డబ్బులతో  బతక లేక, నాలుగు డబ్బులొస్తయ్యని జేస్తన్నా ఈ పని.  ఒళ్ళు బల్సి సరదాకి జెయ్యట్లా.  కేసు రాస్తారంట కేసు, రాస్కోండి,, ఏం జేత్తారో నన్ను! తల దీసి మొలేత్తారా? ఓయబ్బ, నేను జూడని కష్టాలున్నయ్యా? ఇదో కస్టం గాదు నాకు..” మొండి గా మాట్లాడింది గానీ మనసంతా బడి నుంచి వచ్చే పిల్లల మీదే ఉంది నాగలక్ష్మి కి , సాయంత్రానికి వదలక పొతే ఏం జేసేటట్టు ??

లోపలికి వచ్చాడు ఎస్సై కొండవీటి అబ్రహాం లింకన్.  వరండాలో ఉన్నపుడే  మాటలన్నీ వినపడ్డాయి

లోపలికి వస్తుండగానే అందరూ సైలెంట్ కావడం చూసి నాగలక్ష్మి కూడా ఆపేసింది.
“లెయ్ , లెయ్ నీ … సి ఐ గారొచ్చారు లెయ్ ” అలరాజు ఆర్దరేశాడు లాఠీ తో నేలమీద కొడుతూ
నిల్చుంది
“ఎవరిది ?” లోపల గదిలోకి పోతూ ఒకసారి నాగలక్ష్మి వైపు చూపు విసిరాడు
అలరాజు, మరియమ్మ ఇద్దరూ అగ్గగ్గలాడుతూ లోపలి పరిగెత్తారు
“టిపినీ క్యారేజీ లో బాంబులు తీసక బోతంటే  పట్టుకున్నాం సార్ “
“ఎక్కడ ?”
“పల్నాడు బస్టాండ్ కాడ సార్ , పెద్ద చెరువు రోడ్డు లోకి పోతంటే “
“ఎట్ట తెల్సింది ? ఇన్ఫర్మేషన్ వచ్చిందా ?”
“కాస్సార్ , రాయి తట్టుకోని బొక్క బోర్లా పడింది ముండ . కారేజీ కింద పడిపోయింది . ఎమ్మటే ఎవురో లేపబోతే, పట్టిచ్చుకోకుండా లేచి కారేజీ మూత బిగిచ్చి గబాల్నపరిగెత్తినట్టే నడుస్తా పోతంది . నేను ఆణ్ణే డూటీ లో ఉండా సార్ ! ఆనుమానమొచ్చి పట్టుకున్నా .. ఎంతకీ లొంగదే ! చేతిమీద ఒకటి పీకితే  కింద పడేసింది కారేజీ “
“కొట్టావా ? రోడ్డు మీదే ?”
“లాటీ తో ఒక దెబ్బేశా ,లేకపోతే గింజుకుంటంది సార్ రానని  “
“ఇట్టాగే మనం మీడియా  కి దొరికి సచ్చేది . కాఫీ చెప్పు , తలా పగిలి పోతా ఉంది . నాటు బాంబులేగా అయ్యి ? “
“అవును సార్ , స్టేషన్ ఎనకమాల నీళ్ల తొట్లో  పడేశాం “
*******                                                        *********                                           ******
“ఏ వూరమా ?”
“అలరాజు కి తోక తొక్కిన తాచు లా లేచి జవాబు చెప్పిన నాగలక్ష్మి కొంత తగ్గి  జవాబు చెప్పింది
“గామాల పాడయ్యా “
“ఎందుకిట్టాటి పని జేస్తన్నా ? పొలాల్లో పనులు లెవ్వా ? ఇళ్లల్లో పాచి పన్లయినా దొరుకుతయ్యే ? సిగ్గున్న పనేనా ? కేసు రాత్తే ఎన్నేళ్లు లోపలెత్తారో దెల్చా ?
నాగలక్ష్మి మాట్లాళ్ళేదు
చాలా చెప్పాలని ఉంది . ఆ మాటలన్నిటిని ఎలా దార్లో పెట్టి తీరుగా చెప్పాలో తెలీక “ఈ పని ఇష్టమై చెయ్యట్లేదయ్యా , గతి లేక చేత్తన్నా ?” అంది కష్టం మీద
ఆ ఒక్క మాట చెప్పడానికే చాలా అవమానమై పోయినట్టు తెల్లటి మొహం లో ఎర్రగా రక్తం నింపినట్టు కంది పోయింది
అబ్రహాం లింకన్ పరిశీలన గా చూశాడు నాగలక్ష్మి ని.
పొడుగ్గా సన్నగా ఉంది . ఎర్రని ఛాయ
రాగి రంగులో పొడుగాటి  జుట్టూ , ఎర్ర రాయి ముక్కు పుడక , చవక రకం పూల చీర , తెగి పోయి కుట్టించిన చెప్పులు. వెలిసి పోయిన పాత పర్సు . అందగత్తెల్లోకి చేరే రూపం
“పిల్లలా?”
“ఇద్దరు సామీ ” వెంటనే జవాబు చెప్పింది
మొగుడు తాగుబోతై ఉంటాడు .  వీళ్ళ కథలన్నీ ఇంతే
“మీ ఆయనేం చేస్తాడు ? అసలేమైనా పని చేస్తాడా ? యాడుంటాడు ? “
మాట్లాళ్ళేదు
“కాఫీ తాగు ” కాఫీలు తెచ్చిన కుర్రాడి తో కప్పు ఇప్పించాడు
ఒద్దనకుండా తీసుకుని ఆవురావురుమని తాగింది
“చెప్పమా ? ఏం పని చేస్తాడు నీ మొగుడు ?”
జవాబు లేదు
“ఏందే  నీ బెట్టు సి ఐ గారు అడుగుతుంటే ? లంజ ముండ ఏసాలెయ్యమాక “అలరాజు నోరు పారేసుకున్నాడు
“లంజనైతే బానే ఉండేదాన్నయ్యా ! అందరికీ పక్కలేసే పనైతే డబ్బులు బానే వచ్చేయ్యే . అది చాతకాకనే ఇట్టా బతుకుతున్నది! అడ్డమైన దొంగనాబట్టల చేత మాటలు పడతన్నా ” సి ఐ ఉన్నాడనే భయం లేకండా అనేసింది
“అదిగో నోరు లేస్తంది మళ్ళీ “
“నన్ను లంజా గింజా అంటే నేనూరుకోనయ్యా “
సి ఐ వైపు చూసింది “లేడయ్యా , సచ్చి పొయ్యాడు “
“ఎట్టా పోయాడు ?”
మళ్ళీ జవాబు లేదు
“చూడు నాగలష్మీ , నీతో కబుర్లు చెప్తా కూచునే దానికి మా కాడ టైము లేదు . ఎక్కువ ఇసిగిపిచ్చకుండా చెప్పు. లేదంటే తన్నులు తింటావ్. మరియమ్మ ని చూశావు గా ! మడిసి కాదు లాఠీ తీసుకుంటే !ఎట్టా సచ్చాడు నీ మొగుడు ?”
మరియమ్మ ఉత్సాహంగా లాఠీ ఊపుకుంటూ కొట్టే దానికి మల్లే  వచ్చి నిల్చుంది
” రెండేళ్ల కితం రామాపురం పెసిడెంటు గారింటో బాంబులు సేత్తా ఉంటే , అయి పేలి సచ్చిపోయాడయ్యా ” చెప్పాల్సి వచ్చిందనే అసహనం తో గట్టిగా అరిచి చెప్పింది. ఒద్దని పాతి  పెట్టిన విషయాలన్నీ గుర్తొచ్చి దుఃఖపు అల ఉవ్వెత్తున లేచింది
రాబోతున్న ఏడుపుని, రొప్పుతూ , మింగుతూ , మొహం గట్టిగా తుడుస్తూ , గడప అవతలే ఆపేసింది
సి ఐ ఆశ్చర్యంతో నిలబడ్డాడు
“ఎప్పుడు ? రెండేళ్ల క్రితం జరిగిన కేసేనా ? నీ మొగుడు పేరేంటి ?”
“శేషు”
“శేషు పెళ్ళానివా నువ్వు ? ప్రెసిడెంట్ డబ్బులేమైనా ఇచ్చాడా మరి ? ఆయన దగ్గరేగా  శేషు పని చేసింది . ఆయన కారు డ్రైవర్ గా పొయ్యేవాడు కదూ “
“డబ్బుల్లేవు పాడు లేవు . బాంబులు చేసిన గొడ్ల పాక ఆయనది కాదంట , కాయితాల్లో ఎవురి పేర్లో  ఉన్నయ్యంట . ఆ బాంబులు మాయి కాదు , ఆ సచ్చిన మడుసులూ మా వోళ్లు కాదు పొమ్మన్నారు . “
 పోలీసుకు ఈ సంగతులన్నీ తాను చెప్పడమేమిటని సందేహం వచ్చింది
“మీకు తెలీదా సావీ ? దగ్గరుండి కేసు చూసే ఉంటారు గా ?” అంది జడ ముడేసుకుంటూ
తల పంకించాడు లింకన్ . మరియమ్మ కళ్ళలో జాలీ , టేబుల్ మీదకి  లాఠీ చేరాయి .
“ఇది కాకుండా బతకడానికేమీ లేదా నీకు ?”
“ఏవుండిద్దయ్యా ? మా అమ్మకి ఆవె బతకటమే కష్టం . శేషుకి తల్లి తప్ప ఎవురూ లేరు .ఒంటో బాగుండదు
ఆవె ని నేనే సాకుతున్నా ! ఏదో  ఒక పని చేసుకుందామని శానా చూశానయ్యా .
ఏ మగ దొంగనా బట్టా బతకనిచ్చేట్టు కనపళ్ళా
అండ లేదు  గాబట్టి ఎవురు రమ్మంటే వాడి పక్కలోకి చేరతాననుకుంటున్నారు . నాట్లకు పోయినా, కలుపులకు పోయినా , గుంటూరు దాకా పోయి పొగాకు పనికి పోయినా , ఇటుక బట్టీకి పోయినా , ఎవుడో ఒకడు రయిక మీదో నడుం  మీదో చేయిద్దామని చూసే వాడే గానీ పనోళ్ళలో ఒకదానిగా చూసి డబ్బులిచ్చి పంపియ్యలా
మాచర్ల పోయి బళ్ళో ఆయా గా చేరితే, అక్కడ కూడా ప్రిన్సిపాలంట … ఆ నా బట్ట బడి  అయ్యాక గదిలోకి రమ్మన్నాడు . కాళ్ళు నొక్కాలంట నేను ఆ బట్ట కి . పాంటు ఇప్పేదా ? అనడిగాడు నన్ను “
నా మొగుడు బాంబులు జేత్తా చచ్చిపొయ్యాడు గాబట్టి నేనూ తప్పు జేసినట్టే అంట . ఆ తప్పు ఈళ్ళతో పడుకుంటే పోయిద్దా ?”
కళ్ళ వెంట నీళ్లు జారుతున్న  సంగతి నాగలక్ష్మి కి తెలీదు . అవన్నీ జరిగినపుడు పడ్డ భయం, అవమానం, అన్నీ గడ్డ కట్టుకు పోయి , వాటిని బయటకు చెప్తుంటే , కట్ట తెగినట్టు  కళ్ళలో సాగర్ పంట కాల్వలై ప్రవహించాయి .
నీ కష్టమేంటని ఎవరు అడగలేదు ఇంతవరకూ
విచిత్రంగా ఒక పోలీసుకు చెప్పుకుంటోంది ఇవాళ
కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ” మాయత్త కి ఒంటో బాగోదు . ఒంటేలు పోసుకోటానికి కూడా మడిసి కావాల. నేను  రోజంతా పనికి పోయి వచ్చే సరికి ఒక్కోసారి కింద పడిపోయుంటది . పిల్లలిద్దరూ నేనొచ్చి వొండి పెడితేనే  అన్నాలు తినేది ..” స్వగతం లా అంది నెమ్మదైన స్వరంలో
“నీ మొగుడు బాంబులు తయారు చేస్తా , పేలి సచ్చి పోయాడు గదా ! ఇంగ మళ్ళా వాటి జోలికి పోగూడదు అనుకోవాలి గానీ మళ్ళా నువ్వు కూడా అదే పని చేస్తే  ఎట్టమా ??”
ఒక్కక్క నిమిషం ఆగింది
“సెయ్యొద్దనే నేనూ అనుకున్నానయ్యా . నాకేం సరదా కాదు సావీ !మీరు పట్టుకోటం సరే , పేలితే  నేను కూడా సచ్చిపోతా అని తెల్సు
ముగ్గురిని మోస్తన్నాను సామీ! ముండమోపి ఎదవల ఏసాలు తట్టుకొని కూలికి పోదామనుకున్నా, కూలి డబ్బులు సాలట్లేదు . నలుగురం బతకాల . పిల్లలు ఎక్కొచ్చే దాకా నా ఒకదాని కూలి సరిపోదని అర్థమైంది
అందుకే ఎలచ్చన్ల టైములో అయినా నాలుగు డబ్బులు ఇట్టా సంపాదించుకోమని …. “ఎవరి పేరో చెప్పబోయి ఆగింది
“ఎవరో చెప్పారులే సావీ !కూలికి బొయ్యేఆడ మడిసిని కాబట్టి ఎవురూ నన్ను అనుమానించరనే ధైర్నం ! కారేజీ తీస్కపొయి సెప్పిన కాడ ఇస్తే నాలుగు రోజుల కూలీ వచ్చిద్ది “
“తప్పు కాదా?”కటువు గా ఉంది లింకన్ గొంతు

“తప్పో ఒప్పో  నాకు తెలవదయ్యా! నా పిల్లలు, మాయత్త, నాలుగు ముద్దలు తినాలి. ఆళ్లు నా బుజాల మీద ఉండారయ్యా. కేసు రాత్తావా? రాసి పార్నూకు . ఆ ముగ్గురూ ఉంటారో పోతారో పోనీ!ఏమైతే అదే అయిద్ది ”

కూచున్నదల్లా ,అన్నిటికీ తెగించిన దాని లాగ లేచి నిలబడి జుట్టు గట్టిగా ముడేసుకుంది

లింకన్ బూటు కాలుతో నేల మీద చిన్నగా తడుతూ టేబుల్ కి ఒక చివర సీరియస్ గా కూచున్నాడు

నాగలక్ష్మి మళ్ళీ అంది ” నేనేదో నా మీద జాలేసిద్ద్దని అట్టా మాట్టాడాను అనుకోబాకయ్యా . నీ కష్టమేందని నన్నెవరూ అడగలా ఈ రోజు కాడికి.

మా యమ్మ కూడా అడగలా ! ఆమె పొట్ట కష్టాలు ఆమెయ్యి గదా

ఏందో, సిగ్గిడిసి అన్నీ చెప్పేశాను! అట్ట సెప్పుకోవాలని నాకుందని  గూడా నాకు తెలవదు”

*********                                                                          ************

“ఆ బాంబులు తీస్కపోయి నకరికల్లు కాడ  కాస్త లోపలికి పోయి కాల్వలో పారేసి రాండి.మఫ్టీలో పోవాల. కాళ్ళో సేతులో కడుక్కుంటున్నట్టు కూసోని, వొదిలెయ్యండి ”

“కేసొద్దా సార్”

“ఏం కేసయ్యా? నాగమ్మ సెప్పిన దాంట్లో ఒక్కబద్దం కూడా లేదు. ప్రెసిడెంట్ ఇంట్లో బాంబులు పేలినపుడు  నేనే రూరల్ ఎస్సై ని. ఆ కాయితాలు మార్చటం అయ్యన్నీ దగ్గరుండి చూశాను. పోయినోళ్ళకు డబ్బులిస్తానని ఆ నాయాలు చెప్తే  నిజంగానే ఇచ్చాడనుకున్నాం. పిల్లల కోసం ఎంత కష్టపడతందో పాపం! మనకి దమ్ముంటే ఎవరు చేయిస్తున్నారో పట్టుకోవాలి . అట్టా జేసినప్పుడు  ఏనాడైనా ఒక్క నాకొడుకైనా ఒక్క రోజైనా లోపల ఉండాడా ? ఎవుడి చేతనో ఫోన్లు చేయిచ్చి గంటలో బయటికి వొస్తుండెనే ?”

లింకన్ కి తల్లి గుర్తొచ్చి మొహం మీదికి నవ్వు పాకింది

తండ్రి కి పిల్లలందరినీ గొప్పోళ్ళని చెయ్యాలని ఉండేది. అందుకే అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, అనిబిసెంట్ అని పెట్టుకున్నాడు పేర్లు. గొప్పోళ్లు కాదు కదా, కనీసం స్కూల్లో కూడా పైకి రాకుండానే ఆయన పోయాడు.

తల్లి నానా చాకిరీ చేసి హాస్టళ్ళలో పెట్టినా డబ్బు సరిపోయేది కాదు

ప్రొహిబిషన్ టైం లో గుడ్డల మూటలో మందు సీసాలు తీసుకెళ్లేది అమ్మ, ఎవరికో తెలీదు గానీ . బక్క చిక్కి పోయుండే అమ్మని, ఆమె చేతిలో మూటని ఎవరూ అనుమానించే వాళ్ళు కాదు. ఏ పనైనా చేసి పిల్లల్ని బతికించుకోవాలనే కోరిక ! ఎక్కడి నుంచి వస్తుందో అంత కాంక్ష !

“మరి పంపించెయ్యమంటారా సార్?”

“పంపించెయ్”

కిటికీ లోంచి నాగలక్ష్మి కనపడుతోంది. మరియమ్మ వెళ్ళమని చెప్పగానే కాళ్ళ మీద పడ్డంత పని చేసి దణ్ణాలు పెట్టి గబ గబా పరీగెత్తినట్టు వెళుతోంది

“కానీ తప్పే గద సార్ బాంబులు దీస్క పోటం? రిస్క్ కూడా గదా?” గేటు లోంచి మలుపు తిరుగుతోన్న నాగలక్ష్మి ని చూస్తూ అన్నాడు అలరాజు

“పిల్లల తల్లి అలరాజూ ! వాళ్లని బతికించుకోడానికి తల్లి ఏం చేసినా సరే, ఏం చేసినా సరే.. తప్పు కానే కాదు. ఎట్టవుద్ది ?”

*
సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

40 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మాకు‌ పదకొండేళ్లున్నప్పుడు మా నాన్న పోయారు. ఇద్దరం‌ కవల పిల్లలం. ఇంకా‌ యవ్వనంలోనే ఉన్నావు గదా, పెళ్లి చేసుకోవే శారదా అని మా బంధువులు ఎంత అడిగినా మా‌ అమ్మ‌ చేసుకోలేదు.‌ పిల్లలే పంచప్రాణాలుగా బతికింది. గుమస్తా నుండి మొదలై, ఇప్పుడు తహశీల్దారు గా పనిచేస్తుంది. నెలకు 5 వేలు జీతం‌ తీసుకున్నా, ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా ఏనాడూ మాకు లోటు చేయలేదు. ఇప్పటికీ సుఖమనేది ఎరగకుండా మాకోసమే‌ కష్టపడుతుంది. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిజాయితీగా ఒక కథ చెబితే పాఠకుడు ఎంత బాగా రిలేట్ చేసుకుంటాడో రచయితకు తెలియజెప్పడానికి. నా జ్ఞాపకాల తావుల్లోకి నన్ను తీసుకెల్లినందుకూ, నా వ్యధలనూ, వెతలనూ, నా తల్లి పడ్డ కష్టాన్నీ మరొక్కసారి నెమరువేసుకోవడానికి దోహదపడినందుకు గానూ, సుజాత గారికి ధన్యవాదాలు.

  • సాయిరాం సంపతి రావు గారూ, ఈ కథ మీకు మీ అమ్మగారి కష్టాన్ని గుర్తు చేయటం మీరీ కథను ఎంతగా ఓన్ చేసుకున్నారో చెపుతోంది

   చాలా సంతోషం. మీ అమ్మగారికి నమస్సులు

  • సహజంగా.. ఆసక్తికరంగా ఉంది కథ. నాగమ్మ తన చేదు అనుభవాలూ, కుటుంబ భారం గురించి చెప్పే ఘట్టం కదిలించింది.

   సంఘటనల కూర్పులో, సంభాషణల్లో కథన నైపుణ్యం ఎంతో బాగుంది.

   అలరాజు సీఐ గా, లింకన్ కానిస్టేబుల్ గా ఉండిఉంటే..? ఈ కథ ఎలా మారివుండేదా అని కూడా ఆలోచించాను…!

 • నిజమే ,ఈ బాంబుల కత ఎవరైనా ?రాస్తే బాగుండునని మొన్నే అనుకున్నా .మంచి కథ .రావి శాస్త్రిగారి నీడ పడకుంండా చాలా జాగ్రత్త పడ్డారు .నిజమే పోలీసోళ్ళు మాత్రం ఎక్కడ్నుడి వస్తారు ? వాళ్ళనీ ఓ అమ్మే కదా పెంచాలి ?
  పోలీసు స్టేషన్ అట్మాస్ఫియర్ బాగా తెచ్చారు . ముఖ్యంగా వారిని మనుష్యుల్లా చూపించారు .

  • థాంక్ యూ కళ్యాణి గారూ
   రావి శాస్త్రి ని నేను ఎక్కువగా చదవలేదు. అందువల్ల ఆయన నీడ నా మీద పడే అవకాశం లేదు 🙂

 • మీరు పట్టుకోటం కాదు , పేలితే నేను కూడా సచ్చిపోతా అని తెలుసు . .

  బతుకు పోరులో బిడ్డల కోసం తల్లి తెగింపు ఈ ఒక్క మాటలో చూపించారు .

 • చాలా బాగుంది సుజాత గారు. నేపథ్యం చదివి కథ చదవినప్పుడు ఇంకా బాగా అర్థమైంది.

 • “పిల్లల తల్లి అలరాజూ ! వాళ్లని బతికించుకోడానికి తల్లి ఏం చేసినా సరే, ఏం చేసినా సరే.. తప్పు కానే కాదు. ఎట్టవుద్ది ?”
  గొప్ప మాట!
  అలరాజు భలే పేరు. బాగుంది. కాపీరైటు లేకుండా వాడుకుంటా!
  నా వరకు నాకు పల్నాడు పండు మిరప కారం ఘాటు సరిపోయింది.

 • చాలా బాగుంది..నాగలక్ష్మి ధైర్యంతో మొదలై ఆత్మాభిమానం, మానవత్వం నుండి చివరికి తల్లి ప్రేమకు ప్రతిరూపం గా నిల్చింది.. మీ కథల్లో స్త్రీ పాత్రల్లో ఉండే self respect చాలా నచ్చేస్తుంటది నాకు.

  • థాంక్యూ శ్రుతా 🙂

   సెల్ఫ్ రెస్పెక్ట్ లేనిదే ఆడవాళ్లు లేరని నమ్ముతాను

 • ‘పొట్టకూటికి మడికెన్ని ఎతలో,
  తిన్నదరక్క మందులకెంపర్లాడేవాడొకడు – పూట గడవటానికి పడనిపాట్లు పడేవాడొకడు. ఏం జెప్తం. ఉరికొకటా.. వాడకోకటా. పత్తిత్తు లోకంలో సెడని పత్తిత్తులెందరో’

  మనసుకు హత్తుకుందండీ, ఆ పల్నాటి యాస కానీ, ఆ పాత్రల పేర్లు కానీ, పాత్రల ఓచిత్యం కానీ గుండెళ్ళోతుల్లోంచి వచ్చినట్లున్నాయ్. చాలా బాగుంది క(వ్య)ధ.

  • అవునండీ

   పొట్టకూటి కోసం సంఘ నీతులను పక్కన పెట్టాల్సిన పరిస్తితి , తప్పని సరైతేనే వస్తుంది

   కథ నచ్చినందుకు థాంక్ యూ

 • Wrong Premise. Bombs are destructive. Even the sarpanch is making them for money . Mercinaries are not revolutionaries. మన వలన పక వాడి కి వీలైనంత తక్కువ హానీ వీలైనంత ఎక్కువ ఉపకారం జరగడం అనేది ఒకటే నీతి. మిగిలిన వన్నీ బూటకాలు

  • ఎన్నికలను హింసాత్మకం గా చేయడానికి కాకుండా డబ్బు కోసం బాంబులు తయారు చేసే విషయం ఇపుడే వింటున్నాను చిత్రం గారూ

   మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్యూ

 • బాగుంది. పుట్టు దుర్మార్గులుగా చిత్రీకరించ బడుతున్న పోలీసులలోని మానవత్వ చిత్రణ సంతోషాన్ని కలిగించింది. పురుషులు, అగ్రవర్ణాలు, రాజకీయనాయకులు….వీరి మంచితనాన్ని, ఆశక్తత ను సైతం వర్తమాన సాహిత్యం పట్టించు కుంటుందన్న ఆశను కూడా ఈ రచన కలిగిస్తున్నది.

  • రాఘవరావు గారూ

   మంచి, చెడు మనుషులు ఉన్న ప్రతి చోటా ఉంటాయి

   మనం మెజారిటీ ని లెక్కలోకి తీసుకుని మైనారిటీ కేసులను వదిలేస్తాం

   అందుకే పోలీసుల మంచి తనం గ్లోరిఫై కాదు

   ధన్యవాదాలు

 • ఆమె అమ్మ అంతే.. ఎంత బాగా చెప్పారండీ సుజాతగారూ..

 • “ఏ వూరమా ?” …
  నీ కష్టమేంటని ఎవరు అడగలేదు ఇంతవరకూ ,,, అట్ట సెప్పుకోవాలని నాకుందని గూడా నాకు తెలవదు” …
  “మరి పంపించెయ్యమంటారా సార్?” … “పిల్లల తల్లి అలరాజూ ! వాళ్లని బతికించుకోడానికి తల్లి ఏం చేసినా సరే, ఏం చేసినా సరే.. తప్పు కానే కాదు. ఎట్టవుద్ది ?”

  ఓ కధ మనసును, మనిషిని ఎంతలా కదిలిస్తుందో తెలిపిన కధ ఇది. కధా వస్తువు పరిమాణాన్ని బట్టి చిన్నదిగా అనిపించినా చాలా మిన్నగా మనసు లోతుల్లోకి చొచ్చుకు పోయింది. ఇది కధ కాదు, కళ్ళముందు కదలాడిన దృశ్యం – సజీవ చిత్రం. అద్భుతమైన, హృద్యమైన చిత్రణ సుజాత మేడం గారు. హృదయపూర్వక అభినందనలు.

  • రావు గారూ, చాలా థాంక్స్ అండీ, కథ నచ్చినందుకు

  • అంతంత బరువులు పెట్టకండి సార్, మోయడం కష్టం

   Thank you Aranya Krishna garu

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు