నాగరత్నమ్మక్క

లోపలేవో ఏడుపులు, నిండా మనుషులు. ఏమి జరిగిందో అర్థం కాలేదు.

త ఆగష్టులో వూరెళ్ళినపుడు నీలకఠరావుపేటలోని ఆ యింటికి మళ్ళీ ముప్పై ఆరేళ్ళ తర్వాత వెళ్ళాను. ఇప్పుడు లెక్కపెట్టుకుంటుంటే ముప్పై ఆరేళ్ళా.. అని నాకే ఆశ్చర్యంగా అనిపించినా, అప్పటి ఆ గోడలు, గొడ్ల చావిడి, ఆ పాడుబడ్డ చెక్క తలుపూ, ఆ చుట్టిల్లూ, ఆ రెండు గదుల మిద్దె అన్నీ నిన్న చూసినట్లే కళ్ళ ముందు మెదులుతున్నాయి. అన్నింటితో పాటు మిద్దెకూ చుట్టిల్లుకూ మధ్య గలగలా తిరుగుతూ, చిరునవ్వుతో పలకరిస్తూ తిరిగే ఆ అక్కను కూడా అక్కడ నిన్న చూసినట్లే అనిపించింది.

ఎప్పటిమాట.. 1982-83ల నాటి జ్ఞాపకం. నేను హైస్కూలు వెళుతున్న రోజులు. నీలకఠరావుపేటలోని హైస్కూలు మావూరికి రెండు కిలోమీటర్ల దూరం. బడి ఉదయం 9గంటలకు మొదలయ్యేదనుకుంటా. ఆవుల, ఎనుముల పేడ అవ్వ గంపలకు ఎత్తుతుంటే ఆ గంపలను నెత్తికెత్తుకొని వూరిబయట వున్న మా పేడదిబ్బలో పేడ గుమ్మరించి రావడంతో వుదయం మొదలయ్యే రోజులవి. వూరు వూరంతా సందడిగా వుండేది పొద్దున్నే. పొలం పనులకు తయారయ్యే కూలీలు, పేడ ఎత్తేవారు, కసువు చిమ్మేవారు, కాడి కట్టుకుని పనులకు పోయేవారు, రాత్రి వస్తామని.. పొద్దున్నే రామనే కూలీలను శాపనార్థాలు పెట్టేవారు. పాలు పితికే శబ్దాలు, గుంజకు కట్టేసిన దూడ ఆరాటాలు, పాలుపితికిన రొమ్మును పాలకోసం గుద్దుతున్న దూడలు. మజ్జిగ చిలికే కవ్వం లయబద్దమైన సవ్వడి. పేడ గంపలు మోయడం, మజ్జిగ చిలకడం, పాలు కాయడం, యానాది వచ్చి ఎనుముల్ని తోలుకుపోయేదాకా వుదయాన్నే వాటిని ఓ గంట వూరిబయట పాతూర్లో తిప్పుకురావడం, ఇవీ నా దినచర్యలు బడికి వెళ్ళడానికి ముందు. బడికి సమయానికి వెళ్ళాలంటే కనీసం 8:30 కైనా వూర్లో బయలుదేరాలి.

ఈ లోపల పైన చెప్పిన పనులన్నీ అయిపోవాలి. ఆ లోపలే అన్నం వండి, కూర వండి మాకు బడికి క్యారియర్ సిద్దం చేయాలి అమ్మ. అమ్మకేమో ఓ వైపు ఈ పాలు పితకడం, ఆరోజు పనికి రాత్రి పిలిచిన కూలీలను మళ్ళీ యింటింటికీ వెళ్ళి వాళ్ళను పురమాయించడం సరిపోయేది. రాత్రి వస్తామన్న వారు పొద్దున్నే ఏదో కారణం వల్ల రాలేమనేవారు. ఒకామే నేను వస్తాను గానీ, నాకు కొడవలి లేదు అనేది లేదంటే తొలికె లేదు అనేది. ఇవన్నీ చూసుకుంటూ మాకు పావు బియ్యం పొయిమీద పెట్టి అన్నం వండడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ పొయ్యిలోకి కావల్సిన ఎండు కట్టెలూ ఒక్కోసారి దొరకవు. కట్టెలు లేనప్పుడు, ఏ ఎండు దూలాన్నో గొడ్డలితో చీల్చి పేళ్ళు తియ్యాలన్నా మళ్ళీ ఏ నరసయ్యనో, సుబ్బరాయున్నో బతిమాలాలి. (నేను ఎన్ని పనులు చేసినా ఇలా తుండును చీల్చి పేళ్ళు తియ్యడం మాత్రం నాకెప్పటికీ చేతనవలేదు.) అంత పని ఒత్తిడిలో అమ్మకు ఇక ఏ కూరగాయలతోనో ఓ కూర చెయ్యడం అనేది సాధ్యమయ్యే పనికాదు. అప్పుడు ఆమెకైనా, మా అవ్వకైనా వెంటనే చేయగలిగే కూర, వూరిమిండి. ఎర్రగడ్డ(వుల్లిపాయ), ఎండు మిరపకాయలు, కాసింత చింతపండు, చెనిగ్గింజలు(వేరుశనగ గింజలు) వుంటే వూరిమిండి పది నిమిషాల్లో తయారయిపోతుంది. ఈ తక్కువ సయంలో అయిపోయేది గనుక వారంలో నాల్రోజులు అన్నం వూరిమిండే మాకు క్యారియర్‌లో చేరేది. ఇక పెరుగుకు కరువే లేదు కాబట్టి ఒక గిన్నెలో పెరుగన్నమూ వుండేది. కాకపోతే మధ్యాహ్నానికి ఆ పెరుగన్నం గట్టిపడిపోయి సయించేది కాదు.

నేను చదివిన ఆ హైస్కూలుకు మొన్న వెళితే అక్కడ పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. నేను కూడా వాళ్ళతో తింటానని ఆ భోజనాన్ని అడిగి పెట్టించుకుని తిన్నా. అన్నం మరియు చారు లాంటి పప్పు. అయినా వూరిమిండి కాదుగా.. నాకైతే చాలా రుచిగా వుండింది. అప్పట్లో మా స్కూలు ఆవరణలో బోరుబావి కూడా వుండేది కాదు. టీచర్లు కూర్చునే ఆఫీసు రూములో వాళ్ళు తాగడానికి ఓ కుండ వుండేది. స్కూలు ఫ్యూను సుబ్బయ్య తాత ఓ కుండతో ఎక్కడి నుండో తెచ్చి ఆ కుండలో నీళ్ళు నింపేవాడు. ఇప్పుడనుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.. మేము వుదయం యింట్లో నీళ్ళు తాగాక మళ్ళీ మధ్యాహ్నం భోజనం సమయంలోనే నీళ్ళు తాగేవాళ్ళమా అని అనుకుంటే. ఇక మధ్యాహ్నభోజనం తినడానికి వూరి బయట వున్న బావికి వెళ్ళేవాళ్లం. అది ఆ వూర్లోని కోమటి అన్నయ్య శెట్టి వాళ్ళ పొలం బావి. దిగుడు బావి. నీళ్ళెక్కడో అయిదారుమట్ల (ఒక మట్టు అంటే మనిషి పొడవంత)లోతులో వుండేవి. దిగడానికి బావిగోడనానుకొని మెట్లు లేని సన్నటి తోవ వుండేది. అది అక్కడక్కడా కరిగిపోయి మరీ ఇరుకుగా వుండేది. దిగేవాడికి ఎక్కేవాడు ఎదురుపడ్డాడంటే తొలగడమే కష్టం. అలాంటిబావిలోకి దిగి, చేతులూ మొహం కడుక్కొని, వీలయితే ఓ ఖాళీ గొన్నెలోకి కొన్ని నీళ్ళు పట్టుకొని వచ్చి, ఆ పొలం గట్లమీది ఓ వేప చెట్టుకింద కూర్చుని ఆ తెచ్చుకున్న అన్నం, వూరిబిండి కలిపి తినేవాళ్లం.

మా మధ్యాహ్న భోజన కష్టాలు ఇలా వున్నప్పుడు మాకు మావూర్లో నరసింహ అనే కొత్త పిల్లవాడు తోడయ్యాడు. ఈ బావి అగచాట్లు చూసి ఆ పిల్లోడి తల్లిదండ్రులు నీకంఠరావుపేటలో వున్న బందువుల యింట్లో తెచ్చుకున్న మధ్యాహ్నభోజనాన్ని తినేటట్లు ఏర్పాట్లు చేశారు. అతనితోపాటు నేను, మా అన్నా కూడా అలా బావికి వెళ్ళకుండా ఆ యింట్లో భోజనం చేయడం అలవాటయ్యింది. వుదయాన బడికి వెళ్ళే దారిలోనే ఆ యిల్లు కావడం వల్ల వెళ్ళేటపుడే మా క్యారియర్స్ ఆ యింట్లో పెట్టేసి వెళ్ళేవాళ్ళం. మధ్యాహ్నం భోజన విరామంలో ఆ యింటికి వచ్చి తినేవాళ్ళం. యింట్లో కొండయ్యతాత బార్య వున్నా మేము తినేటప్పుడు మాతో కూర్చుని అవో ఇవో కబుర్లు చెబుతూ కూర్చునేది నాగరత్నమక్క. ఆ పూట చేసిన పప్పో, మరో కూరో మా అన్నంలో వేసేది. వూరిబిండితో మొహమొత్తిన మా నాలుకలకు ఆ కూర ఎంత అపురూపంగా వుండేదో! అన్నం అయ్యేవరకూ ఎలాగోలా తిని బావిలోకి దిగి నీళ్ళు తాగుతుండిన మాకు పక్కనే చక్కని గ్లాసులో చల్లటి కుండ నీళ్ళు కూడా అమృతమే! మేము తింటున్నంత సేపూ అక్క ఎదురుగ్గా కూచుని ఏవో కబుర్లు చెబుతూ వుండేది. ఆ మాటల్లోనూ, పెద్దోళ్ళ మాటల ద్వారానూ తెలుస్తూ వుండేది, అక్కకు వచ్చే పెళ్ళి సంబంధాల గురించి, రాని సంబంధాల గురించి కూడా. ఇప్పుడు దూరాన వున్న బావిదాకా వెళ్ళి తిని రావాల్సిన అగత్యం లేక పోవడం వల్ల మధ్యాహ్న భోజన విరామంలో కనిపించిన వార పత్రికలు తిరగేసేవాన్ని. నా జీవితంలో వారపత్రికలు చూడటం అదే మొదటిసారి. అక్క తన తీరుబడిలో చదువుకోవడానికి వూర్ళో ఎవరిళ్లనుండో తెచ్చుకున్నవి అక్కడ దొరికేవి.

రెండు ముడేళ్ళు అలా గడిచాయి. ప్రతిరోజు లాగానే ఆరోజు కూడా మధ్యాహ్నభోజన సమయానికి యింటికి వెళుతుంటే ఆ యింట్లో నుండి చాలా మంది వస్తూ పోతూ కనిపించారు. లోపలేవో ఏడుపులు, నిండా మనుషులు. ఏమి జరిగిందో అర్థం కాలేదు. పెద్దవాళ్ళ మధ్య ఎలాగూ దారి చేసుకొని, అక్కడే వున్న గాటిబండ ఎక్కి చూద్దును కదా, మంచంపై నిర్జీవంగా నాగరత్నమక్క. గలగలా మాత్లాడుతూ ఎంతో ప్రేమగా చూసుకున్న అక్కను నిర్జీవంగా మంచంపై చూసి నిర్ఘాతపోయా! పొలంలో పురుగు ముట్టిందట! మా హైస్కూలు ఆవరణకు, పక్కనే వున్న రోడ్డుకూ మధ్యలో ఆమె సమాధి ఆ రోడ్డంబడీ వెళ్ళినప్పుడల్లా అమె నవ్వుతూ పలకరించినట్లే వుండేది. ఒక ఈడు వచ్చాకా పెళ్ళికాని అమ్మాయిలను, పెళ్ళయి కొన్నేళ్ళయినా పిల్లలు పుట్టని భార్యలను ఇలా పాములు కాటెయ్యడమో, దిగుడుబావిలో కాలు జారడమో జరుగుతూ వుండేది. నాగరత్నమ్మక్క చావు మీదా ఇలాంటివే పుకార్లున్నా సత్యమేంటో అక్కతోపాటే సమాధి అయ్యింది.

*

ప్రసాద్ చరసాల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు