మా ఊరులో
నాలుగు దారులు కలిపిన చౌరస్తలా చావిడి.
నాలుగు బాజులున్నట్లే
నలుగురు మనుషులు నాలుగు విశ్వాసాలు
పూల సేరల దూలాటపాటలు
నేలదిగిన కోయిలల కమ్మని జానపద రాగాలు
అమ్మా బీబీ ఫాతిమ్మలాల
ఆశన్న ఊశన్న వాళ్లిద్దరన్నదమ్ములు
మోట సాగుతున్నట్లు నాగలి నడుస్తున్నట్లు
అలుగు దుంకుతున్నట్లు జేకుజెజ్జడాలు
కాశన్న ,సుల్తాన్ ,బాలపీరు
మెడలు కలుస్తయి
చేతులు పెనేసుకుంటయి
ఘల్లుఘల్లున కాళ్లు గజ్జలై మోగుతాయి
సవార్లకాడికోదాం
అలై సుట్టూ దూలాడుదాం
దుంకుదాం.
నెమళ్లు ఫించాలిప్పుతాయి
పంట చేలలోకి పక్షుల బారుల్లా
ఊర్లో ఆడబిడ్డల సందడి
వీధులన్నీ బెల్లం ఫాతెహాలతో
మటికీళ్ల పానకాలు తీయని సమ్మేళనాలు
కళ్ళు మూసుకొని నిలబడ్డా పీర్లే కన్పడుతాయి.
తురక పాష ఇమాం ఖాసీం
కుమ్మరి జంగయ్య మొగులాలు
ఈడిగ నాగయ్య అలీఅక్బర్
వడ్డె నర్సిహ్మ లాల్సాబ్
కురువ మాసయ్య ఒంటికొమ్ము
ఉప్పరి సిరిశైలం అసేన్ హుసేన్
సాకలి నిరంజన్ రెడ్ల హుసేన్
ఫకీర్ చాంద్ పాష కత్తుల సవారు
మంగలి బాలయ్య బారిమామ్
తెలుగు కుష్ణయ్య ఊద్దాన్
జాంగిర్ ఫాతేహాలు దోస్తరాదీన్
ఇంటికో పీరు కులానికో పీరు జాగకో సవారి
బతుకమ్మ పూల తేరులా అలాయి బలాయి
కట్టురా కట్టు నడుములకు కాషకోకలు
బోయ నాయుడు డోరిపట్టు
అరచేతుల సవారు బొంగురమే
సాకలి శంకరమ్మ తడికోకల దివిటీల వెలుగులు
మూలచుక్క పొడిసింది పీర్లు లేసినయి
తెగిన యాటలు కందూర్ల ఉరుకులాట
దట్టీలు గొడుగులు కంఠెలు
పుట్టెంటికల ముడుపులు దీవెనల నెమలి కట్టలు
పది దినాలు పది సరిగతులు
నక్షత్రాల్లా నిప్పుల కణికలు
జెజ్జడం జజ్జనక జన్ దరువులు
పొద్దింకల వానొచ్చినట్లు తప్పెట్ల హోరు
వెన్నెల్లో రంగురంగుల మెరుపులు
నిద్రిస్తున్న తోటలోకి పాటలొచ్చినట్లు
పడగలెత్తి బుసకొడుతు పాములు
పూలబుట్టలా
వున్న ఊరు కత్తుల వంతెన
మనిషిలోంచి మనిషి మాయమై
మతం ఒక్కటే పండ్లునూరుతుంది
కన్నీళ్లు చేదుగా-
సూర్యుడుదయిస్తున్నాడు
చంద్రుడస్తమిస్తున్నాడు
కాల చక్రం ఋతువులు గతితప్పుతున్నాయి
రైతు బండిచక్రమే పత్రహరితం
చెట్టు ఏ జెండాలనైనా ధిక్కారంగా ఎగరేస్తుంది
మనిషి కూడా
విశ్వాసాలేవైనా స్వీయంగా గౌరవించాలి
ఎడారి మైదానంలో
భీకర యుద్ధ రక్తప్రవాహలు
అప్పుడూ ఇప్పుడూ
వెన్నుపోట్లు కత్తిపోట్లు
వాళ్లు అమరులు
ప్రజాస్వామ్యం కోసం ఆత్మబలిదానాలతో
నేల కొరిగారు
రాయాల్సింది నిలబడాల్సింది కవులే
సీతాకోక చిలుకలు – పావురాలు
సమస్త జీవులు ప్రేమ పుష్పాలే
పీర్లు కూడా అంతే…
పీర్లకు ఫాతెహాలు ఇచ్చేటప్పుడు ప్రతి పీరుకు దోస్తరాదీన్ అంటారు.నాకు తెలిసి అది జోహార్లు కావొచ్చు
నివాళిగా ముజావరు ఫాతెహల చివర దోస్తరాదీన్ అనడం ఆనవాయితీ.








చాలా బాగుంది సార్… మొహర్రం రాత్రులు కళ్ళ ముందు మెదిలాయి.
నిద్రిస్తున్న తోటలోకి పాటలొచ్చినట్లు
పడగలెత్తి బుసకొడుతు పాములు
పూలబుట్టలా
వున్న ఊరు కత్తుల వంతెన
మనిషిలోంచి మనిషి మాయమై
మతం ఒక్కటే పండ్లునూరుతుంది
కన్నీళ్లు చేదుగా-
అవును సార్… మతం ఒక్కటే పండ్లు నూరుతుంది..