తెల్లెద్దు పేరు “కుంటెద్దు”గా మారింది

చాలాకాలం వరకూ ఈ ఎద్దులే నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. నా మూలంగానే కాలు పోయింది కదా అని మనసు విలవిలలాడేది. ఇప్పటికీ తలచుకుంటే మనసు రోదిస్తుంది.

నేను బడికెళ్ళే రోజుల్లో మాకు పెద్దా చిన్నా పాతిక దాకా ఆవులు, దూడలు, గిత్తలు, కోడెలు వుండేవి. పదో పదిహేనో ఎనుములూ, పడ్డలూ, దున్నపోతులూ వుండేవి. ఇవిగాక కాడి ఎద్దులూ, మరో కాడి గిత్తలూ వుండేవి. మేముండే రెండు అంకణాల కొట్టానికి ఆనుకునే రెండంకణాల ఎద్దుల కొట్టమూ వుండేది. తర్వాత కొన్నేళ్ళకు ఎదురుగా మరో కొట్టం పట్టుపురుగుల కోసమని కట్టి, ఆ తర్వాత ఆవులకొట్టంగా మార్చారు. లేకపోతే ఆవులూ, ఎనుములన్నీ ఆరుబయట గుంజలకే కట్టేసి వుండేవి. వర్షం వచ్చిన రాత్రయితే మేము పడుకున్న ఆ కొద్ది ఇంట్లోకే అమ్మానాన్నా లేదూడలను తీసుకొచ్చేవారు. అవి చేసే రొచ్చు అంతా మరుసటి వుదయం శుభ్రం చేసుకోవల్సిందే! మా నాన్నయితే చంటిబిడ్డలను చూసుకున్నట్లే ఆ దూడలతో గారాలు పోయేవాడు. మా అమ్మ మమ్మల్ని తినకపోతే కసురుకున్నట్టే వాటినీ కసురుకుంటూ గడ్డి వేసేది. పసిదూడలకు ప్రత్యేకంగా లేత పచ్చగడ్డి వేసేవారు. అవి పచ్చటిగడ్డితో ఎంత కడుపు నింపుకుంటే వాటి తల్లుల పాలను మనం అంతగా కడుపు నింపుకోవచ్చు. అడవికి మేతకు వెళ్ళిన ఆవులు ఇంటికి తిరిగి వచ్చే వేళ దూడల కోలాహలం చూడాలి… రెండు కన్నులూ చాలవు. మేము పాలు వుదయాన మాత్రమే పిండేవాళ్లం. కాబట్టి సాయంత్రం యింటికి ఆవులొచ్చేవేళకంటే ముందే లేగదూడల కట్లు విప్పేసివుండేవి. అవి తోక పైకెత్తి జోరుజోరుగా, వీధి ఈ కొస నుండి ఆ కొసకు పరుగెత్తే దృశ్యం మనోహరంగా వుంటుంది. బిడ్డల తల్లులైన ఆవులు మందకంటే ముందుగానే “అంబా” అంటూ పరుగెత్తు కొచ్చి తన బిడ్డను వెతుక్కొనే తీరూ, కనపడగానే చేపిన రొమ్మును తోక పైకెత్తి బిడ్డ తాగుతుంటే, తను కూడా మైమరిచిపోయి బిడ్డను నాకుతూ నిలబడే దృశ్యం ఎంత అద్భుతం! ఎంత సౌందర్యం!!

ఏదో చెప్పబోయి ఎటో వెళ్ళిపోయాను. ఈ ఆవులు నాటు ఆవులు. పాలు పెద్దగా ఇచ్చేవి కావు. మానాన్నకు అవిచ్చే పాలకంటే, అవి పెట్టే పేడపైనే మక్కువ. అవి పెట్టే పేడే మా పొలాలకు ఎరువు. ఆ ఆవులకు పుట్టే గిత్తలు కూడా సైజులో చిన్నగా వుండి బరువైన పనులకు ఉపయోగపడేవి కావు. ముఖ్యమైన పనులకు దేశపు ఎద్దులు అనబడే కాడెద్దులు వుండేవి. అవీ ఖరీదయినవి. ఆరడుగుల ఎత్తు వరకూ వుండి, పొడవైన కొమ్ములతో నాజూకుగా అందంగా వుండేవి. బాగా వ్యవసాయ పనులున్న రోజుల్లో వాటికి వీలయినంత వరకూ పచ్చగడ్డే వేసేవాళ్లం. ఉలవలు వుడకబెట్టి తినిపించేవాళ్లం. అవి సరిగ్గా తినకపోతే నాలుకను బయటకు లాగి ఉప్పు రుద్దేవారు. ఇలా ఇంట్లో పశువులు అంతర్భాగం.

ఒకసారి మానాన్న మా పక్కూరు నీలకంఠరావుపేటలో ఈ దేశీ కోడెలను అమ్ముతుంటే ఒకదాని నడక, పలువరస, ఠీవి, సుళ్ళు అన్నీ బావుంటే అంతమంచి ఎద్దు మళ్ళీ దొరుకుతుందా అని కొని ఇంటికి తెచ్చాడు. అది లేబ్రాయపు కోడె. మా తమ్ముడు దిలీప్ అదే సమయంలో స్కూలు మానేసి వ్యవసాయం చేసుకుంటా అంటూ ఇంటిపట్టునే వున్నాడు. ఈ కోడెకూ, వాడికీ బాగా స్నేహం కుదిరింది. ఆ కోడె కథేంటో.. నేను చెప్పే కంటే మా తమ్ముడు చెబితేనే న్యాయం జరుగుతుంది. వినండి అతని మాటల్లోనే..

” మావాడు(దేశపు కోడె) అన్నింటితో పాటే చాలా తెలివైన వాడు. చలాకైన వాడు. చక్కటి కొమ్ముల వాడు. మా ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే మాతో బాగా కలిసి పోయాడు. వీడిని చిన్న పిల్లవాడిలా చూసుకొనే వాళ్ళం. అన్ని ఆవులున్నా వాటితో పాటు మందలో తోలేవాళ్ళం కాదు. మా అమ్మ దూడలకు గరిక తేవడానికి మా గదగుండ్లబావి దగ్గరికి వెళ్ళేటపుడు వీడిని కూడా వెంట తీసుకెళ్ళి మేపుకొచ్చేది. అలా అల్లారుముద్దుగా పెంచాము. వీడిని మా గదగుండ్ల బావి దగ్గరికి తీసుకొని పోవడానికి పగ్గము అవసరము కూడా లేదు. బుద్ధిగా మా వెనకాలే వచ్చేవాడు. నాక్కూడా తెగ నచ్చాడు. నన్ను చూస్తే అలా మెడ పైకి ఎత్తుకొని దగ్గరికి వచ్చేవాడు. ఎందుకంటే మెడ కింద గంగడోలును నిమిరించుకోవడము చాలా ఇష్టం వాడికి.

నేను కూడా అల్లరే, చదువు అంతగా ఎక్కేది కాదు, పొలం దగ్గరకు వెళ్ళడము మహా యిష్టం. అందులోనూ ఆమధ్యే మా లెక్కల మాస్టారును తిట్టానని మా నాన్న చెవిలో పడింది. నేను ఏమి తిట్టలేదు – మా మాస్టారు రెండు మూడు గైడులు ముందర పెట్టుకొని బోర్డు పైన అన్ని విధాల సమాధానాలు వ్రాసేవాడు. అందులో ఆ రోజు ఏదో తికమక పడ్డాడు, అందుకే మార్చి మార్చి సమాధానాలు రాస్తున్నాడు. సరే అని నేను వూరుకోకుండా నా పక్క వాడితో “ఈ గుడ్డి సారుకు కనిపించి సావలేదు, అందుకే మార్చి మార్చి సమాధానాలు రాస్తున్నాడు” అన్నా. అంతే, ఇక వాడు మంచిగా చేతులు కట్టుకొని నేను అన్నమాటలు మాస్టారుకు చెప్పేశాడు. మనకు వంటిమీద వాతలు తేలాయి. విషయం ఇంటిదాక వెళ్లింది. అప్పటికే నాతో విసిగి వున్న మావాళ్ళు, ఇంక లాభం లేదని చదువు మానిపించారు.

అప్పుడు మావాడు మంచి రంజుమీదున్నాడు. ఆ నడక, ఆ ధీమా.. ఎకరం పొలం ఇరసాలు ఏమి ఖర్మ, నాలుగు సాళ్ళైనా ముల్లుకర్ర లేకుండానే దున్నేస్తా అనేటట్టున్నాడు. పని ఎక్కువ అవడంతో మావాడికి మరొక తెల్లదొరగాడిని(తెల్లటి దేశీ కోడె) జత చేశారు. వీడు కూడా మంచి ఆరు అడుగుల అందగాడు. నాకు వీళ్ళంటే ఎంతో ఇష్టం. ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి. మావాడికి, ఈతెల్లదొరగాడికి, నాకు బాగా షాడకేసే(వరినాటుకు బురదను దున్నడం) పని వచ్చి పడింది. మా నాన్న సామాన్యంగా చేసే దుక్కి ఒప్పుకోడు. పొలం బాగా మెత్తగా దుక్కి అవ్వాలంటాడు. ఎన్నిసార్లు దున్నినా, “ఇంకా గడ్డలు వున్నాయి నాయినా, ఇంకోసారి దున్ను” అంటాడు. ఈ మళ్ళు మరీ మెత్తని నేలలు కాదు. గులకరాళ్ళు వుంటాయి. వరసగా దున్నితే మనకాళ్ళూ మెత్తబడి సులభంగా కోసుకుపోతాయి. అలాంటి నేలల్లో ఒక నెల రోజులు రోజూ బురదలో పనే. వరి నాట్లు వేశారు. పని అయితే అయింది. కాని మావాడు బాగా మెత్తపడ్డాడు (మెత్తకాళ్ళు పడ్డాయి అంటే గిట్టలు మెత్తపడ్డాయి). మామూలుగా అలా బురదలో పని వుంటే ముందే లాలాలు (గిట్టల కింద కొట్టే ఇనుప ముక్కలు. నాడాలు లాలాలుగా మారివుండవచ్చు.) కొడతారు చెప్పులు లాగా. అవిలేకపోవడం వల్ల గిట్టలు బాగా మెత్తపడ్డాయి. గిట్టలు మెత్తపడితే మామూలు నేలమీద అడుగుపెట్టాలంటే వాటికి చాలా కష్టం. ఇద్దరూ నడవలేక పోతున్నారు. నాకు చాలా బాధేసింది. సరే అని ఎవరికి చెప్పకుండా నా దగ్గర వున్న డబ్బులతో మా ఊరికొచ్చిన లాలాలసాయిబు దగ్గర లాలాలు కొట్టించడానికి తీసుకెళ్ళాను.

మా అమ్మ ఒక వైపు చెపుతూనే వుంది. ఇంతకు ముందు అవి ఎప్పుడు లాలాలు కొట్టించుకోలేదు, వద్దు నాయనా అని. లాలాలు కొట్టాలంటే బలవంతంగా కింద పడుకోబెట్టాలి. ముందరి కాళ్ళకు తాడుతో కొక్కెం బిగించి, తల ఒకరు పట్టుకిని కింద పడేలా తాడులాగుతారు.  కాని అప్పుడు మా అమ్మ చెప్పిన దానికంటే నాకు వాటిమీద ఉన్న ప్రేమతో వాటి బాధ తీర్చాలనే ఎలాగయినా లాలాలు కొట్టించాలని తోలుకెళ్ళాను. మన వాడు తేలిగ్గానే పడుకున్నాడు, లాలాలు కొట్టించుకున్నాడు. తెల్లదొరకే భయం ఎక్కువ. ఒకపట్టాన పడుకోలేదు. కొత్త గిత్తలకు ముకుతాడు కుట్టాలన్నా, వాటిని కాడిగా సేద్యానికి తర్పీదు చేయాలన్నా, మా వూరిలో అందరికీ వినపడే పేరు, వేమయ్య. లాలాల సాయిబు, వేమయ్య ఇద్దరు కలిసి బలవంతంగా తెల్లోడిని పడుకోబెట్టారు. లాలాలు కొట్టారు. లేపితే లేచి వెనుక కాళ్ళలో ఒక కాలును ఎత్తి నిల్చుంది. ఏమి అయిందో నాకు అర్థం కాలేదు. ఇంటికి తీసుకెళ్ళాను. అందరూ వచ్చి చూశారు. కాలు బెణికింది అన్నారు. కోడిగుడ్డు, ఎర్రమట్టి, రాగిచెక్క కలిపి కట్టమన్నారు. మా రామయ్య పెద్దనాన్న ఏవేవో పసర్లు పూసాడు. ఏవీ పనిచేయలేదు. ఎత్తిన కాలు దించనే లేదు. ఎవరిసలహాతోనో కాలుపైన వాత పెట్టించాము. అయినా కాలు కింద పెట్టలేదు. కాడి విడింది. జోడు తప్పింది. ఇద్దరినీ విడదీసారు. మావాడిని ఎవరికో అమ్మేశారు. తెల్లోడిని, కాలు నేను బాగు చేస్తానని మా రామయ్య పెదనాన్న తీసుకెళ్ళాడు. తెల్లెద్దు పేరు “కుంటెద్దు”గా మారింది. అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాక తెల్లోడినీ అమ్మేశారు. చాలాకాలం వరకూ ఈ ఎద్దులే నా కలల్లో ఎక్కువగా కనిపించేవి. నా మూలంగానే కాలు పోయింది కదా అని మనసు విలవిలలాడేది. ఇప్పటికీ తలచుకుంటే మనసు రోదిస్తుంది.”

అదీ మాతమ్ముడు చెప్పిన ఎద్దులతో తన అనుబందం. ఇప్పుడా ఎద్దులూ లేవు. ఆవులూ, కోడెలూ, దూడలూ లేవు. అంబా అనే అరుపుల్లేవు, గోధూళి లేదు. సుయ్ సుయ్ మనే పాలు పితుకు శబ్దాలు లేవు. సిరాక్..సిరాక్ మనే పెరుగు కుండలో కవ్వళ్ళ నాట్యాలు లేవు.

*

ప్రసాద్ చరసాల

8 comments

Leave a Reply to సోమ సుధేష్ణ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కొత్తరకం నెరేషన్ అన్నా….గొప్పగా చెప్పావు. నాకు వ్యవసాయం, పాడి గురించి చాలా తక్కువ తెలుసు. నీ కథలో బతికే ఛాన్స్ ఇచ్చావ్. లవ్యూ.

    • థ్యాంక్స్ అన్నా! మా తమ్ముడు చెప్పినట్లున్న కథ, నిజంగా మా తమ్ముడు రాసిందే అన్నా!

  • ఎద్దుల కథ భలె చెప్పిన్రు , జోరుగ నడిచింది ప్రసాద్ గారు.

  • చాలా బాగా చెప్పారు ప్రసాద్ గారు.

    దేశవాళీ పశువులు రైతుల జీవితాల్లో ఉన్నంత కాలం సీమలో వ్యవసాయం మరీ ఇప్పుడున్న దీన స్థితిలోకి వెళ్ళ లేదు. వాటి స్థానం లో శ్వేత విప్లవం పేరుతో ఎప్పుడైతే హైబ్రిడ్ పశువులు వచ్చాయో అప్పటినుంచి సమస్య పెరిగిపోయి రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అనేక కారణాల్లో ఇది చాలా ముఖ్యమైనది.
    వాటిని పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్న ఒక కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా చూసాను.
    పశువుల పేడ ఉంటేనే భూమికి కావలసిన సహజ ఎరువు తయారవుతుంది. ఇప్పుడు పశువులూ లేవూ, ఎరువూ లేదు. అంటా విష రసాయనాలే. వాటితో మనం తినేది కూడా విషమే.

    • థ్యాంక్యూ సజయ గారూ, ఇప్పుడు ఆర్గానిక్ అంటున్నాము కానీ అప్పుడంతా ఆర్గానిక్ మాత్రమే.

  • మనిషి పశువు కథ గుర్తొచ్చింది. రామకృష్ణ గారు సీమలో పశువులు కూడా మనుషుల స్థాయే అని చెప్పిన కథ. మంచి రైటప్ ప్రసాద్ గా‌రు. చివర్లో నీళ్ళం తిరిగాయి కంట్లో…

    • మహమూద్ గారు, థ్యాంక్యూ!
      ఆ కథకు లంకె వుంటే ఇవ్వగలరా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు