తెల్లవారు ఝూము కల 

ఒకరినొకరు
బిగికౌగిళ్ల పీఠముడులై
అల్లుకుపోయాం!

తెల్లవారు ఝూమున

అందమైన కల ఒకటి వొచ్చింది

 

నాలోంచి

నా పక్కటెముక ఒకటి విడిపడి

ఆరడుగుల సర్పిణియై

చూస్తుండగానే

జరజరా పాక్కుంటూ వెళ్ళిపోయింది

మరికాసేపటికి

నేనూ మానవ కుబుసం విడిచి

గోధువ వర్ణపు కోడెత్రాచునై

దానిని వెంబడించాను

ఎంతదూరం వెళ్లామో

నదులు అడవులు

ఎడారులు మైదానాలు

ఎన్ని పగళ్లు

మరెన్ని రాత్రులు

ఒకదాని వెంట మరొకటి

ఒక దానిని మించి మరొకటి

ఎన్ని యోజనాలు పరుగెత్తామో

మాకే తెలియదు.

 

చివరకు

ఒక వెన్నెల రాత్రి

ముఖ్ మల్ గుడ్డలాంటి

మెత్తని ఆకుపచ్చ మైదానంలో

అలసిసొలసి ఆగిపోయాం!

అప్పుడు ఆకాశం ఒకింత కిందకు వొంగి

మాకోసం కల్లు నురగలాంటి వెన్నెలను

ధవళ వస్త్రపు శయ్యగా పరచింది.

 

శిరసులెత్తి

పడగలెత్తి

మోహపు మంటల

చీలికల నాలుకలతో

ఒకరినొకరు స్పృశించుకున్నాం

ఒకరినొకరు

బిగికౌగిళ్ల పీఠముడులై

అల్లుకుపోయాం!

ఒట్టిగడ్డి పరకలను

గుప్పెడు గుప్పెడు జోడించి

మెలిపెట్టి ఎంటును పేనినట్టు

వొకరి నొకరం

పెనవేసుకు పోయాం!

 

ఉతికిన వస్త్రాన్ని

నీళ్లు పిండడానికి

ముమ్మార్లు మెలితిప్పినట్టు

ఒకరినొకరం మెలితిరిగిపోయాం

ఆకల్లాడలేదు

గాలి కంపించలేదు

చుట్టూ నిబిడ నిశ్శబ్ద సౌందర్యం!

 

అంతవరకూ

సముద్రపు కెరటాల్లా

హోరెత్తిన ఉచ్ఛ్వాస నిశ్వాసాల బుసలు

ఒక్కసారిగా నెమ్మదించాయి.

అంతవరకూ

ఒక్కటిగా సాగిన రైలుపట్టా

రెండుమార్గాలుగా చీలినట్టు

చెరోవైపు

ఒకరికొకరు తెలియనట్టుగా

వెళ్లిపోయాం!

 

తెల్లవారు ఝామున

మంచికల ఒకటి వొచ్చింది

అందమైన కవితావాక్యం

నన్ను సుతారంగా తట్టిలేపుతున్నట్టు.

*

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

శిఖామణి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి కవిత. చక్కటి అనుభూతి. శిఖామణిగారికి అభినందనలు.

  • వర్తమాన సంఘటనలపై మంచి కవిత సార్….

  • తెల్లవారుఝాము కలలా వెంటాడుతూనే ఉంది.
    మనిషిలోని కోర్కెల పరుగులాట ఎన్నటికీ ఆగేది కాదేమో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు