తెలుగింగ్లీష్ ….కొన్ని ప్రాబ్లమ్స్!

ఒక తెలుగు కవితకు గాని, కథకు గాని, పుస్తకానికి గాని సరిగ్గా సరిపడే ఆంగ్ల శీర్షిక మనసులో మెదిలినప్పుడు, అవే పదాలను తెలుగులోకి అనువదించి అంతే మంచి శీర్షికను పెట్టలేమన్నది చాలా సందర్భాల్లో వాస్తవమే అయినా, భిన్నమైన అర్థాన్నిచ్చే వేరే తెలుగు పదాలనుపయోగించి, అంతే మంచి మరొక శీర్షికను, లేదా అంతకన్న ఎక్కువ ప్రభావవంతమైన దాన్ని పెట్టడం సాధ్యమనేది కూడా వాస్తవం.

మధ్య తెలుగు కవితలకు, కథలకు, పుస్తకాలకు ఆంగ్ల శీర్షికలు పెట్టడం సాధారణమైపోయింది. రచనల్లోని వాక్యాల్లో, పంక్తుల్లో కూడా ఆంగ్లపదాలు విరివిగా కనపడుతున్నాయి. కొందరైతే తెలుగు రచనల్లో ఆంగ్లపదాలను విచ్చలవిడిగా గుప్పిస్తారు – అక్కడ వాటి అవసరం అంతగా లేకపోయినా. కథలు మొదలైన వచనరచనల్లో వందలకొద్ది ఆంగ్లపదాలను అనవసరంగా రాసేవాళ్లుంటారు కొందరు. అది యెట్లా వుంటుందంటే, మిగిలిన ఆ కొన్ని పదాలకు కూడా సరిపడే ఆంగ్లపదాలను కనుక్కుని మొత్తం రచనను ఆంగ్లంలోనే రాయొచ్చు కదా అనిపిస్తుంది. చాలా మంది విషయంలో ఇదొక లౌల్యం.

వేరే విధంగా రాయటానికి వీలు కాని సందర్భాల్లో ఆంగ్లపదాలను వాడితే అది సమంజసమే. ఉదాహరణకు déjà vu, aura మొదలైన ఆంగ్లపదాలకు కచ్చితమైన అనువాదాలను ఒకటి రెండు మాటల్లో చెప్పలేం. అట్లాంటప్పడు వాటిని ఉన్నదున్నట్టుగా రాయడం సబబే. కాని, తెలుగులో రచన చేస్తూ ప్రతి సందర్భంలో అనవసరంగా, విచక్షణ లేకుండా ఆంగ్లపదాలను వాడటం అసమంజసం. ఈ పోకడకు విరుద్ధంగా శుద్ధతావాదులు గొంతెత్తి తమ నిరసనను బలంగా వినిపించే పరిస్థితి లేదిప్పుడు. ఎందుకంటే, ఈ ఆధునిక కాలంలో ఆంగ్లభాష మన జీవితాల్లోకీ, రోజువారీ వ్యవహారాల్లోకీ బాగా చొచ్చుకునిపోయింది. అయినప్పటికీ మామూలు స్థాయిలోనైనా ఆక్షేపణను తెలిపేవారుండకపోరు. దీన్నంతా పక్కన పెడితే, తెలుగు రచనల్లో ఆంగ్లపదాలను ఎప్పుడు వాడాలి అనే విషయంలో చాలా మంది కవులు, రచయితలు తమకు తాము నియమాలను నిర్దేశించుకున్నట్టు కనిపించదు. దీన్నే మరోవిధంగా చెప్పాలంటే, ప్రత్యేకమైన లేక అనివార్యమైన సందర్భాల్లో మాత్రమే ఆంగ్లపదాలను వాడుతాము అని అనుకోరు.

ఒక తెలుగు కవితకు గాని, కథకు గాని, పుస్తకానికి గాని సరిగ్గా సరిపడే ఆంగ్ల శీర్షిక మనసులో మెదిలినప్పుడు, అవే పదాలను తెలుగులోకి అనువదించి అంతే మంచి శీర్షికను పెట్టలేమన్నది చాలా సందర్భాల్లో వాస్తవమే అయినా, భిన్నమైన అర్థాన్నిచ్చే వేరే తెలుగు పదాలనుపయోగించి, అంతే మంచి మరొక శీర్షికను, లేదా అంతకన్న ఎక్కువ ప్రభావవంతమైన దాన్ని పెట్టడం సాధ్యమనేది కూడా వాస్తవం. సరైన, సంతృప్తికరమైన సమానార్థక పదం దొరకనప్పుడు తప్ప తెలుగు రచనల్లో నేను ఆంగ్లపదాలను వాడను అని ప్రతి కవీ,  రచయితా గట్టిగా నిర్ణయించుకున్నప్పుడే ఈ పోకడ మారుతుంది. ఆంగ్లపదాలను తెలుగులిపిలో రాయాలని ప్రయత్నించినప్పుడు తప్పులు దొర్లే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవటం ఎంతో అవసరం. ఇదే ఈ వ్యాసం ద్వారా చెప్పదల్చుకున్న ప్రధానమైన విషయం.

అప్పుడప్పుడు కొన్ని ఇంగ్లిష్ పదాలకు కచ్చితంగా సరిపోయే పదాలు – పూర్తిగా సంతృప్తికరమైనవి –  తెలుగులో దొరకవు. అటువంటప్పుడు అవే పదాలను తెలుగు లిపిలో కాని, ఆంగ్లలిపిలో కాని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాటిని తర్జుమా చేయకుండా అట్లాగే రాయాలన్న మాట. వాటి సరైన రూపాలను తెలుగులిపిలో రాయాలని ప్రయత్నిస్తే అవి భాష పరంగా తప్పులుగానైనా తయారవుతాయి, లేదా మనం సరిగ్గా రాసినా మామూలు పాఠకులకు తప్పులుగానైనా కనపడతాయి. ఉదాహరణకు ఓ. హెన్రీ రాసిన The Gift of the Magi  అనే కథ వుంది. ఆ శీర్షికలోని చివరి పదాన్ని మెజై అని పలకాలి/రాయాలి, మాగి/మ్యాగి అనకూడదు. కాని, మళ్లీ Maggi noodles ను మ్యాగి నూడుల్స్ అనటమే కరెక్ట్. ఇంగ్లిష్ చాలా విచిత్రమైన భాష. అందులో ఏ అక్షరాలను రాస్తామో వాటిని ఉన్నదున్నట్టుగా పలకం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా పలకాల్సి/రాయాల్సి ఉంటుంది. Lullaby ని లల్లబీ అని రాస్తారు/ఉచ్చరిస్తారు కొందరు. కాని, దానికి సరైన రూపం లలబై.  ఇక poignant ను పాయిన్యెంట్ అనాలి. `Francoise Mitterand ను ఫ్రాంస్వాజె మీతరాఁ, Champ Elyssee ని షాంజే లీజే అనాలి. Chaos ను కేయాస్ అనీ, chamois ను షామీ/షామ్వా అనీ, repertoire ను రెపర్ట్వా(ర్) అనీ, memoir ను మెమ్వా అనీ, memoirs ను మెమ్వార్స్ అనీ రాయాల్సి/పలకాల్సి వుంటుంది. Focus ను ఫోకస్ అంటాము. కాని, దానికి బహువచనమైన foci ని ఫోకై అనకుండా ఫొసై అనాలట. అదే విధంగా facade ను ఫసాడ్ అని పలకాలి/రాయాలి.  Indict ను ఇండైట్ అనకుండా ఇండిక్ట్ అనీ, quay (బల్లకట్టు) ను కీ అనకుండా క్వే అనీ రాస్తే, అవి నిస్సందేహంగా తప్పులే. ఒకవేళ ఇండైట్ అనీ, కీ అనీ సరిగ్గా రాస్తే మన తెలుగు పాఠకులు అవి వేరే పదాలనుకుంటారు. అయితే, వాటినే ఆంగ్లలిపిలో రాస్తే పట్టుకునే వారుంటారు కొందరు. కొన్ని ఆంగ్లపదాలను తెలుగు లిపిలో రాసినా వాటికి వ్యాకరణదోషం అంటదు. అంటే కచ్చితత్వానికి ముప్పు వాటిల్లదన్న మాట.

తెలుగులిపిలో రాసినా అనుమానానికి, అయోమయానికి, వివాదానికి తావివ్వని ఆంగ్లపదాలు కొల్లలుగా ఉన్నాయి ఇంగ్లిష్ భాషలో.  ఉదాహరణకు సబార్డినేట్, ఎనీవేర్, ఇంప్లిసిట్, ఆన్సర్, బ్రేవరీ, క్లియర్లీ, జస్ట్, ఎవర్, ఐడెంటిటీ, డిఫికల్ట్, గ్రేటర్ మొదలైన ఎన్నో మాటలు. ఇటువంటి పదాలను తెలుగులిపి లోనే రాయొచ్చు. అయితే జస్ట్ కు బదులు జెస్ట్ అని రాస్తే అది పూర్తిగా భిన్నమైన అర్థాన్నిస్తుంది (jest = joke). ఇక, పైన చెప్పబడిన పదాల్లో చాలా వాటికి సరిగ్గా సరిపోయే తెలుగు పదాలున్నాయనే అతి ముఖ్యమైన సంగతిని మరిచిపోవద్దు. మరి వాటికి బదులు ఇంగ్లిష్ పదాలను ఎందుకు ఉపయోగించాలి? మొత్తం మీద, ఆంగ్లపదాలను తెలుగులిపిలో రాయాలనుకున్నప్పుడు మనం పప్పులో కాలు వేయబోతున్నామా అనే ప్రశ్నను వేసుకోవాలి ఎవరికి వారు.

ఉదాహరణకు ద హిందు  అనే బదులు ది హిందు అని రాశామనుకోండి. అది తప్పవుతుంది. కాని, ద ఓన్లీ ఎక్సెప్షన్ అనటం తప్పు కిందికి వస్తుంది.  ది ఓన్లీ ఎక్సెప్షన్ అనటమే సరైనది. The అనేది హల్లు (consonant)తో ప్రారంభమయ్యే పదం ముందు వచ్చినప్పుడు దాన్ని ద అనీ, అచ్చు (a, e, i, o, u వంటి vowel)తో మొదలయ్యే పదం ముందర వచ్చినప్పుడు ది అనీ పలకాలి/రాయాలి. కాబట్టి, ఈ తలనొప్పంతా ఎందుకు? The Hindu అని ఆంగ్లంలోనే రాస్తే పోలేదా? Thrill ను థ్రిల్ అనకూడదు, త్రిల్ అనాలి. కాని అట్లా రాస్తే, సామాన్య పాఠకుడు మనం రాసిందే తప్పనుకుంటాడు. ‘ఫోయెనిక్స్ నగరంలో దుండగుల కాల్పులు’ అని ఒక పత్రికలో వార్తాశీర్షిక వచ్చింది. Phoenix ను ఫీనిక్స్ అని పలకాలని తెలియకపోవటమే ఈ తప్పుకు కారణం. అదే విధంగా foetus ను ఫీటస్ అనాలి. తౌజెండ్, గాస్ట్లీ, గోస్ట్, చెస్ట్, చీప్ కు బదులు థౌజెండ్, ఘాస్ట్లీ, ఘోస్ట్ ఛెస్ట్, ఛీప్ అని రాస్తే/ఉచ్చరిస్తే అవి తప్పులవుతాయి. Buryని బెరీ అనకుండా బరీ అనీ, burial ground ను బెరియల్ గ్రౌండ్ అనకుండా బరియల్ గ్రౌండ్ అనీ పలికితే/రాస్తే అవి తప్పులే అవుతాయి. క్రికెట్ లో bowling ఉంటుంది కదా. దాన్ని బోలింగ్ అనాలి, బౌలింగ్ అనకూడదు. Oven ను ఓవెన్ అనకూడదు, అవెన్ అనాలి. మారువానా(marijuana), మోగేజ్(mortgage), ఎపిటమీ(epitome) క్యాష్(cache), నీష్(niche) లను రాసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. స్వీట్(suite), క(ర్)నల్(colonel), క్వాయర్(choir), ఇలీట్(elite), చెలో(cello), లియొనార్డో డ వించి(Leonardo Da Vinci) మొదలైన ఎన్నో పదరూపాలను సరిగ్గా రాయాలంటే వాటిని ప్రత్యేక శ్రద్ధతో జ్ఞాపకం పెట్టుకోవాలి. పప్పులో కాలేయడానికి ఇన్ని అవకాశాలున్నప్పుడు, ప్రతిసారీ ఆంగ్లపదాన్ని తెలుగులిపిలో రాసి ఇబ్బందిని కొనితెచ్చుకోవటమెందుకు? సందేహం తలెత్తిన కొన్ని  సందర్భాల్లోనైనా ఆంగ్లలిపిలో రాసి, ప్రమాదాన్ని నివారించవచ్చును కదా!

ఇన్ని కారణాల వలన కొన్ని ఆంగ్లపదాలను ఆంగ్లలిపిలో, మరికొన్నింటిని తెలుగు లిపిలో రాయటమే సమంజసం అని ఈ వ్యాసకర్త అభిప్రాయం.

 

 

ఎలనాగ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు