నిప్పు పూలు గెలిచాయి!

మర్నాడు సాయంత్రం గౌరి రాలేదు. జాగీర్దార్లు చేసిన అత్యాచారాలకు జనమంతా కోపంగా ఉన్నారు. ఇప్పుడు జాగీర్దారు భార్య అన్నా, బంధువులన్నా జనానికి కోపం. వాళ్ళు బాగానే సుఖపడి చచ్చారు. ఇప్పుడు బతికున్నవాళ్లు కష్టపడి బతకాల్సి వస్తున్నది. ఎంత పాడు కాలం వచ్చింది. ఇప్పుడెట్లా? అని బేగం మెదడులో ఆలోచనల పాములు బుసలు కొడుతుంటాయి.

వాబులు, జమీందార్లూ, జాగీర్దార్లూ, దొరలు, ధనవంతులు తమకు నచ్చిన పూలను కొన్నింటిని తమ ఇంటిముందు కట్టేసుకొని తమను మించిన వారు లేరనో, ఈ ప్రపంచం తమ చూపుడువేలును అనుసరించి నడుస్తుందనో విర్రవీగుతుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే వాళ్ళు మోకరిల్లినా అందని పూల దొంతరలెన్నో అడవిలో ఉంటాయి. తాము సుఖమనుకునే జీవితం కంటే అద్భుతమైన జీవితం ఎక్కడో దూరంగా మాయామర్మం తెలియని పల్లెల్లో ఉంటుంది.

కాలం, చేతిలోంచి జారిపోయినా ఫరవాలేదు కానీ ఎదురుతిరిగితే? నవాబులు ప్రజలను దోపిడీ చేసి చేసి సుఖపడి చచ్చారు. మరి ఇంకా ఇక్కడే మిగిలిపోయిన నవాబుల భార్యలు ఎలా బతకాలి? ఒకప్పుడు మహారాణిలా బతికిన జాగీర్దారు  భార్య కాలపు చేతిలో చితికి పోయి బంగళాలు, ధనం, అహంకారం అన్నింటినీ విడిచేసి సామాన్యుల్లో సామాన్యురాలిగా కలిసిపోయిన నిజాం కాలం నాటి ఒక జాగీర్దారు భార్య కథ ‘నిప్పుపూలు’.

ఈ కథ 12 మే 1949లో తెలుగుదేశం పత్రికలో అచ్చయ్యింది. రచయిత దాశరథి కృష్ణమాచార్య. కవిగా, సినీ గేయ రచయితగా ప్రసిద్ధులైన దాశరథి కథకుడిగా అంతగా ప్రచారం లేనివాడు. ఆయన రాసిన కథలు మొత్తం అయిదు కథల్ని ఇటీవల నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు ‘ప్రజాకవి దాశరథి సాహిత్యం-5’ లో చేర్చి ప్రచురించారు.  వాటిలో ‘నిప్పుపూలు’ కథ అద్భుతమైన కథ. వాసిరెడ్డి నవీన్ సంపాదకత్వంలో వెలువడిన ‘తెలంగాణ విముక్తి పోరాట కథలు’ లో చేర్చాల్సిన కథ. బహుశా ప్రత్యక్ష పోరాటాన్ని చిత్రించిన కథల్నే తీసుకోవాలని భావించారేమో సంపాదకులు ఈ కథకు అందులో చోటు కల్పించలేదు. నిజాంకు వ్యతిరేకంగా పొరాడి జైలుకు కూడా పోయిన ఉద్యమకారుడు కాబట్టి సహజంగానే దాశరథికి ఉద్యమానికి, విప్లవానికి ప్రతీక అయిన మోదుగుపూలంటే చాలా ఇష్టం. అందుకే మోదుగుపూల మీదనే రెండు కథలు రాశాడు. నిప్పుపూలు కాకుండా మరోకథ ‘పూచిన మోదుగులు’. (తెలుగుదేశం పత్రిక మే 12, 1949)

అవి ‘ఆపరేషన్ పోలో’ మొదలై తెలంగాణ ఇండియన్ యూనియన్లో కల్సిపోవడానికి తొక్కులాడుతోన్న సంధి కాలపు రోజులు. జమీందారులు, జాగీర్దారులు, దొరల వైభవమంతా మట్టిలో కల్సిపోవడానికి సిద్ధమవుతున్న రోజులు. కొంత మంది తమ భార్యలను విధవలుగా ఇక్కడే వదిలేసి ఈ లోకాన్నే విడిచిపోయిన గడ్డు రోజులు. అట్లా బతికినన్ని రోజులు పైడితంగెళ్ళ వెనక ఉన్న మహళ్లలో హుక్కాలు తాగుతూ ప్రజల్ని పీడించుకు, కాల్చుకు తిని అధికారం కోల్పోక ముందే గతించిన ఒక ప్రాంతపు జాగీర్దారు అక్తర్ జంగ్. ఆయన భార్య బేగం  సాహిబా. ఈమె అక్తర్ జంగ్ కు ఆరో భార్య. వయసులో చాలా చిన్నది. కానీ అన్నీ అనుభవించిన స్త్రీలాగా గర్వంగా ఉండేది హైదరబాద్ లో.

భర్త బతికి ఉన్నన్ని రోజులు సిరి సంపదలతో తులతూగి జీవితాన్ని అంగరంగ వైభవంగా గడిపింది. పైడితంగెళ్ళ వెనక దర్పం ఒలకబోస్తూ నిల్చున్న అందమైన “మహళ్ళు, ఎత్తైన మెత్తని పరుపులు, గొప్ప భోజనాలు, విలువైన దుస్తులు, తాంబూలాలు, అత్తరు, ముసలి మొగుడి కామం, వందలకొద్ది పరిచారికలు, బురఖాలు, తెరలు, అంతకంటే లోకంలో ఏం విశేషాలుంటాయి! 16 జిల్లాలను దోచుకొని, ఆ దోపిడితో శోభించే మహానగరంలో కంటే ఇంకేం విశేషాలుంటాయి?” అని అనుకునేది. కనీసం తమ జాగీరు ఎక్కడుందో కూడా తెలియదు ఆమెకు. ప్రజలు ఎన్నో బాధల్ని పంటి బిగువున భరించి ప్రతి ఏటా కొన్ని లక్షల రూపాయలను పన్ను రూపేణా కట్టేవారు. కానీ రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా! భర్త చనిపోయిన చాలా రోజులకు తమ జాగీరును వెతుక్కుంటూ హైదరాబాద్ నుండి వస్తుంది బేగం. బండి దిగి తమ బంగాళాలోకి చేరి దూరంగా హైదరాబాద్ లో తమ మహళ్ళ ముందరి పైడితంగేడు పూల కన్నా ఎర్రగా పూసిన మోదుగుపూలను చూసి అశ్చర్యపోతుంది. వెధవ పల్లెటూళ్లలో ఇంత అందం పర్చుకోవడమేమిటని విస్తూపోతుంది. ముట్టుకున్నా కాలని చల్లని నిప్పులాంటి ఆ మోదుగులను కొన్నింటిని సేవకులతో గంపల నిండా తెప్పించుకొని వాటి విత్తనాలనో, లేక వాటి అంట్లనో హైదరాబాద్ కు తీసుకుపోవాలని నిశ్చయించుకుంటుంది. వాటికి ‘నిప్పుపూలు’ అని పేరు పెట్టుకుంటుంది.

మర్నాటి సాయంత్రం కొందరు పేద ఆడవాళ్ళు జాగీర్దారిణి బేగంను చూడడానికి బంగళాకు వస్తారు. చిరిగి అతుకులు పడ్డ చీరలు, తైల సంస్కారం లేని జుట్టూ, చెమట వాసనా వస్తున్న వాళ్ళూ నవ్వుతూ మేడలోకి వస్తారు. వాళ్ళలో బేగం కళ్ళు గౌరి మీద పడి నిర్ఘాంతపోతుంది. తనలాంటి దుస్తులే ఇస్తే గౌరి ప్రపంచ సుందరి  అనుకుంటుంది. నిన్న తమ మహళ్ల ముందటి పైడితంగెళ్ళతో మోదుగుపూలని పోల్చుకుంది. ఇప్పుడు తనను ఈ గౌరీతో పోల్చుకుంటుంది. నిన్న మోదుగుపూలు గెల్చినై. ఇప్పుడు గౌరి గెల్చింది. బేగం ఒక్కసారిగా గౌరి దగ్గరికి వచ్చి ‘కిత్తీ అచ్చీ హై’ (ఎంత అందంగా ఉన్నావ్) అంటూ గౌరీని కౌగిలించుకుంటుంది. గౌరీకి ఉర్దూ అర్థం కాదు. బేగం కౌగిలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. గభాల్న బేగం గౌరీని పడకగదిలోకి తీసుకుపోయి, పెట్టె తెరిచి మంచి చీర, జాకెట్ తీసిస్తుంది. గౌరి పెదాలను తన పెదాలతో వేడిగా పిండుకుంటుంది. ఒంటి నిండా అత్తరు పూస్తుంది. కొప్పులో నాలుగు మోదుగు మొగ్గలు చెక్కుతుంది. పడమటి ఆకాశం గౌరి కొప్పులో మంద్రంగా నవ్వుతుంది. గదినంతా పరిశీలించి-

“ఇదంతా మమ్మల్ని దోచుకున్న డబ్బే” అంటుంది గౌరి.

“ఏమిటీ?” అంటుంది బేగం ఉర్దూలో.

“నాకు తెలుసులే. మీ వాళ్ళు మా వాళ్లని ఎన్ని బాధలు పెట్టలే! గాంధీ జెండాను ఎత్తుకోనిచ్చారా? మా ఆయన్ని ఖైదుకు పంపితిరి” అంది గౌరి.

“ఈ దుస్తులు నువ్వే ఉంచుకో రేపు సాయంత్రం మళ్ళీ రా!” అంది బేగం.

“ఈ జాగీర్లు పోతైలే. మా ఆయన ఈ వూరికి కాంగ్రెస్ పెద్ద. నువ్వు పెద్ద కాదు” అంది గౌరి.

మర్నాడు సాయంత్రం గౌరి రాలేదు. జాగీర్దార్లు చేసిన అత్యాచారాలకు జనమంతా కోపంగా ఉన్నారు. ఇప్పుడు జాగీర్దారు భార్య అన్నా, బంధువులన్నా జనానికి కోపం. వాళ్ళు బాగానే సుఖపడి చచ్చారు. ఇప్పుడు బతికున్నవాళ్లు కష్టపడి బతకాల్సి వస్తున్నది. ఎంత పాడు కాలం వచ్చింది. ఇప్పుడెట్లా? అని బేగం మెదడులో ఆలోచనల పాములు బుసలు కొడుతుంటాయి. సౌధాలు, సౌభాగ్యాలు, సంతోషాలూ ఇప్పుడు మనిషిని నిలబెట్టవు. ఏదో ఒక విధంగా జనాన్ని మచ్చిక చేసుకోవాలి. వాళ్ళతో కలిసిపోయి జీవించడం మంచిది. లేకుంటే కాలం గడవదు అని అనుకున్నదే తడవుగా గౌరి ఇంటికి పోతుంది బేగం. అవాక్కైన గౌరికి బేగం మీద అంతకు ముందున్న కోపం పోయి ఆమె మీద జాలి, దయ కలుగుతాయి. “పాపం ఆడది మగాళ్లు చేసే ప్రతి పనికి బాధ్యురాలా? పాపం విధవరాలు, మొగుడు పోయిన్నాటి నుంచి అన్నీ చిక్కులే. ఎన్నడూ లేంది ఈ పల్లెకు వచ్చింది” అని మనసులోనే అనుకొని ఇంట్లోకి తీసుకుపోతుంది. బేగం ఇంటినంతా పరికించి చూసి “నేను ఇక్కడే ఉండిపోనా?” అంది.

నువ్వు అంతా గొప్పదానవు. మేం కలో గంజో తాగి ఈ గుడిసెలోనే ఉంటాం అంది గౌరి.

“అన్నం తింటావా ఇక్కడ?” గౌరి అడుగుతుంది.

ఆమెకు తెలుగు రాదు. ఈమెకు ఉర్దూ రాదు అయినా ఎవరికి కావాల్సిన సమాధానం వారికి లభించినట్టే మెసులుతున్నారు. బేగం పోతాననలేదు. గౌరి పొమ్మనలేదు. గౌరి భర్త చంద్రం కూడా ఏమనలేదు. లోకులు కాకులు. బేగం పారిపోయిందన్నారు జాగీరు వంశీకులు. పట్నవాసులేమో బేగం చంద్రాన్ని ఉంచుకుందన్నారు. పెద్దలేమో చంద్రం బేగంను ఎత్తుకుపోయాడన్నారు. బేగం ఈ నిందల్ని వినడం మానేసి హాయిగా వాళ్ళలో కలిసిపోయింది. గౌరి మాటలు, మోదుగుపూదోటలు, చల్లగాలి పాటలు, చిరిగి అతుకులు పడ్డ  చీరెతో, పోకముడి రైకతో, నూనె లేక ఎర్రవారిన జుట్టుతో గౌరి అక్క మాదిరి ఉంది బేగమిప్పుడు. ఓసారి హైదరాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ సభలను చూడ్డానికి వచ్చి పైడి తంగెళ్ళ పాలిపోయిన ఎరుపు రంగు  వెనక ఉన్న తన మహలును చూసి పెద్దగా నవ్వింది బేగం. పల్లెలో చల్లని నిప్పు మోదుగులు, అందమైన గౌరి, గొప్ప చంద్రం వీళ్ళే లోకం ఇప్పుడు బేగంకు. పట్నాలన్నీ ఒట్టి మోసం. మళ్ళీ నవ్వింది బేగం. గౌరి జడలోని మోదుగులు కూడా నవ్వాయి.

కథకుడు కవి కావడం మూలాన కావచ్చు. కథంతా ఒక కవిత్వ ధారలో నడుస్తుంది. చాలా మాటలు కవితాత్మకంగానే దొర్లిపోతాయి. ఎంచుకున్న శిల్పం పాఠకుడిని కట్టిపడేస్తుంది. ఒక జాగీర్దారు భార్య కొన్ని క్లిష్ట పరిస్థితుల మధ్యే కావచ్చు సాధారణ ప్రజలతో కల్సి బతకడమనేది ఒక గొప్ప మార్పు. దాన్ని రచయిత చాలా నేర్పుతో చెప్పడం కనిపిస్తుంది. నగరాల్లో కాదు పల్లెల్లోనే నిజమైన జీవితం ఇమిడి ఉందని చెప్తుందీ కథ. నిజానికీ కథలో చెప్పిన విషయాలకంటే చెప్పని విషయాలే ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ భారత్ లో విలీనం కావడానికి ముందున్న   పరిస్థితులను ప్రతిబింబిస్తుందీ కథ. నిజాం పాలన చర్చకు వచ్చిన ప్రతీసారి నాణానికి ఒకవైపునే నిలబడి దొరల, జాగీర్దారుల దోపిడీని, పీడనను చర్చకు పెడుతాం.  కానీ దానికి భిన్నంగా కథకుడు నాణానికి ఆవలి వైపున్న జీవితాన్ని చూపెడుతాడు. అయితే అధికారం ఉన్న కాలంలో ఒక వెలుగు వెలిగి అధికారం అంతమైన తరువాత వాస్తవ పరిస్థితులకు లొంగిపోయి ఒక మామూలు మనిషిలా సమాజంలో కల్సిపోతారా అనేది ఒక చర్చనీయాంశం. ఇట్లాంటి సందర్భాలలో ఆత్మహత్యలకైనా పాల్పడుతారు కానీ పరిస్థితులకు రాజీపడిపోయి బతకడానికి ఇష్టపడక ప్రాణాలు తీసుకున్న దాఖలాలు మనకు చరిత్రలో చాలా కనిపిస్తాయి.

కానీ ఈ కథలో జీవితంలో ఏది జరిగినా ఒక పాజిటివ్ దృక్పథంతో చూడాలనే కోణం ఒకటి తొంగి చూస్తుంది. కథను స్త్రీ కోణంలో నడపడం కూడా కొత్తగానే కనిపిస్తుంది.  ఇంటి ముంగిట్లో నిప్పుపూలను పెంచుకోం అవి అరణ్యాలకే పరిమితమై అక్కడే శోభను సమకూర్చుతాయి. అలాగే నగరాలకు దూరంగా ఉన్న పల్లెలు దేశానికే జీవగర్రగా నిలుస్తాయి. నిప్పుపూలు కథ స్త్రీల పట్ల, జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని కనబరుస్తాయి. ఈ ఒక్క కథ చాలు దాశరథి కథకుడిగా కలకాలం నిల్చిపోవడానికి. తిరుగుబాటుకు, విప్లవానికి, తెలంగాణ అస్తిత్వానికి సంకేతంగా కనిపించే దాశరథి ఈ కథ ద్వారా ఒక మానవీయ కథకుడిగా నిలబడుతాడు. ఈ కథ దాశరథిలోని లాలిత్యానికి, సున్నితత్వానికి, రజాకార్ల వ్యతిరేకతకు, తెలంగాణ ప్రజల విశాలత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ కథ తెలంగాణలోని 1948 నాటి సమాజ చిత్రాన్ని చెట్టు తల మీద ఎగిరే జెండాలా రెపరెపలాడిస్తుంది.

(ఈ కథని పరిచయం చేసిన నందిని సిద్దా రెడ్డి గారికి కృతజ్ఞతలు)

 

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాగుంది మిత్రమా… ఒక కొత్త కథనూ, కొత్త కోణాన్ని పరిచయం చేశావు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు