డా. పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీతకథ’ – వాళ్ళు పాడిన భూపాలరాగం

డా. పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీతకథ’ – వాళ్ళు పాడిన భూపాలరాగం

డా. పి. శ్రీదేవి పేరు చెప్పగానే ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. అయితే ఆమె కథలు కూడా రాసినట్లు  తెలిసినా ఆ కథల్ని తెలిసినవారు తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలు ఉన్నాయి. నవలలో పాత్రల లాగే మరపురాని పాత్రలతో ఉన్న కథగా చటుక్కున చెప్పదగినది – ‘వాళ్ళు పాడిన భూపాలరాగం’. ఇది 1959లో జయంతి (జులై) సంచికలో ప్రచురితం. 1966లో ‘ఏరినపూలు’ సంకలనంలో చేర్చబడింది. అనేక భిన్న మనస్తత్వాలు గల పాత్రలలో, అనేక సంఘటనలతో, ఆనాటి సమజానికి ప్రతిబింబంగా ఉండి, కథావిస్తృతి కలిగి ఉండటం చేత దీనిని నవలికగా కూడా చెప్పుకోవచ్చు. కాలాతీతవ్యక్తులు నవల రాసిన తర్వాత రాసిన కథ కావటాన కథాసంవిధానంలో, పాత్రల చిత్రణలో ఈ కథపై కూడా దాని ప్రభావం ఉంటుంది.

ఇందులోని కథంతా చెప్పకుండా పాత్రల్ని, పాత్రల స్వభావాల్నీ, మాత్రమే చెపుతాను. ఎందుకంటే ఇందులోని పాత్రలు కూడా సమాజంలో ఎప్పటికీ ఉండే పాత్రలే.  పాత్రని సృష్టించేటప్పుడు పాత్రల యొక్క మూలస్వభావాన్ని కూడా పాఠకులకు అవగాహన అయ్యేలా సంఘటనల్నీ, సంభాషణల్నీ కూర్చే శైలి శ్రీదేవికే స్వంతం. అందుకనే వీరి పాత్రలు ఎప్పటికీ సజీవంగా వుంటాయి.

  1. రామచంద్రయ్య: శుద్ధ మాష్టరీ ఉద్యోగం. లేమికి గానీ, అశుచికిగానీ బాధపడడు. అనారోగ్యం ఎరగడు. జీవితావసరాలు సమపాళ్ళలో వుండే కుదురైన సంసారం. రేడియోలూ, సినీమాలూ, గ్రామఫోన్ల వంటి అధునాతనమైన వాటిని నమ్మడు. ఇంట్లో ఏ కార్యం చేసినా పొదుపుగా, శాస్త్రోక్తంగా చేస్తాడు. ఒకరి మీద ఆధారపడకుండా బతకాలనే మధ్యతరగతి సగటు మనిషి మనస్తత్వం, జీవన విధానం కలవాడు. తిండి, బట్ట బతకటానికి చాలనే అతని ఉద్దేశ్యం. అందుకే తెలివైనవాడైనాసరే కొడుకు రామారావుని పై చదువులకు ప్రోత్సహించకుండా పట్నం పంపి ఏ ఆఫీసులో ఏయే ఖాళీలు ఉన్నాయో కనుక్కొని దరఖాస్తు చేయమని పరీక్షలు పూర్తి చేయగానే పంపించేస్తాడు. కూతురు మీనాక్షిని పదహారు ఏళ్ళు నిండగానే సుఖపడ్తుందని భావించి, ఆస్థిపరుడైన రెండో సంబంధం వాడికిచ్చి పెళ్ళి చేసి చేతులు దులుపుకుంటాడు.
  2. సూర్యం: రామారావుకి బాబాయి. మొదటి భార్య పోతే మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. మొదటి భార్య కూతుర్ని శ్రీనివాసులు అనే ఆస్థిపరుడికి ఇచ్చి పెళ్ళి చేసి అందరూ కలిసి ఉంటారు. సూర్యం రెండో భార్య ఏటా బాలింత, చూలింతగా ఉండటంతో, పండుగలూ, పబ్బాలుతో ఇల్లు ఒక ధర్మసత్రంలా ఉంటుంది. ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఏడుగురు పిల్లలతో శుచీ, శుభ్రతలే కాదు, పట్టించుకునేవారూ లేక భాషా, ప్రవర్తన, అలవాట్లు భరించలేనివిగా ఉంటాయి. మామగారి కుటుంబ పోషణకు తన ఆస్థి హరించుకుపోగానే అల్లుడు శ్రీనివాసులు వేరు కాపురం పెడతాడు. ఇంట్లో ఏ వస్తువూ సరీగా లేక వాళ్ళింటికి వచ్చిన కుర్రాడు రామారావునే కాదు, శ్రీనివాసులు తెచ్చిపెట్టుకున్న ఆమెని పరోక్షంలో శాపనార్థాలు పెడ్తూ కూడా తిరిగి ఆమె దగ్గర కూడా చేయి చాపటానికి సిగ్గుపడరు సూర్యం, అతని భార్య. ఇంకా పైపెచ్చు తమ లేమినీ, తమ అవసరాల్నీ తమ నిర్లజ్జనీ కప్పిపుచ్చుకుంటూ భార్య చాతకానిదని సూర్యం, భర్త మతిమరపుతనాన్ని అతని భార్యా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు.
  3. వెంకటేశ్వర్లు: రామారావుకు మరోబంధువు. డెబ్భయి రూపాయల జీతం వచ్చే ఉద్యోగం, ఇంటద్దెకు ఇరవైపోగా భార్యాభర్తలిద్దరూ, పక్కవాళ్ళింటిలో పిల్లలిద్దర్నీ వదిలేసి వారానికి మూడు సినీమాలైనా చూసే సినీమా పిచ్చి కలవాళ్ళు. డబ్బులు లేకపోతే తాము భోజనం మానేసి పిల్లలకి పకోడీ పొట్లాం కొనిచ్చి మంచినీళ్ళు తాగిస్తారు కానీ సినిమా మానరు. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదని కనెక్షన్ తీసేసినా బాధ వుండదు. కానీ పరోక్షంలో శ్రీనివాసుల్ని ఎత్తి పొడుపు మాటలంటూనే సినిమా కోసం మళ్ళీ అతని ముందే చెయ్యి చాచటానికి ఏమాత్రం సంకోచించడు. ఆఖరికి ఉద్యోగార్థియై వచ్చిన పిల్లవాడు రామారావుచేత సినిమాకి డబ్బు ఖర్చు చేయించటానికి కూడా సిగ్గుగానీ మొగమాటంగానీ లేదు.
  4. సుబ్బారావు: లక్షాధికారి కొడుకు కావడంతో చదువు అబ్బలేదు. కృత్రిమ రాజసంతో తగిన వధువు దొరకక ఆలస్యంగా పెళ్ళి చేసుకుంటాడు. ఉద్యోగం చేయటానికి నామోషీ. ఆస్థి అంతా కరిగిపోయి అప్పులు చేసేందుకు మాత్రం నామోషీ లేదు. తండ్రి పంపే డబ్బుతో కొత్త భార్యతో సినిమాలూ, షికార్లు, హోటళ్ళుతో జల్సా చేస్తుంటాడు. పూర్వ వైభవం చాటే రోజ్ వుడ్ కుర్చీలు, వెండి ఏనుగుల అగరొత్తి స్టాండు, పెద్ద పట్టిమంచాలుతో రెండు గదుల ఇల్లు పాత కొత్తల మేలు కలయికతో కృత్రిమ రాజసాన్నీ, హిపోక్రసీని ప్రదర్శిస్తూ ఖరీదైన జీవితం గడుపుతుంటాడు. కానీ ఎవరినెత్తినైనా చేయి పెట్టి భార్యతోపాటు సినిమాలకీ షికార్లకీ ఖర్చు చేయించటానికి వెనుదీయడు.
  5. శ్రీనివాసులు: ఈ కథకి నిజానికి హీరోగా చెప్పబడే వ్యక్తి. పదహారు ఏళ్ళకే సూర్యం మొదటి భార్య కూతురు సుశీలని పెళ్ళి చేసుకొని మామగారి బహుసంతానాన్ని పోషించే బాధ్యత నెత్తికెత్తుకొని ఆస్థి హరించిపోతుంటే, భార్య సలహాతో వేరు కాపురం పెట్టి ఒక్కటొక్కటే తిరిగి ఇంట్లో హంగులు అమర్చుకుంటాడు. అయిదుగురు పిల్లలున్నా పొందికగా సంసారాన్ని గడుపుతుంటాడు. పెద్దకూతురు బాగా చదువుతుందని డాక్టర్ని చేయాలనుకుంటాడు. ఇతను చేసిన గొప్ప సాహసం ఆస్తిపరురాలైన బాలవితంతువు వరలక్ష్మిని చేరదీయడం. బహుభార్యత్వం నిషేధం కనుక సహజీవనం సాగిస్తుంటాడు. బతికి చెడిన వాడే కాకుండా బతకడం ఎలాగో తెలిసినవాడు శ్రీనివాసులు. అందుకే నేనొక లాటరీ గెలిచాను. నా సమస్తం వరలక్ష్మి అధీనంలో పెట్టాను. తెల్లవారితే ఉప్పుకో, పప్పుకో నాలుగు కుటుంబాల వాళ్ళు నా యింటికి రాక తప్పటం లేదు. ఆ ‘ఎవర్తో’ అనే సంగతి తెలిసి కూడా ఆమె దగ్గర మాటిమాటికీ చెయ్యి చాపుతారు. మొన్నపుట్టిన పిల్లాడితో సహా మేమంతా ఆమె పెంపుడు చిలకలం’’ అని ప్రశాంతంగా చెప్పగలిగేవాడు శ్రీనివాసులు.

స్వభావంలోనూ, ప్రవర్తనలోను, తన భావాలను స్పష్టంగా చెప్పేతీరులోనూ కాలాతీత వ్యక్తులులోని ఇందిర ఛాయలు శ్రీనివాసులలో వ్యక్తమౌతుంటాయి.

చస్తూ బతికే కన్నా చెడి బతికే మార్గం చూసుకోవాలనే సిద్దాంతంతో తానూ, తన భార్యాపిల్లల్నే కాక తమతో సహజీవనం చేస్తున్న వరలక్ష్మికి ఏ బాధలు, నిరాశానిస్పృహలు లేకుండా నిశ్చింతగా బతకటం బతికించటం ఎలాగో ప్రయోగాత్మకంగా చూపిస్తూ బాగుపడినవాడు శ్రీనివాసులు.

తాను సమాజానికి ఆదర్శం అని చెప్పుకోలేదు. సమాజానికి పరాన్న జీవుల్లా బతికే వారికన్నా మరొకరికి నష్టం కలిగించని జీవితం ఇతనిది. శ్రీనివాసులు వరలక్ష్మిని చేరదీయటం వలన భార్య సుశీల ఏమాత్రం అభ్యంతరపెట్టలేదు. ఇద్దరూ కలిసి మెలిసే బతుకుతుంటారు. ఎందుకంటే ఇద్దరికి ఒకరి అవసరం ఒకరికి ఉంది. ఈ విషయాన్ని రచయిత్రి చాలా పాజిటివ్ దృక్పథంతో పాఠకులని ఒప్పించే రీతిలో కథనం సాగించటం విశేషం.

  1. రామారావు: కథలో ఆసాంతమూ విస్తరించిన పాత్ర. కథాగమనంలో ప్రేక్షకుడిలా ఒక్కొక్క తరహా పాత్రల్నీ వారి కుటుంబ జీవన విధానాల్నీ చూస్తూ, వాళ్ళతో నడుస్తూ, పరిశీలిస్తూ, అనేకానేక జీవన సత్యాలు అనుభవం ద్వారా తెలుసుకుంటాడు.

ఉద్యోగార్థియై తిరుగుతున్నప్పుడు దారిలో శ్రీనివాసనులు ఎదురై ఇంటికి తీసుకెళ్ళి తన కూతురు తెలివైందనీ, డాక్టరీ చదివిస్తానని చెప్పినప్పుడు రామారావు మొదటిసారి చిన్నబోతాడు. ఫస్టు మార్కులు తెచ్చుకొని కూడా పై చదువులు చదవలేకపోతున్నందుకు తన తోటి వాళ్ళైన వెంకటస్వామి చిన్న కొడుకు, మిల్లు మేనేజర్ పెద్ద కొడుకూ హాయిగా గోళీలాడుకుంటుంటే తానిట్లా ఉద్యోగం కోసం తిరిగే పరిస్థితికి భయపడ్తాడు, బాధ కూడా పడ్తాడు.

ఇక ఆ తర్వాత కథాప్రయాణంలో రామారావుని ఏ సంఘటనలు ఎలాటి అనుభూతులకు లోనుచేసాయో చెప్పే విధానంలో రచయిత్రి ముద్ర గమనించవచ్చును. కౌమారదశలోని అభం శుభం తెలియని రామారావు ఆయా కుటుంబాలతో గడిపి ఎలాంటి సంఘర్షణలకు లోనయ్యాడో, ఏ విధంగా మానసిక పరిణితి సాధించాడో పి. శ్రీదేవి తనదైన శైలిలో కొంత వ్యంగ్యంగా, కొంత హాస్యంగా, కొంత నిరసనగా కథ నడుపుతుంది. ఇక్కడ అనేకచోట కాలాతీతవ్యక్తులులోని ప్రకాశం, ఇందిర, కళ్యాణి, కృష్ణమూర్తుల జీవితాల్ని పరిచయం చేసిన ధోరణులు, ఛాయలూ ఈ కథలో కూడా తొంగిచూస్తాయి.

సూర్యం బాబాయి కూతురు టైఫాయిడ్ తో అస్థి పంజరంలా ఉండటం, యమకూపంలాంటి ఇల్లు, యమకింకరుల్లాంటి సంతానం, చస్తూ బతుకుతోన్న ఆ కుటుంబాన్ని చూస్తే రామారావుకి భయం కలుగుతుంది. స్కూలు ఫైనల్ పాసై కౌమారదశలోని అభం శుభం తెలియని రామారావుకు సూర్యం కుటుంబం వరలక్ష్మిని వెటకారం చేస్తూనే అవసరం కోసం నిర్లజ్జగా ఆమె ముందు చెయ్యి చాపటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇంటి అవసరాలకన్నా సినీమాలు చూడటమే ముఖ్యమనుకునే వెంకటేశ్వర్లుకి వచ్చే 70 రూపాయల జీతం నెలంతా ఎలా సరిపోతుందో స్కూలు ఫైనల్ మెదడు లెక్కకట్టలేకపోతుందని చమత్కారంగా అంటుంది రచయిత్రి.

కృత్రిమ రాజసంతో హిపోక్రసీతో బతికే నిరుద్యోగి సుబ్బారావుకి సినీమాలకీ, షికార్లకీ డబ్బు ఎక్కడ నుండి వస్తుందో, తర్వాత ఎలాగ గడుస్తుందో అనే ప్రశ్న రామారావుని వేధిస్తుందని రచయిత్రి చెప్తుంది.

వరలక్ష్మి, సుశీల ఒకరికొకరు ఆదరంతోనూ, ఆప్యాయతలతో ప్రశాంతంగా గడపటం చూసి రామారావు ఆశ్చర్యపోతాడు. శ్రీనివాసులు తన కథ అంతటినీ తనతో విడమరిచి చెప్పేసరికి తనకు పెద్దరికాన్ని ఇచ్చినట్లుగా, ఆత్మీయునిగా సంబోధించినట్లు ఉక్కిరి బిక్కిరి అవుతాడు అంటూ కథనం చేయటంలో రామారావు తానింకా స్కూలు పిల్లాడిగానే భావిస్తూన్న వయసులోని మనస్తత్వాన్ని చూపుతుంది డా. పి. శ్రీదేవి.

పుస్తక జ్ఞానం తప్ప మరొకటి తెలియని రామారావుకి ప్రపంచం అంతా తేటతెల్లమైనట్లు తోచింది, మంచి వాతావరణంలో పెడితే వీడీవిడని మొగ్గ సహజసిద్ధంగా విచ్చుకున్ననట్లు. మానసిక పరిణితి వచ్చింది అనేది చెప్పటానికి కాయాపండూ కాని మెదడు మెల్లమెల్లగా పలకబారినట్లు అయ్యింది అంటూ ఉపమానించటం రచయిత్రి శైలిలోని కొత్తదనం. రచయిత్రి తాను దృశ్యమానం చేసిన సంఘటనల వలన, దృశ్యాల వలన ఒక్కొక్కపాత్ర మనస్తత్వం జీవన విధానం విడమరచటం వలన రామారావుకి మానసిక పరవర్తన ఎలా కలిగిందో తెలియజేసింది తప్ప నీతిబోధ చేయలేదు. ఏది మంచి ఏది చెడు అని డా. పి. శ్రీదేవి ఎప్పుడూ చెప్పదు. కథని బట్టి పాఠకుడు అర్థం చేసుకోవాలి.

‘‘ఇప్పుడు నీ తండ్రి చెప్పినట్లే రేపు పెళ్ళి చేసుకోమంటే చేసుకుంటావు. తర్వాత నీ చదువుకి నీకు వచ్చే జీతంతో సూర్యం కుటుంబంలా చస్తూ బతుకుతావో, వెంకటేశ్వర్లూ, సుబ్బారావుల్లా అయిదూ పదికీ మీ నాన్న మీద ఆధారపడతావో నిర్ణయం చేసుకో. వాళ్ళందరిలా పవిత్రంగా చచ్చిపోకు. శ్రీనివాసులా చెడిపోయి బతికేమార్గం చూసుకో’’ అని శ్రీనివాసులు చేసిన దిశానిర్దేశం రామారావుకి మార్గం నిర్ణయించుకోటానికి బీజం వేసింది అంటుంది రచయిత్రి. అంటే ఏది చేయకూడదో తెలుసుకోటానికే కాని చెడిపోమని రచయిత్రి ఉద్దేశం కాదు. అందుకే తిరిగి వెళ్ళిన రామారావు తండ్రికి తన నిర్ణయం తెలియజేసి, తల్లి వత్తాసుతో చదువులో చేరుతాడు.

కానీ రామారావు మనసు చల్లబడలేదు. ఎవరినో ఉద్ధరించాలనో, ఘనకార్యం చేయాలనో చదవబోవటం లేదు. బురదగుంటలో కప్పలా ఒకరినొకరు కబళిస్తూ బతికేకన్నా కొన్నాళ్ళు ఆకాశంలో పక్షిలా స్వేచ్ఛగా బతకటానికి వ్యవధి కోసమే నా చదువు’’ అని అనుకుంటాడని కథ ముగిస్తారు. రామారావు పూర్తిగా పరిణితి చెందటానికి కావలసిన వ్యవధిని తెలియజేస్తున్న ముగింపుగా ఉంటుంది.

భారత స్వాతంత్ర్యానంతరం తొలి పదేళ్ళలో సమాజంలోని ఆర్థికసంక్షోభం. మధ్య తరగతి కుటుంబాలలో మానవ సంబంధాలపై ప్రభావం చూపించి ఆర్థిక సంబంధాలుగా మాత్రమే మార్చేసిన సామాజిక పరిస్థితులు కథలో ప్రతీదృశ్యంలోనూ ప్రతిబింబిస్తుంటాయి.

కథకి కేంద్ర బిందువు అయిన వరలక్ష్మి గురించి చెప్పినపుడు రచయిత్రి తన సహజమైన కథన పద్ధతి వ్యక్తమౌతుంది. వరలక్ష్మి 11వ ఏటనో, 12వ ఏటనో పెళ్ళి జరిగింది. ఏడాదికి భర్త చనిపోవటంతో భర్త విలువా, డబ్బు విలువా తెలియకుండా పెరిగింది. ఆమె తండ్రి వియ్యాల వారి ముక్కుపిండి పాతికవేల రూపాయిన ఆస్థిలాగితే అది వడ్డీలకు వడ్డీలై పెరిగింది. తెలివైన వరలక్ష్మి స్కూల్లో చేరి స్కూలు ఫైనల్ వరకూ చదివింది. ఇంకా చదివిస్తే ఎక్కడికైనా ఎగిరిపోతే ఆస్థి దూరమౌతుందని మానిపించుతారు. కానీ వయసు పెరుగుతున్నా వరలక్ష్మికి కోరికలూ పెరిగాయి. ఆమె అన్న శేషగిరి ద్వారా పరిచయం అయిన శ్రీనివాసులు తన ఆస్థినీ, తననీ కాపాడతాడని నమ్మి అతని నీడన చేరి, బహుభార్యా నిషేధం వలన సహజీవనం సాగిస్తుంది. ఆమె వలన శ్రీనివాసులు కుటుంబానికి  ఆర్థికావసరాలూ, అతని వలన వరలక్ష్మి అవసరాలూ తీరాలని, అతని కుటుంబాన్ని ఆదరంగా చేరదీసింది వరలక్ష్మి. శ్రీనివాసులు భార్య సుశీల కూడా తెలివిగా తన కుటుంబంతో సహా వరలక్ష్మి అధీనంలోకి చేరింది అంటుంది రచయిత్రి. అద్భుతమైన పదునైన వాక్యం నిర్మాణం శ్రీదేవి స్వంతం. చిన్న చిన్న వాక్యాలలోనే ఎంతో అర్థాన్ని నిబిడీకృతం చేసిన వాక్యాలు శ్రీదేవి రచనలకు మంచి గాఢతని ఇస్తాయి.

ఈ కథలోని ప్రతీ పాత్ర కూడా విచిత్రమైన విభిన్న వ్యక్తిత్వం కలవే. ఒక పాత్రని మరొక పాత్రతో పోల్చటానికి లేదు. ఇది కూడా డా. పి. శ్రీదేవి రచనలలోని పాత్రల ప్రత్యేకతగానే చెప్పాలి. ఇందులో పట్టణ జీవితానికీ, నగర జీవితానికి గల వ్యత్యాసం కనిపిస్తుంది. సమాజంలోని సాధారణ మధ్యతరగతి జీవులు నగర జీవితాలలో ప్రలోభపెట్టే అలవాట్లకి ఆకర్షితులు కావటం తమ తాహతును గుర్తించకుండా అనేకానేక ప్రలోభాలకు బలై అప్పులపాలై జీవితాలను అస్తవ్యస్తం చేసుకోవటం వలన అంతకంతకూ లేమిలో కూరుకుపోయి చస్తూ బతికే బతుకులను అద్దంలా ప్రస్ఫుటంగా చూపిస్తుంది. ఆ ప్రలోభాలకు చిక్కకుండా ఉండటానికి కావలసిన తెలివి తేటలు లేకపోతే శ్లేష్మంలో ఈగల్లా, బురద గుంటలో పందుల్లాగా బతకాల్సిందే. ఈ నిజాల్ని తెలియపరచటానికి ఒక్కొక్క కుటుంబాన్ని పరిచయం చేస్తుంది రచయిత్రి.

శ్రీనివాసులు తమ జీవితాల్ని విప్పి చెప్పి ‘‘ఇలా బతకటానికి స్కూలు ఫైనల్ ఫస్టు రానవసరం లేదు. ఆ అవకాశాన్ని విదేశీ చదువులు చదివి, ఉన్నత విద్యలు చదివేవారికి వదిలేస్తే బావుండేది’’ అనటంలో ఎలా బతకాలో తెలియచేయటానికి, జీవితాన్ని సఫలీకృతంగా మలచుకోవటానికి ఉపయోగించని చదువులు అనవసరమని, చదివిన చదువు వల్ల మానసిక వికాసం కలగాల్సిన అవసరాన్ని వ్యక్తపరిచారు రచయిత్రి. ఇది ఈనాటికీ కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సత్యం.

అరవై ఏళ్ళ క్రిందట ఆడపిల్లల మనస్థితి, ముఖ్యంగా బాలవితంతువుల దుస్థితి, ఆర్థికావసరాలు ఏ విదంగా మధ్య తరగతి కుటుంబాలలోని మానవ సంబంధాన్ని ఛిద్రం చేస్తాయో దృశ్యమానం చేశారు రచయిత్రి. విభిన్న దృక్పథాలు కలిగిన వ్యక్తులతో గడిపిన అనుభవాలు రామారావుని స్వంతగా నిర్ణయం తీసుకోగలిగేలా చైతన్యం కలిగించటం వలన ఈ కథ శీర్షిక ‘‘వాళ్ళు పాడిన భూపాల రాగం’’ అర్థవంతంగా ఉంది. భూపాలరాగాన్ని తెల్లవారుజామున మేల్కొల్పుగా పాడే పాటలకు వాడుతారు.

పుస్తక జ్ఞానం కన్నా మానసిక వికాసం కోసం జీవితాల్ని చదవాల్సిన అవసరాన్ని ఈ కథ ఆసాంతం వ్యక్తం చేస్తుంది. కథ పరిమాణం కూడా విస్తృతంగా ఉండటం వలన నవలికగా అనిపిస్తుంది. కథానిర్మాణశైలిలోనూ, సంభాషణల్లోనూ, పాత్రల రూపచిత్రణలోనూ, రచయిత్రి వ్యాఖ్యానంలోనూ కాలాతీతవ్యక్తులు నవలకు ఏమాత్రం తీసిపోనిది కావటాన డా. పి. శ్రీదేవి రాసిన ‘కాలాతీత కథ’గా ఈ కథని గుర్తించవచ్చును.

*

Avatar

శీలా సుభద్రాదేవి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆసక్తిగా వుంది. వెంటనే కథ చదవాలనిపించేలా వుంది. రామారావు పాత్రలా సమాజాన్ని అర్దం చేసుకోవాల్సిన అవసరం,మర్మంగా చెప్పగల్గిన శ్రీనివాసులు ఏ కాలానికి ఆ కాలంలో అవసరమేమో కూడా…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు