జూదం

నాటా-సారంగ కథల పోటీలో విజేత.

డి  కాడ మెంతి పోసుంటి. ఆ యాకు పెరక్కొచ్చిన. పులగూర దుద్దదామని ఆయాకంతా ఇడిపిస్తి. సట్టిలో ఆకేసి దాంట్లోకి ఒట్టి మిరపకాయ, తెలబాయలు, ఎర్రగడ్డ, కందిబేడలు, నాలుగు టమోటాకాయలు రవంత సింతపండు, కాసింత ధనియాలపొడి ఏసినా. రవ్వంత పసుప్పొడి ఎయ్యాలని డబ్బాలో చూస్తే అయిపొయింది. ఇరిగింటికో పొరుగింటికో పొయ్యి ఇప్పిచ్చుకొత్తామని బయలు దేరిన. నేను ఎక్కువ సావాసంగాఉండే నాకు చెల్లెలివరసైన వసంత  ఇంటి ముందర నిలబడితి. ఆయమ్మి ఇంట్లో మూలకూసోని మొగం నల్లగా బెట్టుకొని యాన్నోనాబిలో నుండి “రాకా అనే!” ఎబుడు వాళ్ళింటికాడకు పోయినా నోరారా మాట్లాడేది. నేను ఆ యమ్మ మాట గమనించి “ఏమే పాపా అట్లుండావు” అంటి.

“ఏమీలేదక తలకాయి నొస్తాఉంది,” అనే.

“అయితే మాతరన్నమింగమ్మా,” అంటా అట్లే కుసుంటి.

ఆయమ్మి ఉండుకొని “ఏంటి మాతర లేకా బతికేదానికన్నా సచ్చిపోయేది మానం,”అనే.

“అదేలపాప అట్లాంటావు ఇద్దరు బిడ్లుండారు వాళ్లకు ఎవురౌతారు, ఏంటికి అట్లుండావు ఏమైన్ది  పాపా,” అని అడిగితి.

దాని మొగుడుకూడా చెడ్డోడు కాదు, ఆడేది లేదు, తాగేది లేదు. ఏకిరికాదు, పోకిరి కాదు అని మనసులో అనుకొన్నా.

“ఏంది పోకా ఈ ముండటమోటా చెట్లు నాటితే ఎబుడూ అగసాట్లే.”

“ఔ మీరు నాటినారు కదా,” అంటి.

“ఓ నాటినాము, ఆ టమోటా చెట్లకు చీడ పట్టిందని వాటికి మొందు కొట్టదానికి డబ్బులు లేవని నామొగుడు కమ్మలు అడిగినాడు. అంతకు ముందు దున్నడానికి, నారు కొనేదానికి, ఆ మొలక నాటినా పొద్దే మొలకలు సాయకుండా మందు పోసేదానికి ఐదువేలు అయ్యింది. వాటిల్లో గెడ్డి తొగిందానికి, సుమారు మూడు తవ్వకాలు ఏసిందానికి ఏడువేలు అయ్యింది. దీని పెట్టుబడంతా నాసొత్తులే. ఉన్నివి బన్నివి అన్నీఇచ్చేస్తి. ఇబుడు మల్ల మందు కొట్టల్లని మాయమ్మ సచ్చిపోతా ఇచ్చిన కమ్మలు గుర్తుగా ఎత్తి పెట్టుకొనుంటే అవికూడా ఇమ్మంటాడు. అవి ఈలేదని పట్టుకొని కొట్టి నానా మాట్లడిగె. నేనేమన్నా ఆడేదానికి, తాగేదానికి అడగతున్నానా, లేదంటే ఎత్తుకొనిపొయ్యి లంజలకిస్తానా అంటాడు. నేను ఆ టమోటాకాయల సేద్యం చేయద్దు అంటే విండు. ఇబుడికి మూడేండ్ల నుండి ఒక్క రూపాయి చేతికి రాలే, మూడేండ్లకు ముందు ‘గుడ్డోడు గువ్వను ఏసినట్టు’ నాలుగు ఐదులచ్చలు వచ్చింది. అబుడు నుండి నామొగునికి టమోటాల పిచ్చి పట్టుకునింది. ఆ పంటేస్తానే వుండాము, సారిసారికి పెట్టుబళ్లుకూడా రాలేదు. ఆరు సార్లు పంటపెట్నాం, ఇప్పటికి ఒక్క రూపాయికూడా కండ్లచూడ్లే. ఈ సేద్యం చేసేదానికన్నా కూలీనాలీ చేసుకునేది మేలు.

మూణ్ణెల్లయ్య. ఒక పంట ఏమికాపు కాసింది, ఒక్కొక్క కాయ పట్టడు పట్టడు. చెట్లోనే మాగి పొయ్యి మడంతా ఎర్రంగా పండిపొయ్యినాయి. అవి ఒక కోత కోసిందిలేదు. ఎట్లామాగిన కాయ అట్లే వదిలేసిందాయ. మడిమిందనే ముప్పైకేజీల గంప యాభయ్ అరవై రూపాయలకు ఎట్లమ్మేది?

అవి పీకిన దానికి కూలీలు లగేజీలు అంతా మాచేతికే పడేది. అందుకే కస్టపడి పెట్టుబళ్ళు పెట్టిన పంటను మడిమిందనే వదిలేస్తే ఆవులు, గొర్రెలు, మేకలు తినేసి కుళ్లిపాయ. ఆ బాధతో నెలదినాలు కడుపుకు కూడు లేదు. కంటికి నిద్దరలేదు. దానిబదులు మడినాటినా కనీసం గొడ్లకుమేత, మాకుతిండి గింజలన్నా వచ్చిండవా, “కూటికి ఉంటే కోటి కి ఉన్నట్టు.” ఆమాట అంటే విండు.

ఈసారి వస్తాదేమో, ఒగాల రేటువస్తే ముప్పైకేజీలు రెండువేలు కూడా అమ్మిన దినాలున్నాయ్. అట్లొస్తే మన దగ్గర కాయలు లేకపోతే ఎట్ల, ఏమిపంట చేస్తే అంతడబ్బులు సంపాదించేది, ఒక ఎకరాలోనే మూడు నాలుగు లచ్చలు పదైదు ఇరవై దినాల్లో వస్తుంది అంటాడు.

అట్లా అని అని మమ్మల్ని ఈగతికి దిగజార్చినాడు, ఈయప్ప కన్నాఆడే, తాగేవాడు మేలు. వాడుతాగి వానిఒళ్ళు చెడ్సుకుంటాడు, దుడ్డోదుగ్గానో పోతుంది. ఇక్కడ మాకష్టం, భూమికష్టం అన్నీపోతా ఉంది. దానికి తోడు అప్పులు. మొన్నటికి మొన్నమాఈముకురాలు నన్ను చూసి పక్కింటియమ్మతో అంటా ఉందట, “ఒగ సారి టమోటకాయలో లచ్చిలొచినప్పుడు వాళ్ళబావట చూస్తివా, చీరలేనా సొమ్ములేనా! కాలం ఎపుడూ ఒగటిగా ఉంటుందా, దేవుడేమన్నా గుడ్డోడా,” అంటుందట.

“ఏమక్క, మేమేమన్నాదొంగతనం చేసినామా, మోసంచేసినామా, భూమమ్మను నమ్ముకున్నాం, ఈ పొద్దు ఏమీలేదు మా దగ్గర అని నగతా ఉండారు. ఇట్లాటపుడు ఈ కమ్మలు కూడా లేకపోతే ఎట్లక్కా,” అనే.

“సరేలే, అయ్యింది ఎట్లా అయ్యిపోయింది అదే ఆలోసన సేస్తాఉంటే ఎట్లా, మొకంకడుక్కొని అన్నం తిను,” అని ఆయమ్మికి చెప్పి “రవ్వంత పసుప్పొడి పెట్టు నేనువచ్చి చానాసేపు అయ్యే, మీ మామచూస్తే తిడతడు” అని పసుప్పొడి పెట్టించుకుని ఇంటికి వస్తి!

 

నేను మెంతాకు పులగూర దుద్ది, దాంట్లోకి అన్నం చేసుంటే అది నా మొగుడు తింటా “పులగూరలోకి సంగటి గెలికింటే ఏమి” అనె. దానికి నేను “రాగిపిండి అయిపొయ్యి వారమయ్యె తెచ్చింటే ఏమి,” అంటి. దానికి ఏమీ మాట్లాడలే, గమ్మున తినేసి ఎలిపాయ. నేనుతిని ఈదిలోకి పోతి. మాదిబ్బ దావన మాచిన్నమ్మ గింజముదిరిన పచ్చిరాగెన్నులు సందుడు పెరుక్కుని వస్తాఉంది. వాటిని చూసి ఇచిత్రం అయి సంతోషంతో నగతా, “యాడవి చిన్నమ్మా రాగెన్నులు, అవీ పచ్చివి… ఎన్నాళ్లయ్యిందో చూసి,” అని ఆయమ్మ పోతా ఉంటె దావ అడ్డగించుకొని చేతిలోఉన్న రాగెన్నులను ఒకటి పెరుక్కొంటి.

ఆ యమ్మనిలబడి  “పాపా కొండకింద కయ్యలో చూస్తి.  పానం ఉండబట్టక కయ్యగల్లోలను కూడా అడగలా. సందుడు పెరకస్తి. ఇవి పులిమి రోటికేసి దంచి పచ్చిమిరప కాయి, ఎర్రగడ్డ, ఉప్పు ఏసి రొట్టి కాల్చుకు తిందామనిపించింది,” అనే!

“అయితే కుసో! ఈన్నేపులమదాము,” అని ఇద్దరమూ మాఇంటిదగ్గర కూసింటిమి. ఆ కంకులు పులమతా నేను ఊరికే ఉండకుండా ఆయమ్మ మంచిసెడు ఆలోశన చేసే మన్సని, ఏమిచెప్పినా తల్లిమాదిరి కడుపులో పెట్టుకుంటుందని వసంత  వాళ్ళమొగుడు టమోటా సేద్యంకోసం కమ్మలు అడిగితే వసంత ఈలేదని, ఇద్దరూ కొట్లాడుకున్నారు అనిజరిగిందంతా ఆ యమ్మతో చెప్తి.

ఆ యమ్మ ఉండుకొని “కాదు పాపా నాకు పెండ్లి అయి నలభై ఏండ్లు అయింది. కొత్తగా నేను ఈఊరికి వచ్చినబడు ఊర్లోన, పొలంమింద కుక్కలకు కూడెల్లేది. ఏమి పంట్లు… యాడ చూసినా ఈడవలు ఈడవలు చెరుగుతోట్లు. ఆ తోటల్లో ఒంటిసంటిగా మల్లాడాలంటే భయపడేది. ఆడోల్లు నిదరలేసి ఆవల కింద ప్యాడ ఎత్తేసి మబ్బుతోనే నలుగురైదు మంది చెరుగుతోటల్లోకి గెడ్డికి పొయ్యి, మోపు గెడ్డి గోసిపెట్టేసి చెరుకుల మీద పడేది. ఒగొగ్గ  చెరుకు మునిచేతిలావు, ఒగొగ్గ పిచ్చిమూర, ఒగ్గో గెడి మన్సికి పైన. ఆ తోటల్లో కోరిన చెరుకులు పెరుక్కొని తినేది. తేపు వచ్చిందాకా తినేది. పర కడుపున చెరుకు తింటేకడుపులోచల్లగుండేది. మోపులు ఎత్తుకొని దావ నడస్తా ఉంటే కడుపులో చెరుకుపాలు తొనికేది. మల్లి పొగులు అట్ల పొలంమింద పోతే చెనిగి చెట్లు. అవి ఊడగలు దిగినబుడు నుండి పెరికి తినేది. కాయి ముదిరితే మూన్నెల్లు ఉడక పెట్టుకు తినేది అవే, కాల్చుకునితినేది, కూరకు వాడేది అవే!

మాకు ఉండే భూమి ఎంత ఇరవై కుంట్లు. దాన్లో ఎన్నిపండించేది…చేరుకుతోట, చెనిక్కాయలు, మడి, కూరగాయలు సగలము పండించేది. ఒగచెనిక్కాయ పంటేస్తేనే దాంట్లో సద్దలు, జొన్నలు, అలసందులు, అనపకాయలు, నూగులు ఇవన్నీ సాలిగింజలు మాదిరి ఏసేది. చెనిక్కాయ పంట ఒడిపి ఇంటికొస్తే దాంతో పాటు ఆరు రకాల పంటగింజలు ఇంటికొస్తా ఉండే! మిరపతోటలో కాల్వగట్లకి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, వంకాయలు, బెండకాయలు, బీర, కాకర నాటేవాళ్ళం.

మేము తిని మనల్ని ఆసించినోళ్లకు పెట్టేది. అవసరానికి అమ్ముకొనేది. అపుడు సేద్యానికి పెట్టుబడి ఇత్తనాలు, దిబ్బెరువు, మన చేతల కష్టం. పంటకు రోగం ఉంటే ఆవు పంచితము, పొయ్యిలో బూడిది, లేదంటే గమిషన్ పొడి  వాడేవాళ్లు. అబుడు పండే పంటలన్నీ మూడు నాలుగేండ్లు నిలువఉండేటివి.  అవసరం అయితే అమ్మే వాళ్ళం లేదంటే నిలువబెట్టె వాళ్ళం.

ఒగబడు  ఈ టమోటా కాయల్ని అవగూదకాయలు అనేది. మా చిన్నపుడు దిబ్బల్లో ఎక్కువ పడి  చెట్ల మాదిరి మొలిచేవి. పిల్లోళ్ళు ఆ కాయలతో ఆట్లాడుకొనేది. పెద్దోళ్ళు మమ్మల్ని అవితింటె ఎర్రి పడుతుంది అని బెదిరించే వాళ్ళు. అట్లాటి అవగూదకాయలు ఈ పొద్దు మన బతుకై పోయినాయి.

వొగర్ని చూసుకొని వొగరు గొర్రు దాటై ఇస్పెటాకుల్లో ముక్క ఎగిరినట్టు అయింది. ఎబుడు గాలి దోలుతుందా అని సేద్యం చేస్తే ఎట్లా? ఈ పొద్దు అమ్మలేదని పంట ఒడిపి పెట్టుకొనేదానికి లేదు. ఒగ రోజుకే కంపు కొడతాయి. మేము ఎమన్నా మాట్లాడితే మీ కాలం కాదు, కాలం మారింది అంటారు. కాలం మారితే నూరేండ్లు బతికే మన్సిని నూటాయాభై ఏండ్లు బతికిస్తున్నారా? కాలం మారితే రెట్టింపు లాభం రావల్లా?

“‘ఎనిగ నెత్తిన ఏనిగే మన్ను ఏసుకున్నంట’ అట్లా ఇంగ ఎట్లా కాలం చూడాల్సి వస్తుందో! సరే నాకు పని ఉంది పాపా,” అని మా చిన్నమ్మ లేసి పోయే!
ఆ పచ్చి రాగులు నోటినిండా పోసుకొని నమలతా ఉంటె కమ్మగా ఉన్నయి .

ఆ రోజు మధ్యాహ్నం కాడ ఊర్లో జనం ఆడ మొగ అంతా ఇరవై మంద దాకా మా చిన్నమ్మ ఇంటికాడ ఉడ్డ చేరుకొని ఉండారు. నేను “అయ్యో ఏమయ్యిందో ఏమో నిన్న బాగున్నెఆయమ్,” అని వాళ్ళ ఇంటి కాడికి పరుగెత్తితి. చూస్తే మా చిన్నమ్మ యాడస్తా ఉంది, “ఏలమ్మ అట్లేడుస్తాఉండావు,” అంటే ఆ యమ్మ కొంచేపు ఏమీ మాట్లాడలే. ఆడున్నోళ్లు “టమోటా రేటు పడిపోయిందని మీ చిన్నాయన  కొడవలి ఎత్తుకొని పోయి టమోటా చెట్లు అన్నీ మొదల్లు నరికేసినాడంట. చేతికొచ్చిన పంట నోటికి రాలేదని,” మీ చిన్నమ్మ యాడస్తా ఉంది అన్రి. మా చిన్నాయన ఇంటిముందర అరుగు మింద కూసోని ఉండాడు.  నేను “ఏల చిన్నాయనా కస్టపడి చేసిన పంట మొదల్లు నరికేసింది, అట్లే వదిలేసేది” అంటి.

“ఏంది పో పాపా! చిన్న కష్టం పన్నానా? ఎర్రటి ఎండ్లో నీళ్లు లేక ఏట్లో గుంత తీసి రేయనక పగలనక నీళ్లుకట్టి ఎర్రటి ఎండలో నెత్తరుచ్చలు పోసుకొని పంట పెడితి. తిరుమానం అమ్మకుండానే పోతే ఎట్లా చేసేది… అందుకే నరికి పారదెగ్గితి,” అనే!

ఆ మర్సునాడు నిదరలేసి ఇంట్లో పనులు చేసుకుంటా ఉండా. అబిటికి టైముఎనిమిదిగంటలు అయ్యింది. ఆయాలకే ఊర్లోని ఆడోల్లు ఇంటికి ఒగరు సంగటిమూట్లు కట్టుకుని, భుజాన తువాలి, సొక్కాయి తగిలించుకొని పోతావుండారు. నేను యాలికి ఇయ్యాల కబుడే పోతావుండారు అని అడిగితి. మాఒదిన ఉండుకొని, “ఆడయాన్నో భూమలగడ్నట, ఎవరోడాక్టర్లు ఈ టమోటా సేద్యం చేస్తున్నారంట. అన్నం పెట్టరంట. కూలీ రెండువందలా యాభై ఇస్తారంట. సేర్ ఆటోలు కూడా పంపినారు పిల్సుకోని పోయేది ఆటోల్లోనే, మల్ల మావిటేల పిల్సుకొచ్చేది ఆటోల్లోనే అనే!”

అందరూ ఆటోలు ఎక్కతా ఉండారు నేను వాళ్ళదగ్గరకు పోయి నిలబడితి. ఆడికి మా పెదనాయిన వచ్చే! ఆ యప్ప ఉండుకొని “ఈ పకారం టవున్లో ఉండే నాకొడుకులు, గవరమెంటు ఉద్యోగస్తులు నెలకి లచ్చిలు జీతాలు తీసేవాల్లంతా  డబ్బులు బ్యాంక్లో ఏస్తే ట్యాక్సులు కట్టల్లనో, లేదంటే వడ్డీలకు ఇస్తే తిరిగి రాదనో, సేద్యాలపైనా పెట్టుబడి పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో మన పక్క ఐదు ఎకరాల భూమి ఉండే రైతులు కూడాఈ వ్యవసాయం చేసి, బోర్లు వేసి అంతా పోగొట్టుకున్నారు. పెట్టుబడులు పెట్టలేక, భూమిని బీడు పెట్టలేక, ఈ ఉద్యోగస్తుల చేతికి చిక్కారు.

“పెద్దోళ్ళు అనేది ఎలుంగొడ్డు కి ఆతులు చపాతులు ఒగటేనంట” అన్నట్లు దుడ్లుండే వాడికి ఏమి కొదవ? భూమి గళ్ళ రైతునే జీతానికి పెట్టుకుంటుండారు. పెట్టుబడి పెట్టి రెట్టింపు కూలీలు ఇచ్చిసేద్యం చేస్తాఉండారు. వానికి పోయేది ఏంది? పంటలో నష్టంవస్తే ఒగ నెల జీతం పాయె. లాభం వస్తే పది ఇరవై లచ్చలు సంపాదించే! వీళ్ళు వచ్చిసేద్యం చేయబట్టి పంట్లకు రేట్లులేకుండా పోతున్నాయి. ‘గద్దలు తన్నికొచ్చిన కోన్నిరాబందులు తన్నుకు పోయినట్టుంది’ ఈ సేద్యాన్నినమ్ముకొని ఎట్లా కడెళ్ళేదో ఏమో” అంటా ఆయప్పఆవుల నిప్పుకొనిపోయే! నేను మడికాడికి పోతి!

ఆ రెయ్యి ఒగదాన్నే పనుకొని ఉండా! నిద్దర రాలా! చూడు బాగా నగతాఉన్న నాచెల్లి యాడస్తావుందే, దాని మొగుడు సొత్తులు అడిగింది సేద్యం కోసం. వాణ్నిఏమనే దానికీ లేదే!

మా చిన్నాయన ఏగిలేసి పొద్దు గుంకే వరకూ సేద్యం కాడనే కొన మునగతా ఉంటాడు. కస్టపడి అప్పుచేసి పెట్టినపంట నరికేసినాడే, ఆ యప్పకంటే కష్టం ఎవరు చేస్తారు? కష్టానికి ఫలితమే లేకుండా పోయిందే, ఇంతకీ కష్టానికి ఫలితం ఉన్నట్టా లేనట్టా?

ఈ టమోటా పంట పేరుతో జరిగే జూదాన్నిఎట్ల కట్టడి చేయాల? మా పక్క ప్రతి పంటా జూదమే కానీ ఈ టమోటా పంట జూదానికి అందరూ బానిసలై నారు. అందరి తలకాయల్లోన ఈటమోట పంటతప్ప వేరే పంట గుర్తు లేదు. ఏరే పంటలు ఏమున్నయి అనేది కూడా మర్సిపోయినారు. ఈ పంటే కారు, ఇరుకారు ఏసేది, దిక్కులేని రోగాలు పంటలకు వచ్చినబుడు ఖరీదైన పురుగుమందులు వాడేది. దాంతోభూమితల్లితో పాటు మేముకూడా గొంతులు కాడికి మునిగి ప్రాణాలకు కొట్టుకుంటున్నామే!

మా యవ్వ చెప్పిన ఎబుడుదో  మాట  గుర్తుకొస్తావుంది… మా యవ్వ లచ్చుమవ్వ, వాల్ల అమ్మ యల్లమ్మ ఇద్దరూ ఊరికి పోయి వస్తా ఉండారట. మద్యలొ ఓనిమి వచ్చిందట. ఆమర్సు నాడు వానొచ్చి ఆ ఓనిమింటి వరకు నున్నమన్ను కొట్టకొచ్చిందంట. ఆ మన్ను నున్నగా బిళ్ళ కట్టిందంట. ఆ పేరుకు పోయిన దావింటి ముందు మా యవ్వ వెనుక వాళ్ళమ్మ నడస్తా ఉండారట. ముందుపోయే మా యవ్వ ఎనక్కి తిరిగి చూసిందట. వాళ్ళమ్మ కాలితో మాపతా ఉందంట. మా యవ్వ వెనక్కి వచ్చి “ఏందమ్మా కాలి అడుగు మాపతా ఉండావు నీకు పనీపాటా లేదా” అనిందట. “పాపా వానకు  మన్నుకొట్టుకొచ్చింది. నేను తెలీకుండా అడుగు పెడితే ఆ అడుగు గురుతు అట్లే పడింది. అట్లా పడకూడదని పెద్దోళ్ళు చెబుతారు. అందుకే కాలి గుర్తు మాపతా ఉండా. మనల్ని ఆ దేవుడు సంత చేసుకొని రమ్మన్నాడు. మనం ఎట్లొచ్చినామో అట్లే సంతంతా తిరిగి ఎలిపోవల్ల. మనం వచ్చిన గుర్తులు కూడా ఉండకూడదంట” అనే! మా అవ్వ కాలి  గురుతుకే బయపడింది. అట్లాంటిది భూమితల్లి కడుపులో విషంపోస్తా ఉండాము, ఏమిజరుగుతుందో ఏమో… అనుకుంటూ అట్లే నిద్రలోకి జారుకుంటి!

ఎండపల్లి భారతి

ఎండపల్లి భారతి 1981 లో చిత్తూరు జిల్లా, మదనపల్లి లో పుట్టారు . అక్కడే భర్త ముగ్గురు పిల్లలతో ప్రస్తుతం నివాసముంటున్నారు. గత 15 ఏండ్లుగా చిత్తూరుజిల్లా వెలుగు మహిళాసంఘాల పత్రిక 'నవోదయం'లో పనిచేస్తున్నారు. రచనలు : ముప్పై కథలతో 'ఎదారి బతుకులు ' కథా సంకలనం ఈ ఏడాది మార్చి లో విడుదలయ్యింది. లఘుచిత్రాలు : మహిళా సంఘాలకు సంబంధించిన అనేక అంశాలపై లఘు చిత్రాలు తీశారు.

5 comments

Leave a Reply to Chimate Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భారతిగారి పేరు చూడగానే చేస్తున్న పని వదిలిపెట్టి కథ చదవడం అలవాటయ్యింది, ప్రతి కథ మనసుని మెలిపెడ్తుందని తెలిసినా. This story is no different. చిత్తూరు టమేటా రైతుల గురించి పేపర్లో వార్తలు వచ్చినప్పుడు, గిట్టుబాటు ధర లేక పంటంతా రోడ్డు పక్క పడేసి వెళ్ళారని చదివినప్పుడు ఏమైనా చేయగలిగితే బాగుండని ఎంతగా అనిపిస్తుందో. ఈ ఫామ్ హౌస్లు కొనే స్థితిమంతులు రైతును కూలీగా చేసేకంటే రైతుకు పంటకు న్యాయమైన ధర ఇప్పించడానికో, లేదా ఆ ధర వచ్చేదాకా పంటను నిలవ చేసుకోడానికి (కోల్డ్) స్టోరేజీ ఫెసిలిటీస్ నిర్మించడానికి సహాయం చేస్తేనో బాగుంటుందేమో.
    “కష్టానికి ఫలితం ఉన్నట్టా, లేనట్టా?” రైతు అడిగే ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరుందా??

  • రైతుల పట్ల జరుగుతున్నదారుణాల వల్ల ఫ్యూచర్ లో తీవ్రంగా నష్ట పోయేది మనమే అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పటికి ఇలా సాగిపోయింది అనుకుంటూ బ్రతికేస్తున్నాం.
    మనసుకు హత్తుకునేలా రాసారు.

  • చాలా బాగుందండి కథ. శైలి అద్భుతం. చిత్తూరు, యాసకు మా ప్రకాశం జిల్లా యాసకు పెద్ద తేడా ఉన్నట్లు కనపడలే! ఆహాయిగా చదివించింది! కథ పిప్పి ఉరుకుంటే చాలదు. దానివెనుక నున్న లారణాలను కూడా విశ్లేషిస్తే ఇంకా అద్భుతంగా ఉండేది.

  • భారతి గారు, మీరు వ్రాసిన ఈ కథ చదివిన తర్వాత చాలాసేపు బాధపడ్డాను. ప్రజలకు అన్నం పెట్టె రైతులంటే అందరికి అంత చులకన ఎందుకో అర్థం కావట్లేదు. ఈలోకం ఎప్పుడు మారుతుందో ఏమో !? మనిషి బ్రతుకీడ్చాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో అన్నం అవసరం కాకుండ మొబైల్ లో డేటా వుంటే సరిపోతుంది అనుకుంటున్నాడు. భవిష్యత్తు చాల భయంకరంగా వుండబోతోంది అనే నిజం ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో !!!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు