చెట్టు చెప్పిన కథ “నెమలి నార”

          “నిజమే! నెమలి నార చావలేదు. ఎవరో ఒకరు నరికేసినా, ఎప్పుడో ఒకప్పుడు భూమిని చీల్చుకొని పైకి పొడుచుకొని వస్తూనే వుంటుంది.”

ది మానవుని ఏ గాయం నుండో పురుడు పోసుకొని ప్రపంచ వ్యాప్తం అయిన ఆయుర్వేదం ఈ భూమి మీద ప్రాథమిక వైద్య విధానం. ఆధునికంగా ఎన్ని వైద్య పద్ధతులు వచ్చినా ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యత తగ్గక పోవడం గమనార్హం. ఇప్పటికీ కొన్ని చర్మ సంబంధ వ్యాధులకు ఆకు పసర్లే బాగా పనిచేస్తాయని అంటుంటారు. మానవాళికి సకల సంపదలిచ్చినట్టుగానే చెట్టు రోగానికి చికిత్సను కూడా అందిస్తుంది. తెలుగులో చెట్టు చుట్టూ అల్లుకున్న పర్యావరణాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని కథగా అల్లిన వారు తక్కువ. ఆ లోటును తీర్చడానికా అన్నట్లు బి. మురళీధర్ నెమలినార పేర అద్భుతమైన కథ రాశారు. ఈ కథ మొదటి సారి 20 జూలై 2005లో ఆంధ్రజ్యోతి నవ్య వార పత్రికలో ప్రచురింపబడింది. తరువాత అనేక కథా సంకలనాల్లో చేరి 2006లో మంజీర రచయితల సంఘం అందించే ‘వట్టికోట ఆళ్వారు స్వామి’ ఉత్తమ కథా  పురస్కారాన్ని పొందింది. మరాఠీ, హిందీ భాషల్లోకి కూడా అనువాదం అయింది. అంతేగాక ‘తానా’ కథల పోటీలో ప్రోత్సాహక బహుమతినీ  గెల్చుకుంది.

అది అల్లోపతి సూది మందు రుచి తెల్వని ఒక మారు మూల పల్లె. అక్కడ మనుషులకైనా, పశువులకైనా ఏదైనా  రోగం వస్తే నారాయణయ్య అనే ఆయుర్వేద వైద్యుడే దిక్కు. (ఈయన అప్పుడప్పుడు వీధి నాటకాలు కూడా వేస్తుంటాడు) నారాయణయ్య నరనరాన  ఆయుర్వేద వైద్యమే నిండి ఉంటుంది. పైగా స్వార్థం లేని వాడు. వైద్యం చేసి పైసా కూడా తీసుకోడు. అలా తీసుకుంటే వైద్యం పనిచేయదని ఒక నమ్మకం ఆయనకు. రకరకాల రోగాలకు రకరకాల మూలికలు, ఆకులు అవసరమౌతాయి. ఇలా అవసరమైన ప్రతిసారి అడవిలో తిరిగి సేకరించడం కష్టమని నారాయణయ్య తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనే రకరకాల మొక్కలను పెంచుతాడు. అందులో ఎన్నో అరుదైన మొక్కలుంటాయి. అలాంటి అరుదైన మొక్కే ‘వజునుకలు’ (బదనికలు). దీని ప్రత్యేకత ఏమిటంటే “వజునుక (తీగ) పెరిగే వృక్షాన్ని బట్టి దాని ఔషధ గుణం ఆధారపడి ఉంటుంది. వేపచెట్టు మీద పెరిగిన వజునుక ఒక రోగానికి పనికి వస్తే, విప్ప చెట్టు మీద పెరిగిన అదే వజునుక మరో రోగానికి పనికి వస్తుంది”. ఇలాంటి అరుదైన మరో చెట్టు ‘నెమలినార’ (Holoptelia Integrifolia – హోలోఫ్టీలియా ఇంటెగ్రిఫోలియా). ఇది పశువులకు వచ్చే అనేక రోగాలను నయం చేస్తుంది. కానుగు చెట్టు నీడలో పెరిగిన నెమలినార చెట్టు గుణం రెట్టింపు అవుతుందని అంటారు.

ఒక నాటి రాత్రి ఊరి నడి వీధిలో రామాయణం నాటకం జరుగుతుంటుంది. అందులో రామ రావణ యుద్ధ ఘట్టం భీకరంగా జరుగుతూ, మద్దెల తాళాలు రువ్వడి మీద మోగుతూ నాటకం రంజు మీద ఉంటుంది. నాటకంలో రాముడు నారాయణయ్యే. రావణుని వ్యర్థ ప్రేలాపనలకు సమాధానమిస్తూ రాముడు రావణుని మీద బాణం ఎక్కు పెడుతున్నాడు.. ఇంతలో ఒక మనిషెవరో స్టేజీ మీదకు వచ్చి రాముని చెవిలో ఏదో చెప్తాడు. వెంటనే రాముని వేషంలో ఉన్న నారాయణయ్య అదే వేషంలో స్టేజీ దిగి పోతాడు. ప్రేక్షకులంతా  ఆశ్చర్యపోయి  ఏమైందేమైందని గుస గుసలాడుకుంటారు. అసలు విషయమేమిటంటే ఊళ్ళో ఆశన్న దుక్కెటెద్దు కిందపడి కొట్టుకుంటుందట వైద్యం చేయడానికి నారాయణయ్య వెళ్ళాడు. నాటకం కన్నా మూగ జీవి ప్రాణమే గొప్పది కదా. కాసేపటికి నారాయణయ్య తిరిగి వచ్చి నాటకాన్ని పూర్తి చేస్తాడు. ఈలోపు బుడ్డెన్ కాన్  తన ఆట పాటల ద్వారా అలరిస్తాడు.

స్టేజి నాటకం ముగిసినా జగన్నాటకం ముగియదు కదా. నారాయణయ్యకు ముగ్గురు కొడుకులు. మూడు కుటుంబాలుగా విడి పోయి బతుకుతుంటారు. వాళ్ళకు స్వంత ఇండ్లే లేవు.  కాబట్టి ఇంటి ముందు నారాయణయ్య మొక్కలు పెంచిన ఖాళీ స్థలాన్ని మూడు భాగాలు చేసి ఎవరి గూడు వారు కట్టుకోవాలని ఆశ. కానీ విలువైన మొక్కలన్నీ నాశనమవుతాయని నారాయణయ్య ససేమిరా ఒప్పుకోడు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఊళ్ళో ఎవరికి ఏ రోగం వచ్చినా అల్లోపతి దవాఖానాలు చాలా వచ్చాయి. నీ చెట్ల మందులు ఎవరికీ  అవసరం లేదని వాదించి కొడుకులు మొక్కలన్నిటిని పీకి పారేసి స్థలాన్ని చదును చేసుకుంటారు. ‘కాలగతిని తప్పించ నెవ్వారి తరమూ..’ అని నారాయణయ్య కూడా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోతాడు. పెద్దోడు ఇంటి ముందు బావిని పూడ్చేస్తాడు. చిన్నోడు  నెమలినార చెట్టును నరుకుతుంటే.. ఒరేయ్ చిన్నోడా! నెమలినార చెట్టునైనా వదిలేయిరా దాన్ని కొట్టకురా అని నారాయణయ్య మొత్తుకుంటాడు. కానీ వాడు వినడు. చెట్టు పెళపెళమని నేల కూలుతుంది. ‘లోకం తన మీద తనే మట్టి వోసుకొని పూడ్చుకునే కాలం వచ్చేసినట్లే’ అని అనిపించింది నారాయణయ్యకు.

ఓ రోజు అర్ధరాత్రి చిన్న కొడుకు ఇంటికి ఎనగర్రాలా నిలబడ్డ సుక్కెద్దు పొరపాటున పాము కూసం మేసి ఆగమాగం చేస్తుంటుంది. వెంటనే చిన్నోడు తండ్రి నారాయణయ్యను నిద్ర లేపుతాడు. నారాయణయ్య సుక్కెద్దు అవస్థను బాగా గమనించి దీనికి నెమలినార ఆకు బాగా పనిజేస్తుండే నువ్వు వద్దంటే చెట్టును కొట్టేస్తివి అంటాడు. సుక్కెద్దును ఎట్లాగైనా బతికియ్యమని చిన్నోడు వేడుకుంటాడు. సుక్కెద్దు లేక పోతే తన కుటుంబం వీధిన పడుతుందని బాధ పడుతాడు. చిన్నోని బాధ చూడలేక పెద్దోడు ఎందుకు బాధ పడుతవురా? జింకల ఒర్రెలో నెమలినార చెట్టుండే నేను పోయి తీసుకొస్త తీయి అంటాడు. కానీ  నేనే పోతానని చిన్నోడు జింకల ఒర్రెకు  పోయి అంతటా వెతుకుతాడు. కానీ ఎక్కడా నెమలినార చెట్టు కనపడదు.  ఎంతో విచారంగా ఖాళీ చేతులతోనే ఇంటికి తిరిగి వస్తాడు. ఇక్కడ  సుక్కెద్దు కొస ప్రాణంతో కొట్టుకుంటుంది. చిన్నోన్ని చూడగానే నెమలి నార దొరికిందా? అని  సుక్కెద్దు తన చూపులతోనే అడిగినట్లు అనిపిస్తుంది.

చిన్నోడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతుంటాడు. నెమలి నార కొట్టేసిన స్థలం బోసిగా కనిపిస్తుంది. ఏ పోశమ్మ దయ వల్లనో ఇప్పటికిప్పుడు అక్కడ మళ్ళీ నెమలినార చెట్టు మొలిస్తే బాగుండు ననుకుంటాడు. ‘కానీ అంతటి మహిమ జరిగే కాలమా ఇది?’ చివరికి నెమలినార చెట్టును కొట్టేసి కుప్ప పోసిన మొద్దుల సందు నుండి ఏదో ఆకుపచ్చగా కనిపిస్తే చిన్నోడు పరుగెత్తుకెళ్లి కట్టెలను పక్కకు జరిపి చూస్తే వాటి మధ్య కొన్ని నెమలినార ఆకులు కనిపిస్తాయి. నారాయణయ్యతో సహా అందరూ పరుగెత్తుకొచ్చి చూస్తారు. నారాయణయ్య చిన్నోడా1 నీ  సుక్కెద్దు ఇక చావదురా బతికినట్టే అంటాడు సంబ్రమంగా.

“నిజమే! నెమలి నార చావలేదు. ఎవరో ఒకరు నరికేసినా, ఎప్పుడో ఒకప్పుడు భూమిని చీల్చుకొని పైకి పొడుచుకొని వస్తూనే వుంటుంది. ఎవరో ఒక నారాయణయ్య తన చేద బావిలోంచి నీళ్లు పోసి దానిని పెంచి పెద్ద చేస్తూనే ఉంటాడు”.

కథ నాటక ప్రదర్శనతో ప్రారంభమై నాటకీయ మలుపుతో ముగుస్తుంది. మనుషులకే కాదు మూగ జీవాలకు కూడా ఆయుర్వేద వైద్యం అందించే నారాయణయ్యే ఇందులో ప్రధాన పాత్ర. ఈయన చుట్టే కథంతా నడుస్తుంది. కథలో కథకుడు వివరించిన పశు వైద్య విధానం ఆకట్టుకుంటుంది. సంజీవని మొక్క ఆకు పసరును మింగి మళ్ళీ బతికిన లక్ష్మణుడు పాత్రగా గల రామాయణం నాటకంతోనే ఈ కథ ప్రారంభం కావడం ఒక భవిష్యత్ కథా సూచన. చెట్టంత మనిషి అంటే చెట్టంత పొడవున్న మనిషి అని కాదు చెట్టులా పలువురుకి ఉపయోగపడే మనిషని చెప్తుందీ కథ. మూర్ఖంగా మనిషి తాను కూర్చున్న కొమ్మను తానే ఎలా నరుక్కుంటున్నాడో ఈ కథ చాలా ధ్వన్యాత్మకంగా చెప్తుంది. కథ 2005 సంచికలో ఈ కథను  డా. పాపినేని శివశంకర్ సమీక్షిస్తూ “ప్రకృతి మనిషికెప్పుడూ ఒక అభేద్య మర్మమే. ఆ అభేధ్య మర్మంలో ఒక భాగమే నెమలినార కూడా. నెమలినారే కాదు, ఎన్నెన్నో అమృత సంజీవనులతో నిండారిన సమస్త ప్రకృతిని కాపాడు కోవడమా? లేదా? అన్నది మనిషి మీద ఆధారపడి ఉంది. నిజానికి ప్రకృతి మనిషికి చెందింది కాదు. మనిషే ప్రకృతికి చెందిన వాడు. దాన్ని ధ్వంసం చేయడం అంతిమంగా ఆత్మ విధ్వంసమే. ప్రకృతి ధర్మాన్ని భంగం చేయకుండా దానితో సహవాసం చేసినపుడే మనిషికి శాంతి”. అంటాడు.

ఇదొక ముగింపు లేని కథ. భూమ్మీద మనిషి ఉన్నన్ని నాళ్లూ బతికి ఉండే కథ. ఇందులో ఉపయోగించిన భాష, శిల్పాలను పరిశీలిస్తే రచయిత పరిణతి అబ్బురపరుస్తుంది. కథ నిండా పర్చుకున్న మానవీయత మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. సాహిత్యం యొక్క పని సామాజిక మార్పే అయితే ఆ పనిని ఈ కథ నూటికి నూరు పాళ్లూ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రానురానూ కాంక్రీట్ అరణ్యం పెరిగిపోతున్న ప్రస్తుత సందర్భంలో ఇప్పటి తరానికి పాఠ్యాంశంగా పెట్టదగిన కథ.

*

శ్రీధర్ వెల్దండి

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • మంచి కథకు ,చక్కటి విశ్లేషణ. ప్రకృతి వైద్య విశిష్టతను , పల్లెల్లో చదువుకోకుండానే అటు మనుషులకు ఇటు పశువులకు ఏ రోగంనైన నయం చేసే నారాయణ పాత్ర బాగుంది. మనిషి రోగాల్ని వ్యాపారంగా మారిన తరంలో , అలోపతి వాడడం విపరీతంగా పెరిగింది, దాని మూలంగా వచ్చే side effects కి మళ్ళీ అలోపతే వాడుతుంటారు….దీనికి చక్కని పరిష్కారం ఆయుర్వేదం.

 • Super anna
  Manchi manchi kathalu anda jesthunnaduku karanga ku, sridharannaki kruthagnathalu.

  Dr. Siddenky

 • కథా కచ్చీరులో ఖచ్చితంగా పరిచయం చేయాల్సిన కథారాజం “నెమలినార”. ఉత్తర తెలంగాణ జీవన శైలికి అద్దం పట్టే వస్తువు, తేనెలూరె మాందలీకపు సొబగు, చిక్కటి కథన శైలి, గుండె తడిపే మానవీయత వెరసి “నెమలినార”. మురళీధర్ ఎంత చిత్రిక పట్టారో కథ చదివితే తెలుస్తుంది . ఇక కొండని అద్దంలో చూపించే మంచి విశ్లేషకుడు వెల్దండి గారి గురించి కొత్తగా, ప్రత్యేకంగా చెప్పేదేముంది?

 • గొప్ప కథ కు మంచి సమీక్ష సార్

 • నెమలి పురి విప్పి నాట్యమాడినంత అందంగా నెమలి నార ను విశ్లేషించారు.అభినందనలు

 • నెమలినార కథ ఎంత అద్బుతంగా రాసారో మీ విశ్లేషణ అంత అద్బుతంగా వుంది . ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యతను గురించి చాల చక్కగా చెప్పారు వెల్దండిగారు .
  ఒకప్పుడు మనుషులంతా తమ పరిసరాలల్లో దొరికే మొక్కలను వైద్యానికి ఉపయోగించుకోవడం వల్లనే సుఖంగా ఆరోగ్యంగా ఖర్చు లేకుండా హాయిగా బ్రతకడం సాధ్యమైంది .

  శ్రీధర్ గారికి అభినందనలు.

  • గొరుసు గారికి, శ్రీధర్ గారికి, స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు