చింత చెట్టు కన్నీరు

 పుష్ప ఎల్లకిలా పడి పోయి ఉంది. గుప్పిళ్ల నిండా మట్టి. బాధ తట్టుకునేందుకు, దొర్లుతూ మట్టిని బిగించి పట్టుకోవడం ఇందాకే కళ్లారా చూశాన్నేను.

పుష్ప అనుభవించిన ఒంటి బాధ కంటే, ఆ పిల్ల పడిన అవమానం, నగుబాటు ఆ ప్రాణం లేని బిగుసుకు పోయిన ఆ మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పొట్ట పట్టుకుని గిల గిలా తన్నుకుంటున్నపుడు నిస్సహాయంగా చూస్తూ, చల్లని గాలిని వీస్తూ చేయగలిగినంత చేశాను. ప్రాణం పోయేటపుడు చల్లగాలి ఎవరికి కావాలి? ప్రాణం పోవడమే గోరం అనుకుంటే అందులో మళ్ళీ సుఖంగా పోటం కూడానా?

ఎన్ని చావులు చూశాను నా కళ్ల ముందు? నా కొమ్మలకే చీరలతో, చాంతాళ్లతో వేలాడిన వాళ్లున్నారు. ఎడంపక్క కొమ్మల కింద పరిచిన అరుగు మీద పురుగు మందు తాగి పడి పోయిన వాళ్లు…

నాకు కాస్త దూరంలో పక్కన వీరభద్రుడు చేనులో పత్తి పంట నాశనం అయి కౌలు రైతు సీతారాముడు ఎండ్రిన్ తాగి దొర్లినాడు గాదా?

“కోటయ్య చేలో సింత సెట్టు కింద అరుగు మీద పొణుకుంటే ప్రాణం ఎటు బోయిందో” అని ఎవురన్నా అనుకుంటే బో గొప్పగా అనిపిస్తది. ఇదే అరుగుల మీద సచ్చి పోయినోళ్ళు గుర్తొస్తే బో మంట గుండెల్లో.

తలొంచుకోవాలనిపిస్తది

ఆ నాపరాళ్ల అరుగుల మీద కుసోని ఆడోళ్ళ కబుర్లు ఇంటా వుంటే నవ్వొస్తది. గల గల మని నేను నవ్వితే రాలే సింతకాయలు ఏరుకునే దానికి ఆళ్ళకి తీరికెక్కడుంది.

వూళ్ళో యవ్వారాలన్నీ ఆళ్ళయ్యే గదా

ఏ ఇంట్లో ఎవడు తాగి పెళ్ళాన్ని తన్నిందీ, యవ్వారాలు పెట్టుకోని పెళ్ళాం బిడ్డల్ని రోడ్డు మీనకి తెచ్చిందీ, ఏ చేలో పత్తి పురుగుబడి పోయిందీ,ఎవురి పిల్ల సమర్తకి ముందే ఫలాన వోళ్ళ పిలగాడితో చేల గెనాలెమ్మట తిరిగిందీ, ఊళ్ళో యవ్వారాలన్నీ ఆళ్ళయ్యే గదా
మాయిటేళ టీవీ ముంగట్లే కూసుంటారేమో గానీ మజ్జానాల ఈ సెట్టు కిందే గదా కబుర్లన్నీ

గాలి గట్టిగా కొట్టింది. గురవయ్య సేను వైపున్న నా కొమ్మలన్నీ గల గల్లాడాయి. ఎండి పోయిన సింత కాయలు బోలు గా సప్పుడు చేస్తా రాలి సిన్న కాలవలో పడ్డై

తెప్పరిల్లి పుష్ప శవం వైపు చూశాను. అరమూతలు పడి, ఆరి పోయిన ఆ పొడి కళ్ళలో ఎవరి మీదో జాలి, మరెవరి మీదో కోపం, ఏమీ చేతగాని తనం…

నాకే గనక కన్నీళ్ళుంటే, ఆకులన్నీ తడి బారి పోయేవా ? ఏమో
నాలుగైదేళ్ళ కిందట గురవయ్య సేను కౌలు చేసే ఆంజనేయులు పత్తి మొత్తం నాశనమై, అప్పు తీర్చలేక అదిగో, ఆ సీమ సింత సెట్టు కిదనే మందు గుళికలు మింగి గిల గిలా కొట్టుకోవడం సూసి కలవర పడ్డాను.

గురవయ్య పెళ్ళాం మట్టి నెత్తిన పోసుకోని ఏడుస్తుంటే నాకే జలదరించి పోయింది

పొయ్యే వాళ్ళు తమ ఎనకాల మిగిలి పోయి ఏడ్చే వోళ్ళ గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏం పోద్దో?

కానీ పుష్ప కి అట్టాటి అవసరం ఏమీ లేదట్టుగుంది.

తనని నానా తన్నులూ తన్నిన బతుకుని చివరగా సాచి పెట్టి తన్నింది పుష్ప

యాణ్ణో ముసలి తల్లితో అన్న ఇంటి కాణ్ణే ఒక గుడిసె ఏసుకోని ఉంటదని ఎవరితోనో సెప్తుంటే ఇన్నా

మొగుడు  పిల్లలు పుట్లేదనే వొంకతో ఈ పిల్లను వొదిలించుకోని ఇంకెవర్నో పెళ్ళి చేసుకున్నాడంట. కోర్టుకు పొయ్యేదానికి,పంచాయితీ కాడికి పొయ్యేదానికి పుష్ప దగ్గర డబ్బులు లేక పాయె.

రోజూ తాగొచ్చి తన్నే మొగుడు వొదిలెయ్యటమే మంచిదనుకుందేమో

అన్నా వొదినలు కూడా కూలీలే.

ముసలి తల్లికి ఇంత ముద్ద పెట్టటవే కష్టం వాళ్ళకి. పుష్ప కూలీకి పొయ్యి, ఇటిక బట్టీల్లో మట్టి తొక్కి, ఆ పనీ ఈ పనీ చేసి పొట్ట పోసుకుంటదంట.

వొయిసులో ఉన్న పిల్ల గదా, యాణ్ణో దూరాన ఎందుకనిఅన్న గుడిసె పక్కనే ఒంటి నిట్టాడి పాకేసుకోని దాంట్లోనే ఉంటం

వేరే వూళ్ళలో వరి కోతలో , ఇంకేదన్నా పనుంటే వొచ్చి చేసుకోని నాలుగు డబ్బులు చేసుకోని పోయిద్ది

ఈ వూళ్ళో కోతలకి రాగానే మేస్త్రీ నాగరాజు కళ్ళలో పడింది.

“ఎవురిది?” అడిగాడు నాగమణి ని  ఆ రోజు పొద్దున్నే. నేను చూశాగా
“మరే, నూకతోటోళ్ళ రోజ్ మేరీ లేదూ వాళ్ళ సుట్టాలంట. మాసారం నించి రోజ్ మేరీ కాడికొస్తే, కోతలున్నయి రమ్మని తీసకొచ్చింది” నాగమణి చెప్పింది చీరె కొంగు బిగించి దాని మీద మొగోళ్ళ చొక్కా తొడుక్కుంటూ.

అదేసుకుంటే కొంగు పక్కకి పోటాలూ, దోపుకోటాలు ఉండవని కాబోలు
“మాయ్, ఏ వూరు మీది” మాట కలిపాడు
“మాసారమయ్యా”
“ఈడ ఇడిగా వొచ్చి ఎట్ట వొస్తావమాయ్ కూలికి? మేస్త్రీ తీసకొస్తే రావాల”
“తెలుసు మేస్త్రీ, మా వొదిన రోజ్ మేరీ కాడికొచ్చా. ఆవే తీసకొచ్చింది , నేను మాట్టాడతాలే అని” మేరీ కోసం చూసింది
ఎవరితోనో పగల బడి నవ్వుతూ కబుర్లు చెప్తున్న మేరీ కనపడింది
“వొదినా, ఓ వొదినా” కేకేసింది
“ఒద్దులే ఆవెనెందుకు పిలిసేది? నేనే ఈడ మేస్త్రీ. నాగరాజు నా పేరు” పరిచయం చేసుకున్నాడు

“ఈడ పనిప్పిస్తే నాలుగు రూపాయలు తీసుకోని పోతా మేస్త్రీ”

“సరే అట్నే ఇప్పిత్తాలే గానీ, ఈడ రోజ్ మేరీ ఇంట్లోనేనా ఉండేది? మీ ఆయన కూడా వొచ్చాడా పనికి?” మామూలు గా అడిగాడు మొగుడి సంగతి తెల్సుకోవాలని

“నేనొక్క దాన్నే వచ్చా. మా ఆయన…. ” ఒక్క నిమిషం ఆగి
“ఏరే పెళ్ళి సేసుకున్నాడు. మా యన్న కాడ ఉంటన్నా వూర్లో”

నాకే కోపం వచ్చింది,
ఎంత అమాయకంగా చెప్పింది పిచ్చిది

“అదంతా సెప్పాల్నా ఆ ఎదవకి నువ్వు? మా ఆయన వూర్లో ఉండాడని సెప్తే సాల్దా?” విసుక్కున్నాను

నాగరాజు ఈ చేను పక్కన గడ్డి వాము వెనక్కి, పంపు సెట్టు గది కాడికి ఎంత మందిని తెచ్చాడో నాకు తెల్సు. వాళ్ళలో ఇష్టంతో వొచ్చినోళ్ళ కంటే పని పోకుండా సూసుకోవాలనే అవసరంతో వచ్చినోళ్ళే ఎక్కువ, అది నాకే గాదు, నాగరాజు కీ తెలుసు

 

******************

ఆ చివర్న ఉన్న వెదురు పొదలోకి గాలి దూరి “వూయ్ వూయ్” అని కీచుగా కేకలు పెట్టింది

దాని పక్కనే పెరిగిన మొగలి పొదలో పూలు పండినట్టున్నాయి, కమ్మని సువాసనని గాలితో పుష్ప శవం మీదికి పంపి నా వైపు చూసింది పొద

భారంగా నిట్టూర్చాను
“ఆ ఎదవ ఈ పిల్ల ఉసురు తీస్తాడని నాకు ముందే తెల్చు” అంది నిరసనగా మొగలి పొద

ఏమనాలో తోచలేదు. పుష్ప ఎద మీద నుంచి పమిట గాలికి తొలగి పోయింది
ఎంత అందమైన పిల్ల ఇది!! మొగుడు వదిలేసిన దుఖం లేకుండా, పెద్ద కష్టం నుంచి బయట పడిన దాని లాగా, ఆ తన్నులు, గుద్దులు తప్పించుకుని హాయిగా పని పాటలు చేసుకోని బతికే పిల్ల

పిల్లలు పుట్టనంత మాత్రాన ఒంట్లో కోరికలు సచ్చిపోవు గదా? ఈ నాగరాజు మాటల్ని ఎట్ట నమ్మిందో ఈ పిల్ల?

ఆడోళ్ళంతా ఇంతేనా? ఎవుడో ఒకడు “నా వోడు” అనే మడిసి ఉండి తీరాల్సిందేనా? ఏదో ఒక ముడికి కట్టుబడి

అదే నాది అనుకోక పోతే బాగుండదా ఈళ్ళకి?

పని పాటలతో , తన్నులు లేని అందమైన లోకంలో హాయిగా తిని నిద్రపోయి బలంగా ఎదిగిన పుష్ప, ప్రాణం లేని కట్టె అయిపాయె

నల్ల మట్టిలో ఎల్లకిలా పడిపోయిందాయె. నోటి పక్కగా కారిన నురగ గాలికి ఆరిపోయింది
కుక్క ఒకటి అటుగా పోతూ పుష్ప దగ్గరికి వచ్చి వాసన జూసి, బెదిరి పోయినట్టు పరిగెత్తి పోయింది

 

*****************

నాగరాజు పుష్ప ఉషారు గా పని చేయడం గమనించాడు. చలాకీ గా మాట్టాడ్డం గమనించాడు. ఎవరినీ లెక్క చేయదని గమనించాడు.

“పుష్పా, సాయంత్రం ఇంటికి పోబాక, ఆగు, ఏరే కాడ పనుంది ఇప్పిస్తా నీకు” అనడం మొగలి పొద విననే విన్నది

“చూశావా వాడిని ?వాడి మాటలు ఇన్నా?” ఆ చివరి నుంచి కేకేసింది
గల గలా తలూపాను  నిస్పృహతో

ఆ సాయంత్రం నాగరాజు పకోడీలు, కూల్ డ్రింకులు తెచ్చి పుష్పని మాటల్లో పెట్టాడు

మరో వారం పది రోజులకు పుష్ప నాగరాజు కి కాస్త దగ్గరైంది

“నా పెళ్ళానికి ఒంటో బాగోదు పుస్పా, బట్టలిడిసే రోగం. అందుకే పుట్టింటి కాణ్ణే ఉంటది. రెండో పెళ్ళి చేసుకోమని మా యమ్మ ఎంత పోరిద్దనీ? ఎంత కాలమని ఇట్టా కూసునేది? నేను మాత్రం ఉప్పూ కారం తినట్లా? నీలాంటి నాణ్ణెమైన మడిసిని వొదులుకున్నడే వాడెట్టాంటి ఎదవో నీ మొగుడు. నువ్వొప్పుకుంటే నిన్ను పెళ్ళి చేసుకుంటా”

“నాకు పిల్లలు పుట్టరు నాగరాజూ” అంది పుష్ప పెళ్ళి మాట ఎత్తగనే
నాగరాజు కి కావాల్సింది ఆ ప్రమాదం లేని పుష్ప లాంటిదే
“నాకున్నారు గా ఇద్దరు పిల్లలూ? ఇంగా మనకి పిల్లలెందుకూ? వాళ్ళని సరింగ చూసుకుంటే చాలు మనం. నీకెందుకు,నువ్వు ఊ అను, మహాత్మా గాంధీ కాలనీ లో ఇల్లుంది, తీసుకుంటా . ఆడుండు ముందునిమ్మళంగా దానికి ఇడాకులిచ్చి.. ”
మరో రెండు వారాల పాటు ఇయ్యే మాటలు చెప్పి పుష్పను గాంధీ కాలనీ లో ఇంట్లో పెట్టాడు

“నాగరాజూ, నాకింక పెళ్ళీ గిళ్ళీ ఏం వొద్దు. శానా పడ్డాలే పెళ్ళి తో.” నాగరాజు పెళ్ళి కబుర్లని నిమ్మళంగానే తిరగ్గొట్టింది

కాలనీ చివర్లో ఇల్లు. చేలోంచి ఆ ఇంట్లోకి సరాసరి పోవచ్చు. రోడ్డు మీద నుంచి అందరూ చూసేతట్టుగా పోవక్కర్లేదు.

మహాత్మా గాంధీ కాలనీ లో చాలా మంది నాగరాజు పనిప్పిస్తే పొయ్యే వాళ్ళే. సేలో పని లేనపుడు ఇటిక బట్టీల్లోనో, బేల్దారీ పనో ఏదో ఒకటి సూపిత్తాడు. అందుకే అందరూ పైకి ఏమీ మాట్టాడకుండా ఊరుకున్నారు “మనకెందుకులే, నోటికాడ కూడు పోగొట్టుకునేది దేనికి” అనుకున్నారు గాబోలు

యాణ్ణుంచో ఒక్కతే వచ్చి ఈడ ఇల్లు తీసుకోని ఉంటున్న మడిసి లాగే చూశారు

“మేయ్, నాగరాజు కి మంచి పేరు లేదే. పెళ్ళాం వొదిలేసి పోయిందంటారు గానీ ఇడాకులు గాలేదు ఆళ్ళకి. ఆడితో జాగర్త” రోజు మేరీ చెప్పింది గానీ పుష్ప చెవులకెక్కిందా ఆ మాట ?

నాగరాజు తెచ్చే జిలేబీలూ, మల్లెపూలూ, రెండో ఆట సినిమాలూ, సిల్కు చీరెలూ, ఆడదాన్నే చూడనట్టు ఆవేశంగా అల్లుకుపోయే ప్రేమలూ వీటన్నిటి మజ్జెన ఎవురి మాటా ఇనపళ్ళా

మొన్న సాయంత్రం నవ్వుకుంటా తుళ్ళుకుంటా సేలో నుంచి ఇంటికి పోయిన పుష్ప నిన్న పన్లోకి రాలా

మజ్జానం  రెండు దాటినాక కూలీల్లో గోల మొదలైంది
ఇదిగో, నా కొమ్మల కిందనే అరుగుల కాడ కుప్పబడి చెప్పుకున్నారు.

వూర్లో ఉన్న నాగరాజు పెళ్ళాం పూర్ణమ్మకి తెల్సిందంట పుష్ప సంగతి

అన్న దమ్ముల్ని తీసుకోని వచ్చిందట. ఇంటి చుట్టు పక్కలోళ్ళతో కల్సి అందరూ పుష్ప ఇంటి మీద బడి ఇద్దరినీ పట్టుకున్నారంట

పుష్పని జుట్టుపట్టుకోని ఈడ్చి రోడ్డు మీద పడేసి కొట్టారంట.

“ఏవే గుడిసేటి దానా, నా మొగుడే దొరికాడంటనే నీకు గొడ్డుమోతు దానా? నీ వూర్లో పనే దొరకనట్టు నా కాపరం తీసేదానికి ఈడ దాకా వొచ్చినావంటే సిగ్గు లేని దానా” అని నాగరాజు పెళ్ళాం పుష్పని చీపురుతో కొట్టిందంట

ఆమె అన్నదమ్ములిద్దరూ కూడా పుష్ప మీద చెయ్యి జేసుకున్నారంట. చీర లాగినాడంట పూర్ణమ్మ తమ్ముడు.

అడిగే మడిసి లేక పోతే ఆడదంటే అందరికీ సులకనే కదా

“యాణ్ణుంచో వచ్చి నాగరాజుని తగులుకుందిది”

“అంత ఆగలేక పోతంటే మీ వూర్లోనే ఎవురినన్నా ఉంచుకోక పొయ్యావా?”

“ఇదేం జేస్తే మొగుడు ఒదిలిపెట్టినాడో”

“తాడూ బొంగరం యేదన్నా ఉంటేగా? అందుకే వూళ్ళ మీద బడి కాపరాలు తీస్తంది ఇది ”

ఇరుగు పొరుగులంతా తలా ఒక మాటా దూసి పోశారు తప్ప పుష్పకి ఒక్కడూ అడ్డం పడలేదు

“వూళ్లో లేను గదాని, దానెనకాల పడ్డావా?” అని నాగరాజు పెళ్ళాం మొగుడి మీద విరుచుకు పడితే

“మొగుడు వొదిలేశాడు, ఒక్క దాన్నే ఉండాను, రమ్మంది అదే, నువ్వు గూడా వూరికి పోయి రెణ్ణెల్లు గాలా? ఆడది రెచ్చగొడితే మొగోణ్ణి సమాదానం చెప్పద్దా?”  అన్నాడంట  నాగరాజు

అప్పటి దాకా అందరి దెబ్బలూ తలొంచుకుని పడిన పుష్ప ఆ మాటతో కుప్ప కూలి పోయిందంట పాపం.

నాగరాజు ఒక్క మాటైనా తన కోసం మాట్లాడతాడని చూసిన పుష్ప ఆ మాటతో తల వాలేసి కూచుండిపోయిందంట

నా కొమ్మల కింద కూసున్న ఆడోళ్లలో కొంతమంది కళ్ళెమ్మట నీళ్ళు కార్చారు

“ఎంత నగుబాటు జరిగిందో పుస్ప కి. మట్టసమైన పిల్ల. ఈడి వొల్లో పడింది. చేలో పని చేసుకోని మేరీ కాడే ఉంటే  ఎంత బాగుండేది? సెప్తే ఇన్నదా? ఆ నా బట్ట పెళ్ళి జేసుకుంటానంటే ఎట్ట నమ్మింది?”

“పెళ్ళీ గిళ్ళీ అని కాదులే, వొయిసు లో ఉన్న పిల్ల గదా. ఈడ ఉన్నన్నాళ్ళూ ఈడితో ఉండాలనుకుందేమో. ముత్తెం లాంటి పిల్ల బతుకుని నలుగురిలో పెట్టి నాశనం జేశాడమ్మా ముండ నా బట్ట.  ఇంగ సామాను సర్దుకోని పుస్ప వాళ్ల వూరు పోతే మంచిది. ఒక్కడైనా నాగరాజు నా బట్ట ని ఒక్క మాటైనా అన్లేదంట. ఎట్టంటార్లే, ఆ నా బట్ట కి డబ్బులుండై గదా, ఆడదే లోకువ”

వాళ్ళ మాటలు వింటుంటే గుండె పగిలి పోయింది. పుష్ప ని వెంటనే చూడాలనిపించింది.

“మరేం పర్వాలేదు. ఆడ కూతుళ్ళకి అన్యాయం జేసే ఎదవలు అట్టనే ఉంటారు. నువ్వు గాబరా పడమాక. దైర్నంగా ఉండు.” అని చల్లటి గాలిని పంపిచ్చి పుష్ప తో చెప్పాలనిపించింది. నాకే చేతులుంటే పుష్పని ఆలింగనం చేసుకోని గుండెల్లో పెట్టుకోవాలనిపించింది

పుష్ప, ఎట్టుందో ఆ పిల్ల!! అని రాత్రంతా కంగారు పడతానే ఉన్నాను. చిమ్మ చీకట్లో కన్ను మూతెయ్యకుండా నిలబడి ఆలోచిస్తానే ఉన్నాను

ఇయాల పొద్దున ఇంకా సీకట్లు పోకముందే, పుష్ప చేతిలో డబ్బాతో తూలుకుంటా వచ్చి అరుగు మీద కూసోని గుండె పగిలేలా ఏడ్చింది.

“పుష్పా, ఏడవమాక, అయిపోయింది గా, ఇంగ వూరికి పోమ్మా, ఆడ గూడా ఈ ఇసయం తెలిసే ఉంటదనుకో! కానీ మరెట్ట? ఈడ బతకలేక పోతే ఇంకో సోటికి పోవాల గదా” అన్నాను

పుష్పతో పాటు నేనూ ఏడ్చాను

నా మాటలు పుష్ప కి వినపడవని గ్రహించకుండా మాట్టాడతన్నా

కళ్ళు తుడుసుకోని గమ్మున కూసున్న పుష్ప గబాల్న లేచి డబ్బా మూత తీసి గడ గడ తాగేసింది

డబ్బా సూడగానే అనుమానించా
పుష్ప పురుగు మందు తాగుతుంటే ఆపలేకపొయ్యాను

నా కళ్ళ ముందే పుష్ప గిల గిల కొట్టుకుంటే ఎవరినీ పిలవలేక పొయ్యాను.

పిచ్చి పిచ్చిగా కొమ్మలూపాను. కాయలు రాలి పడ్డాయి గానీ పోయే పుష్ప ప్రాణం ఆగలేదు

******
గోల గోల గా ఏడుపులు కేకలు వినపడి తెప్పరిల్లాను.
రోజ్ మేరీ గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకొస్తోంది. ఆమె వెనకే మరి కొంత మంది ఆడా మగా

“సూడండి, పేణం ఉందా? ఆస్పత్రికి తీస్క పోదాం” ఎవరో అన్నారు

“ఇంకేడ పేణం. సచ్చి పొయ్యి కూడా శానా సేపయింది. సేతులు నీలుక్కు పోలా? కళ్ళు లోపలికి పొయినై, ఇదిగో ఈడంతా నురగ కక్కింది”

పుష్ప చావుని వాళ్ళలో ఎవరో ఇవరంగా సెబుతుంటే,సేదుగా అనిపిచ్చింది

చెంగు దోపి చక చకా చేలో పని చేసే పుష్ప… చచ్చి పోయింది

చచ్చిపోయింది పుష్ప.

ఇక ఈ సేలో పుష్ప నవ్వులు కనపడవు. జీర గొంతుతో పుష్ప పాడే “హై లో హైలెస్స హంస కదా నా పడవ” పాట వినపడదు

నాగరాజుని సూడగానే పుష్ప కళ్లలో మెరిసే రంగులు, బుగ్గల్లో పూసే పువ్వులు.. ఇంగ కళ్ళ జూడను

చూస్తుండగానే పోలీసులొచ్చారు. రాసుకున్నారు. ఒక గంటలో శవాన్ని ఎత్తేశారు. ఎవరో ఇన్ని పసుపు నీళ్ళు తెచ్చి పోశారు

“నా సేనే కావాల్సొచ్చిందా సచ్చే ముండకి” కోటయ్య పెళ్లాం తిట్టింది

సేను కాళీ అయిపోయింది.

పుష్ప కత అయిపోయింది

దూరాన ఎవురో వస్తన్నారే, ఎవరా మడిసి? ఇప్పటి దాకా దూరాన గడ్డి వామి ఎనక నుంచి సూస్తన్న పూర్ణమ్మ పరిగెత్తుకుంటా వస్తంది

ఆ ఎనకమాలే నాగరాజు

కోపంతో రగిలి పోయాను

ముత్తెమంటి పిల్లను పొట్టన పెట్టుకోని ఎందుకురా ఇంగా బతికుండావు? పోయి గుత్తికొండ బిలం ఎక్కి దూకి సావరా దరిద్రపు నాయాలా?

పసుపు నీళ్లతో తడి తడి గా ఉన్న చోటుకు వస్తానే  పూర్ణమ్మ కుప్పకూలి పడి పోయింది

చేతుల్తో ఆ మట్టి పోగు చేస్తూ “సచ్చి పోతావనుకోలేదే , సచ్చి పోతావనుకోలేదే పుస్పా” నెత్తి మీద ఆ మట్టి పోసుకుని గోలు గోలున ఏడ్చింది

నాక్కూడా మనసుందా? లోపల ఏదో తడి, ఏదో కదలిక

జలదరింత

“తప్పు చేశా నేను. పాతెయ్యాల్సింది ఈ నా బట్టని కానీ, నిన్ను కొట్టి తప్పు సేసినాను పుస్పా” మట్టి లో పడి పుష్పనే కావిలించుకున్నట్టు ఆ మట్టిని కౌగిట్లోకి తీసుకుంది

నాగరాజు గంభీరంగా  మొహం పెట్టి “ఇంగ పా, పోదాం, అయిపోయింది గా” అన్నాడు

శివంగి లా, రాక్షసి లా, కాళిక లా  లేచింది పూర్ణమ్మ

“ఓరేయ్, దొంగ నా బట్టా, ఎంత మంది ఆడోళ్ళ ఉసురు పోసుకుంటావు రా? నీకు గత్తర తగలా? నీ చేతుల్లో జెట్ట పుట్టా, నీకు వాయవ రానూ. నిన్ను పోలేరమ్మ ఎత్తక పోదేమి రా?

నేను పుట్టింటికి పోతే వొచ్చి తీసకొస్తావనుకున్నా గానీ ఇంకో దాన్ని తగులుకుంటావనుకోలా. ఆ కోపంతో ఈ పిల్లను కొట్టాను. దాన్ని కొట్టి ఏమి లాబం రా ముండా. నిన్ను కత్తికొక కండ చీల్చి కాకులకేస్తే నాకు పట్టిన దరిద్రం వొదిలి పొయ్యేది గదరా”

“ఒరేయ్, ఎంత ఈనమైన బతుకురా నీది? ఏం జెప్పి ఈ పిల్లని మాయ జేసినావు రా ఎదవ నా బట్టా? దాని ఉసురు నా బిడ్డలకి తగిలిద్ది రా, దాని ఏడుపు నా కడుపు కాల్చిద్ది రా! నిన్ను వొలుకుల్లో బెట్టా. నీదొక జన్మంటరా? మొగోడంటే పది మందితో పడుకోని,పది మంది ఆడోళ్ళ ఉసురు పోసుకోటం గాదురరేయ్,నిన్ను పొయిలో బెట్ట”

కరువు తీరా తిడుతూ ఆవేశం పట్టలేక పుష్ప శవం పడున్న చోటు నుంచి దోసిళ్లతో దుమ్ము ఎత్తి నాగరాజు మొహాన కొట్టింది

నా ఎడమ వైపు కిందకు వాలిన కొమ్మల్లోంచి ఒక కొమ్మ ఇరగ దీసి నాగరాజు వెంటబడి చితక బాదింది

“ఒద్దే, నీయమ్మ, ఇంగ సాలు ఆపవే.కొట్టమాకు. నీ మాటే ఇంటా ఇంగ”  నాగరాజు దెబ్బలకు తాళలేక అరుస్తుంటే “ఇంగా కొట్టు, పీకు నాలుగు. తాట వూడాల” అన్నాను

కాసేపట్లో కాలి బూడిద కాబోతున్న పుష్ప గురొచ్చి వూగుతున్న కొమ్మలు ఆగిపోయాయి

పూర్ణమ్మ ని చూస్తుంటే ప్రేమ గా అనిపించింది

********

ఆర్నెల్ల తర్వాత

“ఏం పిల్లా? కొత్తగా వొచ్చినావా? ఆ జుట్టేంది అంత బాగుంది? ఈ మజ్జెన ఎవురికీ అంత పొడుగు జడ చూళ్ళేదే, గులబి పూలు తింటావెట్టా? బుగ్గలు పూలమల్లే ఉండయ్యే?”

నాగరాజు మాటలకు పదిహేడేళ్ళ ఆ కొత్త పిల్ల బుగ్గల్లో సిగ్గు నింపుకుని జడ ముందుకేసుకుని టిపినీ కారేజీ వూపుకుంటూ చేలోకి పోతూ వెనక్కి తిరిగి చూసింది

పుష్ప కళ్ళముందు మెదిలింది

“నువ్వే నాశనమై పొయ్యావు. ఆడు బానే ఉండాడు సూడు” అనుకున్నా

*

సుజాత వేల్పూరి

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • చింత చెట్టు కన్నీరు కార్చింది. అక్కడ ఉన్న, చెట్టు చేమ కన్నీరు, పెట్టాయి. , జ్ఞానం లేని మనిషి మాత్రం అలాగే ఉన్నాడు. వాడికి బుద్ది వచ్చే, పరిష్కారం చూపుతే బాగుండేది కధ లో..! ధన్య వాదాలు, ma’am. కథ బాగుంది

  • Padmapv

   వెధవ బుద్ధికి పరిష్కారం ఏముంటుంది, కథల్లో తప్ప నిజ జీవితాలలో మనుషులు మారటం జరగదు ఏ నూటికో కోటికో ఒకరు తప్ప

   వాస్తవం ఇలాగే ముగుస్తుంది

   పెళ్లయిన ఏ మగవాడూ, కుటుంబాన్ని రిస్క్ చేయడు . ఆడవాళ్లే మెలకువ గా తెలివి గా ఉండాలి

 • చెట్టుతో కథ చెప్పించటం వైవిధ్యంగా ఉంది. ఈ కథను మరో విధంగా రాస్తే ఇంత శక్తిమంతంగా వచ్చి ఉండేది కాదేమో… పూర్ణమ్మ పశ్చాత్తాపం బాగుంది. ఇక ముగింపు
  అలా ఉండటమే వాస్తవం.!

  పల్నాటి నుడికారం మిరప కారంలా చెలరేగి…
  కథనంతా వేరే స్థాయిలో నిలబెట్టింది!

 • చింత చెట్టు కథ చెప్పడం ఎంత బాగుందో ,పూర్ణమ్మ పశ్చాత్తాపం పడడం అంతే సహజంగా వుంది . ఇక్కడ పుష్ప పూర్ణ కూడా బాధితులే .నాగరాజులాంటి వారు కోకొల్లలు .వాళ్లకు మారే అవసరం కనపడదు. మంచి కథనం సుజాతా.👍

  • అవును కల్యాణి గారూ, వీళ్లు అమాయకంగా నమ్మినంత కాలం నాగరాజు లకు మారే అవసరం కనబడదు

   పూర్ణ. పుష్ప ఇద్దరూ బాధితులే. కానీ పూర్ణకి లోకం ఆమోద ముద్ర ఉంది
   పుష్ప మీద పడిన రాళ్లు పూర్ణ మీద పడవు

 • చాలా మంచి కథను అందించారు. ఎంతసేపూ నష్టపోయేది ఆడదె. వాడు మగమహారాజునని బాగానే ఉంటాడు. బాధనిపించింది. నిజమే మీరు చెప్పినట్లు వెధవబుద్దికి మార్పు ఏది. కథలో చూపవచ్చునేమో. నిజ జీవితంలో మారని మనిషి. చెప్పిన తీరు చాలా బాగుంది.

 • తనని నానా తన్నులూ తన్నిన బతుకుని చివరగా సాచి పెట్టి తన్నింది పుష్ప…..wow

  • శ్రీరామ్ గారూ,
   అవును, తన్నుల్ని తట్టుకునే శక్తి అయి పోయాక తిరగబడటమో, ముగించటమో ఎన్నుకోవాలి కదా
   పుష్ప కి తిరగబడే శక్తి, దన్ను లేవు

   అందుకే సాచి పెట్టి తన్ని ముగించింది

   థాంక్ యూ

 • పుష్ప కధ చాలా కదిలించేలా రాశారు . మీరు రాసినట్టు “తనని నానా తన్నులూ తన్నిన బతుకుని చివరగా సాచి పెట్టి తన్నింది పుష్ప”

  • సుబ్రహ్మణ్యం గారూ
   శ్రీరామ్ వేలమూరి గారు అన్నారు ఆ మాట. కానీ కరెక్టైన మాట కదా

   కథ నచ్చినందుకు థాంక్ యూ అండీ

 • చింతచెట్టు సాక్షిగా ఛిద్రమైన బతుకు… అంతులేని కథ కదిలించింది. కథనం కూడా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు