చలం అంటే నిజంగా ఈ కథే!

అతనిలో ఆమె పట్ల కామాన్ని మించిన భావమేదో కలిగింది. అంటే స్త్రీ నిబద్ధత, ప్రేమలోంచి పొంగిన సేవాభావన ఆమెకు వింత సౌందర్యాన్ని తెచ్చి, అవి పురుషుడిలో తృష్ణను మించిన ప్రేమభావనను కలిగిస్తాయని చలమే సాక్షాత్తూ ఈ కథలో చెప్తాడు.

కథ నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలని ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చదివినా కొత్తగా ఉంటుంది. ఇంతేనా! ఇంతేకాదు, ఇది నాకు ఇష్టమని ఓ పత్రిక ద్వారా చెప్తే ఎప్పటికీ దూరం కాలేని మిత్రుల్ని సంపాదించిపెట్టింది.

ఇష్టమైన కథ గురించి కాదు కదా నేను ఇక్కడ చెప్పాలనుకున్నది?!!

నిజమే. ఇది నన్ను ఎంతో ప్రభావితం చేసింది కూడా.  అందరిలాగే నేనూ ఒకప్పుడు ఆడవాళ్ళ మంచిచెడుల విషయంలో చెడ్డ కళ్ళజోడు పెట్టుకునే ఉన్నాను. చెడ్డ అంటే దుమ్ముకొట్టుకుపోయిన అద్దాలతో ఉన్నది.

అప్పుడెప్పుడో చిన్నప్పుడు, చలంగారు తెలియకముందు భవభూతి అనే సంస్కృత నాటక కవి ‘‘యధా స్త్రీణాం తధా వాచాం సాధుత్వే దుర్జనో జనః’’ అంటే తెలుగు అర్థం తెలిసిందే కాని ఆయన చెప్పిన లోకదృష్టి పూర్తిగా తెలియలేదు.

చలంగారిని చదివేదాకా తెలియలేదు. ఒకటీ ఒకటీ ఒకటీ చదువుతూ అలా ‘ఆమె త్యాగంకథ దగ్గరికి వచ్చేటప్పటికి భవభూతి ఆవేదన అర్థమయింది.

అవును. ఆయన చెప్పినట్టే స్త్రీల సాధుత్వ నిర్ణయ విషయంలో ప్రజలు దుర్జనులే. సాధుత్వం అంటే స్త్రీల విషయంలో శీలమే. ఆ ఒక్కటే. అంటే శరీరానికి సంబంధించిన లైంగికపరమైన సంబంధం మీదుగానే ఆమె సమస్త సజ్జనత్వాన్నీ నిర్ణయిస్తుంది లోకం. ఇలా నిర్ణయించడం దుర్జన లక్షణం అన్నాడు కవి భవభూతి.ప్రజలు ఈ విషయం లో దుర్మార్గం గా ఉంటారు అంటాడు.

మరింత వివరంగా తనదైన తిరుగుబాటు ధోరణిలో ఇదే విషయాన్ని  చలం గారు ఆమె త్యాగం కథ గా రాశారు. ఇస్మాయిల్ గారు చెప్పినట్టు కుంచె తో సప్తవర్ణాలు తీర్చుతూ రాసారు చలంగారు ఆ కథ. (ఆయన శైలి కుంచె, కత్తి, తుఫాను).

నూట ఎనిమిది కథలు రాసిన చలంగారి కథల్లో అందరూ ‘ఓ పువ్వు పూసింది’ తప్ప మరోదాని పేరే చెప్పరు. ఇందులో చాలామంది కనీసం ఆ కథ కూడా చదివి ఉండరని నా గట్టి నమ్మకం. చలం అనగానే వెంటనే ఆ కథ చదివిన కొందరు ఆ పేరు అలవాటు చేసేరు కనక అలవాటు కొద్దీ చిలకల్లా పలికేస్తారనుకుంటాను మిగతావాళ్ళు. చలంగారే కాదు, చాలామంది గొప్ప కథారచయితలకి ఇదే గౌరవం ఇస్తాం. పద్మరాజు గారంటే గాలివాన కథే.

కానీ ఆమె త్యాగం కథ ఒక్కటి చదివినా చాలు చలం మనని ఎంతటి ఉన్నత శిఖరాల మీదకి అలవోకగా ఎక్కిస్తాడో తెలుసుకోడానికి. అంతటి హృదయ సంస్కారాన్ని అలదుతాడు.

“ఇలాంటి స్త్రీలు నీకెక్కడ కనిపిస్తారు? మాకు కనిపించరేం? “అని మిత్రుడొకరు అడిగితే చలం అంటారూ – “మన చుట్టూ ఉంటారు. మనం గమనించం గానీ -” అని.

అలా చుట్టూ ఉన్న సమాజం నుంచీ ఆమె త్యాగంలో ‘ఆమె’ లాంటివారిని గుర్తుపట్టగలిగే చూపును నాకు కూడా ఎంతో కొంత ఆ కథ, మరిన్ని ఆయనే రాసిన చిన్నా పెద్దా కథలూ, ఆయన మైక్రోస్కోపిక్ ఆలోచనలూ   ఇచ్చాయనుకుంటాను.

కథలో ‘ఆమె’కు చలం పేరు పెట్టడు. ఒక అనామక స్త్రీ, దిక్కులేని కారణం వల్ల, పలువురు మగాళ్ళ వల్ల, తెలివితక్కువతనం లాంటి అమాయకత్వం కూడా కారణంగా వంచించబడిన స్త్రీ. ఇలా అనగానే ఆమె పట్ల వెంటనే మన దృష్టి మారిపోతుంది పతిత అని.

కానీ ఒక సాధారణమైన పురుషుడు ఆమెను ‘ఉంచుకున్న’ మిత్రుని క్షయవ్యాధికి వైద్యం చెయ్యడానికి వెళ్ళి మొదటిసారిగా ఆమెను చూసి ఇలా అనుకుంటాడు,

‘‘ఆమె వచ్చింది. తలెత్తి ఆమె వంక చూడగానే తెలిసింది నా అంతరాత్మకి, నా జీవితంలో శాశ్వతమైన పదచిహ్నాన్ని వదలగల ఒక గొప్ప నిమిషం తటస్థించిందని. ఆమెలో పెద్ద అందం లేదు. కానీ ఏదో శుభ్రం, పవిత్రత, పాతివ్రత్యం, శోభ ఆమెను ఆవరించి ఉంటాయి.’’

దీనికి కారణం చెప్తాడు.

“ప్రతి ఉదయం నేనా గుమ్మంలో కాలుపెట్టడంతోనే పారిజాత పువ్వుల వాసనా, వెన్నెల మెత్తదనమూ, ఆకాశపు విశాలత్వమూ తోచేట్టు ఆమె శాంతమైన చిరునవ్వు, కళ్ళలోని దయా నన్నావరించేవి.” శాంతమైన చిరునవ్వూ,  అనిర్వచనీయమైన దయా ఇవి ఆమెలోకి ఎలా వచ్చేయో తెలుసుకోడానికేనా రోజూ ఆ ఇంటికి వెడతాడు.

ఆమెతో సాహచర్యం చేస్తోన్న అతనిపేరు సీతారామయ్య. ధనం అంతా ఆమె మీద ప్రేమతో వెదజల్లి, బీదవాడై వైద్యానికి దిక్కులేని పరిస్థితిలో పడ్డాడు. ఆమె సేవే అతనికి ధనం.

ఆమె డాక్టరుమిత్రుడి సహాయం తీవ్రంగా నిరాకరిస్తుంది, ఫీజు ఇవ్వలేక. కానీ అతనికంత జబ్బుగా ఉన్నా కొంచెమైనా వేదన లేదు, ప్రేమ తప్ప. ‘‘ధీరత్వమా, అతనిపై నిజంగా ప్రేమా’’ ఇలాంటి చలంగారి మాటలు అర్థం కావు.

వేదన లేకపోవడం ఏమిటి అనిపిస్తుంది. ఏడుపుగొట్టుమొహం లేదనమాట, ప్రేమ తప్ప అంటాడు. అంతటి ప్రేమను అవగాహన చేసుకోవడం కష్టం డాక్టరు కి ఎంతో కొంత అర్ధమవుతుంది.

అందుకే ఊరిచివర సమాజం నుంచి వెలిపడి వారిద్దరూ ఉంటున్న ఆ అందమైన కుటీరం నుంచి కదిలి ఊళ్ళోకి వెళ్ళడం తలచుకుంటే డాక్టరుకి కణ్వాశ్రమం నుంచి దండకారణ్యంలో ప్రవేశించడంలా ఉండేదట.

పెద్దనగారు వరూధినిని చూసి ‘‘చూచి ఝళంఝళ త్కటక సూచితవేగ పదారవిందయై లేచి కుచంబులున్, తురుము, లేనడుము అల్లలనాడ’’ అని ఆమె నడకలోని చప్పుడు, వేగం, బరువయిన కదలికలు రాస్తాడు. వరూధిని గంధర్వ వేశ్య.

కులీన నాయిక గిరికను భట్టుమూర్తి ‘పదమెత్తన్ కలహంస లీల, అధర స్పందంబు సేయన్ శుభ్రాస్పదమౌ రాగకదంబకంబు’ అంటూ ఎడాపెడా రెండు మూడర్థాలతో వర్ణిస్తాడు.

చలంగారు కులీన, వేశ్యా కాని, సమాజ పురుష మృగవాంఛకు బలి అయిన స్త్రీ గురించి ఎంత గొప్పగా రాసాడో చూడండి- ఆమెను చూస్తే ‘‘మురికి కాల్వలూ, నల్లటి గోడలూ, ఎర్రటి దుమ్మూ, వీటిలోంచి హఠాత్తుగా గంధర్వ ద్వారం తెరుచుకుని శీతలచ్ఛాయలతో ఆహ్వానించే సుందరారణ్యంలోకి వెళ్ళినట్టుంది’’ట డాక్టర్ కి.

ఇంకా ఇలా అంటాడు

ఈమెలోని ఆకర్షణకు కారణం కనిపెట్టాలని వెతికాను. ఆమె కళ్లలో శాంతమైన సరస్సు లో ప్రతిఫలించే ఆకాశం కనపడ్డదో, దూరపు పర్వతాల నీలపు నునుపు, వానలు కడిగిన గాలి పరిమళం, ఆమె దేహకాంతిలో కరిగినట్లుందో గానీ….

ఇలా ఆమెలోని శాంత శుభ్ర సౌందర్యం అతని పైపైన పేరుకున్న కామాన్ని దులిపి ఆ ఆలోచనపట్ల అతనికే అసహ్యాన్ని కలిగించిందంటాడు.

కానీ ఆమెను చూచింది మొదలు ఒక్కవారంలో అతని జీవితం దుర్భరమయిందిట. ఎవరు డబ్బు చేతిలో పెట్టినా, ఎవరు కృతజ్ఞతతో నమస్కారాలు పెట్టినా వ్యర్థమనిపించిందట.

డబ్బుని, కీర్తిని తృణీకరించగలిగే భావానికి సంబంధించిన శక్తి ఏదో ఆమెతో గడిపే కాస్త సమయం వల్ల అతనికి లభించింది. ఆమె దర్శనమాత్రంచేతనే అప్రమేయానందం కలిగేదట.

కానీ ఉచితంగా ఆమె అతని సహాయం తీసుకోలేదు. వైద్యానికి తగిన పరిస్థితి లేక రావద్దంది. కానీ రోగి పరిస్థితి ముదిరిపోతూ ఉంది.

‘‘సుఖంగా భోజనం ముందు కూర్చున్నప్పుడు కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకున్న ఆమె శీలం జ్ఞాపకం వచ్చి, తిండి సహించేది కాదు. చీట్లపేకతో క్లబ్బులో కాఫీ తాగుతో కాలం గడిపే సమయాన రాత్రింబవళ్ళూ నిమిషం శాంతినెరక్క చాకిరీ చేసే ఆమె ధృఢత్వం జ్ఞాపకం వచ్చి, పేక పారేసి లేచేవాణ్ణి’’ అంటారు డాక్టరు.

చలం ఇలాంటి స్త్రీలను చూసాడు. ‘‘దినదినమూ, నిమిషనిమిషమూ మనోవాక్కాయ కర్మలమీద ఏ పత్రికలలోనూ పేర్లు పడని స్త్రీలు నిలిపే నిగ్రహం’’ ఆయన చూశాడు. చూసి ఇలాంటి కథలు రాసాడు. మనం కూడా చూడగలిగి ‘లోకమందలి మంచిచెడ్డలు’ గుర్తుపట్టగలిగితే బావుణ్ణని ఆయన ఆశ.

డాక్టరు ఎలాగో వైద్యానికి ఒప్పించాడు. లేకపోతే రోగి మరణానికి చేరువయిపోతున్నాడు.

స్త్రీ పరాయి పురుషుడి నుంచి సహాయం తీసుకోవడం ఆమెను ఎంతటి అధమావస్థలోకి ఈడుస్తుందో తెలిసిన ఆమె తన సహచరుడి ప్రాణం కోసం సహాయం నిరాకరించలేకపోతుంది.

ఎవ్వరినుంచీ ధర్మంగా గానీ, అధర్మంగా గానీ ఒక్క దమ్మిడీ స్వీకరించకూడదని ప్రతిన పూనిన ‘ఆమె’.

స్త్రీలోని సౌశీల్యం అంటే ఏమిటో స్పష్టంగా చూపుతాడు చలం ఈ కథలో. అలాంటి స్త్రీ ఎదుటి పరాయిమగవాడిలోని కాముకతను అతనే మరచిపోయేలా లేదా అసహ్యించుకునేలా చేయగలదంటాడు.

ఆమెను చూస్తూ ఉండడం వల్ల కలిగే అప్రమేయానందం ఆ డాక్టర్ కే ఆశ్చర్యం కలిగిస్తుంది.

అతనిలో ఆమె పట్ల కామాన్ని మించిన భావమేదో కలిగింది. అంటే స్త్రీ నిబద్ధత, ప్రేమలోంచి పొంగిన సేవాభావన ఆమెకు వింత సౌందర్యాన్ని తెచ్చి, అవి పురుషుడిలో తృష్ణను మించిన ప్రేమభావనను కలిగిస్తాయని చలమే సాక్షాత్తూ ఈ కథలో చెప్తాడు.

అయితే ఈ నిబద్ధత కానీ, సేవ కానీ ఆమెకు ఆ వ్యక్తి పట్ల కలిగిన ప్రేమ వల్ల, ఆమె యొక్క స్వేచ్ఛితం నుంచి రావాలి. బలవంతపు పాతివ్రత్యాలు వద్దనే ఆయన వాదన. అటువంటి ప్రేమ కు అర్హులుగా పురుషులు మారాలనే చలం గోలా, ఘోషానూ.

వైద్యం చేసి బిల్లు పంపుతాడు డాక్టరు. ఆ బిల్లుకి ఆమె చెల్లించగలిగేది ఆమె శరీరం తప్ప మరేమీ లేదు.  సిద్ధపడుతుంది.

శరీరం కాదు హృదయం కావాలంటాడు. అది పరాయత్తం అంటుంది. వేశ్యవలె దేహాన్ని అమ్ముతున్నారా అంటాడు. ఉచితంగా ఉపకారం పొందితే వేశ్యకన్నా అధమురాలినవుతానంటుంది.(ఇక్కడ వేశ్య అధమురాలని ఆయన ఉద్దేశం కాదు)

ఆమె ప్రవర్తన అతనిలో తెచ్చిన మార్పుతో కథ ముగిస్తారు. అతను ఆ బిల్లు విలువగా ఆమె చెంపలు మాత్రం తాకుతాడట. తాకి, ‘‘ఈ త్యాగానికై ఎంత రక్తం ఒలికి ఉంటుందో మీ హృదయంలోంచి నాకు తెలుసు’’ అంటాడు.

ఇలాంటి కథ చదివితే మనం కూడా అంత విశాలంగానూ మారతాం అనిపిస్తుంది.

ఏకాగ్రత, నిబద్ధత అన్నవాటికి చలం ఎంత గౌరవమిచ్చాడో, దానిచుట్టూ ఎంత శాంత సౌందర్యలోకాన్ని నిర్మించాడో గమనిస్తే అసలు చలం ఏం చెప్తున్నాడో తెలుస్తుంది.

అలాంటి ప్రేమ నుంచి ఆమె చెయ్యబోయిన త్యాగానికి – నాకు ఎప్పుడూ కళ్ళు తడుస్తాయి.

అలా తడిసిన కళ్ళు అలాంటి స్త్రీలను గుర్తుపట్టి గౌరవించడం, ప్రేమించడం నేర్పుతూనే ఉంటాయి.

*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చలం మీకు ఆత్మీయ బంధువు కాబోలు! కధ లోతును ఎంత తేటగా వ్యాసం చేసి మాకు అందించారు వీరలక్ష్మీ గారూ… మీ సాహితీదృష్టి మా చదువరుల హృదయాన్ని విశాలంగా చేస్తోంది…. ఇలా బోలెడు మీరు వ్రాయాలి … మేం చదవాలి..

  • ధన్యవాదశతాలు
    ఆమె త్యాగం కథ లింక్ ఇచ్చారు సారంగ వారు. చూడండి

    • థాంక్యూ వెరీమచ్

  • మోహం, ప్రేమల మధ్య అంతరాన్ని ఇంత అందంగా, సున్నితంగా, స్పష్టంగా చిత్రించడం చలానికి మాత్రమే సాధ్యమేమో.

    • థాంక్యూ వెరీమచ్ సీతారామయ్యగారూ
      చాలా కాలానికి మళ్లీ చలం గారి వల్ల పలకరించేరు మీరు

  • చలం గారి “ఆమె త్యాగం” కథను వీరలక్ష్మి గారు హ్రిదయాన్ని కదిలించి ఆ కథను చదివేలా చేసారు. ఆవిడ వదిన ఈ పంక్తులు నాకు బాగా నచ్చాయి – “అయితే ఈ నిబద్ధత కానీ, సేవ కానీ ఆమెకు ఆ వ్యక్తి పట్ల కలిగిన ప్రేమ వల్ల, ఆమె యొక్క స్వేచ్ఛితం నుంచి రావాలి. బలవంతపు పాతివ్రత్యాలు వద్దనే ఆయన వాదన. అటువంటి ప్రేమ కు అర్హులుగా పురుషులు మారాలనే చలం గోలా, ఘోషానూ.” అభినందనలు వీరలక్ష్మి గారూ.

  • ఒకప్పుడు చలం రచనలంటే…చదవ కూడనివి అనుకునేదాన్ని.(బహుశా పెద్దల అభిప్రాయం వల్ల కావొచ్చు).కానీ ఈ ముఖపుస్తకం పుణ్యమా అని ఆయనను అర్ధం చేసుకునే పరిణితి వచ్చింది..అంతే కాదు ఇలాంటి కథలు చదివాకా దుమ్ముకొట్టుకుపోయిన కళ్ళజోళ్లు,మనస్సును శుభ్రం చేసి మరీ లోకాన్ని చూడగలుగుతున్నాము . అభినందనలు మీకు????????????

  • ఆరాధనా భావము ఆకాశాన్ని అంటించారు చలం..ఈ కథలో…… ఎందరికి అర్థమవుతుందో..వాస్తవంలో సాద్యమో కాదో..I don’t like it..I admire it..Thank you madam….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు