చరిత్రకెక్కువ – పురాణానికి తక్కువ “సైరా”!

ఇదెలాగూ దేశభక్తి సీజన్ కదా! అందుకు అనుగుణంగానే భారత్ మాతాకీ జై వంటి నినాదాలు సొమ్ములు కురిపిస్తాయని ఆ సూత్రాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారు.

ఇప్పటి కర్నూల్, కడప జిల్లాలతో కూడిన ‘రేనాడు’ ప్రాంతంలోని దత్తమండలాల్లో ఒకటైన నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నాయకత్వంలో 19వ శతాబ్దపు నాలుగవ దశకంలో అప్పటి బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ప్రధానంగా పాలెగాళ్ళ హక్కుల కోసం చేసిన తిరుగుబాటు ఆధారంగా తీసినట్లుగా చెప్పుకుంటున్న సినిమా “సైరా”.  బ్రిటీష్ కంపెనీ పరిపాలకుల మీద చేసిన తిరుగుబాటు అన్నంత వరకు నిజమే కానీ అందులో వున్న ప్రజా స్వభావమెంత అనేదాని పట్ల భిన్నాభిప్రాయాలున్నాయి.  కంపెనీ గెజిట్ల ప్రకారం మిగతా దత్త మండలాల పాలెగాళ్ళను కలుపుకొని ఆయా ప్రాంతాలకు చెందిన కొద్ది వేలమందిని  నరసింహారెడ్డి కూడగట్టగలిగాడని విన్నాను.  కంపెనీ బలగాలు అత్యంత క్రూరంగా అణచివేసిన ఆ తిరుగుబాటుని పాలెగాళ్ళ హక్కుల కోసమే ప్రధానంగా జరిగిందనుకున్నప్పటికీ గొప్ప విషయంగానే భావించాలి.  అది బ్రిటన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా చూడొచ్చు.  ఈ కథని వున్నదున్నట్లు సత్య సంధతతో తీసినా మంచి వాణిజ్యాంశమే సినిమాకి.  కానీ జరిగిందేమిటి సినిమాటిక్ లిబర్టీ పేరుతో దర్శక రచయితల వెర్రి వేయి తలలు వేసింది.

సినిమా వ్యాపారమే కావొచ్చు కానీ వ్యాపారం కోసమే సినిమా అనుకుంటే కష్టమే.  ఎందుకంటే సినిమా మనిషిని ఊగించగల భావావేశ ప్రధానమైన దృశ్య మాధ్యమం.  మనిషిని రోమాంచితం చేయటం పెద్ద కష్టమైన విషయం కాదు.  డూపుల్ని పెట్టుకొని, రోప్ ట్రిక్కులతో, కెమెరా మాయజాలంతో హీ(జీ)రోలు చేసే ఫైట్లు విజిళ్ళేయిస్తాయి.  టీవీ సీరియళ్ళలో హీరోయిన్ కృత్రిమ కష్టాలు కన్నీళ్ళు తెప్పిస్తాయి.  ఏ విలువలతో, ఏ దృక్పథంతో, ఏ లక్ష్యంతో ప్రేక్షకుల్ని ప్రభావితం చేస్తామనేదే ముఖ్యం. అలా చూసినప్పుడు చిరంజీవి “సైరా” వ్యతిరిక్త భావోద్వేగాల్ని మాత్రమే కలిగించగల సినిమాగా భావించాల్సి వస్తుంది.  ఈ సినిమాకి ఒక 180 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఆధారం కాదు, ప్రేరణ కూడా కాదు.   అవి ఒక వంక మాత్రమే.  సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం అని ఎన్ని డిస్క్లెయిమర్లు ఇచ్చినా జరిగింది మాత్రం చరిత్ర పేరుతో బరితెగింపు వక్రీకరణలకి పూనుకోవటమే.  సినిమా వ్యాపారం కాబట్టి దానికి సామాజిక బాధ్యత వుండదు, చరిత్ర పేరుతో అసత్యాలు చూపించొచ్చు అనటం పెద్ద ఫ్రాడ్.  మంచికి చెడు, చెడుకి మంచి చేసే హక్కు ఏ వ్యాపారానికి వుండరాదు సినిమాతో సహా!

****

చరిత్రని సినిమాగా తీయటమంటే ఓ మేథొమథన వ్యవహారం నిజానికి. చరిత్రలో జరిగిన వీరోచిత పరిణామాలకి, ప్రజా విజయాలకి నాయకుల గొప్పదనమే కారణమని భావించటం నాసిరకపు చారిత్రిక దృక్పథం.  ప్రజల భాగస్వామ్యం లేని ఏ ఉద్యమాలూ నాయకుల వల్ల నడవవు.  అప్పటి సమాజ అవసరార్ధం కొద్దిగా నడిచినా పెద్దగా నిలవవు.  కొంచెం నిలిచినా ఎక్కువకాలం బతకవు.  అవి కాలగర్భంలో కలిసిపోతాయంతే.  చరిత్రలో ఏ నాయకుడూ ఊరకనే వినుతికెక్కడు.   తిరుగుబాటుకి ప్రజల కడగండ్లే ప్రధానమై, ప్రజల భాగస్వామ్యం ప్రముఖంగా వుండుంటే ఉయ్యాలవాడ అంత తేలిగ్గా విస్మరించబడే వాడు కాదు.   ఈ రోజున ఉయ్యాలవాడ గురించిన విస్మరణే  పరుచూరి బ్రదర్స్ కి సినిమాటిక్ విశృంఖలతని ఇచ్చింది.  ప్రజలేం పెయిడ్ ఆర్టిస్టులు కాదు ఉత్తి పుణ్యానికే నాయకుల్ని భుజానికెత్తుకోటానికి, చప్పట్లు కొట్టడానికి.  ప్రజలు తమ బాధల్ని, సమస్యల్ని పరిష్కరించుకోవటం కోసం, తమ జీవితాన్ని మెరుగు పరుచుకోటం కోసం, ఆత్మ గౌరవం కోసం, తమని దోపిడీ చేసేవారిని ఎదిరించటం కోసం, తమ సహజ లేదా చట్టబద్ధ హక్కుల్ని పొందటం కోసం ఉద్యమాలు చేస్తారు.  అదీ చరిత్ర.  అంతేకానీ చరిత్ర హీరోల కోసం రూపొందదు.  కానీ దురదృష్టమేమిటంటే భారతదేశంలో చరిత్ర పేరుతో తీసిన సినిమాలంటే వాస్తవానికి ఎక్కువగానూ, పురాణాలకి తక్కువగానూ వుంటాయి.  ఎక్కడో “మా భూమి” వంటి సినిమాలు మినహాయింపులుగా వుంటాయ్.

పైన చెప్పినట్లు “సైరా” సినిమా అంతా విపరీతమైన హీరోయిజం.  ఫ్యూడల్ కంపు.  అది ఫ్యూడల్ కాలమే కావొచ్చు.  ఆ కాలపు రాచరిక విలువల్ని గ్లోరిఫై చేయటం, అందుకు అనుగుణంగా రూపొందిన హీరో ఇమేజే పెద్ద ఫ్యూడల్ దుర్గంధం.   సినిమా కోసం కథా రచయితలు పరుచూరి బ్రదర్స్ కానీ, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా కానీ చేసిన పరిశోధన ఏమీ లేదు.  వాళ్ళు రేనాడు ప్రాంతానికి సంబంధించిన కొంత జాగ్రఫీని, పాలెగాళ్ళ పేర్లని మాత్రమే తీసుకున్నారు.  మిగతా కథంతా మరే ఇతర కమర్షియల్ సినిమా కోసం రాసుకున్నట్లే చిరంజీవి కోసమే అల్లుకున్నారు.  సినిమాలో అన్ని రకాల మామూలు కమర్షియల్ మసాలాలు వున్నాయి.   ప్రజలెక్కడా యుద్ధంలో పాల్గొనరు.   పోరాట సన్నివేశాలన్నీ రాం లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ తమ ధోరణిలో రోప్ ట్రిక్స్ తో చేసుకుపోయారు.  తేడా అల్లా ఇందులో సుమో వాహనాల్లేవ్.  (ఆ మాత్రం నిగ్రహాన్ని పాటించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి.)  ఒక దెబ్బకి నలుగురు మట్టి కరవటం, ఒంటి చేత్తో మనిషిని లాక్కెళ్ళటం, మోచేత్త్లో డొక్కల్లో కుమ్మటం వంటి సన్నివేశాలతో సినిమా హోరెత్తిపోయింది.  ఫ్రజా ఉద్యమ నాయకులు అంతె చిరంజీవిలా ఫైటింగులు చేసి తీరాలన్నట్లు తీసారు.   అదేం ప్రజలో మన తెలుగు సినిమాల్లో – అది బాహుబలి ఐనా, చత్రపతి ఐనా, సైరా ఐనా సరే అలా తమ కోసం ఫైటింగులు చేసే బాహుబలి వంటి నాయకుడు కోసం ఎదురు చూస్తూ వుంటారు.  ఈ సినిమాలో ప్రతి ఇంగ్లీషోడు భల్లాల దేవుడిలానే ప్రవర్తిస్తుంటాడు.

ఇదెలాగూ దేశభక్తి సీజన్ కదా!  అందుకు అనుగుణంగానే భారత్ మాతాకీ జై వంటి నినాదాలు సొమ్ములు కురిపిస్తాయని ఆ సూత్రాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారు.  1947కి ముందు, మరీ ముఖ్యంగా కంపెనీ పరిపాలన కాలంలో భారతదేశం ఎక్కడుందో కానీ చిరంజీవి మాత్రం “మా దేశం వదిలి వెళ్ళిపోండి” అని డీటీఎస్ లో గర్జిస్తాడు.  ఆ కాలంలో వున్నవన్నీ సంస్థానాలే.  అప్పుడు జరిగిన యుద్ధాలన్నీ బ్రిటీష్ ప్రభుత్వంతో సంస్థానాలకున్న పేచీల వల్లనే.  అందుకే వాటిలో ప్రజలకి పెద్దగా ప్రమేయం లేదు.  ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేసే సంస్థానాధీశుల్ని, కంపెనీ నుండి పింఛన్ల కోసం కక్కుర్తి పడే (ఉయ్యాలవాడతో సహా) పాలెగాళ్ళని దేశభక్తులనటం పెద్ద హిస్టారికల్ జోక్.   ఝాన్సీతో సహా బ్రిటీష్ వాళ్ళతో చేసిన యుద్ధాలన్నీ సింహాసనాల కోసం రోషంతో చేసినవే కానీ ప్రజల తరపున చేసినవి కావు.   వాటిని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన స్థానిక రాజుల తిరుగుబాట్లుగానే చూడాలి.  ఆ యుద్ధాల్లో ఇరువైపులా పాల్గొన్నది జీతాలకి పని చేసిన సైనికులే కానీ ప్రజలు కాదు.  రాజుల్ని, రాణుల్ని లేని దేశానికి భక్తులనటం అచారిత్రికం.  కాశ్మీర్, నైజాం మినహా మిగతా సంస్థానాల్ని వంద శాతం నిర్వీర్యం చేసిన అనంతరం  జూన్ 1, 1874న కంపెనీ నుండి పరిపాలనని బ్రిటీష్ ప్రభుత్వం లాగేసుకున్నాక, సంస్కరణాభిలాషులైన బ్రిటీషర్స్ ఆధ్వర్యంలోనే 1885లో కాంగ్రెస్ ఆవిర్భవించిన కొన్ని సంవత్సరాల తరువాతనే ప్రజలందరిలోనూ తామో దేశంగా ఐక్యంగా బతకాలని, తెల్లోడు నుండి అన్ని ప్రాంతాలకు స్వాతంత్ర్యం కావాలి అనే కాంక్ష ప్రబలింది.  ప్రజలతో పెద్దగా సంబంధం లేని సంస్థానాల తిరుగుబాట్లన్నీ స్వతంత్ర పోరాటాలనటం హాస్యాస్పదం.  ఇక్కడే మన తెలుగు వాళ్ళైన ఉయ్యాలవాడకి, అల్లూరికీ తేడా వుంది.   అల్లూరి సంస్థానాధీశుడు కాదు. ఆయనలో ఏ స్వార్ధమూ లేదు.  తెల్లవాళ్ళు భారతదేశాన్ని చేస్తున్న దోపిడీ పట్ల ఆయనలో ఆగ్రహం, అవగాహన రెండూ వున్నాయి. ఆయనకి తెల్లవాళ్ళని పారద్రోలాలంటే సాయిధ పోరాటం తప్పనిసరన్న బలమైన నమ్మకం వుంది.

మళ్ళీ సినిమాలోకి వద్దాం.  కార్తీక పౌర్ణమి రోజున ఓ కొండ మీద వున్న శివాలయంలో జ్యోతిని వెలిగించే సెంటిమెంట్ కోసం పోరాట రంగం వదిలేసి ఎంతో సినిమాటిగ్గా జ్యోతిని వెలిగించి బ్రిటీష్ సైన్యాలకి దొరికిపోయే వ్యక్తి ప్రజానాయకుడెట్లవుతాడు చిరంజీవి అనే హీరో కాకుండా?  ఉరికొయ్య మీద చిన్నప్పటి నుండి సాధన చేసుకున్న శ్వాస స్తంభన విద్య ప్రదర్శించి అచ్చు హీరోలానే సోమర్ సాల్ట్ కొట్టి ఫైటింగులు చేసేవాడు విప్లవకారుడెలా అవుతాడు చిరంజీవి అనే మెగా స్టార్ కాక?  (ఒక్కసారి ఆంథోనీ క్విన్ నటించిన “ఒమర్ ముక్తర్” సినిమాలో ఉరితీతతో ముగిసే క్లైమాక్స్ సన్నివేశం చూడండి.   నిజానికి నీడకి వున్న తేడా తెలుస్తుంది.  లింక్ ఇస్తున్నాను)

సినిమా మొత్తం హిందూత్వ పోటెత్తింది.  సినిమా మొదట్లోనే లండన్లోని బకింగ్ హం పాలెస్లో ఒక బ్రిటీష్ అధికారి మరొకరితో వేద ప్రాశస్త్యం కారణంగా భారతదేశం సిరిసంపదలతో ఎంతో తులతూగుతుందని, వేదాలు పచ్చగా ఉన్నంత కాలమూ వారిని తామేం చేయలేమనీ అంటాడు.  మొఘల్స్ తో సహా ముస్లీం పాలకులు ఎంత దోచుకున్నా ఇంకా తరగని సంపద వుందని కూడా అంటాడు.  ఇక్కడనే రాజ్యాలు ఏర్పరిచి, ఇక్కడే పరిపాలన చేసి, ఇక్కడే చచ్చిన మొగల్స్ ని కూడా తమ జాబితాలోకి చేర్చేసుకోవటంలో పెరుగుతున్న ముస్లీం వ్యతిరేక ఆరెస్సెస్ భావజాలవాదుల్ని మచ్చిక చేసుకోవటం కనిపిస్తుంది.  కథకి సంబంధం లేని, సినిమాలో ఏ విధంగానూ ప్రతిఫలించని విషయంతో మొదలుపెట్టడం భావదారిద్ర్యానికి అదనంగా తగులుకున్న నీచత్వం.

సినిమా మొత్తం ధారాళంగా డబ్బులు వెదజల్లటం కనబడుతుంది.  బాహుబలి కన్నా రిచ్ గా వుంది సినిమా మొత్తం.  ఇంక నటుల నటన విషయానికొస్తే చిరంజీవి నుండి అమితాబ్ వరకు అందరి నటన మహా కృతకంగా వుంది వారికేసిన మేకప్ లానే.  చిన్న పాత్రలు అయినా ఒక్క సాయిచంద్, రోహిణిలు మాత్రమే గొప్ప నటనని అందించారు.  వాళ్ళిద్దరూ సహజ నటులు కనుక జీవించగలిగారు.  ముఖ్యంగా సాయిచంద్ నటన మర్చిపోలేం.  ఈ సినిమాని చివరి వరకు భరించగలిగానంటే అందుకు కారణం చాయాగ్రహణ బృందం, కళా బృందం యొక్క అద్భుతమైన పని తీరు మాత్రమే.

ఇది చిరంజీవిచే, చిరంజీవి యొక్క, చిరంజీవి కోసం తీసిన సినిమా.

*

అరణ్య కృష్ణ

12 comments

Leave a Reply to ramana rao Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • తెలుగు సినిమా ఏనాడూ సమాజాన్ని చూపలేదు.
  చూప’లేదు’ (…it cannot …) అనే మరో రంగు బొమ్మ… వదిలేద్దాం అండీ….

  • కనీసం క్షీణతనైనా అపలేమా అన్న అలిచాన!

 • చిరంజీవికోసం తీసిన సినిమా, కాబట్టే అంతగా ఖర్చు పెట్టిన సినిమా ను,అందరు చూస్తున్నారు. కధనం బాగుంది కాబట్టి అందరు చూస్తున్నారు..చిరు నటన కోసం.!

  • అందరూ ఎందుకు చూస్తున్నారు అని ప్రజల్ని మనం ఏమీ ప్రశ్నించం. ఏం చూపించైనా, ఎలాగైనా జనాల్ని థియేటర్ కి రప్పించి సొమ్ములు చేసుకుందామన్న ఆలోచనని ప్రశ్నిద్దాం.

 • ఇక్కడ రాయడం ఇది నాకు మొదటిసారి 🙂

  కృష్ణ గారు, మీ ఈ సమీక్ష తో నేను ఏకీభవిస్తున్నాను. ఇందులోని మీ అభిప్రాయాలు లేదా విమర్శ, జీవిత చరిత్రలు లేదా వాస్తవాలు ఆధారంగా చేసిన సినిమాలన్నింటికీ అన్వయించుకోవచ్చు.

  సుమారు మూడు నెలల క్రితం, ఒక సినిమా గురించి వేరొక site లో ఈ క్రింది comment చేశాను:

  These film-makers literally cash in on their viewers’ herd mentality and the ensuing vulnerability. The viewers become stuck in grooves filled with emotions, rather than rational thinking.

 • సినిమా పై సమీక్ష అద్భుతం. మీరు లేవనెత్తిన విషయాల్లో 100%నిజం ఉంది. చరిత్ర ని ఆధారంగా చేసుకొని తీసిన సినిమా లు చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు తర్కించు కోవాలి అలాకాకుండా ఏదైనా ప్రేక్షకుల పై రుద్దొచ్చు అనుకుంటే ఇలా దొరికి పోతారు.
  ఇప్పుడు సినిమా అంటే డబ్బు సంపాదించే మార్గం మాత్రమే. ఎథిక్స్ నోర్మ్స లేకుండా కొట్టుకు పోతున్నారు.
  ఏదిఏమైనా మీరు చివరిగా అందించిన సందేశం బాగుంది చిరంజీవి కోసమే ఇదంతా.
  Wonderful all-round analysis Aranya Krishna గారు.

 • పద్మ గారూ! సైరా సినిమాను జనం ఎందుకు చూస్తున్నారనేది మన ప్రశ్న కాదు. ఏ విలువలతో, వక్రీకరణలతో, భూకరింపులతో తీసారనేది మన ప్రశ్న.

 • good review…..it is not a history based…….only names of characters were used…….it is a folklore film of chiranjivi….but surprisingly,all big people are praising the film in press and in news channels includig u- tube…..we are living in a hypocritic society..we,the commeners, are being brain washed and also our thinking is conditioned

 • ఎలాతీస్తే కులాలవారిగా సామాన్యుని డబ్బుకొల్లగొట్టవచ్చొ ఆలోచించి తీసిన సినమా.సమాజం కోసంతీయాలనే ఆలోచనగలనిర్మాత ఎవరూ అనుకోలేదు.పేదవాళ్ళయిన వారి వారసులకోసం ఈసినిమా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు