చరణ్ పరిమి కథ -పొగ

కొత్త శీర్షిక ప్రారంభం!

“రాత్రి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అనుకుంటా, ఆ పొగ నన్ను వెంబడించింది” ర్యాక్‌లోని తుపాకీ తీసుకుంటూ అన్నాడు ఈశ్వర్. క్యాప్ అందిస్తూ అతనివైపు చూసింది స్పందన.

“ఏంటి అలా చూస్తున్నావ్? నమ్మడం లేదా? నిజమే. అది పొగ కూడా కాదు. మరేదో? నా మీదుగా వీచినప్పుడు చల్లగా తగిలింది. ఏదో జలదరింపు. కదలకుండా ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది”

“చేసినవి వెంటాడుతున్నాయి కాబోలు”

“నేనేం చేశాను, నీకు కోపం పోనట్టుంది. ఊర్లో పొలం కొని కౌలుకు ఇవ్వడం కన్నా, ఇక్కడ కారు కొనడం మోర్ డెవలప్మెంట్”

“డిసైడ్ అయ్యావుగా! కూల్. వీటికి నేను సమాధానం చెప్పలేను, మీ నాన్నగారిని అడగండి” లోనికి వెళ్లిపోయింది.

“పొలం గురించా.. పొగ గురించా” అరుపు పక్కింట్లోకి వినబడింది, ఆమెకి తప్ప. తనని అంతలా భయపెట్టింది ఆమెను కనీసం తొనకనివ్వలేదు. అసలు పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఏంటి? అతని ముక్కుపుటాలు అసహనాన్ని చిమ్ముతున్నాయి.

నాన్ననే అడుగుదామనేమో గోడ మీద ఫోటో చూశాడు. తెల్లటి కోర మీసాలతో నవ్వుతున్నాడాయన. తాను ఒకటి అడిగితే ఆయన పది అడుగుతాడు. ఆయన దగ్గర అన్నీ ప్రశ్నలే! ఓసారి జీవితానికి సార్థకత ఏంటి? అన్నాడు. ఈ వయసులో ఏం తెలుసు?

“పోనీ చేస్తున్న ఉద్యోగానికి?”

“దేశ సేవ” ధీమాగా అన్నాడు.

నిజానికి అతను పోలీస్ అయిన రోజు ఆయన మొహంలో చిత్రమైన నవ్వు. దీని సారమేమి సామీ అని బ్రహ్మంగారిని ఎవరైనా అడిగితే ఎలా నవ్వుతాడో అలా. గోడకి ఎడమ వైపు చిరిగిపోతున్న లెనిన్, కుడివైపు వెలిసిపోతున్న మాక్సిం గోర్కీ. చుట్టూ ఏదో మంచు అలుముకున్నట్టు ఉంటుంది దిగులుకి రూపంలా. నాన్న ఊర్లో ఓ మాదిరి నాయకుడు. ఆయన తనకు లాభం లేని పని ఎందుకు చేస్తాడో అర్థమయ్యేది కాదు. భావాలు ఏమోగానీ మీసాలు మాత్రం తండ్రిలానే తిప్పాడు ఈశ్వర్. సరైన ఒడ్డు, పొడుగు ఉంటాడు ఆయన లాగే. అది ఇద్దరికీ వాళ్ళ పనుల్లో పనికొచ్చిందనేది వాస్తవం. బతికున్నప్పుడు ఆయన నుంచి ఒక్క మెప్పూ పొందలేదు. ఎందుకో అతని వాలకం నచ్చేది కాదు.

బైటికొచ్చి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని డుగ్‌డుగ్‌మనిపించాడు. అదేంటో రోడ్డెక్కిన వెంటనే అతని గాగుల్స్‌లోకి దూరడానికి మేఘంలా దూసుకొస్తోంది పొగ. సర్ర్‌మని బ్రేకేశాడు. రోడ్డు మధ్యలో ఉఫ్ఫ్, ఉఫ్ఫ్ శబ్దాలు. అతని బ్రీత్ థెరపీ. భయం పోగొట్టుకోడానికి అదో టెక్నిక్. ఓహ్! ఊపిరి అందుతున్నట్టు ఉంది. ముందుకి కదిలాడు. స్టేషన్‌లోకి అడుగుపెట్టాక మళ్లీ ముసురు కమ్మింది. తన శరీరాన్ని తిరిగి ఇవ్వమని అడుగు తుందేమో ఆ ప్రాణం. పొగ.. పొగ. దట్టమైన పొగ.

ఎక్కడా క్షణం ఉండబుద్ధి కావట్లేదు. సమయానికి సాయంత్రం ప్రోగ్రాం గుర్తొచ్చినట్లు బైటపడ్డాడు. భార్యతో కార్ షోరూంలో తేలాడు.

“ఏ కలర్?” ఈశ్వర్

“నీ ఇష్టం” స్పందన

“నా ఇష్టం అయితే నిన్నెందుకు అడుగుతా!”

“ఓకే! రెడ్”

“రెడ్.. నాన్నగారికి ఆకుపచ్చ అంటే ఇష్టం, రెడ్ అంటే గౌరవం.”

ఆమె మౌనంగా ఉంది.

“యాష్ కలర్ ఓకే, చూద్దాం”

ఆమె తలఎత్తి చూసిన చూపు అతన్ని తాకలేదు. లేకుంటే టెస్ట్ డ్రైవ్ కోసం కార్‌లో కూర్చోడు.

‘ఏదీ ఏమీ కనపడదే’ పొగ చూరిన అద్దాలు నవ్వాయి.

“తర్వాత చేద్దాంలే టెస్ట్ డ్రైవ్” కీస్ ఇచ్చేశాడు.

“ఫర్వాలేదు. చెయ్యండి సార్” కార్ కొనరేమోనని పోరు పెట్టాడు సూపర్వైజర్.

“భయపడుతున్నావ్ కదూ, అది నీ ప్రాణం తీస్తుందని” భర్తకి మాత్రమే వినపడేలా అంది స్పందన.

జీవితంలో తొలిసారి బేలగా చూశాడు భార్య వైపు.

“యు అబ్సెస్డ్ అబౌట్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్, చెప్పు. పోతుంది. మీలో మీ నాన్నగారి ధైర్యం లేదు” తానూ ఊర్లో ఆయన్ని చూస్తూనే పెరిగింది మరి! అతను పోలీస్ కాకముందు ఆయన చేసింది అదే పని. జనం కోసం, హక్కుల కోసం, న్యాయం కోసం రోడ్డెక్కడం.

“ఇప్పుడిక రెస్టారెంట్ వద్దు, ఇంటికి పోదాం” ఆమె అసహనమో, అనునయమో!

“అంటే ఏంటి, నేను నాన్నలా ఆలోచించలేదనా! అలాగే చేస్తున్నా. కానీ మరో పద్ధతిలో పని చేస్తున్నా. అయినా నేనేం చేసినా నీ కోసమే కదా! ఈ కార్ కూడా” అతనిలో భావాల ముడి బిగిసింది. కొత్త కన్‌ఫ్యూజన్. తత్వం దేశం నుంచి వ్యక్తికి కుచించుకుపోయింది.

“కార్ ఎవరికోసమో యాష్ కలర్ చెబుతోంది లే” వెళ్లి బైక్ పక్కన చేతులు కట్టుకు నిలబడింది.

తప్పదన్నట్టు బైక్ తీశాడు. గాలికి రేగి ముఖానికి కొట్టుకున్నాయి.. కరపత్రాలు. వాటిని చూసేకదా మొన్న అతనికి అంత కోపం వచ్చింది. అద్దంలో నుంచి అతని కళ్ళలోని భయాన్ని, తప్పించుకోవాలన్న ఆత్రాన్నీ గమనిస్తోంది స్పందన.

“ఒకసారి ఊరికి వెళ్దాం, మనసులో అలజడి ఉంటే పోతుంది”

“హు, జనాన్ని పోగేసిన కరపత్రాలు. అల్లర్లు రెచ్చగొట్టిన కరపత్రాలు. రోడ్ బ్లాక్ వల్ల ఎంతో మంది అవసరాలు ఆగిపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఏం బాగుంటుంది?” భార్య వినాలనే గట్టిగా అన్నాడేమో! బైక్ టైర్ కరపత్రం వీపు పైన వాతలు వేస్తూ పోయింది. పొగ దాన్ని వెంబడిస్తూ పోతోంది.

**************

టక టక టక టక టైపింగ్ శబ్దం. ప్రతి అక్షరం నగ్నత్వాన్ని చూపిస్తుంది. దాన్ని దాచడమే ఆ ఎడిటర్ విద్వత్తు.

“ఏదో ఒక పథకమో, చట్టమో, జీవోనో, తీర్పో, మార్పో అల్లరి చిల్లర గుంపు రోడ్ల వెంట పరుగులు తీయడానికి, డాన్సులు చేయడానికి కారణమౌతుంది” హోదాకి తగిన స్థాయి చిరాకులో చీఫ్ ఎడిటర్.

“అలాగే రాయాలా సార్” టైపింగ్ ఆపి అమాయకత్వం నటించాడు సందీప్.

“హ..హ..హ..” సెన్స్ ఆఫ్ హ్యూమర్ నటించాడు ఎడిటర్. ఏమీ వినబడనట్టే ఉన్నారు మిగతా ఉద్యోగులు.

“ఏం రాద్దామనుకుంటున్నావ్?”

సందీప్ లోగొంతులో “నిన్న నేను పంటకు గిట్టుబాటు ధర ఇమ్మని ధర్నా చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. ఏడు క్యారియర్లు తీసుకెళ్ళాను. 15 మంది దాకా తినొచ్చు. ఒక్కరూ ముట్టుకోలేదు. తిండి పెట్టేది మేమా, నువ్వా అన్నారు, ఎవరో తెలుసా? మా అన్న, బాబాయ్, మా పక్కింటి మామ, వెనకింటి పెద్దయ్య, తాత. చేను మీద వీచే గాలి కోసం ఎదురుచూసే వాళ్ళంతా. ఇన్ని రోజులు వీళ్ళ గురించి నేను రాసిన రాతలు చెరపలేనివి అన్నారు. 72 గంటల కడుపు మాడాక కూడా దారికి రాలేదు” దిగులుగా అన్నాడు సందీప్.

“వాళ్ళు అమాయకులు, వాళ్ళకి మనమే రాతలతో తెలియజెప్పాలి. మీడియా ఈజ్ ఒపీనియన్ లీడర్స్. మనం జనంలోకి ఏది వదిలితే అదే నిజం. మన ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ చేయడమే.”

“ప్రాపగాండా. నిన్న, మొన్న రాసినదీ అదే. అమాయకులు అని, తెలీక అడుగుతున్నారనీ, ఇంకా ఏవేవో, ఇక చాలు, నన్ను వింగ్ మార్చేయండి” అతను ఎడిటర్‌తో అంత ధైర్యంగా మాట్లాడటం అదే మొదటిసారి. చూస్తే చివరిసారి కూడా అయ్యేలాగుంది.

“నీలాంటివాన్ని ఇంకొకరిని తయారు చేయడం డిఫికల్ట్. నిన్ను నువ్వు ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఇదే సరైన టైం. ఆ రోడ్డెక్కిన ముఠా మీద అద్భుతమైన కథనాలు వ్రాయి. లైక్ హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నిన్న ఏదో రాశావుగా, టైం లేక చూళ్ళేదు, చెప్పు”

“యా సార్, ఓ వైపు దీక్ష, మరో వైపు వాళ్ళకి ఆహారం అందిస్తున్న సామాజిక కార్యకర్తలు. కళ్లు లోపలికెళ్లి నీరసంగా ఉన్న ఒక సన్నకారు రైతు ఏమన్నాడో తెలుసా? జీవితాంతం ఈ ఉద్యమం సాగితే బాగుండు, నా బిడ్డకు మూడు పూటలా తిండి దొరుకుతుంది అన్నాడు. అప్పుడు ఆ కళ్లలో వివర్ణం పోయి మెరుపు మెరిసింది. దాంతో నేను తీసుకెళ్లిన తిండి నా వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకి పనికొచ్చింది.”

“ఇవి రాస్తే ఇక అంతే! అసలు వాళ్ళకి దేశభక్తి ఉంటే ఇలా చేయరు.”

“ఏంటి సార్? పైన ఉన్న పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. నన్నడిగితే దేశభక్తి అనేది ఒక ఫేక్ ఎక్స్‌ప్రెషన్. ప్రేమ, కోపం లాగా అది నాచురల్ కాదు”

“వాట్ డూ యూ మీన్?” ఎడిటర్ అదిరిపడటం మొదటిసారి చూసింది ఆ ఆఫీస్.

“ఐమీన్.. ఎమోషన్స్ సహజంగా పుడతాయి. ఎవరన్నా తప్పు చేస్తే కోపం, ప్రేమను కురిపిస్తే స్పందించడం. కానీ పేట్రియాటిజం అలా కాదే! దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం సైన్యం, పాలించడానికి అధికారులు, తిండి పెట్టడానికి రైతు, వీటన్నిటినీ చూసి వారిపట్ల కృతజ్ఞత ఉండాలన్న ఎరుకే దేశభక్తి. చిన్నగా జెండాలకి గీతాలకు స్పందించేలా ట్యూన్ చేయబడ్డాము, ఇప్పుడు మొదటిది పోయింది. అంతే.”

“అంటే దేశభక్తి ఉండక్కర్లేదా?”

“అలా నేను అనలేదు” మొదటిసారి ఎడిటర్ మొహంలో అయోమయం చూసి నవ్వుకున్నాడు లోలోపల.

“సో వాట్ నెక్స్ట్” టాపిక్‌ని ఎలా ఎండ్ చేయాలో అర్థం కాలేదు.

“ఈ రోజు కూడా క్యారియర్ తీసుకెళ్తా” ప్రకటించాడు.

“వాళ్లు తినకపోతే?”

“తింటారు” ధీమాగా వెళ్లిపోయాడు సందీప్. పజిల్డ్ మొహంతో డోర్ వైపు చూసాడు చీఫ్. రోగిలా ఊగుతుంది సందీప్ కూర్చునే కుర్చీ. అతను వదిలేసిన ఆర్టికల్ పూర్తి చేయడానికి ఎవరినో పిలిచాడు చీఫ్ ఎడిటర్.

********

స్టేషన్ ముందు పడ్డ కరపత్రాలన్నీ తీయించి లోనికి వెళ్లాడు ఈశ్వర్. ఎస్పీ కాల్, ఆయన ఎప్పటికప్పుడు విషయం కనుక్కుంటూనే ఉన్నాడు.

“ఆర్ యూ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్? అక్కడంతా బంద్ అయింది. ఎన్నో వాహనాలు ఆగిపోయాయి. ఎంతో మందికి అవసరాలు ఉంటాయి. వీళ్లకు బాధ్యత లేదు ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికే ఇలాంటివి జరుగుతుంటాయి, వీ షుడ్ బీ కేర్‌ఫుల్.”

టిపికల్ ఆఫీసర్‌లానే మాట్లాడాడు. ఆ మాటలకి నిమిష నిమిషానికి ఈశ్వర్ మెదడులో నీరు ఇంకిపోయి రాయిలా గడ్డకడుతోంది. పూర్తిగా కట్టిన తర్వాత మెదడు భ్రమించడం మొదలైంది. అంతే! రైతుల మీద పైపులతో తుఫాన్ పుట్టించాడు. అది పని చేయలేదు, రైతుల కళ్ళల్లో ఆకలి, ధైర్యం, ఆశ, ఖాకీల మీద జాలి అన్నీ కనబడుతున్నాయి.

పోలీసులు లాఠీలకు పని చెప్పారు. సందీప్ తెచ్చిన క్యారేజీలు బూట్ల కింద బంతుల్లా మారాయి. కాసేపు అన్న కోసం, మరి కాసేపు బాబాయ్ కోసం, ఇంకా సేపు తాత కోసం అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏం చేయడం కరెక్ట్ అనేది తెలియడం లేదు. గుంపులో ఉన్న బాబాయిని పట్టుకుని లాక్కు పోయాడు. కానీ తాత జాడ లేదు. చుట్టూ చూస్తే అల్లంత దూరాన కింద పడి ఉన్నాడు. లేచే ప్రయత్నం చేయట్లేదు. ఈశ్వర్ లాఠీ ఎత్తాడు. చేతులు వణికిపోయాయి. తాతవీ, సందీప్‌వీ కూడా. విషవాయువుని ఆహ్వానిస్తూ నోరు తెరిచాడు ముసలాయన. అతని చివరి ఊపిరి ఆ పొగలో పొగలా కలిసిపోయింది. శవాన్ని కొడుతున్న ఈశ్వర్ దేశభక్తి గేయాలు చూసి నిట్టూర్పు లాంటి నవ్వు సందీప్ మొహంలో. అప్పట్నుంచే ఎగసి వగచే పొగ పుట్టింది. ప్రశ్నలతో తరుముతోంది.

***************

భార్య వైపు చూసాడు ఈశ్వర్. గదిలో ఏదో అడగాలని వెంబడిస్తున్న పొగ. దాన్నే చూస్తూ ‘నావల్ల అతను చనిపోయాడా, కానీ చనిపోవాలని నేను కోరుకోలేదు. రోడ్డు మీద నిలబడి ఇష్టానికి అరుస్తున్నాడు. గట్టిగానే కొట్టాను. అతని తల పగిలింది, దెబ్బకు అందరూ భయపడ్డారు. అప్పుడు నేను కోరుకున్నదీ అదే. ఆ గాజు కళ్లలోనుండి ప్రాణం పోవడం నేను చూసాను. అది నేనే లాగేశానా?’ దాదాపు కుచించుకు పోయాడు. ఎవరినో ఒకరిని ఎక్స్‌క్యూజ్ అడిగి కడిగేసుకోవాలి అన్న ఆరాటం. స్పందన అతని భుజం మీద చెయ్యి వేసింది.

పావులు ఎంత జ్ఞానులైనా సొంతంగా నల్లగడి నుంచి తెల్లగడికి రావడం అసాధ్యం. ఎత్తు వేసే చేతుల్లో బొమ్మలు వాళ్ళు. ఆ చేతులని అడిగేది ఎవరు?

‘మనము వీళ్ళకి వత్తాసు పలికితే సివిల్ వార్ అయిపోదు. అంటే నేను పని చేస్తున్నది ప్రభుత్వం కోసం మాత్రమేనా? దేశం కోసం కాదా? ఇది మంచే అయితే మంచే జరగాలి కదా! ప్రాణం పోవడమేమిటి? ఇది నాన్న చూసి ఉంటే ఏమనేవాడు?’  తనలోపలి మనిషి అర్థం కాసాగాడు. చేతులతో మొహాన్ని దాచుకున్నాడు.

ఆమె మొహంలో చిన్న నవ్వు. గోడ మీద ఫోటో చూసింది. అక్కడా అదే నవ్వు. ఈశ్వర్ తన భావాలపై పొగ చూరి ఏ కన్‌క్లూజన్‌కి రాకుండా ఆ కన్‌ఫ్యూజన్‌లోనే శేషజీవితాన్ని గడిపేస్తున్నాడు.

*

కథల్లో వాక్యానికి చాలా బలం ఉంటుంది: చరణ్

* హాయ్ చరణ్! మీ పేరు చెప్పగానే ‘కేరాఫ్ బావర్చీ’ కథ గుర్తొస్తుంది. దాని నేపథ్యం ఏంటి?

హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఉంటూ సినిమా దర్శకత్వశాఖలో పని చేస్తున్న టైంలో చూసిన అనుభవాలే ఆ కథకు ప్రేరణ. అంతకు ముందు దాదాపు సంవత్సరన్నర పాటు కథ రాయలేదు. ఆ గ్యాప్ తర్వాత రాసిన ఈ కథ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమై పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల విడుదలైన కథాసాహితి వారి ‘కథ 2019’ పుస్తకంలో ఎంపికైంది.

* మీ కథల ప్రయాణం ఎలా మొదలైంది?

మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. చిన్నప్పటి నుంచి నాన్నమ్మ చెప్పే కథలు వినడం, అప్పుడప్పుడూ చేతికి దొరికే చందమామ, బాలమిత్ర మాసపత్రికల్లో కథలు చదవడం అలవాటు. బొమ్మలు గీయడం పైన ఆసక్తి ఉండేది. మా నాన్న కూడా బొమ్మలు వేసేవారు. ఆయనకు ఫొటో స్టూడియో ఉండటం వల్ల బొమ్మలు, రంగుల మీద నాకు ఆసక్తి బాగా పెరిగింది. నేను విన్న కథల్ని నాకు నచ్చినట్టు సొంతంగా రాసి నేనే బొమ్మలు​ గీసేవాణ్ని. కష్టమైన​ బొమ్మలైతే మా నాన్న చేత వేయించి వాటిని దాచుకునేవాణ్ని. నాగార్జున యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేశాక ‘తెలుగు వెలుగు’ మాసపత్రికలో ఆర్టిస్ట్‌గా చేరి, అనేక కథలు, ఫీచర్స్‌కి బొమ్మలు వేశాను. అక్కడ ఉండగానే 2017లో కథలు రాయడం మొదలుపెట్టాను. మొదట రాసిన కథ ‘శుద్ధి’. ప్రచురితమైంది మాత్రం ‘ప్రేమ పిలుపు’. ఇప్పటికి 12 కథలు రాశాను.

* కథారచన, చిత్రలేఖనం, దర్శకత్వశాఖలో పని.. అన్నింట్లోనూ ప్రవేశించారే?

కళకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం నాకిష్టం. పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీ చేశాను. బ్రాండింగ్ కంపెనీలో డిజైనర్‌గా పని చేశాను. ప్రస్తుతం దర్శకత్వశాఖలో పని చేస్తూ, ఫ్రీలాన్స‌ర్‌గా పత్రికల్లో బొమ్మలు వేస్తున్నాను.

* అనేక సాహిత్య ప్రక్రియల్లో కథారచననే ఎంచుకోవడానికి కారణం?

నేను చెప్పాలనుకున్న విషయాల్ని కథల ద్వారా బాగా చెప్పగలనన్న ఆలోచనతో రాయడం మొదలు పెట్టాను‌.

కథల్లో వాక్యానికి చాలా బలం ఉంటుంది. అనేక అంశాల్ని ప్రభావవంతంగా చెప్పొచ్చు. పీజీ చదివే టైంలో శ్రీశ్రీ గారి ప్రభావంతో​ కొన్ని కవితలు రాశాను. ఇప్పుడవి చూసుకుంటే చాలా ఇమ్మెచ్యూర్‌గా అనిపిస్తాయి.

* ఎలాంటి ఇతివృత్తంతో కథలు రాయడాన్ని ఇష్టపడతారు?

ప్రత్యేకించి ఇదీ అని లేదు. నేను చూసిన, నాకు రాయాలనిపించిన విషయాల్ని కథలుగా రాస్తాను. దళిత జీవితాల ఇతివృత్తంతో ‘శుద్ధి’, ‘బొంబాయి పొట్టేలు’ కథలు రాశాను. సినిమా రంగాన్ని నేపథ్యంగా తీసుకుని రాసినవి ‘కేరాఫ్ బావర్చీ’, ‘సినీడెజావు’. రకరకాల​ సామాజిక​ పరిస్థితులను నా కథల్లో చూపేందుకు ప్రయత్నిస్తుంటాను.

*

చరణ్ పరిమి

2 comments

Leave a Reply to చరణ్ పరిమి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ చాలా బాగుంది. మీ ఇంటర్వ్యూ కూడా.. ఇంకా మరెన్నో కథల రాసి, పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ… Wish you a happy new year 🎉🎊🎁💐 and All the best….

    • Thank you,
      మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు