చంద్రమ్మ

దుర్గ మొహం అప్పటికే వాచి పోయి ఉంది. ఇంకా ఏడుస్తోంది.
“అట్టంటే ఎట్టమ్మా? మావయ్యోళ్ళు కాబట్టి సిన్న దానివిలే తెలియక సేశావని ఊరుకున్నారు. అదే బైటోళ్ళయితే ఎంత గోలయిద్ది? అమ్మగదూ, మాటిను తల్లీ. కొత్తల్లో అట్టనే ఉంటది. రాను రాను అలవాటై పోయిద్ది”
తన మాటలు ఎవరైనా వింటున్నారేమో అని సిగ్గు పడి చుట్టూ చూసింది కృష్ణ వేణి
“నేను పోనమ్మో,సంపేత్తాడు నన్ను” ఒకటే మాట పొద్దున వచ్చినప్పటి నుంచీ బయట వరండాలో తండ్రి ఫోన్లో మాట్లాడుతున్నాడు
“అట్టనమాక బావా,సిన్న పిల్ల గదా, అట్టా కోపగిస్తే ఎట్ట? కిష్ణ వేణి మాట్టాడతంది లే. తొందర పెడితే ఎట్టయిద్ది?”
వరండా కింద కానుగ చెట్టు కింద మంచానికి నవారు బిగిస్తోంది సరోజిని

“ఇదిగో, ఆ ముండనాయాలు యోగ్గుడు, మహారాజు అదీ ఇదీ దాని గొంతు కోశారు. అయినా పదహారేళ్ళ పసి ముండ కి ఏ ఎదవ చేస్తాడు పెళ్ళి. సదువుకుంటుంది సదువుకోనీండి అని ఎంత సెవుతానే ఉండా నేను. ఇప్పుడు దాని జీవానికి బడి యాడవండి మీ నోళ్ళు బడా”
తల్లి నోరంటే ఎప్పుడూ గుండె దడే రాఘవులు కి .
“మా, నువ్వు బయట గూసోని అట్ట అరవగాకు, లోనకి రా”

“ఏందిరా లోనకొచ్చేది? అది పొలాలకడ్డం పడి పారిపోయొచ్చినప్పుడే అందరికీ తెలిసి పాయె. ఇంగా దాస్తావేంది? ఇదిగో, నా మాటిని దాన్ని కాపరానికి పంపిచ్చేది లేదని సెప్పు వాళ్లకి.”

“మ్మోవ్, నువ్వు లోనకి రా” లోపలి నుంచి అరిచింది కృష్ణ వేణి
తీక్షణంగా చూసింది సరోజిని. నవారు వదిలేసి నాలుగంగల్లో వరండా దాటి మధ్య గదిలోకి వచ్చింది
“ఏంది మొగుడూ పెళ్ళాలు లోనకి రా లోనకి రా అని గోల? మీరు చేసింది సిగ్గు పడే పని. నేను మాట్టాడేది గాదు. ఎంత నెత్తీ నోరు కొట్టుకోని సెప్పానా రోజు? ఆస్తొక్కటే గాదు చూసేది. పెళ్ళంటే ఆ పిల్లకి ఇష్టముండాలని ఎంత సెప్పాను? అసలు పదో క్లాసు పిల్లకి పెళ్ళెవుడయ్యా జేసేది ఈ కాలాన? నా బతుకంటే పదేళ్లకే బుగ్గి పాలైంది. నువ్వు ఇరవై దాటినాకనే పెళ్ళి చేసుకున్నావు గదే కిష్ణ వేణా? మరి నీ కూతురికి పదో క్లాసులో పెళ్ళేంది?”

కృష్ణవేణి ఏడుస్తూ అరిచింది “ఏదో నయానో బయానో చెప్పి దాన్ని పంపిద్దామనుకుంటే నువ్వు పడనిచ్చేతట్టుగా లేవే?  ఇంక ఇక్కణ్ణే పెట్టుకుందామా దాన్ని?”

“మహరాజు లాగా పెట్టుకుందాం. అది ఈడనుంచి ఆడికి పోయిన పిల్లే. మనకి బరువేం గాదు” దుర్గని దగ్గరికి తీసుకుంది.

ఈ మాటలేవీ వినకుండా ఎటో చూస్తూ కూచున్న దుర్గ నాయనమ్మ స్పర్శతో ఒక్కసారి ఉలిక్కి పడింది. మెత్తగా లావుగా, వెచ్చగా నాయనమ్మ. ఒక్కసారిగా నడుం చుట్టూ చేతులేసి కావిలించుకుంది
“నాయనమ్మా, నేను పోనే అక్కడికి, ఆడు నన్ను సంపేస్తాడు”
“పద, అన్నం తిందుగాని” లాక్కుపోయింది సరోజిని లోపలికి

స్కూలు నుంచి నడుచుకుంటూ చేను పక్కగా వస్తోంది దుర్గ. కంది చేను విరగ్గాసి ఉంది. గింజ ముదిరిన కంది కాయలు కోసి, యూనిఫాం షర్ట్ జేబులో నింపుకుంటుండగా,బలంగా చేలోకి లాగాయి రెండు చేతులు
భయంతో బిగుసుకు పోతూనే అరవబోయింది.
“సేయ్, అరవగాకు. నేనే” శివ ని చూసి మరీ హడలి పోయింది. ఇంకెవరైనా అయితే, రెండు తన్ని బయట పడేదే
శివ బావ తన కాబోయే మొగుడు. తన మీద సర్వ హక్కులూ ఉన్న వాడు
“నేనింటికి పోవాల. చానా వర్కుంది” విదిలించుకోబోయింది
“మ్మేయ్, ఇంగా మూణ్ణెల్లలో ఇంట్లో కూసోనుండాల నువ్వు. ఇంకా బడేందే నీకు?” మొరటు గా దుర్గ మీద పడి బుగ్గ కొరికాడు. కెవ్వుమంది దుర్గ నొప్పితో గిల గిల లాడుతూ
ఎర్రగా గాట్లు పడి రక్తపు చెమ్మ ఉబ్బరించింది బుగ్గ మీద

చేత్తో అద్దుకుంటే ఎర్రటి మరక అరచేతి మీద
దాన్ని చూడగానే ఇంకా ఏడుపొచ్చింది

“సచ్చినోడా” అంది ఏడుస్తూ

చెంప చెళ్ళు మంది . “దొంగముండా,మాటలు జాగర్త. మొగుణ్ణి పట్టుకోని ఎదవ మాటలు మాట్టాడబాక, ఇట్రా నువ్వసల. నువ్వు పెద్ద మడిసైన కాణ్ణించి సూస్తన్నా, దొరకనే దొరకవు” గబ గబా గుబురు చేలోకి ఈడ్చుకుపోయాడు

షర్ట్ నిండా చెత్త, దుమ్ము అంటుకుంటున్నాయి.వదిలించుకునే వదిలే పట్టు కాదు వాడిదని అర్థమైంది

“బావా, ఒదులు, నేనింటికి పోవాల” ఏడుస్తోంది

“పోదువులే, కాసేపే” కోపం అణిచి, నెమ్మదిగా చెప్పబోయాడు. మాట వినదేమో అని కంగారేసింది

“ఒద్దు” షర్ట్ మీద పడిన చేతిని తోసేసింది ఒణికి పోతూ

దుర్గ తిరస్కరిస్తుంటే శివ కి పంతం ఎక్కువైంది

సర్రున షర్ట్ చింపేస్తూ, దూరంగా ఉన్న కాపలా గదిలోకి లాక్కు పోయాడు.

దుర్గ కేకలు పెట్టినా, ఏడ్చినా, తన్నినా ఏమీ లాభం లేక పోయింది.

తుఫాన్ కి ధ్వంసమైన అరటి తోటలా కూలి పోయింది. స్కర్టంతా రక్తం. మొహాన గాట్లు.
మోకాళ్ళు దోక్కు పోయాయి.
మరి కాసేపటికి జీపు లో తెచ్చి ఇంటి దగ్గర దింపాడు శివ. కృష్ణవేణి వదిన చంద్రమ్మ జీపు దిగి దుర్గని ఇంట్లోకి నడిపించుకొచ్చింది

“అమ్మో, ఏమైందొదినా?” దుర్గ బట్టల మీద రక్తం చూసి హడలి పోయింది కృష్ణవేణి
చంద్రమ్మ గొంతు తగ్గించి “ఏం కాలేదే, పిల్ల బడి కాణ్ణించి వొస్తుంటే శివ కలిశాడంట. ఇద్దరూ కాసేపు కంది చేలోకి పోయారు. ఏం చేస్తాం? కుర్రోళ్ళు గదా, ఆపగలమా? పెళ్ళి కుదిరే పొయ్యింది కదాని సరదా పడ్డట్టున్నారు”

దుర్గని చూస్తూ ఆ మాటలు నిజమని ఎలా నమ్మడం?

“అయ్యో” దుర్గ ని గబ గబా లోపలికి తీసుకుపోయింది.
రెండిళ్ళ మధ్యా గొడవలు, తిట్లు, సీరియస్ చర్చలు నడిచాయి.
“కాబోయే పెళ్ళాం కదాని పిల్లాడు ముచ్చట పడ్డాడు” దగ్గరే నిలబడ్డారు చంద్రమ్మ ఇంట్లో అందరూ గట్టిగా
సరోజిని వూర్లో లేక పోవడంతో గొడవ తొందరగానే సద్దు మణిగింది.
దుర్గ కి జ్వరం పట్టుకుని నెల రోజుల దాకా తగ్గలేదు.డాక్టర్ నానా తిట్లూ తిట్టింది
సరోజిని వూరునుంచి వచ్చాక విషయం ఎంత దాచాలన్నా దాగలేదు. దుర్గ చెప్పేసింది. చిరుత పులల్లే లేచింది సరోజిని

ఆస్తుల కోసం పెళ్ళి చెయ్యడానికి వీల్లేదని, దుర్గ కి ఇష్టమైతేనే చెయ్యాలని గొడవ చేసింది. కానీ దుర్గ మీద శివ అఘాయిత్యం రాఘవులు, కృష్ణవేణి ల గొంతు నొక్కేసింది

“కట్టుకు పోయినంత ఆస్తి మా అన్నయ్యది. ఒక్కడే కొడుకు. నాల్రోజులు పోతే దుర్గ సర్దుకుంటుంది. సుఖ పడుతుంది” సర్ది చెప్పుకోడానికి ప్రయత్నించింది కృష్ణవేణి

దుర్గ ఎంత భయపడినా పెళ్ళి ఆగలేదు. జరిగే పోయింది

“కార్యం మా ఇంట్లో పెట్టుకుందాం వదినా” అని చంద్రమ్మ అడిగితే సరే అని ఒప్పుకున్నారు
దుర్గ పొలాలకు అడ్డం పడి పారి పోయి వచ్చింది ఆ రాత్రే
కార్యం గదిలోంచి పారి పోయి వచ్చిన కూతుర్ని ఏమనాలో అర్థం కాక ఏడ్చింది కృష్ణ వేణి.
“వాడు మడిసి గాదు, రాచ్చసుడు, కిరాతకుడు” దుర్గ ఒంటి మీద గాయాలు చూసి కేకలు పెట్టింది సరోజిని

బుగ్గల మీద గాట్లు, పెదవులు చిట్లి పోయాయి. నిలువెల్లా గాయాలతో వచ్చిన మనవరాలిని చూసి

ఏడుపు తప్ప మరో మాట లేదు దుర్గ నుంచి
“వాడు నాకొద్దు, నన్ను చంపేస్తాడు. నన్ను ఏదేదో చెయ్యమన్నాడు. అయ్యన్నీ నేను సెయ్యను. నాకసయం . చెయ్యనంటే బాల్ పెన్నుతో గుచ్చాడు” వీపు మీద పెన్ను దిగిన గుర్తులు

“కుర్రోళ్ళన్న తర్వాత అట్టాటి సరదాలుంటై. అయ్యన్నీ ఇట్ట రచ్చ చేసుకుంటారా ఎవురైనా? నోర్మూసుకోని రమ్మనండి. లేదంటే మీ పిల్లను మీ ఇంటి కాడే ఉంచుకోండి, అసలు మీ పిల్ల మాకొద్దనే ఒద్దు” తెగేసింది చంద్రమ్మ

“ఒదినా, చిన్న పిల్ల గదా, కాస్త సర్దుకోండి. ఎట్టనో సెప్పి పంపిత్తాగా’
“ఇదిగో కిష్ణవేణీ, ఇయ్యన్నీ గాదు, పెళ్ళి చేసేటప్పుడు చూడాల గదా సిన్న పిల్లో పెద్ద పిల్లో?ఇప్పుడు ఇట్ట జేస్తే ఎట్ట? శివా కి ఇంకో పెళ్ళి చెయ్యడం ఎంజేపు? ”
అన్న తో మాట్లాడాలని ప్రయత్నించింది కృష్ణ వేణి

“ఇయ్ అన్నా సెల్లెలూ  మాట్టాడుకునే ఇసయాలా?ఒక నాల్నెల్లు ఆగి వస్తదేమో సూడండి నువ్వూ మీ ఆయనా?”  రామచంద్రం విసుగ్గా అన్నాడు

ఆ రోజు దుర్గ పారిపోయి రావడం దాదాపు పొలం పనికి పోయిన వాళ్లంతా చూడనే చూశారు.

“రామారావు కొడుకు మామూలు మడిసి కాదమ్మో, ఆ పిల్లను నానా రకాల యదవ పన్లూ సెయ్యమంటాడంట. ఎంచేపూ ఆ ఫోన్లో బూతు సినిమాలు, అయి గూడా మన బాస గాదు, అయి జూస్తా వుంటాడంట.ఆ ఎదవ నా బట్ట ఆ మజ్జెన చాకిరేవు లో నాగమణి బట్టలుతుకుతా ఉంటే, “నాయి కూడా ఉతుకుతావా? అన్నాడంట. మన నామణి ఊరుకుండిద్దా? ‘రారా నా బట్టా, మళ్ళా ఎందుకు పనికి రాకుండా ఉతుకుతా దా’ అందంట” మిరపచేలో ఎండబోసిన కాయలు నెరుపుతూ రోజ్ మేరీ

“ఆ నాకొడుకు తోటి తిరిగే ఎదవలంతా అదే టైపు గద వొదినా? ఆ సుబ్బారావు బడ్డీ కొట్టు కాడ ఈ నా బట్టలంతా జేరి దారే బొయ్యే ఆడోళ్ళ గురించి ఇయ్యేగా కబుర్లూ? ఆళ్ల యవ్వారాలన్నీ వూరంతా దెల్చు. అయినా డబ్బు గలోళ్ళు గనక బైట పడి ఎవురూ ఏవీ అన్లేక పోతన్నారు. అయినా రాగవులు కేం రోగవమ్మా? చక్కదనాల సుక్క గదా దురగ? ఆ పిల్లని దెచ్చి ఈ ఎదవ పాల్జేసేది దేనికంట? ఆడు సిలకలూరి పేట్లో ఎవరునో ఉంచుకుంటే ఆ పిల్ల ఈడి నానా రచ్చా బరించలేక తన్నిపిచ్చిందంట. అన్నీ ఇపరీతాలేనంట ఈడు” పుష్ప మెటికలు విరుస్తూ

“ఎందుకేందే? డబ్బో? రామా రావు ఆస్తి ఎంతనుకుండావు? ఓయబ్బో, మొన్న నే ఒప్పిచర్ల కాడ ఇంగో పాతికెకరాలు కొన్నారంట ఉన్నయి సాలక. ఒక్కడే కొడుకు గదా, ఎంత ఎదవైనా? బయటోళ్ళకెందుకు పోవాల్లే ఆస్తి అనీ, రాగవులూ, కిష్ణవేణమ్మా ఆశపడ్డారట్టుగుంది లే” సీతారావమ్మ కొంగు అడ్డం పెట్టుకుని మిరప ఘాటుకి దగ్గుతూ

“అట్టాంటి ఎదవని కాళ్ల మజ్జెన తన్ని, గొంతు మీద కాలేసి తొక్కి పండబెట్టెయ్యాలి. థూ” సెలవులు గదాని పన్లోకి వచ్చిన కాలేజీ పిల్ల సరోజ ఆవేశం

“మేయ్, ఏందే పెద్దోళ్ల మజ్జెన జేరి పెద్ద మాటలు మాట్లాడతన్నావ్?” వాళ్లమ్మ కసురు
చంద్రమ్మ చెవుల్లో పడకుండా ఎట్లా ఉంటాయి?
కడిగి పారేసింది ఒక్కొక్కళ్ళని, చేను గట్టు మీద నిలబడి.

“అవునే ముండల్లారా, నా కొడుకు ఎదవే, బూతు సినిమాలు చూస్తాడు, ఎవురినైనా ఉంచుకుంటాడు. మీకేంది బాద  మజ్జెన? మిమ్మల్ని ఉంచుకోలేదనా? రాండి, వాడేందో చూపిత్తాడు. ఆడు బూతు సినిమాలు జూస్తే మీకేంది? ఎవుర్నో ఉంచుకుంటే మీకేంది? ఆవె తన్నిపిస్తే మీకేంది? మీ రచ్చ జూస్తుంటే ఆడికి మళ్ళీ పెళ్ళి కానిచ్చేతట్టు లేరే? ఇంకెక్కడా పిల్ల దొరక్కుండా జేసేతట్టుగుండారే?”

నోరెత్తారా ఒక్కరైనా? తలొంచుకోని తమని గాదన్నట్టు గమ్మునున్నారు.
ఊరంతా నానా రచ్చా అయింది.

“దానికి పజ్జెనిమిది వచ్చాకే కాపరానికి తెచ్చుకుంటా. ఇడిసి పెట్టే ఇసయమే లేదు”
శివ చిందులు తొక్కాడు.
సరోజిని అంతకంటే ఎక్కువ చిందులు తొక్కింది.”ఎట్ట తీసక పోతావో దా , నేనూ చూస్తా”
గుంటూర్లో ఉన్న తమ్ముడి దగ్గరికి పంపింది దుర్గని. అక్కడే కాలేజీలో చేరింది దుర్గ. ఎవరితోనూ కలవకుండా బెరుగ్గా కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండిపోయినా, కొన్నాళ్ళకి మనుషుల్లో పడింది

సెలవులకు ఇంటికి రావాలంటే భయపడేది. సెలవులు ఇవ్వగానే శివ వచ్చి ఇంటి ముందు కాపు కాసే వాడు
“పిల్ల రాదు కాపరానికి.నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వేరే పెళ్ళి చేసుకో పో” అని సరోజిని ఎన్ని సార్లు ఈసడించినా పోడు
“నాకేం కరమ  పట్టిందే అమ్మమ్మా ఏరే పెళ్ళి చేసుకునే దానికి. అదే నా పెళ్ళాం. పజ్జెనిమిది రాగానే కోర్టుకు పోయి తెచ్చుకుంటా దాన్ని. దాని పొగరేందో చూడాల”

“శానా చూశాం ఇట్టాంటి బెదిరింపులు, ఇంగ పో”

#########

“ఆ పిల్లోడికి మన దురగంటే చానా ఇష్టం. పిల్ల సంగతి అంతా తెల్లుసు వాళ్ళింట్లో. అది కూడా ఇష్ట పడింది. వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడాడు” తమ్ముడు చెప్తుంటే సరోజిని సంభ్రమంగా చూస్తూ కూచుంది

“మరి ఏం చేద్దాం? రాఘవ గాడు ఒప్పుకోడు. వాడు ఎట్టైనా దాన్ని శివ గాడి దగ్గరికే పంపాలంటున్నాడు. ఈ నా బట్ట కి పరువు పోయిద్దంట కూతురు కాపరానికి పోక పోతే”

“ఏం కాపరమే అది? ఎవురు సెప్పినా ఇనక చేసిన పెళ్ళి అది. పిల్ల మైనరు. ఎవురెంత అరిసి గీ పెట్టినా, సెల్లదు ఆ పెళ్ళి. రాఘవులుతో, కృష్ణవేణితో చెప్పాల మనం.

రామారావుతో మర్యాదగా మాట్టాడి, కాయితాలు రాయించుకుందాం. అసలు చెప్పకుండా సెయ్యద్దు. పెళ్ళి పెద్ద అడావుడి లేకుండా చేసేద్దాం అన్నారు వాళ్ళు గూడా

తమ్ముడు చెప్తోంటే కొంచెం గుబులు గా అనిపించింది

“పరవాలేదంటావా?’

“ఏం పర్లా. అయినా ఆడు ఎదవ అని తెలిసిన్నపుడు, పిల్ల సుకంగా ఉంటదని గారంటీ లేనపుడు, డబ్బేం చేసుకుంటామని ఆలోచన లేదు. మీ డబ్బు పిచ్చి తగల బడ”తమ్ముడు తిడుతుంటే హాయిగా అనిపించింది. కొంపలేం మునగలేదని ధైర్యం వచ్చింది

##########

“ఆ ముండ అట్ట చేస్తే నేను గాజులు తొడుక్కోని లేను సూస్తా కూసోడానికి” చేతిలో గ్లాసు నేలకేసి కొట్టాడు శివ
“నువ్వింకా బతికే ఉండావు, అది ముండ కాలా” కోపంగా అన్నాడు తండ్రి
“దానికి పజ్జెనిమిది నిండగానే నేను దెచ్చుకుంటా అని ముందే సెప్పాన్నేను. నేనేమీ ఇడాకులు ఇయ్యలా దానికి. అదింకా నా పెళ్ళామే. నాతో పడుకోదంట. కానీ దాని కాలేజీలో ఎవుడితోనో తిరుగుద్దంటే నేనెట్ట సూస్తా కూసుంటా? నరికి పారేస్తా ఇద్దరినీ. ఎవుడాడు అసలు గుంటూరు పోయి సూస్తా”

“రాఘవులు మావయ్యతో మాట్లాడదాం , నువ్వు తొందర పడమాక. దానికి పందొమ్మిది వొచ్చిన మాట నిజవే గానీ మనం కాస్త ఓర్పు తో ఉండాల. నువ్వేమైనా మామూలు మడిసివా? పిల్లను బెదరగొట్టేస్తివి గదా? అయినా నీ తిరుగుళ్ళకేం తక్కువ? అయ్యన్నీ జరుగుబాటుగానే ఉండై గదా”

“అయితే? నేను తిరుగుతున్నానా లేనా అనేది కాదిక్కడ. మొగుణ్ణి ఈడ బెట్టుకోని అది ఎవురితోనో తిరుగుతుంటే అది నాకు తల గొట్టి మొలేసినట్టు గాలా?  ఇదిగో ఈ ఫొటో జూడు. ఎంకట్రావోళ్ళ సురేషు పంపిచ్చాడు వాట్సప్ లో. అది వాడి బండెక్కి తిరుగుతుంది గుంటూరు లో”

“ఎంత పని చేసింది రా తిరుగుబోతు ముండ. అలాటి కుక్క ముట్టిన కుండ నీకెందుకు? దాని పాపాన అదే పోయిద్ది పోనీ. లోకమేం గొడ్డు బోయిందా?అట్టాటి పిల్ల మనకొద్దే ఒద్దు. అది కార్యం గది లో నుంచి పారి పోయిన్నాడే మన పరువు గంగలో కల్సింది. ఇంకా దాన్ని తెచ్చి కొంపలో పెట్టుకుంటామా? నువ్వసలు దాన్ని ఏలుకునే ప్రశ్నే లేదు.” మండి పడింది చంద్రమ్మ

ఆగ్రహంతో ముందుకు దూకింది బుల్లెట్

#######

“పిల్ల చాలా గాయపడి ఉందయ్యా. కాస్త నెమ్మదిగా చూసుకోవాల. నీకు సెప్పచ్చో లేదో నేను పెద్ద దాన్ని, ఆడు చానా బయపెట్టాడు దాన్ని. పెళ్ళంటేనే గుండె పగిలిన పిల్ల తేరుకోని పెళ్ళికి ఒప్పుకుందంటేనే మాకు పండగ. దాని పాత రోజుల నిండా రక్తం , బయం, నిండి పోయున్నై . ఇంతకంటే సెప్పలేనయ్యా, పిల్లని పువ్వు లాగ సూస్కో.నా ఆయుషు పోసుకోని…”

“వాడికి అన్నీ తెలుసు. మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరూ. మీరేం కంగారు పడొద్దు. అంతా బాగనే ఉంటది లెండి” పెళ్ళి కొడుకు తల్లి సరోజిని చెయ్యి పట్టుకుంది

“సెంద్రమ్మ నానా శాపనార్దాలు పెడతందమ్మా! ఇది కాపరం ఎట్ట సేస్తదో సూస్తా అని తిడతంది. ఏం జేస్తాం? అది తిట్టే తిట్లన్నీ ఇనలేక చెవులు మూసుకుంటన్నాం” కళ్ళు తుడుచుకుంటూ గేటు వైపు చూసిన సరోజిని బిగుసుకు పోయింది

ఎదురుగా చంద్రమ్మ, చేతిలో బాగు తో
తీవ్రమైన కోపంతో ఉన్నట్టు మొహం కఠినంగా ఉంది
“ఏదది?” అంది
“ఎవరూ?” లోపలి నుంచి వచ్చిన దుర్గ అత్తని చూసి ఆగి పోయింది.

చంద్రమ్మ మొహం దుర్గని చూస్తూనే ఎర్రబడి పోయింది. దగ్గరకు వచ్చి “తల్లీ” కావిలించుకుంది . సరోజిని ఒక్క క్షణం తెల్ల బోయినా, వెంటనే తేరుకుని చంద్రమ్మ చేతిని పట్టుకుంది

“ఇదిగో, తీసుకో,ఇందులో నగలున్నాయి. డబ్బులు కూడా పెట్టి తెచ్చాను. కోరుకున్నోడితో సుకంగా ఉండు” కళ్ళలో నీళ్ళు తోసుకొచ్చాయి. దుర్గ కళ్ళలో చేరుతున్న నీటి పొరను చూడలేదు చంద్రమ్మ

“నా జీవితం ఇట్టనే పదేనేళ్ళకే నాశనమై పోయింది. అదే ఇత్తనం గదా? రేత్తిరి అయితందంటే వొణికి వొణికి సచ్చే దాన్ని.  రక్తం కళ్ళ జూడకుండా చూడకుండా నిద్ర పొయ్యేవాడు కాదు. పిల్లలు ఎట్ట పుట్టినారో తెలవదు. సినిమాల్లో సూపిత్తారేం పేవ కు గుర్తులని, అయ్యేం లేవు. దెబ్బలతో సిగిరెట్ల వాతలతో నేను ఏడుస్తా ఉన్నపుడు కడుపులో బడ్డారేమో తెలవదు. నా ఇష్టం తో ఆ మడిసికి పన్లేదు. బయట జేరినా, కడుపుతో ఉన్నా వొదిలే వాడు కాదు. రెండో కానుపుకి అమ్మోళ్ళింటికి పోనియ్యలా. పచ్చి బాలింతగా ఉన్నా, కుట్లు పడ్డయ్యని సెప్పినా ఇన్లేదు. నరకం సూపిచ్చాడు. కుట్లు తెగి సీము పట్టి ఆస్పత్రిలో ఉండాను పది రోజులు. డాక్టరమ్మ బాగా తిట్టింది మీ మావని

అయినా లెక్క చేస్తాడా? నేనొక ఆడదాన్ని అంతే. నాకు ఇష్టమా కాదా ఎన్నడూ అడగలా. ఆడు నిద్ర పోటానికి అదుండాల అంతే. ఎవురికైనా పెళ్లి అయితందంటే ఏడుపొస్తదే నాకు. నిన్ను శివా కి ఇస్తామని మీ నాన అడగ్గానే గుండెల్లో రాయి పడిందే. వంద వొంకలు చెప్పాను. శివ గాడి సంగతి నాకు తెల్సు. అబ్బ లాంటోడే

వాడు పెట్టే బాదలు బరించలేక, చిలకలూరి పేటలో ఒక పిల్ల తన్నించింది ఈడిని. నిన్ను ఆ నరకంలో పడకుండా సూడాలని ఎంత తపన పడ్డా కుదర్లా. పడనే పడ్డావు.

ఆడదాని ఇష్టం తెలుసుకోకుండా కాపరం చేసే ప్రతి నా బట్టా మొగుడై పోతాడంటనే? పెతి రోజూ పెళ్ళాన్ని రేపు చేసే ఎదవ నా కొడుకు అవుతాడు గానీ. ఈళ్ళు బతికుండగా ఆడదంటే తెలుసుకోలేరు. నువ్వు కార్యం గది వొదిలి పారి పోయిన రోజు నాగేంద్రుడికి పుట్టలో పాలు పోశా, నాయనా ఇంగ ఆ పిల్లను ఈ కొంపకి రానీమాకు అని.

సదూకున్న పిల్లవి కాబట్టి పారిపోవాలనే దైర్నం వొచ్చింది నీకు.  నాకు తెలీలా అది. ఈనాటికీ ఈ నలబై రెండేళ్ళ వొయిసులో గూడ, నీ మావ చేతిలో రోజూ రేత్తిరేల వంద సావులు సస్తున్నా నేను”
దుర్గ ఫెటిల్లున దుఖంగా పగిలి పోయింది . చంద్రమ్మ గుండెల్లో దాగి పోయింది. సరోజిని చంద్రమ్మ భుజాల చుట్టూ చేతులేసి పట్టుకుంది

“సెంద్రా, ఎంత గొప్ప దానివే నువ్వూ, నువ్వు నోరు పట్టని తిట్లు తిడతంటే.. నేను” సంజాయిషీ ఇవ్వబోయింది

“నాకు తెలుసులే ఆమ్మా, వూరుకో, ఇంగేం సెప్పమాక, నేను అట్ట తిట్టక పోతే, దీని ఎనక నేను గూడ ఉన్నానంటారు ఇద్దరూ. దుర్గ మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా నా వొంతు నేను పంజేశా ”
దుర్గ వైపు తిరిగింది

“సరే, నేను పోవాల ఇంగ. పేటలో రమాదేవి ఆస్పత్రిలో సూపిచ్చుకునే దానికని చెప్పి వొచ్చా. కాదనకుండా తీసుకో ఈ నగలు. ఇయ్యన్నీ అడిగే తీరిక లేదులే వాళ్ళకి. పో తల్లీ, పోయి సంతోసంగా ఉండు”

చేతిలో బాగు దుర్గ చేతిలో పెట్టి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ గేటు వైపు నడిచి సందు మలుపు తిరిగి అదృశ్యమై పోయింది చంద్రమ్మ
*

సుజాత వేల్పూరి

14 comments

Leave a Reply to గిరి ప్రసాద్ చెల మల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)
 • మీకధల్లో ప్రధాన స్త్రీ పాత్రలు రాజీలేని వ్యక్తిత్వంతో జీవిస్తాయి. ఈ కధలో కూడా సరోజిని పాత్ర అటువంటిదే. కాకపోతే అనూహ్యంగా చంద్రమ్మ చివరికి నిలబడింది.

  • అనిల్ గారూ
   రాజీ లేని తత్వం, ఆత్మ గౌరవం పల్నాటి లక్షణం. ఎంత తప్పిద్దామన్నా పాత్ర అక్కడికే వచ్చి నిలబడుతుంది

   చంద్రమ్మ కాస్త తెలివి గా గొడవలకు పోకుండా నిలబడింది

 • చంద్రమ్మలు వుండాలనేది మన కోరిక. కానీ కావల్సినంత, వుండాల్సినంత కనపడరు.

  • ప్రసాద్ గారూ, అవునండీ, మనకి ఇలాటి చంద్రమ్మలు చాలా మంది కావాలి. ఎపుడూ కావాలి

   థాంక్ యూ

 • వేల్పూరు సుజాత గారు.. ముందుగా మీకు అభినందనలు. ఇంకా ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో
  అమ్మాయిల జీవితాలు ఇంత బీభత్సంగా కొనసాగుతున్నాయి అంటే ఆశ్చర్య పరుస్తోంది మీ కథనం.. ముగింపు చాలాబాగుంది. సారంగ సంపాదక వర్గానికి ధన్యవాదాలు.

  • ప్రేమ్ చంద్ గారూ

   అమ్మాయిల జీవితాలు చాలా చోట్ల ఇంతకంటే కూడా దుర్భరంగా ఉన్నాయి. ఈ కథ సుఖాంతమే. సమాజంలో కొన్ని చోట్ల వచ్చిన మార్పు మరి కొన్ని చోట్ల మొహం కూడా చూపదు

   థాంక్ యూ

 • బావుంది కథ కథనం శైలి

 • కథ బాగుంది.. నిజ జీవితంలో ఇలా సుఖాంతం జరిగితే బాగునే ఉంటుంది ఎవరికి అయిన జీవితం! ధన్య వాదాలు ma’am.. మంచి కథ రాసినందుకు.👍❤️

  • పద్మ గారూ, కథ నచ్చినందుకు ధన్యవాదాలు

 • చంద్రమ్మ చివరకు అలా నిలబడుతుందనుకోలేదు .ఏ దేశమేగినా ,ఎందు కాలిడినా ,స్త్రీల ,బడుగు జీవుల జీవితంలో పెద్ద తేడా లేదు .ఎన్నేళ్ళు కాపురం చేసినా రహస్యంగా సహాయం చేయాల్సిందే చంద్రమ్మైనా మరొకరైనా. .

  • ఎన్నేళ్ళు కాపురం చేసినా రహస్యంగా సహాయం చేయాల్సిందే… అవును కల్యాణి గారూ! బహిరంగం గా నోరు విప్పి (కాపురానికి ఎసరు పెట్టుకునే) ధైర్యం గా మాట్లాడే ఇంకా చాలా మందికి రాలేదు

   Thank you

 • కథకు చంద్రమ్మ అనే పేరు చూసినప్పుడే చంద్రమ్మది బలమైన పాత్రని అనుకున్నాను. చివరికి అదే నిజమైంది. యెంత బాగుందండి ఈ కథ. ఎంత చిత్రవధకు గురౌతున్నా, గుట్టుగా కాపురం చేసే చంద్రమ్మను చూపిస్తూనే, ఎదురు తిరిగి బాగుపడిన దుర్గనూ చూపించారు. Excellent narration👌👌 ఎక్కడా ఆపకుండా చదివించింది.

  • Thank you కిరణ్ విభావరి గారూ

   సిటీలలో మారిటల్ రేప్ గురించి ఇపుడిపుడే బహిరంగంగా మాట్లాడ గలుగుతున్నారు

   చంద్రమ్మ లాటి ఆడవాళ్లు తమ మీద జరుగుతున్న హింసను దురదృష్ట వశాత్తూ ఎవరికీ చెప్పుకోలేరు. చెప్పకున్నా “అది మామూలే “ అన్న సమాధానం ఎదురవుతుంది.

   దాని బారిన మరొకరు పడకూడదని మాత్రం కోరుకుంటూనే ఉంటారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు