గోధుమ రంగు ఊహ

క ఊహ ఉదయం నుండీ ఆరడి పెడుతోంది . ఆ ఊహ మొదటి సారి ఎప్పుడు కనుల ముందు తారాడిందో తెలియదు కానీ పదే పదే గుర్తుకు వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నది . రంగు రంగుల కలల ఊహలు కౌగిలించుకునే వయసు కాదు నాది . అందుకేనేమో ఆ ఊహ గోధుమ రంగులో ఉన్నది . నిజానికి అది గోధుమ రంగు కూడా కాకపోవచ్చు

ఒక సాయంత్రం మిత్రుడి తో కలసి వీథి చివర ఉన్న సంగం కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ అతడు చెపుతున్న మాటలు వింటూ , మధ్య మధ్య నా ఆలోచనల్లోకి జారిపోతూ , మళ్ళీ బయటకు వచ్చి మిత్రుడి మాటలు వింటున్నాను . అప్రయత్నంగా తాగిన ఇరానీ చాయ్ కప్పును బోర్లించి నల్లటి మార్బల్ బల్ల మీద పడిన కప్పు చివర మిగిలిన చాయ్ లో కొన్ని నీళ్లు చిలకరించాను . ఎరుపు రంగు లో ఉన్న చాయ్ నల్లటి నీళ్లు కలసి మరొక రంగులోకి మారిపోయింది . నల్లటి మార్బల్ మీద అక్షరాలా వివరించలేని రంగులో ఒక మరక . మార్బల్ వాసన , చాయ్ వాసనా మిత్రుడి వేదనల వాసన కలసి ఒక వింత సుగంధం ఎదో ఆ మరక నుండి సంగం కేఫ్ అంతటా వ్యాపిస్తున్నది . ఉదయం నుండీ నన్ను వేధిస్తున్న ఆ ఊహ ఈ మరక రంగు లోనే ఉంది . ఈ ఊహ మాత్రం ఎందుకో తెలియదు చావు వాసన వేస్తున్నది . నిజానికి నాకు చావు రంగు రుచి వాసన తెలియదు . కానీ ఈ వాసన చావు దే అని లోలోపల నుండి ఎవరో చెపుతున్నట్లు ఒక భావన . ఎవరి చావు అది ? ఎంత హృదయాన్ని మెలి తిప్పుకుంటున్నా ఆ చావు ఎవరిదో తెలియడం లేదు

ఒకప్పుడు నాకు కృష్ణమాచారి అని ఒక మిత్రుడు ఉండే వాడు . వాడు నేను కలసి ఐదవ తరగతి దాకా చదువుకున్నాము . చాలా చిన్న పల్లెటూరు అది . పేరేమో రాయపట్నం . రెండే రెండు బజార్లు . ఒకటి తూర్పు బజారు . మరొకటి పడమర బజారు . తూర్పు బజారు చివర ఒక వేణుగోపాల స్వామి వారి ఆలయం . ఆలయం నిండా తెల్ల గన్నేరు . పసుపుపచ్చ మందార చెట్లు . నాలుగొందల గజాల దూరం లో ఎప్పుడూ ఎడతెగక పారే మున్నేరు . గుడి పక్కనే మా బడి . మా బడి లో ఉదయం పూట ఇంటర్వెల్ ఇచ్చే సమయం వేణుగోపాల స్వామి వారికీ నివేదన చేసే సమయం ఒకటే . ఒక్కొక్క సారి మా స్కూల్ బెల్లు , స్వామివారి ఘంటానాదం పోటీ పడేవి . గుడిలోకి వెళితే శఠగోపా చార్యులవారు , మా కృష్ణమాచారి వాళ్ళ నాన్న గారు మాకు చక్రపొంగలి , దద్దోజనం ఆప్యాయంగా పెట్టేవారు . ఏ పూట అయినా శఠగోపాచార్యులవారు గుడిలోకి రాక పోతే కృష్ణమాచారి స్వామి వారికీ నైవేద్యం పెట్టె డ్యూటీ వేసుకునేవాడు . వాడు స్కూల్ కి రాలేదు అంటే ఆరోజు గుడిలో మాకు కావలసినంత చక్రపొంగలి దొరికేది . కృష్ణమాచారి అయితే గుడి కి రాని మా మిగతా స్నేహితులకు కూడా చక్రపొంగలి పంపేవాడు . ఇంటర్వెల్ అయిన తరువాత మాకు మూడో పిరియడు లెక్కల క్లాస్ ఉండేది . ఈ చక్రపొంగలి రుచిని ఆ లెక్కల చేదు మింగేసేది .

మూడున్నర కల్లా మా స్కూల్ అయిపోయేది . అప్పటి నుండీ అమ్మ కేకేసేవరకు మేమంతా ఆ గుడిలోనే ఆ తెల్లగన్నేరు , పసుపు పచ్చ మందార చెట్ల మధ్య ఆడుకునేవాళ్ళం . కృష్ణమాచారి ఒక జట్టుకు లీడర్ . వాడెప్పుడూ దుందుడుకుగా ఉండేవాడు . వాడికి వాళ్ళ నాన్న చేసే అర్చకత్వం నచ్చేది కాదు . వాడి ఊహలన్నీ చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉండేవి . మాకు ఊహకు అందేవి కావు . తిరునామాలు పెట్టుకోవడమంటే వాడికి పరమ చిరాకు . గుళ్లో ఉన్నంత సేపు నామాలు ఉంచుకుని స్కూల్ కి వచ్చేటప్పుడు వాటిని బలంగా తుడిపివేసుకునే వాడు . వాడికి వాడి పేరు చివరన ఉన్న చారి అనే పదం కూడా నచ్చేది కాదు . తన పుస్తకాలలో కృష్ణ ఎమ్ .బి .బి ఎస్ అని రాసుకునేవాడు . నిజానికి ఎమ్ .బి .బి ఎస్ అంటే ఏమిటో మాకు అప్పుడు తెలియదు .

ఎండాకాలం అయినా , వానాకాలం అయినా మా మున్నేరు ఎప్పుడూ నిండుగా ప్రవహించేది . ఒక్కళ్ళు ఆ మున్నేరు దాటడం కష్టం . అందుకే గుంపులు గుంపులు గా మున్నేరు దాటి పక్కనే ఉన్న మధిర పట్టణానికి వెళ్లేవారు మా ఊరి వాళ్ళు అంతా . మా కృష్ణమాచారికి ఆ నదిని ఈ చివర నుండి ఆ చివరకి ఒంటి చేత్తో ఈదాలని ఉండేది . ఎప్పుడో ఒకప్పుడు ఈ నదిని జయిస్తా అనేవాడు . నాకుమాత్రం మా వూరు పక్కన వంపు తిరిగిన మున్నేరు ఎటు వెళుతుందో తెలుసుకోవాలని మహా కోరికగా ఉండేది . ఎప్పుడో ఒక సారి ఈ మున్నేరు ఎక్కడ పుట్టింది , ఎక్కడకు వెళుతోంది , దీనికి అసలు అలుపు అనేది లేదా , ఎప్పుడూ అలా ప్రవహిస్తూనే ఉంటుందేం ? అని మా నాన్న ని అడిగితే అది చాలా దూరం వెళ్లి కృష్ణ్ణా నదిలో కలుస్తుంది అని చెప్పాడు . అప్పటి నుండి నాకు నదీ మూలం చూడాలని మహా కోరికగా ఉండేది . ఒక సారి రెండు రోజులు స్కూల్ కి సెలవులు వచ్చినప్పుడు కృష్ణమాచారికి చెప్పకుండా మున్నేటి మూలం కనుక్కోవాలని తీరం వెంట నడుచుకుంటూ పోయాను .చాలా దూరం వెళ్ళాను . బంగారు రంగులో ఉన్న ఇసుక సూర్యుడి కిరణాలూ పడి మెరుస్తుంటే చూస్తుంటే చూడాలి అనిపించింది . చీకటి పడే సరికి చాలా భయం వేసింది . తీరం వెంట ఉన్న సర్కార్ తుమ్మ చెట్లు చీకట్లో జడలు విరబోసుకున్న దయ్యంలా కనపడ్డాయి . వాటి మధ్య నుండి వచ్చే గాలి నన్ను ముందుకూ వెనక్కూ నెట్టుతోంది . ఒక్క సారిగా నీళ్లు నన్ను ముంచెత్తాయి . అమ్మా అన్నాను . కళ్ళు మూసుకు పోతున్నాయి . ఎవరిదో ఒక చేయి నన్ను ముందుకు నెట్టింది

కళ్ళు విప్పే సరికి సాలె వీరభద్రం కుప్పె మీద ఏవో కాయలు అరగదీస్తూ కనిపించాడు . అందరూ నావైపు చూస్తున్నా అందరి మొహం లోనూ ఎదో తెలియని బాధ కనిపించింది . మా ఊరి పెద్ద మార్నేడి సీతారామయ్య నా వంక చూసి “ఇక భయం లేదులే “అని తువ్వాలు దులిపి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు . తగ్గిన తరువాత మూడు రోజులకో , నాలుగు రోజులకో స్కూల్ కి వెళ్ళాను . ఆ రోజు ఎందుకో కృష్ణమాచారి స్కూల్ కి రాలేదు . ఆ తరువాత నాలుగు రోజులు కూడా కృష్ణమాచారి రాలేదు . ఆ తరువాత వారానికి వాళ్ళు రాయపట్నం విడిచి వెళ్లిపోయారు . ఆ తరువాత ఎప్పుడో మా అమ్మ చెప్పింది . ఆ రోజు మున్నేటి దగ్గర నన్ను బలంగా నెట్టిన చేయి శఠగోపాచార్యులదని ఆయన మున్నేటి వరదలో కొట్టుకుని వెళ్లి చనిపోయాడని . నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు . నావల్లే కృష్ణమాచారికి నాన్న లేకుండా పోయాడని నాకు చాలా భాధ కలిగింది . అందుకేనేమో కృష్ణమాచారి నాకు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు . ఆ తరువాత చాలా సార్లు నేను ఒంటరిగా పసుపుపచ్చ మందార చెట్టు కింద కూర్చుని కృష్ణమాచారి గురించి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను వేణుగోపాల స్వామి వారి గుడిలోనుండి తరువాత నా కెప్పుడూ ఘంటానాదం వినిపించలేదు

ఆ తరువాత మేము ఆ ఊరు విడిచి మరో వూరు వెళ్ళాము . చాలా సార్లు కృష్ణమాచారి గుర్తుకు వచ్చాడు కానీ వాడిని కలుసుకోవడం ఎలాగో తెలియక మౌనంగా ఉండిపోయాను . ఏ వైష్ణవ క్షేత్రం లో అయినా చక్రపొంగలి చూస్తే నాకు కృష్ణమాచారే గుర్తుకు వస్తుంటాడు . కృష్ణమాచారి గోధుమ రంగులో ఉంటాడు

అవునూ ? ఇప్పుడెందుకు కృష్ణమాచారి గుర్తుకు వచ్చాడు ?

ఇన్నాళ్లకు, నాలుగు దశాబ్దాల తరువాత , జీవన రంగస్థలం మీద యవనిక రాలఁబోతున్నప్పుడు ఇప్పుడెందుకు కృష్ణమాచారి గుర్తుకు వచ్చాడు . నా గోధుమ రంగు ఊహా పేరే కృష్ణమాచారా ? వాడిప్పుడు నల్లటి మార్బల్ మీద చావు వాసన వేస్తున్న ఇరానీ చాయ్ అస్తిత్వం లో దాగి ఉన్నాడా ?

ఏమిటీ గోధుమ రంగు ఊహ?

2

నల్ల జడ నాకు ఎప్పుడు పరిచయం అయిందో కచ్చితంగా చెప్పలేను . ఒకానొక ఊహ నా కళ్ళ ముందు తారాడుతుండగా నేను విస్మయ , విభ్రమ భయాందోళనలలో కొట్టుమిట్టాడుతూ బహుశా ఆమెను చూసి వుంటాను . అప్పుడు నా కళ్ళ ముందు ఆమె రూపం కాక కేవలం ఆమె జడ మాత్రమే కదలాడింది . అటు తిరిగి మాట్లాడుతూ ఉందనుకుంటాను . ఆమె మాట్లాడుతూ , మాట్లాడుతూ తల అటూ ఇటూ తిప్పినప్పుడల్లా మేఘాలమాటునుండి చందమామ కనిపించీ కనిపించనట్టుగా కనిపించి ఆరడి పెట్టినట్టుగా ఆమె ముఖ చంద్రోదయం జరిగింది నాకు . అప్పుడు నా వయసు బహుశా ఇరవైయ్ వుంటాయేమో . ఆమె కు పద్దెనిమిదో . పందొమ్మిదో ఉండి ఉండవచ్చు . ఆమెను చూడగానే ఒక మోహపు తెర ఏదో నా కళ్ళను అదాటున కమ్మేసింది . చిక్కటి చీకటి రాత్రి లాంటి ఆమె జడ భుజాల మీదుగా జారీ శ్రీశైలాన్ని చుట్టేసిన కృష్ణవేణిలా నడుమును చుట్టేసి మరింత కిందకు జారింది . ఆమె నల్లటి జడను చూసి “అబ్బ ! ఎంత పెద్ద జడో “అనుకుని ఈ అమ్మాయి పేరు ఏదైనా అయి ఉండవచ్చు కానీ నాకు మాత్రం “నల్ల జడ “.

ఆమె పేరు నిజం పేరు కూడా నల్ల జడే . అంటే కృష్ణవేణి . కృష్ణవేణి కి నా తరం అమ్మాయిలు అందరికి లాగే శ్రీదేవి అంటే ఇష్టం . నాకు మాత్రం శ్రీదేవి అంటే అస్సలు ఇష్టం లేదు . ఎందుకు లేదు అంటే నేను చెప్పలేను . ఒకళ్ళు నచ్చడానికి , నచ్చకపోవడానికి పెద్ద కారణాలు ఏవీ ఉండవలసిన అవసరం లేదు అనుకుంటాను . కృష్ణ వేణి కి శ్రీ దేవి ఎందుకు నచ్చింది అన్న ప్రశ్న వేసుకుని కృష్ణ వేణి కి లేని అందం , అభినయం శ్రీదేవికి ఉండటం వలన అనే జవాబు చెప్పుకున్నాను కానీ , కృష్ణ వేణి నీ కెందుకు నచ్చిందంటే నేను వెంటనే జవాబు చెప్పలేను . నచ్చింది అంతే

“కృష్ణ వేణి ఎందుకు నచ్చింది ? “అని నా మిత్రుడు ఒకడు ప్రశ్న వేస్తే నేను పై జవాబే చెప్పాను. కానీ వాడికి ఆ జవాబు నచ్చినట్టు లేదు . ఎందుకు ? ఎందుకు ? అని పదే , పదే నా మెదడు తినే వాడు . వాడికి జవాబు చెప్పడం కోసం నేను కృష్ణవేణి ని పరిశీలనగా చూశాను . అలా అనడం కంటే మొదటి సారి కృష్ణవేణిని ఒక స్త్రీ లా గుర్తించి మరీ చూశాను . ఆమె లో ఏ ప్రత్యేకతా లేదు . కానీ నాకు నచ్చింది . మిత్రుడికి జవాబు చెప్పడం కోసం “కృష్ణవేణి లో కృష్ణవేణి నచ్చింది “అన్నాను . వాడు అర్ధం కాక చూస్తుంటే కృష్ణవేణి అంటే నల్లటి జడ అని అర్ధం చెప్పి కృష్ణవేణి నా నల్లజడ అన్నాను . నల్ల అంటే తమిళం లో మంచి అని కదా అర్ధం అని వాడు అడిగి ఆ తరువాత ఎప్పుడు కృష్ణవేణి గురించి చెప్పవలసి వచ్చినా ” నీ నల్లజడ “అనేవాడు . కృష్ణవేణి అప్పటినుండీ నా నల్లజడ అయింది

ఒక రోజు నల్లజడ “నీ వన్నీ గోధుమ రంగు ఊహలు “అన్నది

“ఊహలకి కూడా రంగులు ఉంటాయా ?” అన్నాను నేను

“ఎందుకు వుండవు ? ఊహలకి రంగులు ఉంటాయి . రంగులకు ప్రాణం ఉంటుంది ” అన్నది నల్ల జడ

“మరి నీ ఊహలది ఏ రంగు ? “అన్నాను నేను

“నా ఊహలది ఆకుపచ్చ రంగు . ఆకు పచ్చ రంగు కి అందరినీ ప్రేమించే స్వభావం ఉంటుంది . ఈ ప్రపంచం లో ప్రాణం పోసే అని చరాచర వస్తువుల రంగు ఆకుపచ్చే . వరి చేల రంగు ఆకుపచ్చ . ఆక్సిజెన్ ఇచ్చే చెట్టు రంగు ఆకుపచ్చ . అడవి రంగు ఆకుపచ్చ “అన్నది

“మరి గోధుమ రంగు స్వభావం ఏమిటో చెప్పు “అన్నాను

“నీ ఊహలు గోధుమ రంగు ఊహలు అన్నాను కదా . వాటి స్వభావం ఏమిటో నువ్వే తెలుసుకో . అదేమైనా పెద్ద బ్రహ్మ విద్యా ?”అన్నది

ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది కానీ ఒక ప్రశ్న నన్ను చాలాకాలం వెంటాడింది . ” గోధుమ రంగు స్వభావం ఏమిటి “? అన్నదే ఆ ప్రశ్న . నా ఊహల రంగు గోధుమ వర్ణం అన్నది కదా అని నా ఊహలని తరచి తరచి చూడటం మొదలు పెట్టాను . వచ్చిన ప్రతి ఊహను పోస్టుమార్టం చేయడం మొదలుపెట్టాను . ఎన్నో ఊహలు అలా పోస్టుమార్టం అయ్యాయి కానీ గోధుమ రంగు స్వభావం ఎదో నేను కనిపెట్టలేక పోయాను

ఒకానొక అర్ధ వెన్నెల రాత్రి నాకు ఒక వింత ఊహ కలిగింది . అలా కళ్ళు మూసుకుని గోధుమ రంగు ను ఊహిస్తూ మౌనంగా ఉండిపోయాను . కళ్ళముందు ఎరుపు , నలుపు , నీలం , పసుపు ఇలా అన్ని రంగులు కనిపిస్తున్నాయి కానీ గోధుమ రంగు మాత్రం సాక్షత్కారం కావడం లేదు . చాలా సేపు “గోధుమ రంగూ ఒక్క సారి నన్ను కరుణించు ” అని వేడుకున్నాను . రంగు నన్ను అస్సలు పట్టించుకోలేదు

గోధుమ రంగు తో నా కుస్తీ కొనసాగుతున్న రోజులలోనే ఒక రోజు హఠాత్తుగా నల్లజడ కనిపించకుండా పోయింది . ఆమె ఎక్కడకు వెళ్లిందో ఎవరికీ తెలియదు . చాలా రోజులు ఆమె గురించి ఆమె కుటుంబం చాలా వెతికింది . నేనూ , నా మిత్ర బృందం కూడా చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసాము . పోలీస్ స్టేషన్ లో ఫైల్ అయిన కేసు ఫైళ్ల మధ్య అలాగే బందీ అయింది . అంగబలం , అర్ధ బలం ఉంటే హడావిడీ ఏమైనా చేసేవారేమో. కొన్నాళ్ల తరువాత కనిపించకుండా పోయిన అనేకానేక కేసులలో ఒక కేసుగా నల్లజడ కేసు కూడా కంచికి చేరింది

మరపులోకి నల్ల జడ పూర్తిగా వెళ్లిపోయిన సమయం లో ఒకరోజు నాకొక కవరు పోస్ట్ లో వచ్చింది . కవరు మీద అక్షరాలు ఎవరినో గుర్తు చేయడానికి ప్రయత్నం చేశాయి కానీ నా కైతే గుర్తు రాలేదు . కవరు విప్పి చూశాను . అందులో ఇలా ఉంది

“మై డియర్ జాన్ మిల్టన్ ! గోధుమ రంగు ఊహల స్వభావం ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా ?” అన్న ఒక్క వాక్యం మాత్రమే వుంది

ఒక సముద్రపు కెరటం బలంగా తాకినట్టు అయింది . నల్లజడ . ఎక్కడ ఉంది ? ఎలా ఉంది ? అనే ప్రశ్నకి బదులు గోధుమ రంగు ఊహ మళ్ళీ నన్ను వెంటాడటం మొదలు పెట్టింది

3

“మీరసలు మనిషేనా ? మీ కంటే ఆ జడపదార్ధం నయం . మీరు ఎవరి దుఖానికీ కదలరు . ఎదుటివాడి దుఃఖానికి మన కంట్లో నీళ్లు తిరిగితే కదా మనిషి అన్నపదానికి అర్ధం . ఆ పసిపాప నడిరోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంటే బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకుండా వస్తారా ? ”

కళ్యాణి వాక్ప్రవాహం అలా సాగిపోతూనే వున్నది

కళ్యాణి నా సహచరి . నేను ఎంతో ఇష్టపడి చేసుకున్న కళ్యాణి అనుక్షణం నాలో లోపాలే వెతుకుతుంది . ఆమెకు సామాజిక స్ప్రుహ ఎక్కువ . నా కసలు లేదు అని ఆమె అనుకుంటుంది . బాధ్యత గల పౌరుడిగా నేను చేయవలసిన పనులు అన్నీ నేను చేస్తాను . బకాయి లేకుండా పన్నులు కడతాను , ఆదాయపు పన్ను ఎగగొట్టను , ఎవరి స్వేచ్ఛను అయినా గౌరవిస్తాను . నేను ఇంకా ఏమి చేయాలి అని కళ్యాణి అనుకుంటుందో నాకు తెలియదు . ఒక వేళ తెలిసినా నేను నాలాగే వుంటాను తప్పిస్తే కళ్యాణి ఆశించినట్లు ఉండటానికి ప్రయత్నం చేయను . కల్యాణిని ఇలా ఉండమని నేను చెప్పను

ఇవాళ సాయంత్రం ఆఫిస్ నుండి వస్తున్నప్పుడు నాలుగు రోడ్ల కూడలి లో ఒక యాక్సిడెంట్ జరిగింది . పదేళ్ల కూడా వుంటాయో , ఉండవో ఒక పసిపాప ను , ట్రాఫిక్ సిగ్నల్ ఖాతరు చేయకుండా దూసుకుని వచ్చిన ఒక కారు గుద్దేసి ఆగకుండా వెళ్లి పోయింది . పాప రక్తపు మడుగులో గిల గిలా కొట్టుకుని అంబులెన్సు వచ్చేలోగానే తుది శ్వాస విడిచింది . దూసుకెళ్లిన కారు ఒక మంత్రిగారి కొడుకుదని అక్కడ ఉన్న అందరికీ తెలుసు . ఎవరూ ఎవరికీ రిపోర్ట్ చేయరు . నాకు తెలిసినంతవరకూ అక్కడ ఉన్న సి సి కెమెరాలు కూడా బహుశా సంఘటన జరగడానికి ఒక గంట ముందు నుండే పనిచేయడం మానేస్తాయి . జనం రెండు రోజులు మాట్లాడుకుని మరచిపోతారు

ఇప్పుడు కళ్యాణి నన్ను మనిషిని కాదు అంటున్నది ఈ విషయంలోనే . కారు నెంబర్ ఎందుకు నోట్ చేయలేదు ? పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇలా సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది . ఉదయం లేచినదగ్గరనుండీ కొన్ని వందల యాక్సిడెంట్స్ జరుగుతాయి . కొన్ని మనం ప్రత్యక్షం గా చూస్తాం . కొన్ని పరోక్షంగా వింటాం . అన్నిటికీ మనమెలా స్పందించగలం ? స్పందించాలి అంటుంది కళ్యాణి

ఎవరి జీవితం వారికొక ఫ్యూజియమా అగ్నిపర్వతం ఇక్కడ . ఎప్పుడు ఏ క్షణం ఎలా పగులుతుందో ఎవరికీ తెలియదు . ఈ తన్యత మనిషి అస్తిత్వానికే ఎసరు పెడుతున్నప్పుడు పక్కవాడిని ఇంకేమి పట్టించుకుంటాము ?

ఉన్నట్టు ఉండి ఒకరోజు కళ్యాణి “నీల మేఘ శ్యాముడిలా వుండేవాడివి . ఇప్పుడు నీ శరీరం ఏమిటి గోధుమ వర్ణం లోకి మారుతున్నది ? నాకు తెలియకుండా సబ్బు ఏదైనా మార్చావా ? ” అన్నది

నాకు ఒక్క క్షణం పాటు ఆమె ఏమన్నదీ అర్ధం కాలేదు . నా శరీరం గోధుమ వర్ణం లోకి మారడం ఏమిటి ? గబగబా లోపలి వెళ్లి నిలువుటద్దం లో నన్ను నేను పరీక్షించి చూసుకున్నాను . నేను మామూలు గానే వున్నాను . అయినా ఇప్పుడు శరీరం ఆంగ్ మారడం ఏమిటి ? నేనేమైనా శివాజీ సినిమా లో రజనీకాంత్ లా రకరకాల క్రీములు పూస్తున్నానా ? కళ్యాణి పిచ్చికాక పోతే .

ఆ తరువాత పది రోజులకు మళ్ళీ కళ్యాణి అలాగే అన్నది . “నువ్వొక సారి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే బావుంటుందేమో . నీలో ఎదో మార్పు వస్తోంది “అన్నది . అప్పుడు నేను కాస్త సీరియస్ గా గోధుమ వర్ణం గురించి ఆలోచించాను . ఆ సాయంత్రం నా మిత్రుడు , మాకు అలవాటైన సంగం కేఫ్ లో కూర్చుని చాయ్ తాగుతున్నప్పుడు “బాస్ నీ దగ్గరనుండి ఏదో వాసన వస్తోంది “అన్నాడు

నేను ఉలిక్కిపడ్డాను . ” వాసనా ? ఏమిటది ”

“ఏమో నేను సరిగ్గా ఐడెంటిఫై చేయలేక పోతున్నాను . బట్ ఇట్ ఈజ్ సమ్ థింగ్ స్ట్రేంజ్ ” అన్నాడు

ఇవాళ ఉదయం నుండీ ఒక ఊహ నన్ను ఆరడి పెడుతున్నది . ఆ ఊహ మొదటి సారి ఎప్పుడు కనుల ముందు తారాడిందో తెలియదు కానీ పదే పదే గుర్తుకు వచ్చి కొంత ఇబ్బంది పెడుతున్నది .ఆ ఊహ గోధుమ రంగు లో ఉన్నది . ఏమిటది ?

లేచి బయటకు వచ్చాను . డిసెంబర్ మాసపు చివరి రోజులు . చలి చలి గా ఉండాల్సింది ఉగ్రోష్ణం తో పెళ పెళ లాడుతున్నాయి రహదారులు అన్నీ చిత్రం గా నల్లగా ఉండవలసిన రహదారు లన్నీ గోధుమ రంగులో కనిపిస్తున్నాయి . రహదారుల చివర నల్లటి అంచుల తారు వాసన వేస్తోంది . అలా నడుస్తూ ఉండగా ఒక మిత్రుడు ఎదురు అయ్యాడు . ఇద్దరమూ కలసి సంగం కేఫ్ లోకి దూరాము

అతడేదో చెపుతున్నాడు . నేను కాస్త వింటూ , నా ఆలోచనలో నేను గడుపుతూ అప్పటికి మూడు రౌండ్ల చాయ్ పూర్తి అయింది . ఇక వెళదామా అని కుర్చీలోంచి లేవబోతుండగా

ఒక గోధుమ రంగు ట్రక్ అదుపుతప్పి సంగం కేఫ్ లోకి దూసుకుని వచ్చింది . క్షణం లో దాని చక్రాల కింద నేను . నా కళ్ళు మూతలు పడుతున్నాయి . బహుశా మెదడు చిట్లి ఉంటుంది . సరిగ్గా అప్పుడు కృష్ణమాచారి గుర్తుకొచ్చాడు . కళ్యాణి గుర్తుకొచ్చింది .

“నీ వన్నీ గోధుమ రంగు ఊహలు ” నల్లజడ మాట బైరాగి నూతి లో గొంతు లా సన్నగా , పీలగా వినిపిస్తోంది

ఒక గోధుమ రంగు ఊహ నన్ను కప్పేసింది

****

 

 

వంశీ కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు