గుర్తింపు

“ఇవాళ, మన జూనియర్ కాలేజీ వాట్సప్ గ్రూపులో, ఒక వీడియో చూశాను” అన్నాడు సులేమాన్‌, తన స్నేహితుడిని ఆ సాయంత్రం కలిసినప్పుడు.

“అదేంటో చెప్పమని మళ్ళీ వేరే, అడగాలా?” అనడిగాడు చలపతి.

“కాదులే! ఉపోద్ఘాతంగా అలా అన్నాను. ఆ వీడియోలో, మాస్కు పెట్టుకున్న ఒక మహిళ, పరిగెత్తుకుని వెళ్ళి బస్సుని ఆపింది మొదట. వెనక్కి వెళ్ళి, ఒక కళ్ళు లేని మనిషిని చెయ్యి పట్టుకుని, తీసుకుని వచ్చి, బస్సు ఎక్కించింది. ఆ మనిషి కూడా, మాస్కు పెట్టుకున్నాడు. ఇదంతా బయట నుంచి ఎవరో వీడియో తీశారు” అని సులేమాన్‌ చెప్పాడు.

“బావుంది. ఇలాంటి సాయాలు చాలా మంది చేస్తూనే వుంటారు కదా? ఇందులో ప్రత్యేకత ఏముంది?”

“అంతే కాదు. ఆ వీడీయోని, ఆ మహిళ ఎవరి దగ్గిర ఉద్యోగం చేస్తోందో, ఆ యజమాని చూసి, ఆ మహిళకి ఒక ఇల్లు బహుమతిగా ఇచ్చాడట. ఇదీ, ఆ మొత్తం విషయం” అని వివరంగా చెప్పాడు.

“బాగానే వుంది. అందరి నిజ జీవితాల్లోనూ అనుభవాలు, ఇంత రంగుల మయంగా వుండవు. మంచి చేస్తే మంచి జరుగుతుందని అనుకుంటే, అదొక చాదస్తపు నమ్మకమే అవుతుంది. నా అనుభవం నాదీ!” చెప్పాడు చలపతి.

“చెప్పు, చెప్పు, నీ అనుభవం. మన గ్రూపు వాట్సప్‌లో పోస్ట్ చేద్దాం” అన్నాడు సులేమాన్ ఆత్రంగా.

“పోస్టులు తర్వాత. ముందు విను” అంటూ మొదలు పెట్టాడు చలపతి.

*                *             *               *

అవి, నేను బీయస్సీ చదివే రోజులు. పేదరికం లోనే సాగుతోంది జీవితం.

“నిన్న బ్లడ్‌ బేంకుకి వెళ్ళి, రక్తం అమ్మి, హాలిడే అండ్‌ రెస్నిక్‌ రాసిన ఫిజిక్సు పుస్తకం కొంటానన్నావు కదా? ఏమయిందా సంగతి?” అని ఆరాగా అడిగాడు కాలేజీ నేస్తం, నరసింహ.

“నా బతుకు లాగే వుంది, నా ఆలోచన కూడా. మొదట, సన్నగా, చిన్నగా వున్నావన్నారు ఆ బ్లడ్‌ బేంకు వాళ్ళు. ఎలాగో వాళ్ళని ఒప్పించాను. ఆ తర్వాత, నేను స్వచ్ఛందంగా రక్త దానం చేస్తున్నాననుకుని, చాలా గౌరవంగా చూసి, చాలా మర్యాదలు చేశారు. ‘కాదూ, డబ్బు ఇవ్వండి’ అని అడగడానికి సిగ్గేసింది. ఉచితంగా, రక్త దానం చేసి, మర్యాద నిలుపుకుని వచ్చేశాను” అని విచారంగా చెప్పాను.

“అయ్యో, పాపం! పోనీలే, నా పుస్తకం తీసుకుని చదువుకుంటూ వుండు” అని భరోసా ఇచ్చాడు, నరసింహ.

నా ఆర్ధిక కష్టాలు తీరక పోయినా, ఆ విధంగా ప్రతీ మూడు నెలలకీ, రక్త దానం చేయడం అలవాటయిపోయింది. ఎటువంటి నొప్పీ, ఎటువంటి కష్టం వుండేవి కాదు. ఆ పని అయిన వెంటనే, మూడు మైళ్ళు నడుచుకుంటూ, ఇంటికి చాలా మామూలుగా వెళ్ళేవాడిని.

“నరసింహా! ఈ విషయం మా ఇంట్లో మాత్రం చెప్పకు. మా వాళ్ళు నన్ను నిరోధించొచ్చు” అని చెప్పాను.

“అలాగే” నన్నాడు నరసింహ.

రోజులు అలాగే గడుస్తున్నాయి. రెండో సంవత్సరం హిందీలో మంచి మార్కులు వొచ్చాయని, మా హిందీ టీచరు, ప్రిన్సిపల్‌తో చెప్పి, మూడో సంవత్సరానికి కొన్ని పుస్తకాలు ఇప్పించింది. ఒక కష్టం కొంత గట్టెక్కింది.

పరీక్షలయ్యాయి. పాసయ్యాను. దేనికో అప్లికేషను పెట్టడానికి, ఒక కాయితం మీద, గెజిటెడ్‌ ఆఫీసరు సంతకం కావాల్సి వొచ్చింది.

“ఆ బ్లడ్‌ బేంకు డైరెక్టరు, డాక్టరు రామయ్య గారికి, గెజిటెడ్‌ ఆఫీసరు రేంకు వుంది. ఆయన, నీకు తెలుసు కదా? ఆయన చేత సంతకం పెట్టించుకో” అని సలహా ఇచ్చాడు, నరసింహ.

ఆ సలహా నచ్చింది. వెంటనే కాయితాలు, తీసుకుని ఆ బ్లడ్‌ బేంకుకి వెళ్ళాను.

నా ఖర్మ కాలి, ఆ గేటు దగ్గిర కొత్త వాచ్‌మేన్ వున్నాడు.

“నై! అందర్ జానా మనా హై” అంటూ, నిర్లక్ష్యంగా పద్దెనిమిదేళ్ళ నన్ను ఆపేశాడు.

“నేను రక్త దానం చేసే మనిషిని” అని హిందీలో ఎంత మొత్తుకున్నా, వినడే!

చాలా అవమానం అయిపోయింది నాకు. ఉక్రోషం కూడా వచ్చింది. ఖరీదు కాని నా దుస్తులూ, బూట్లు కాని నా చెప్పులూ, నా కొక తక్కువ తనాన్ని ఆపాదించాయి, ఆ వాచ్‌మేన్ దృష్టిలో.

“లోపల వున్న డైరెక్టరుకి ఒక ఉత్తరం రాస్తాను. పట్టికెళ్ళి ఇయ్యి” అని హిందీ లోనే చెప్పాను.

వెంటనే, నా దగ్గిర వున్న కాయితాల్లో వున్న ఒక కాయితం మీద, ఒక ఉత్తరం ఇంగ్లీషులో రాయడం మొదలు పెట్టాను. నా ప్రయత్నం చూసి, ఆ వాచ్‌మేన్, తన మనసు మార్చుకున్నాడు.

“ఠీక్‌ హై. అందర్ జావో!” అని అనుమతి ఇచ్చాడు.

కోపంగా లోపలికి వెళ్ళాను. ఆ వాచ్‌మేన్ మీద, ఆ డైరెక్టరుకి ఫిర్యాదు చెయ్యాలని నిశ్చయించుకున్నాను.

“రక్త దానం చేసేవాడిని, నన్ను ఆపి, అవమానిస్తాడా” అని నాకు ఒకటే, ఉడుకుమోత్తనం.

గబ గబా నడుచుకుంటూ, డైరెక్టరు, డాక్టరు రామయ్య గారి ఆఫీసుకు చేరాను. అక్కడంతా ఏదో హడావుడిగా వుంది. చాలా మందే వున్నారక్కడ.

నన్ను చూడగానే, “అదిగో, మాటల్లోనే కనిపించాడు, మన హీరో” అంటూ, నన్ను లోపలికి ఆహ్వానించారు రామయ్య గారు.

ఆశ్చర్య పోయాను. ఆ సంభ్రమంలో, వాచ్‌మేన్ మీద కోపం మర్చిపోయాను.

“ఏం జరుగుతోందండీ ఇక్కడ?” అని అడిగాను, అర్ధం కాక.

“రేడియో స్టేషను వాళ్ళు, రక్త దానం గురించి ఒక ప్రోగ్రామ్‌ రికార్డు చెయ్యడానికి వచ్చారు. వాళ్ళకి, నీ గురించి చెప్పాను. ‘నిన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుందని’ చెప్పాను. ఇంత చిన్న వయసులో ఇలా చేసే వాళ్ళు, ఎవరూ లేరు. ఇంతలో అనుకోకుండా, నువ్వు వచ్చావు” అని వివరించారు రామయ్య గారు.

చాలా సంబరం వేసింది. ఎప్పుడూ రేడియోలో మాట్లాడి ఎరగను. నా మాటలు రేడియోలో వొస్తాయంటే, సంతోషం పట్టలేక పోయాను. ఆ వాచ్‌మేన్‌ని మనస్పూర్తిగా క్షమించేశాను.

అయినా సరే, అసలు పని మర్చిపోలేదు. రామయ్య గారి చేత, నా కాయితాల మీద, సంతకం పెట్టించుకుని, స్టాంపు వేయించుకోవడం పూర్తి చేశాను ముందు.

“ఇవాళ నీ పుట్టిన రోజు అయినట్టూ, ఈ రోజున రక్త దానం చెయ్యడానికి ఇక్కడకి వచ్చినట్టూ, నిన్ను మేము, కొన్ని ప్రశ్నలు అడుగుతాము. నీ జవాబులూ, మా ప్రశ్నలూ టేప్‌ రికార్డర్‌లో రికార్డు చేసి, రేడియోలో ప్రసారం చేస్తాము” అని, ఆ రేడియో వాళ్ళు వివరించారు.

ఆనందం పొంగిపోతుండగా ఒప్పేసుకున్నాను.

వాళ్ళు, ప్రశ్నలు అడగడం.

నేను, నాకు తోచినవి, ఏవో జబాబులు గొప్పగా చెప్పడం.

అవన్నీ వాళ్ళు, రికార్డు చెయ్యడం.

ఏదో అనుకోని అనుభూతి, ఆ చిన్న వయసులో.

అప్పుడు, ఇద్దరు భార్యాభర్తలు వొచ్చారు అక్కడకి. ఆ రేడియో వాళ్ళు, ఆ భార్యాభర్తలనీ ఇంటర్వ్యూ చేశారు.

వాళ్ళు, చెప్పిన విషయం ఇదీ.

“ఆ భార్యకి ఏదో ఆపరేషను చెయ్యాలట. ఆవిడ రక్తం గ్రూపుకి చెందిన రక్తం, దొరకడం లేదట. మూడు బాటిళ్ళు కావాలట ఆపరేషనుకి. అప్పటికి రెండే దొరికాయట. ఆవిడది చాలా రేర్ గ్రూపట. చాలా దిగులుగా వున్నారట. ఆపరేషను ఆలస్యం అయితే ఇబ్బందట.”

ఆ మాటలు కూడా, రేడియో రికార్డింగు లోకి వెళ్ళాయి.

అక్కడే వున్న, ఇంకో డాక్టరు, రాజ్యలక్ష్మి గారు, అన్నారు, “ఈ అబ్బాయి, చలపతిదీ, ఆ రేర్ గ్రూపే. ఏబీ, ఆర్‌హెచ్ పాజిటివ్‌”.

ఆ భార్యాభర్తలు నా వేపు, చాలా ఆశగా చూశారు. గతుక్కు మన్నాను.

“కిందటి సారి రక్త దానం చేసి, రెండు నెలలే అయిందండీ. మూడు నెలలకి గానీ, ఇంకో సారి చేయకూడదు నేను” అంటూ నా నిస్సహాయతని వెళ్ళబుచ్చాను.

“ఫరవాలేదు. అవసరం వొస్తే, రెండు నెలల తర్వాత కూడా రక్తాన్ని తీసుకోవచ్చు, ఆరోగ్యంగా వుంటే” అన్నారు, రామయ్య గారు.

వెంటనే ఒప్పేసుకున్నాను. ఆ అనుభవమూ, బాగానే అనిపించింది నాకు.

వెంటనే, ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇరవై నిముషాల్లో నా నించి రక్తాన్ని ఒక బాటిల్‌లో సేకరించారు.

అది, అలవాటైన పనే. నాకే కష్టమూ కలగ లేదు.

ఆ రక్త దానం జరుగుతున్నంత సేపూ, ఆ భార్యాభర్త లిద్దరూ, నా దగ్గిరే వున్నారు.

“చాలా మంచి వాడివి బాబూ! నీ సహాయం జన్మలో మర్చిపోలేం. అవసరంలో ఆదుకుంటున్నావు. నీ ఇంటి అడ్రసూ, ఫోను నంబరూ చెప్పు. నిన్ను మళ్ళీ కలుస్తాం, ఆపరేషను అయ్యాక” అని మాట్లాడారు వాళ్ళు.

“మా ఇంట్లో ఫోను లేదండీ” అని చెప్పి, మా ఇంటి అడ్రసు ఇచ్చాను.

వాళ్ళు, చాలా సంతోషించి, నా భుజం తట్టారు. నా ఆనందానికి అవధులు లేవు. ఏదో, పెద్ద మేరు పర్వతం ఎత్తినట్టుగా ఫీలయ్యాను.

ఏదో కాయితాల మీద సంతకాలకని రావడ మేమిటీ, వాచ్‌మేన్‌ నన్ను అవమానించడ మేమిటీ, రేడియో వాళ్ళు నా మాటలు రికార్డు చెయ్యడ మేమిటీ, ఈ భార్యాభర్తలకి నా రక్తం అవసరం రావడ మేమిటీ, నేను వెంటనే రక్త దానం చెయ్యడ మేమిటీ, – అన్నీ, ఏదో సినిమా లోని విషయాల్లాగా జరిగిపోయాయి ఆ రోజు.

ఒక వారం పోయాక, రేడియోలో ఆ ప్రోగ్రాము ప్రసారం చేశారు. నా గొంతు, నేనే గుర్తు పట్టలేక పోయాను. కానీ, ఇంట్లో వాళ్ళు గుర్తు పట్టి, చాలా కేకలేశారు.

“ఇంత చిన్న వయసులో, ఇంట్లో తెలియకుండా, ఇన్ని సార్లు రక్త దానాలు చేస్తావా? నీ ఆరోగ్యం ఏమై పోతుంది? మాకు చెప్పొద్దా?” అంటూ, నన్నొక దోషిని చేసి, చడా మడా తిట్టేశారు, మా వాళ్ళు అభిమానంతో, కంగారుతో.

వాళ్ళకు సరైన సమాధానాలు చెప్పి, వాళ్ళని సముదాయించే సరికి, నాకు చాలా నీరసం వచ్చింది.

కొన్నాళ్ళకి, ఆ భార్యాభర్తల ఆపరేషన్ విజయవంతంగా నడిచిందని, రామయ్య గారి ద్వారా తెలిసింది.

ఆ రోజు, సంతోషంగా నిద్ర పోయాను.

మర్నాడు, లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చేసి, కొత్త పుస్తకాలు తీసుకుని ఇంటికొచ్చేసరికి, ఇంట్లో ఎవరో కొత్త వాళ్ళు వున్నారని అర్ధం అయింది. చూస్తే, ఆ బ్లడ్‌ బేంకులో కలిసిన భార్యాభర్తలు.

“మీ అబ్బాయి, మాకు చాలా సహాయం చేశాడండీ. అతని మేలు మేము మరవలేము” అన్నారు మా వాళ్ళతో.

మా వాళ్ళు సంతోషంగా, “అలాగాండీ” అన్నారు.

నన్ను చూడగానే, ఆ భర్త, నా  చేతులు పట్టుకుని కూర్చోపెట్టాడు. ఆ పక్కన చూస్తే, వాళ్ళు తీసుకొచ్చిన బట్టలూ, ఫలహారాలూ, పుస్తకాలూ, ఎవేవో, చాలా వున్నాయి సరంజామా.

అవి చూసి, “ఇవన్నీ ఎందుకండీ?” అన్నాను కాస్త మొహమాటంగా.

మనసు లోపల సంతోషం గానే వుంది.

“ఇందులో ఏముంది?” అని నాతో అని, మా వాళ్ళ వేపు తిరిగి, “మీ అబ్బాయి రుణం ఏ జన్మకీ తీర్చుకోలేమండీ! అయినా మాకు చేతనయింది చెయ్యదల్చు కున్నాము. అతను ఎంత వరకూ చదువుకుంటే, అంతవరకూ మేము చదివిస్తాము. ఆ ఖర్చులన్నీ మేము పెట్టుకుంటాము” అంది ఆ భార్య నవ్వు మొహంతో.

నా చెవులని నేనే నమ్మలేక పోయాను. అప్పటికే, నా పై చదువుల గురించి, ఇంట్లో తర్జన భర్జన లవుతున్నాయి.

“నిజంగా….? నిజంగా….? నిజంగా….?” అన్నాను.

“ఏంట్రా, ఆ ‘నిజం’? ఏమన్నా కల గంటున్నావా?” అంటూ లేపారు మా వాళ్ళు.

“అయ్యో, కలా!?” అనుకుంటూ నిరాశ పడ్డాను కొంచెం.

అయితే, ఆ భార్యాభర్తలని మళ్ళీ జీవితంలో ఎప్పుడూ చూడలేదూ, వారి నించి వినలేదూ!

ఏమయిందో వాళ్ళకి! అదెప్పటికీ తెలియని విషయం!

అప్పుడు మాత్రం, వాళ్ళ మీద, నాకు చాలా కోపం కలిగింది, నన్ను మళ్ళీ కలవనందుకూ, ఎటువంటి బహుమానాలూ ఇవ్వనందుకూ.

కాల క్రమాన, చదువులు పూర్తయి, మొదటి ఉద్యోగంలో చేరాను ఢిల్లీలో.

కొత్త ఊరూ, కొత్త పద్ధతులూ, అన్నీ నెమ్మదిగా అలవాటవుతున్నాయి. ఆఫీసుకు వెళ్ళే దారిలో, ఒక ఆస్పత్రి దగ్గిర, బ్లడ్‌ బేంక్‌ అన్న బోర్డు చూశాను. అప్పటికే, రక్తం ఇచ్చి మూడు నెలలు దాటింది.  ఒక రోజు, ఆ ఆస్పత్రి లోకి వెళ్ళాను.

అక్కడున్న డాక్టరుకి, వయసు డెబ్భై ఏళ్ళ పైనే వుండొచ్చనిపించింది.

వచ్చిన పని చెప్పాను. నా చేత, ఏవేవో కాయితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు. కాస్త ఆశ్చర్యం వేసింది ఆ పద్ధతికి.

ఆ డాక్టరు, నన్ను వేరే రూముకి తీసుకు వెళ్ళాడు.

“ఫాంటూ, డ్రాయరూ విప్పు” అన్నాడు కాస్త మొరటుగా.

తెల్ల బోయాను. “ఎందుకూ?” అన్నాను చాలా ఆశ్చర్యంగా.

ఎక్కడికి వచ్చానో, సరిగా అర్ధం కాలేదు.

“నీకేమన్నా సుఖ రోగాలు వున్నాయేమో చెక్ చెయ్యాలి” అన్నాడు ఆ డాక్టరు.

చాలా సిగ్గు పడిపోయాను. చాలా అవమాన పడిపోయాను కూడా.

“ఛీ! ఛీ! నేనలాంటి వాడిని కాను” అన్నాను కొంచెం పౌరుషంగా.

అసలు వెంటనే అక్కణ్ణించీ వెళ్ళి పోదామనిపించింది. అప్పటికే, రక్తం ఇస్తానని కాయితాల మీద సంతకాలు పెట్టేశాను. అలా దెబ్బలాడి, వెళ్ళి పోయే ధైర్యం లేదు అప్పుడు. అంటే, నా రక్తంలో అలా అవమానాలు భరించి, లొంగి పోయే మనస్తత్వం వుందేమో అప్పుడు!

“అందరూ అలాగే అంటారు. నీ వయసు వాళ్ళు, ఆడ వాళ్ళతో తిరుగుతారు” అన్నాడు ఆ డాక్టరు వదలకుండా.

ఇక చచ్చినట్టు, ఫాంటూ, డ్రాయరూ విప్పి, కళ్ళు మూసుకుని నించున్నాను, సిగ్గుతో, అవమానంతో.

“సరే! సరే! పక్క గదిలోకి వెళ్ళు” అన్నాడు ఆ డాక్టరు ఏదో కాస్త పరీక్ష చేసి.

బట్టలు వేసుకుని, పక్క గది లోకి వెళ్ళాను. అక్కడ వున్న నర్సులు, అన్ని ఏర్పాట్లూ చేసి, నా దగ్గిర రక్తాన్ని సేకరించారు.

“మళ్ళీ జన్మలో ఈ ఆస్పత్రిలో అడుగు పెట్టకూడదు” అని గాఢంగా నిశ్చయించుకున్నాను.

పని అయిపోయాక, బయటకి వచ్చేస్తోంటే, ఆ డాక్టరు తన ఆఫీసు లోంచి, ఫోనులో మాట్లాడుతున్న కొన్ని మాటలు వినబడ్డాయి.

“ఆ( ఆ(! ఇప్పుడే ఆ రేర్‌ గ్రూపు రక్తం వచ్చింది. ఆ(.. ఆ(… అబ్బే! రెండు వేల రూపాయల కన్నా తగ్గించలేం. ఆ(… ఆ(… రేప్పొద్దున్నే పంపుతాం…… ” అంటున్నాడు ఆ డెబ్భై ఏళ్ళ డాక్టరు, ఎవరి తోనో.

ఏమీ చేతకాని వాడి లాగా, ఖిన్నుడనై, అక్కణ్ణించీ బయట పడ్డాను.

 

*             *           *           *

 

ఆ కధంతా చెప్పి, ఆగాడు చలపతి.

“చాలా బావుంది, నీ కధ, చలపతీ! నిన్ను మళ్ళీ కలవని ఆ భార్యాభర్తలు సరైన వాళ్ళు కాదు” అన్నాడు సులేమాన్, నాతో ఓదార్పుగా.

“చాలా ఏళ్ళు, నేనూ అలాగే అనుకున్నాను. అయితే, వాళ్ళ గురించి నాకేమీ తెలియదుగా, ఆపరేషన్ విజయవంతం అయిందని తప్ప? వాళ్ళ జీవితంలో, అనుకోకుండా మరింకేం మార్పులు జరిగాయో! ఏం విపత్తులు వచ్చి పడ్డాయో! నాకేం తెలుస్తుంది? ఆ చిన్న వయసులో, నేను ఏదో వారి నించి ఆశించానంటే, అది నా చిన్నతనం. నా తెలియని తనం. నా జీవితం లోని మిగిలిన అనుభవాలు, ఆ భార్యాభర్తల మీద కోపాన్ని హరించాయి. నేను చేసిన ఒక మంచి పనికి, ఏదో గొప్ప బహుమతి పొందానంటే, అది నా శ్రమకి వచ్చే ఫలితం కాదు, కదా? ఒక మంచి పని చేసి, దానికి ఫలితాన్ని ఎలాగో ఒక లాగా పొందితే, అది ఇంకా మంచిగానే వుంటుందా? ఈ విషయాలు గుర్తొచ్చి చెప్పానంతే” అన్నాడు చలపతి.

చలపతి వేపు, స్నేహంగా చూశాడు సులేమాన్.

*

Avatar

జె. యు. బి. వి. ప్రసాద్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కధ చాలా బాగుంది.
    మంచి చేస్తే ఏదో ఒరంగుతుందని కాక మంచి కోసమే మంచి చేయాలి అన్న సందేశం చెప్పకనే చెప్పినట్లు ంది.

  • కథ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చింది, రక్తదానం ఎంత ప్రాణదాత , అని కథలో చలపతి చిన్న తనం నుంచి రక్త దానం చేయడం చాలా ఆదర్శనీయం
    ఇటువంటి సందేశాత్మక కథలు ప్రచురించిన పత్రిక క కు థన్యవాదములు

  • కథ చాలా బాగుంది. సంఘటనలను కళ్ళకు కట్టినట్టు వర్ణించారు

  • సందేశాత్మకమైన కథ చాలా బాగుంది. మంచి పని చేస్తే ఆత్మతృప్తి, ఆనందము కలుగుతాయి. ఫలితము వెంటనే లభించక పోయినా ఏదో రూపంలో తప్పక ఏదోరోజు లభిస్తుంది.

  • ప్రసాద్ గారు బాగా వ్రాశారు. ఈ కథ చదవగానే మధురాంతకం రాజారాం గారి కథ అప్పుల నర్సయ్య గురుతుకివచ్చింది. ఈ కథలో కూడా ముఖ్య పాత్రధారి ప్రతిఫలం ఆశయించకుండా సహాయం చేస్తూఉంటాడు. ఈ కథని Youtube లో విని చూడవచ్చు https://www.youtube.com/watch?v=9j2SyryZ_Ug

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు