గాడ్, సెక్స్ అండ్ ట్రూత్!

మూసినగుప్పెట్లో ఏముందోనని ఆత్రుత

దేహాల మూలాలేవో కనిపెట్టాలనే ఆకాంక్ష

కొమ్మకున్న మొగ్గలు ఆకాశంలోకి విచ్చుకుని

ఊహకి జీవం పోసే అద్భుతమైన ఘడియకోసం

తనని తాను  త్యజించిన ఆమె చూసిన ఎదురు చూపు

అది ఒక ప్రాణం కోసం తపన

దేహాన్ని మరో దేహం నుంచి మలచే ప్రయాస

 

ఎనిమిదినుంచే కాస్త ఇబ్బంది మొదలవుతుంది

ఎడంపక్కనో కుడిపక్కనో ముద్దుగా  తన్నుతూ

కడుపంతా గిరా గిరా తిరుగుతున్న ఓ అనుభవం

 

ఆదుర్దా…ఆకాంక్ష…ఒక వెచ్చని పసి ఊపిరి కోసం

నూనూగు వెంట్రుకల మీద  వెచ్చని ముద్దుకోసం

ఊపిరి కూడా తీయలేనంతటి ఉక్కపోత

 

పేగువాసన ముడి వేసి ఉన్నంతకాలం

అక్కడే అక్కడక్కడే అమ్మతోనే

గర్భాలయం లాంటి ఉమ్మనీటిలోనే ఈదులాట

మూసిన గుప్పిటిలో గాలాడక తిరుగులాట

 

నెత్తుటి మడుగులో కళ్ళు తెరుచుకుంటాయి

ఊపిరి తీసుకోవడం మొదలౌతుంది

తెగిపడిన బొడ్డు పేగు లో గాయం మానని నరకయాతన

 

ఊహ కి మారు పేరు వయసు

గుప్పెట్లోనుంచి బయటపడిన గాలి రివ్వున ఎగిరిపోతుంది

నూనూగు మీసాలొస్తాయి

మూసినగుప్పెట్లో ఏముందోనని ఆత్రుత

దేహాల మూలాలేవో కనిపెట్టాలనే ఆకాంక్ష

ఎవరూ చేయి పట్టి నడిపించకుండానే

నడకవేగం పెరుగుతుంది

హఠాత్తుగా  రెక్కల బలం పెరుగుతుంది

అరచేతిలో ప్రపంచమే  విప్పబడ్డాక

ఎగరిపోవాలని  విశ్వమంతా విప్పి చూడాలని ఆరాట పడుతుంది

 

మోహం  గుడ్డిది

ఎవరి దేహమైనా దేవాలయమేనని ఎప్పటికీ గుర్తింపురాదు

తాను తిరిగొచ్చిన ఆలయపు ఆనవాళ్ళు

అమ్మతనమనే స్పృహ ఎప్పటికీ అందదు

అంతర్నేత్రం మూసుకుపోయి లోపలేదో ఒకానొక లుకలుక

ఎంత వయసుపెరిగినా  ఎంత పరిజ్ఞానం సాధించినా

గురిమొత్తం ఆమె రంగురంగుల దేహం పైనే

 

విశ్వం మొత్తం ఒకే తెర

ఎక్కడా ఆచ్చాదనే లేని తెల్లటి తెర

తెరమీద నవరంధ్రాల తోలు తిత్తి

మూయబడిన గుప్పిటని ఎప్పటికి తెరిచే తెర

పొర …..కళ్ళనిండా …..కామావేశపు  పొర

తెరమీద తోలు బొమ్మలాట పేరు జీ ఎస్ టీ

దేవుడూ… సత్యమూ..నిజమూ… మనమూ పాత్రధారులం

*

పెయింటింగ్: సత్య బిరుదరాజు

అనిల్ డ్యాని

అనిల్ డ్యాని

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఆమెతనం నారు పోయాలన్నప్పుడు నీ సీరియస్నెస్ అర్ధం సగమే అయ్యింది. ఆమె చుట్టూనే కవిత్వం. ఆమెతనం లానే. నీ లాలస లో ఎంత నొప్పి వుందో తెలియజెప్పిన వాక్యాలు వ్రాశావు. అభినందనలు మిత్రమా

 • అందరం పాత్రధారులమే….
  కవిత బాగుంది డానీ. అభినందనలు

 • ధన్యవాదాలు ఎడిటర్ బృందానికి

  చాలా మెట్లు ఎక్కి వెనక్కి తిరిగిన ఈ కవితని మీరు అక్కున చేర్చుకున్నందుకు .

 • మూసిన గుప్పిట్లో ఏముందోనని ఆత్రుత
  దేహం మూలాలేవో కనిపెట్టాలనే ఆకాంక్ష
  అజ్ఞానం అత్యాచారాలకు ఓ కారణమని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  మీ కవిత ఎంత చక్కగా చెప్పిందో ఈమాట.

 • కవిత చాలా బాగుంది సోదరా.కొన్ని పాదాలు కోట్ చేసుకునేంత గొప్పగా రాశారు.అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు