గంటారావం

గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత టర్న్ తీసుకున్నాడు. రేర్ వ్యూ మిర్రర్ని గమనిస్తూనే ఆ రోడ్డు మీద కొంత దూరం ముందుకు వెళ్లి, ఎడమపక్క రెండవ సందులోకి కారుని మలుపు తిప్పాడు.

రేడియోలో వస్తున్న కిషోర్ కుమార్ పాటతో గొంతు కలిపి పాడుతున్న రాజు రేర్ వ్యూ మిర్రర్లో చూస్తే వెనక కారు మరీ దగ్గరగా ఉన్నట్లనిపించింది.

“ఎందుకురా అంత దగ్గరగా వస్తావ్? అసలే ఈ కారు నాది కాదు!” అన్నాడు మెడని ఒక చేత్తో తడుముకుంటూ. “నీలాంటి వాళ్లే రేరెండ్ ఆక్సిడెంట్లు చేసేది. వారానికి రెండు మూడు కార్లు పచ్చడయి తన చేతిలో పడితే మా సియాజ్‌కి ఆనందమే గానీ వాడి కారుకి ఏమన్నా అయితే మాత్రం కాదు. నేను డ్రైవ్ చేస్తున్న కారుని గుద్దడాన్ని మాత్రం చెయ్యకు, ప్లీజ్!” అని జత చేశాడు.

అరవై మైళ్ల వేగంతో వెళ్లే కార్లు హఠాత్తుగా నత్తనడకకి మారడం ఆ బెల్టువే మీద సర్వసాధారణం. అప్పుడప్పుడూ మాత్రమే కాక ప్రతిరోజూ దానిమీద డ్రైవ్ చేసేవాళ్లు కూడా ఆ వేగం తేడాకి గాభరా పడడమూ అంత సాధారణమే. నాలుగయిదు లేన్లున్న చోట చివరి లేన్లో వెడుతున్న వాహనాలకి మాత్రం అవసరమయితే – అంటే, బ్రేకు వేసినప్పుడు ముందు కారుని గుద్దకుండా ఆగే సూచన లేవీ లేకపోతే – షోల్డర్ మీదకి కారుని మళ్లించి యాక్సిడెంటు నించీ తప్పించగలిగే వీలుంటుంది.

తన కారుకి బ్రేక్ వేస్తూనే వెనక కారు అలా షోల్డర్ మీదకి మళ్లడం రాజు చూశాడు. “చెబుతూనే వున్నా. ప్రతి పది మైళ్ల స్పీడుకీ ఒక కారు పొడవు దూరం మెయిన్టెయిన్ చెయ్యాలని చెప్పినట్టు ఎందుకు మరచిపోతా రసలు?” పెద్దగానే అన్నాడు. “చూడు, దున్నపోతులా ఎంత పెద్దగా వున్నదో! అలాగే నల్లగా మెరిసిపోతోంది కూడాను. పెద్ద ఎస్యూవీ. మేక్ షెవర్లే. మోడల్ టాహో అయ్యుంటుంది. నువ్వు గనుక గుద్దివుంటే, నాయనా -” అంతకు మించి ఆలోచించడానికి భయపడ్డాడు.

తనకి జరిగిన రేరెండ్ యాక్సిడెంట్ అతనికి గుర్తొచ్చింది. దాన్నసలు మరచిపోయిం దెప్పుడు? అది అవతలివాళ్ల తప్పేనని నిర్ధారించబడడం వల్ల కారు రిపేరవడానికి అయ్యే ఖర్చు దాని విలువకన్నా ఎక్కువ కావడంతో ఆ కారు విలువ సొమ్ముని వాళ్ల ఇన్స్యూరెన్స్ కంపెనీ అతని కిచ్చింది. రెండేళ్ల కొత్త టయోటా కేమ్రీ కాస్తా ఎవరో మంత్రం వేసినట్టుగా కుంచించుకుపోయి టయోటా కరోలాకి మారిపోయింది. “ఒక యాక్సిడెంటు కొన్ని జీవితాలని మార్చేస్తుంది!” అన్నది అతని అనుభవం. శరీరానికి తగిలిన దెబ్బలకి హాస్పిటల్ బిల్లులకి అవతలివాళ్లకి ఖర్చయింది చిన్న మొత్తమే గానీ, మిగిలిపోయిన మైగ్రెయిన్ తలనొప్పికీ, వెన్ను నెప్పులకీ మాత్రం కోర్టులో కేసు వేసి రెండు లక్షల డాలర్లకి సెటిలయ్యాడు.

“దొంగవెధవలు!” తమ వాటా అంటూ ఎనభైవేలు పట్టుకెళ్లిన లాయర్లని రాజు తిట్టుకోని రోజుండదు. ఇప్పుడు వాళ్లు మళ్లీ గుర్తుకొచ్చారు. అయితే, ఆనాడు పరుషంగా పెదవులు దాటిన తిట్లు ఈనాడు సరళంగా మారడం అతనికే ఆశ్చర్యాన్ని కలిగించి సన్న నవ్వు రాజు పెదాలపైన వెలిసింది. “నాకు ఆ డబ్బూ వద్దు, హాస్పిటల్ అనుభవమూ వద్దు. క్షేమంగా ఇంటికి చేర్చు సాయీ!” ఒక్క క్షణం మాత్రమే అయినా కళ్లు మూసుకుని ఆ రూపాన్ని మనసులో తలచుకుంటూ రెండు చేతులతో నమస్కారం పెట్టి మళ్లీ స్టీరింగ్ వీలుని పట్టుకున్నాడు. “ఇప్పుడయితే, నాకు హాస్పిటల్ ట్రిప్పు రాసివుంటే, అక్కడ వైద్యం జరక్కుండానే అటునించి అటే నన్ను ఇండియాకి పార్సిల్ చేస్తార్ట. ట్రంపు మహిమ! నన్ను షిరిడీకి రప్పించుకునే మార్గం అదే ననుకుంటున్నా వేమిటి కొంప దీసి?” నిట్టూర్చాడు. “పదిహేనే ళ్లయింది అమ్మానాన్నలని చూసి!”

కనెక్టికట్ ఎవెన్యూ దాటిన తరువాత ట్రాఫిక్ కొద్దిగా వేగం పుంజుకుంది. లెఫ్ట్ మోస్ట్ లేన్లో వెడుతుంటే కుడిపక్క నించీ ఒక పెద్ద నల్ల ఎస్యూవీ అతన్ని దాటి వెళ్లడం కనిపించింది. తన వెనక నల్ల కారు కనిపించకపోవడం వల్ల, ఆ ఎస్యూవీ లేన్ మారి తనని ఓవర్టేక్ చేసిందని అర్థమై, “నన్ను బతికించావు, ఫో!” అన్నాడు రాజు పెద్దగా.

రెండు మైళ్ల దూరం వెళ్లేసరికి ట్రాఫిక్ మళ్లీ ఆగిపోయింది. డాష్‌బోర్డ్ మీద వున్న మాప్ నువ్వు వెళ్లడానికి ఇదే మార్గం అని చూపిస్తోంది. బాల్టిమోర్ ఎయిర్‌పోర్టు దగ్గర బయలుదేరినప్పటి  నుంచీ దాన్ని ఫాలో అవుతూనే వస్తున్నాడు. గమ్యం చేరడానికి గంట పడుతుందని చెబుతోందది. వెళ్లేటప్పుడు సియాజ్ కొడుకే డ్రైవ్ చేశాడు. “రౌండ్ ట్రిప్ నూట ఇరవై మైళ్లు డ్రైవ్ చెయ్యొచ్చని ఆశపడితే దాన్ని సగం చేశాడు వెధవ! పైగా, ఈ ట్రాఫిక్ గోల వాడికి లేదుగా? ఎనభై మైళ్ల వేగంతో పోయాడు. ప్రాణా లుగ్గబట్టుకుని కూర్చున్నాను. టిక్కెట్టు నివ్వడానికి పోలీస్ వాణ్ణి ఆపినా నన్నక్కణ్ణించే తిన్నగా ఇండియా పంపేవాళ్లు. ఇప్పుడు నాకేమో తంపర్లాట. అరవై మైళ్ల వేగంతో ఇరవై మైళ్లు డ్రైవ్ చేసివుంటా మహా అయితే. మిగిలిన ఇరవై మైళ్లూ ఇలా టుక్కుటుక్కు మంటూ డేక్కుంటూ పోవడమే!” అనుకుంటూ రేర్ వ్యూ మిర్రర్లో చూశాడు. పెద్ద నల్ల ఎస్యూవీ వెనక. జీప్ బ్రాండ్. “చెరొకీ అయ్యుంటుంది” అనుకున్నాడు. ఇందాక కనిపించిన షెవీ టాహో పక్క లేన్లో మూడు కార్ల ముందు కనిపించింది. ఆరు నెలల క్రితం ఆల్బర్తో వైనం హీసూస్ చెప్పిన దగ్గర నుంచీ ఇలాంటి నల్ల ఎస్యూవీ లంటే అతనికి భయం పట్టుకుంది.

రాణికి ఫోన్ చేశాడు. ఆమె సంబంధం వచ్చినప్పుడు ఏమాత్రం చూడబుల్‌గా ఉన్నా పెళ్లిచేసుకుందామని ముందే నిర్ణయించేసుకున్నాడు – రాజు, రాణి కాంబినేషన్, వహ్వా! అనుకుని. రాణి అతణ్ణి నిరాశపరచలేదు. అతణ్ణి గూర్చి కూడా తను అలాగే అనుకున్నా నన్నది.

“నిన్ను రాణీలాగా సింహాసనం మీద కూర్చోబెట్టగలిగే మొగుడి మాట అటుంచి, ఇలా ఎవరింట్లోనో బేస్‌మెంటులో అద్దెకు దించే మొగుడొస్తాడని ఎప్పుడయినా కలగన్నావా?” అని గడిచిన పదేళ్లల్లో ఎన్నిసార్లు అన్నాడో అతనికి గుర్తులేదు.

“మీరు మాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నారా?” అన్నది రాణి మొదట్లో. “ఎన్నిసార్లని ఇట్లా అంటావ్?” అని విసుక్కుంది కొన్నేళ్లయిన తరువాత. “అరిగిపోయిన రికార్డులాగా నన్ను చంపకు!” అంటోందిప్పుడు. “మన పిల్లలకి అరిగిపోయిన రికార్డు అంటే ఏమిటో ఎలా వివరిస్తావ్?” అంటాడు రాజు.

“ఏంటిప్పుడు చేశావ్?” అన్నది రాణి.

“బెల్టువే మీద ట్రాఫిక్‌లో కుంటుకుంటూ వస్తున్నాను. మెర్సిడెజ్ ఎస్ ఫైవ్ ఫిఫ్టీ డ్రైవ్ చేస్తూ. కొత్తదేమీ కాదనుకో, అయిదేళ్ల వయసుది. అది చెబుదామని!” జవాబిచ్చాడు.

“మరి నన్నెందుకు తీసుకెళ్లలే దందులో? నాకేమో, రంగు వెలిసి, సొట్టలు పడిన టయోటా కరోలా!”

“నాకూ రోజూ అదేగా! ఇవాళ్లే ఈ భోగం! అది కూడా సియాజ్ వాళ్లింటికి చేరాదాకా మాత్రమే.”

“వాళ్లింటి కెందుకు వెడుతున్నావ్?”

“వాళ్లబ్బాయి బాల్టిమోర్ ఎయిర్పోర్టుకి డ్రైవ్ చేసి అక్కడ ఫ్లయి టెక్కాడు. నేను కారుని వెనక్కు తోలుకొస్తున్నాను.”

“ప్రస్తుతం ఎక్కడున్నావ్?”

“మేరీలాండులో. 495 మీద.”

“ఇంటి పక్కన డల్లస్ ఎయిర్పోర్టు పెట్టుకుని అరవై మైళ్లు అక్కడి కెందు కెళ్లా లసలు?”

“టిక్కెట్టు చవగ్గా వచ్చుంటుంది.”

“తనేమో పైసా, పైసా కూడబెడతాడు. రషవర్ ట్రాఫిక్‌లో కూర్చోవడం అతనికిష్టం లేక, సమయం వృధా అవుతుందని నిన్ను పంపాడు.”

“కాదా మరి? అతని సమయం నా సమయం కన్నా విలువైనదే.”

“నీ చేత ఊడిగం చేయించుకుంటున్నాడు!”

“అవసర మొచ్చింది, అడిగాడు, చేస్తున్నాను. నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లేలా బతకలేకపోయినా కనీసం ఇలాగయినా బండిని లాగుతోంది అతనిచ్చే జీతంతోనేగా!”

“రెడ్డిగారి పిల్లలకి బేబీ సిటింగ్ కోసం వాళ్లు మనకి బేస్‌మెంటివ్వడం వల్ల కూడాను. అది మర్చిపోకు.”

“ఆగాగు. ఇక్కడ పెద్ద మెర్జ్ జరుగుతోంది. యాక్సిడెంట్లో ఇరుక్కోకుండా డ్రైవ్ చెయ్యగలిగితే చాలు!” అని ఫోన్ పెట్టేశాడు.

270 స్పర్ వర్జీనియా వైపు వెళ్లే 495తో కలిసే చోట రషవర్లో జరిగే మెర్జ్ అతనికి కొత్త. వీలయినంత వరకూ ఇంటి చుట్టుపక్కలే డ్రైవ్ చేస్తాడు తప్ప సాధారణంగా హైవే లెక్కడు. యాక్సిడెంటు తరువాత డ్రైవ్ చెయ్యడానికి భయం వేసింది కొన్నాళ్లు. అప్పుడు రాణీయే డ్రైవ్ చేసేది. పిల్లలు వయసొచ్చి లైసెన్స్ తెచ్చుకున్న తరువాత ఇంట్లో ఉన్నంత కాలం వాళ్లే రథసారథులు. అతను హైవేల మీద ఫ్రీగా డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ కాకముందరే. ఇవాళ సియాజ్ తప్పదంటే కాదనలేకపోయాడు. “అదృష్టవశాత్తూ, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌కి డ్రైవింగ్ లైసెన్స్ నివ్వం అని ఇంకా వర్జీనియా రాష్ట్రం అనట్లేదు!” అనుకుంటారు రాజు కుటుంబ సభ్యులు.

ఒక్క చూపుతో అక్కడ ఆరేడు లేన్లున్నయ్యని గ్రహించాడు. ఎడమపక్కన వస్తున్న వాళ్లు కుడిపక్కకు పోతా మంటారు. కుడిపక్కన మూడు లేన్లున్నయ్ అతనున్న దానితో కలిపి. వీళ్లల్లో కొందరు ఎడమపక్కకు మారా లంటున్నారు. రివర్ రోడ్డు దగ్గర కొచ్చేసరికి తనున్న లేన్ ఎగ్జిట్ లేన్ అవడంవల్ల అతను తప్పనిసరిగా ఎడమపక్క లేన్‌కి మారాల్సి వచ్చింది. అలా మారడం కోసం రేర్ వ్యూ మిర్రర్‌లోకి చూసినప్పుడు అతని వెనకే కనిపించింది ఇందాక చూసిన నల్ల ఎస్యూవీ, అది కూడా లేన్ మారుతూ. అది షెవీ. “ఇందాక కనిపించిన జీప్ స్థానంలోకి ఇదెప్పుడు వచ్చిందో?” అనుకున్నాడు. ఎడమ పక్కన రెండు కార్లకు ముందు కనిపించింది ఆ జీప్ చెరొకీ. “కొంపదీసి ఈ రెండూ నన్ను కనిపెట్టుకుని ఉండట్లేదు గదా?” మనసులో మెదిలిన ఆ ప్రశ్నకు జవాబుని తెలుసుకోవడానికి భయపడ్డాడు.

రాణికి మళ్లీ ఫోన్ చేశాడు. ఆమె ఆన్సర్ చెయ్యలేదు. “పిల్లల్ని తీసుకెళ్లడానికి వచ్చిన వాళ్లతో మాట్లాడుతూ ఉండివుంటుంది,” అనుకున్నాడు డాష్‌బోర్డు మీద గడియారం చూపిస్తున్న అయిదున్నర గంటల సమయాన్ని చూసి. తెలిసిన రఫీ పాట వినిపిస్తే ఇందాకటినించీ రేడియో మోగుతున్నా గానీ ఆ మోత తన చెవిలో కెక్కలేదని అతనికి అర్థమయింది. తను వాషింగ్టన్, డి.సి.,కి వచ్చినప్పుడు లేనివి ఇప్పుడు కోకొల్లలు. గుళ్లూ, రెస్టారెంట్లూ, ఇండియన్ గ్రోసరీ షాపులూ, చుట్టుపక్కల సినిమా హాళ్లలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట తెలుగు సినిమాలు వెయ్యడాలూ, ఇప్పుడు ఈ రేడియో స్టేషన్లో హిందీ పాటలు. ఇక మిగిలిందల్లా రేడియోలో తెలుగు పాటలు రావడమే.

రేడియోలో వస్తున్న పాటలకు గొంతు కలుపుతూ, దరువేస్తూ డ్రైవ్ చేస్తూ, వాషింగ్టన్ డల్లస్ ఎయిర్పోర్టుకు వెళ్లే దారి అంటూ చూపించిన ఎగ్జిట్ తీసుకుంటూ చూస్తే ఆ లేన్లో రెండు కార్ల ముందర ఒక నల్ల ఎస్యూవీ, వెనక ఇందాకటిదే షెవీ టాహో. “వీళ్లు నన్ను ఫాలో అవుతున్నా రనుకోవడానికి ఛాన్సులు ఎక్కువయ్యెయ్!” అనుకున్నాడు. ఆ ఆలోచనకి అతని గుండె వేగం హెచ్చింది.

కార్ల మేక్, మోడల్స్‌ని గుర్తుపట్టడం సియాజ్ బాడీ రిపేర్ షాపులో పనిలో చేరిన దగ్గరనుంచీ అతనికి అలవడ్డది. నడిసముద్రంలో షిప్‌రెక్ అయినప్పుడు ప్రయాణీకులకు దొరికే బల్లచెక్క లాంటి వాడయ్యాడు సియాజ్ రాజు పాలిటి. ఒకటే తేడా. అలాంటి బల్లచెక్క మీద ప్రయాణిస్తూ ఎవడూ తీరాన్నో లేక ఇంకొక ఓడనో చేరకుండా పదిహేనేళ్లు బతకలేరు. రాజు మాత్రం ఇంకా ఆ చెక్కమీదే వున్నాడు. దానిమీద రాజుని చేర్చినవాడు అఫ్తాబ్. కాలేజీలో ఎమ్మెస్ చేసినప్పుడు క్లాస్‌మేట్. ఫెయిర్‌ఫాక్స్ మాల్‌లో కలిసినప్పుడు ఆశ్చర్యపోయాడు. మొహమాటం లేకుండా రాజు చెయ్యి చాపితే కంగు తిన్నాడు.

“ఇండియాకి వెనక్కెందుకు వెళ్లా వసలు?” అని చికాకు పడ్డాడు అఫ్తాబ్. “నీ పిల్లలన్నా అమెరికాలో పుట్టుంటే బావుండేది. వాళ్లకి మైనారిటీ తీరగానే మీ బాధలు గట్టెక్కేవి!” అన్నాడు.

“దేశభక్తి మితిమీరి వెళ్లలేదు ఇండియా. హైదరాబాదులో ఉద్యోగాలు దొరక్కపోవు, తల్లిదండ్రులకి దగ్గరగా కూడా ఉంటుందని వెళ్లాను,” అన్నాడు రాజు.

“మరి వెనక్కెందుకు వచ్చావ్?”

“ఇండియా వెళ్లింది 1995లో కదా! పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టే సమయానికి వై2కె రాజుకుంది. ఎంతోమంది ఇక్కడికి రావడం చూసి రాణికి కూడా అరికాల్లో దురద పుట్టింది. 2000లో ఇక్కడికి వచ్చాం.”

“ఎంప్లాయీగానే వచ్చుంటావ్ కదా?”

“వచ్చింది అలాగే. ఒక రెండేళ్లపాటు వై2కె కొలాప్స్ వల్ల జరిగిన ఉద్యోగాల కోతని కూడా తట్టుకున్నాను. అయితే, యాక్సిడెంటయి పనిచెయ్యలేని పరిస్థితి ఎదురయ్యింది. యాక్సిడెంట్ సెటిల్మెంటులో కొద్దిగా డబ్బులు చేతికొచ్చెయ్ గానీ, దెబ్బల నుండీ కోలుకోవడానికి కొన్ని నెలలపాటు ఉద్యోగానికి దూరంగా ఉండేసరికి పీకేశారు. ఆ కాలంలో హెచ్-1 వీసా ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా లేదు. తెలిసినవాళ్లు ఇక్కడి ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఎలాంటివాళ్ల నయినా గట్టున పడెయ్యగలరని చెబితే నమ్మాను. సరిదిద్దుకోలేని పెద్ద పొరబాటు చేశానని తెలిసేసరికి పుణ్యకాలం గడిచిపోయింది.”

“నీ కొచ్చిన డబ్బులో కొంత లాయర్లు ఫీజుకిందా, గవర్నమెంటు టాక్సు కిందా లాగేసుంటారు!”

“నలభై శాతం లాయర్లకి. కట్టుంటే టాక్సుకింద ముఫ్ఫై శాతం పోయేది. మిగిలేది అరవై వేలు మాత్రం. ఎంతకాలం వస్తుందది? చూసుకునల్లా ఖర్చు పెడితే ఒక ఏడాది పాటు, అంతేగా!”

“టాక్సు కట్టలే దన్నమాట!”

“డబ్బు చేతిలో పడ్డప్పుడు కడదామనే అనుకున్నాను. టాక్స్ డే దగ్గర కొచ్చేసరికి నిరుద్యోగిగా ఎనిమిది నెలలు గడిపాను. తరువాత ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా పోయింది. … కెన్ యు హెల్ప్ మి?”

“ఏ వీసా లేని, తెచ్చుకోలేని నీకు లీగల్‌గా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేరు. అలా కావాలంటే ముందు దేశం బయటి కెళ్లి వీసాకి అప్లై చెయ్యాలి. నువ్వా మార్గంలో వెళ్లా లనుకోవట్లేదని అర్థ మయింది. అలాగని ఇండియా వెడితే అమెరికా నిన్ను తిరిగి రానిచ్చే ప్రసక్తి కూడా లేదనుకో. ఇంక నీకు మిగిలిందల్లా ఎవరన్నా కాష్ బేసిస్ మీద ఉద్యోగ మివ్వడం. ఓ వందా, వెయ్యీ ఇస్తారేమో గానీ, ఒకే చోట నిన్ను పెట్టుకుని సంవత్సరానికి సరిపడేటంత …  అది ఈ దేశం దురదృష్టం. లేకపోతే, అమెరికాలో కంప్యూటర్స్‌లో ఎమ్మెస్ చేసిన నిన్నీ పరిస్థితిలో నిన్ను చూడడ మేమిటి?

“ప్లీజ్ హెల్ప్ మి!”

“మా అన్నయ్యకి ఒక బాడీ షాపుంది. నీ కేమయినా సహాయం చెయ్యగలడేమో అడుగుతాను! నో గారంటీ,” అన్నాడు అఫ్తాబ్.

ఉత్త అడగడం కాదు. అర్థించి వుంటాడు. చేస్తా ననేదాకా సియాజ్‌ని విసిగించే ఉంటాడు.

“నీకు మెకానిక్ సర్టిఫికేష న్లేవీ వచ్చే అవకాశమే లేదు. నేను పని నేర్పగలను గానీ షాపులో నీ సర్టిఫికెట్లని డిస్‌ప్లే చెయ్యకుండా నీ చేత పని చేయిస్తే మిగతావాళ్లకి ఎలాగూ అనుమానం వస్తుంది. ప్రస్తుతం ఉన్నది ఇద్దరే మెక్సిక న్లనుకో. కానీ వాళ్లు లీగల్. వాళ్లకి నా మీద అధికారం చెలాయించ గలిగే అవకాశా న్నివ్వకూడదు గదా! ఇంకొకటి, అప్పుడప్పుడూ ప్రభుత్వం వాళ్లు అకస్మాత్తుగా తనిఖీలకి వస్తుంటారు. దాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి మరి. అందుకని, నువ్వు ఫ్రంట్ డెస్క్ దగ్గర ఉండి ఫోన్లు ఆన్సర్ చేస్తూండు,” అన్నాడు సియాజ్.

అప్పటినించీ అంతే. ఫ్రంట్ డెస్క్ దగ్గర ఉంటాడు. బిల్లులు తయారు చేస్తాడు, క్రెడిట్ కార్డు పేమెంట్లు తీసుకుంటాడు కానీ ఆ సీట్లో కూర్చోడు. అలాగయితే ఎవరన్నా అకస్మాత్తుగా తనిఖీ చేస్తే కస్టమర్ లాగా బిహేవ్ చెయ్యొచ్చు. సాయంత్రం తనూ, సియాజూ మాత్రమే షాపులొ మిగిలినప్పుడు మాత్రం ఆయిలూ, టైర్లూ మార్చడాలు చేస్తాడు గానీ, కంప్యూటర్ని, సాఫ్ట్‌వేర్‌ని మెయిన్‌టెయిన్ చెయ్యడం లోనే సియాజ్‌కి రాజు ఎక్కువ సహాయపడింది.

మెయిన్ టోల్ ప్లాజా దాటి ఒక మైలు దూరం వెళ్లిన తరువాత ట్రాఫిక్ వేగం పుంజుకుంది. ఆ వేగంతో సంబంధం లేకుండా అతని గుండె వేగం ఒక ఇరవై నిముషాల నించీ ఎలాగో పెరుగుతూనే వుంది. వెనక షెవీ టాహో, పక్కన జీప్ చెరొకీ కాపలా కాస్తున్నాయి. నాలుగు లేన్ల వేగాల్లో కొద్దిగా హెచ్చుతగ్గులుండడంవల్ల నేమో అవి అప్పుడపుడూ స్థలాలు మారిన ట్లనిపించినా అవి అతన్ని పట్టించుకుంటూన్నయ్యనే అతనికి అనిపించింది. పరీక్షిద్దా మనుకుని అవకాశ మొచ్చినప్పుడు లెఫ్ట్ సెంటర్ లేన్లో ఉన్న రాజు కుడిపక్కకు ఒక లేన్ మారాడు. కొద్ది క్షణాల తరువాత వెనకనున్న షెవీ కూడా లేన్ మారి అతని వెనకే రావడం అతని గుండె వేగాన్ని ఇంకొంచెం పెంచింది. ఆ నల్ల ఎస్యూవీలు ఏ హోండా పైలటో లేక టయోటా రోడ్‌రన్నరో అయ్యుంటే రాజు అంత భయపడేవాడు కాదు. ప్రభుత్వ వాహనాలు అమెరికన్ తయారీవే అయుంటాయని హీసూస్ చెప్పాడు. చట్టప్రకారం అలా చెయ్యాలట. గవర్నమెంట్ మస్ట్ బయ్ అమెరికన్!

హీసూస్‌కి ఫోన్ చెయ్యా లనిపించింది. డ్రైవ్ చేసేటప్పుడు హాండ్‌సెట్‌ని ఉపయోగించి ఫోన్ చెయ్యడం చట్టప్రకారం నిషేధం. బాల్టిమోర్ ఎయిర్పోర్టులో బయలుదేరినప్పుడు కారు బ్లూటూత్‌కి ఫోన్‌ని కనెక్ట్ చేసివుంటే బావుండే దనుకున్నాడు. అలా చెయ్యకపోవడాన్ని తిట్టుకుంటూ, తనని అబ్సర్వ్ చేస్తున్న ఆ రెండు కార్లల్లో ఉన్నవాళ్లకి తను చట్టాన్ని ధిక్కరిస్తూ ఫోన్ డయల్ చేస్తున్నట్లు కనిపించకుండా ఉండేలా జాగ్రత్తగా ఉంటూ, తల వంచకుండా, కళ్లు మాత్రం దించి, ఫోన్‌ని సీటు ఎత్తులో మాత్రం ఉంచి కీపాడ్ మీద అంకెలని నొక్కి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి హీసూస్ నంబర్ డయల్ చేశాడు.

“మీ నెయిబర్‌హుడ్‌లో ఆల్బర్తోని పట్టుకోవడానికి ఎన్ని ఎస్యూవీలు వచ్చె య్యన్నావు?” హీసూస్ “హలో” అనగానే రాజు అడిగాడు.

“నాలు గనుకుంటా. ఎందు కడుగుతున్నావ్?”

“నన్ను ఫాలో అవుతున్నవి రెండే. నాకు తగిన మర్యాద నివ్వడం లేదు వీళ్లు,” రాజు జవాబిచ్చాడు.

“వాటిల్లో ఎంతమం దున్నారో ఐడియా ఉన్నదా? రెండింటిలోనూ కలిపి ఒక డజను మంది ఉండొచ్చు గదా!”

“టింటెడ్ విండోస్. వెనకదాంట్లో ఇద్దరున్నట్లు కనిపిస్తోంది అంతే.”

“నీ లైసెన్స్ ప్లేట్ వివరాలని బట్టీ వాళ్లు నీ చరిత్ర నంతా పట్టేసి వుంటారు. పైగా, నువ్వు ఇల్లీగలేమోనని చాటి చెప్పేటంత పాత కారు కూడాను. అందుకని ఇంటికి వెళ్లకు. అలా వెడితే నీ భార్యకు కూడా ప్రమాదం!”

“నేను సియాజ్ కారు డ్రైవ్ చేస్తున్నాను. దీన్ని వాళ్లింటి దగ్గర వదిలేసి నా కారు తీసుకుని ఇంటికి చేరా లన్నది ఒరిజినల్ ప్లాన్.”

“మరి చెప్పవేం? సియాజ్ పాకిస్తాన్ నుంచీ అన్నావు గదూ!”

“అయితే?”

“కారు వివరాల గూర్చి ఆరా తీస్తే దొరికేవి సియాజ్ విషయాలు గదా! ఆ కనెక్షన్‌తో వాళ్లు అతన్ని వెంటాడుతున్నారేమో నీకేం తెలుసు?”

“ట్రంప్ గెలిచినప్పటి నించీ భయపడుతూనే వున్నాను. గత ఆర్నెల్లుగా నిర్దాక్షిణ్యంగా కుటుంబాలని విడదీస్తున్న సంఘటనల గూర్చి వింటూనే వున్నాం. ఇప్పుడు నేను వాళ్ల చేతికి చిక్కడం, వాళ్లు సియాజ్‌ని వెంటాడడం వల్ల నయితే, నా తలరాత ఇలా ఉన్నదనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేను.”

“ఈ మధ్య గ్రేస్ అనాటమీలో – టీవీ షో, వినేవుంటావు – ఒక DACA డాక్టరు. అదే, డ్రీమర్స్ అమ్మాయి. రెడ్ లైటుని బీట్ చేసిందన్న చిన్న కారణాన్ని పట్టుకుని చట్టం ఉల్లంఘన అంటూ దేశం నించీ తరిమెయ్యడానికి ప్రభుత్వాధికారి ఒకడు ఆ అమ్మాయి పనిచేస్తున్న హాస్పిటల్‌కి వస్తాడు. ఆ అమ్మాయి అక్కడ ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఎనీవే, జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి. స్పీడింగూ, రెడ్‌లైటుని బీట్ చెయ్యడాలూ వంటి వేవీ చెయ్యకు. గుడ్ లక్!” అని హీసూస్ ఫోన్ పెట్టేశాడు. అఫ్తాబ్ తగలడానికి ముందు హెర్న్‌డన్‌లో 7-ఎలెవెన్ పార్కింగ్ లాట్‌లో రోజు వారీ కూలి ఇచ్చే ఉద్యోగం కోసం నిల్చున్నప్పుడు రాజుకి పరిచయ మయ్యాడు హీసూస్. మొదట్లో తనతో బాటు కొన్ని ఉద్యోగాలకి తీసుకు వెళ్లి సహాయం చేశాడు. ఇమ్మిగ్రేషన్ వివరాలని తెలుపుతూంటాడు. మొదట్లో పేరు అర్థంకాక అడిగితే చెప్పిన స్పెల్లింగ్ విని ఆశ్చర్యపోయి, “మేం దాన్ని జీసస్ అని పలుకుతాం! ” అని చెప్పా డతనికి. “సాయి పంపిన తోడు!” అనుకుంటాడు రాజు.

రాజు ఇద్దరు పిల్లలు కూడా DACA ప్రోగ్రాంలో ఉన్నవాళ్లే. వివేక్ మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తున్నాడు. అతను, లహరి ఇద్దరూ ఈ దేశంలో ఇల్లీగల్‌గా ఉండడం వాళ్ల తల్లిదండ్రుల వల్ల జరిగింది తప్ప అందులో వాళ్ల ప్రమేయ మేమీ లేదు అని నిర్ణయించి వాళ్ల పేర్లని ఇమ్మిగ్రేషన్ అధికారులు DACA లిస్టులో చేర్చారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లూ తెలిసిన అందరూ – లాయర్లతో సహా – ఏమీ ఫరవా లేదు, మంచి క్వాలిఫికేషన్లున్న వివేక్, లహరిల వంటి ఎనిమిది లక్షల మందిని దేశం పోగొట్టుకోదు, కొంచెం ఆలస్య మయినా గానీ వాళ్లకి సిటిజెన్‌షిప్పు ఖాయం, అని ధైర్యం చెప్పారు.

“ట్రంప్ వచ్చిన దగ్గర్నుంచీ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంటుకి కొమ్ములు మొలిచి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది. మొగుడి చేత దెబ్బలు తిన్నవాళ్లు పోలీసులను పిలవడం మాట అటుంచి, ఆ దెబ్బలు ఎంత తీవ్రమయిన గాయాలని కలిగించినా హాస్పిటల్ మొహాలని చూడాలనుకోవడం కూడా మానుకున్నారు.  హాస్పిటల్‌కి వెడితే వైద్యం దొరుకుతుందో లేదో తెలియదు గానీ మళ్లీ ఇంటి మొహం చూడకుండా ఈ దేశం నుంచీ వెళ్లగొట్టబడడం మాత్రం ఖాయం! ఫ్యామిలీ వాల్యూసో అని మొత్తుకునే దేశంలో ఎంత ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అయితే మటుకు చిన్న పిల్లలని తల్లిదండ్రుల నించీ వేరుచేసే పరిస్థితి వస్తుందని ఎవరు కలగన్నారు?” అన్నాడు హీసూస్.

“ఎన్నారైలు కొంతమంది ట్రంపుకు ఓటు వెయ్యడమే గాక అతను చేస్తున్న పనులకి చప్పట్లు కొడుతున్నా రనడానికి ఋజువు కోసం ఎంతో దూరం వెళ్లక్కర్లేదు, మన ఇంటి ఓనర్ రెడ్డిగారు చాలు!” అన్నది రాణి.

“పోనీ, ఈయనేమన్నా గొప్పవాడా అంటే, వాళ్లింట్లో పార్టీ జరిగితే నేను చచ్చినట్లు చాకిరీ చెయ్యాలి. వంటలు చెయ్యడమే కాదు, ఇల్లు క్లీన్ చెయ్యాలి అతిథులు వచ్చే ముందరా, వెళ్లిన తరువాతా కూడా. అంత చేసినా ఒక్క పెన్నీ ముట్టచెప్పరు. మొదట్లో అప్పుడప్పుడూ అడిగేవాళ్లా? ఇప్పుడు అడక్కుండానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు! దయ జూపి ఇంట్లో ఉండనిస్తున్నందుకు ఈ వెట్టిచాకిరీ. రెడ్డిగారి పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు బేబీసిటింగ్ కోసం పిల్లలని బయట కెక్కడికీ పంపవలసిన అవసర ముండదని బేస్‌మెంట్లో ఉండమన్నారు. అప్పటికీ, నెలకి అయిదొందల డాలర్లు అద్దె తీసుకున్నారు. ఇదీ ఎక్స్‌ప్లాయిటేషనంటే!” అని కసిదీరా రాణి అక్కసు వెళ్లగక్కుతుంటుంది పార్టీ అని తెలిసినప్పుడల్లా.

“వీళ్లు టాక్సు లెగ్గొట్టడంలో ట్రంపు కంటే రెండాకులు ఎక్కువే చదివుంటారు. ఈ పన్నెండేళ్లలో మన దగ్గర తీసుకున్న అద్దె డబ్బులకి ఏనాడూ ఇన్‌కంటాక్సు కట్టి వుండరు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయి బేబీ సిటింగ్ అవసరం లేనందువల్ల మనం వాళ్లకి భారంగా కనిపిస్తున్నాం. ఇంట్లో పిల్లలున్నప్పుడు అవసరం లేని చోటు వాళ్లు కాలేజీ కెళ్లిపోయి జంటగా మిగిలిపోయినప్పు డొచ్చింది. వాళ్లకి ఇప్పుడు ఇల్లు చాలడం లేదట! నువ్వు బేబీసిటింగ్ చేసినప్పుడు వాళ్లకి నెలకు రెండు వేలు – అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మిగిలినట్లు లెక్క. ఇప్పుడు ఆ అవసరం లేదు గనుక ఆ రాని రాబడి గూర్చే పీక్కుంటూంటారు. కనిపించినప్పుడల్లా ఏదో ఒక సూటీపోటీ మాట ననకుండా వుండట్లేదు. ఈ క్షణాన ఇల్లు ఖాళీ చేసి వెళ్లండని అనకపోవడమే కాస్త గుడ్డిలో మెల్ల!” అని రాజు ఆమెకు వత్తాసు పలుకుతాడు. ఏదయినా గానీ, ఇండియన్స్ ఎక్కువగా ఉన్న నెయిబర్‌హుడ్‌లో కలిసిపోయి మనుగడ సాగించా రిప్పటిదాకా.

“మీ ఇండియన్స్‌లో ఇల్లీగల్స్ గూర్చి వినడమే అరుదు గనుక ఊర్కేనే ఆ నెయిబర్‌హుడ్స్‌లో రెయిడ్ చెయ్యాలనే ఆలోచనే వాళ్లకి రాదనుకుంటా. అదే స్పానిష్ స్పీకింగ్ వయితే, అక్కడ ప్రతీ ఒక్కడూ ఇల్లీగలే నని నమ్ముతారు. ‘దిసీజ్ అమెరికా, స్పీక్ ఇంగ్లీష్! ఇమ్మిగ్రేషన్ పోలీసులని పిలిస్తే మీ తిక్క కుదుర్తుంది,’ అంటూ ఒక తెల్లతను రెస్టారెంటులో అరవడాన్ని విడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు చూశావా? అది కూడా, న్యూయార్కులో. ఇంక దేశంలో సౌత్‌లో గానీ, మిడ్‌వెస్టులో గానీ పరిస్థితి ఎలా వుంటుందో ఆలోచించడానికే భయ మేస్తుంది,” అన్నాడు హీసూస్.

‘ట్రంపు పాలనలో ఏడాది గడిచిపోయింది. మిగిలిన మూడేళ్లూ ఎలాగోలా గడిచేలా చెయ్యి స్వామీ!’ అని షిరిడీ సాయిబాబాకీ, తిరుపతి వెంకన్నకీ రాజు మొక్కని రోజు లేదు.

రెస్టన్ పార్క్‌వే ఎగ్జిట్ దాటిన తరువాత రాజు మెల్లగా కుడిపక్క లేన్లో కొచ్చి, రైట్ టర్న్ సిగ్నల్ ఇచ్చాడు ఎగ్జిట్ దగ్గర కొస్తుండగా. అప్పటికి రెండు కార్ల ముందున్న జీపు కూడా లేన్లని మారి ఎగ్జిట్ లేన్లోకి వచ్చింది. అదీ, వెనక వున్న షెవీ కూడా ఎగ్జిట్ సిగ్నల్స్ ఇచ్చెయ్. టోల్ ప్లాజా దాటిన తరువాత ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పార్క్ వే మీదకు లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నానని తెలుపుతూ సిగ్నల్ ఇచ్చాడు. రెండు నల్ల ఎస్యూవీలూ అవే సిగ్నల్స్ ఇచ్చెయ్.

‘ఒక క్షణం క్రితం దాకా వాళ్లల్లో కనీసం ఒకడయినా అవతలిపక్కకి వెడతాడేమో, నేను అనవసరంగా భయపడ్డానేమో నని ఆశపడ్డా. ఇప్పుడు అది కాస్తా అడియాస అయిపోయింది. ఇంక సియాజ్ ఇంటికి చేరే లోపల ఈ రోడ్డు మీద మిగిలింది మూడు సిగ్నల్ లైట్స్. వాళ్లు వస్తోంది సియాజ్ కోసమే అయినా, నేను కూడా వాళ్లకి దొరికిపోతున్నాను!’ అనుకున్నాడు రాజు. ‘ఇన్నాళ్లూ నన్ను రక్షిస్తున్నా వనుకున్నాను గానీ ఇలా నీవల్ల పట్టుబడతానని కలలో కూడా అనుకోలేదు సియాజ్!’ అని ఆక్రోశించాడు. అతని గుండెదడ ఇంకాస్త హెచ్చింది. వంటి మీద చెమట ఎక్కువయింది. ‘వాళ్లు నన్ను పట్టుకున్న తరువాత ఎవరితోనూ ఫోన్లో మాట్లాడ్డం కానీ, ఎవరినీ కలవడం కానీ జరిగే పని కాదు. ఇల్లీగల్ ఏలియన్స్‌కి సిటిజెన్లకుండే హక్కు లేవీ లేవని కదా ట్రంప్ సుప్రీం కోర్టులో కేసు వేస్తే వాళ్లు తీర్పు నిచ్చింది? అఫ్‌కోర్స్, నన్ను ఇండియాకి చేర్చిన తరువాత అక్కణ్ణించీ ఫోన్ చెయ్యొచ్చు!’ రాజు మనసులో ఆలోచనలు పరిపరివిధాల పోతున్నయ్. ఆ క్షణాన అతనికి పిల్లల గొంతులు వినా లనిపించింది. దొరకడు అనుకుంటూనే వివేక్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్డ్ఆఫ్ అని తెలిసింది. ‘ఏ ఆపరేషన్ థియేటర్లోనో ఉండుంటాడు!’ అనుకున్నాడు.

గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత ముందున్న జీపుని జాగ్రత్తగా ఫాలో అవుతూ టర్న్ తీసుకున్నాడు. అతణ్ణి షెవీ ఫాలో అయింది. మధ్యలో వేరే కార్లేవీ అడ్డం లేకుండా ఇప్పు డతనికి ముందొకటి, వెనకొకటి నల్ల ఎస్యూవీలు రక్షక భటుల్లా. అతని గుండె వేగం ఇంకాస్త పెరిగింది. రేటు నిముషానికి రెండొందలు దాటివుంటుందని అనుకున్నాడు. స్పృహ తప్పకపోవడం ఆశ్చర్యకరం. ముందు కారుకి తగినంత దూరాన్ని మెయిన్‌టెయిన్ చేస్తూ డ్రైవ్ చెయ్యగలుగుతున్నాడు!

మొదటి లైటు దాటాడు.

కాలేజీలో క్లాసులో ఉన్నదేమో ననుకుంటూనే లహరికి ఫోన్ చేశాడు. “హాయ్ డాడ్!” అంటూ లహరి గొంతు వినిపించింది. కళ్లల్లో నీళ్లు నిలబడి, గొంతుని ఎవరో నొక్కేసినట్లనిపించి జవాబు చెప్పలేకపోయాడు.

“డాడీ?” లహరి రెట్టించింది.

రెండో సిగ్నల్ దగ్గర కొచ్చాడు. అది పొరబాటున యెల్లోకి మారితే బ్రేకు వెయ్యడానికి రెడీ అయ్యాడు. అయితే, ఆ అవసరం రాలేదు.

“డాడీ, ఆర్యూ ఆల్‌రైట్?” లహరి గొంతులో ఆదుర్దా వినిపించిం దతనికి.

“యస్ బేబీ!” అన్నాడు గొంతు పెగుల్చుకుని. “అన్‌టిల్ నెక్స్ట్ టైమ్!” అని అందా మనుకున్నాడు గానీ, కూతురుని గాభరా పెట్టడ మెందుకని అంతే అన్నాడు.

అతని గొంతులో తేడాని కనిపెట్టి లహరి ఆందోళన చెందింది. “నీ గొంతు వేరేగా ఉన్నది,” అన్నది.

“గొంతులో ఏదో అడ్డం పడి,” అని ఆపేశాడు గానీ, ఎవరో ఒక కవి అన్న వాక్యం – గుండె గొంతుకలోన కొట్లాడుతాది – అతని స్ఫురణ కొచ్చింది.

“హోప్ యు ఆర్ ఓకె. నేను క్లాసు కెళ్లాలి. ఏమైనా అర్జెంటా?” లహరి అడిగింది.

“నో. నథింగ్. నీ గొంతు వినా లనిపించింది. అంతే,” అన్నాడు ఒక చేత్తో కళ్లని తుడుచుకుంటూ. “బై!” అని లహరి ఫోన్ పెట్టేసింది.

ఆ రోడ్డు మీద మూడో సిగ్నల్ దగ్గర కొచ్చాడు. ఇక్కడే లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. టర్న్ సిగ్నల్ ఇచ్చి, టర్నింగ్ లేన్ లోకి మారాడు. అతనలా సిగ్నల్ ఇవ్వడం, లేను మారడం చూసి కూడా, తిన్నగా వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఉన్నందున ముందరి జీప్ చెరొకీ ఉన్న లేన్లో కంటిన్యూ అవుతూ ఆ ఇంటర్సెక్షన్ దాటి ముందు కెళ్లిపోయింది. రేర్ వ్యూ మిర్రర్లో చూస్తే షెవీ టాహో మాత్రం అతని వెనకే ఉన్నది. “మీరెళ్లి వాణ్ణక్కడ ఆపి ఉంచండి. మేం వెళ్లి ఇంకొంత బలగాన్ని తీసుకొస్తాం,” అని చెప్పివుంటా రనుకున్నాడు.

గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత టర్న్ తీసుకున్నాడు. రేర్ వ్యూ మిర్రర్ని గమనిస్తూనే ఆ రోడ్డు మీద కొంత దూరం ముందుకు వెళ్లి, ఎడమపక్క రెండవ సందులోకి కారుని మలుపు తిప్పాడు. షెవీ కుడిపక్క సందులోకి మలుపు తిరిగింది. రాజు ముందుకు వెడుతూనే మిర్రర్లో వ్యతిరేక దిశలో వెడుతూ కనుమరు గవుతున్న షెవీని గమనించాడు. ఆశ్చర్యంతో అతని నోరు తెరుచుకుంది. “ఇదేమిటి?” అని పెద్దగానే అన్నాడు. అతనికి జవాబు చెప్పేవాళ్లెవరూ లేరు. సియాజ్ ఇంటి సందులోకి రైట్ టర్న్ తీసుకుని, సందు మొదట్లోనే పక్కకు తీసి కారు నాపి తనని దాటి వెడుతున్న వాహనాలని గమనించాడు. అది నెయిబర్‌హుడ్ అవడం వల్ల ఎక్కువగా వాహనాల రాకపోకలు లేవు.  నల్ల ఎస్యూవీ కనిపించని నిముషాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అతని గుండె వేగం తగ్గుతూ వచ్చిందని అతను గ్రహించాడు. పావు గంట గడిచిన తరువాత సాయి భజన రింగ్‌టోన్‌తో అతని ఫోన్ మోగేసరికి ఉలిక్కిపడ్డాడు. తేరుకుని, డిస్‌ప్లే మీద నంబర్ చూసి బటన్ నొక్కి, “ఆఁ వివేక్!” అన్నాడు.

“మిస్‌డ్ కాల్ ఇప్పుడే చూశాను,” అన్నాడు వివేక్.

“ఒక పావు గంటలో ఇంటికి చేరతాను. అప్పుడు మీ అమ్మకీ, నీకూ కలిపి ఒకేసారి ఒళ్లు గగుర్పొడిచే ఒక అనుభవం చెబుతాను. నువ్వు అవైలబులేనా?”

“ఆఁ. ఎనీ గుడ్‌న్యూస్?”

“బాడ్ న్యూస్ కానిది ప్రతీదీ గుడ్ న్యూసే నంటారు మీ తాతయ్య,” అన్నాడు.

“ఓకె. ఈసారి నీ కాల్ మిస్ కాన్లే,” అని వివేక్ ఫోన్ పెట్టేశాడు.

షిరిడీ కెళ్లే అవకాశం భయపడినంత త్వరలో లేదని అప్పు డనిపించిం దతనికి.

కారుని సియాజ్ ఇంటి ముందర ఆపి, డాష్‌బోర్డు మీద టైం చూస్తే తను మొదట ఆ నల్ల ఎస్యూవీని రేర్ వ్యూ మిర్రర్లో చూసి గంటయిందని రాజు గమనించాడు. దిగి, తాళంచేతులని చేత్తో పట్టుకుని వెళ్లి ఆ ఇంటి డోర్ బెల్ మోగించాడు. గంట నుండీ ఇటిక మీద ఇటికని పేర్చి అతనిమీద కట్టినట్టున్న గుండె చప్పుడు భారం ఒక్కసారిగా ఆ లండన్ బిగ్‌బెన్ డోర్ బెల్లు శబ్దం రూపంలో తొలగిన ట్లనిపించి రాజుకి నిస్త్రాణ కలిగింది.

తాడికొండ శివకుమార శర్మ

తాడికొండ శివకుమార శర్మ

వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్. ఐ.ఐ.టి. మద్రాసులో బాచెలర్స్ డిగ్రీ తరువాత రట్గర్స్ యూనివర్సిటీలో పి.హెచ్.డి. వాషింగ్టన్, డి.సి., సబర్బ్స్ లో పాతికేళ్ళకి పైగా నివాసం. మొదటి కథ "సంశయాత్మా వినశ్యతి" రచన మాస పత్రికలో 2002 లో వచ్చింది. ఇప్పటి దాకా యాభైకి పైగా కథలు పలు పత్రికల్లో వచ్చాయి, కొన్ని బహుమతుల నందుకున్నాయి. "విదేశ గమనే," (జనవరి 2016 లో) "స్వల్పజ్ఞుడు" (జనవరి 2018 లో) అన్న కథా సంకలనాలు వెలువరించారు. "అదృశ్య హస్తపు అస్పృశ్య స్పర్శ" ధారావాహికగా వాకిలి వెబ్ పత్రికలో, ఆ తరువాత అదే శీర్షికతో నవలగా వెలువడింది. అయిదు నాటికలు రచించారు, కొన్నింటికి దర్శకత్వం వహిస్తూ నటించి, డెలావర్ నాటక పోటీల్లో ప్రదర్శించారు. "ఇది అహల్య కథ కాదు" ప్రదర్శన అజో-విభో-కందాళం వారి వార్షిక ఉత్సవాల్లో నిజామాబాదులో 2006 లో, తరువాత 2007 లో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగింది.

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • వావ్! భలే!
  ఇప్పుడే రాజులో నేను, రాజులా నేను BWIనుండి, 495, 267 మీదుగా సిరాజ్ యింటిదాకా గుండె వుగ్గ బట్టుకొని ప్రయాణం చేశాను. ఆ రోడ్డమ్మట నేను రోజూ ప్రయాణిస్తాను గనుక మీరు లేన్ల వివరాలతో సహా కరక్టుగా చెప్పడం ఇంకా నచ్చింది.
  ఒక పాకిస్తాని అమెరికన్ దగ్గర ఒక ఇండియన్ ఇల్లీగల్ ఇమ్మిగ్రాంట్ .. చాలా గట్టి, చిక్కటి కాంబినేషన్.
  చట్ట వ్యతిరేకంగా ఈ దేశంలో నివసిస్తున్నవారు క్షణ క్షణం భయంతో ఎలా బతుకీడుస్తారో, వాళ్ళను చట్టబద్దంగా నివసించేవారు ఎలా దోచుకుంటారో..చక్కగా చెప్పారు.
  ఆదుగడుగునా సస్పెన్సు అదే సమయంలో ఈ దేశంలో ప్రస్తుత పరిస్థితిని వివరించడం. ఇక భయమూ, సంతోషమూ లోపల్నుండే వస్తాయనే ఒక తత్వమూ!

 • శర్మ గారు, చాలా చక్కని కథ. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ఇమ్మిగ్రెంట్స్ లో ఉన్న భయాన్ని సస్పెన్స్ లో పెట్టి చాలా చక్కగా వివరించారు. అభినందనలు .

 • లబ్, డబ్ వేగం పెంచారు! ఇంకా మరో మూడేళ్ళు ఆ ట్రంప్ ని భరించాలా! ఓ హాలివుడ్ సినిమా చూపించారు! Wonder it it is still worth living in that country with all these uncertainties!

 • good suspense, blended well into contemporary social turmoil. One of my recent favorite stories featured a petty thief of Indian origin – to which many readers protested that Indians in America are not thieves. I replied – why not? I am sure your story will get a similar question. 🙂
  Good show!!

 • Good narration.. I felt my heart beat as well!
  డ్రైవింగ్ నేర్చుకుని మొదటిసారి హైవే మీద వెళ్ళినప్పుడు నా గుండె కూడా గొంతులోకి వచ్చింది .. ఆ అనుభవాన్ని ప్రస్తుత పరిస్థితులతో చక్కగా కలిపి చెప్పారు . Made me read till to the end… gripping!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు