కొత్త గొంతుక కోసం హరీష్ అన్వేషణ

హృదయం నిండా తడి నింపుకొని, ప్రతి చిన్న అంశంపై స్పందించే హరీష్ తో మాట్లాడుతున్నంత సేపు ఒక రకమైన సాహితీ తృష్ణ కనిపించింది.

“Poetry is the other way of using LANGUAGE –  భాష ను ఇంకోరకంగా వాడటమే కవిత్వం.
“అంతెందుకు
ఆదిత్య369 సినిమా సీక్వెల్
నీ జీవితంలోకి తొంగి చూస్తుంది
నువ్వందులో పాత్ర పోషిస్తావు
చర్మంపై వేడివేడి బొబ్బట్లు వేయించుకుంటావు
భూమిపొరల్లో ఇళ్ళుకట్టుకొని
నువ్వో పాతాళభైరవి సినిమా చూస్తావు
..
చెట్లపాదుల కూల్చేసి
నీటిచుక్కలకోసం
నువ్వు వట్టి నల్లాల పితుకుతున్నావు
ఓజోన్ పొరకు చిల్లులు పెట్టుకుంటూ
చంద్రుని మీద కాలుమోపుతున్నావు”.
ఈ గొంతుక ఎవరిది? భాష ను ఇంకోరకంగా వాడుతున్న ఈ కొత్త కవిత్వ తీరం ఎవరిది?  ఈ సౌందర్య వస్తువుల సృష్టి కర్త ఎవరు? నాకూ కాస్త తెలుసుకోవాలని అతడి ఫేస్ బుక్ వాల్ పైన  చూస్తూ వెళ్ళాను. వెళ్ళగా… వెళ్ళగా, అంతులేని కవిత్వ సంపద  చిక్కగా ఎదురైంది. అతి సున్నిత భావాలతో, అలతి పదాలతో, గొప్ప అర్థాన్ని చెప్పిన ఇతడి కవిత్వం ఖచ్చితంగా ‘సారంగ’ పాఠకులకు అందచేయాలని భావించాను.
అతడు తండ హరీష్ గౌడ్. పుట్టింది పెద్ద గూడూరుగ్రామం, మండలం, మహబూబా బాద్  జిల్లా, తండ్రి చిరువ్యాపారి.  తల్లి గృహిణి. బాల్యం పెద్ద గూడూరులో నే పూర్తయ్యింది. ఇంటర్మీడియట్  మహబూబాబాద్ లో చదివారు. వికాస్ కళాశాలలో చదివారు. మొదటి కవిత లోనే, ఇలా భిన్నంగా కనిపించిన ఇతని కవిత్వం మరింత లోతుగా అధ్యయనం చేయాలని భావించాను.
“poetry speaketh somewhat above a mortal mouth” అని బెన్ జాన్సన్ తెలిపారు.“కవిత్వం ఆత్మగత అనుభవాల్ని ఆవిష్కరిస్తుంది” అని హెన్రీ బెర్గ్సన్  చెప్పారు. ఇలాంటి కోట్ లు విన్నప్పుడు , నిజంగా అలాంటి కవిత్వం ఎక్కడైనా దొరకబుచ్చుకొని చదవాలని అనిపించేది.  ఆ అనుభవం  ఉన్నఫళంగా నాకు ఎదురైంది.  సరిగ్గా అలాంటి కవిత్వాన్నే తండ హరీష్ గౌడ్  రాస్తున్నట్లు గమనించాను. అతని కవిత్వాన్ని తరచి చూసాను. తన ఆత్మగత అనుభవాల్ని  హరీష్  ఎంత హృద్యంగా, సరళంగా కవిత్వం చేసారో ఈ కింది వాఖ్యలు చదవాల్సిందే..
సముద్రాన్ని తలాపున పెట్టుకొని
అలల్లో విషాదాన్ని వెతుకుతుంటారు..
ఇసుకతిన్నెలపైన కూర్చొని మృత్యుగీతాలు
ఆలపిస్తుంటారు..
కవిత్వమంటే ఏడవడమేనా?
నేనొరకం..నువ్వోరకం..
నా ఏడుపు నాదే
నీ ఏడుపు నీదే
నీ కన్నులు నేనతికించుకున్నంత మాత్రాన
నీలానే చూస్తాననే నమ్మకం లేదు
నీ కన్నులే నాలా చూస్తాయేమో ఎవరికెరుక?
కావాలంటే
అందరం ఒకేలా ఆలోచించే రోజు
తారాసపడ్డప్పుడు
ఇద్దరం ఒకరికొకరం ఎదురుపడి
ఇద్దరి ఏడుపంతా తుడుచుకుపెట్టుపోయేలా
పగలబడి నవ్వుదాం..
ఒక లోతైన మార్మికతను ఫిలాసఫీ తో జోడించి పాఠకులకు అందించారు.  ఇదంతా అతడికి తెలిసే రాసి ఉంటాడని నేను అనుకోను. కొమ్మకు ఆకులు పుట్టినంత సహజంగా అతడికి కవిత్వం అబ్బిందని చెప్పవచ్చు.  ఆస్కార్ వైల్డ్ అన్నట్లుThe artist is the creator of beautiful things, కళాకారుడు సౌందర్య వస్తువుల సృష్టి కర్త. ఒకవైపు సౌందర్య వస్తువుల సృష్టిస్తూనే, ఒకరకమైన విప్లవ ధోరణులు కూడా హరీష్ చాల పవర్ఫుల్  ఎక్స్ప్రెషన్ లో చెప్తాడు.  మావో అన్నట్లు…Before the revolutionary comes, culture prepares for it in the ideological field. During the revolution, it is important and necessary sector in the revolutionary front”  విప్లవం కంటే ముందుగా ఆ విప్లవ సంస్కృతి ముందుగా ఫార్మ్ అవుతుంది.  హరీష్ కవితల్ని చదువుతుంటే, ఆయన మాటలు గుర్తుకు వచ్చాయి.  కవులు సహజంగా స్పందిస్తారు.  కానీ, ఆ స్పందన  ఎంతటి అగ్ని ని మోసుకొస్తుందో  అనే దాన్ని బట్టి  కవి గమనం ఖరారు అవుతుంది.  గమనం లక్ష్యాన్ని ఖచ్చితంగా నిర్దేశిస్తుంది.   హరీష్ రాసిన ఈ రెండు కవితల్లోని  కొన్ని చరణాలు చదివితే హరీష్ సరిగ్గా ఇలాంటి ధోరణి లోనే తన కవిత్వాని రాస్తున్నాడు.  కవిత్వంలో కాస్త  వచనమూ మనకు అక్కడక్కడా ఎదురైనా సరే, ఆ రెవల్యూషనరీ కల్చర్ ను ఇతడు ప్రిపేర్ చేస్తున్నాడని అనిపిస్తుంది.
“రాయాలి
భరతభూమి చుట్టూ
నిప్పుకణికలు గస్తీకాస్తున్నాయని
సముద్రాలు ఉప్పొంగుతున్నాయని
ఆకాశాలు కన్నెర్రచేస్తున్నాయని
సూర్యుళ్ళు రాత్రి,పగలు భగభగ మండిపోతున్నారని..
రాయాలి
ప్రాణాలను సరిహద్దుగా నాటి
రక్తాన్ని నీరుగా పోసి,
త్రివర్ణ పతాకాన్ని విరబూయిస్తున్న
ఆ సముద్రాలు,ఆ ఆకాశాలు,ఆ సూర్యుళ్ళు
సైనికులని..
ఇదిలా ఉంటె, హరీష్ లో ఒక తత్వవేత్త కూడా దాగి ఉన్నాడు. ఆ తాత్వికత ఇతడికి ఎలా అబ్బిందో అని అతడి జీవిత శైలి ని గురించి అడిగాను.  మధ్య తరగతి కుటుంబం. తండ్రి రెక్కల పైన సజావుగా సంసారాన్ని సాగించారు.  ఇలాంటి హరీష్ కు ఇంతటి తాత్వికత ఎలా వచ్చిందన్న సందేహం తో ఆయన రాసిన ఈ కవిత చూసాను.  బహుశా, ఆ తరహా కవిత్వాన్ని అతడు బాగా చదివి,  వొంటపట్టించుకోన్నాడని నేనో అభిప్రాయానికి వచ్చాను. ఈ కవిత లో…
నొసటిపై గీతలు గీసినవాడొకడు
గీతలు చెరిపేవాడొకడని తెలుసు
ఈ క్షణభంగురాల మధ్య
గిరికీలు కొట్టేదే జీవితమని తెలుసు
సమయాన్ని ఓడించాలనే వేగంలో
తానే జీవితమంతా తేడాతో ఓడిపోయాడు..
ఒక్క క్షణం ఆగితే
కొన్ని చంద్రుళ్ళు మన చుట్టూ తిరిగెళ్ళుతాయి
కొన్ని సూర్యుళ్ళు ప్రదక్షిణ చేస్తాయి
సిమెంటుదేహాలలో బందీఅయ్యే
కర్మమనకెందుకని
ఆ రోజు దానికదే రావాలని
ఇంకొకతను
గుండెపట్టుకొని కుప్పకూలాడు
ఇప్పుడే తినొచ్చాడు
చెయ్యి తడిఆరిందో లేదో అని
ఇంకొకతను.
ఇలా ఒక్కో కవితను ఒక్కో అభివ్యక్తి తో భిన్నంగా తన కవిత్వాన్ని పాఠకులకు అందిస్తున్నాడు.  హరీష్ ను  సారంగ కు పరిచయం చేయాలని అనుకోనేలోగా, అతడు తన కవిత్వాన్నంత “నీటి దీపం”  అనే పేరు పైన కవితా సంపుటి ఒకటి తీసుకు వస్తున్నాడని తెలిసింది. ఆ నేపధ్యం లో హరీష్ తో సారంగ మాట్లాడింది.. ఆ సంకలనం గురించి  ఆయన మాటల్లోనే విందాం…
“ సమాజంలో దుర్భరమైన బ్రతుకు ఈడుస్తున్న కొన్ని జీవితాలను పరిచయం చేస్తున్నాను. సమాజం లో జరుగుతున్న అనేక దాష్టీకాలను ఖండిస్తూ, ప్రేమ, అనురాగం , ఆప్యాయతలకు దూరమవుతూ, కనీసం మనుషులుగా జీవించలేని వారికి సందేశాన్ని ఇస్తూ రాసిన నా ఈ కవిత్వం జూలై 21 వ తేది, సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో కవి శివారెడ్డి చేతుల మీదుగా విడుదల అవుతోంది సార్…. !” అని అతి వినయంగా చెప్తాడు.
కొద్దిగా అయన జీవితం లోకి కూడా తొంగి చూడాలని ‘సారంగ’ చేసిన ప్రయత్నం కు ఆయన అతి ఓపిగ్గా స్పందించారు.
హరీష్ ఒక స్టాండర్డ్ లైఫ్ ను గడుపుతున్నాడు.  కవిత్వం మీకు ఎలా అబ్బిందన్న నా ప్రశ్నకు ,  ఆయన సమాధానం ఆయన మాటల్లోనే విందాం….
“పింగిలి శ్రీనివాస్ అనే గురువు నా చేత పాటలు పాడించే వారు. జన జాగృత , నవ భారత మహోదయం అనే పాట ను పాడించారు.  అట్లా పాటల పట్ల శ్రద్ధ పెరిగింది. పాటలు పాడుకొంటూ పోయే క్రమం లో డిగ్రీ లో 2003 నుండి 2005 లో పాటలు రాయడానికి ప్రయత్నించాను. లవ్ ఫీల్ ఉండే పాటలు రాసినాను. డిగ్రీ చేసే సమయం లో జయం , నువ్వు, నేను అనే సినిమా లు వచ్చాయి. ఆ స్ఫూర్తి తో పాటలు రాయడం మొదలు పెట్టినాను.  డిగ్రీ 2005 వరకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో చదివాను. ఆ వయసులో నేను రాసిన పాటల కవిత్వం ….
కెరటం లా పొంగే నా హృదయం
నా మదిని పులకరింప చేసే ఒక పవనం…
నాలో ఆవేదనే ఈ ఉప్పొంగే ప్రవాహం.
నాకంటూ ఉంది  ఒక సందేశం.. అదియే ప్రేమ సందేశం….
…..
నాదొక చిన్ని హృదయం, ఆ హృదయం లో ఒక కోవెల…
ఆ కోవెల లో గుడి గంటల మోతలు,
నా గుండె ఆర్తనాదాలు
ఆమె: నాదొక చిన్ని మనసు
ఆ మనసులోన ఒక నిలయం
ఆ నిలయం లో తిరగాడుతున్నది నీకోసం కాదా..!
ఇలా డిగ్రీ లో ఉన్నప్పుడు ఇలా రాస్తూ వచ్చాను. 2007 లో బి.ఇ.డి.  మహబూబా బాద్ లోని , మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ లో  పూర్తి చేసారు. బి.ఇ.డి లో ఉండగా, నిజానికి  ఫిజికల్ సైన్సు ప్రత్యెక సబ్జెక్టు. కానీ, తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమ తో మాథ్స్ బదులుగా, నేను తెలుగు మెథడాలజి  తీసుకొన్నాను. తెలుగు లో  పాటాలు చెప్పడం లో నేను నాదైన ప్రత్యేకత ను చాటుకొన్నాను.
బి.ఇ.డి లో ఉండగా, అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర లోని  ప్రవరుని స్వగతం  అని చాప్టర్ లో పద్యాలు అద్బుతంగా క్లాసు రూమ్ లో పాడి మెప్పించే వాడిని.  ఇలా చెపుతూనే ఆయన ఒక పద్యాన్ని అనర్గళంగా పాడేసారు. చాల ఆశ్చర్యం అయింది.
తర్వాత ఉద్యోగ అన్వేషణ చేస్తూనే,  ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి MA తెలుగు చేసాను. అయిపోయిన తర్వాత డియస్సీ ని ఎలాగైనా సాధించాలన్న తపన లో మునిగి పోయాను. వాస్తవంగా నాకు తెలుగు టీచర్ కావాలని ఉండేది. భాష పైన ఉన్న ప్రేమ తో అలా జరిగింది. తిలక్ గారు రాసిన ‘పిలుపు’ అనే కవిత నన్ను ఎక్కువగా ప్రభావితం చేసింది.  త్రిపురనేని గోపీచంద్ గారి తుమ్మ చెట్టు అనే పాఠం, అలాగే సినారె గారి “ప్రపంచ పదులు” ఇవన్నీ ప్రభావితం చేసాయి.  ఆ క్రమం లో తెలుగు టీచర్ కావాలన్న ఆలోచన బలంగా పాతుకు పోయింది. తొలుత 2009 లో జెడ్ పీ హెచ్ ఎస్. తీగల వేణి అనే స్కూల్ లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు అయ్యప్ప మాల వేసాను. అప్పుడు వినాయకుడి పైన పాట రాసాను….
2013 లో నా మొట్ట మొదటి కవిత  మానని గాయం.
తగిలింది గాయం
బండిపై వెళ్తున్నప్పుడు
పిల్లవాడు మధ్యలోకి వచ్చినప్పుడు
నా మనస్సు ఎక్కడుందో …ఏ మూలన విహరిస్తుందో
నేరుగా హృదయం పై తగిలింది.
….
2014 లో పల్లె జీవితం అనే కవిత రాసాను.
“పల్లెలో జీవించడం అంటే
పరమాత్మునిలో లీనం అయినట్లీ.
పల్లెలో కలిసి ఉన్నామంటే,
అనురాగం లో ఆరితేరినట్లే
అంతరాలు లేని అనుబంధాలు
అన్ని కులాల మధ్య
ఏ కులం వాడైనా వరస కలిపి పిలవవలసిందే
ఏ మతం వాడిన చేయి కలిపి నడవ వలసిందే
ఆచార్య బద్రి రాజు గారి భాషా శాస్త్రం , ఎస్పీ రామారావు గారి సాహిత్య విమర్శా, బాగా చదవాల్సి వచ్చింది. ఇదంతా 2012 లో జరిగింది. నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం అమృతం కురిసిన రాత్రి. గోపీచంద్ గారి అసమర్థుడి జీవిత యాత్ర. అటు ఉద్యోగం చేస్తూనే, సాహిత్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపి, అలాగే కవితలు రాసుకొంటూ వచ్చాను .
నాగపూర్ లో ఉద్యోగం చేస్తుండగా, అక్కడ బఠానీలు అమ్మే ఒక అమ్మ నాకు కనిపించేది. ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘బఠాణీలవ్వ’ అనే కవిత రాసాను.
పిల్లలు ఆమె దగ్గర బఠానీలు కొంటారు.
నేను మాత్రం ఆత్మ విశ్వాసం అప్పు తెచ్చుకొంటా
ఏ విశ్వ విద్యాలయం ఎదురుపడని పాఠ్య ప్రణాళిక ఆమె జీవితం
నేను పిల్లలకు పాఠాలు బోదిస్తుంటే ,
నిత్యం నాకు ఆమె జీవిత పాఠాలు బోధిస్తాది.
ఇలా చెపుతూ… ఆయనలో స్పందించే ఆ గుణాన్ని తన మాటగా చెపుతూ…
రైతులు అందరూ ఒక మార్చ్ జరిగింది సర్..  అప్పుడు ఆ రైతుల కష్టాన్ని చూసి, చలించి పోయి, ఇలా రాసాను….
“ఎండను దీపంగా కౌగిలించుకొని
పయనిస్తున్నప్పుడు
ఎన్ని బొబ్బలేక్కినా చెక్కు చెదరని
ఆత్మ విశ్వాసం
వరిమళ్ల మైదానం లో
ఆటాడిన ప్రతీ సారీ
ఎప్పుడో ఒకప్పుడు గెలుస్తాననే నమ్మకం.
 నాకైతే ఆయన కవిత ఇలా ఎంతో ఆర్ధ్రతగా అనిపించింది.
ఆసిఫా ఉదంతం జరిగినప్పుడు  కూడా నా మనసు కకావికలం అయింది సర్..
“చివరి కోరిక”.. అనే ఈ కవిత లో….
ఆపద సమయాల్లో
మా చేతుల్లో గండ్ర గొడ్డళ్ళు మొలిస్తే బావుండేది
శ్రుతి గతి తప్పి వేణు గానమూదే
నయవంచకుల పాటకు
విషపు పల్లవై గొంతు లాడితే
భూమికి సగం భారువు తగ్గేది.
చేతి కొచ్చిన పంట కు చీడ పడితే
మందు పిచికారి చేస్తారు
మరి కలల మేడలు కట్టుకొన్న
మా జీవితాలను తొలుచు పురుగులకు
జీవితమే బదులు అంటున్నాను. .సమంజసమే కదా…!
ఇలా ఎప్పటికప్పుడు తన గళాన్ని కవిత్వం లో వినిపించే హరీష్ చాల సౌమ్యుడు.  ఎదిగే కొద్దీ వొదగాలని ఆలోచన ఉండే వాడు.  అమ్మాయిలపై యాసిడ్ దాడులు జరుగుతుంటే, ఆయన రాసిన కవిత .”.ఏది స్వాతంత్రం ?”  ఈ కవిత లో కవితా వాక్యాలు చూడండి…
ఒకడు శరీరమంతా కామాన్ని నింపుకొని
పసిపాపలపై మగతనాన్ని ప్రదర్శిస్తుంటాడు
అవసరమొస్తే రసాయనాలను మొఖం పై చల్లి
ఆడపిల్లల ముఖ చిత్రాలను
ఛిద్రం చేస్తుంటాడు .
ఎవరికీ వారే నిలువెల్లా స్వార్థాన్ని నింపుకొని
జేబులు నిమ్పుకొంటున్నారే తప్ప
దేశ భవిత కు బాటలు వేసే వారు లేరిక్కడ…
రాబందుల తరిమేస్తేనే రాజ్యం బాగు పడుతుందేమో…!!
హృదయం నిండా తడి నింపుకొని, ప్రతి చిన్న అంశంపై స్పందించే హరీష్ తో మాట్లాడుతున్నంత సేపు ఒక రకమైన సాహితీ తృష్ణ కనిపించింది. అతనికి  పుట్టుకతో మార్క్సిస్టు భావాలు అలవడ్డాయి. పేదల పట్ల, అట్టడుగు వర్గాల వారి పట్ల ఆయన స్పందన నిజంగా హాట్సాఫ్. హైదరాబాద్ లో ఉండగా, రోజు రాత్రి అవుతూనే జొన్న రొట్టెలు తినే అమ్మలు చాల మంది గురించి ఈయన కవిత ను చూడాలి …
కవిత పేరు … రొట్టెలమ్మలు
“ సాయంకాలం వేళ కొలువు దిగిన
సూర్యున్ని మంట గా పెట్టి
గాలితో సోపతి చేసుకొంటూ …
అరచేతుల్లో చందమామల్ని గీస్తారు ..
సూర్యుడు అస్తమించే సమయం లో ..
వీళ్ళ బ్రతుకులకు సూర్యోదయం
వారు కొత్త నుంచి పాత వైపుకు దార్లేస్తున్న
ఫుడ్ ఇంజనీర్ లు .
పల్లె వంటకాలకు పట్టణం లో ప్రాణం పోస్తూ
సాయంకాలపు క్లినిక్ లు నడుపుతున్న డాక్టర్ లు …!
తన కవిత్వాన్ని క్రమేపి ఎంత చిక్కగా, స్పష్టంగా చేస్తూ వచ్చారో గమనించ వచ్చు. బహుశా హరీష్ ఎక్కువగా పుస్తకాలు, కవిత్వం చదవడం., స్పందించే హృదయం ఉండటం. చుట్ట పక్కల స్నేహితుల జోక్యం. ఇవన్నీ ఆయన లో ఆ సాహిత్య పిపాసిత్వం మెరుగు పడేలా చేసింది.
హరీష్ తండ్రి శ్రీహరి. మోటార్ వైన్డింగ్ వర్క్ చేసుకొంటూ జీవనం సాగించారు. ఆయన కష్టం పైన స్పందిస్తూ రాసిన ఈ కవిత  పేరు…”నిఖార్సైన వాఖ్యం “
తాను రోజు ముక్కలు ముక్కలు అవుతూ..
నన్ను అతికించుకొంటూ వచ్చారు.
తాను గాయమవుతూ, తగలక ముందే
తాను మందులు పూస్తూ వచ్చాడు.
..
మా కష్టాలన్నిటిని దొంగిలించి, తన జోలె సంచిలో మూట కట్టుకొని
నేరనట్టు ఉండే దొంగ మా నాన్న
….
ఇలా ఒక రెండు గంటల సేపు తన కవిత్వం లోని వైవిధ్యాన్ని, తన శైలినీ తన అభివ్యక్తినీ సారంగ కు చెప్పకనే చెపుతూ వచ్చాడు తండ హరీష్ గౌడ్…!
Avatar

సి.వి. సురేష్

53 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ధన్యవాదాలు..సర్..
  చాలా చాలా సంతోషం సర్..
  ఇప్పుడిప్పుడే పుస్తకరూపంలో సాహిత్యలోకానికి పరిచయమవుతున్న నన్ను పూర్తిగా పట్టి చూపించారు..
  కొత్తకవులను ఇలా పరిచయంచేస్తూ వెన్నుతడుతూ గొప్పపనిచేస్తున్న మీకు,సారంగ (అఫ్సర్ సర్ కు)
  వేలవేల వందనాలు సర్..

 • తండా హరీష్ అన్నకి హృదయపూర్వక అభినందనలు 💐💐 .
  యువకవుల చేతులు పట్టుకొని నడిపిస్తు
  రేపటి కోసం కవుల్ని నిలబెట్టే కార్యక్రమాని చేస్తున్న
  సి వి సురేష్ సర్,అప్సర్ సర్,సారంగా టీం కి ప్రత్యేక ధన్యవాదాలు.

  • ధన్యవాదాలు రాము…
   చాలా సంతోషం..💐💐💐

 • మీలాంటి వారూ నాకు ఉపాధ్యాయులు అవడం చాలా గర్వాంగా ఉంది ….మీలాంటి వారిని మరో సారి చూడగలమో లేదో తెలియదు

 • చక్కని భావ చిత్రాలు కలిగిన కవి తండా హారిష్ గౌడ్ కవిత్వం లో నిత్య చైతన్యం కనిపిస్తుంది కవి క్రాంతధర్షి కనిపించే ప్రతి వస్తువును కవిత్వం గా మలచి పారదర్శకత్వం అక్షరాలాలో కనిపిస్తాడు అన్న కవిత్వం లో ఒక సరీకోత్త ద్రుక్పధం లో కనిపిస్తుంది

 • కవిత్వ వనంలో ఒక శాఉన్న మొక్క ను పరిచయం చేశారు… మహావృక్షం గా యెదగ్గల శాఉన్నోడు హరీష్ …మంచి పరిచయం.. మంచి సమీక్ష
  అభినందనలు ఇరువురికీ👌👌💐💐💐💐💐

  • ధన్యవాదాలు సర్..
   మీ విలువైన స్పందనకు..

 • హరీశన్న కలంలో పదాలు,భావాలు కొత్తదనాన్ని అద్దుకుని కొంగ్రొత్త రూపాన్ని సంతరించుకుని వినూత్న స్పర్శతో పరుగుతీస్తాయి .

  తండ హరీశన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలతో…

 • నీటి దీపం….కవి హరీష్ గారి కవితా ప్రపంచాన్ని అక్షరాలుగా పరిచిన సి.వి.సురేష్ గారికి అభినందనలు…..వారి మనోదీపాన్ని ఆవిష్కరించారు

 • సాహిత్య యోధుడైన తండ హరీష్ గారూ!! భాషా భానుడి వలే మీరు మరింత ప్రకాశిస్తూ.. కవితా కాంతిని మరింత ప్రసరింపజేస్తారని నమ్ముతున్నాం… తెలుగు భాషామృతాన్ని నిత్యం జాలువార్చే ఊటగా వెలుగొంది తెలుగు జాతి గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెల్లేలా ఆ సరస్వతీ కటాక్షం మీకు మెండుగా లభించేలా కోరుకుంటున్నా..

  మీతో సహ ఉపాద్యాయుడిగా, మీతో కలిసి ఆడిన ఆటల్లో ఒకడిగా మిమ్మల్ని చాలా దగ్గిరగా చూసాను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందండి.. మీరు మీ ప్రయాణాన్ని మీరు పాడిన పాటల్లా.. జనాలని జాగృతం చేయడానికి .. నవ భారత మహోదయానికి ఉపయోగపడాలని ఆశిస్తూ… జై హింద్…

  • ధన్యవాదాలు సర్..
   మీ విలువైన స్పందనకు హృదయపూర్వక నమస్సులు సర్..

 • తండ హరీష్ కవిత్వాన్ని పరిచయం చేస్తూనే
  హరీష్ వ్యక్తిత్వం కూడా పరిచయం చేశారు. బలమైన పదబంధాలు కల్గిన కవిత్వం రాసే వర్థమాన కవులలో హరీష్ ఒకరు. రొట్టెలమ్మ,బఠానిల అవ్వ , నాన్న వంటి అద్భుతమైన కవితలున్నాయి.

  • అన్న ధన్యవాదాలు..
   విలువైన స్పందన

 • Harish gari పరిచయ వ్యాసం చాలా బాగుంది, ఇన్నాళ్లు వారి కవితలు చదివి వస్తు, కవితా లోతులు telisukogaliganu , ఇప్పుడు వారి వ్యక్తిత్వాన్ని జీవితాన్ని తెలుసుకునే అవకాశం వారి కవిత్వాన్ని మరింత అర్థం చేసుకోవడానికి పాఠకుడికి ఉపయోగపడుతుంది. యువ కవులకు ఎంతో ప్రోత్సాహకరం ఈ కార్యక్రమం👏👏 అభినందనలు harish గారు💐💐💐wish you all the best

  • ధన్యవాదాలు సర్..
   చాలా సంతోషం..
   విలువైన స్పందన..

 • సర్.. ఏ కవిని ఎంపిక చేసుకున్నా ఆ కవి జీవితాన్నీ వారి సాహిత్య యానాన్నీ ఏకకాలంలో స్పృశిస్తూ సాగే మీ వ్యాసాలు కవినీ కవిత్వాన్నీ సమగ్రంగా ఆవిష్కరిస్తాయి. మీదైన పంథా సొంతం చేసుకున్నారు. “కొత్త కవిత్వ తీరాలు” కు ఇవాళ్టి ఎంపిక తండా హరీష్ గౌడ్. వీరి కవితల్ని నేను మొట్టమొదట చదివినపుడు.. మిగతా కవుల నుంచి వేరు చేస్తున్న తనదైన లోతైన ఊహాశాలీనత గల ఓ కొత్త గొంతుకా తను ఎంపిక చేసుకున్న వస్తువుకు కవిత్వపు రంగులద్దే తపనా కనపడేది. మీరన్నట్టు తనకది సహజంగానే అబ్బిందేమో. వారి కవితల్ని గమనిస్తుండేదాన్ని కానీ.. మీ ఈ వ్యాసం ద్వారా సంపూర్ణంగా ఆవిష్కృతమయ్యారు. తను మొదట రాసిన కవిత నుంచీ ఇప్పటి వరకూ ఉటంకిచటం ద్వారా కవిత్వంలో వచ్చిన పురోగతిని తెలియజేశారు. ఇది కవికి తరచి చూసుకుని స్ఫూర్తి పొందేలా ఉంది. తన కవిత్వంలోని ధోరణీ భాషా సౌందర్యాలను మీరెంత పరిశీలించారో ఉటంకించిన కోట్స్ చెప్తున్నాయి. నవ తరం కలాల సిరాలో కొత్త చైతన్యం నింపగల ‘కొత్త కవిత్వ తీరాలు’ శీర్షిక వర్థిల్లాలి. ప్రామిసింగ్ పోయెట్ తండా హరీష్ గౌడ్ గారికి అభినందనలతో.. మీకూ.. సారంగకూ.. హృదయపూర్వక ధన్యవాదాలు సర్.

  • ధన్యవాదాలు మేడమ్..
   మీ విలువైన స్పందనకు..

  • నిజమే మాధవి గారు… మీ స్పందనకు. ప్రత్యేక ధన్యవాదాలు

 • Harish sir na Chinna naati guruvu🙏..
  Meeru indulo cheppinattugaane aayana class lo nerpinche prathi padhyam, prathee paatam vinagaane medhadu lo balangaa paathukupoyevi..antha adbhuthamga undedhi aayana vivaranaa shaili…
  Ika kavithwam vishayinki vasthe dhaanni nenu depth ga analysis chesi ardham cheskodanki chaala samayam pattedhi Naa lanti oka common human being ki ,ante ayana padhaala allika antha gammatthu ga, antha lothugaa untundi..kaani aa kavithwaanni ardham chesukune lope, manalo teliyakundaane kachithamgaa oka baavodhwegam aithe nindukuntundhi anadam lo sandheham ledu…kallaku kattinattuga oka kavithwaanni chupinchadam lo meeku meere saati sir..

  And Iam really proud to see this..all the very best sir💐💐💐

 • హృదయం నిండా తడి నింపుకొని కవిత్వానికి జీవంపోసే కవి హరీష్..కొత్త కవిత్వ తీరాలు శీర్షిక ద్వారా తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాం..బావుంది సురేష్ గారు మీ కృషి అభినందనీయం.కవిగా నీపై హారీష్ నీపై మరింత బాధ్యత పెరిగింది ఆల్ ది బెస్ట్

 • కవిత్వం ఆత్మగత అనుభవాల్ని ఆవిష్కరిస్తుంది…పర్ఫెక్ట్ quote ..ఓ కవిని పరిచయం చేసేందుకు మీరు తీసుకున్న కొటేషన్స్..మావో ,ఆస్కార్ వైల్డ్ ,బెన్ జాన్సన్..ఎంత అధ్యయన విస్తృతి ఉంటే కానీ సాధ్యం కాని తీరే….
  మంచి కవిత్వం తో పాటూ ఉపాధ్యాయులుగా సామాజిక బాధ్యతని కవితల్లోకి తీసుకురావాలని తపన గమనించాను..
  కవిని వారి కవిత్వాన్ని మొదటగా పాఠకుల్లో ఇంజెక్ట్ చేస్తూనే వారి నేపధ్యాన్ని…. మొదటి కవితనుంది పరిణామ క్రమాన్ని చూపే తీరు ఆకట్టుకుంటోంది.. హరీష్ గారి కవిత్వాన్ని విశ్లేషించిన తీరు బావుందీ..మీరు ఉటంకించిన కవితా వాక్యాలు వారి శైలిని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తున్నాయి..
  కొత్త తీరాలు ద్వారా మరో మంచి కవిని పరిచయం చేసినCV సర్ కి సారంగా పత్రిక కి కృతజ్ఞతలు..హరీష్ గారూ కవితా సంకలనాన్ని తీసుకురాబోతూన్న సమయంలో మీ సాహితీ ప్రయాణ ఆవిష్కరణకు ఇది మంచి అవకాశం.. మీకు హార్ధిక శుభాకాంక్షలు సర్..

  • థాంక్యూ వెరీమచ్ మేమ్..
   మీ విలువైన స్పందనకు..
   ఈ ఆర్టికల్ నాకు పుస్తకావిష్కరణకు ముందే సి.వి సర్ ఇచ్చిన కానుక..
   నా సాహితీ ప్రయాణంలో ఇదో మరుపురాని ఘట్టం..థాంక్స్ టు సి.వి.సర్..
   థాంక్స్ టు సారంగ టీమ్..

 • సహృదయం తో ఇక్కడ స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు…

  మీ సురేష్

 • వాస్తవికతను కవిత్వంగా మలచిన సహజ కవి హరీష్ చాలా గొప్ప కవిగా ఎదుగుతావు.. అభినందనలతో

 • చిక్కని కవిత్వానికి చక్కనైన వ్యాసం. నీటిదీపం ఆత్మను పట్టి చూపింది. స్వచ్చమైన కవిత్వం వైపు పరుగులు తీస్తున్న హరీషన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు