కుటుంబ శాస్త్రం! 

పలాయనవాదాలు వొద్దు.  పరాయీకరణలూ వొద్దు.  దగ్గరగా అయినా, దూరంగా అయినా ప్రేమగా వుండటమే మానవసంబంధాల లక్ష్యం.   

కుటుంబం అనేది మానవుడికి మాత్రమే ప్రత్యేకమైన వ్యవస్థ కాదు.  మనిషితో సహా చీమ నుండి ఏనుగు వరకు ప్రతి జీవి తన కుటుంబాన్ని కలిగి వుంటుంది.  కుటుంబం అనేది సహజాతాల నుండి ఏర్పడిన వ్యవస్థ.  ఐతే ఇతర జీవుల కుటుంబ వ్యవస్థ అలాగే కొనసాగుతుండగా మానవుడి కుటుంబ వ్యవస్థ మాత్రం మార్పు చేర్పులకి లోనవుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ భిన్న ప్రజా సమూహాల మధ్యన, ప్రజలకి పాలకులకి మధ్యన అధికార సంబంధాలకు, స్త్రీ పురుషుల మధ్య ఆధిపత్య జెండర్ అవగాహనలకనుగుణంగా, అది ఎప్పటికప్పుడు మార్పు చేర్పులకు లోనవుతూ వచ్చింది.  ఉమ్మడి కుటుంబం నుండి చిన్న కుటుంబం వరకు సాగిన కుటుంబ ప్రయాణం గురించి చర్చించటం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు.  ఆధునిక జీవితంలో యాంత్రికత, వేగం ఎక్కువైన నేపధ్యంలో రెండింటి మంచి చెడ్డలు తూకం తూయాలనే చిన్న ప్రయత్నం ఇది.
మనం ఎప్పుడూ గతం గొప్పది. వర్తమానం దుర్మార్గమైనది అనే నమ్ముతుంటాం.  “గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్” అన్న నమ్మికలో ఇప్పటి పరిస్తితుల్లో మనం సరిగ్గా బతకలేం అనే పరాయీకరణ,  ఇప్పటి పరిస్తితులు బాగు చేసుకోలేనంత దుర్మార్గంగా వున్నాయన్న పలాయనవాదం కనిపిస్తుంది.  అందులో భాగమే ఉమ్మడికుటుంబాల్ని శ్లాఘించటం.
తాతయ్య చెప్పే కబుర్లు, బామ్మ చెప్పే కథలు వింటూ పెరిగామని, అది తమకొక అపరూప సంపదని, ఇప్పటి తరాలు వాటిని మిస్ అవుతున్నాయని చాలామంది అంటుంటారు.  అసలు బాల్యంలోనే నాయనమ్మ తాతయ్యలు చెప్పే కథల ద్వారానే లోకం యొక్క మంచి చెడులు పిల్లలు నేర్చుకుంటారని, ప్రపంచ రీతుల గురించి జ్ఞానాన్ని సముపార్జించుకుంటారని చాలా చెబుతుంటారు.  ఇంట్లో అనుభవజ్ఞులైన ముసలి వారు అసలు ఒక పెట్టని కోట అని, గొప్ప నైతిక రక్షణ అని, ఇల్లంతా సక్రమంగా, ఒక పద్ధతిలో నడుస్తుందనీ, వారి వలన ఒక క్రమశిక్షణాయుత వాతావరణంలో పిల్లలు పెరిగి పెద్దై బాధ్యతగల పౌరులౌతారనీ కూడా అనేకమంది విశ్వసిస్తుంటారు.  ఇప్పుడు నూక్లియర్ (చిన్న) కుటుంబాలొచ్చి ఆ విలువలన్నీ ధ్వంసం అయిపొతున్నాయని, పిల్లలకి మంచి చెడు తెలియటం లేదని, పెద్దా చిన్నా అనే లెక్క లేకుండా వుంటున్నారని, మానవ సంబంధాల్లో బాధ్యత తోపిస్తున్నదని, మనుషులు స్వార్ధంగా మారుతున్నారని, ప్రేమలు తగ్గుతున్నాయని…ఇలా చిన్న కుటుంబాల మీద అనేకానేక ఆరోపణలు చేస్తుంటారు.  అంతేకాదు ఇంట్లో ఒకరికి కష్టం వస్తే అందరూ ఒక్కటవుతారని, బోలెడంత భరోస వుంటుందని, ఒకరికొకరు ఆదుకుంటారని, పెద్దల సంక్షేమానికి ఢోకా లేదని ఘంటా భజాయించి చెబుతుంటారు.  “ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని పెంచటానికే ఓ తెగ ఇబ్బంది పడుతున్నారు.  మా టైములో మా అమ్మలు అరడజను మందిని ఈజీగా ఒంటి చేత్తో పెంచేసే వాళ్ళు.” అంటుంటారు.  సరే అప్పటికంటే ఇప్పటి పిల్లల పెంపకం మరింత సంక్లిష్టమైందని, మరింత ఫోకస్డ్ అని, ఎన్నో రకాలుగా పిల్లల్ని భవిష్యత్తు కోసం సన్నద్ధం చేయాల్సి వుంటుందని, అప్పటి రోజుల్లో మొదటి సంతానానికి చివరి సంతానానికి 15 ఏళ్ళ పైనే వ్యత్యాసముండేదని, పెద్ద అమ్మాయిలు బళ్ళకి వెళ్ళకుండా తమ తరువాత పిల్లల్ని రెండో అమ్మలా మోసి, పెంచాల్సి వస్తుందని, అత్తా కోడళ్ళు, తల్లీ కూతుళ్ళు ఒకేసారి గర్భం దాల్చే సంఘటనలు కోకొల్లలని, అప్పటి ఉమ్మడి కుటుంబం స్త్రీల దేహాల మీద ఇష్టారాజ్యంగా ప్రయోగాలు చేసిందని, వారితో విశృంఖలంగా వ్యవహరించి వారిని సంతానోత్పత్తి కేంద్రాలుగా మార్చిందని మనం చెప్పాల్సి వుంటుంది.
ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోతున్నాయనేది ఒక వాస్తవం.  ఒక సర్వే ప్రకారం సీనియర్ సిటిజన్లు లేని కుటుంబాలు 88 శాతం వున్నాయి.  కేవలం 11 శాతం కుటుంబాల్లోనే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నారు.  అసలు మనం ఉమ్మడి కుటుంబాలు బలహీనమై భార్య, భర్త ప్లస్ ఒకరు లేక ఇద్దరు పిల్లలతో కూడిన చిన్న కుటుంబాలు ఎలా అనివార్యమయ్యాయో ఆలోచించాలి.  చారిత్రికంగా మనది ప్రధానంగా గ్రామీణ వ్యవస్థ అయినందున గ్రామాల్లో భూమే ప్రధానంగా ఆదాయ వనరు అయినందున, ఆస్తి విభజన జరిగితే చిన్న చిన్న ముక్కల్లో వ్యవసాయం చేయటం కష్టం కాబట్టి, ఆస్తి విభజన నివారించటం కోసం ఆస్తులుగల పై కులాల్లో ఉమ్మడి కుటుంబాలు అప్పట్లో అనివార్యం అయ్యాయి.  అంతే కాదు చేతి వృత్తుల కులాలకు ఆదాయం అప్పట్లో ధన రూపంలో కాక ధాన్యం, వస్త్రాలు, చెప్పులు, గొడుగులు వంటి వస్తు రూపంలో వుండేది.  కుటుంబంలో ఎంత మందుంటే పనిలో అంత ఆదాయమన్న, అంత సహాయమనే అమాయకమైన లెక్కలుండేవి శ్రామిక కుటుంబాలకి.  అందువలన కింద కులాల్లో ఉమ్మడికుటుంబం నడిచేది.
వ్యవసాయాధారితమైన భారతదేశంలో గత శతాబ్దంలోనే మొదలైన  పారిశ్రామీకరణ, పట్టణీకరణ విపరీతంగా పెరిగిపోయి  గ్రామాల నుండి వలసలతో పెద్ద కుటుంబాలు చీలిపోయి చిన్న కుటుంబాలకి బీజం పడింది.  వ్యవసాయం ఇచ్చే ఆదాయం కంటే భూమిని అమ్ముకుంటే  వచ్చే రియల్ ఎస్టేట్ విలువ ఎక్కువ కనుక అమ్మేసి పట్టణంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చని ఆలోచన కుటుంబాల పరిమాణాన్ని తగ్గించింది.  ప్రపంచీకరణతో చేతివృత్తులు దెబ్బతిని, గ్రామాలు నిస్సహాయమై పోయి బతుకు తెరువు కోసం పట్టణాల వైపు చూడాల్సిన పరిస్తితి చేతివృత్తుల కులాలకు ఏర్పడింది.  నిపుణులైన పనివారు నైపుణ్యంతో నిమిత్తం లేని పట్టణ వుద్యోగాల కోసం అర్రులు చాచాల్సి వచ్చింది.
ఇంక పట్టణాల్లోని మధ్య తరగతికి చెంది చదువుకున్న వారికి దేశమంతా, ప్రపంచమంతా అవకాశాలే.  వారు తమ కుటుంబం విడిచి ఎంత దూరమైనా వెళ్ళిపోతారు.  అసలా మాటకి వస్తే ఉమ్మడి కుటుంబాన్ని సమర్ధించే ఎంతమంది సంస్కృతీ ప్రియులు, కుటుంబరావులు తమ పిల్లలు అమెరికాలో చదువుకొని, అక్కడే సెటిల్ అవటాన్ని ఇష్టపడరు చెప్పండి. అసలివాల్టి మెజారిటీ మధ్యతరగతి తల్లిదండ్రుల లక్ష్యమదేగా?  ఈ రోజున హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో తమ పిల్లలు ఉద్యోగాలు చేయని తెలుగు రాష్ట్రాల్లోని మధ్య తరగతి కుటుంబాలెన్ని? ఇవన్నీ అనివార్యతలు.  వ్యవస్థని కమ్ముకొచ్చిన ఈ పరిణామాల్ని పట్టించుకోక ఊరకే ఉమ్మడి కుటుంబాల గొప్పతనం గురించి ఊదరగొడితే ఫలితమేముంటుంది?
నేను అనేక ఉమ్మడి కుటుంబాల్ని పరిశీలించాను.  అవి రెండు రకాలుగా వుంటాయి.  ఒకటి – కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులుండటం, రెండు – అన్నదమ్ములు తమ భార్యా బిడ్డలతో సహా కలిసి వుండటం. ఈ కుటుంబాలలో ముసలి తల్లిదండ్రులకి పింఛన్ల రూపంలోనో, కౌలు సొమ్ము రూపంలోనో,  అద్దెల రూపంలోనో వారి ఆదాయం వారికుంటే ఒక రకమైన పరిస్తితి వుంటుంది.  అలా కాకుండా వారు పూర్తిగా తమ పిల్లల మీద ఆధారపడితే మరో రకమైన పరిస్తితి వుంటుంది.  వారి మధ్య ప్రేమానుబంధాల్ని కొలిచే సాధనం వారి ఆదాయ వనరులే అనేది నిస్సందేహం.  పెద్దల అనారోగ్యానికి, మందులకి, ఇతర అవసరాలకి తగినంత ఆర్ధిక స్తోమతు లేని పక్షంలో అశాంతి రాజ్యమేలుతుంది.  ప్రతి చిన్నదానికి గాభరాపడి పోయి మంచి ఆస్పత్రిలో చూపించమనే తల్లిదండ్రులకేం తక్కువ లేదు.  ఇదివరకటిలా ఏ మునిసిపల్ స్కూల్లోనో ఉచిత చదువులు కాదుగా ఇప్పుడు.  వృద్ధులైన తల్లిదండ్రుల ఆకాంక్షలు, తమ పిల్లల చదువులు, ఇతర ఖర్చులకి మధ్య సతమతమై పోవటం సర్వ సాధారణం.
 అన్నదమ్ములు తమ పెళ్ళాం బిడ్డలతో సహా ఒకే వంటగదితో ఒకే కప్పు కింద ఉమ్మడిగా జీవించే ఉదంతాలు ఇప్పుడు చాలా అరుదు.  అలాగని అసలు లేకపోలేదు.  నేను విశాఖలో పని చేసే రోజుల్లో నా సహోద్యోగి ఒకాయన ఆరుగురు అన్నదమ్ముల కుటుంబాలతో సహా ఒకే ఇంట్లో నివశించేవారు.  నాకు వాళ్ళిల్లు చూడటం భలే ఆసక్తిగా వుండేది.  అదొక హాస్టల్లా అనిపించేది.  బోలెడన్ని గదులు.  అనేక సంవత్సరాల నుండి ఒక గదిలో మంచంలోనే బతుకీడ్చే ముసలి వగ్గు నాయనమ్మ, ఆయన తండ్రి చనిపోగా ఇంటి పెద్దగా ఆజమాయిషీ చేసే ముసలి తల్లి, నా సహోద్యోగి అప్పట్లో లేటు ముప్ఫైల్లో వున్నప్పటికీ వయసులో ఎంతో వ్యత్యాసమున్న ఆయన పెద్దన్నకి మనవలున్న కారణంగా ఇతను కూడా ముప్ఫైల్లోనే తాతయ్యా అని పిలిపించుకోవాల్సి వచ్చేది.  మా ఎదుట తెగ ఇబ్బంది పడేవాడు.  మా సహోద్యోగులు,  ఆయన మిత్రులు అందరూ ఆ కుటుంబాన్ని తెగ పొగిడేసేవారు.  నేనో రోజు అడిగాను “మీ నాయనమ్మతో రోజూ ఒక పది నిమిషాలైనా మాట్లాడతారా రావుగారూ” అంటే ఆయన ఇచ్చిన జవాబేంటంటే “ఆమె గదిలోకి వెళ్ళి, ఆమెని చూసి సంవత్సరం దాటింది సార్” అన్నాడు.  ఒకసారి చెప్పాడాయన “మేం ఏం కోల్పోతామో మాకే తెలుసండీ.  అసలు ప్రైవసీ వుండదు.  మా ఆవిడ తెగ పోరు పెడుతుంది వెళ్ళిపోదామని.  ఇంక ఇంట్లో చాలామందికి ఒకరంటే ఒకరికి పడదు. బైటికెళ్ళిపోదామంటే ఆస్తి విభజన సమయంలో నాకు నష్టం జరగొచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.
అత్తా మామలు రాగానే ఏదైనా టీవీ ప్రోగ్రాం చూస్తూ సోఫాల్లో కూర్చున్న కోడళ్ళు లేచి వెళ్ళిపోవటం, వారి వెనకాలే నిలబడి టీవీ చూడాల్సి రావటం, అసలు వాళ్ళతో సమానంగా కూర్చోవటం పద్ధతి కాదనటం, అత్త మామల ఎదుట నైటీలు వేసుకు తిరగ్గూడదనటం…ఇవన్నీ ఉమ్మడి కుటుంబ విలువలే.  పగటి పూట మొగుడితో కలిసి  తమ గదుల్లోకి వెళ్ళటం నిషిద్ధం.  ఎప్పుడూ వంటిల్లు లేదా హాల్లోనే వుండాలి.  ఇంటికి ఎవరైనా బైటివాళ్ళొస్తే వెంటనే వంటింట్లోకి వెళ్ళాలి.  ఆ వచ్చిన గెస్టులు ఇంటి “పెద్దల”తో బాతాఖానీ కొట్టినంత సేపూ ఈ కోడళ్ళు వంటింట్లోనో, పెరట్లోనో కాలక్షేపం చేయాలి.  నిజానికి అప్రజాస్వామికతకి, పితృస్వామిక ఆధిపత్యానికి, ఉక్కపోతకి, స్త్రీల సృజనాత్మకత అణచివేతకి, ఏకాంత రాహిత్యానికి ఉమ్మడి కుటుంబాలు అసలైన చిరునామాలు.  వొట్టి కంపల్షన్స్ తప్ప నిజమైన ఏం ప్రేమలు మిగలాలి ఆ వాతావరణంలో?  ఎవరు నోరు పెట్టుకొని బతగ్గలరో, పెత్తనాలు చేయగలరో వారికే పెద్ద పీట.  ఉమ్మడి కుటుంబాల్ని రొమాంటిసైజ్ చేస్తూ పేద్ద పెద్ద పెంకుటింటి లోగిళ్ళలో లంగా జాకెట్లుతో అటు ఇటూ పరిగెత్తే ఆడపిల్లలు, పరికిణీ వోణీలతో గలగలలాడే యువతులు కృష్ణవంశీ సినిమాలు, శతమానం భవతి వంటి సినిమాల్లో కనిపిస్తారేమో కానీ నిజ జీవితంలో ఆ అందం, ఆనందం వాస్తవ దూరం.  మన సినిమాల్లో, ముఖ్యంగా పాత సినిమాల్లో అయితే, ప్రైవసీని కోరుతూ దూరంగా బతుకుదామనే కోడల్ని విలన్లా చిత్రిస్తుంటారు.  అంతేగా.  అంతేగా.  మన మానవసంబంధాల్లో ప్రజాస్వామిక హక్కులన్నీ దుర్మార్గాలేగా!
ఉమ్మడి కుటుంబాల సమర్ధకులకి ప్రధానంగా కనిపించే అంశం వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ.  చిన్న కుటుంబాలు రావటం వల్లనే తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలనే అంశంలో తగాదాలు మొదలవుతాయని, వారిని తీసుకెళ్ళి ఏ వృద్ధాశ్రమంలోనో, అనాధాశ్రమంలోనో  వదిలేస్తున్నారని అంటారు.  “తల్లిని బస్టాండులో నిర్దయగా వదిలేసిన కుమారుడు”, తండ్రిని అనాధాశ్రమం మెట్ల మీద పడేసి వెళ్ళిన ఘాతకుడు” వంటి వార్తలు మనం రోజూ చూస్తూనే వుంటాం.  నిజానికి ఏ ఆర్ధిక వెసులుబాటు, వసతి సౌకర్యాలు వున్న కుటుంబాల్లో వృద్ధులైన తల్లిదండ్రులకి ఇన్ని బాధలుండవు.  వృద్ధుల్ని పట్టించుకోని తనానికి ప్రధాన కారణం ఆర్ధిక దారిద్ర్యం.  సంఘం ఆమోదించే మనుషుల్లోని మంచి చెడుల్ని ముందుగా నిర్ధారించేది ఆర్ధిక స్తితే.  పెరుగుతున్న అవసరాలు, చాలీచాలనితనం సృష్టించే అశాంతి, ఘర్షణ అల్పాదాయ వర్గాలకు చెందిన కుటుంబాల్లోనే అధికం.
విద్య, వైద్యం వంటి సేవా రంగాల్లో ప్రభుత్వం తన జవాబుదారీతనాన్ని వదిలేసుకున్న విషయం గమనించాలి.  సామాన్య ప్రజలకి కూడా స్టార్ హాస్పిటళ్ళలో ట్రీట్మెంట్ అనే నెపంతో నిధులన్నింటినీ ప్రభుత్వాసుపత్రుల్ని అభివృద్ధి చేయటానికి ఉపయోగించకుండా ప్రైవేటు కార్పొరేట్ వైద్యరంగానికి దోచిపెడుతున్నాయి ప్రభుత్వాలు.  (అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంతవరకు నయమేమో.  కానుపుల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే విధంగా ప్రోత్సహించటం, ప్రసూతి కిట్ల సరఫరా, కంటి ఆపరేషన్లు భారీగా నిర్వహించటం వగైరా జరుగుతున్నాయి)  ఎప్పుడైతే ఆరోగ్యమ్మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందో అక్కడ ఆ కుటుంబాలు కుదేలు అవుతాయి.  దీనికి మొదటి బాధితులు కుటుంబంలోని వృద్ధులే.  ఆరొగ్యశ్రీ పరిధిలోకి రాని అల్పాదాయ వర్గాల వారికి ఇంకే దిక్కూ లేదు.  వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే వారి మీద కేసులు పెట్టడం, కౌన్సెలింగ్ చేయటం వంటివి చేయటం చేస్తారు కానీ అసలు వృద్ధుల సమస్య రాజ్యంది కాదా?  వారి సంరక్షణ ప్రభుత్వాల బాధ్యత కాదా?  వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఏలికలకి వారి సంక్షేమం పట్ల జవాబుదారీతనం లేదా?  బళ్ళెంత ముఖ్యమో, గుళ్ళెంత ముఖ్యమో, పార్కులెంత ముఖ్యమో అల్పాదాయ వర్గాల వృద్ధులకు వృద్ధాశ్రమాలు అంత ముఖ్యం కాదా?  అసలు ఆ వయసు రేంజ్ లో వున్నవారి గురించి మనకొక పాలసీ వుండాలి కదా.
సరే మళ్ళీ మధ్య తరగతికొద్దాం.  తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వేసి చేతులు దులిపేసుకుంటున్నారని మనం బాగానే ఆడిపోసుకోవచ్చు.  ఇంత వేగవంతమైన జీవితంలో, పిల్లల పెంపకం కూడా అత్యంత సంక్లిష్టమౌతున్న దశలో వాళ్ళసలు పెద్దల బాగోగులు ఎంత మేరకు చూడగలరు?  మనం సెంటిమెంట్లకి కొట్టుకుపోకూడదు.  వాస్తవ సమస్యల్ని వాస్తవిక దృక్పథంతోనే ఎదుర్కోవాలి.  అసలు ఏ మాత్రం చైతన్యమున్నా అసలా పెద్దలే తమ శంరక్షణ కోసం ప్రణాళికలు వేసుకోవాలి.  ఒక అవగాహనతో మెసలాలి.  తాము తమ పిల్లల్ని కని, పెంచి, పెద్ద చేసింది కేవలం వారి చేత సేవలు చేయించుకోవటానిక్కాదని, తాము తమ ఆనందం కోసం సంసారం చేసుకున్నామని, తమ ముచ్చట కోసం పిల్లల్ని కన్నామని, వారిని పెంచి పెద్ద చేయటం తమ బాధ్యతని, అది నిర్వర్తించామని అర్ధం చేసుకోవాలి.  అంతేకానీ ఏదో వ్యాపారం లో లాభాలు ఆశించినట్లు వార్ధక్యంలో పిల్లల చేత సేవలు చేయించుకోవాలనే ఆలోచనలు వదిలిపెట్టాలి.   ఆర్ధికంగా వెసులుబాటుగల సీనియర్ సిటిజన్స్ చక్కగా మంచి వృద్ధాశ్రమాల గురించి తెలుసుకొని అందులో చేరటం అత్యుత్తమం.  తమ పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చాం చాలు, ఇంక మనవల గోల మనకెందుకు అనుకోగలగాలి.  (భవిష్యత్తులో నా ప్రణాళికైతే అదే.)  ఆర్ధిక వెసులుబాటు లేని వారి గురించి బాధ్యత తీసుకోవటం ప్రభుత్వాల పని.  ఈ విషయం మీద బుద్ధి జీవులు ఆలోచించి వత్తిడి తేవాలి.
******
పలాయనవాదాలు వొద్దు.  పరాయీకరణలూ వొద్దు.  దగ్గరగా అయినా, దూరంగా అయినా ప్రేమగా వుండటమే మానవసంబంధాల లక్ష్యం.
*

అరణ్య కృష్ణ

9 comments

Leave a Reply to చల్లా గోపాల కృష్ణ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good..it is the necessary thought .all parents should think in these lines .they dont think that their responsibility is fully on the sons or daughters..once again a good thought pravoking essay from you .keep it up.

  • కృష్ణగారు! “కుటుంబశాస్త్రం” గురించి చక్కని article రాశారు. చూడని ,ఆలోచించని ఎన్నో కోణాల్ని విభజించి చెప్పారు. నిజం ఆలోచించాల్సిన విషయాలు. అయినా ప్రతి ఒక్క వ్యవస్థలోను అనుకూలాలు అనానుకూలాలనేవి ఉండనే ఉంటాయి! Two faces of the coin.మంచి చెడు. ధన్యవాదాలు ఆలోచించి ,విశ్లేషించె article ను రాశారు.

  • మీ కథానిక ఒక గందరగోళా నికి దారి తీస్తుంది.ఎవడి బ్రతుకు వాడిది అన్నట్టు గా ఉంది.ఇటువంటి వాటి వల్ల నష్టం మీకు రాదు.చాలా కుటుంబాలు ఇలాంటి రచన ల వల్ల చితికి పోయాయి

    • మీరనవసరంగా కంగారు పడకండి. నేను మీరు భయపడుతున్న బతుకే బతుకుతున్నాను. చితికిపోలేదు సరికదా సుబ్బరంగా వున్నాను. నా తోబుట్టువులతో, బంధువులతో సస్య సంబంధాలను కలిగివున్నాను.

  • చీమ నుండి ఏనుగు వరకూ ప్రతి జీవీ తన కుటుంబాన్ని కలిగి ఉన్నా[?], మానవుడికి ఉన్న కుటుంబ వ్యవస్థ మాత్రం ప్రత్యేకమైనదే.
    ఉమ్మడి కుటుంబం మీద విమర్శలు సమర్ధనీయంగానే ఉన్నా మిగతా విషయాలమీద చేసిన సూత్రీకరణలు చాలా తప్పుగా ఉన్నాయి.
    ఈ రోజున మధ్య తరగతి కుటుంబాలలోని పిల్లలు అమెరికాలో చదువుకుని, అక్కడే సెటిల్ అవుతున్నారంటే, అక్కడ వచ్చినంత ఆదాయాలు ఇక్కడ రాకపోవడమే. హైదరాబాద్, బెంగళూరు , చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే, దానికి కారణం, ఆ పట్టణాలలోనే ఉద్యోగాలు చేయాలనే తల్లిదండ్రుల లక్ష్యం గానీ, ఉద్యోగాలు చేసే వాళ్ళ కోరిక గానీ కాదు. ఆయా పట్టణాలలోనే తప్ప మిగతా పట్టణాలలో ఉద్యోగ అవకాశాలు లేక పోవడమే.
    అసలు కుటుంబం అంటే భర్తా, భార్యా, వాళ్ళ తల్లిదండ్రులూ, పిల్లలు. ఇదీ కుటుంబం అంటే. అంతే కానీ భర్తా,భార్యా పిల్లలూ మాత్రమే కాదు.
    వృద్ధుల్ని పట్టించుకోక పోవడానికి ఆర్ధిక దారిద్ర్యమే కారణం కాదు. ప్రేమా, బాధ్యతా లేక పోవడం అనేదే అసలైన కారణం. ఆర్ధిక దారిద్ర్యమే కారణం అయితే పిల్లల్ని మాత్రం ఎలా పెంచగలుగుతారు? తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో పడేసినట్లే, పిల్లలని కూడా అనాధాశ్రమాలలో వదిలెయ్య వచ్చుగా? మరి అలా చెయ్యడం లేదే? తాము కన్న పిల్లలని చూసుకోవడం యెంత బాధ్యతో, తమని కన్ని తల్లిదండ్రులని చూసుకోవడం కూడా అంతే బాధ్యత అనే జ్ఞానం లేకపోవడమే అసలు కారణం.
    ప్రభుత్వం తమ జవాబుదారీ తనాన్ని వదిలేసుకున్న విషయం గమనించిన ఈ రచయిత ‘జవాబుదారీ తనాన్ని వదిలేసుకున్న పిల్లలే తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు’ అన్న విషయాన్ని గమనించలేదు. వృద్ధుల సమస్యా, సంరక్షణ బాధ్యత కేవలం రాజ్యానికి వదిలేసి, ఆ బాధ్యత పిల్లలది కాదు అని సూత్రీకరించడం మరొక తప్పు.
    బళ్ళూ,గుళ్ళూ, పార్కులూ యెంత ముఖ్యమో వృద్ధాశ్రమాలు కూడా అంతే ముఖ్యంగా కనిపించాయి ఈ రచయితకి. ఆ వయసు రేంజ్ లో ఉన్న వారి గురించి ఒక పాలసీ ఉండాలిట.
    కేవలం తమ ఆనందం కోసమే సంసారాలు చేసుకుని, పిల్లల్ని కంటారనేది అమానవీయ,దుర్మార్గపు వక్రీకరణ. అనేక విధాలైన కష్టాలు,నష్టాలు పడి, పిల్లల్ని కని, పెంచడం లో ప్రేమా, బాధ్యతా ఉంటాయే తప్ప. కష్ట నష్టాలు పడాలనే ‘ముచ్చట’ కానీ వార్ధక్యంలో పిల్లల చేత సేవలు చేయించుకోవాలనే దురాలోచన కానీ ఉండదు. పిల్లలని పెంచి పెద్ద చేయడం తల్లిదండ్రుల బాధ్యత అయితే, కని పెంచిన తల్లి దండ్రులని చూసుకోవడం పిల్లలకి కూడా అంతే బాధ్యత కాదా? బాధ్యతలు లేని హక్కులంటూ ఎవరికీ ఉండవు.
    వృద్ధాశ్రమాలు చూసుకుని, అందులో చేరడం అత్యుత్తమం గా కనిపించిందీ రచయితకి.
    ఈ సందర్భంలో, రంగనాయకమ్మ గారు రాసిన, “వృద్ధుల సమస్యకి వృద్ధాశ్రమాలే పరిష్కారమా?” అనే వ్యాసం లో ని కొన్ని వాక్యాలని ఇక్కడ పేర్కొనడం సమంజసంగా ఉంటుంది
    “జంతు జాలాల్లో అయితే, వృద్ధులైన తల్లిదండ్రుల్ని బిడ్డలు సంరక్షణ చేసే పరిస్థితి ఉండదు. మనుషుల్లోనే ఇది ప్రత్యేకం. ఆ మనుషుల్లో కూడా ఆ పరిస్తితి లేకుండా పోవడం అంటే, తల్లిదండ్రులకూ బిడ్డలకూ ఉండే సంబంధాలు ‘జంతు సంబంధాలు’గా మారిపోతున్నాయని అర్ధం.”
    “…బిడ్డలకు ఉండవలసింది ‘జాలి’ కాదు. ప్రేమ!బాధ్యత! బిడ్డల తరానికి సమాజం నేర్పవలసిందంతా ఈ అంశాన్నే.”
    “…ఇంతకన్నా ఎక్కువ శ్రమే తల్లిదండ్రులు బిడ్డల కోసం పడి ఉంటారు.”
    “మరి, పెద్ద వాళ్లకి జబ్బు చేస్తే, వాళ్ళని చూసుకోవడం కూడా బిడ్డల బాధ్యత కాదా? ఆ పెద్ద వాళ్ళు ఈ పిల్లల్ని చిన్న తనంలో ఎన్నో అనారోగ్యాల్లో, ఎన్నో చాకేరీలు చేసి పెంచలేదా?
    “…మొత్తం ‘సమాజం’ నించి తరిమివేసే మార్గమే వృద్ధాశ్రమాల మార్గం. అది ఇల్లూ కాదు, వాకిలీ కాదు. సత్రవా కాదు, హోటలూ కాదు. అది ఒక వికృత నివాసం.”

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు