కాస్తంత బువ్వ

అవును మనం బీటలు పడ్డభూములం.తడి ఆరిపోయిన చెట్టుకొమ్మలం. మనవత్వపు రంగు వెలసిన ఒట్టి దేహాలం

వృద్దుడు అంటే ఎవరు అని అడిగితే నిన్నటి యువకుడు అని చమత్కరించాడట ఎవరో మేధావి.నిజమేకదా?బాల్యం ఓ పాలగిన్నె,యవ్వనం ఒక తేనె డబ్బా,వృద్దాప్యం ఒక టానిక్ సీసా? అందుకనే మనకి పాలగిన్నె కంటే, తేనె సీసాకంటే, టానిక్ సీసా అంటే గిట్టదు. ఎందుకంటే మనకి నచ్చని సువాసన్ని అది వెదజల్లుతుంది కాబట్టి.

పోయిన సమ్మర్లో నేను మాఊరు వెళ్లాల్చీ వొచ్చి ఊరు వెళ్తే మా దగ్గరి బందులలో,ఒకరైన ఒక వృద్దురాలిని కలిశాను. తనకి అప్పటిదాకా  తోడుగా, నీడగా, ఉన్న  పెనిమిటిని కోల్పోయి పుట్టడి దుఃఖంలో వుంది. ఆ మాయదారి దేవుడు నన్నూపట్టుకుపోతే పాయే,ఇంకా వుండి నేను ఎట్టాబతకాలి?ఆ పాడు చీకటి గుహలాంటి ఇంట్లోని నేనొక్కదాన్ని ఇవ్వాల్టినుండి ఒంటరిగా ఎలా ఉండాలని కన్నిరు పెట్టుకుంది.నిండుకుండలాంటి తన కుటుంబం ఇప్పుడు ఖాళీ కుండను తలపిస్తోందని బాధపడింది.కొడుకులు కొడళ్లు మనవళ్లు లేని ఇల్లు దెయ్యాలకొంపకంటే హీనమైనది అని నిరాశ పడ్డది.తన వృద్దాప్యత సృష్టించే నిస్సత్తువ నిస్సహాయత గురించి బెంగపడ్డది.తోడు ఎవరూలేక ఎలబతకాలో తెలియక ఒంటరితనం కలిగించే క్షోభని ఊహించుకొని కన్నీళ్లు వెళ్లబోసింది.

వింటున్నమాకు హృదయం ద్రవించి కళ్ళు కన్నీళ్లను వాంతి చేసుకున్నాయి.అండలేని ఆ వృద్దురాల్ని విన్నప్పుడు దుఃఖం కట్టలుతెంచుకొని మనసు నదుల్లోంచి పొంగిపొర్లింది.నీకు దుఃఖం ఎందుకు మామ్మ నువ్వు కన్నకొడుకులు నీకు అండదండలుగా వుండి ,నిన్ను బాగానేచూస్తారలే అంటే.?వాళ్లు నన్ను చూస్తారు అన్న నమ్మకం అనాపైసా అంత కూడాలేదని,వాళ్ళనాన్న పోయినవెంటనే చావుకు వోచ్చిన వారు సదివించిన, పదో, ఇరవైనో పట్టుకొని పెద్దకొడకు తన రెండో భార్యని, పిల్లల్ని , దినాలన్నా కాకుండానే వెళ్లిపోయాడనీ,అదే దారిలో ఆఫీస్ కి సెలవులు లేవని రెండోకొడుకు వెళ్లిపోయాడని చెప్పి గుండెలుబాదుకుంది.తనకు సంభవింపజేసిన ఈ స్థితిని, తన బిడ్డల్ని చూసి గతుక్కుమన్నది.
గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తననిప్పుడు బతికిస్తుందని ముఖ్యమంత్రే తనకిప్పుడు నిజమైన కొడుకుని ఆక్రోశాన్ని వెళ్లగక్కిoది.

ఇప్పుడు సమస్య ఏమిటంటే ?ఎందుకు తల్లులకు,తండ్రులుకు ఏ సత్తువా లేని వృద్దాప్య స్థితిలో ఈ దారుణ స్థితి వొస్తోంది?,దీనికి కారణం ఏమైఉండొచ్చు? ఎందుకు సొంత బిడ్డలే తల్లిదండ్రులపట్ల ఇటువంటి ధోరణి వెలబుచ్చుతున్నారు.ఎందుకు వృద్దాప్యంలో ఉన్న అమ్మానాన్నల పట్ల కనీస ఆదరణకూడా చూపించలేకపోతున్నాం.కని ,పెంచి ,ఎన్నోపాట్లుపడి,ఎంతో మధనచెంది,దినదిన దారిద్యాన్ని మింగి, ఆకలికి కడుపుని దూరంచేసుకొని, ఉండబట్టుకొని,ఓర్చుకొని,ఏడ్చి,దుఃఖపడి,నానా యాథనలు పడి,చాకిరి చేస్తూ, ఎండకు ఎండి, వానకు ఓనికి,ఎన్నో తుఫాన్లని మరెన్నో కుటుంబ బీభచ్ఛాల్ని భరించి, పిల్లల్ని పెంచి, ఎగరడానికి రెక్కల్నిచ్చి, సమస్తాన్ని దారపోసిన అమ్మానాన్నలకి ఏంటి స్థితని తలుచుకుంటే దుఃఖం కలుగుతుంది.

మనిషయి  పుట్టినందుకు  అవమానం కలుగుతుంది.అసహ్యం కూడా కలుగుతుంది.తల్లితో కాసేపు ప్రేమగా మాట్లాడలేని వాళ్ళుకూడా తల్లిమీద నీతులుబోధిస్తారు. ఫాథర్స్ డే రోజున తండ్రిమీద లెక్చర్స్ బయటికి వస్తాయి. పాలు తాగించిన తల్లి స్థనంలోoచి ఇంతటి నెత్తుటిని ఒంపుతున్నా,సంబరంతో నిన్ను భుజాలమీద ఊరంతా  ఉరేగించిన నాన్న ప్రేమను నులకమంచంలో పడేసినా,తోడుగా ఆసరాగా వుండాల్చిన అమ్మానాన్నల్ని ఆదరణనురాగాఫ్యాయథల్ని చూపకుండా అనాదల్ని చేసినా,గుక్కెడు నీళ్లు ఇవ్వక కన్నీళ్లు తెప్పిస్తున్నా,మందులు ఇప్పించక,బట్టలు ఉతక్క,వాళ్ళని మనుషుల్లాగా చూడకుండా చూస్తున్నందుకు..ఇంకా ఇంకా ఉదయం సాయంత్రం నిన్ను మనిషి అని అన్నందుకు, అనుకుంటున్నందుకు సిగ్గుతోకూడిన దుఃఖం పొంగుకొస్తోంది…

అవును మనం బీటలు పడ్డభూములం.తడి ఆరిపోయిన చెట్టుకొమ్మలం. మనవత్వపు రంగు వెలసిన ఒట్టి దేహాలం. పేగులవలలో దాచిన అమ్మను.గుండె చెమ్మలో సంతోషాల పువ్వుల్ని పూయించే నాన్నని,అనాదలుగా నిస్సహాయులుగా చూసే వదిలేసే ప్రతిఒక్కరిని ప్రతిఒక్కర్తిని మనిషి అని పిలిచి మనిషిని అవమానించవద్దు.

ప్లీజ్ అటువంటి వాడిని మనిషనకండి.మమతల పూదోటా అని మానవియుడని  అనకండి.ఒకవేళ ఏదైనా  అనాల్చి వొస్తే తన పిల్లల్ని తానే తిని ఆకలి తీర్చుకునే పాము అనండి.తనని కన్నవారిని తానే తన్నుకుపోయే గద్దా అనండి.మరేదైనా అనండి.మనిషని మాత్రం అనకండి….బతికున్నప్పుడు  కాస్తంత బువ్వపెట్టకుండా,ఒక్కమాటన్న పలకరించకుండా,చనిపోయాక సమాధుల కోటలు కట్టి అమ్మానాన్నలమీద దొంగప్రేమని చూపించే వాళ్ళని మనిషనకండి..

*

ఫోటో: ప్రవీణ్

Avatar

పెద్దన్న మారాబత్తుల

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎందుకో ఈ వాక్యాలు చదువుతుంటే పతంజలి భాష్యం గుర్తుకు వచ్చింది. మంచి లైన్ పెద్దన్నా. ఇవన్నీ ఆధునికత మూలంగా మానవత్వానికి వాటిన నెర్రెలు, అవిప్పుడు నెర్రలు అఘాతాలుగా మారే రోజూ రాకపోదు.అన్ని సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబందాలే అనే విశాల అర్థం లో దానిని కుదించే పని చెయ్యను గానీ ఇప్పుడు ప్రేమలు బంధాలు రాకెట్ స్పీడ్ లో వీక్ ఎండ్ క్రతువులు అయిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే పెన్సన్ పెద్దకొడుకు ఇటువంటి ఆదరణ లేని వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం కూడా చూపాలి. ఈ రైటప్ కు ఉపయోగించిన ఫోటో బాగుంది. అల్ ది బెస్ట్ పెద్దన్నా…

  • Excellent sir….చాలా బాగా రాసారు….చదువుతూంటే కళ్లల్లో నీళ్ళ వచాయి…

  • ఇది నేను చదువుతున్నంత సేపు నా చుట్టూ కొన్ని ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆర్ధిక సంబంధాలు రోజు రోజుకి ఎలా బల పడుతుందో అర్ధం అవుతుంది.మనిషి ఏదో సాధించడానికి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వదిలేసి తిరిగి తిరిగి అలసిపోయి అందరూ దూరం అయిపోయిన తరువాత తనకు కావాల్సింది, తను కోరుకుంది తన చుట్టూనే ఉంది అని గ్రహించి తెరుకొనేలోపు ఆ ప్రపంచమే ఆవిరయ్యిపోతుంది.

    “ఒకప్పుడు మానవ సంబంధాల్లో ఆర్ధిక సంబంధాలు ఉండేవి.
    ఇప్పుడు ఆర్ధిక సంబంధాల్లో మానవ సంబంధాలు ఉచ్చు బిగుసుకుంటున్నాయి”

    చాలా బాగా రాసారు అన్నయ్య ,మీ నుంచి మరిన్ని ఆసిస్తూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు