కవిత్వానికి కావాల్సింది…!

నా పూర్వజులెంత అమాయకులు!
నెనరు నిండిన మనుషులు వాళ్లు
అయినా అస్పృశ్యులు

తెలుగులో మంచి కవిత్వం రాస్తున్నవాళ్లెందరో వున్నారిప్పుడు. అయితే వస్తువు విషయంలో పరిధిని ఇంకా  పెంచుకోవాలేమో అనిపిస్తుంది. స్థానిక అంశాలమీద మన భాషలో చాలా కవిత్వమే వచ్చింది.

ఇంకా కొత్తగా ఏయే విషయాలమీద కవిత్వం రాయొచ్చు, అని ప్రతి కవీ ఆలోచించి ఆ దిశగా అడుగు వేస్తే, తెలుగు కవిత్వం ఇతర భారతీయ భాషల కవిత్వంతో మరింతగా పోటీ పడే దశకు చేరుతుంది. దీనికి సమాంతరంగా శిల్పంలో విశిష్టతను, విలక్షణతను, నవ్యతను చేర్చుకోవడం మరో విధానం.

మొత్తం మీద వస్తువులోనో, శిల్పంలోనో – రెండింటిలో అయితే మరీ మంచిది – సాధారణత్వానికి దూరంగా జరిగి Unconventional poetry ని వెలువరించడం అవసరం. Run-of-the-mill కవిత్వంతో విసిగిపోనివాళ్లు అదృష్టవంతులనిపిస్తుంది. కానీ మరోవిధంగా చూస్తే వాళ్లు దురదృష్టవంతులని కూడా అనిపిస్తుంది.

ఇతర భాషల్లో వస్తున్న ఆధునిక కవిత్వాన్ని కనీసం ఇంగ్లిష్ లోనైనా చదివి అర్థం చేసుకుని కొత్తపోకడలను గమనించడం చాలా అవసరం. వేరే భాషల్లో వస్తున్న విభిన్న, విశిష్ట కవిత్వానికి Exposure లేకపోవడం బాగా రాస్తున్న తెలుగు యువకవులకు ఒక Handicap అనే చెప్పాల్సి వుంటుంది. Indian Literature, Muse India మొదలైన ఆంగ్ల పత్రికలను చదివితే తెలుగు యువకవులకు ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.  Unconventional poems ఎక్కడ కనిపించినా వాటిని తెలుగులోకి అనువదించడం బాధ్యతగా భావిస్తూ వస్తున్నాను.

ఐదేళ్ల క్రితం నేను వెలువరించిన ‘పొరుగువెన్నెల’లో, గత సంవత్సరం ప్రచురించిన ‘ఊహల వాహిని’లో అటువంటి కవిత్వం దొరుకుతుంది. ఈ మధ్య మరికొన్ని ఇతర భారతీయ భాషల కవితలను అనువదించాను. వాటిని ఇప్పుడు రెండు భాగాలుగా మీ ముందుంచుతున్నాను. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో వస్తువు పరంగా, శిల్పపరంగా మరింత Unconventional అయిన కవితల అనువాదాలుంటాయి.

                                                                                                   – ఎలనాగ  

నీకు ఈదడం వచ్చా?

నువ్వు కోరితే

జీన్స్ తొడుక్కోవటం మానేయగలను

వేరే స్త్రీగా మారగలను, చాలా సులభంగా.

నువ్వు ప్రేమించే అమ్మాయితల మీద

తైలసంస్కారం లేని పొట్టి కురులున్నాయి

(అని నువ్వెవరికో చెప్పినట్టున్నావు)

ఆమె యెప్పటికీ నీది కాలేదు!

సరే, రేపట్నుంచి నాకు నేనే

అపరిచితురాలినవుతాను

నువ్వడిగితే ఈ నది తన నీలిరంగు చీరను

నీ పాదాల ముందు పరుస్తుంది

నావి అబ్బాయిల అలవాట్లు

వాటన్నిటినీ గాలికి వదిలేయగలను

 

అయితే పిల్లవాడా!

నీకు ఈదడం వచ్చా?

బెంగాలీ మూలం: మందాక్రాంత సేన్

వంద కొడుకుల యిల్లు

అతడు తన గదిలో

గాలి తాలూకు మెత్తని ఏడుపును వింటాడు

ఆ గాలిలో వానగుసగుసలుంటాయి

 

అతని నూరుగురు కొడుకులు

తమలో తామే బందీలయ్యారు

తమనీడలో తామే దాక్కునే వృద్ధులయ్యారు

 

తర్వాత ఆ వాన ఎలా ఏడవాలో మరిచిపోయింది

అతని సింహాసనంలోని ఏకాంతమే పరిపాలించసాగింది

 

ఆలోచనల్లో మునిగిపోయిన అతడు

తనెప్పుడూ ఒంటరిగా వెళ్లని చోటు లోపలికి పోయాడు

 

ఉరి తీయబడిన హంతకుని పాలిపోయిన ముఖమే ఆ చోటు

ఆ హంతకుడు ఒకప్పుడు తాను బతికిన ప్రపంచాన్ని

అసలే అర్థం చేసుకోలేకపోయాడు

 

వంద కొడుకుల తండ్రికి ఇప్పుడు సొంతయిల్లు లేదు

భారతదేశం తన పిడికిలిని బిగించి

అతని ముఖాన్ని ఛిన్నాభిన్నం చేసింది

 

అతని గదిలో మౌనం మహాసముద్రమైంది

అతని గొంతులో వెక్కిళ్ల సంగీతం నిండిపోయింది

 

గాలిలోని చావువాసనను పరాయితనం నిండిన కళ్లతో పరికిస్తూ

తన వంద కొడుకులను లేపే ప్రయత్నం చేస్తాడతడు

 

కానీ ఆ కొడుకులు

ద్వేషపు దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తుంటారు

    ఆంగ్లమూలం:  జయంత మహాపాత్ర

పరాయి మనుగడ

మేము తిరిగివచ్చి వారం రోజులైంది

వారం మరో వారంలోకీ

ఆ పైన మరెన్నో వారాల్లోకీ దొర్లిపోతుంది

అయినా పాలరాతి నేలమీది దుమ్మూ

గదిమూలల్లోని బూజూ

ఇంటిలోని ముక్కవాసనా

మునుపటిలాగా అట్లానే వుంటాయి

ఎందుకంటే మేము ఈ యింట్లో

నిజంగా నివసించే మనుషులం కాము

ఇక్కడ వ్యాపకాలు బాధ్యతలు

పనులు మాత్రమే మనుగడ సాగిస్తాయి

సమయాన్ని బేరం చేసి కొనడం

కొనుగోలుదార్లకు నచ్చేలా

ప్యాక్ చేసి లేబిల్ అంటించడం

ఇక్కడ మామూలుగా జరిగే విషయాలు

సమయమంతా భుజించడానికీ భోగించడానికే

నిద్రించడానికి సరిపడే సమయం మాకెప్పుడూ వుండదు

ఇతరుల బ్రతుకుల్ని జీవించడం

ఇతరుల కలల్ని స్వప్నించడం నిర్బంధమైపోయి

మేమిట్లానే మిగిలిపోతాం

  ఆంగ్లమూలం: ఎ. జె. థామస్

ఆకాశంలో విమానం

ఆకాశంలో విమానమొకటి దూసుకుపోతున్నప్పుడు

ఒక చెట్టు చుట్టూ చీమలు చేరుతాయి

ఒక స్త్రీ కొన్ని బట్టలను ఆరవేస్తుంది

ఒక తపాలా బంట్రోతు ఉత్తరాలను బట్వాడా చేస్తుంటాడు

ఒక రైతుచేతిలోని పార భూమ్మీద దెబ్బ వేస్తుంది

ఒక లేగదూడ ఉల్లాసంతో గంతులు వేస్తుంది

ఒక చంద్రవదన చెరువులో మునక వేస్తుంది

ఒక అమ్మాయి తనవంతు ఆహ్లాదాన్ని అనుభవిస్తుంది

లేదా దుఃఖం ఆమెమనసును తాకుతుంది

కాని ఆ విమానం

బాంబులను వర్షించే యుద్ధవిమానమైతే

ఒక్కక్షణంలో అన్నీ అంతర్ధానమౌతాయి

   హిందీ మూలం: ప్రయాగ్ శుక్లా

 

నా పూర్వజులు

శూద్రుడు బ్రహ్మపాదం లోంచీ

బ్రాహ్మణుడు బ్రహ్మతల లోంచీ

పుట్టారని అన్నావు నువ్వు

కానీ బ్రహ్మ పుట్టింది ఎందులోంచి

అని అడగలేదు వాళ్లు

 

సేవ చేయడం శూద్రుని ధర్మం

అని నువ్వన్నప్పుడు

జీతం యెంత అని అడగలేదు వాళ్లు

 

సేవకులు దొరికినందుకు

నీకెంతో సంతోషం…

 

వాళ్లకు కూడా సంతోషమైంది

అధికారాన్నంతా నీ చేతిలో పెట్టినందుకు

ఆనందం కలిగింది నీకు

 

కట్టుకునేందుకు బట్టలు లేకున్నా

కడుపు నిండా అన్నం లేకపోయినా

కష్టాలు యెంతో బాధించినా

నీ నవ్వును చూసి వాళ్లూ నవ్వారు

 

బరహీనుల్నీ బోళా మనుషుల్నీ

దోచుకోవడం తెలీదు వాళ్లకు

 

చంపడం ధీరతకు చిహ్నమనీ

చౌర్యం సంస్కృతికి సంకేతమనీ

ఎరుగరు వాళ్లు

 

నా పూర్వజులెంత అమాయకులు!

నెనరు నిండిన మనుషులు వాళ్లు

అయినా అస్పృశ్యులు

  హిందీ మూలం: ఓం ప్రకాశ్ వాల్మీకి

 

కుప్పిగంతులు

తెల్లదొకటీ నల్లదొకటీ

ఎర్రదొకటీ గోధుమవన్నెదొకటీ

మేటిగుర్రాలు నాలుగు

ముందుకు ఉరికాయి

 

ఒకదానికి నాలుగు కాళ్లు

ఒకదానికి మూడు కాళ్లు

మరొకదానికి రెండే

ఇంకొకదానికి ఒకటే

 

ఒంటికాలి గుర్రం

తన నేస్తాలతో అన్నది యిలా:

నాట్యం చేయాల్సిన సమయమిది

రండి చేద్దాం నాట్యం

 

ఊహ అందరికీ నచ్చింది

నాట్యం మొదలైంది

నాలుగుకాళ్ల గుర్రం సొమ్మసిల్లింది

మూడుకాళ్లది జారి పడిపోయింది

రెండుకాళ్లది కుంటుతూ కూలబడింది

ఒంటికాలి గుర్రమొకటే

ఆగకుండా చేసింది నాట్యం

 మళయాళ మూలం: అయ్యప్ప పణికర్

 

 

మేడ్ ఇన్ అమెరికా

ప్రతి ధాన్యంగింజ మీదా

ప్రతి అన్నంముద్ద మీదా

మేడ్ ఇన్ అమెరికా అని రాయబడి వుంటుంది

 

శ్వేతసౌధపు పైఅంతస్తు కిటికీలోంచి

సాతాను తోక బయటికి వచ్చి

గోడను రాసుకుంటూ

కిందికి జారుతుంది మెత్తగా

 

ప్రతి గంటకోసారి

శ్వేతసౌధం దేవునికి

ఒక్కోరంగు శవాన్ని

కానుకగా యిస్తుంది

 

ప్రతి ధాన్యంగింజ మీదా

ప్రతి శవం మీదా

మేడ్ ఇన్ అమెరికా

అని రాయబడి వుంటుంది

తమిళ మూలం: మాలతీ మైత్రి

 

రోషనారా

రోషనారా!

నువ్వు నీ రొమ్ముల్లో గడ్డ కట్టిన పాలను ద్రవీకరించి

వాటిని రక్తంగా మార్చి

కదులుతున్న యుద్ధ ట్యాంకును

హత్తుకుంటావని యెలా ఊహించగలను?

 

నిర్బంధం లేని సీమలో

నిత్యం బానిస యిన కవిని నేను

ఇక్కడ ప్రజలకు కుక్కల్లాగా మొరిగే

కుక్కల్లా పిచ్చిగా చెలరేగే స్వేచ్ఛ వుంది

 

రోషనారా!

నా దేశంలో విప్లవం రాదు

గృహాలు గోరీలుగా మారవు

విద్యాలయాలు యుద్ధభూములైపోవు

అటువంటి నా సొంతనేల మీద

నీ గాజులూ ఎముకలూ లయబద్ధంగా

నలిగి చూర్ణమైపోతాయని ఎలా ఊహించగలను?

ఇక్కడ విప్లవం పోస్టర్లలో మూత్రశాలల్లో

రెస్టారెంట్లలో కాసేపు బద్ధకంగా పడుకుని

ఆ పైన మెల్లగా బ్యాలెట్ పెట్టెల్లోకి పాకుతుంది

రోషనారా!

సర్కారు యిక్కడ ఓ తీర్మానం చేసింది

నగరంలో ఒక వూరేగింపు సాగింది

వార్తాపత్రికల్లో వృత్తాంతం అచ్చయింది

నేను… నేను… నేను ఒక కవితను రాశాను

 

ఇక్కడ అంతకన్న యెక్కువ

ఏం చేయగలం మేము!

 

1971 నాటి ఈ కవిత ఢాకాలో స్వతంత్ర  సాధనకు దారి తీసిన విద్యార్థుల విప్లవం మీద రాయబడింది.

   పంజాబీ మూలం: అమితోజ్

 

ఎలనాగ

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గ్రేట్ ట్రాన్స్ లేషన్స్ సర్. అద్భుతంగా ఉన్నాయి అన్నీ
    థాంక్యూ ఎలనాగ గారు

    • చాలా థాంక్స్ బొల్లోజు బాబా గారూ.
      నా అనువాద కవితలు మీకు నచ్చినందుకు సంతోషం.

  • మనకున్న కొద్దిమంది మంచి అనువాదకుల్లో మీరొకరు. మీ రన్నట్టు మన తెలుగు కవుల వస్తువిసృతి ఇంకా పెరుగవలసి ఉంది.
    – రామా చంద్రమౌళి

    • నా అనువాద రీతిని మెచ్చుకున్నందుకూ, నా అభిప్రాయంతో ఏకీభవించినందుకూ మీకు నా కృతజ్ఞతలు రామా చంద్రమౌళి గారూ.

      మంచి కవుల ప్రశంసలు మనసుకు సంతోషాన్ని కలిగిస్తాయి.

  • ఎలనాగ గారు, మీ అనువాదాలు ఒక ప్రత్యేకానుభూతిని కలిగిస్తాయి.సౌకుమార్యం, ఎన్నిక పద్దతి బాగుంటుంది.నమస్సులు.

    • చాలా సంతోషం & కృతజ్ఞతలు దాసరాజు రామారావు గారూ, నా అనువాదాలు బాగున్నాయన్నందుకు. అవి ప్రత్యేకానుభూతిని కలిగించడమనేది అనువాదకునిగా నేను కొంత వరకైనా సఫలం కావడాన్ని సూచిస్తుందనుకుంటా.

      ఇక ఎన్నిక పద్ధతి నిజంగా నేనెప్పుడూ సీరియస్ గా తీసుకునే విషయం. తెలుగులో మనం తరచుగా చదివే కథలు, కవితలవంటి వాటిని అనువదించడం ద్వారా కొత్తగా సాధించేదేమీ వుండదని నా అభిప్రాయం. మూసపద్దతికి భిన్నమైన రచనలను అనువదించడమే నాకు ఎక్కువ ఇష్టం.

    • చాలా సంతోషం & కృతజ్ఞతలు దాసరాజు రామారావు గారూ, నా అనువాద కవితలు బాగున్నాయన్నందుకు. అవి ప్రత్యేకానుభూతిని కలిగించడమనేది అనువాదకునిగా నేను కొంతవరకైనా సఫలం కావడాన్ని సూచిస్తుందనుకుంటా.

      ఇక ఎన్నిక పద్ధతి నిజంగా నేను బాగా సీరియస్ గా తీసుకునే విషయం. మనం తెలుగులో తరచుగా చదివే కథలు, కవితల వంటి వాటిని అనువదించడం ద్వారా ప్రత్యేకంగా సాధించేదేమీ వుండదని నా అభిప్రాయం. మూస పద్ధతికి భిన్నమైన రచనలను అనువదించడమే నాకు ఎక్కువ ఇష్టం.

  • వస్తువు,శిల్పం ..రెండింటిని నేర్పిస్తున్న కవితలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు