రాసింది కవిత్వం అని, దానికి భవిష్యత్తు లో ఇంత ప్రాసంగికత వుంటుందని తెలియని రోజుల్లో మళ్ళీ దానికి తేదీలు సంతకాలు వుంటాయా చెప్పండి ? పత్రిక్కి ఎలా పంపాలో తెలియదు . బొత్తిగా సాహిత్య వాసన లేని మా ఇంట్లో కవిత్వం అంటే చదువుని చెడగొట్టే వ్యాపకం అనుకునేవారు . ముదిరితే పిచ్చాసుపత్రికి పోవాలి అని కూడా నమ్ముతారు . అచ్చయిన పుస్తకం చూపించి ఇక్కడ నా పేరొచ్చింది చూడమని నాన్నని బతిమలాడు కోవాల్సివచ్చేది . అమ్మ అల్ప సంతోషి కదా కాయితాన్ని నిమిరి నా పేరు కూడబలుక్కుని చదివి సంతోషించేది . కాబట్టి నా విషయంలో కవిత్వం ఒక రహస్య క్రీడ మాత్రమే . అచ్చయినదాన్ని జాగ్రత్త చేసుకునే శ్రద్ధ తెలీదు.
చలం బాధపడినట్టు గా , చదువు , అభిరుచులు , ప్రేమ, దోమ, పరువు, రహస్యం అన్నిటికీ ఒక్కటే యవ్వనదశ ఎందుకుంటుందో తెలియదు . రెండు మూడు యవ్వన దశలు వుండచ్చు కదా. ఎందులో దూకితే అందులోనే వుండిపోకుండా నాలుగైదు గమ్యాలు వుండేవి.
ఇంటర్ నుంచి రాస్తూనే వున్నా దాచుకోకుండా పారేసుకున్నవే ఎక్కువ . 1978 నుంచీ 1988 వరకు రాసిన వాటిలో నిర్మమకార౦ గా ఎంపిక చేసి ఒక 15 మాత్రం సందిగ్ధ సంధ్యలో చేర్చగలిగాను . నడిచే గాయాలు పుస్తకం వేసేటప్పుడు కవితల తేదీల వరస గుర్తురాక ప్రెస్ లో కూచుని తికమక పడుతుంటే వాసిరెడ్డి నవీన్ జోక్ చేశాడు.
“ నిన్ను చూస్తే గణపతి నాటకం గుర్తొస్తోంది నిర్మలా, అందులో కూడా ఇంతే, గణపతిని స్కూల్లో వేసేటప్పుడు వాళ్ళమ్మ చెబుతుంది చూడు , మచ్చల ఆవు ఈనినప్పుడు , కంచు చెంబు చెరువు లో కొట్టుకుపోయినప్పుడు కదా మా అబ్బాయి పుట్టాడు అని, అలావుంది.”
ప్రారంభ కవితలు ఒకే సంవత్సరంలో పది కి పైగా రాశాను , కొన్నాళ్ళు అసలు రాయలేదు . ఏది ముందు, ఏది వెనక అంటే నెలలు, తేదీలు సవ్యంగా చెప్పలేను . నా విషయంలో కవిత్వమే కాదు వాటి పుట్టుక ఊహాత్మకమే . కొన్నిటికే చెప్పుకోదగ్గ అనుభూతులు వుంటాయి. మా క్లాసులో కొంతమంది ప్రతి పుస్తక౦ మీదా బండ అక్షరాలతో తన పేరు రాసి నాలుగురకాల ఇంకులతో అండర్ లైన్ చేయడం చూస్తే విరక్తి పుట్టేది. ఎందుకలా కాయితాన్ని హింస పెడతారు ? అని అడిగేదాన్ని.
“ఎందుకేమిటి నీ మొహం, ఎవరూ ఎత్తుకుపోకుండా వుండే౦దుకు “ అని చెప్పేవారు. అదిగో అలాంటి జాగ్రత్త నాకు లేదు. పైగా కావాలని అలవర్చుకున్న అనార్కిజం ఒకటి. మూడు పొద్దులా కవిత్వం తప్ప నెత్తికి నూనె కూడా రాయకూడదనుకునే పాటింపు వుండేది . కొందరిలా కవిత్వం నన్ను ప్రమాద వశాత్తు కాటేయలేదు. ఆ ప్రమాదమే నా రూపంలో పుట్టింది . అవును ఇలా చెప్పడానికి చాలా గీర వుండాలి . కవి అంటే ఎంత గీర గా వుండాలి? గీరగానే వుండేదాన్ని.
క్లాసు పుస్తకాలంటే చిన్నచూపు . చదువేమిటి చదువు ? అది కవులు కాలేనివాళ్ళు చేసేపని అనుకునే అమాయకత్వం . దీనివల్ల పరీక్షలన్నీ గుండు కొట్టి గంట వాయించాయి . అయినా చలనం లేదు . ఇంటర్ లో పరీక్ష ముందు రోజు తిలక్ కవిత్వం తో లేచిపోవడం ఏమిటి ? డిగ్రీ లో అందరూ యూరోపియన్ హిస్టరీ పరీక్ష రాస్తుంటే నేను శేషేంద్ర శర్మ రాసిన “ కొండల నిశ్శబ్దాన్ని గుక్క గుక్కగా చప్పరిస్తున్నప్పుడు, చప్పుడు చేసే నా గుండె ని కూడా క్షమించలేను” అన్న ఒక్క వాక్యాన్నిఆన్సరు పేపరు మీద రాసి విలాసంగా కూచోడమేమిటి ? ఎక్కడయినా బాగుపడే లక్షణాలు వున్నాయా ? లేవు. అది తెలుసుకోవవడానికి ఇన్నాళ్ళు పట్టింది .ఇప్పుడు తెలిసీ లాభ౦ లేదు తిలక్ నీ, శ్రీ శ్రీ నీ ఒకేసారి చదవడంతో ఇటు విప్లవం, అటు అనుభూతి వాదం రెండూ కలిసి ఉక్కిరిబిక్కిరిచేశాయి.
అంచేత 1978 “చీకటి చినుకు”, 1980 “దూరదృశ్యాలు’ లాంటి వైయుక్తిక కవితలతో బాటు “ఈ సంప్రదాయం మాకొద్దు’ లాంటి ఎర్ర కవిత్వం కూడా రాశాను . ఈ కవితకు తాపీ ధర్మారావు అవార్డు వచ్చింది . అప్పుడు అందుకున్న తాపీ పుస్తకాలు రేపిన ప్రశ్నలు నన్ను కుదురుగా వుండనివ్వలేదు . ఆక్షరానికి ఆవేశాన్ని నేర్పాయి.
మొదటి రెండు ఆంధ్ర ప్రభ లోనూ, సంప్రదాయం కవిత ఆంధ్రజ్యోతి లోనూ వచ్చినట్టు గుర్తు .
1980 లో అచ్చయిన కవిత “దూర దృశ్యాలు” . దీనికొ క గుండెకోత నేపధ్యం వుంది. నాలుగో క్లాసు లో నాకొక మిత్రుడు వుండేవాడు . పూర్తి పేరు వరప్రసాదో ఏదో వుండేది. ప్రసాదం అని పిలిచేవాళ్ళం . బక్కగా వుండేవాడు . రెండు జేబుల నిండా పాలకోవాలు తెచ్చేవాడు. సంచీ నిండా కూడా రకరకాల తినుబండారాలు వుండేవి. వాళ్ళకి మిఠాయి షాపు వుండేదట. వాడి పక్కన కూచోడానికి పోటీ పడేవాళ్ళం . రెండు పెన్నులు తెచ్చేవాడు. ఒకటి తనకి ఇంకోటి దోస్తులకి. అవును. ఎవరి పెన్నులో ఇంకు అయిపోయినా తన పెన్ను సిద్ధంగా వుండేది.
ఎరుపురంగు గిరజాల జుట్టు , పిల్లి కళ్ళు , మాగిన సపోటా రంగులో వుండేవాడు . నాకు మంచి దోస్త్ . అదేమిటో అస్తమానూ దెయ్యం కధలు చెప్పి భయపెట్టేవాడు. ఒక దసరా సెలవలకని వాళ్ళ నాన్నమ్మ వూరు పాలకొల్లు వెళ్ళి మళ్ళీ రాలేదు. వెళ్లేముందురోజు వాడికీ నాకు పేచీ వచ్చింది . పేచీ అంటే మరీ పేచీ ఏం కాదు. లంచే బ్రేక్ లో ఇంటికెడుతూ పుస్తకాల సంచీ బెల్టు తెగి ఆ బరువుకి బొక్కబోర్లా బురదలో పడిపోయాను. అందరితో బాటు వాడూ నవ్వాడు . ఫ్రెండయి వుండి అలా నవ్వచ్చా ? పంపుదగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటున్నప్పుడు కూడా సారీ చెప్పలేదు . అందుకే మాట్లాడదల్చుకోలేదు.

“ఊరెడుతున్నాను రైల్లో, కిటికీ దగ్గర సీటు, మాట్లాడవా ? “ అని చీటీ రాసి నా ముందు పెట్టాడు . నేను మొహం తిప్పుకున్నాను . ఎప్పటిలాగా వాళ్ళ నాన్న వచ్చి స్కూటరు మీద తీసుకెళ్ళాడు . వాడు వెనక్కి చూశాడు అయినా నేను చూడాలనుకోలేదు . కోపం కదా . తిక్క కుదిరింది వెధవకి అనుకున్నాను కూడా . కానీ సెలవులు గడిచేకొద్దీ కోపం తగ్గిపోయింది . అన్యాయం కదా, నా దోస్తు కదా పాపం , ఎన్ని పాలకోవాలు ఇచ్చాడు అనిపించింది. స్కూలుకి వెళ్ళగానే నేనే ముందు సారీ చెప్పాలి అని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను . స్కూలు తెరిచారు , ఉత్సాహంగా క్లాసులో అడుగుపెట్టాను . రాలేదు వాడు. వారం అయింది. పదిరోజులు దాటింది రావటంలేదేమిటి ? అర్ధం కాలేదు.వెనక బెంచీ శ్యామలని అడిగితే చెప్పింది.
“అయ్యో ప్రసాదం పోయాడు, నీకు తెలియదా? రిజిస్టరు లో వాడి పేరు కొట్టేశారు కూడా “అంది
నాకు ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది . అయ్యో ప్రసాదం పోవడం ఏంటి ? పోవడం అంటే ఏమిటి ? ఎక్కడికి పోయాడు? తెలియక చాలా రోజులు నిద్రపట్టలేదు. ఏడెనిమిదేళ్ల వయసులో నేను విన్న మొదటి మరణం అది. సైన్సు మాస్టారు నడిగినా అదేమాట “జబ్బు పిల్లాడు కదమ్మా, పోయాడు .. చచ్చిపోయాడు” అన్నాడు. జబ్బు వుంటే మటుకు, పోవడమే న్యాయం అన్నట్టు ఆయన అలా చెప్పడం నాకు నచ్చలేదు . ఏమి జబ్బు, ఆయనకి తెలుసా ? అదేమిటి వెళ్ళేదాకా బానే వున్నాడు కదా. అయినా జబ్బు చేస్తే పోతారా ? వుండకూడడా ? ఎనిమిదేళ్ళ పిల్లకి ఎవరు చెబుతారు ?
“ఊరెడుతున్నాను రైల్లో , కిటికీ దగ్గర సీటు, మాట్లాడవా ?” అనే మాట వెయ్యి గొ౦తులతో వినిపి౦చేది. మనల్ని ఎవరయినా మోసం చేస్తే తిట్టుకోవచ్చు . దానికి మద్దత్తు కూడా దొరుకుతుంది . మనల్ని మనమే క్షమించుకోలేని తప్పు ఏదయినా చేస్తే ఆ బాధ చాలా క్రూరంగా వుంటుంది. వెళ్ళే ముందు రోజు కూడా నేను స్నేహంగా వుంటే బావుండేదా ? కనీసం నా మనసుకి బావుండేది. వాడి ప్రయాణం ఆగిపోతుందని కాదు . కాలం వెనక్కి రాదు కదా ఎలిమెంటరీ స్కూలు దాటి, హైస్కూలు, తర్వాత కాలేజీ, ఆ తర్వాత ఉద్యోగ జీవితం, ప్రసాదం గుర్తులు పల్చబడ్డాయి . కొత్త స్నేహాలు కుదిరాయి . అపరాధ భావన మనసులో ఒక మూల అలాగే వుంది . అదెలా పోతుంది ? కిటికీ పక్క రైలు ప్రయాణం .. పాలకొల్లు …. నల్లటి ఇంకు చుక్కలు .. ఇవన్నీ ఆ ఎనిమిదేళ్ళ పిల్ల వాడి పిల్లి కళ్ళని గుర్తుచేస్తాయి . మొదటి నుంచీ నాకు బ్లాక్ ఇంక్ అంటే ఇష్టం , వాడి వల్ల ఇంకా ఎక్కువ అయింది . 1980 ల నాటికి అది ఒక కవితా రూపం తీసుకున్నాక కొంచెం ఊరట చిక్కింది. పాత గాయానికి కొత్త నిట్టూర్పు తో కట్టుకట్టినట్టయింది.
కదిలే రైలు కిటికీలోంచి / నే వున్న ఇల్లు / గొ౦తువిప్పని పూల రెల్లు / ప్రశ్నలెవీ ఆడక్కుండానే వీడ్కోలిస్తుంది / సొంతమనుకున్న మనుషులు, స్వపరిచయాలు ఏవీ / ఉద్దేశించిన అనుబ౦ధాలు వ్యక్తం చెయ్యవు / టెలిఫోన్ తీగలపై వాలిన గోరువంకా / వరిమళ్ళలో ఈదులాడే నెలవంకా / వద్దన్నా వెన్నంటి వస్తూనే వుంటాయి . / చిన్నప్పుడు గోళీ లాడిన ప్రాణ స్నేహితుడి మరణ వార్తలా / గుమ్మ౦ లో కాళ్ళకి చుట్టుకున్న తెల్లపిల్లి జాలి కళ్ళలా
తీగ మీటితే చాలు / చెప్పలేనంత వ్యాకులత / తుదీ మొదలు లేని వాక్యలత / కేంద్రం నుండి కక్ష్య వరకు సాగిపోయే ఈ అనంత ప్రయాణ దూరంలో / నీతో చేతులైనా కలపని, అడుగై నా వేయని / ఈ కాసిన్ని పరిచిత గళాలు,/ పరిమళ దృశ్యాలు / ఎందుకింత బాధిస్తాయో అర్ధంకాదు / నా ప్రమేయమైనా లేకుండానే / మెడను వంచి తలను తనవేపు లాక్కుని / చూపుల్ని అంతదూరాన ఆరేస్తాయి / దూర దృశ్యాలెప్పుడూ రైలు వెంట / గాయపెట్టే స్మృతులన్నీ నా వెంట….
-కవిత్వం ఏం చేస్తుంది ? రాయిని మనిషి చేస్తుంది . మనిషిని మ౦చులా కరిగిస్తుంది. కరిగిన ఆ ప్రవాహానికి ఒక దిశ చూపిస్తుంది . కవిత్వం నాకు చాలా ఇచ్చింది. నేనే ఏమీ ఇవ్వలేదు.
నా కవిత్వానికి మొదటి విమర్శకుడు టి. ఎల్ కా౦తారావు . అది ప్రభలో వచ్చింది . ఎక్కువసార్లు ఆత్మీయ పరామర్శ చేసినవారు చేకూరి రామారావు . చేరా వల్ల నేను సరళ వాక్యం నేర్చుకున్నాను . నేను కవిని కాకపోయి వుంటే ఏం అయివుండేదాన్ని ? ఏమో ? బహుశా బొమ్మలు వేసే ఆర్టిస్టుగా స్థిర పడేదాన్ని. లేదా ఏ కంపెనీలోనో గుమాస్తాగా పనిచేస్తూ పప్పులు, ఉప్పులు ఎవరు తగ్గిస్తే వాళ్ళకి ఓటేస్తూ వుండేదాన్ని . చివరికి ఆ మురికి నీళ్ళ కుంభమేళాలో కూడా మునిగి వచ్చేదాన్నేమో తెలీదు . అప్పుడు నా మొదటి కవితానుభవం గురించి ఎవ్వరూ అడిగేవారు కాదు . నన్ను నేను పనికట్టుకుని తలకి౦దులుగా బోర్లించుకుని ఏభైయ్యేళ్ళ వెనక్కి వెళ్ళేదాన్ని కానేకాదు.
*








ప్రతీ వ్యక్తి జీవితంలోనూ ఇలాంటి బాధ ఒకటి ఉంటుందేమో. లేక సున్నితమైన హృదయం ఉన్నవారికేనా. చిన్నప్పుడు..అంటే మీకంటే బాగా చిన్నప్పుడు మేము పెంచుకుంటున్న కుక్కపిల్లని, నేను అరవమన్నపుడు అరవలేదని తీసుకువెళ్ళి కాలవలో పడేసి అది అరుస్తుంటే సంతోషించాను. అది తిరిగి రాదు..రాలేదు అన్నప్పుడు అప్పుడు..మూడు రోజులపాటు ఏడ్చాను. ఇప్పుడు 70 ఏళ్ల వయస్సొచ్చాక జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కళ్ళు చెమ్మగిల్లుతాయి. మీరు మంచివారు కాదు. నాకు మళ్ళీ జ్ఞాపకం తెచ్చారు.
అవును, కవిత్వం అనే ‘ప్రమాదమే’ కొండేపూడి నిర్మలగా పుట్టింది! ఆమె కవయిత్రి కాకుండా మరింకేదీ అయ్యే అవకాశమే లేదు. అది పాఠకుల అదృష్టం.