ఏ కథైనా చివరికి ఎక్కడికి చేరుతుందో, మనం కూడా అక్కడికే చేరుకున్నాం. అదే ముగింపు.
దాదాపు సంవత్సరం క్రితం మొదలుపెట్టిన ఈ వ్యాసాలలో వరుసలో రెండో వ్యాసంలో అనుకుంటాను, కథా ప్రారంభం గురించి చెప్తూ – కథా ప్రారంభం అంటే రచయిత పాఠకులకి ఇచ్చే వాగ్దానం లాంటిది అని చెప్పాను. ప్రారంభం వాగ్దానం అయితే, ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడమే ముగింపు. పాఠకులు చదివే ప్రతి వాక్యం, తిరగేసే ప్రతి పేజీ, ఆ కథపై పెట్టే సమయం, శ్రద్ధ ఇవన్నీ ఒక పెట్టుబడి లాంటివి. వాళ్లు ప్రధాన పాత్ర వెనుకే నడుస్తూ, ఆ పాత్ర సంఘర్షణలను, పరాజయాలను, అన్వేషణలను, పరిణామాలను అనుభూతి చెందుతారు. ఎందుకు?
ఎందుకంటే ప్రధాన పాత్రతో చేసే ఆ ప్రయాణం కచ్చితంగా ఏదో ఒక అర్థవంతమైన గమ్యస్థానానికి దారితీస్తుందని ఉండే నమ్మకం వల్ల. ఆ నమ్మకాన్ని నిజం లేదా ఒమ్ము చేసేదే కథా ముగింపు. ఒక అద్భుతమైన ఆరంభం పాఠకులని ముందుకు సాగమని ప్రోత్సహించవచ్చు, ఒక ఆసక్తికరమైన చర్చన వాళ్లని కథలో లీనం చేయవచ్చు, కానీ కథని పాఠకులు ఎలా గుర్తుంచుకోవాలో నిర్ణయించేది మాత్రం ముగింపే. చాలా మంది పాఠకులకు కథ చదివిన కొన్ని నెలల తర్వాత అందులోని ప్రతి సంఘటన గుర్తుండకపోవచ్చు, కానీ ముగింపు తమలో ఎలాంటి స్ఫూర్తిని నింపిందో, ఎంతగా కలచివేసిందో, ఎలా కలవరపాటుకు గురిచేసిందో, ఎంత లోతుగా హృదయాన్ని హత్తుకుందో మాత్రం ఎంతో స్పష్టంగా గుర్తుంచుకుంటారు. ఆ కోణంలో చూస్తే ముగింపు అనేది కథ అందించదల్చుకున్న భావోద్వేగానికి అద్దం లాంటిది. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ సంపూర్ణ కథా రూపం ముగింపులోనే పాఠకులకి సాక్షాత్కరిస్తుంది.
ఒక బలమైన ముగింపు కథా రచన పైన రచయితకు ఉన్న పట్టుని కూడా నిరూపిస్తుంది. కథలోని ప్రతి దృశ్యం, ప్రతి సంభాషణ, ప్రతి సంఘర్షణ బుద్ధిపూర్వకంగా ముగింపు అనే గమ్యస్థానం వైపే అడుగులు వేస్తూ వచ్చాయని ఒక మంచి ముగింపులో అనిపించాలి. కథ ముగియడం వేరు, రచయిత రాయడం ఆపేయడం వేరు. రచయిత రాయడం ఆపేసిన చోటు ముగింపు కాదు. ముగింపు అంటే ఆ కథ అక్కడ తప్ప ఇంకెక్కడ ఆగకూడదు అనిపించే గమ్యస్థానం. ఆ ముగింపు సుఖాంతమైనా, విషాదాంతమైనా, ఆశాజనకమైనా, నిరాశాజనకమైన సరే, పాఠకుడు అక్కడికి చేరుకున్నాక ఈ కథకి ఈ ముగింపు అనివార్యమైనది అని అనిపించాలి. ఈ అనివార్యతే అత్యున్నత కథా శిల్పానికి అసలైన గీటురాయి. కొన్ని అద్భుతమైన ముగింపులు కథలో ఉన్న ఒక భావోద్వేగాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించాయనే అనుభూతిని కలిగిస్తాయి. అంటే కథలో ఉన్న ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వడం కాదు. కథలో ఉన్న ప్రధాన భావోద్వేగాన్నీ, అంతర్లీనంగా ఉన్న తాత్విక చింతనను ఒక ప్రయాణంలా సాగించి చివరికి వాటిని పరిపూర్ణం చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమౌతుంది.
ఒక మంచి కథకి పేలవమైన ముగింపుని జోడిస్తే ఆ కథ నిలబడదు. కానీ కథ అంత గొప్పగా లేకపోయినా, అద్భుతమైన ముగింపు ద్వారా ఆ కథని నిలబెట్టచ్చు. ఎందువల్ల? ముగింపుకి ఉండే ఐదు ప్రధాన లక్షణాల వల్ల. అవేమిటో చూద్దాం రండి –
- తృప్తిని కలిగించడం
నేను మొదట్లో చెప్పినట్లు పాఠకులు ప్రతి కథనూ నమ్మకంతో మొదలుపెడతారు. కథ లేవనెత్తిన ప్రశ్నలు చివరికి ఒక అర్థవంతమైన ముగింపుకి చేరతాయని వాళ్లు ఆశిస్తారు. అది జరిగితే కథ తృప్తిగా ముగుస్తుంది. ఇక్కడ తృప్తి అంటే కేవలం ‘సంతోషం’ మాత్రమే కానవసరం లేదు. కథా గమనంలో సహజంగా ఒక విషాదాంతం పుడితే, అది కూడా పాఠకులకి ఎంతో తృప్తిని ఇస్తుంది. తగినంత పునాది లేకుండా అకస్మాత్తుగా వచ్చే సుఖాంతం కూడా శూన్యంగా అనిపిస్తుంది. పాఠకులు ఆశించేది ఏదో ఒక ఖచ్చితమైన ఫలితాన్ని కాదు, తాము పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసే ఒక సరైన ముగింపును, తద్వారా ఒక తృప్తిని మాత్రమే.
- లోతైన ముద్ర
మీరు ఏదైనా ఒక మంచి కథని తీసుకోండి. కథలోని చివరి నాలుగు పేరాలు, లేదా చివరి నాలుగు వాక్యాలు చూడండి. అవి చాలా బలమైన భావోద్వేగాన్ని కలిగించేవిగా ఉంటాయి. కథనంలో ఉన్న ఉత్కంఠ, పాత్రల పరిణామ క్రమం, అంతర్లీనంగా నడిచే ఆలోచనల, శోధన అంతా కలిసి ఒకే అనుభూతిగా కేంద్రీకృతమయ్యే స్థానం ఇదే. ఆనందం, దుఃఖం, ఊరట, ఆశ, భయం, విషాదం లాంటి అనుభూతిని, ఆ పుస్తకాన్ని మూసివేసిన తర్వాత కూడా పాఠకులు తమతో పాటు మోసుకెళ్లేలా చేసేది ముగింపే.
ముగింపులోని భావోద్వేగం కేవలం నాటకీయ సంఘటన మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కథ గనుక పాఠకుడిని ఆ క్షణం కోసం మొదటి నుంచి సిద్ధం చేస్తూ వస్తే ముగింపు సరైన అనుభూతిని ఇవ్వగలుగుతుంది. రచయితలు చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి ఏంటంటే ఆ చివరి వాక్యాలలో భావోద్వేగాలను బలవంతంగా కల్పించడానికి ప్రయత్నించడం. ఒక నిజమైన భావోద్వేగ ప్రభావాన్ని ఆఖరి పారాగ్రాఫ్‌లో అకస్మాత్తుగా తీసుకురావడం అసాధ్యం. దాన్ని కథ అంతటా నెమ్మదిగా పెంచి పోషించాలి. ముగింపు అనేది కేవలం అప్పటికే నాటిన భావోద్వేగాల పంటను కోయడంలాగా జరగాలి. ఒక కథ చదవడం ముగించాక పాఠకులు కన్నీళ్లు పెట్టుకున్నా, చిరునవ్వు నవ్వినా, నిశ్శబ్దంగా ఆలోచనలో మునిగిపోయినా అది కేవలం ఆ చివరి వాక్యం వల్ల మాత్రమే జరగదు. అంతకుముందు సాగిన ప్రతి దృశ్యమూ వాళ్లని ఆ గమ్యస్థానానికి నడిపించింది కాబట్టే అది సాధ్యమవుతుంది.
- కథా వస్తువుని బలోపేతం చేయడం
ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రతి కథా, కథ మాత్రమే చెప్పదు. కథని దాటి, దాన్ని మించిన మరేదో ఒక పెద్ద నిజం, ఆలోచన గురించి మాట్లాడుతుంది. కథలో జరిగే సంఘటనల వెనుక ఒక లోతైన ప్రశ్న లేదా ఆలోచన దాగి ఉంటుంది: ఆశయం కోసం చెల్లించాల్సిన మూల్యం, అస్తిత్వం కోసం శోధన, ఒంటరితనపు భారం, చట్టం చేసే అన్యాయం, మనిషి కోరికల వలయం – ఇలాంటివేవో కథలో ఉంటాయి. చాలాసార్లు ఇవి తాత్వికమైనవి కూడా అయ్యుంటాయి. మంచి ముగింపు ఈ ఆలోచనలకి ఒక స్పష్టమైన రూపాన్ని కల్పిస్తుంది.
అలాగని ఆ ఆలోచనను, తాత్విక చింతనను మాటల్లో చెప్పకూడదు. అది మంచి కథా లక్షణం కాదు. ఆ ఆలోచనలను ఆచరణలోనో, పాత్ర మీద ఆ ఆలోచన తాలూకూ ప్రభావం ద్వారానో చూపించాలి. పాత్రలు తీసుకునే నిర్ణయాలు, వాటి వల్ల ఆ పాత్రలు ఎదుర్కొనే సందర్భాలు, ఆ కథ పాఠకుల మనసులో వదిలి వెళ్లే దృశ్యాల ద్వారానే ఆ థీమ్‌ను పాఠకులు స్వయంగా చేరుకునేలా రచన సాగాలి.
ముగింపు కథ మూలమైన ఆలోచన నుంచి సహజంగా పుడితే, పాఠకుల మనసులో ఆ కథ సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతకుముందు జరిగిన ప్రతి విషయానికీ మరో కొత్త అర్థం, కోణం తోడవుతుంది. కథలో అక్కడక్కడ చెప్పిన చిన్న చిన్న వివరాలు కూడా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మరింత సంపన్నంగా అనిపిస్తాయి. ఎందుకంటే ముగింపు వాటి వెనుక ఉన్న అసలు ప్రాధాన్యతను ఆవిష్కరిస్తుంది. ఈ విధంగా, ఒక మంచి ముగింపు కేవలం కథను ముగించడం మాత్రమే కాదు, ఆ కథ పైన, దాని వెనుక ఉన్న చింతన మీద ఒక కొత్త కాంతిని ప్రసరింపజేస్తుంది.
- జ్ఞాపకంగా మార్చడం
పాఠకులు కథలను ఎప్పుడూ దృశ్యం తర్వాత దృశ్యంగా గుర్తుంచుకోరు. జ్ఞాపకశక్తి ఆ కథ మొత్తాన్ని కుదించి కొన్ని స్పష్టమైన ముద్రలుగా మార్చుకుంటుంది. ఈ ముద్రలలో అన్నింటికంటే బలమైనది సాధారణంగా ముగింపే అవుతుంది. ఎందుకంటే ఆ కల్పిత ప్రపంచాన్ని వదిలి వెళ్లే ముందు పాఠకుడు పొందే ఆఖరి భావోద్వేగ అనుభూతి అదే కాబట్టి. మానసిక శాస్త్రవేత్తలు తరచుగా ‘పీక్-ఎండ్ ఎఫెక్ట్’ (Peak-end effect) గురించి మాట్లాడుతుంటారు. మనుషులు తాము పొందిన అనుభవాలలో అత్యంత తీవ్రమైన అనుభవం ద్వారా, ఆ అనుభవం ఎలా ముగిసిందనే దాన్నిబట్టే గుర్తుంచుకుంటారు అని ఈ సిద్ధాంతం చెప్తుంది. కథా రచన కూడా సరిగ్గా అలాగే పనిచేస్తుంది. వందల పేజీల నిడివి ఉన్న ఒక నవల, చివరికి ఒకే ఒక్క ముగింపు దృశ్యం వల్లే పాఠకుల జ్ఞాపకాల్లో నిలిచిపోవచ్చు. అందుకే ముగింపుకి చాలా పెద్ద బాధ్యత ఉంటుంది.
- ప్రతిధ్వనించే గుణం
కొత్తగా రాయడం మొదలుపెట్టిన చాలా మంది రచయితలు, ప్రతి విషయానికీ సమాధానం ఇచ్చేసి, ప్రతి సంఘర్షణనూ పూర్తిగా ముగించేస్తేనే ముగింపు సరిగ్గా చేసినట్లు భావిస్తారు. కానీ చరిత్రలో నిల్చిపోయిన గొప్ప సాహిత్యం ఏదైనా చదివితే అది నిజం కాదని తెలుస్తుంది. కలకాలం గుర్తుండిపోయే అద్భుతమైన ముగింపులు గమనిస్తే అవి అసంపూర్ణాంగానూ, ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వకుండా పాఠకుల మనసులో ఆలోచనలు వదిలి వెళ్లేవే అయ్యుంటాయి. వాటి గొప్పదనం సమాధానాలు ఇవ్వడంలో ఉండదు. రచయిత మనసులో పుట్టిన ఒక ఆలోచనను, ఒక ప్రశ్నని పాఠకుల మనసులో ప్రతిధ్వనించేలా చెయ్యడంలో ఉంటుంది.
ఒక అద్భుతమైన ముగింపు ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం కానీ అందులో ఒక చిన్న తిరకాసు ఉంది. మంచి ముగింపు అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇవ్వదనే మాట నిజమే కానీ కథని నడిపించే ముఖ్య ప్రశ్నకీ మాత్రం సమాధానం ఇవ్వాలి. లేకపోతే ఆ కథ అసంపూర్ణంగా మిగిలిపోయినట్లు పాఠకులు అనుకునే ప్రమాదం ఉంది. ముగింపు ఉద్దేశం కేవలం సంఘటనలను ముగించడం మాత్రమే కాదు. పుస్తకాన్ని మూసిన తర్వాత కూడా ఆ కథ పాఠకుని అంతరంగంలో సజీవంగా జీవిస్తూనే ఉండేలా చూడటమే దాని అసలు ఉద్దేశం.
అన్నింటికన్నా ముఖ్యమైనది మరొకటి ఉంది. అది ఆ కథకి సంబంధించిన అంతర్లీనమైన తాత్విక చింతనకి బలాన్ని ఇవ్వడం. ఒక రచయితగా మీరు ఒక ప్రేమ జంట కథ చెప్పచ్చు, తండ్రీ కొడుకుల కథ చెప్పచ్చు, ఇద్దరు అపరిచితుల కథ కూడా చెప్పచ్చు. కానీ ఆ మూడింటిలో మీరు త్యాగం అనే ఆలోచనను వస్తువుగా స్వీకరించి ఉండాచ్చు. కథాంశం వేరు, వస్తువు వేరు. కథ ఏదైనా అందులో ప్రేమ, అస్తిత్వం, త్యాగం, ఆశయం, క్షమాపణ లాంటి ఏదో ఒక ఆలోచనని (Theme) అంతర్లీనంగా చర్చించచ్చు. ఈ ఆలోచనను నేరుగా మాటల్లో వివరించడం కంటే, ఒక ముగింపు ద్వారా పాఠకులకి స్పష్టంగా అందింఛచ్చు. రచయిత మనసులో పుట్టిన ఒక ఆలోచనని పాఠకుల మనసులో పంపించే సాధనంగా కథ మారుతుంది. అందులో ఆ ఆలోచనని మోసే బాధ్య ముగింపుకే ఎక్కువగా ఉంటుంది. అలా ఆ అంతరార్థాన్ని పాఠకులు స్వయంగా గ్రహించినప్పుడు, ఆ కథ మరింత ఆసక్తికరంగా, ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మారుతుంది. అందుకే ముగింపుకి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంత ప్రాముఖ్యత కలిగిన ముగింపు విషయంలో రచయితలు సామాన్యంగా చేసే తప్పులేమిటో అర్థం చేసుకోడానికి ఒక కథలో కొంత భాగం (ముగింపు) కింద ఇస్తున్నాను. ఇది మీరు చదివిన తరువాత అందులో ఉన్న లోపాలేమిటో తెలుసుకుందాం.
>> ఇంటికి వెళ్లే రైలు
(నేపథ్యం: ఆనంద్, కార్తీక్ అన్నదమ్ములు. పదేళ్ల క్రితం జరిగిన ఒక ఆస్తి గొడవ కారణంగా కార్తీక్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఇల్లు అమ్మాలంటే అతని సంతకం తప్పనిసరి అని తెలుసుకున్న ఆనంద్ అతని కోసం కథ మొత్తం వెతుకుతూ ఉంటాడు. రకరకాల ప్రదేశాలు తిరుగుతాడు. ఆ ప్రయాణంలో తన తప్పు తెలుసుకుంటాడు. పశ్చాత్తాపపడతాడు. చివరికి కారీక్ కాచీగూడా రైల్వే స్టేషన్‌లో ఉన్నాడని ఎవరో చెప్తే అక్కడికి చేరుకుంటాడు)
ఆ ప్లాట్‌ఫారమ్ దాదాపు ఖాళీగా ఉంది.
ఆనంద్ తన పక్కన నుంచి వెళ్తున్న ప్రతి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ మెల్లగా నడుస్తున్నాడు. ఢిల్లీ వెళ్లే ఏదో ఎక్స్‌ప్రెస్ గురించి ఎనౌన్స్‌మెంట్ స్టేషన్ మొత్తం ప్రతిధ్వనిస్తోంది. కానీ అతని చెవులకు అది వినబడటం లేదు.
నాలుగో ప్లాట్‌ఫార్మ్ మీద ఒక వ్యక్తిని చూడగానే కార్తీకేనా అని అనిపించింది. తన జేబులో ఉన్న ఫోటోను తీసి సరిచూసుకుంటున్నప్పుడు అతని చేతులు కొద్దిగా వణికాయి. అతను కార్తీకే!
ఆగి ఉన్న గూడ్స్ రైలు చివరి బోగీ పక్కన నిలబడి ఉన్నాడతను. అతని భుజాన ఒక వెలిసిపోయిన నీలం రంగు బ్యాగ్ ఉంది. పదేళ్లలో ఇరవై ఏళ్లు పెరిగినట్లు ఉన్నాడు. గడ్డం అక్కడక్కడా నెరిసింది. కానీ అతని ఎడమ కనుబొమ్మ పక్కన ఉన్న చిన్నప్పటి గాయం గుర్తు అది కార్తీకేనని చెప్తోంది.
“కార్తీక్?”
ఆ వ్యక్తి ఇటు తిరిగాడు. ఒక్క క్షణం పాటు వాళ్లిద్దరూ మాట్లాడలేదు. ఆ తర్వాత కార్తీక్ నవ్వాడు.
“నువ్వు వస్తావని నాకు తెలుసు, అన్నా,” అన్నాడు.
ఆనంద్ పరుగెత్తి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. దశాబ్దకాలంగా మోస్తున్న తప్పులు, అనుమానాలన్నీ ఒక్క క్షణంలో కరిగిపోతుండగా, ఆ ఇద్దరు అన్నదమ్ములూ చాలాసేపు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఒక్క కౌగిలింతలోనే ఇన్నేళ్ల వేదనా ఒక్కసారిగా మాయమైపోయింది.
కుటుంబం యొక్క విలువ ఏంటో ఆనంద్‌కు అర్థం కావాలనే ఉద్దేశంతోనే తాను ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నానని కార్తీక్ వివరించాడు. ఇన్ని సంవత్సరాలూ తను రహస్యంగా ఆనంద్‌ను గమనిస్తూనే ఉన్నానని, చివరికి తన అన్నయ్య ఇప్పుడు ఒక ఉత్తమమైన మనిషిగా మారాడని నమ్మాకనే ఇక్కడికి వచ్చానని అతను ఒప్పుకున్నాడు.
ప్రేమ లేనప్పుడు ఈ విజయాలు, డబ్బు, అహంకారాలకి ఎలాంటి అర్థమూ ఉండదని ఆనంద్ గ్రహించాడు. కుటుంబమే ఈ జీవితంలో అన్నింటికంటే పెద్ద సంపద అని, క్షమించడం అనేది ఎల్లప్పుడూ మనసుకు ప్రశాంతతను ఇస్తుందని అతనికి అర్థమైంది. తనకు ఇంతటి ముఖ్యమైన పాఠాన్ని నేర్పినందుకు ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
అప్పటిదాకా వాళ్లిద్దరినే గమనిస్తున్న ఒక కూలీ వాళ్ల దగ్గరకు వచ్చాడు. ఆయన వయసు అరవై దాకా ఉండచ్చు.
“ఏమైంది బాబూ” అన్నాడు ఆసక్తి.
జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు ఆనంద్. “ఒక చెట్టు కొమ్మల్లా ఉండాల్సినవాళ్లం, పంతాలకిపోయి విడిపోయాము,” అని ముగించాడు.
ఆయన చిన్నగా నవ్వి తలూపాడు. “ఏ కుటుంబమైనా ఎందుకు విడిపోతుందా తెలుసా మీకు? కేవలం మనుషుల అహంకారం వల్లే. ఆ అహంకారాం కంటే ప్రేమే విలువైనదని మనుషులు మర్చిపోవడం వల్ల. ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి నాయనలారా. సంపద పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధాలు ఒక్కసారి విరిగిపోతే, వాటిని మళ్ళీ అతికించడం చాలా కష్టం.”
ఆ అన్నదమ్ములిద్దరూ ఎంతో గౌరవంతో తలలు ఊపారు.
వాళ్లిద్దరూ కలిసి ఆ స్టేషన్ బయటికి నడుస్తుండగా, ఆనంద్ తను తమ్ముడి పాత ఫోటో పోగొట్టుకున్నాడని గమనించాడు. తన జేబుల్లో వెతికాడు కానీ అది ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత నవ్వుకున్నాడు. ఆ ఫోటో అవసరం అతనికి ఇక లేదు కదా.
సాయంత్రపు సూర్యుడు స్టేషన్ అంతటా ఒక రకమైన సువర్ణ కాంతిని పరుస్తున్నాడు.
ఆ రోజు నుంచి, ఎప్పుడూ ఆ అన్నదమ్ములు గొడవ పడలేదు. వాళ్లు తమ వ్యాపారాన్ని మళ్ళీ నిలబెట్టారు. ఎంతో సంతోషంగా కలిసి జీవించారు. అన్నింటికన్నా ముఖ్యంగా – ఆ ఊరిలోని ఏ కుటుంబంలోనైనా విభేదాలు వస్తే, వాళ్లిద్దరూ ముందు నిలబడి ఆ బంధాలను మళ్ళీ కలిపేవారు.
ప్రేమ ఎప్పుడూ అహంకారాన్ని జయిస్తుంది. క్షమాపణ మనిషికి మాత్రమే ఉండే అత్యుత్తమ గుణాలలో ఒకటి. ఆ రెండు లక్షణాలు ఇద్దరు అన్నదమ్ములలో ఉండడం వల్ల ఆ ఇల్లు బాగుపడింది. ఆ ఊరు బాగుపడింది. ఇవే లక్షణాలు మనలో ఉంటే ఈ దేశమే బాగుంటుంది. ఇదే ఈ కథ ఇచ్చే సందేశం. <<
పైన ఇచ్చిన “ఇంటికి వెళ్లే రైలు” కథా ముగింపు ఒకసారి చదవగానే బాగానే ఉంది కదా అనిపించి ఉండచ్చు. ఈ ముగింపు అన్నదమ్ములు విడిపోయి కలవటం అనే భావోద్వేగాన్ని బాగానే పండించింది అని అనిపించచ్చు. పదేళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ కలుసుకుంటారు, ఒకరినొకరు క్షమించుకుంటారు, కుటుంబం ప్రాధాన్యతను తిరిగి గుర్తిస్తారు, కలిసి ముందుకు సాగుతారు. కొత్తగా రాయడం మొదలుపెట్టిన రచయితలకి, చాలా మంది పాఠకులకి కూడా, ఈ కథ ఎంతో ఉదాత్తమైన, మనసుకు హత్తుకునే సన్నివేశంతో ముగిసిందని అనిపించవచ్చు. కానీ, కథా శిల్పం కోణం నుంచి మనం ఈ ముగింపును పరిశీలిస్తే, ఇందులో కొన్ని దారుణమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముగింపులో చేసే ఇలాంటి తప్పులు కేవలం ఆ చివరి పారాగ్రాఫ్‌లను మాత్రమే దెబ్బతీయవు; అవి ఆ కథని దెబ్బతీస్తాయి. ఆ కథ అప్పటిదాకా మోసిన భావోద్వేగాన్ని దారుణంగా చంపేస్తాయి. పైన ఇచ్చిన కథలో ఉన్న అలాంటి లోపాలేమిటో చూద్దాం రండి.
- తొందరపాటు ముగింపు
ఇందాక చెప్పినట్లు కథ ముగియటం వేరు, రచయిత రాయడం ఆపేయటం వేరు. రచయిత కథని ముఖ్యంగా అందులో ఉన్న సంఘర్షణని సహజంగా ముగింపు వైపు వెళ్లనివ్వాలి తప్ప, వీలైనంత త్వరగా రాయడం ముగించడానికి ఆరాటపడకూడదు. పైన ఇచ్చిన కథలో స్పష్టంగా కనిపిస్తున్న లోపం ఇదే. తమ్ముడు కనపడటం లేదని ఇన్నేళ్ల పాటు సాగిన సంఘర్షణను కేవలం కొన్ని వాక్యాలలో పరిష్కరించడానికి ఈ ముగింపు ప్రయత్నించింది. కథ అంతా ఆనంద్ తన తమ్ముడి కోసం వెతుకుతూనే ఉన్నాడు. ఈ వెతుకులాట అతని మనసుల్లో లోతైన గాయాలను తడిమి, పశ్చాత్తాపాన్ని, కుటుంబ ప్రాముఖ్యతని తెలుసుకునేలా చేస్తుందని పాఠకుడి ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఇంత మంచి సంఘర్షణ ఉన్నప్పుడు, దాని ముగింపు కూడా అంతే క్లిష్టంగా, మరింత భావోద్వేగపూరితంగా సాగుతుందని పాఠకులు ఆశిస్తారు. కానీ దానికి భిన్నంగా, కార్తీక్ కనిపించిన మరుక్షణమే అదంతా చాలా సులువుగా పరిష్కారమౌతుంది.
“దశాబ్దకాలంగా మోస్తున్న తప్పులు, అనుమానాలన్నీ ఒక్క క్షణంలో కరిగిపోతుండగా, ఆ ఇద్దరు అన్నదమ్ములూ చాలాసేపు కన్నీళ్లు పెట్టుకున్నారు.”
ఈ ఒక్క వాక్యం ఒక దశాబ్ద కాలపు అసంతృప్తిని, అసహనాన్ని, కోపాన్ని పూర్తిగా తుడిచేస్తుంది. ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు లేవు. సంశయాలు లేవు. కోపం లేదు. నిశ్శబ్దం లేదు. కనీసం ఎలాంటి చర్చా లేదు. అప్పుడే రైలు దిగిన తమ్ముడిని అన్నయ్య రిసీవ్ చేసుకున్నట్లు ఉంది. ఎంతో లోతైనా భావేద్వేగం నిండిన కథ అవుతుందని పాఠకులు ఆశిస్తే అలాంటిదేదీ లేకుండా చప్పగా ముగిసినట్లు అనిపిస్తుంది.
మంచి ముగింపు అంతకుముందు సాగిన సుదీర్ఘ ప్రయాణపు బరువును దించేదిలా ఉండాలి. అంత ప్రయాణమూ మోసుకొచ్చిన బరువుని విసిరేసినట్లు ఉండకూడదు. ఎప్పుడైతే కథకుడు గమ్యం చేరక ముందే బరువు దించేసి వెళ్లిపోతాడో అప్పుడు ఆ ప్రయాణం విలువ తగ్గిపోతుంది. అప్పుడు ముగింపు కథా గమనం నుంచి సహజంగా రాలేదని (not earned) పాఠకులకు సులువుగా అర్థమైపోతుంది. మనం చర్చిస్తున్న కథలో చూడండి. ఆనంద్, కార్తీక్ దశాబ్ద కాలంగా విడిపోయి ఉన్న్నారు. ఇన్నాళ్లుగా విడిపోయిన బంధం కేవలం ఒకే ఒక్క కౌగిలితో అతుకుపడుతుందా? మనసుకి అయ్యే గాయాలు, అలాంటి గాయం చేసిన సదర్భం తాలూకు జ్ఞాపకాలు అంత త్వరగా మాయం అవుతాయా? ఈ ఆలోచన చెయ్యకుండా రచయిత ముగింపును తొందరపెట్టడం ద్వారా, కథ అంతటా పాఠకులు ఎంతో ఓపికగా ఎదురుచూసిన ఆ అసలైన భావోద్వేగ అనుభూతిని లేకుండా చేశారు. అందువల్ల ఆ దృశ్యానికి మనసు చలించాల్సింది పోయి, చుట్టేసిన ముగింపులా పాఠకులకి అనిపిస్తుంది.
దీని అర్థం ముగింపు నిడివి ఎక్కువ ఉండాలని కాదు. తక్కువ నిడివిలో కూడా ఇది సాధించవచ్చు. కొన్నిసార్లు ఒక సంశయంతో కూడిన కరచాలనం, ఒక అసంపూర్ణ సంభాషణ, ఒక చిన్న అనుమాస్పదమైన చిరునవ్వు కూడా పేజీల కొద్దీ సాగే చర్చల కన్నా ఎంతో ఎక్కువ భావోద్వేగాన్ని ఆవిష్కరిస్తాయి. కాకపోతే ఆ ముగింపు, కథలో ఉండే సంఘర్షణకు తగిన నిష్పత్తిలో ఉన్నట్లు అనిపించాలి. అంతమాత్రాన ప్రతి ముగింపు కథలో ఉన్న ప్రతి సమస్యనూ పూర్తిగా పరిష్కరించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. కథ వరకు చూస్తే ఒక మార్పు మొదలైందని చూపిస్తే చాలు. ఎనభైలలో వచ్చిన చాలా కథలలో “అతను పిడికిలి బిగించి అరుణవర్ణ ఆకాశం వైపు సాగిపోయాడు” అనే వాక్యం ముగింపుగా ఉండేది. ఆ దారి ఎటు వెళ్తోందో పాఠకులకి అర్థమౌతుంది కాబట్టి ఆ ముగింపు అర్థవంతంగానే అనిపించేది.
(మళ్లీ కలిసినప్పుడు మరో ఐదు లోపాల గురించి మాట్లాడదాం)








Add comment