కథలో మన ప్రత్యేకత ఎక్కడ?!

వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పుకోవాలనే లేదా పంచుకోవాలనే అంతర్గత ఒత్తిడి అతని రచనకి ప్రేరణ.

న ఆలోచనావిధానానికీ, ప్రాశ్చాత్య ఆలోచనావిధానానికీ మధ్య తేడాలు, ఆధునిక సాహిత్యాన్ని ప్రభావితం చేసేంత ప్రధానమైనవా? బలమైనవా? అయితే అవి ఏమిటి? అవి ఎలా కల్పనా సాహిత్యం సృజనలో.. దాని విమర్శలో.. ప్రత్యేకించి కథానిక ప్రక్రియలో.. ఎలా manifest అయాయి? ఏమైనా ఉదాహరణలతో చెప్పగలమా?

గత సంచికలో ఈ ప్రశ్నలు వేసుకున్నాం.

ఆలోచనావిధానాల మధ్య తేడా సాహిత్యసృజనలో తేడాలకు కారణమయిందనే అభిప్రాయాన్ని పరిశీలిస్తున్నాం..

సమాజం ఎలా ఉండాలి – సమాజం ఎలా ఉంది? అనాది కథ సమాజం ఎలా ఉండాలో చెపుతుంది. ఉపదేశం దాని ఉద్దేశ్యం. వినోదం దాని విధానం. అద్భతం, ఆశ్చర్యం అందుకు ప్రదాన పరికరాలు. కథకుడు సమాజం బాగుండాలనే ప్రేరణతో కథ చెపుతాడు.

ఆధునిక కథానిక సమాజం ఎలా ఉందో అర్ధం చేసుకోటానికి పరికరం. రచయిత తన స్థితిని చెపుతాడు. అంటే బాధ, ఆనందం, కోపం, పశ్చాత్తాపం, ప్రేమ వంటి వ్యక్తిగత అనుభవాలు, స్పందనలు, ఆలోచనలు – చెప్పుకుంటాడు వ్యక్తి. ఆ చెప్పుకోవాలనే లేదా పంచుకోవాలనే అంతర్గత ఒత్తిడి అతని రచనకి ప్రేరణ. రాతలో చెప్పటానికి అనేక పద్దతులు ఎంచుకుంటాడు. చదువరిని చేరాలి. చేరాక అతన్ని ఆకట్టుకోవాలి. అలరించాలి. ఆలోచింపజేయాలి. రచయిత సమాజం మీద చేసిన వ్యాఖ్యలు అతని వ్యక్తిగతాభిప్రాయాలు. బలమైన కథ రచయిత అభిప్రాయాలను అధిగమించుతుంది. చదువరిని స్వీయ వివేచనకి పురికొల్పుతుంది.

ఈ పద్దతిలో పరిశీలిస్తే రూపాన్ని ఆధునిక పాశ్చాత్య కథానికనుంచే తెలుగు కథ స్వీకరించినా అనాది కథ సారాన్నే ఇంకా అంటిపెట్టుకుని ఉంది. రచయిత ఉపదేశక భావన నుంచి పూర్తిగా బయటపడలేదు. చదువరి ఉపదేశాన్ని ఆశించే స్థాయిలోనే ఉన్నాడు. దీన్ని వారెక్కువ మనం తక్కువ అన్న దృష్టితో చూడరాదు. మనకీ వారికీ ఉన్న ఆలోచనావిధానంలో(thinking) తేడాగా పరిశీలించాలి.

*********

కథానిక గురించి మనవాళ్లు రాసిన పుస్తకాలు మననం చేసుకుందాం.

1944లో కథానికారచన మహమ్మద్ ఖాసింఖాన్ రాసారు. ఆధునిక కథానిక రూప స్వభావాలపై తెలుగులో వచ్చిన మొదటి పుస్తకం ఇది. దీనిని కథానిలయం తరఫున మేం ఇటీవల ప్రచురించాం. 1988లో పోరంకి దక్షమామూర్తి కథానిక స్వరూప స్వభావాలు(structure and nature) సిద్ధాంత గ్రంధం వచ్చింది. 1995లో వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథాశిల్పం వచ్చింది. ఇవికాక ఆరుద్ర , శొంఠి కృష్ణమూర్తి, మేఘశ్యాం, కాళీపట్నం రామారావు, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, ఎమ్.వి. నారాయణాచార్య, టి,ఎస్,ఎ, కృష్ణమూర్తి వంటి అనేకమంది కథ రాయాలనుకునే ఔత్సాహికులకోసం పుస్తకాలు రాసారు. వీరు కథారచనలో తమ సుదీర్ఘానుభవంతో రచయితలకి సూచనలు ఇచ్చారు. కథానిక స్వరూపస్వభావాల గురించి కొన్ని వ్యాసాలు కూడా వచ్చాయి.

వీటిలో అనేక సూచనలు ఆంగ్ల గ్రంధాల నుంచి కూడా ఇచ్చారు. వాటిని తెలుగు కథకులకి వివరించారు. కౌశల్యాలు మెరుగు పరుచుకుందుకు దోహదం చేసారు. నా కథాయానానికి సంబంధించినంత వరకూ స్వరూప స్వభావాల గురించి చర్చకి ఖాసింఖాన్, పోరంకి, వల్లంపాటి పుస్తకాలు ప్రధానంగా తీసుకుని ఆలోచిస్తున్నాను. ఆ చర్చ కూడా ప్రాశ్చాత్య కథానికకీ, తెలుగు కథానికకీ ఉన్న పోలికలు, వ్యత్యాసాలు అన్న అంశానికే పరిమితం.

ఈ మూడు పుస్తకాలలో ఖాసింఖాన్ గ్రంథం తెలుగు కథానిక ఆరంభదశకి చెందినది. ఆంగ్ల కథానికా చరిత్ర, పరిణామం, లక్షణాలు చెప్పారు. కథ , కథానిక అనే పదాలు పూర్వ గ్రంధాలలో ఉన్నాయి. వాటిని కొంత వివరించారు. వానికీ, ఆధునిక కథానికకీ సంబంధం లేదనేదే ఖాన్ గారి అభిప్రాయం.  ఆనాటి రచయితలు ప్రాశ్చాత్య కథానికలను అనుకరించటం, కాపీ కొట్టటం గమనించి రాసిన గ్రంధం ఇది. అందులో ఇలా అంటారు.

“పాశ్చాత్య భాషల్లోని కథానికలను కేవలం అనుకరించటం, “వాటిని మార్చో, కొంత కలిపో, కొంత తీసివేసో” అనువదించటం కంటె దాని లక్షణాలు తెలిసికొని, సుప్రసిద్ధ కథానికాకారుల పద్ధతులను జీర్ణించుకుని ఆ కళను చక్కగా అభ్యాసము గావించుకుని ఉత్తమ కథానికలని స్వయంగా రచియించుట రచయితలకి సాహిత్యానికీ శ్రేయస్కరం.”

ఈ గ్రంధానికి ముందుమాట రాసిన రాయప్రోలు సుబ్బారావు మన అలంకారశాస్త్రాలలో ప్రస్తావించబడిన కథ, కథానికలకి పూర్తిగా ఆధునిక కథానిక భిన్నమైనదని చెపుతూ ఇలా అన్నారు. “కథానిక పూర్తిగా ఖండాంతర  రచనానుకరణం కావటం వల్ల, ఏ తల్లక్షణ సంపాదనము అన్యభాషావరోధముల నుండియే సేకరించవలసి వచ్చినది.” అంటూ ఖాసింఖాన్ గారు ఈ పని సుబోధకంగా చేసారని చెపుతారు.

పాశ్చాత్యులు కథానికా లక్షణాల గురించి చేసిన అనేక చర్చలు, అభిప్రాయాలు, ఉటంకింపులు ఈ గ్రంధంలో ఉన్నాయి. కురుగంటి సీతారామయ్య, తల్లావఝ్జుల శివశంకరశాస్త్రి కాపీకొట్టటం గురించి రాసినవి ఖాన్ ఉటంకించారు. చలం, కృష్ణశాస్త్రి ఈ నేరానికి పాల్పడినట్టు వారు భావించారు. అనుకరణ, ప్రభావితమవటం, ఒకే ప్లాట్ ఉండటం, దాదాపు పేర్లు మార్చి యధాతధంగా రాయటం వంటి అనేక తరతమ భేదాలు ఈ గ్రంధచౌర్యంలో ఉన్నాయి.

వీటిలో చలం, కృష్ణశాస్తులపై  మోపబడిన గ్రంధచౌర్య అభియోగం ఏ స్థాయికి చెందినదో ఖాన్ వివరంగా చర్చించలేదు. కాకపోతే చలం కోరిన స్త్రీ స్వాతంత్ర్యం, ఒక విధంగా కృష్ణశాస్త్రి పలవరించిన అమలిన ప్రేమ వల్ల సంఘం చెడిపోతున్నదనే భావం ఆనాడు చాలామందిని బాధించింది. అది ఖాన్ గారిని కూడా బాధించింది. ఇలా అంటారు “పాత్రలు కేవలం అవినీతికరమైనట్లుగా చిత్రంచటం, అదే మానవప్రకృతియా అనే భావం(impression) పఠితయందు కల్గించటం అనే పద్దతి కూడా ఆధునికుల్లో ఉంది.” డి.హెచ్.లారెన్స్, మపాసా, మేరీ కొరైలీ లను ఉదహరించారు. దానికి కారణం “యూరప్, అమెరికాఖండాల్లో స్త్రీ స్వాతంత్ర్యం మిక్కిలి పతనహేతువుగా పరిణమించింది. నీతి, నియమం నశించి నగ్నత్వం వ్యాపించింది. వ్యభిచారం అంత దూషితమైన చర్యగా భావింపబడకుండా ఉంది.” అని భావించారు ఖాన్. మేరీ కొరైలీ నవల Sorrows of Satan నుంచి విపులమైన ఉటంకింపు చేసారు ఖాశింఖాన్. “చలం కథల వల్ల ఆనందానికి బదులు జుగుప్స, సంస్కారానికి బదులు అవినీతి సంభవిస్తాయి.” అంటారు. ఈ అభిప్రాయానికీ ఆ అభియోగానికీ సంబంధం ఉందా? అదేవిధంగా కథలలో వాడే భాష నియమరహితంగా ఉందంటారు. ఇది ఈనాటివరకూ తేలని ఇంకా చర్చించబడుతున్న విషయం. ఎలాగైనా రాయొచ్చు/రాయవచ్చు/వ్రాయవచ్చును అనేదొకవాదం. వాడుకభాష రాయి కాదనం కాని ఒకే వాక్యంలో లేదా ఒకే పేరాలో రకరకాలుగా రాయకు/రాసీకు/వ్రాయమాకు/ అనేదొకవాదం. ఖాన్ గారిది రెండవవాదం. ఈ అభిప్రాయాల గురించి ఇంత విపులంగా చెప్పుకోవలసిన అగత్యం ఒకటుంది.  తెలుగు కథకీ పాశ్చాత్య కథకీ Thinkingలో ఉన్న అంతరం గురించి చర్చించేటపుడు మరోచోట దీనిని ప్రస్తావిస్తాను.

పోరంకి గ్రంధం కథానిక స్వరూపస్వభావాలు చాలా సమగ్రమైన గ్రంధం. చాలా విషయాలను ఇది నమోదు చేసింది. అనేక అంశాలను విపులంగా తెలుగు కథల ఆధారంగా చర్చించింది. ఈ గ్రంధం నా కథాయానంలో అనేకచోట్ల ప్రస్తావించబడుతుంది. చాలా స్వతంత్రమైన, ఉదారమైన వస్తు, భావ చర్చ, సేకరణ ఈ గ్రంధంలో ఉన్నాయి.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథాశిల్పం రాసారు. దానిలో “ప్రాశ్చాత్య కథాపరిణామం” శీర్షికతో ఓ అధ్యాయం ఉంది. ఇది ఏదో ఓ ఆంగ్లవ్యాసం చదివి దాని ఆధారంగా రాసినది కాదు. స్వయంగా ఆయన ఆంగ్ల భాషలోని కథా సాహిత్యం చదివారు. దానిపై విమర్శ గ్రంధాలు చదివారు. ఆంగ్ల సాహిత్యాన్ని బోధించిన అనుభవం తోడయింది. ఒక విధంగా ఈ వ్యాసం సుబ్బయ్య గారి జీవిత కృషి అంటాను నేను. ఈ పుస్తకం రాస్తూ నాకు చదివి వినిపించేవారు. వారు చదివిన ఆంగ్ల సాహిత్యంలో నేను చదివినది లవలేశం. కాని వారు రాసినదాని మీద నా సామాన్యజ్ఞానంతో చర్చించేవాడిని. చాలా రాత్రిళ్లు చర్చించుతూ కూర్చునే వాళ్లం. సరదాగా మామీద మేం జోకులాడుకుంటూండే వాళ్లం. “నేనుసైతం  విశ్వకథకి నడుము నొప్పిని ధారపోసాను” అనుకోటం నాకు బాగా గుర్తు. ఈ వ్యాసం ఆంగ్లంలోకి అనువదించమని అడిగేవాడిని. దురదృష్టవశాత్తూ ఆ మాట ఆయన నిలబెట్టుకోకుండానే వెళ్లిపోయారు. వారి కృషిలో అగ్రస్థానం ఈ వ్యాసానిదే అని నా అభిప్రాయం. ఈ వ్యాసంలో ప్రధానంగా చర్చించిన అంశం తరవాత సంచికలలో చర్చించుకుందాం.

ఈ మూడు గ్రంధాలూ నిర్ధ్వందంగా అంగీకరించినవి

  1. ఆధునిక కథానిక పుట్టుక యూరప్, అమెరికాలలో జరిగింది.
  2. కథానిక కళను నేర్వటానికి పాశ్చాత్య కథానికా పరిణామం, అక్కడ గొప్ప రచయితల కృషి తెలియాలి. “ఇప్పుడు పాశ్చాత్యదేశాలలో కథాసాహిత్యం అభివృద్ధి చెందిన విధానాన్ని గురించీ, ఆ అభివృద్ధిలో పాలుపంచుకున్న గొప్ప రచయితల్ని గురించీ, వారు రాసిన గొప్ప కథల్ని గురించీ తెలుసుకుందాం. వీటిని గురించి తెలుసుకోటం తెలుగు కథారచయితలకి తప్పనిసరి.”(వల్లంపాటి) ఇంతకు ముందు పేరాల్లో ఖాశింఖాన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చెయ్యటం గమనించవచ్చు. పోరంకి దక్షిణామూర్తిది సిద్ధాంత గ్రంధం. పిహెచ్డీ కోసం సమర్పించబడిన ఈ గ్రంధంలో పరిశోధనాసక్తి గలవారు దానిని కొనసాగించటానికి చాలా ఉత్సుకత, ప్రేరణ ఇస్తుంది. వల్లంపాటి, ఖాశింఖాన్ తెలుగు రచయితలకి స్పష్టంగా చెప్పిన – చదవండి, రాయండి- అన్న దానితో పోరంకి వారికి ఏకీభావం ఉందని ఈ గ్రంధం చదివాక అనిపించింది.
  3. కథానిక ప్రధాన లక్షణం క్లుప్తత. కథాంగాల విభజన, వాటి గురించి అవగాహనలలో మూడు గ్రంధాలకూ ఏకీభావం ఉంది. కారణం వారు ముగ్గురూ పాశ్చాత్య కథాసాహిత్య శాస్త్రాన్నే తీసుకున్నారు. తెలుగు కథకి అన్వయించారు. పోరంకి మన ఆలంకారికుల పరిశీలనలను కూడా వీటితో సమన్వయం చేయబోయారు.
  4. వీరితో సహా ప్రతి ఒక్కరూ అనాది కథ ప్రస్తావనతోనో ఆధునిక కథానికా చర్చ ఆరంభించారు.
  5. ప్రాశ్చాత్య ప్రపంచం చాలాకాలం వరకూ కథానికని దిగువస్థాయి ప్రక్రియగా భావించింది.

కాకపోతే-

పాశ్చాత్యకథానిక పుట్టుకకు దోహదం చేసిన ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని వివరించిన వల్లంపాటి తెలుగు కథ పుట్టుక గురించి ఇలా అంటారు. “అలాంటి కారణాలు – అంత స్పష్టంగా – తెలుగు కథ అవతరణ వెనక కనిపించవు.” ఇది చాలా వివరంగా ఆలోచంచవలసిన అంశం. కాకపోతే పాశ్చాత్య కథానికా, నవలా అవతరణం వెనక అక్కడి కథా చారిత్రకులు చేసిన  విశ్లేషణా నమూనాని (ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక కారణాలు అన్వేషించటం) వల్లంపాటి తెలుగు కథ పుట్టుక విషయంలోనూ అనుసరించారు. ఇదే నమూనాతో తెలుగు కథ పుట్టుక గురించి కెవి రమణారెడ్డి చేసిన పరిశీలనతో తన గ్రంధంలో పోరంకి ఏకీభవించారు.

ఈ నమూనాతో తెలుగు కథావతరణను పునఃపరిశీలించే పని మన కథాయానానికి అవసరం కాదు.

********  *********

తెలుగు కథానికా చరిత్ర, విమర్శలలో 1944 నుంచి  మనవారి అవగాహన క్లుప్తంగా తెలుసుకున్నాం.  దీని గురించి మరికొంత ఆలోచించవలసింది ఉంది. ఖాశింఖాన్, వల్లంపాటిల గ్రంధాలు ఉపదేశక స్వరంతో ఉన్నాయి. కథలెలా రాస్తారు అనేవి కూడా అదే కోవకి చెందినవి. పాశ్చాత్య గ్రంధాలలో కూడా రచయితలకి కళనేర్పే శిక్షణా గ్రంధాలు ఉన్నాయి. అవి కొంతవరకే ఈ కోవకే చెందుతాయి. చదవటం ఎలాగో నేర్పే గ్రంధాలు ఉన్నాయి. Reading like a writer వంటి పుస్తకాలు ఉన్నాయి. (వల్లంపాటి కూడా చదవటం ఎలా అన్న అంశంపై మంచి వ్యాసం రాసారు. పాఠకదృష్టి కోణం గురించి కూడా రాసారు.)      దీనివెనక ఉన్న మన ప్రత్యేక ఆలోచనావిధానం విమర్శలో మాత్రమే manifest అయిందా?  కల్పనా సాహిత్య సృజనలో కూడా ఉందా? అది ఎలా manifest అయింది?

తరవాత సంచికలలో చూదాం.

*

Avatar

వివిన మూర్తి

తెలుగు సాహిత్యంలో పరిణత వాణి వివిన మూర్తి సాహిత్యం. కథ, నవల, విమర్శ అనే మూడు బంధాల మధ్య రచనతో పాటు ఆచరణని జీవనమార్గంగా సూచిస్తున్న బుద్ధిజీవి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు