కందుకూరి:గమనించాల్సిన కొన్నివిషయాలు

“ఇప్పటివాళ్ళు” గ్రహించాల్సినవి అనేకం వున్నాయి. ప్రభాకర్ గారు వాటిని చూడలేదు, లేదా చూపెట్టలేదు. వారు చెప్పినది పాక్షిక సత్యం.

“విగ్రహాలు మాట్లాడనివ్వవు” శీర్షికతో ఎ.కె.ప్రభాకర్ కందుకూరి గురించి చక్కగా సమతుల్యత పాటిస్తూ రాసారు. సద్విమర్శకుడు “శివుడులాంటివాడు. చల్లటి చంద్రుణ్ణి శిరసున ధరిస్తాడు. కాలకూట విషాన్ని కంఠంలో దాచి వుంచుతాడు. ఇది లోకరీతి కావాలి” అని మంచి సూచన కూడా చేసారు.

అర్.ఎమ్.ఉమామహేశ్వరరావు ఈసూచనను తలక్రిందులు చేసి, కందుకూరిపై విషం కక్కారు. (ఆంధ్రజ్యోతి 20-5-2019). అయినా ప్రభాకర్ రాసిన దానిలోనూ చర్చనీయాంశాలు కొన్ని వున్నాయి. అంతేకాక, కందుకూరిలో అంతగా గమనించని, గమనించాల్సిన విషయాలూ ఉన్నాయి.

కందుకూరి, గురజాడ వంటి వాళ్ళు ఇంగ్లీషువిద్య ప్రభావంతో “భౌతికవాదాన్ని, హేతుదృష్టినీ అలవరచుకున్నవాళ్ళు” అని సరిగ్గానే రాశారు. ఇంగ్లీషుద్వారా పాశ్చాత్యదేశాలనుంచి ఆధునిక, శాస్త్రీయ భావాలు విద్యావంతుల్లో కొందరిని ప్రభావితం చేశాయి. జాతీయవాదం  పేరుతో ఛాందసత్వాన్ని, మూఢత్వాన్ని వెనకేసుకొచ్చేవారు నాడూ,నేడూ కూడా వున్నారు. అది తప్పు. మంచిని స్వీకరించడం — ఈ భావాలు వలస”పాలకుల” ప్రభావంతో వచ్చినా — ఆహ్వానించదగినవే. అయితే, పాశ్చాత్య ప్రభావాన్నంతా “వలసవాద”ప్రభావం అనలేమేమో.

ఇంగ్లీషు చదువులతో బ్రాహ్మణులు బూజుపట్టిన భావాలని వదులుకొని కొత్తపాలకులకు దగ్గరయ్యారు. మరో సెక్షన్ తెల్లదొరలకు వ్యతిరేకంగా ఉద్యమించటం మరోకోణం – అని రాసారు. ఇందులో రెండు గమనించాలి. అలా దగ్గరైంది బ్రాహ్మణులే కాదు. బ్రాహ్మణేతర కులీనులు కూడా వున్నారు. బ్రిటీషువారి ప్రభావంతో కాంగ్రెసుని స్ధాపించినవారిలో అలాటి బ్రాహ్మణేతరులైన ప్రముఖులు అనేకులున్నారు – జమిందార్లు, దివాన్లు మొ..వారు. తర్వాత కాలంలో జస్టిస్ పార్టీగా రూపొందినవారంతా బ్రాహ్మణేతరులూ,  బ్రాహ్మణవ్యతిరేకులే.

ఇది ‘రెండోకోణం’ కన్నా ‘రెండోదశ’ అనటం మేలు. 1885లో కాంగ్రెసు స్ధాపించినది బ్రిటిషు విధేయులైన కులీనవర్గాలే. 1929 దాకా వారు ‘సంపూర్ణ స్వాతంత్ర్యం’ అన్న మాట అనటానికి కూడా వ్యతిరేకులు. మొదటి 20ఏళ్ళు (1905 స్వదేశీ దాకా) ఎఐసిసి మహాసభల్లో ‘మీ దయతో సుభిక్షంగా వున్నాం’ అని ఏటా తీర్మానాలు  చేసి, బ్రిటీషు ప్రభువులకి పంపారు. 1905లో తిలక్ ప్రభృతుల ‘స్వదేశీ’ ఉద్యమం తర్వాత విధేయులకు వ్యతిరేక వర్గం ఏర్పడింది. గోఖలే, రణడే, తొలిదశలో గాంధీ మితవాద ధోరణినే ప్రతిబింబించారు. వారిదే 1929 దాకా పైచేయి, కాగా, కందుకూరి 1919లోనే చనిపోయారు. అప్పటికి పైచేయిగా వున్న మితవాద ధోరణిలోనే ఆయనా వున్నారు. ‘వందేమాతరం’ అతివాదుల్ని ఖండించారు.

రాజకీయమార్పు జటిలమైనది, ఇతరులపై(బ్రిటీషు పాలకులపై) ఆధారపడినది. కాగా సాంఘిక సంస్కరణ “తేలికైనది”, మనం చేసుకోగలిగినది. అందువల్ల వివేకవంతులు అశ్రద్ధ చేయకూడదు – అని కందుకూరి భావించారు. 1880-83 వివేకవర్ధిని రచనల ఆధారంతో ప్రముఖ సోషల్ సైంటిస్టు కె.వి.నారాయణరావు తన ప్రసిద్ధ గ్రంధంలో ఈ విశ్లేషణ చేసారు. (KVN, The Emergence of AP, 1973, Popular Prakashan, Bombay)

దురాచారాల్ని జాతీయ ఉన్మాదంతో వెనకేసుకు వస్తున్నారని; అది నిజమైన దేశభక్తి కాదని; మన దురాచారాల్ని “మంచి సాంప్రదాయం”గా కీర్తిస్తున్నారని; ఇతర దేశాల మంచి పద్ధతులను కూడా దుష్టమైనవిగా ఖండిస్తున్నారని; తద్వారా నిజమైన ప్రగతికి ఆటంకం అని ఒక ఉపన్యాసంలో వివరించారు (18-4-1908). (స్వీయచరిత్ర, పేజి. 158). పాశ్చాత్యులనుంచి మంచిని, శాస్త్రీయమైన అంశాల్ని తీసుకోవటాన్ని “వలసవాద” ప్రభావం అనటం సముచితం కాదు.

(600పేజీల్లో రెండు భాగాలుగా రాసి, 1910లో, 1915లో ప్రచురించిన కందుకూరి ‘స్వీయచరిత్ర’ని 200పేజీల్లో ఒకే పుస్తకంగా కుదించారు కొడవటిగంటి కుటుంబరావు. కందుకూరి భాషని, శైలినే ఉంచారు. NBT 1972లో ఈ ‘స్వీయచరిత్ర సంగ్రహము’ని ప్రచురించింది. ప్రస్తుత వ్యాఖ్యలో బ్రాకెట్లలో ఇచ్చినవి దాని 1990 నాల్గవ ముద్రణ పేజీ నంబర్లు.)

అధికారభాష ఇంగ్లీషు ఎంత అభివృద్ధి చెందినదైనప్పటికీ, అది ఎన్నటికీ దేశీయభాష కాజాలదు. దేశీయభాషలను మెరుగుచేసుకోకుండా దేశం ఎన్నటికీ ముందుకు పోజాలదు – అని కందుకూరి భావించి రాసారు.(KVN).  భారతీయ సాంప్రదాయాల పేరిట ఛాందసత్వాన్ని, జాతీయ వున్మాదాన్ని, అశాస్త్రీయతనీ వెనకేసుకు వచ్చేవారు ఈనాడుకూడా అలాంటి ముద్రలు వేస్తున్నారని గుర్తుంచుకోవాలి. అందువల్ల, “వలసవాద” ప్రభావం అనటాన్ని, బ్రిటిషువారికి “అత్యంత”విధేయుడనటాన్నిమరోసారి లోతుగా పరిశీలించాలి.

స్వదేశీ, విదేశీ, యూరోపియను, పై అధికారి అని చూడకుండా, నమ్మిన విషయాన్ని వారి ముఖంమీదనే గట్టిగా అనటం, నిర్భయంగావ్యవహరించడం తన స్వభావంలో భాగం (పేజీ 94-95) అంటారు కందుకూరి. రాజమండ్రి మున్సిపల్ చైర్మనుగా సబ్ కలెక్టర్ హామ్నెట్ దొరగారిని సూచిస్తూ, తమ శాస్త్ర పాఠశాలాధిపతి మెట్కాఫు దొరగారుసూచించి, మద్దతుగాకందుకూరిని సంతకం చేయమంటే నిరాకరించారు. అలాంటి మరీ పై అధికారి చైర్మనుగా వుంటే నిర్భయంగా వుండటం కుదరదని కారణం చెప్పారు.

చివరికి హామ్నెట్ ఆ పదవిని చేపట్టి కందుకూరిని తన సహాయకునిగా వుండమని కోరగా “సమస్త విషయములలో సర్వ స్వాతంత్ర్యమునిచ్చినగాని” అంగీకరించను అని చెప్పారు. దానికీ ఆ దొర అంగీకరించాడు. కొన్ని సమయాల్లో ఆయన చెప్పినది తప్పని మొగము మీదనే అనేవారు అలాగే తాలూకాబోర్డులోమోబర్లీ దొరతో వివాదం నడిచిందని ఉదహరించారు.టీచర్లపై అరిచే స్కూళ్ళ ఇన్స్పెక్టర్ బ్రాడా దొరగారిని ఎలాధిక్కరించినదీ పేర్కొన్నారు. ఇన్స్పెక్షన్ కి వచ్చిన దొరగారు మాత్రమే కూర్చోవాలన్న పద్ధతి వున్నా, ఆయనపక్కనే కుర్చీ తెప్పించుకొని కూర్చున్న వైనం చెపుతారు (పే.131) ఎంతమంది ఉద్యోగులు, టీచర్లు ఈనాడైనా ఇలా వ్యవహరించగలుగుతున్నారు?

“తన ఆధిపత్యస్వభావం వల్ల, అధికార దర్పం వల్ల” మిత్రులతో సైతం విరోధం తెచ్చుకున్నాడు అని రాసారు ప్రభాకర్. నిజానికి ఆయనకు అధికారం ఏదీలేదు. తాను ఎవరెవరితో ఎందుకు తగవుపడ్డారో, మళ్ళీ దగ్గరవటానికి ప్రయత్నించారో ఆయన స్వీయచరిత్రలో సోదాహరణంగా వివరించారు. వారి పిరికితనం, హిపోక్రసీ, ఇచ్చినమాటపై నిలబడలేకపోవడం, బలహీనతలు మొదలగు వాటితో రాజీపడలేకపోయాడు. తాను సరైనదని నమ్మినదాని విషయంలో ఎలా నిర్భయంగా, మొండిగా, మొహమాటం లేకుండా వుండేవాడినో చెప్పి, ఈ “తొందరస్వభావము నాకు గల లోపాలలో నొకటి. ఈ వేగిరపాటువలన మనవారిలో కొందరు నాకు ద్వేషులగుట సంభవించుచు వచ్చెను” అని రాసారు.( స్వీయచరిత్ర,పేజి.95)

‘వందేమాతరం’ ఉద్యమంలో పాల్గొన్న వారిపట్ల ఆయన వ్యతిరేకతని ప్రభాకర్ పేర్కొన్నారు. గాడిచర్ల లాంటి దేశభక్తులకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి, శిక్షపడేందుకు కారణమయ్యాడని  ఎత్తి చూపారు. ఇవి నిజమే. ఈ రెండో అంశం చాలామంది స్వకీయులకే మింగుడుపడలేదు. ఆయన్ని బ్రిటీషు ఏజంటనీ, దళారీ  అనీ నిందించారు, అని త్రిపురనేని వెంకటేశ్వర్రావుని ఉటకించి పేర్కొన్నారు.

ఇక్కడ  కొంత విచక్షణ పాటించటం అవసరం. ఈ విషయంలో రాజకీయవాదులను, కేవలం సంస్కర్తలను వేరు చేసి చూడాలి. కందుకూరి రెండవకోవకి చెందిన వారు; పరిమితులు కలవారు. రాజకీయరంగం ప్రధానంగా కలవారిని, అందునా నాయకులను ఏజంట్/దళారీ అనటం భావ్యమే. అవసరం కూడా.

తిలక్ వంటి ’వందేమాతరం’/స్వదేశీవాదులను ఎఐసిసి సభ (1907-08 సూరత్) లోంచి పోలీసుల సాయంతో బైటికి వెళ్ళగొట్టింది కాంగ్రెసు అధిష్టానం. బ్రిటీషు వారికి, విలియం బెంటింగుకి అతి సన్నిహితంగా వుండిన రాజారాంమోహన్ రాయ్ ని ’భారతజాతీయపిత’ అని పట్టాభిసీతారామయ్య కాంగ్రెసు చరిత్రలో పేర్కొన్నారు. బ్రిటీషు హోంశాఖ అధికారి ’హ్యూం’ కాంగ్రెసు స్ధాపకుడని గర్విస్తున్నా అని 1929లో కూడా గాంధీ అన్నారు. ’సంపూర్ణస్వాతంత్ర్యం’ తీర్మానాన్ని 1928 దాకా కాంగ్రెసు వ్యతిరేకించింది; విధిలేక 1929లో ఆమోదించింది-అదీ కపటంతో. ఇలాంటి సందర్భాల్లో ‘దళారీ’ అనడం సబబు.

పై స్వభావంగల నాయకత్వాన్ని దళారీ అని ముద్రవేయడం సముచితమే. కానీ, సంస్కరణ ప్రధాన కార్యరంగంగా కలవారిని, అనుచరులని కొంతవేరుచేసి చూడాలి. 1919లో కందుకూరి మరణించారు. ఆనాటికి మితవాద ధోరణిదే పైచేయిగా వుండేది. రాడికల్స్ పరిమితబలంతో వుండేవారు. మరో 20 ఏళ్ళ  తర్వాత పుట్టిన చిలకమర్తి ( 1867-1946), కందుకూరి వారసుడైనా ఈ విషయంలో రాడికలైజు అయ్యారు. కాలప్రభావం కూడా ఇది.

కందుకూరి దంపతులను ఫూలే దంపతులతో పోల్చారు. ఇది సరైందే. గత 20-30 ఏళ్ళుగా ఫూలే గురించి తెలుగువారికి బాగానే పరిచయమైంది, మంచిదే. కానీ  కందుకూరి ఇప్పటి తరాలకు అంతగా తెలియదు. అసమగ్రమైన వక్రీకరణలతో కూడిన సమాచారం ఇటీవల వ్యాప్తిలో వుంది. ప్రభాకర్ గారి వ్యాసం ఈ లోటుని పూడ్చటానికి దోహదంచేసింది. అయినా ఈసందర్భంగా గమనించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి:

కందుకూరి దంపతుల కార్యక్షేత్రం బ్రాహ్మణసమాజానికి పరిమితమే అంటూ, ఎవరికైనా వారి నేపధ్యం ఒక పరిమితిగా ఉంటుంది అని సరిగానే రాశారు. “ఆయన సంస్కరణలు, ఆలోచనలు సొంత కులం దాటి బయటకు పోలేదు” అన్నారు. కిందికులాల్లో మారుమనువు “అసలు సమస్యే” కాదు అని జనరలైజు చేయటం నేటికీ అతిశయోక్తే. “ఒక కులానికి సంబంధించిన ఒక చిన్న సంస్కరణ కారణంగా … అపరిమితకీర్తి లభించిందని ఇప్పటివాళ్ళు అనుకోవటంలో తప్పులేదు” అని రాశారు.

“ఇప్పటివాళ్ళు” గ్రహించాల్సినవి అనేకం వున్నాయి. ప్రభాకర్ గారు వాటిని చూడలేదు, లేదా చూపెట్టలేదు. వారు చెప్పినది పాక్షిక సత్యం. పై పరిమితి కందుకూరి కులంరీత్యా ఎంచుకున్నది కాదు. రెడ్డి హాస్టలు, బ్రాహ్మణ సంక్షేమసంఘం, కమ్మ సంక్షేమ సంఘం వంటి కులప్రాతిపదికతో ఆయన తన సంస్థలను నడపలేదని గమనించాలి.

తన కార్యకలాపాలకు విద్యార్థుల అండ, రక్షణ కీలకం అన్నారు. ఒక ఘర్షణలో 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈవేలాదిమందీ బ్రాహ్మణులే అని భావించలేము. వారు నడిపిన పాఠశాలల్లో కో-ఎడ్యుకేషన్ పెట్టారు. నిమ్నకులాలవారు, దళితకులాల వారు కూడా ప్రవేశించారు. ప్రస్తుతం 500 మంది విద్యార్ధులు ఉన్నారు అని తన స్వీయచరిత్ర లో ఒకచోట రాసారు. (పేజీ 165) అలా వాటిల్లో ఆరోజుల్లోనే వేలాదిమంది చదువుకున్నారని గ్రహించవచ్చును.

ముస్లిం విద్యాసంఘకార్యదర్శిగా వుండి ముస్లిం విద్యార్థుల భోజనశాలను  నడుపుచుండెడి వాడను అని రాసారు.(పేజి.91)  పతిత యువతీ సంరక్షణశాలలో ఒక దశలో 150మంది వరకు వున్నారు; వారు ఎలా చేరేవారో, భార్య రాజ్యలక్ష్మమ్మ గారు వారిని ఎలా ఆదరించారో స్వీయ చరిత్రలో రాసారు. అందులో బ్రాహ్మణ స్త్రీలు మాత్రమే వున్నారనడానికి ఆధారాలు లేవు.

మద్రాసులో చాకలిపేటలో ఉపన్యాసాన్ని, బెంగుళూర్లో చేనేతవారికోసం ప్రార్ధనా మందిరం నిర్మించటాన్ని(పేజి.127) స్వీయచరిత్రలో చూడవచ్చును. పగలు కష్టంచేసి వచ్చేవారికి రాత్రి పాఠశాల ఆయన శిష్యులు నడిపేవారు. దాన్ని ఓ అధికారి స్వాధీనంచేసుకుంటే, మళ్ళీ తెరిపించారు కందుకూరి. వారు ప్రధానంగా బ్రాహ్మణేతరులు, క్రిందికులాలవారు అని భావించ వచ్చును.

తమ ఇంటిముందు సృహతప్పి పడివున్న మాలవ్యక్తిని తమ అరుగుమీదకు తీసుకొచ్చి, సపర్యలు చేసిన సంఘటనను స్వీయచరిత్రలో చూడవచ్చును(పేజి181). శూద్రులతో సహా దారినపోయేవారెవ్వరూ సహకరించకపోవటంతో, రాజ్యలక్ష్మమ్మగారు, మరో మిత్రుడు చెరోవైపు పట్టుకుని మాల అనిగాని, మగవాడనిగాని చూడకుండా, అతడిని స్వయంగా మోసి అరుగుమీద పడుకోబెట్టారు.

1874లో వివేకవర్ధినితో మొదలుపెట్టి 40ఏళ్ళకు పైగా ఐదారు పత్రికలు నడిపారు. వాటిలో స్త్రీల సమస్యలు, వారి ఆరోగ్య సమస్యలు, మూఢనమ్మకాలు, భూతవైద్యుల, పురోహితుల మోసాలు, సైన్సు అంశాలు, మున్సిపల్-ప్రభుత్వ-కోర్టు కచేరీలలో లంచాలు మొ.వాటిగురించి రాసి ఇబ్బందులెదుర్కొన్నారు. ఇవన్నీ బ్రాహ్మణులే చదివారు, బ్రాహ్మణ సమాజానికే పరిమితం అని చెప్పవచ్చునా?ప్రభాకర్ గారే — కందుకూరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి ఆద్యులేమో అని సరిగ్గానే పేర్కొన్నారు.

ఇలాంటివన్నీ “ఒక కులానికి సంబంధించిన చిన్న సంస్కరణలు” కావని ఇప్పటివారు సైతం గమనించాలి.

వేశ్యావృత్తిలోని వారి “దైన్యంపట్ల కనీసపు జాలి కూడా చూపలేదు” అని రాసారు. (ఈవృత్తిని మానేస్తే ప్రత్యామ్నాయ బతుకులేమిటి అన్న ఆలోచనతో కందుకూరికి  సంబంధంలేదు-అని వి. చెంచయ్య ఇదే ధోరణిలో రాసారు. జ్యోతి 25-5-2019).

ఈ విమర్శలను మరోసారి పరిశీలించాలి: అభాగ్యస్త్రీలకోసం తమ ఇంటిముందే ”పతిత” యువతీ రక్షణశాలని స్ధాపించి నడిపించారు. ఒక దశలో అందులో 150మంది దాకా వుండేవారు. ఇక్కడా,తమ స్కూళ్ళలోనూ విద్యాబుద్ధులు నేర్పించారు. ఎంతోమందికి ఆర్థిక సాయం చేసారు.(P.148).

వితంతువుల్లో చాలామంది  “చెడు అలవాట్ల”తో, గర్భిణులై కూడా వచ్చేవారు. వారిని సరైన దారిలోపెట్టి, ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పించారు. “సమర్థురాండ్రు”గా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. వైద్యసేవలందించారు. కాన్పులు చేసారు. పిల్లల్నిపెంచే ఏర్పాట్లు చేసారు. అలాంటి ఒక పాపని తాము స్వయంగా పెంచుకున్నారు. బోగంమేళాలని, వేశ్యావృత్తిని కొంత వేరుచేసి వ్యవహరించారు కందుకూరి.

బోగంమేళాలు ఆనాడు గౌరవనీయమైన కులవృత్తి. ఘరానా పెద్దలందరికీ వాటితో బహిరంగ సంబంధం, వారి ఆదరణ, పోషణ వుండేవి. ఈనాటి వేశ్యలకూ, వారికీ తేడా వుంది.

నిజానికి ఆనాటి కులీనసమాజంలో  ఈ బోగంమేళాల దురాచారం ఎంతగా ముదిరిపోయిందో, అప్పటి అధికార కులీన వర్గాలతో, సంపదతో, హోదాతో, అవినీతితో ఈ వృత్తి ఎలా ముడిపడి వున్నదో కందుకూరి సవివరంగా చెప్పారు:

“వేశ్యాప్రియుల సంఖ్య మేరమీరిందని”; “న్యాయాధిపత్యము మొదలగు మహోన్నత పదవులవారు” అందులో మునిగి తేలారని, పనిమీద వారివద్దకు వెళితే, “వేశ్యలనుంచుకున్న వారికెక్కువ గౌరవము, ఉంచుకోని వారికి తక్కువ గౌరవము”; కోర్టుల్లో “వారకాంత వల్లభులైన న్య్హాయావాదుల పట్ల ఆదరము; కేవల కులకాంత వల్లభులైన అనాదరము”; దానివల్ల “ధనార్జన చేయ నపేక్షించిన న్యాయవాదులనేకులు వేశ్యలను చేరదీసిన వారైరి” అని; రాజమండ్రి వారు చాలక ఇతరగ్రామాల నుంచి కొత్త వేశ్యలను రప్పించేవారని రాశారు.

చివరకు విద్యారంగం లోకి కూడా దీని ప్రభావం ఎలా పాకిందో చెప్పారు: రాజమండ్రిలో “పాఠశాల అనగా వేశ్యల చదువు కోసమనియే అర్ధం. శుద్ధ శోత్రీయులు సహితము అధికారుల మెప్పునకయి” ఈ స్కూళ్ళకు చందాలు ఇయ్యాలి.  నాయుడిగారి బోగంమేళం, పంతులుగారి మేళం, శాస్త్రిగారి మేళం ఇలా పేరు బడ్డాయి. ఎవరింట్లో శుభకార్యమైనా “ఈ ప్రముఖులు తమతమ మేళములు పెట్టవలసినదని సందేశములు పంపుచుండిరి” ఇలాటి పెద్దలతో చిక్కులెదురైనాయి: “ఇట్టి బలవంతుల కప్రియముగా” రాయాల్సి వచ్చింది; దానికి “ప్రముఖులు దురాగ్రహవేశ పరులయి” పత్రికకు వ్యతిరేకంగా “దూషణోక్తులు”, బెదిరింపులు, చివరికి దాడులు కూడా చేసారు.(పే22-23).

పెద్దల ఇంట్లో శుభకార్యాలకు వెళ్ళినవారు బోగంమేళం ఖర్చులకు విధిగా డబ్బులివ్వాలి. ఇది “సర్వసాధారణం”. ఇవ్వకపోతే “అవమానకరం”, కొందరు ఈ శక్తి చాలక వాటికి వెళ్ళటం మానుకొనేవారు. అయినా “అధికార పిశాచావేశ మత్తులయిన వారి ఇండ్లకు తప్పకపోయి, వేశ్యలకు కట్నములు సమర్పించవలసిన వారుగా నుండిరి. పిలిచినపుడు అధికారుల ఇండ్లకు పోని సన్నగాండ్రకు గ్రామములో కాపురము చేయుటయే దుర్ఘటముగా  నుండెను.”

ఒక దండ విధాయి ఏదోపేరిట నెలకు రెండుసారులైనా బోగంమేళాలు పెట్టి, ఊరిలో అందరినీ ఆహ్వనించడం, వాటికి ఎవరైనా పోకపోతే “మరునాడు వారి ఇంటిముందు పెంట ఉన్నదనియో, మురికి నీరు వీధిలోకి వచ్చినదనియో ఆ మందభాగ్యులు సభల కీడ్వబడి, కొన్నాళ్ళు పనిచెడి తిరిగిన మీదట ఒక్క రూపాయకు బదులుగా నాలుగు రూపాయలు ధనదండనం” ఇచ్చుకోవాలి.ఇలాటి కొందరు అధికారులు “వసూళ్ళలోసగము మాత్రమే వేశ్యలకిచ్చి, నెలకిన్నూరో, మున్నూరో గడించుచుండిరి.”( పే26).

1906 వరకు జంధ్యం తీయలేదు అని ప్రభాకర్ రాశారు. ఈనాటికీ జంధ్యం తీయని అభ్యుదయ వాదులున్నారని, గొప్పగా జంధ్యం వేసుకునే బ్రాహ్మణేతరులున్నారని గమనించాలి. అంత వెనుకబడిన సమాజం మనది. కందుకూరికి గురుతుల్యులైన రాజారాంమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటివారు జంధ్యం తీయలేదు అని సమాచారం వుంది.

సహపంక్తి భోజనాల గురించి ప్రస్తావించి, కందుకూరి బ్రాహ్మణేతరుల చేతివంట తిన్న దాఖలాలు లేవు అని రాసారు. ఈ విషయం గురించి స్వీయచరిత్ర లో ప్రస్తావనలు ఉన్నాయి.

మొదటి వితంతు వివాహం కాగానే శంకరాచార్యులవారు కందుకూరిని ’జాతినుంచి’ బహిష్కరించారు. ఆయనొక్కరినేకాదు. ఆయన ఎలాంటి వాతావరణంలో పనిచేశారో చూసి బేరీజు వేసుకోవాలి:

వితంతువివాహంలో సహకరించిన 30మందికి శంకరాచార్యులనుండి బహిష్కార పత్రికలు వచ్చినవి. అద్దెఇళ్ళనుంచి ఖాళీ చేయించారు. నూతులలో నీళ్ళు తోడుకోనీయలేదు. పురొహితులను వారి ఇళ్ళకు రాకుండా చేశారు. బంధువులను రాకుండా చేశారు. (పేజీ 49).

ఇలాంటి వాతావరణంలో ఆయన పనిచేయాల్సి వచ్చింది. తన మద్దతుదారులు కూడా ఒక్కొక్కరే విడిచి పెట్టటంతో ‘నేనొక్కడనే మిగిలితిని’. ఈ దశలో భోజన ప్రతి భోజనాదులుచేసేవారు, సహాయులు ఎవరూ ఉండరు. వర్ణభేదమును విడిచినవాడను… “ఇటువంటి స్థితిలోఒంటిగాడనైన నాకు కష్టములు కాక ఏముండును? నేను జంధ్యమును, వర్ణభేదమును విడిచి అనుష్టానానికి అబ్రాహ్మడయిన పక్షమున శూద్రాదులతో మాత్రమేకాక క్రైస్తవ, మహమ్మదీయాదులతో కూడా భోజన ప్రతి భోజనాదులు చేయగల వాడనగుదును. క్రమముగా వివాహము లాడు వారి సంఖ్య అధికంబుగావచ్చి భోజన ప్రతి భోజనాదులు (Inter-Dining) జరపదగిన సంఘమేర్పడినది.’ (పేజీ నెం.149)

ఈ విషయంలో నాటి సామాజిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని జరిగిన ప్రయత్నాలను సానుకూలంగా పరిగణించాలి. ఈ నాటికీ క్రింది కులాలఇళ్ళలో భోజనం చేయని విద్యావంతులున్నారు. మాదిగల ఇళ్ళలో తినని మాల విద్యావంతులు; బ్రాహ్మణులతోనే వండించి, వడ్డించాం అనే బ్రాహ్మణేతరులూ ఉన్నారు. మన సమాజం నేటికీ ఎంత వెనుకబడి ఉన్నదో గుర్తు చేసుకోవాలి.

“స్త్రీ విద్యకు వీరేశలింగం ఆద్యుడు కానప్పటికీ” కొత్త వెలుగులు నింపారు అన్నారు. తెలుగు ప్రాంతాల్లో, అదీ చిన్న పట్టణంలో ప్రారంభించిన ఆద్యుడే. హైదరాబాదులోసైతం 1896లో మాత్రమే స్త్రీవిద్యకు పాఠశాల మొదలైంది. మద్రాసు 1837, మైసూరు 1842, తిరువాన్కూరు 1864, హైదరాబాదు 1896 — ఇవన్నీపాశ్చాత్య మిషనరీలు స్థాపించిన బాలికా పాఠశాలలు. కాగా ఫూలే (1848), కందుకూరి (1874) ప్రారంభించినవి స్థానికుల చొరవతో మొదలైన విశిష్టత కలవి.

ఏమైనా ప్రభాకర్ గారు గొప్ప కృషి చేశారు. దానికి ‘సారంగ’ వేదిక కల్పించింది. వారికి చేర్పుగా పై విషయాలను ఎత్తిచూపటం జరిగిందని గమనించగలరు.

*

 

కలిదిండి జగన్నాధ రామారావు

2 comments

Leave a Reply to Kallakuri sailaja Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • An essay which has Balance… and point to point explanation along with honest agreement towards facts. Healthy one. Thanks sir and thanks to Saranga .

  • జగన్నాధ రామారావు గారూ
    ‘విగ్రహాలు మాట్లాడనివ్వవు’ మీద మీ స్పందనకు కృతజ్ఞతలు. వీరేశలింగాన్ని , ఆయన కృషిని, దానికున్న పరిమితుల్ని అర్థం చేసుకోడానికి మీరిచ్చిన సమాచారం మరింతగా తోడ్పడుతుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు