ఒక మహాకావ్యమంత ప్రేమ ‘కోల్డ్ వార్’

ఒక మహాకావ్యమంత ప్రేమ ‘కోల్డ్ వార్’

పదిహేనేండ్ల కాల వ్యవధి గల కావ్యం. నాలుగు దేశాల వైశాల్యం గల కావ్యం. ఒక యుద్ధానంతర దేశ చరిత్రలో జన్మించిన  కావ్యం.

యేడాది ఆస్కార్ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రానికి నామినేట్ ఐన రెండు సినిమాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. రెండూ నలుపు తెలుపుల్లో (బ్లాక్ అండ్ వైట్) చిత్రీకరించిన సినిమాలు. రెండూ గతానికి(చరిత్రకు)  చెందిన కథలు. రెండు సినిమాల్లోనూ  దర్శకుల జీవితాలకు చెందిన ఆత్మకథాత్మక ఛాయలున్నవి. ఒక సినిమా అల్ఫాన్సో కువెరన్ దర్శకత్వం వహించిన ‘రోమా’ (దీని గురించి పోయిన సారి ఈ శీర్షికలోనే రాశాను). మరొకటి పావెల్ పావ్లికోవ్స్కీ దర్శకత్వం వహించిన ‘కోల్డ్ వార్’.

ఈ రెండింటిలోనూ  కోల్డ్ వార్ కు కొన్ని అదనపు ప్రత్యేకతలున్నాయి.

కోల్డ్ వార్ దర్శకుడు పావెల్ పావ్లికోవిస్కీ 2013 లో ‘ఇడా’ అనే సినిమా తీశాడు. అది కూడా పోలండ్ చరిత్రను ఆధారంగా తీసిన సినిమా. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు,  హిట్లర్ నాజీ నిరంకుశ పాలన కింద నలిగిపోయిన పోలండ్,  యుద్ధం తర్వాత సోవియట్ రష్యా పాలన కిందికి వచ్చింది. పోలండ్ రెండవ ప్రపంచ యుద్ధం లో తీవ్రంగా నష్టపోయింది. పోలిష్ ప్రజలు అనేకానేక ఇబ్బందులను ఎదుర్కున్నారు. తీవ్రమైన కష్టనష్టాలకు లోనయ్యినరు. తన చిన్న నాడే ఇంగ్లండు కు వలస పోయిన పావెల్ తన దేశం ఎదుర్కున్న చారిత్రిక పరిస్తితులను తన సినిమాల్లో, ముఖ్యంగా 2013 లో  ‘ఇడా’, ఇప్పుడు ‘కోల్డ్ వార్’ లో అద్భుతంగా తెరకెక్కించాడు. గత చరిత్రను ప్రతిబింబిస్తున్న రెండు సినిమాలూ నలుపు తెలుపుల్లోనే చిత్రీకరించాడు. రెండు సినిమాలూ 4:3 ఆస్పెక్ట్ రేషియో (ఇప్పుడు మనకు 70ఎం‌ఎం,  వైడ్ స్క్రీన్ ఫార్మాట్ సినిమాలు అలవాటయ్యి ఒకప్పటి లెటర్ బాక్స్ ఫార్మాట్ ను మర్చిపోయాం), లెటర్ బాక్స్ ఫార్మాట్ లో తీశాడు. ఈ రెండు పద్దతులు, నలుపు తెలుపుల ఛాయాగ్రహణమూ 4:3 ఆస్పెక్ట్ రేషియో లెటర్ బాక్స్ మోడ్, ఉపయోగించి ఆ చారిత్రిక వాతావరణాన్నీ , స్వేచ్ఛను కోరే తన పాత్రలు ఎట్లా ఒక చారిత్రిక వాతావరణం లో బందీలుగా మారిపోయారో, ఎట్లా వాళ్ళను అప్పటి పరిస్తితులు కుదించే  ప్రయత్నం చేసాయో అద్భుతంగా చిత్రీకరిస్తాడు.

నిజానికి పావెల్ పావ్లికోవిస్కీ ‘కోల్డ్ వార్’ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందు టెక్నిక్ గురించే చెప్పుకోవాలి. నలుపు తెలుపుల్లో అద్భుతంగా చిత్రీకరించిన 2013 దృశ్యకావ్యం. ‘ఇడా’ కూ ఈ సినిమా కూ ఛాయాగ్రహకుడు ఒక్కడే – లూకాష్ జాల్. ఒక కావ్యం చదువుతున్నట్టు ఉంటుంది కోల్డ్ వార్ చూస్తున్నంత సేపూ. వెలుగు నీడలను అద్భుతంగా వాడుకుంటూ పోలిష్ ప్రజల జీవితాలమీద  ఛాయలు పరిచిన చారిత్రిక సందర్భాన్ని గొప్పగా చిత్రీకరించాడు. నలుపు తెలుపుల్లో హై కాంట్రాస్ట్ ఇమేజ్ తో చిత్రీకరించడం పావెల్, లూకాష్ ల ప్రత్యేకత. దాదాపు ప్రతి ఫ్రేము ఒక కవితాత్మక ప్రతిబింబంగా, పదచిత్రంగా చిత్రీకరించారు. పొగమంచులు కమ్మిన పోలిష్ గ్రామీణ వాతావరణం కానీ, పురాతనమైన గోడలు కూలిన చర్చి కానీ, సంగీత నృత్యప్రదర్శనలు జరిగే వేదికలు కానీ, పారిస్ లో నగర వాతావరణం కానీ,  అర్బేనిటీ కానీ,  సంగీత ప్రదర్శనలు కానీ, దేశాల సరిహద్దులు కానీ, ఒకటేమిటి సినిమాలో ప్రతి దృశ్యమూ కన్నులపండగే – అద్భుత దృశ్యమానమే – కవితా పదచిత్రాల సమాహారమే!

అంతే కాదు – ‘ఇడా’ లోనూ, ‘కోల్డ్ వార్’ లోనూ మరో టెక్నిక్ ఉపయోగించారు దర్శకుడు పావెల్, ఛాయా దర్శకుడు లూకాష్. ఫ్రేమ్ లో నటీనటులను, ముఖ్యంగా హీరో హీరోయిన్లను చూపిస్తున్నప్పుడు వాళ్ళను ఎక్కువ కాంట్రాస్ట్ తో చూపిస్తూనే, ఫ్రేమ్ లో మూడో వంతు కింది భాగం లో చిత్రీకరిస్తారు. అంటే ఫ్రేమ్ లో కింది మూడో వంతులోనే వాళ్ళు కనబడతారు. పై భాగమంతా దాదాపుగా ఖాళీ గా ఉంటుంది. చారిత్రిక పరిస్తితులకు, బరువులకు, బాధలకు లోనయిన పాత్రలనట్లా చిత్రీకరించడం వల్ల వారి బలహీనమైన పరిస్తితి మనకు చెప్పకనే చెప్తున్నారు దర్శకులు. అట్లా ప్రతి ఫ్రేమ్ మన మీద మన అంతరంగం మీద బలమైన ముద్ర వేస్తాయి.

అట్లాగే సినిమా లో ఉపయోగించిన మిజ ఎన్ సెన్  (mise en scène) కథలోని ప్రతి చారిత్రిక సందర్భాన్ని, వాతావరణాన్ని అద్భుతంగా పట్టిస్తాయి.

సినిమాలో ఉపయోగించిన సంగీతమంతా ఆయా సన్నివేశాల్లో  సహజంగా ఉండే సంగీతమే. అంటే ప్రధాన పాత్రలు సంగీతకారులే కాబట్టి వారు సృష్టించే సంగీతమే సినిమాకు సంగీతమైంది. ప్రత్యేకంగా నేపథ్య సంగీతమంటూ యేమీ ఉండదు. దీన్నే డైఎజెటిక్ (Diegetic) సంగీతం అంటారు.

సినిమా మొత్తంగా వాడిన సాంకేతికత – ఛాయాగ్రహణం, సంగీతం, మిజ ఎన్ సెన్, ఎడిటింగ్  వగైరాలు – సినిమా కథ లోని చారిత్రక నేపథ్యాన్ని, చారిత్రిక బీభత్సాలను, పరిస్తితులను, పాత్రల మానసిక సంఘర్షణలను, అస్తిత్వ వేదనలను అద్భుతంగా ప్రతిబింబించడానికి మరింత శక్తివంతంగా చెప్పడానికే,  చాలా సమర్థవంతంగా  ఉపయోగపడింది. అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు పావెల్ పావ్లికోవిస్కీ ఈ పనిని చాలా చైతన్యవంతంగా చేశాడు.  వర్ధమాన యువ దర్శకులకు ఒక పాఠ్యపుస్తకం అయ్యేటంత ప్రతిభావంతంగా, చైతన్యయుతంగా..

ఇక పోతే సినిమా కథలోకి వెళ్దాం.

సినిమా రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయాక 1949 లో పోలండ్ దేశం లో ప్రారంభమవుతుంది. సంగీత కళాకారుడైన హీరో విక్టర్ (ప్రముఖ పోలండ్ నటుడు తోమస్ కాట్ హీరో పాత్రలో గొప్పగా నటించాడు) తన తోటి కళాకారిణి ఐరీనా తో కలిసి,  ఒక ప్రభుత్వ బృందం తో పోలండ్ గ్రామీణ ప్రాంతాల్లో కృశించిపోతున్న జానపద సంగీతాన్ని సేకరించడానికి, ఆయా జానపద సంగీత కళాకారులతో కలిసి వారితో పాడించి,  రికార్డు చేసే కార్యక్రమం లో ఉంటాడు. దర్శకుడు అద్భుతమైన పోలండ్ జానపద పాటలను, సంగీతాన్ని, కవిత్వాన్ని మనకు పరిచయం చేస్తాడు మొదటి ఐదు పది నిమిషాల్లోనే.

వాళ్ళతో ఉన్న ప్రభుత్వాధికారి కాజ్మారెక్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఒక జానపద సంగీత కళాకారుల బృందాన్ని తయారు చేస్తాడు. ఆ బృందాన్ని ఒక పాత ప్రభుత్వగృహం లో ఉంచి ఎవరు ఏమి పాడగలరో ఆడిషన్ చేస్తున్న సందర్భం లో హీరోయిన్ జూలియా  (జోయానా  కులిగ్ అనే నటి ఈ పాత్రను అత్యద్భుతంగా పోషించింది – పాత్రలో ఉండే మానసిక సంఘర్షణ, అస్తిత్వ వేదన, కాలం తో మారే పాత్ర స్వరూప స్వభావాలను చాలా గొప్పగా ప్రతిబింబించింది) పరిచయమవుతుంది విక్టర్ కు. ఆమె గొంతు చాలా బాగుందని అనుకుంటాడు విక్టర్ – ఐరీనాకు  ఆమె అంత నచ్చదు. పైగా జూలియా మోసపూరితంగా ప్రవర్తిస్తుందేమో అని అనుమానపడుతుంది కూడా. ఆమె తన తండ్రి ని హత్యచేసి జైలు శిక్ష అనుభవించింది అని కూడా చెప్తుంది. ఆమె పాడిన పాట జానపదం కాదని, అంతకుముందే ఒక రష్యన్ సినిమాలోనుండి అది తీసుకుందని కూడా స్పష్టమవుతుంది.

ఐనా విక్టర్ కు జూలియా అంటే ఏదో తెలియని వ్యామోహం కలుగుతుంది. తీరని మోహమేదో వెంటాడుతుంది. వారి మొదటి ప్రదర్శన గొప్పగా విజయవంతమవుతుంది. విక్టర్ జూలియా మరింత దగ్గరవుతారు. అప్పుడడుగుతాడు జూలియా ను ఆమె తండ్రి గురించి ఆమె జైలు శిక్ష గురించి – ‘అవును నిజమే! ఆయన నాకు తండ్రి అన్న విషయం మరచిపోయి ప్రవర్తించాడు – నేనతనికి అది కత్తితో గుర్తు చేయాల్సివచ్చింది’  అని చెప్తుంది. సంగీతం గురించి కూడా,  తనకు జానపద సంగీతం పెద్దగా తెలియదని కూడా నిజాయితీగా ఒప్పుకుంటుంది. పైగా ప్రభుత్వాధికారి ఆజ్ఞానుసారం విక్టర్ మీద గూఢచర్యం కూడా చేస్తున్నా అని చెప్తుంది. ఆమె నిజాయితీ విపరీతంగా నచ్చుతుంది విక్టర్ కు.

విక్టర్ జూలియా మరింత దగ్గరవుతారు. ఈ లోపల సాంస్కృతిక వ్యవహారాలను చూసే ఒక ప్రభుత్వ అధికారి,  సాంస్కృతిక ప్రదర్శనల్లో భూసంస్కరణలు, ప్రపంచ శాంతి, కార్మికవర్గ విజయాలు. ప్రాలిటేరియట్ నాయకత్వమూ, ప్రపంచ ప్రాలిటేరియట్ మహానాయకుని గురించి చెప్పాలని, అవి సోషలిస్టు వాస్తవికత ను ప్రతిబింబించాలని ఆదేశాలు జారీ చేస్తాడు. ఇది విక్టర్ కు నచ్చదు. తను పోలండ్ జానపద, సంప్రదాయిక సంగీత నేపథ్యం నుండి వచ్చిన వాడు. అతనికి ఈ సోషలిస్టు వాస్తవికత,  వగైరాలు తెలియదు. పోలండ్ లో సోషలిస్టు విప్లవం విజయవంతమై సోషలిస్టు రాజ్యం రాలేదు. రెండవ ప్రపంచ యుద్ధం లో అప్పటిదాకా పీల్చి పిప్పి చేసిన నాజీలను ఓడించడానికి సోవియట్ రష్యా సహకారం తీసుకున్నారు – ఇదే అదనుగా సోవియట్ రష్యా తనకనుకూల ప్రభుత్వాన్ని యేర్పాటు చేసి సోషలిస్టు రాజ్యమని అన్నది. సోషలిస్టు ప్రభుత్వమూ, వ్యవస్థా  పోలండ్ పై పైనుండి నిర్బంధంగా అమలైందే తప్ప అంతర్గంగా విప్లవాల ద్వారా వ్యవస్థ మార్పు ద్వారా వచ్చింది కాదు. అందుకే చాలా మంది  పోలండ్ ప్రజలకు సోవియట్ సోషలిస్టు పాలన పరాయి పాలన లాగానే, కనీస ప్రజాస్వామిక హక్కులను కూడా అణచివేసే అప్రజాస్వామిక నిరంకుశ పాలన లాగానే తోచింది. వాళ్ళలో విక్టర్ కూడా ఒకడు. ప్రభుత్వం కళాకారునిగా తన స్వేచ్చను అణచివేసినట్టు అనిపించింది తనకు. అందుకే తమ బృందమంతా తూర్పు బెర్లిన్ కు వెళ్లినప్పుడు పక్కనే ఉన్న ఫ్రాన్స్ కు పారిపోదామని చెప్తాడు జూలియా తో. జూలియాకు ఈ రాజకీయాలు ఇవన్నీ పట్టవు. ఆమె తన భద్రత, తన భవిష్యత్తు మాత్రమే చూసుకుంటుంది. ఫ్రాన్స్ లో విక్టర్ బ్రతుకగలడేమో కానీ తను బతకలేదని అర్థం చేసుకుని,  విక్టర్ అన్న సమయానికి అక్కడికి వెళ్ళదు. విక్టర్ ఒక్కడే ఫ్రాన్స్ కు వెళ్ళిపోతాడు. అక్కడ పోలండ్ పౌరసత్వం వదిలేసి ఫ్రాన్స్ పౌరసత్వం తీసుకుంటాడు. అక్కడ ఒక కవయిత్రి తో ప్రేమలో పడతాడు కానీ జూలియా లేకుండా బతుకలేకపోతాడు. ఆమెను నిరంతరం వెతుక్కుంటూ ఉంటాడు.

మరోమారు తారసపడుతుంది జూలియా.  ఈ సారి యుగోస్లావియా లో ఒక ప్రదర్శనలో – అక్కడ విక్టర్ ను కలుస్తుంది. మరొకరిని పెళ్లి చేసుకున్నా విక్టర్ లేకుండా బతుకలేక పోతున్న అని చెప్తుంది. ఈ లోపల పోలండ్ అధికారులు విక్టర్ ను అరెస్టు చేసి ఫ్రాన్స్ రైలు ఎక్కిస్తారు.

ఇక జూలియా విక్టర్ ను వదిలి ఉండలేక ఫ్రాన్సుకు, పేరు మార్చుకుని  ఒక ఇటలీ అతన్ని పెళ్లిచేసుకుని వెళ్తుంది. విక్టర్ ను కలుస్తుంది, ఇద్దరూ కలిసి బతకడం మొదలు పెడతారు. అప్పుడు ప్రారంభమవుతాయి విక్టర్,  జూలియా ల అస్తిత్వ వేదనలు! జూలియా అభద్రత, ఆమెను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేసే విక్టర్ పరిచయాలూ..

ఇంకా చెప్తూ పోతే మొత్తం కథ చెప్పినట్టు అవుతుంది. అది సరైంది కాదు. విక్టర్ జూలియా ల మధ్య యే చారిత్రిక స్థల కాలాలూ విడదీయలేని అద్భుతమైన, గాఢమైన ప్రేమ ఉన్నది. అది మామూలు ప్రేమ కాదు. ఒకరి కోసం ఒకరు ధ్వంసమయ్యే ప్రేమ. ఒకరిలో ఒకరు అంతమయ్యేట్టుగా కలిసి పోయే ప్రేమ. మధ్య మధ్య అనేక అవాంతరాలు వచ్చి ఉండవచ్చు. పొరపొచ్చాలు వచ్చి ఉండవచ్చు. ఒకరినొకరు విపరీతంగా అపార్థం చేసుకుని ఉండవచ్చు. విడిపోవాలని తీవ్రంగా అనిపించి ఒకరినుండి ఒకరు పారిపోయిఉండవచ్చు.

అంతెందుకు అసలు వారిద్దరికీ ఒకరికొకరికి అసలు పొంతనే ఉండదు. జోడీయే పూర్తిగా కుదరదు. విక్టర్ ఒక గొప్ప సృజనాత్మకత గలిగిన గొప్ప కళాకారుడు. రాజకీయ చైతన్యం కలవాడు. విలువల కోసం నిలబడేవాడు. తాను సంగీతం లో చాలా యెత్తు ఎదగలనుకునే వాడు. ఐతే తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునేవాడు.  అస్తిత్వ వేదన ఎక్కువ. జూలియా అట్లా కాదు. పల్లెటూరి నుండి వచ్చింది. పెద్దగా చదువుకోలేదు. పెద్దగా సంగీతజ్ఞానమూ లేదు. గొప్ప గాయకురాలు కావచ్చేమో గొప్ప నటి కావచ్చేమో కానీ ఆమెకు అభద్రతా ఎక్కువ, అస్తిత్వ గందరగోళమూ ఎక్కువే. స్తిరత్వం లేదు. కొంత చపలచిత్తమూ ఉన్నది.

ఐనా ఇద్దరి మధ్యా ఒక సముద్రమంత ప్రేమ ఉన్నది.

ఒక మహాకావ్యమంత ప్రేమ ఉన్నది.

ఆ ప్రేమను రాజకీయాలూ, ప్రభుత్వాలూ, దేశ సరిహద్దులూ, సంగీత సరిహద్దులూ, చరిత్రా, కాలమూ యేమీ చేయలేక పోయినాయి. దేశాల సరిహద్దుల్లో ఉండే భద్రత దళాలు, దేశాల ప్రభుత్వాలు, వ్యవస్థలు,  సంగీతాన్ని ఆపగలవేమో, మనుషుల చిరునామాలు చెరిపెయ్యగలవేమో, పూర్తిగా మనుషుల్నే గల్లంతు చెయ్యగలవేమో కానీ వారి ప్రేమను చెరిపెయ్యలేవు. వారి ప్రేమ, ఆకాశమంత ఎత్తైనదీ, సముద్రమంత లోతైనదీ.

ఆ ప్రేమే ఈ సినిమాను ఒక గొప్ప కావ్యం చేసింది. పదిహేనేండ్ల కాల వ్యవధి గల కావ్యం. నాలుగు దేశాల వైశాల్యం గల కావ్యం. ఒక యుద్ధానంతర దేశ చరిత్రలో జన్మించిన  కావ్యం.

ఈ సినిమాకు ప్రాణం జూలియా పాత్ర లో అద్భుతంగా జీవించిన నటి జోయానా క్లుగ్. అతి పిన్నవయసులో సాంస్కృతిక  బృందం లో చేరడానికి వచ్చిన దగ్గరి నుండి పదిహేనేండ్ల జీవితాన్ని, ఆ జీవిత కాల రథ చక్రాలు ఆమె మీద నుండి కర్కశంగా వెళ్ళిపోయిన దశలను ఒక్కొక్కటిగా అద్భుతంగా నటించింది – నటించింది అనడం కంటే జీవించింది. ఆమెది బయటకు కనబడే వేదన. మనకు గోచరించే దుఃఖమూ ప్రేమా! విక్టర్ (తోమస్ కాట్) ది అంతర్లీన దుఃఖం, బయటకు కనబడనిది, నిగూఢంగా, సూక్ష్మభేదాలతో ఉండే పాత్ర ఆయనది. తోమస్ కాట్ కూడా అద్భుతంగా నటించాడు (జీవించాడు). మొత్తం మీద ఈ సినిమా వీరిద్దరిదీ.

దర్శకుడు, ఛాయాయా దర్శకుడు, సంగీతకారుడు, కూర్పూ, ఇంకా ఇతర సాంకేతిక బృందమంతా అద్భుతంగా అమరిన సినిమా ఇది. దాదాపు 90 నిమిషాల నిడివిలో యూరప్ లో ఒక రెండు దశాబ్దాల నాలుగు దేశాల చరిత్ర నేపథ్యం లో ఒక ప్రేమ కథను సినిమాగా తెరకెక్కించడం సామాన్యమైన విషయం కాదు. చాలా క్రిస్ప్ గా అనవసరమైనదేదీ చెప్పకుండా, తెర మీద ప్రతి సెకండుకు విలువనిస్తూ, ప్రతి సెకండులో ఎన్నో విషయాలను చెప్తూ,  ఎంతో ఉద్వేగాన్ని దట్టించిన దృశ్యాలతో మనని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగే గొప్ప కావ్యం ‘కోల్డ్ వార్’.

ఇందులో ఎవరు తప్పు ఎవరు సరైంది అనే చర్చ అనవసరం. ఆయా స్థలకాలాల్లో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు – ఆనాటి చరిత్రనూ, ఆ చరిత్ర గమనాన్ని ఆదేశించిన ఆధిపత్య శక్తులనూ, ఆధిపత్య శక్తులు ప్రాతినిధ్యం వహించిన వ్యవస్థనూ – అన్నీ మన కళ్ళముందుంచి మననే ఆలోచించుకోమని చెప్తూ,  అంతర్లీనంగా ప్రేమ అంతుతెలియనిది,  అంతుచిక్కనిది అజేయమైనదనే  హృదయాలకు హత్తుకుంటుంది ‘కోల్డ్ వార్’.

ఈ చిత్రాన్ని తన తలిదండ్రులకు అంకితం చేశాడు దర్శకుడు పావెల్. వారిద్దరి మధ్య ప్రేమ ను స్ఫూర్తిగా తీసుకునే విక్టర్, జూలియా పాత్రలు చిత్రించి, వారిద్దరి మధ్య ప్రేమనూ తెరకెక్కించానని, ఒక రకంగా ఈ సినిమాలో తన ఆత్మ చరిత్రాత్మక ఛాయలున్నాయని పావెల్ చెప్పాడు.

 

*

నారాయణ స్వామి వెంకట యోగి

23 comments

Leave a Reply to Narayanaswamy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు