‘క’ దేశపు ఆకాశం ఆ రోజు విచిత్రమైన రంగులో మెరిసింది. అది నీలం కాదు, నలుపు కాదు, ధన్వంతరీ ఆచార్య కొత్తగా లాంచ్ చేసిన ‘అల్టిమేట్ స్కై’ యాప్ థీమ్ లాగా ఒక రకమైన బూడిద రంగులో మెరుస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి పాతికేళ్లు గడిచాయి. పాతికేళ్ల క్రితం ‘ఇ’ దేశం నుండి విముక్తి పొందినప్పుడు జనం వీధుల్లో నాట్యం చేశారు. అప్పట్లో వాళ్లకి ఆకలి ఉండేది కానీ ఆశ కూడా ఉండేది.
ఇప్పుడు ఆకలి అలాగే ఉంది, కానీ ఆశ స్థానంలో ఒక డిజిటల్ మత్తు వచ్చి చేరింది. దేశపు విస్తీర్ణం లక్షా అరవై రెండు వేల తొమ్మిదివందల డెబ్బై చదరపు కిలోమీటర్లు. దేశానికి మూడువైపులా సముద్రమూ ఒక వైపు పర్వతాలూ వున్నాయి. ఈ భౌగోళిక సరిహద్దులను ప్రజలు ప్రతిరోజూ జపం చేయాలి. అది దేశభక్తికి సూచన. ప్రజలు రోజూ జపం చేయకపోతే, వారి స్మార్ట్ ఫోన్లలో డేటా బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఇది జెడ్ పార్టీ పెట్టిన కొత్త నిబంధన.
జెడ్ పార్టీ అధికారంలోకి రాకముందు ‘కే’ పార్టీ అధికారం లో ఉండేది. అది ఒక ముసలి ఏనుగు లాంటిది. నెమ్మదిగా నడిచేది, అప్పుడప్పుడు తొండంతో కొట్టేది. కానీ జెడ్ పార్టీ అలా కాదు, అది ఒక మెరుపు లాంటిది. రావడం రావడమే జెన్-జెడ్ తరాన్ని ఉద్దేశించి, “మీకు స్వర్గం పైన ఎక్కడో ఉండదు, మా వెబ్ సైట్ లో ఉంటుంది, లాగిన్ అవ్వండి” అని పిలుపునిచ్చింది
జెడ్ పార్టీ వెనుక ఉన్న మేధస్సు ధన్వంతరీ ఆచార్యది. ఆచార్య ఒకప్పుడు ఒక చిన్న కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్.ఆ కంపెనీ నష్టాలలో ఉండేది. దాన్ని లాభాల బాట పట్టించడానికి ఆయన చాలా శ్రమించాడు. ఆ శ్రమలో కొన్ని కొత్త శక్తులను తనకు తెలియకుండానే తాను సంపాదించుకున్నాడు. ఆ శక్తి పేరు ది గ్రేట్ మెటా మార్ఫసిస్. ఆ విద్య వలన ఆయన అబద్ధాన్ని ఎంత అందంగా, ఎంత అనూహ్యంగా, ఎంత అద్భుతంగా ప్యాక్ చేయవచ్చో ఎవరికీ తెలియనంత, ఎవరూ ఊహించలేనంత గొప్పగా నేర్చుకున్నాడు.
‘కే’ పార్టీ హయాంలో ఆయన పదిహేనో స్థానంలో ఉండేవారు, కానీ జెడ్ పార్టీ పుట్టాక ఆయన మొదటి స్థానానికి చేరడమే కాదు, దేశమే ఆయన రెండో ఆఫీసులా మారిపోయింది. ఎన్నికలకు ముందు జరిగిన ఆ విమాన ప్రయాణం ఒక చారిత్రక ఘట్టం. భూమికి పదివేల అడుగుల ఎత్తులో, ఆక్సిజన్ తక్కువగా ఉన్న చోట, దేశ భవిష్యత్తును ఎలా ఊపిరి ఆడకుండా చేయాలో ఆచార్య జెడ్ పార్టీ నాయకులకు వివరించారు.
ఆ సన్నివేశం తలచుకుంటే ఆయనకు ఇప్పటికీ నవ్వు వస్తుంది.
లక్షా అరవై రెండు వేల తొమ్మిదివందల డెబ్బై చదరపు కిలోమీటర్ల వైశాల్యం వున్న క దేశాన్ని జెడ్ పార్టీ రెండేళ్లలో నాలుగుసార్లు చుట్టేసింది. నలభయ్ రెండు వాగ్దానాలు చేసింది. స్వర్గం పైన ఎక్కడో ఉండదు. మమ్మల్ని అధికారం లోకి తీసుకుని రండి దాన్ని ఉసిరికాయలా మార్చి మీ అరచేతిలో పెడతాను అన్నది.
ప్రతి రాత్రీ మీరు నిద్రపోయాకే నేను రెప్ప వాలుస్తాను అన్నది. ప్రతి ఉదయం మీకంటే ముందే కళ్ళు తెరచి మిమ్మల్ని కంటి రెప్పలా కాపాడుకుంటాను అన్నది.మాది జెడ్ పార్టీ. ఆంగ్ల వర్ణమాలలో జెడ్ తరువాత మరొక అక్షరం ఏదీ లేదు. జెడ్ అల్టిమేట్. మా పార్టీ కూడా అల్టిమేట్. మీకు అల్టిమేట్ సౌకర్యాలు అందిస్తాం అన్నది
జెడ పార్టీ జనం లోకి అలా చొచ్చుకుని పోతుంటే అధికారం లో వున్న కే పార్టీ కి ఏమి చెయ్యాలో తోచలేదు. తన అధీనం లో కేబీఐ ని జెడ్ పార్టీ మీద ప్రయోగించింది. జెడ్ పార్టీ కి పక్క దేశం నిధులు ఇచ్చి ప్రోత్సహించి,క దేశాన్ని విడదీయాలని చూస్తోంది అని ఆరోపించింది.జెడ్ పార్టీ అధికారం లోకి వస్తే దేశం విచ్ఛిన్నం అయిపోతుంది అని బెదిరించింది. దేశద్రోహ పార్టీతో కలుస్తారా?దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ తో వుంటారా? అని ఎమోషనల్ బ్లాక్మయిల్ చేసింది. జెడ్ పార్టీ వస్తే సంక్షేమ పధకాలు అన్నీ సంక్షోభం లో పడతాయి అన్నది.
క దేశం లో వున్న ప్రజలు కాసేపు కలవరపడ్డారు. “ఎవరిని ఎన్నుకోవాలా?” అని. రకరకాల సమ్మేళనాలు రచించుకుని ఎవరిని ఎన్నుకోబోతున్నారో ఏమాత్రం, సూచన ప్రాయంగా కూడా ఎక్కడా వ్యక్తం చేయకుండా రహస్యంగా ఎన్నికలలో ఓట్లేశారు. అధికారం ఎవరిని వరించబోతున్నదో ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలు ఏదీ చెప్పలేక జుట్టుపీక్కుని చేతులెత్తేశాయి.
ఎన్నికలు జరిగిన నాలుగురోజుల తరువాత ఫలితాలు వచ్చేశాయి. క దేశం లో మొత్తం రెండువందల ముప్పైనాలుగు స్థానాలు ఉంటే కే పార్టీకి వందసీట్లొచ్చాయి. జెడ్ పార్టీకి వందాఎనిమిది సీట్లొచ్చాయి. మరో నాలుగు పార్టీలకు ఐదు సీట్ల వంతున ఇరవై ఐదు స్థానాలు ఇంకో పార్టీకి ఒక్క స్థానమూ వచ్చింది. జెడ్ పార్టీకి ప్రభుత్వం స్థాపించాలి అంటే మరో పది సీట్లు కావాలి. కే పార్టీ కి అయితే పద్దెనిమిది సీట్లు కావాలి. క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు
ఎంతయినా కే పార్టీ కాకలు తీరిన పార్టీ కదా! జెడ్ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేయసాగింది.జెడ్ పార్టీకి ఆవేశం వున్నది కానీ ఆలోచన లేదు. మా పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేస్తే నూటఎనిమిది మందిమి రాజీనామా చేస్తాము అని హెచ్చరిక జారీ చేసినది. సరిగా అప్పుడు రంగం లోకి దిగాడు. ధన్వంతరీ ఆచార్య.
“ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వకండి, స్వేచ్ఛ అనే భ్రమను ఇవ్వండి. వాళ్లకి అన్నం పెట్టకండి, అన్నం ఫోటోలు చూసుకునే డేటా ఇవ్వండి.” అని జ్ఞానబోధ చేశాడు. తాను చెప్పిన దానికి ఒప్పుకుంటే జెడ్ పార్టీ అధికారం లోకి తీసుకుని వచ్చే బాధ్యత తీసుకుంటాను అని చెప్పాడు. జెడ్ పార్టీ లాభ నష్టాలు కూడి,తీసివేసి,హెచ్చించి,భాగించి,మేధో మథనం చేసి సరే అన్నది
విమానం దిగాక మీడియా వాళ్ళు అడిగితే ఆచార్య నవ్వారు. ఆ నవ్వులో అగణిత లాభం అలవోకగా మెరిసి మాయం అయింది. జెడ్ పార్టీ నేతలు మాత్రం “అల్టిమేట్!” అని ఒకటే నినాదం చేశారు.
ఆ అక్షరం ‘జెడ్’ లోనే ఏదో మ్యాజిక్ ఉందని జనం నమ్మారు. వర్ణమాలలో ఆఖరి అక్షరం కదా, ఇక దీని తర్వాత మనల్ని ఎవరూ బాధపెట్టరు అనుకున్నారు.
మరునాడు రంగరంగ వైభవంగా జెడ్ పార్టీ ప్రమాణస్వీకారం చేసింది. ఆ సాయంత్రం “క” దేశపు వీధులన్నీ దీపాల కాంతులతో, ఆశావహుల నినాదాలతో మారుమోగిపోయాయి. పాతికేళ్ళ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక కొత్త తరం సింహాసనాన్ని అధిష్టించిందని, జెన్ జెడ్ రాజకీయాలు, అల్టిమేట్ పరిపాలన కొనసాగుతుందని ప్రమాణ స్వీకార వేదికమీదనుండి జెడ్ పార్టీ ప్రకటించింది. ఇక తమ కష్టాలు తీరిపోతాయని జనం కలలు కన్నారు.
మొదటి రెండురోజులు జెడ్ పార్టీ అధినేత స్వయంగా కే పార్టీ అధినేతను,ఇతర రాజకీయపార్టీల నేతలను స్వయంగా కలసి సలహాలు, సూచనలు,ఆశీస్సులు తీసుకున్నారు.జెడ్ పార్టీ గెలవని ప్రాంతాలకు ప్రధాని స్వయంగా వెళ్లి మాకు ఓట్లు వేయని వాళ్ళుకూడా మా వాళ్ళే అని భరోసా ఇచ్చి వచ్చారు. క దేశం లో ప్రజలందరికీ ఒక రాజకీయ పార్టీ తమకు ఓట్లేయని వాళ్ళదగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పడమూ,భరోసా ఇవ్వడమూ ఒక కొత్త అనుభవం. విద్వేషం స్థానం లో ప్రేమ మా అభిమతం అని జెడ్ పార్టీ చెప్పింది. ఆ మాటలకూ దేశం అంతా జేజేలు పలికింది. దేశం లో ఒక కొత్త యుగం ఆరంభం అయిందని సంబర పడ్డది. జెన్ జెడ్ ఇచ్చే అల్టిమేట్ పరిపాలన అంటూ మురిసిపోయింది.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి వంద రోజులు ఒక డిజిటల్ వసంతంలా సాగింది. కొత్త ప్రధాని గారు ప్రతిరోజూ టీవీలో కనిపించి, “మీరు నిద్రపోయాకే నేను నిద్రపోతాను” అని చెప్పేవారు. నిజమే, ఆయన నిద్రపోయేది లేదు, ఎందుకంటే ఆయన నిరంతరం డేటాను పర్యవేక్షిస్తూ ఉండాలి.
“దేశాభివృద్ధికి పెట్టుబడులే ప్రాణం” అనే నినాదంతో ధన్వంతరీ ఆచార్యకు చెందిన పారిశ్రామిక సామ్రాజ్యానికి ఎర్రవా తివాచీ పరచింది. లక్షా అరవై రెండు వేల తొమ్మిదివందల డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లోఅక్కడక్కడా వ్యాపించి వున్న రేర్ ఎర్త్ మినరల్స్ ని కలుపుతూ ఒక ఆర్.ఎమ్ జి కారిడార్ ను, అటవీ పరీవాహక ప్రాంతాలను ప్రత్యేక ఆర్ధిక మండళ్ళుగా ప్రకటించి ధన్వంతరీ ఆచార్య గ్రూప్ కి కేటాయిస్తూ అర్ధరాత్రి పూట గవర్నమెంట్ ఉత్తర్వులు వెలువడినాయి. ప్రజలు ఆశించిన విద్యా, వైద్య సంస్కరణల కంటే ముందుగా ఆర్ధిక సంస్కరణలకు గేట్లు తెరిచారు
చూస్తూ ఉండగానే రెండు సంవత్సరాలు గడచిపోయాయి. జెన్ జెడ్ తరం ప్రతినిధులుగా చెప్పుకున్న యువ నాయకులు ఇప్పుడు ఖరీదైన సూట్లు ధరించి, ధన్వంతరీ ఆచార్య ఇచ్చే విందు వినోదాలలో మునిగిపోయారు. తాము ప్రశ్నించడం కోసం పుట్టామన్న సంగతిని వారు సౌకర్యవంతంగా మర్చిపోయారు. దేశంలోని ప్రతి పౌరుడికి అల్టిమేట్ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన జెడ్ పార్టీ, ఆ సౌకర్యాల బాధ్యతను ధన్వంతరీ సంస్థలకు అప్పగించింది.
ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు రూపురేఖలు మార్చుకున్నాయి కానీ, సామాన్యుడికి అవి అందనంత భారంగా మారాయి. సేవ అనేది ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. దేశంలోని లక్షా అరవై రెండు వేల తొమ్మిదివందల డెబ్బై చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఇప్పుడు ధన్వంతరీ ఆచార్య కంపెనీల మైక్రో చిప్స్, శాటిలైట్ నెట్‌వర్క్ నిఘాలోకి వెళ్ళిపోయింది. ప్రజల ప్రతి కదలికను, ప్రతి మాటను డేటా రూపంలో సేకరించి, దాన్ని విశ్లేషించి ప్రజల ఆలోచనా సరళిని మార్చే ప్రక్రియ మొదలైంది.
ప్రజల ఫోన్లలోని మైక్రో చిప్స్ ద్వారా ఎవరు ఏమనుకుంటున్నారో, ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో, ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలలు కంటున్నారో అంతా ఆచార్య సర్వర్లలో నిక్షిప్తమైపోయేది. ఆచార్య సామ్రాజ్యం ఎంతలా విస్తరించిందంటే, దేశంలోని నదులు ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయనాలతో రంగులు మార్చుకున్నాయి. దాన్ని జెడ్ పార్టీ “కలర్ ఫుల్ డెవలప్‌మెంట్” అని పిలిచింది.
అడవులను నరికేసి అక్కడ ‘రేర్ ఎర్త్’ మినరల్స్ తవ్వడం మొదలుపెట్టారు. అడవిలో ఉన్న కోతులు, జంతువులు ఊళ్లలోకి వస్తుంటే,
“చూశారా, మా పాలనలో జంతువులకు కూడా స్వేచ్ఛ వచ్చి ఊళ్లలోకి తిరుగుతున్నాయి” అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. జనం ఆ రీల్స్ చూస్తూ చప్పట్లు కొట్టారు.
వ్యవస్థ ఎంత సంబద్ద అసంబద్ధంగా మారిందంటే, ఒక సామాన్య పౌరుడు ఆసుపత్రికి వెళ్తే, అక్కడ డాక్టర్ కంటే ముందు ధన్వంతరీ ఫైనాన్స్ ఏజెంట్ కలిసేవాడు.
“మీకు జబ్బు తగ్గాలా? లేక జబ్బు తగ్గనట్టు భ్రమ కలగాలా? రెండోది అయితే తక్కువ ధరకే ప్యాకేజీ ఉంది” అని ఆఫర్లు ఇచ్చేవారు.
స్కూళ్లలో పిల్లలకు చరిత్ర బదులు ‘ఆచార్య విజయగాథలు’ పాఠాలుగా మారాయి. విద్యార్థులు ఏ బి సి డి ల బదులు జెడ్ జెడ్ జెడ్ అని రాయడం నేర్చుకున్నారు. ఎవరైనా పొరపాటున “ప్రజాస్వామ్యం” అనే పదాన్ని వాడితే, వెంటనే వారికి ఒక నోటీసు వచ్చేది
“మీరు వాడుతున్న పదం కాలం చెల్లినది, దయచేసి ‘కార్పొరేట్ సార్వభౌమత్వం’ అని వాడండి.”
ఒక వ్యక్తి తన ఇంట్లో కూర్చుని “నాకు స్వేచ్ఛ కావాలి” అని గొణిగితే, మరుసటి నిమిషమే ఆయన స్మార్ట్ టీవీలో ఒక డాక్యుమెంటరీ ప్లే అయ్యేది
“స్వేచ్ఛ వల్ల వచ్చే అనర్థాలు,బానిసత్వంలో ఉండే సుఖాలు.”
ఇది చూసి ఆ వ్యక్తి భయపడి తన నోటికి తనే తాళం వేసుకునేవాడు.
దేశ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక మంత్రి పార్లమెంటులో కాకుండా, ఆచార్య బోర్డు మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేవారు. దేశంలోని ప్రతి రూపాయి ఆచార్య డిజి మిత్ర యాప్ ద్వారానే ప్రవహించాలి. ఒకవేళ మీరు ఒక బిచ్చగాడికి రూపాయి వేయాలన్నా, అది ‘ధన్వంతరీ పే’ ద్వారానే జరగాలి. అందులో కూడా రెండు పైసలు ‘సర్వీస్ టాక్స్’ కింద కట్ అయ్యేవి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, వారి ఫోన్లలో మాత్రం “దేశం గర్వించదగ్గ స్థాయిలో ఆచార్య గారి ఆస్తులు పెరిగాయి” అనే నోటిఫికేషన్లు వస్తూనే ఉండేవి. ఆ వార్త చూసి ప్రజలు తమ కడుపు నిండిపోయిందని భ్రమపడేవారు.
చివరికి ఐదేళ్లు నిండాయి. ఎన్నికల నగారా మోగింది. కానీ ఈసారి ఎన్నికలు జరగడం లేదు, ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జరుగుతోంది. ప్రజలు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌లకు వెళ్లనవసరం లేదు. వారి కళ్లలోని రెప్పపాట్లను బట్టి, వారి గుండె వేగాన్ని బట్టి ఆచార్య గారి అల్గారిథమ్ ఎవరికి ఓటు వేయాలో ముందే నిర్ణయించేసింది.
ఒక వ్యక్తి జెడ్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకుంటే, వెంటనే ఆయన ఫోన్ లోని బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా అయిపోయేలా ప్రోగ్రామ్ చేశారు. దాంతో ప్రజలందరూ “స్వచ్ఛందంగా” జెడ్ పార్టీకే ఓటేశారు. ఫలితాలు వచ్చాయి. 234 స్థానాలకు గాను 234 స్థానాలూ జెడ్ పార్టీకే వచ్చాయి. ఆ ఒక్క శాతం కూడా ఎందుకు వదిలేయాలి అని ఆచార్య భావించి ఉండవచ్చు. దేశం ఇప్పుడు ఒక పూర్తి స్థాయి బ్లాక్ హోల్. కాంతి కూడా లోపలికి వెళ్తే తిరిగి రాదు, అలాగే ప్రజల ఆక్రందనలు కూడా ఆచార్య ఏసీ గదుల గోడలు దాటి బయటకు రావు.
మరో ఐదేళ్ల తర్వాత, ‘క’ దేశం పేరును అధికారికంగా ‘కా ‘ గా మార్చారు. కా అంటే కార్పొరేట్ అని విస్తృత అర్ధం.
స్వాతంత్య్ర పోరాట యోధుల విగ్రహాల స్థానంలో మైక్రో చిప్స్ ఆకారంలో ఉన్న స్తంభాలు వెలిశాయి. ప్రజలు ఇప్పుడు మనుషులు కాదు, వారు కేవలం ‘యూజర్ ఐడి’లు మాత్రమే. వారు శ్వాస పీల్చుకోవాలన్నా ఆచార్య అనుమతి కావాలి, ఎందుకంటే గాలి కూడా ఇప్పుడు ఒక ‘ప్రీమియం సబ్‌స్క్రిప్షన్’ మోడల్ లోకి వెళ్ళిపోయింది.
కాఫ్కా రాసిన కథల్లోని వింత మనుషులలాగే, ‘కా ‘ దేశపు ప్రజలు కూడా తమ బానిసత్వాన్ని ఒక అలంకారంగా మార్చుకున్నారు. ఆ నల్లటి బిలంలో, ఆ అనంతమైన చీకటిలో, ధన్వంతరీ ఆచార్య తన సింహాసనం మీద కూర్చుని, తన కంప్యూటర్ స్క్రీన్ వంక చూస్తూ ఒక చల్లని చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వుతో ఒక దేశపు ఆత్మ శాశ్వతంగా సమాధి చేయబడింది. జెడ్ తర్వాత అక్షరం లేదు, ఆచార్య తర్వాత ఆశ లేదు. అంతా అల్టిమేట్! అంతా బ్లాక్ హోల్!
*








Fine story and the allegory is superb. An eye opener to one and all. Congratulations.