ఒక్క క్షణమూ ఒంటరికానివాడు!

అతడికి తెలుసు. ఎటైనా పారిపోదామంటే లోకమెల్లా ఖైదు కొట్టమే కదా.. అని. అతడు దేశాన్ని ప్రేమిస్తాడు కాని భక్తిగా తర్జుమా చేసుకోలేనని స్పష్టంగా చెప్పేస్తాడు.

అఫ్సర్–

నాకెపుడూ  అర్థం కాడు. ముప్పైఆరేళ్ల లోపే ఎన్నో జీవితాలను అనుభవించి, తిరుగుబాటులో అంతమైన సూఫీ బైరన్ లా.

సముద్రంపై పయనిద్దామని బయలుదేరిస్తాడు. నిదానంగా సాగిన సముద్రం అల్లకల్లోలమవుతుంది. పడవ అలల మధ్య తేలిపోతుంది. ఝంఝూమారుతం చుట్టుముడుతుంది. నీళ్లు భయంకరంగా శరీరాలపై దాడి చేస్తుంది. ఉన్నట్లుండి మృత్యువు చేరువలో ఉన్నదనిపిస్తుంది. ఏదోరకంగా ఇంటికివెళదాం.. అని సన్నగా ప్రాణభయంతో మూలుగుతాను. అతడు నన్నూ, నా భయాన్నీ గమనించడు. పడవ ఉయ్యాలలా ఊగుతుంటే, నీళ్లు పెడేలుమని తాకుతుంటే, నల్లటి మబ్బులు చుట్టూ ఆవరిస్తుంటే, గాలి హోరున చెవుల్ని బ్రద్దలు కొడుతుంటే అతడు దానికి ఆనందిస్తున్నట్లు కనిపిస్తాడు. అతడి పెదాలపై ఏదో చిరునవ్వు అంత భయంలోనూ నాకు కనిపిస్తుంది. తీరం ఎప్పుడు చేరుకుంటాం. అని అడుగుతాను.. తీరమ్మీద పెద్ద ఆసక్తి లేదు.. వొడ్డుకి చేరాలనే ఉండదు. అంటాడతను. ఆరితేరిన జాలరి కాబోలు!

అతడు ఏదైనా మాట్లాడతాడేమోనని చూస్తాను. కాని అతడి కళ్ల నిండా మాటలు.. ఏదో చెప్పాలనుకుని చెప్పలేక పెదాలపై చిరునవ్వు పులుముకుని సంభాషిస్తాడు పెదాలు బంధించి. ఇద్దరికీ మధ్య నిలబడిన మాటలన్నీ కుప్పకూలిపోతాయి ఇసక గుడుల్లా..

అవును అతడెపుడూ నాకు అర్థం కాడు.

అతడు నిలబడ్డ నేల ఎప్పుడూ కరుకే. పైకి కనబడే ఆకాశం అతడిది కాదు. రెండు ఆకాశాలు నీలివే. కాని మన ఊరి ఆకాశం వేరు. మరి ఊరి నేల వేరు. అది తొలిరక్తపు సెలయేటి నేల. అతడిపుడున్న నేలపై మాయమర్మాల పుప్పొడి రాలుతోంది. కాని మన నేలపై రేగిపళ్ల వాసనే వేరు. పరాయి క్షణాల్లో ఎన్ని చినుకులు కలిస్తే వాన అవుతుందో కూడా అతడికితెలీదు. తెల్లారు జామున వానలో తడుస్తూ అతడు పరుగెత్తుతాడు. ప్రపంచంలోకి.. ఉక్కిరి బిక్కిరి చేసే ప్రపంచంలోకి..

కాని…ఆమె లేకుండా అతడు లేడు. ‘రహస్యంగా మనం కలిశాం, నిశ్శబ్దంగా నేను కుమిలా…’ అన్న లార్డ్ బైరన్ అడుగడుగునా గుర్తుకువస్తాడు.

ప్రేమ స్తబ్దతను కోరదు. ముఖం తిప్పుకుని ఆమె  వెళ్లిపోయిందేమో. కాని అతడి గుండె గూడుపట్లలో ఎన్ని చలియుగాలు గడ్డకట్టుకుపోయాయో.. అతడికి ఆమె చేతుల వంతెన కావాలని ఆమెకు తెలిదా..  పసితనపు అలలాంటిదేదో ఇంకా కొంత ఉండిపోయిందేమో.. బంధించే ఇరుకుబావుల్లోంచి నిన్ను నీవు తోడుకువచ్చే మూడేళ్ల పసిపాప మాయతనం కావాలతడికి.  ఆమె  దూరంలోకి అతడూ, అతడి దగ్గరిలోకి ఆమే వచ్చి ఒకే ఒక్క అడుగు అవుతారా ఎప్పుడైనా.. ఆ చిన్ని పాదాల తడబాటులోకి వెళ్లి రాగలరా.. ఎప్పుడైనా..

పోయిన కల లాంటి నిజం వుండదు. పోయిన నిజంలోని పుప్పొడీ ఉండదు. కానీ అతడు ప్రతి ముఖమూ ఆమెదే అని అనుకుంటాడు. ఎప్పుడు బయటపడాలి.. అతడు తనను చుట్టుముట్టిన తెలియని ముఖాల, తెలియని చెట్ల, తెలియని ఆకాశాల, తెలియని గాయాల, కనిపించని కన్నీళ్ల నుంచి..

ఊరూ, ఏరూ దాటేసాడేమో.. కాని అతడిలోని అతడూ, అతడి లోపలి ఆమెనూ దాటుకు వెళ్లే దారి మాత్రం తెలియదు. ఆమెను తెంపుకుని అతడు ఎక్కడకూ వెళ్లలేడు. వెళ్లిపో.. ఒకే ఒక్క సూర్యుడిని అతడిలో వెలిగించి..

దూరంగా ఉన్నప్పుడే అతడి ఒంటిని అతడే తాకి తాకి. కొలుస్తూ ఉంటాడు. నీ జ్వరాన్ని..

ఆమె కళ్లలోంచి కొన్ని మేఘాల్ని ఎగరేస్తుంది. వెన్నెల బయలులో అతడిని ఒక నిండు వెన్నెల్లా పరిచి ఆ వెన్నెల్లో తనూఒక నీడలా ఆడుకుంటోంది. ఆమె వచ్చిన క్షణం ఒక్కటే అతడితో ఉంది. ఇంకా.. ఆమె వచ్చి వెళ్లిన క్షణపు దిగ్భ్రమను పట్టి బంధించిన సాయంత్రపు చివరి ఎండలో నిల్చొని ఉన్నాడు. ఆమె చుట్టూ తిరిగిన పిల్లగాలిని, సంధ్య వెలుగుని, ఆ గోధూళి పరిమళాన్నీ ఎటూ వెళ్లనివ్వకుండా..

ఒక అనిర్వచనీయమైన, కాంతివంతమైన ప్రేమలో ప్రశ్నలుండవు. గతాలూ, వర్తమానాల ధ్యాస ఉండదు. ఒక నిష్కామ యోగంలో ఆ అరక్షణంలో ఆ ఉనికే ఒక మెరుపై ఆమె కళ్లలో మేఘాల్ని ఎగరేస్తుంది. ఆమె వెళ్లిపోయినా అతడిలో ఉంది…

అతడు తనను తాను విధ్వంసం చేసుకుని ఆమెలో కలిసిపోయాడు. అదే ఫనా అంటే. ప్రేమతో ఐక్యత పొందడంతో ప్రారంభమై, ఒంటరి ప్రయాణంలో ప్రవేశించి, అంతిమంగా తననుంచి తాను దూరం చేసుకుని ఆమెలో భాగం కావడం. ఫనా…ఎన్ని దూరాలు కలిపితే ఒక అస్థిరబైరాగి అవుతాడో.. ఎన్ని తీరాలు గాయాలైసలిపితే ఒక నిర్లక్ష్య సూఫీనవుతాడో.. కాలాన్ని నిలువునా చీల్చిన తర్వాత నిజంగా పరమయోగిగా మారతాడో..

కీట్స్, షెల్లీ నుంచి బైరన్ వరకూ, నిజామీ గంజావీ,  ఫైజ్ అహ్మద్ ఫైజ్ నుంచీ అఫ్సర్ వరకూ ఇదే అనుభవించారు. తనను తాను శిథిలం చేసుకుని ఇతరుల స్థానంలో ఊహించగల శక్తి ప్రేమలోనే, మంచితనంలోనే సాధ్యం కాగలదని షెల్లీ అన్నాడు. తన గుర్తింపు కోల్పోగల సామర్థ్యం ఉండి ఇతరులకోసం తపించేవాడే నిజమైన కవి అని జాన్ కీట్స్ అభివర్ణించాడు. కవికి  తన స్వంత గుర్తింపు లేడు. ఇతరుల్లోనే అతడు జీవిస్తాడని ఆయన భావించాడు. సూఫీలు కూడా చేసేది అదే. ఇతరంతో ఐక్యతకోసం నిరంతరం అన్వేషించడమే వారి ప్రయాణం. ఈ క్రమంలో వారు తమను తాము పోగొట్టుకుంటారు.

విత్తనం ఎప్పుడూ నిర్వీర్యం కాదు, నేల ఉన్నంత కాలం కలలుంటాయి. నది ఉన్నంతకాలం పాదాలు తడుస్తాయి.  ఎడారి అయితేనేం అణువిస్ఫోటనానికైనా పనికి వస్తుంది. నిశ్శబ్దం శ్మశాన ప్రశాంతతకు చిహ్నం కాదు, ఉదయించబోయే ముందు ప్రపంచంలోతచ్చాడే చీకటికి సంకేతం.

అఫ్సర్ తనను తాను దేనిలో విలీనం చేసుకున్నాడు? మెట్టవేదాంతాలనూ, పలాయనవాదాలనూ, నిరాశా నిస్పృహల్నీ  అతడు దరిచేయనివ్వడని నాకు తెలుసు. తలకట్టులు, కొమ్ములు, దీర్ఘాల మధ్య తలదాచుకోడనీ నాకు తెలుసు.

ఎందుకంటే  అతడు గ్రహించాడు, కృత్తిమ నవ్వుల్నీ వంచనల్నీ.. నోరూ, చేయీ అనే రెండు దేశాల్నీ.. అతడు గ్రహించాడు జీవితం కంటే మరణం తేలికయిందని, తుపాకులు మాత్రమే సంభాషణలో ఉన్నాయని. చట్టరాహిత్యపుటడవిలో  పేరు తెలియని చెట్లకి వేలాడేసి ప్రాణాల్నని చివరంటా వేటాడవచ్చనని. అతడు గ్రహించాడు. మానవజాతి చరిత్ర సమస్తం హత్యచేయబడుతున్న హోరుని.

అతడి కాళ్ల క్రింద భూమి ఎప్పుడూ వణికిపోలేదు. మహా బలిదానాలే చేయనక్కర్లేదు. కాని కనీసం ఒక అర చుక్క కంట తడిని రాలిస్తే చాలునని.

అతడికి తెలుసు. ఎటైనా పారిపోదామంటే లోకమెల్లా ఖైదు కొట్టమే కదా.. అని. అతడు దేశాన్ని ప్రేమిస్తాడు కాని భక్తిగా తర్జుమా చేసుకోలేనని స్పష్టంగా చెప్పేస్తాడు.

వస్తువులకోసం పోయినవాళ్లు రోదిస్తారు. కాని పోయిన వాళ్లకోసం వస్తువులు రోదించడం అతడికి తెలుసు. తాగకుండా మిగిలిపోయిన చాయ్ క్షోభ అతడికి తెలుసు. చదవలేదని బాధపడుతూ తమను తాము చదువుకుంటున్న పుస్తకాల వేదన అతడికి తెలుసు.  ఆ దేహం తమలో ఇక దూరలేదని హ్యాంగర్లకు వేళ్లాడుతున్న చొక్కాలు, పాంట్ల బిక్కమొఖాల గురించి తెలుసు. చీకటి మొహంతో పడి ఉన్న సెల్, శరీరపు అన్ని భాషలు తెలిసిన కుర్చీ, ఒంటరి తలను కడుపులో దాచుకున్న టేబుల్, మణికట్టుని వదిలేసిన గడియారం, రాసుకున్న కలలూ, కలల్లాంటి పనులూ, అనాథ ఊహలూ అతడితో సంభాషిస్తాయి.

రోహిత్.. రెండు కలల మధ్య చావుని అల్లుకుంటూ పోయిన రోహిత్. చివరి పద్యాల ధిక్కారాన్ని వాక్యాలుగూ పేనుతూ వచ్చిన రోహిత్.. అతడి శరీరమంతా ఉరితాడై సలుపుతోంది..

హైదరాబాద్.. చార్మినార్ సూర్యుడికెదురుగా.. ఒక సీతాకోక చిలక ఆత్మహత్యకు ముందు విడిచి వెళ్లిన కోకల రంగులు రోడ్డుమీద మెరుస్తాయి. హైదరాబాద్ అతడి రూపాంతరం. కల లేని నిద్ర, నిద్రరాని కల. కునుకు కప్పుకున్న మెలకువ. ప్రశ్నిస్తాడతడు. రెండువందల తల్లుల పేగులు పెనవేసుకుంటున్న మానవ హారాలు.. ఎవరికెవరికి క్షమాపణ చెప్పాలి? రెండువందల ఖూనీలకు మాఫీ ఏదీ అని.. వొళ్లు కూడా చిమిడిపోయిన అన్నం వాసనేస్తుంది..

అవును. అతడికి అన్నీ తెలుసు. చావులూ, ఆకలిచావులూ కూడా. కన్నీళ్లూ, వాటి చివర జీవన్మరణాల అనుక్షణికాల తాడుకు వేళ్లాడే బతుకుదప్పికల గురించీ, కణ కణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాల గురించి..  రోజ్ రోటీ అతడి అద్దం. దాంట్లోంచి రాస్తాడు అతడొక కొత్త చరిత్ర.

ఎయిర్ పోర్టుల్లో ప్రతి ముస్లిం పాడుకునే ఆత్మ శోక గీతం అతడిలో ప్రతిధ్వనిస్తుంది. నమ్మరా.. నమ్మరా.. నేను మంచిబాలుడిని రా.. కాగితం తుపాకి చూపినా మూర్చబోయే అమాయకుడినిరా.. ఆవారాని రా.. పాగల్ గాణ్ణిరా.. నన్ను చంపి పాతరేసినా నా శవాన్ని ఎవ్వరూ మాదే మాదే అని పరిగెత్తుకురారురా..

అతడు ఒక్కక్షణం కూడా నేనొక్కణ్ణే.. అని గావుకేకవేయలేడు. దేన్నీ ప్రేమించలేడు. దేన్నీ విడిచిపెట్టలేడు. కప్పుకున్న ముసుగుల్ని ద్వేషిస్తూ ఇంకేం రాస్తాం బే కవిత్వం అనుకోకుండా ఉండలేడు.

ఏ నగరమైనా ఎవరికినా ఇల్లవుతుందా.. అని శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ లో ఓ అర్థరాత్రి ప్రశ్నిస్తాడతడు. అక్కడ కూడా బంగారు వన్నె సూరీడు మనకంటరాని వాడే.. ఎప్పటికీ..

అతడికి దాచుకోవడం తెలియదు. ఎక్కడ దాచుకోవాలో తెలియక అల్లకల్లోలమవుతాడు. లోపలి ప్రళయమే దాచుకున్నప్పుడు కల్లోలం ఒక నీటి చుక్కే కదా.. సముద్రాన్ని కాయితం చేసి నలిపి ఒక మూల విసిరేయాలనుకుంటాడు అసహనంగా.. లేత పదాల పద్యమే..

ఒక రాత్రి అందరూ నిద్రపోయాక అతడు లేచి కూర్చుంటాడు. ఏ చితిమీదికో దూకి చావుతో సహగమించడానికి కాదు. సాంబ్రాణి పొగయై ఆమెను ఆవరించడానికి. ఆమె ఏకాకి నిద్రలో కలై సంచరించడానికి.. అతడు తాత్వికుడు కాడు, ప్రేమికుడు. అతడు నది ఒంటిమీద వెల్లకిలా పడుకుని పరిగెత్తే ఆకాశం లాంటి వాడు. తన చుక్కల్ని తానే లెక్కపెట్టుకుని అలసిపోయే వాడు, నిలిచిపోయేవాడు.

కోటి శంబూక వధల తర్వాత నీ తీర్పరితనమెందుకు.. నీ కనిపించని హింసల కుట్రల యుద్దానికి ప్రేక్షకుడిని కాలేడు. అతడు ఖాయంగా.. అతడికి తెలుసు. అతడి దేశ భక్తిని నీవు ద్వేషంతో కొలుస్తావని.. అతడిని ప్రేమిస్తూ ఉండమని నీవు ద్వేషిస్తూ ఉంటావని, అతడి చుట్టూ గాలిని ఖైదు చేస్తావని.

నీకు పద్యం ఒక భద్రగదికావచ్చు. అతడికి నిప్పుల చేతుల నెగడు. నీకు మంచుముక్కలో నున్నటి లోకం కనిపించవచ్చు. అతడు అదే మంచుముక్కలో గడ్డకట్టిన ఆకలి రాత్రుల్ని, చూపుని దడికట్టిన ఇనప ఊచల్ని చూస్తాడు.

గుహలోకి చూపు మడిచి అదొక్కటే దిక్కు అనుకుంటున్నావు నీవు. అతడు ఏడు ఆకాశాల నాలుగుదిక్కుల మూడు లోకాల చౌరాస్తా..

సరిహద్దుల్నీ, సముద్రాల్ని దాటి, విశ్వకవిత్వాన్ని, కవిత్వంలో సూఫీయిజాన్ని ఔపోసన పట్టి నిరంతరం అస్థిరంగా ఉన్నా అఫ్సర్ అనే ఒక విశ్వకవి మనవాడు అనుకోవడం గర్వంగా ఉంటుంది. ఎందుకంటే అతడు తనను తాను వదిలించుకుని తన కవిత్వంలో విలీనమైనా అందులో ఆమె ఆడే తొక్కుడుబిళ్లాటలూ ఉన్నాయి. ఇంతేనటే సంద్రమింతేనటే అని ప్రశ్నించే ఎంకిపాటలూ ఉన్నాయి. రేగిపళ్లూ ఉన్నాయి… చెవిచుట్టు ఊగే జూకాలు, సాంబ్రాణులూ, మెరిసి మాయమైన పాదాలపారాణులూ,,అన్నపు మెతుకులూ.. ఆకలి కేకలూ ఉన్నాయి.

అతడు గొంతులోకి గుండెని వొంపి, వొంపి పాడుతూ పాడుతూ.. షంషాద్ వెళ్లిపోతే, అతడు అక్షరాల్లోకి ప్రాణమంతా ధారపోస్తూ వెళ్లిపోతాడు.

వుండనా మరి.. అతడు అంటే బాధపడాల్సింది అతడు కాదు, మనం. అతడు ఇంకా రాయలేదే.. అని గుండెని పిండుకోవాల్సింది మనం.

అఫ్సర్, నీవు ఎక్కడున్నా ఇంటివైపు చూడాల్సిందే. నీవు చూసినప్పుడల్లా రెండు చేతులూ చాచి ఆహ్వానిస్తూ నేను కనపడతాను హత్తుకోవడానికి..

*

 

 

కృష్ణుడు

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజంగా మాట మౌనమై స్థితి,ఏదైతే అఫ్సర్ గారి కవిత్వం చదివిన తరువాత లోపల తిరుగుతూ లోకానికి దూరం చేస్తుందో,అదే స్థితి ఇది చదివిన తరువాత!!అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు