ఒకడుంటాడు

The smarter you are, the more selective you become.

–  Nikola Tesla

నాలుగు బ్యాగ్రౌండ్లు ఇస్తా మీకు. నేనూ నా హీరోయినూ మాట్లాడుకుంటున్నప్పుడల్లా వాటిలో ఏదో ఒకటి మీరే సీన్లో వేసుకోండి, మాటిమాటికీ మమ్మల్ని డిస్టబ్ చేయకుండా! అసలే ఆ పిల్ల షార్టుసర్క్యూటయిన మదరుబోర్డులా మండిపడుతూ ఉంటుంది. షార్టు స్కర్టులు టైట్ షర్టులూ వేసుకునే పిల్లనే ప్రేమిద్దామని డిసైడైపోయి ఓ రోజు రోడ్డుమీద అడ్డంగా ఈ పంజాబీ డ్రస్సుకి దొరికిపోయా. అడ్డదిడ్డంగా బైకు నడుపుతున్న ఎవడో అడ్డమైన వెధవని తప్పించుకోవటానికి ఈవిడగారి కారుకి నా కారు అడ్డం పెట్టాల్సి వచ్చింది. అంత ట్రెండీగా ఉన్న కార్లో ఫ్రెండ్లీగా ఉండే వాళ్లుంటారనుకున్నాను కిలోమీటరు ముందు చూసినపుడు. ఈ హాట్ గాళ్ ఇంత హాట్ టెంపర్డ్ అని కల్లో కూడా అనుకోలేదు. ఏం కళ్లండీ అవి!! మామూలు కళ్లా, కాదు. కార్బురెటర్ కళ్లు! మండటానికి ముందు పెట్రోలునీ గాలినీ చక్కగా కలిపినట్టు, పేలటానికి ముందు జెలాటిన్నునీ, ఆర్డీఎక్సునీ గిలక్కొట్టినట్టు భావాలన్నిటినీ కలిపి ఎదుటివాణ్ని ఒక్క చూపుతో చంపి రెండు కళ్లతో కాల్చిపారేస్తుంది. సడన్ బ్రేకేసి కారునాపాను గాని లేకపోతే నాకు డబుల్ డెత్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యుండేది.

ఇది ఫస్ట్ బ్యాగ్రౌండ్. రెండోది కాఫీ షాపు, మూడోది ఫైవ్ స్టార్ హోటల్ ఇరవయ్యో అంతస్తు స్కై లౌంజ్, నాలుగోది ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. సర్లే, ఇంకా చెప్పటానికి నాకు టైం లేదు. పిల్లది కారు దిగి గగ్గోలు పెట్టేస్తోంది –

“బంపర్ లగ్ గయా ! బానెట్ ఉడ్ గయా!!”

దాన్లో బంపర్, బానెట్ తప్ప నాకింకేమన్నా అర్థమైతేగా. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న నాకు ఈవిడగారి మాటలు తెలుగులా అనిపించలేదు! ‘సారీ’ అన్నాను సర్వప్రపంచ భాషలో. కూనది కన్విన్స్ అయినట్టు లేదు. ఇంతలోకి ట్రాఫిక్ పోలీస్ వచ్చి మమ్మల్ని ఎవరి దారిన వారిని పొమ్మన్నాడు. మేడమ్ కాకినాడ కాజాలో పంచదార పాకంలా జిడ్డుదిలా ఉంది. నా వాలెట్లో ఉన్న రెండు రెండువేల రూపాయల నోట్లూ ఆవిడగారి పర్సులోకి వెళ్లేదాకా కారు తియ్యనంటే తియ్యనని తియ్యగా అంటుకుంది.

లాఘవంగా బైకుని తిప్పుతున్న గ్రే షర్టు బ్యూటీ ఎటో వెళ్లిపోయాడు. అబ్బ, టర్నింగ్లో అదాటున వచ్చిన కాలేజీ బస్సుని ఎంత సునాయాసంగా దాటేశాడు! లక్డికాపూల్ సెంటర్లో వరుసగా ఉండే నాలుగు మాన్ హోల్స్ ని ‘s’ వేస్తూ చకచకా చుట్టేశాడు. నా కార్ దగ్గరగా వచ్చాడు. నల్ల అద్దాలున్న హెల్మెట్ వెనుక ముఖం కనిపించలేదు కాని బాడీ బానే ఉంది. ఇరుకైన గేటు ఊచల్లోంచి మెల్లిగా జారుకునే పిల్లిలా రెండు కార్ల మధ్యనుంచి ఎలా రెప్పపాటులో వెళ్లిపోయాడో. ఒక మనిషి డ్రైవింగ్ స్కిల్ ని బట్టి అతని మనస్తత్వం తెలుసుకోవచ్చని ఎక్కడో చదివాను. ఇతను జీవితంలో ఎదురైన సమస్యల్ని రోడ్డు మీద ఎదురైన స్పీడు బ్రేకర్లు తప్పించినట్టు తప్పిస్తాడని అర్థం చేసుకున్నాను. ఇతన్ని పెళ్లిచేసుకుంటే లైఫ్ సుఖంగా గడిచిపోతుంది. ఇలాంటి నా ఆరాధనాభావనా పారవశ్యంలో సడన్ బ్రేక్ వేశానే అనుకో. ఈ కారుగాడు ఎందుకు ఆగాలి? ఉత్తర గోగ్రహణం చేసిన గ్రెగరీ వాషింగ్టన్లా ఆ చూపులూ వాడూనూ. హైదరాబాదులో డ్రైవ్ చేయటం కిలిమంజారో పర్వతం ఎక్కినంత తేలిక అనుకుంటున్నట్టున్నాడు. నా రోషపు బుసలకి వాడి కారు ఏసీ పగిలిపోను! నా ఉక్రోషపు సెగలకి వాడి మాడు వేడెక్కిపోను! వెర్రిముఖం వేసుకు చూస్తాడేంటి? నేను చెప్పేది అర్థం కాలేదా లేక బోడి బిల్డప్పా. మెత్తటివాడు అనుకుంటా. కాస్త మొడితే నష్టపరిహారం ఇచ్చేలాగున్నాడు. స్పానిష్ లో తిట్టి వెళ్ళిపోయాడు.

కాలింగ్ బెల్లు టింగు టింగుమని మోగుతూనే ఉంది. ఇంత అసహనంగా ఉండేది ఖచ్చితంగా నా కూతురే. తలుపు తోసుకొచ్చి చెప్పులు గడప దగ్గర ఒకటి, సోఫా దగ్గర ఇంకోటి విడిచింది. క్రాస్ బాడీ స్లింగ్ బ్యాగ్ తీసి దూరంగా పడేసింది. అంటే, ఈ సంబంధం కూడా ఔటే అన్నమాట! రుసరుసలాడుతూ నాకు సీన్ బై సీన్ చూపించింది –

“ఇంటికి వెళ్ళగానే ఎవరైనా కుశల ప్రశ్నలు వేస్తారు కదా? ఆవిడేమో, ‘ఏమ్మా, ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చావ్. ఫోన్లో ఛార్జింగ్ ఉందా’ అని అడిగింది. ఆ ఆప్యాయతకి నా కింది పెదవి అదురుతూ ఉంటే ‘మొహమాట పడతావేమ్మా. ఇది నీ ఇల్లే అనుకో’ అని చొరవగా నా చేతిలోని ఫోన్ తీసుకెళ్లి చార్జింగులో పెట్టింది.”

కాఫీరంగు పట్టుచీరలో ఓ మిడిలేజ్డ్ బాబ్ కట్ ని ఊహించుకుంటూ “ఎంత మంచావిడ చిన్నూ!” అన్నాను.

విసుగులో విసుర్లలో వాళ్ల అబ్బ తల్లోంచి లేచొచ్చింది నా కూతురు. పైజమా విప్పి లుంగ చుట్టి కాలితో తొక్కుతూ చెప్పింది –

“తొక్కలో మంచితనం. ఆ పెళ్లికొడుకు వెధవ ఏదో పనుండి అర్జెంటుగా ఆఫీసుకి వెళ్లి ఏడ్చాడుట. ఆవిడతో బాటు ఎవరెవరో చుట్టాలున్నారు. అందరూ అందరే. వేస్ట్  ఫెలోస్. నన్ను… నన్ను…. పెళ్ళిచూపుల కొచ్చిన అమ్మాయిని…. నామీద కొంచెమైనా ఆపేక్ష చూపించారా? ఉపేక్షించారు! గది చుట్టూ పరిచిన సోఫాల్లో కూర్చుని ఎవరి మొబైల్లో వాళ్లు మునిగిపోయారు. నా మొహాన ఓ టీవీ పడేశారు. మంచినీళ్లు కాఫీ లాంటివి పోస్తూ పనమ్మాయే కాస్త మంచీ చెడూ అడిగింది. భోజనాల దగ్గరా అంతే. తింటూ మాట్లాడకూడదని బస్టాపులో బస్సుకోసం ఎదురుచూసే ప్రయాణికుల్లా ఒకే వైపు తల తిప్పి టీవీ చూస్తూ కూర్చున్నారు. పనమ్మాయి, నేను కళ్లతోనే సైగలు చేసుకుంటూ పని కానిచ్చాం. ఆ అమ్మాయి వంటల కోసం తప్ప ఇంత ముష్టి ఫ్యామిలీలోకి నేను వెళ్లను.”

“నువ్వు వెళ్తానన్నా నేను పంపించను” అన్నాను మంచినీళ్లు అందిస్తూ.

‘పరిచయం పెంచుకుందాం’ అంటూ ఫోన్లో అంత ఇదిగా మాట్లాడినావిడ నిజంగా ఇంకెంత ఇదిగా ఉంటుందో అనే నమ్మకంతో పిల్లని ఒక్కదాన్ని పంపించాను. ఫోన్లో మాత్రమే ఇదిగా ఉంటుందనుకోలేదు. నిట్టూర్చాను.

చిన్నూకి మంచి- మర్యాద, వంట- వార్పు, ఓర్పు- నేర్పు ఇవేవీ తెలియవు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. కలుపుగోలు పిల్లే కాని మూడ్సు ఎక్కువ. ఇష్టమైతే మాట్లాడుతుంది, లేకపోతే లేదు. అంత త్వరగా ఏదీ ఇష్టపడదు. ఒకసారి ఇష్టపడితే మరింక వదలదు. దీనికి పెళ్లి చేయడం నా వల్లనవుతుందో లేదో. అదొక్కటే నా బాధ్యతల్లో మిగిలింది. ఆడపిల్లకి సొంత వ్యక్తిత్వం ఏర్పడాలన్న ఆయన ఆశయాలకు తగినట్లుగానే పెంచాము. చిటికెలో ఎదిగిపోయింది. ఇరవై ఎనిమిదేళ్లకే రెండో డాక్టరేటు చేస్తోంది. భాషల పట్ల మమకారం. సంస్కృతుల పిచ్చి. రెండు మూడు పత్రికలకి సంపాదకురాలు. సంపాదనపరురాలేమో కూడా. డబ్బువిషయాల్లో చాలా నిక్కచ్చి. దేన్నైనా నిలదీసి వంగదీసి లాగదీసి కూలంకషంగా పరిశీలించిగాని అభిప్రాయం చెప్పదు. ఎడిటింగ్ అంటే బియ్యంలో రాళ్లేరడమే అంటుంది. ఎన్ని సంబంధాలు చూసినా వెతికి వల వేసి ఏదో లోపం పట్టుకుంటుంది. ఇది నా కడుపున పుట్టిందేనా అని అప్పుడప్పుడూ నాకే డౌటు తెప్పిస్తూ ఉంటుంది. నాకంటే ఎన్నో రెట్లు సాధికారత, చాదస్తం సాధించింది.

వంట చేస్తూ ఇదే ఆలోచిస్తున్నాను. కాలం ఏమీ మారలేదు అని ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. దాదాపు వందేళ్ళ కిందటి మాట. తాతయ్య అమ్మమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఊరివాళ్ళు పంచాయతీ పెట్టారట అప్పట్లో. చివరికి ‘కోడలిగా ఈ పిల్ల రావచ్చు గానీ పుట్టింటితో తెగతెంపులు చేసుకోవాల’ని తీర్పు ఇచ్చారుట. అమ్మమ్మ తరఫు బంధువులు ఎవరో ఏమిటో మా అమ్మకే తెలియదు.

పెళ్లంటే మనుషుల్ని కలుపుకోవడం, దర్జాగా కుటుంబాన్ని ఏలుకోవడం, ఉన్నంతలో సంసారాన్ని నడుపుకోవడం. మా పెళ్లయ్యాక నలుగురు మరుదులు, ఆడపడుచు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పల్లెటూరినుంచి మాతో ఉండటానికి వచ్చారు. నేనేనాడూ కాదనలేదు. అందరం సరదాగానే ఉండేవాళ్ళం. వాళ్ళ చదువులు పెళ్లిళ్లు అన్నీ మేమే చేశాము. ‘పెద్ద కోడలు ఎంతో చక్కగా కలిసిపోయింది’ అనుకునేవాళ్లు అత్తా మామా. మాది ఎంత పెద్ద కుటుంబం! హుఁ, ఇప్పుడిలా ఇదీ నేనూ ఇద్దరమే బిక్కుబిక్కుమంటూ. దీనికి పెళ్లి చేస్తే మళ్ళీ ఇల్లు కళకళలాడుతుంది….

“కంచంలో కెలికింది చాల్లే. ఇక తిను.”

“మాట కాస్త సౌమ్యంగా రానీ చిన్నూ” ఎంతో సౌమ్యంగా చెప్పాను. “మాటే మంత్రము, మనసే బంధము అని సినీకవి చెప్పారు.”

“మమత సమత ఉంటేనే మంగళవాద్యాలు మోగుతాయి. అమ్మా, ఇది జీవితం! కల్యాణం బాగుంటేనే కమనీయంగా ఉంటుంది” అంది నవ్వుతూ.

ఆ నవ్వు ఆయనదే. బుగ్గ మీద సొట్ట ఆయనదే. ఆ అతితెలివి కూడా ఆయనదే. నా పాయింట్ బానే క్యాచ్ చేసింది.

“అందుకే త్వరగా ఏదో ఒక సంబంధం ఒప్పేసుకో. వయసు పెరిగే కొద్దీ….”

“తలపొగరు కూడా పెరుగుతుంది అంటావు. అంతేగా !”

“అదే వద్దు. నోటి దురుసు తగ్గించుకోవాలి.”

“తుక్కు సంబంధాల వాళ్ళని చూస్తే చెడామడా దులిపెయ్యాలనిపిస్తుందమ్మా. వాళ్లేమో నోటికొచ్చిన పనికిమాలిన ప్రశ్నలన్నీ వేయచ్చు, నేను ఒక్క మెడికల్ రిపోర్ట్ అడిగితే మాత్రం తప్పా?”

దీనికి సమాధానం నా దగ్గర లేదు. ఏమి పెంపకాలో ఏమి సంస్కారాలో. కులం గోత్రం దగ్గరే ఆగిపోతున్న సంబంధాలు హెచ్ఐవీ హెపటైటిస్ రిపోర్టుల దాకా వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుందని నా ఆదుర్దా.  మొదట్లో ఆది సోమ మంగళ అని వారాల పేర్లు పెట్టాను సంబంధాలకి. తరువాత ఇంగ్లీషు నెలలు, తెలుగు నెలలు, మూలకాల పట్టిక, క్రమంగా కొండవీటి చాంతాడు. ఇప్పటికి నాలుగు వేల సంబంధాలు అయినాయి. ఫోటోలు, వ్యక్తులు, కుటుంబాలు, కులగోత్రాలు, లావాదేవీలు, జాతకాలు అన్నీ చూశాము. కొన్ని సంబంధాలు మమ్మల్ని కాదనుకున్నారు. ఎక్కువ ఇది కాదన్నవే ఉన్నాయి. ఒకటో రెండో నేను వద్దులే అన్నాను.

తనకు భర్తలో కావల్సిన అరవై ఆరు లక్షణాలతో ఒక లిస్టు రాసింది చిన్నూ. అందులో కనీసం మొదటి ముప్ఫై మూడన్నా కలవాలిట. ప్రతి పెళ్లిచూపులయ్యాక ఆ లిస్టు ముందేసుకుని టిక్కులు కొట్టుకోవటం, దానికి మళ్ళీ విశ్లేషణ, మర్నాటికో రెండ్రోజులకో వాళ్ళకి కుదరదని ఫోన్లు చేయించటానికి నన్ను బతిమిలాడటం. ప్చ్… మంచి కుర్రాడు, మంచి ఫ్యామిలీ ఇంత రేర్ కమోడిటీలని ఊహించలేదు!

“నిజమే. నీలాంటి మణిని, రత్నాన్ని, వజ్రాన్ని, ముత్యాన్ని ఎవడో ఔలాగాడి కివ్వను” అన్నాను బుగ్గమీద ముద్దాడుతూ.

“‘నా అల్లుడు హౌలేగాడు’ అని చెప్పుకునే అదృష్టం నీకు జన్మజన్మలకీ లేదని తెలిసి అమిత దిగ్భ్రాంతినీ, ప్రగాఢ సంతాపాన్నీ తెలియజేస్తున్నాను” అంది తీవ్రంగా.

 

డ ముందుకు వేసుకుని చిట్లిన వెంట్రుకలు తెంపుకుంటూ కూర్చున్నాను, నా ముందున్న ‘కురు’వృద్ధుడిని ఇంకా కుళ్ళించాలని. అరగంట నుంచి వీడి న్యూజిలాండ్ ఓవర్ ఏక్షన్ భరించలేక పోతున్నా. కాఫీ తాగేలోగా వదిలించుకుందామని ట్రై చేశాను. లంచ్ టైము కదా, ఏమన్నా తిందాం అన్నాడు. నూడిల్సుని ఫోర్కుకి చుట్టి కాకుండా పొడవుగా వేలాడేసి కత్తెరతో కత్తిరించుకుని తినాలా ఏంటి, అలా మిర్రి మిర్రి చూసి చస్తాడు?!

“చూడండీ, అలా చూడకండి. సలాడ్ లో క్యాబేజీని, పిట్జా మీద చీజ్ ని, పాయసంలో సేమ్యాని ఇలాగే బారుగా జుర్రుకోవాలి” అని చెప్పాను కూడ.

“ఇహిహి హెహిహీ” అని పచ్చగా ఇకిలించాడు.

నా వీకెండుకి ఇంతకన్నా గతి లేదు. ఇంటికి పిలిచి ప్రతి ఒక్కడికీ మర్యాదలు చేసి వాళ్ళు వెళ్ళాక ప్లేట్లల్లో సగం కతికేసి వదిలేసిన మెత్తబడిన మిక్చర్ పలుకుల్ని చెత్తబుట్టలో పడేయటం నా కష్టార్జితాన్ని చెత్తపాలు చేయటమే కదా.

“డస్ట్ బిన్ అని పిలిచినా, ట్రాష్ క్యాన్ అన్నా రెండిట్లోను వేసేది చెత్తే.”

“ఏంటి? అర్థం కాలేదు మళ్ళీ చెప్పు” అన్నాడు వెర్రిమొహం వేసుకుని.

అంతే. This is it !

“You are rejected. బిల్లు కట్టెయ్యి” అని లేచి వచ్చేశాను.

పరిచయమై పట్టుమని పది నిముషాలు కాలేదు, అప్పుడే నన్ను ఏకవచనంలో సంబోధించిన వాడితో ఇంకా నాకు మాటలేంటి? అసలు ముడ్డికిందకి ముప్ఫై ఐదు ఏళ్ళొచ్చి ఇంకా ‘నా పెళ్లి మా అమ్మ ఇష్టం, నాకు తగ్గ ఉద్యోగం ఇండియాలో లేదు, మా నాన్నగారు జాతకాలు కలిస్తేనే ఆపైన మాట్లాడదాం అంటున్నారు, భార్యలో కోరుకునేది ప్రత్యేకంగా ఏమీ లేదు…. పెళ్లి అయితే చాలు’ లాంటి లఫూట్ ఆలోచనలు ఉండే పెళ్లికొడుకులంతా చెత్త. చెత్త… చెత్త….! ఇంత చెత్త స్టాకులోంచి భాగస్వామిని ఏరుకోవాలా? Disgusting. Frustrating. ఇండియా ఎంత పెద్ద పేద దేశం! ‘మన జన్మభూమి…. బంగారుభూమి….’ పాటను వెల్ష్ లో ఎలా పాడాలబ్బా! ఏమోలే. నిజంగా తల్చుకుంటే, తన కాళ్ళ మీద తాను నిలబడే వ్యక్తిత్వం గలవాడైతే ఇండియాలో వ్యాపారమో ఉద్యోగమో చేయలేడా? వేరే దేశం వెళితేనే గొప్ప అనే దిక్కుమాలిన అవిటి ఐడియాలు మన జనానికి ఎప్పుడు వదిలిపోతాయో. ప్రభూ! ఆ ఉషోదయంలోకి నన్ను త్వరగా మేల్కొలుపు.

ఆరు అంతస్తులు దిగి సెల్లార్లోకి వెళ్లాను. పార్కింగులో ఉన్న వాహనాలను చూస్తే కళ్లు తిరిగాయి. గుంపులు గుంపులుగా పుట్టలో చీమల్లా జనం. నిజంగా వీళ్లంతా జీవితాన్ని అనుభవించటానికే వచ్చారా? జీవితమంటే తినటం తిరగటమేనా? మరి వీళ్లలా కులాసాగా లేక పెళ్లి కిళ్లీ అనే లొల్లితో అమ్మా నేనూ తలలు వేడెక్కించుకుని ఎడమొహం పెడమొహం పెట్టుకుని సాయంకాలానికి ఒకరికి ఒకరం కొబ్బరినూనెతో చంపీ చేసుకుని సంధికి వస్తున్నాం. అలా వారాలు, వారాంతాలూ గడిచిపోతున్నాయి తప్ప సెలెక్టెడ్ లిస్ట్ అంటూ తయారు కావటం లేదు.

 

లేత పసుపు బట్టల్లో బటర్ స్కాచ్ కేక్ లాగా ఉన్నావని ఈ చెర్రీ తెచ్చాను”

వేడివేడి పెనం మీద చిట్టి పొట్టి ఆవగింజలా చిటపటలాడుతోంది మా మేడమ్. ఏమనుకుందో ఏమో గులాబీని తీసుకుంది. పార్కింగులో కారు ఇరుక్కుపోయి చురుక్కు చురుక్కుమని చూస్తోంది. తాళం అనాలో తాళంచెవి అనాలో తెలీక చెయ్యి చాచాను. బానే అర్థంచేసుకుందే! కారు తీసిచ్చాను. థాంక్స్ చెబుతుందని ఊహిస్తున్న నాకు కలుక్కున ఓ జోల్ట్ తగిలింది.

“You can arrange things. Can you arrange feelings?”

అమాయకుణ్ణి చేసి ఇలా అదాటున నెత్తిన బండలేస్తావేం తల్లీ? ఏమడిగిందో అర్థంకాక నీళ్లు నమిలాను.

“చెర్రీ కేక్ మధ్యలోనే ఉంటుంది” అంటూ గులాబీని నడినెత్తిమీద పెట్టుకుంది.

పన్నా సెటైరా? ఏంటీ పిల్ల? ఆలోచనలు బయటికి చెప్పేస్తుందా? లేదా ఆలోచించకుండా మాట్లాడేస్తుందా? Either way, she seems fun to be with. ఆ లేతకళ్ల లోకంలోకి లోతుగా తొంగి చూడాలనిపించింది. జహాఁపనా, నాకేమిటీ పరీక్ష? తిక్కగా చూశాననుకుంటా, సరదాపడింది.

“హః హః హః”

“విసర్గల్లో నవ్వకు.”

“హహ్హహహ్హహహ్హ.”

సెల్లార్లో చీకటి పోయి పట్టపగలయింది. ఆ అబ్బురాల దీప హాసవిలాస వికాసంలో మైమరచి నేనూ నవ్వాను. అంతలోనే –

“జీవితాన్ని రుచి చూడాలి. దేవుణ్ని అనుభవించాలి” అంది సీరియస్సుగా. అమావాస్య అర్ధరాత్రి ఊరంతా కరెంటు పోయినట్టయింది.

“ఒక్క సెంటెన్సయినా అర్థమయేట్టు మాట్లాడు” అని తల పట్టుకున్నాను.

కనుబొమలు దగ్గరికి చేసి- ఏమంటారబ్బా దాన్ని? ఆఁ, భృకుటి ముడివేసి (శభాష్ బేటా, నీ తెలుగు బాగా ఇంప్రూవయింది! ) నావంక చూసింది.

 

చూపులు చిగిర్చే కాలం

“హ్యానకో” అన్నాను అప్రయత్నంగా.

నడిచే దారుల్లో మత్తు జల్లుకుంటూ వెళుతుంది. రాకెట్ వెళ్లిపోయాక పొగ మిగిలినట్టు తను వెళ్ళాక పారవశ్యం మిగులుతుంది.

 

కూరగాయల సంచీతో కాళ్లీడ్చుకుంటూ మెట్లెక్కుతున్న నాకు నా కూతురు ‘నీకు వెయ్యిసార్లు చెప్పాను’ అంటూ ఖంగుఖంగున పేలుస్తున్న తూటాలు వినిపించాయి. ఇస్త్రీ అబ్బాయికి చున్నీలు నిలువుగా ఎలా చలువ చెయ్యాలో వివరంగా చెబుతోంది. ఆ అబ్బాయి ‘మూడు తరాల మా వంశ చరిత్రలో…..’ అంటూ ఏదో చెప్పబోయాడు కాని రోడ్డురోలరుకింద కంకర్రాయిలా నా కూతురి గదమాయింపు ముందు వాడి ఆమ్యామ్యా వాలకం నుగ్గునుగ్గు అయిపోయింది. దీనికి పెళ్లెలా అవుతుందో నాకర్థం కావటం లేదు. దొరికిన ప్రతివాడికీ ఇలా క్లాసు పీక్కోడదమ్మా అని చెబుతూనే ఉంటాను. అప్పుడప్పుడూ ఎవరూ లేకుండా చూసి నన్ను కూడా ఝాడించి పారేస్తుంటుంది.

ఆయాసంతో “చిన్నూ! ఏంటి విషయం?” అని అడిగాను.

“చూడమ్మా, చంటి నాకు కావలసినట్టు కాకుండా ముందులాగే చేసుకొచ్చాడు” ఫిర్యాదు చేసింది.

నీరసంగా ఉన్న పసిపిల్లాడు కుయ్ కుయ్ మన్నట్టు వాడేదో అనేలోపే చిన్నూ ఆ కోపం నామీదకి ట్రాన్సఫర్ చేసింది- “నీకు లక్షసార్లు చెప్పాను, మెయింటెనెన్సు కడుతున్నప్పుడు లిఫ్ట్ వాడుకోమని. ఆ వాచ్మాన్ మొహంగాడు ఎక్కడ ఏడిచాడు? పెద్దావిడ ఇంత బరువేసుకుని వస్తుంటే గాడిదలు కాస్తున్నాడా?”

జవాబుగా నేనిచ్చిన కూరగాయల సంచీని అందుకోకుండా “ఇంత దూరం తెచ్చావుగా, ఇంట్లోకి తేలేవా?” అంటూ నేను లోపలికి రాగానే ఇస్త్రీ అబ్బాయి ముఖమ్మీదే ఠకీమని తలుపేసింది.

“ఏంటి నీ అంకపొంకాలు? ఆడపిల్లలకు నాటు డైలాగులు, నాగార్జున డైలాగులు సూట్ కావని కోటిసార్లు చెప్పాను. నేనే వ్యాయామం కోసం మెట్లెక్కాను. ప్రతిదానికీ అనవసర రాద్ధాంతం చేయకు. ఇంతకీ వెళ్లిన పని కాయా పండా?”

“పండు కాదు, గుండు. గుమ్మడికాయంత గుండు!”

ఓహో అదా సంగతి. పని తుస్సయిందని ఇలా కసపిసలతో కసి తీర్చుకుంటోందనమాట.

“పోనీలే. మొన్న ఆ మ్యారేజ్ బ్యూరో ఆవిడ పంపిన సగం గొరిగిన గడ్డమబ్బాయి బానే ఉన్నాడుగా స్టయిలుగా! ”

“అమ్మా అది సగం గొరిగింది కాదు, వాడికి పెరిగిందే అంత! అయినా ఆ అబ్బాయి మలయాళం మాట్టాడితే మూతి ముప్ఫైమూడు వంకర్లు పోతోంది. నాకోసం ఎదురుచూస్తూ ముక్కులో పొక్కులు గిల్లుకున్నాడు. అది నేను గమనించానని తెలుసుకోకుండా అదే చేత్తో షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. అప్పుడు నాకు మన నమస్తే విలువేంటో తెలిసిందమ్మా తెలిసింది.”

 

హ్యానకో… హ్యానకో….

హ్యానకో అంటే ఏమిటి? తెలుగులో హ్యానకోతో ప్రాస కలిసే తిట్టు గుర్తొచ్చి నిన్నటినుండి తన్నుకులాడుతున్నా. ఆఁ దొరికింది! గూగులమ్మా థాంక్సమ్మా. జాపనీస్ భాషలో హ్యానకో అంటే పూలమ్మాయి అని అర్థం. ఓహో! అయితే పొగిడాడనమాట. ఏదో ఉంది వీడిలో- కరిష్మానో చరిష్మానో. కరిజ్మా కరెక్ట్ కదా. I know.  కడుపులోంచి అదేదో తన్నుకొస్తోంది. Yeah, gut instinct! Nothing can go wrong with this guy అనిపిస్తోంది. కానీ ఇండియన్ కాదు కదా, అమ్మ ఒప్పుకుంటుందా? అసలు వాడు ఒప్పుకుంటాడా? పేరు కూడా తెలీదు!

 

నేను. నా పక్కన బిగించి కట్టిన పకోడీ పొట్లంలా తను. ఆమె పూలెత్తే చెట్టు. నేను ఆ పూలు ఏరుకునే వాణ్ని. హ్యానకోని చూస్తే చాలు- ఇంతవరకూ చెప్పకుండా ఉండిపోయిన ఎన్నో మాటల్ని వెతికి వెతికి వెలికి పలికి తెలపాలని….. ఏమిటో ఈ ఆత్రం ఈ తాపత్రయం!

“నీ పేరేంటి?”

“హైటెక్ సిటీకి వచ్చి అంతర్జాతీయ సమైక్యతకి నిలువుటద్దంగా ఉండే అబ్బాయని అడుగు. ఎవరైనా చెప్తారు.”

మహా చెప్పావులే అన్నట్టు కనుబొమలు పైకి లేపి “నువ్వు చెప్పవా?” అంది.

 

కన్నుల్లో వెన్నెలకాలం

కొంటెపిల్ల! ఆ కళ్ళు చూస్తే నోట మాట రావట్లేదు. తాడుబాంబుల లడీ పేలుతున్నట్టు గుండెల్లో సందళ్లు.

“ఇండికేటర్ వేసినా తల తిప్పినా ఒకటే.”

“నువ్వేం చెబుతావో అర్థమే కాదు” అన్నాను తల విదిలిస్తూ.

“హైద్రాబాదులో డ్రైవింగ్ గురించి చెప్పాను. ఇందాకట్నుంచి మన వెనకాల కారువాడు నువ్వెటు వెళ్తావో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు.”

“ప్రేమ మొలకెత్తిన నేలలో పంట కూడా ప్రేమే. నేల కూడా ప్రేమే.”

“ఆఁ ఏంటి?” నీక్కూడా అసందర్భ ప్రేలాపన చేయటం వచ్చా అన్నట్టు విడ్డూరంగా చూసింది.

“అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.”

 

నాకు ఐరిష్ కాఫీ ఆర్డర్ ఇచ్చాను. రాత్రిపూట కాఫీ తాగకూడదని నేను కాఫీ తాగుతున్నంత సేపూ లెక్చర్ ఇచ్చాడు- తను కొబ్బరినీళ్లు తాగుతూ. నాకంత సహనం ఉందని నాకే తెలీదు. టాపిక్ మారుద్దామని-

“నీకిష్టమైన రంగు ఏమిటి?” అని అడిగాను.

కాసేపు బుగ్గన వేలు పెట్టుకున్నాడు. బుర్ర గోక్కున్నాడు. కాలిమీద కాలు వేశాడు, తీశాడు. టేబుల్ మీద దరువేశాడు. టిష్యూ పేపర్ తో చేతులు తుడుచుకున్నాడు. క్రీ.శ.3019కి కూడా జవాబు ఇచ్చేట్టు లేడు. వీడికి స్ప్రింగ్ లూజయిందా ఏంటి అని నేను కంగారు పడేంతలో… –

“ఇష్టమైన రంగు ఒకటంటూ ఉండదు. వెలుతురుని బట్టి చర్మపురంగుని బట్టి సందర్భాన్ని బట్టి వేసుకున్న వాళ్ళ ఆసక్తిని బట్టి డ్రెస్సు మోడల్ని బట్టి రంగు నచ్చడం ఉంటుంది. నువ్వు వేసుకునే బట్టల్లో నీకు నప్పే రంగులు నాకిష్టం. అట్లానే నేను వేసుకునే బట్టల్లో, వాడుకునే వస్తువుల్లో నాకు నప్పేవి నాకిష్టం.”

వామ్మో వామ్మో బుర్ర తినకురా బాబు. గ్రీనో బ్లూనో ఏదో ఏక పద ఉత్తరం ఆశించి పొరపాటున అడిగాను. ఇంకెప్పుడూ అడగను, వదిలేయరా నాయనా.

భయమేసింది. ఒక చిన్న ప్రశ్నకి ఇంత లాజిక్కు లేవనెత్తాడు నాలాగే. ఈ దెబ్బతో ఎదుటివాళ్ళు నన్ను పిచ్చమొహంది అనుకుంటారని బాగా అర్థమైంది.

బిల్లు కట్టేసి “నీ సింగిడీలకి నా మంగిడీలు” అనే అర్థం వచ్చేలా రష్యన్లో ముచ్చటపడ్డాడు. నా బుగ్గలకి గులాబీ రంగు ఇష్టమైంది.

 

పాతీలు గుండ్రంగా చేయటం ఎలాగో నాకు విడమరిచి చెప్తుంటే, అడిగాను –

“ఆ అబ్బాయికి ఘంటసాల అంటే ఇష్టం అని ప్రొఫైల్లో రాశాడు కదా. ఘంటసాలలాంటి మధురమైన గొంతేనా? ఎంచక్కా డ్యూయెట్లు పాడుకోవచ్చు ఇద్దరూ!”

“అగజా ఆఆఆఆఆనన పద్మార్కం అని ఆయన పాడితే వీడు కూడా అలానే పాడాడు. ఒరిజినాలిటీ లేదు” పిండిముద్ద పళ్ళేనికి పిడకలా కొట్టింది.

ఇలా ప్రతి అబ్బాయిలోను ఏదో వంక పెట్టకుండా వదలదు. పొరలు పొరలుగా పీకేస్తే ఏమీ మిగలదని, ఉల్లిపాయని ఉల్లిపాయలాగే చూడాలని వీలైనప్పుడల్లా చెబుతూనే ఉన్నాను. వినదు. ఇది గయ్యాళిగంప.

“అమ్మమ్మవాళ్ళ చుట్టాల తరఫునుంచి నాకు వదిన వరసయ్యే ఆవిడ ఏదో సంబంధం ఉందని మొన్న మార్కెట్లో కలిసినప్పుడు చెప్పింది. నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను.”

“ఆవిడే అనుకుంటా, ఇవాళ బోర్డు మీటింగులో ఉన్నప్పుడు కాల్చేసింది. హలో అనగానే మీరేవట్లు అనడిగింది. ఒళ్ళు మండి బొబ్బట్లు అని చెప్పి పెట్టేశా” బంగాళాదుంపని కంటికి కనిపించనంత చిన్న చిన్న ముక్కలుగా తరుగుతూ చెప్పింది.

“సెక్రటేరియట్లో ఎవరో పరిచయమయ్యారన్నావ్?”

“అవును. చూట్టానికి బానే ఉన్నాడు. తను ఒక్క చిటికె వేస్తే చాలు, పనులు అయిపోతాయి అని చెప్పాడు.”

“మంచి పలుకుబడి ఉన్నవాడిలా అనిపిస్తున్నాడే.”

“నాకు నచ్చలేదు.”

“ఏం పాపం జేసుకున్నాడు?”

“పెద్ద విలన్ లాగా నా మొహాన చిటికెలు వేశాడు.”

 

మ్, బేబీ! వాట్ ఈజ్ యువర్ హాబీ ?”

తన ప్రాస రోగం నాక్కూడా అంటుకుంది.

“రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్, లిజనింగ్ టు మ్యూజిక్” ఇంటర్వ్యూల్లో చెప్పినట్టే చెప్పింది.

“వాట్ ఈజ్ యువర్ ఫేవరేట్ కలర్ ?”

అవాక్కయినట్టు చూసి “మనమేమన్నా టీనేజీలో ఉన్న పడుచు పిల్లలమా? ఈ నాన్సెన్స్ వదిలేసి సీరియస్సుగా ఏమైనా అడుగు” అంది విసుగ్గా మొహం పెట్టి.

“If an airplane is flying at an altitude where the actual pressure and temperature are 4.72 × 104N/sq m and 255.7K respectively, calculate the pressure, temperature and density altitudes. You can use lapse rate α as −6.5K/km” అని తనవంక సీరియస్సుగా చూస్తూ జేబులోంచి పెన్ను, టేబుల్ మీదున్న టిష్యూ పేపరూ ఇచ్చాను కాలిక్యులేషన్ చేయటానికి.

 

చూపుల్లో ఎండాకాలం.

ఈ కాస్తకే అంత కినుకా? మాటలకడలి అడుగంటిపోయినట్టు కూర్చున్నాం. హ్యానకో అలక కట్టెపొంగలిలో మిరియంలాంటిది. అయినా, ఇంత మూడ్సు మనిషిని ఎప్పుడూ చూడలేదు. ఎదలో ఏదో ప్రేమగీతం మోగుతోంది. కాసేపటికి తన గొంతులో సన్నగా అదే పాట. హమ్మయ్య!

“ఏయ్ కూనిరాగాలు?”

వెంటనే పలికింది- “ఏంటి?”

“పేరుతో పిలిస్తే పలకవేం?”

“జీవితాంతం ఉండే పేరేగా. ఇంటిపేరయినా మారట్లేదు” అల్లరిగా చూసింది.

హమ్మ! కొట్టింది దెబ్బ. Excuse me! ప్రపోజ్ చేసిందా?

నీ పదాల అల్లిక కవితైతే…

నా పెదాల కదలిక పాటైతే….

అంటూ ఏవేవో గొణుగుతూ గుల్మొహర్ నీడలో గాలిబ్ లాగా గజళ్లేరుకున్నాను.

 

పిట్జా ఆర్డర్ చేశాక పొదిగిన కోడల్లే కుర్చీలో అలాగే కూర్చున్నాడు. వెస్టరన్ టాయిలెట్లోకెళ్లి కాళ్లు కడుక్కొచ్చే మొహమూ వాడూనూ. కుదమట్టసంగా, నా ఆరడుగుల కలల రాకుమారుడికి రెండు అడుగుల పొడవున కాళ్ళు కోసేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. ఐదూ ఏడున్న నా పక్కన అతన్ని చూస్తే విమానం పక్కన ఆటోని పెట్టినట్టు ఉంటుంది. నా అమెరికన్ హీరోకి మంచి హైటూ, హెడ్ వెయిటూ ఉన్నాయి. వాడితో పోలిస్తే ఈ తోడుపెళ్ళికొడుక్కి పాసు మార్కులు కూడా రావు. పాసు రావచ్చు. ప్రాస నచ్చలేదా? నా మనసులో అనుకునేదానికి మీ ఎడిటింగ్ ఏమిటి? కావాలంటే ఈ లైను అయ్యేవరకూ కళ్ళు మూసుకొని చదువుకోండి.

“మా ఇంట్లో మడి ఉంది, మంతెండూ ఉంది.”

ముందు అర్థం కాలేదు. ఆ తరువాత ఆటోలోంచి మాటలు వస్తున్నాయని గ్రహించి తల దించి రీప్లే బటన్ నొక్కాను. అర్థమయ్యాక నా మొహం కందిపోయిందేమో మరి.

“నాకైతే మీరు ఇష్టమే. మీ చేయి పట్టి నా జీవితంలోకి స్వాగతించటానికి నేను సిద్ధంగా ఉన్నాను.”

“కానీ, ప్రతి మంతెండూ బయట కూర్చోవటానికి నేను సిద్ధంగా లేను.”

 

“నమస్కారం!”

ప్రేమికురాలితో హాయ్ అని కూయక నమస్తే అంటాడేంటి? అయినా ఎలా తెలుసుకుంటాడో ఏంటో – చూడాలనుకున్నప్పుడల్లా ప్రత్యక్షమవుతాడు?!!!?

“ఎవరు నువ్వు?” అని చిరాకు నటించాను.

“నేను నీ నిట్టూర్పుల సెగని.”

“జక్యూజిలో వేడి ఆవిరివేం కాదు?!”

“నువ్వు నా తల మీద ఐస్ బ్యాగ్ వి. ఏసీ గాలివి. నా మనసులోకి చల్లగా దూరావు.”

“దూరటమేమిటి దరిద్రంగా- ఎలుక కన్నంలోకి దూరినట్టు” ముఖం మటమటలాడించాను.

“మళ్ళీ పెళ్ళిచూపులు. ప్చ్… ఈసారీ కాండీ‘డేటు’ నచ్చలేదా? What a pity! ప్చ్… ప్చ్….” ఎగతాళిగా నవ్వాడు. “For today, I am your Serendipity.”

మాటిమాటికీ గిల్లే మొటిమలాగా వీడికి కూడా కొవ్వెక్కువ కాబోలు. పుండుమీద కారం చల్లటానికి రెడీగా ఉంటాడు.

 

కోపం రోషం ఆక్రోశం ఉక్రోషం పౌరుషం – anything else I forgot, include that too – అన్నీ ఒకేసారి వచ్చాయి. తన ముఖంలో ఎప్పుడూ ఫీలింగ్సుని అందం డామినేట్ చేస్తూ ఉంటుంది. కాని ఇప్పుడు –

 

కన్నుల్లో ఆకురాలు కాలం

కాలం దారపు కొసలని పట్టి దేని తర్వాత ఏది ఎలా జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నించాను. పుస్తకం చిరిగిపోయి అక్షరాలు ఒలికిపోయినట్టు హ్యానకో ఫీలింగ్స్ అన్నీ బయటపడిపోయాయి. ప్రేమ కోసం వెతికే పిచ్చిపిల్ల. అది దొరకదు. తను ప్రయత్నం ఆపదు. ఒకడుంటాడు అంటుంది. జీవితమంటే గమ్యం కాదని, ప్రయాణమని చెప్పాను. గిరగిర తిరిగే బంతికి ప్రేమ అంటదని, ఒకచోట నిలకడగా ఉండమని చెప్పాను. చెప్పీ చెప్పీ నిస్సత్తువొచ్చి నీరసమొచ్చి నిద్రొచ్చి నాలో ప్రేమని వెతుక్కోమనేశాను. అంతా విని నవ్వింది.

ఆ నవ్వు చూసి – “అమ్మ రాకాసీ! కుళ్లబొడిచావు కదే” అన్నాను చైనీస్ లో.

 

వాళేంటి నా కూతురు చేవచచ్చిన హిట్లర్లా కూర్చుంది? చిన్నూకి చిన్నప్పటి నుంచి మలబద్ధకం. రోజూ మోషనే రాదు, ఇంకా ఎమోషన్ కూడానా? అయినా మనసు మబ్బులో పట్టనన్ని కన్నీళ్లు లేవనుకుంటా. ఇంకా కురవలేదు. గట్టిదే. కాసేపు నేనూ గట్టిగా ఉంటే తనే వచ్చి చెప్తుంది. నిశ్శబ్దంగా పని మొత్తం పూర్తి చేసి అన్నానికి పిలిచాను. ఏ వంకలూ పెట్టకుండా మౌనంగా తినేసి దాని గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిగా ఆశ్చర్యపోయాను. విషయమేదో సీరియస్సే.

రాత్రి పదకొండవుతుండగా ఐ మెసేజ్ పెట్టింది –

“పావురాలు గుంపులుగా ఎగురుతుంటే చూడటానికి బాగుంటుంది కదాని పెంచుకుంటే రెట్టలు ఎవరు తుడుస్తారో కూడా ఆలోచించాలి.”

అది చెప్పింది అర్థం కాలేదు కాని కరెక్టే అయుంటుంది అనిపించింది.

“నేను ఒక అమెరికా అబ్బాయిని డేట్ చేస్తున్నాను.”

షాకులివ్వడంలో కూడా ఇది ఆయన పోలికే. వంకాయ జడల నుంచి బాబ్ కట్ వరకు, బట్ట నుంచి కప్ వరకు, స్కూల్ క్రష్ నుంచి కాలేజీ బ్లష్ వరకు, మాక్ టెయిల్ నుంచి కాక్ టెయిల్ వరకు అది తీసుకున్న అతి వ్యక్తిగత నిర్ణయాలు ప్రతి ఒక్కటీ నాకు చెప్పే చేసింది. కాని ఈ పిల్లాడి గురించి ఎప్పుడూ చెప్పలేదే! ఎన్నాళ్ళనుంచీ జరుగుతోంది ఈ బాగోతం అని అడుగుదామనుకుని చివరి నిముషంలో డిలీట్ చేసి –

“ఓకే” అని టైపు చేశాను.

“సారీ మామ్. నీకు చెప్పలేదు. మూడు నెలల నుంచీ పరిచయం. ఓ పేరు మోసిన అమెరికన్ కంపెనీకి చెందిన ఇండియా ఆఫీస్ బరువు బాధ్యతలు మోస్తున్నాడు. మంచివాడు.”

“అతను మంచివాడైతే కావచ్చు. డేటింగ్ అనేది అంత మంచిది కాదు.”

“డేటింగ్ మనం అనుకునేంత చెడ్డదీ కాదు.”

“ఏమోనమ్మా. వయసొచ్చిన ఆడపిల్లవి. అన్నీ తెలిసినదానివి. నీ జాగ్రత్తలో నువ్వుండు. కన్నతల్లిగా చెబుతున్నా- మీద చెయ్యి కూడా వెయ్యనివ్వకు.”

“సరే” అని ఒక స్మైలీ పెట్టింది.

“మరి ఆ ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ ఓనర్- బ్యాంకు మేనేజరుగా చేస్తున్నాడని చెప్పానే, అతనికి నో చెప్పమంటావా?”

“అమ్మా! ఇంట్లో గదులుంటే సరిపోదు. వాతావరణం ఉండాలి.”

ఈసారి అది చెప్పింది నాకర్థమైంది. దాని మనసు ఆ అమెరికా అబ్బాయి మీద ఉంది. చేతులు కాలకముందే దాని చేతిని ఎవరో ఒకడి చేతిలో పెట్టాలని నా తొందర. ఆ అమెరికావాడు నిజంగా దీన్ని ఇష్టపడితే, పెళ్లి చేసుకుంటే, అంతకన్నా ఏమి కావాలి?

(నిజం చెప్పద్దూ, అంతకన్నా కావల్సింది ఇంకోటి ఉందని నాకు అప్పటికి తెలీనే తెలీదు సుమండీ!)

 

వానని మోసుకొచ్చే గాలిలాగా చలచల్లగా హాయిహాయిగా నడిచొస్తుంది చలాకీ పిల్ల. ముగ్గులో గొబ్బిళ్లు పెట్టినట్టు, పాతచీర మీద వడియాలు పెట్టినట్టు నా మనసులో వాసంతాలు పెట్టుకుంటూ పోయింది.

“ఆ నింగిని వంచి.. నెలవంకని తుంచి…..”

“ఆ తర్వాత చీకట్లో కూర్చుని కబుర్లాడుకోవాలా? ఎప్పుడూ డిస్ట్రక్టివ్ థాట్సే!” అంటూ మూతి విరిచేసింది. హు. ఎక్కడో అమెరికాలో పుట్టి జర్మనీలో పెరిగి కెనడాలో తిరిగి జపాన్లో వ్యాపారం చేసి ఇటలీలో ఇల్లు కొనుక్కుని ఇండియా వచ్చి హైద్రాబాదులో స్థిరపడి తెలుగు నేర్చుకుని ఆ తెలుగుని ఓ తెలుగమ్మాయిని ప్రేమించడంలో వాడుతున్నానన్న కనికరం కాస్తైనా ఉందా? రాతి రాక్షసి. కళ్లు మూసుకొని ఆ పరవశమొకటి.

“చిక్కటి మజ్జిగలో తేలాడే వెన్న ఉండలాగా వెన్నెల వెల్లువై కురుస్తున్నప్పుడు……” అంటూ మొదలుపెట్టింది మహాతల్లి. తనకి లైటుంటే ఇష్టమనమాట.

“నీ వెన్నెలా వద్దు, వన్నెలూ వద్దు. నే పోతున్నా.”

“మాడిపోయిన నీ మూడ్ వెనకాలే వెళ్తున్నావా?”

“ఇమ్మిడియెట్ టెక్సస్ ప్రాజెక్ట్.”

బాగా అయింది. లేకపోతే నా మూడ్ చెడగొడుతుందా? వన్ సెకండ్. వన్ సెకండ్. అమ్మగారు పీవీనరసింహారావు మూతి పెట్టింది. ఇక సెల్ఫీ తియ్యందే స్టిల్లు మార్చదు.

“వెళ్లరా వెళ్లు. నన్నొదిలి ఎన్నాళ్లుంటావో అదీ చూస్తా”

“నిన్ను వదలటమెందుకు? పెళ్లికి వెళ్తూ చంకలో పిల్లిని పెట్టుకొని వెళ్లమన్నారుగా.”

“పిల్లిని పట్టుకెళ్లమన్లా. వదలమన్నారు”

“పిల్లినైతే వదలచ్చు. పిల్లనైతే?” అంటూ ఓరగా చూశాను.

 

చూపుల్లో చలికాలం.

కోల్డ్ రియాక్షన్. ఈ పిల్లతో రొమాన్స్ కష్టమేరా బాబూ.

 

“పిల్లని పెళ్లి చేసుకుని వెళ్లమన్నారు” అంది సీరియస్గా (అదే…, గంభీరంగా).

“అబ్బబ్బ, ఎన్నిసార్లు చెప్పాను, పెళ్లి మాట ఎత్తొద్దని? నేనేమీ మోసగాడిని కాదు. బలాదూరుగా తిరిగేవాణ్ణీ కాదు. పరస్పరం నమ్మకం లేనప్పుడు పెళ్లి చేసుకున్నా పెటాకులు చేసుకున్నా ఒకటే!”

ఊరికే పెళ్ళీ పెళ్ళీ అని సతాయిస్తుంది. తనతో గిరగిరా తిరిగే బంతి విషయం మాట్లాడిన రోజే నాతో ఉండటానికి వచ్చెయ్యమన్నాను. ససేమిరా అంది. లివ్ ఇన్ కోసం మూవ్ ఇన్ అవనంది. ప్రేమించాను కదా, మా మహారాణీగారి మాటే చెల్లాలి కదా అని నేనూ ఒప్పుకున్నాను. ఇష్టపడ్డ ఇద్దరు వ్యక్తుల్ని దూరంగా ఉంచే సమాజపు కట్టుబాట్లు ఇవ్వేమి కట్టుబాట్లు? పెళ్లి చేసుకోవాలిట. ఏదైనా అంటే Law of the Land అంటుంది.

“మరైతే ఎన్నాళ్ళు డేటింగ్ చేద్దాం?”

“ఎన్నాళ్ళు అంటే ఏమి చెప్పగలను? Relationships are dynamic.”

“అంటే, ఇక నీకు నాకు ఎనభై మూడో తొంభై ఏడో ఏళ్లు వచ్చేవరకు ఇలానే ఉంటామా?”

“ఏమో నాకేమి తెలుసు? నేనేమన్నా జ్యోతిష్కుడినా, భవిష్యత్తు చెప్పటానికి?”

తన కళ్ళలో భయం చూశాను. ఆ భయం వెనక నామీద ప్రేమ చూశాను. తను మొదటిసారిగా నా కళ్ళలో మోసం, దుర్మార్గం, వంచన, వాంఛ – anything else I forgot, include that too – చూసిందనుకుంటా.

 

సలు మా ఇద్దరిమధ్యా గొడవ వచ్చిందే సెక్స్ విషయంలో.

పెళ్లికిముందు తప్పు కదా? కాదుట. అన్ని విషయాల్లో కంపాటిబిలిటీ చెక్ చేసుకున్నట్టు దీన్లో కూడా చెక్ చేసుకోవాలట. హౌ రిడిక్యులస్!

“తప్పేముంది? నేను నీకు, నువ్వు నాకు సరిపోతామో లేదో చూసుకోవద్దా?”

“అక్కర్లేదు. ప్రేముంటే చాలు, మిగతావన్నీ సర్దుకుంటాయి!”

“స్టీరియోటైప్. నీలాంటి ఆధునిక భావాలున్న యువతి ఇలాంటి చద్ది కబుర్లు చెప్పటం సరికాదు. Sex is sex.”

“కాదు. Sex is a complex emotion.”

“Sure. మరి నీ ఎమోషనల్  కోషన్ట్ లో సెక్స్ స్కోర్ ఎంతో చూసుకోవద్దా?”

“…..”

“జీవితం చాల సింపుల్ హ్యానకో! నువ్వే అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నావు. నీకిష్టం, నాకిష్టం. అలాంటప్పుడు ఎందుకీ కష్టం? కాళ్ళూ వేళ్ళూ తాకించుకుని తృప్తి పడటం నాకు కుదరని పని. ‘మోడరన్’ అంటే గిరి గీసుకుని కూర్చోవటం కాదు. నచ్చినట్టు ఉండటం. నచ్చినవాళ్లతో ఉండటం. అయినా మనమేమీ చిన్నపిల్లలం కాదుగా. ఇంకా ఎందుకు నీకు సందేహం? అందంతో తిక్కతో ఛంపుతున్నావ్!!”

మోస్తున్న మోహాలు చాలక వీడొకడు నా ప్రాణానికి. ఎదురుగా ఉరుముతాడు, కల్లో తరుముతాడు. నా దాహం విరహం తీర్చే స్నేహం కావాలి. కాని అది పెళ్లి తర్వాతే కావాలి. వాడు చెప్తోంది నాకు అర్థమవుతోంది. కాని నన్ను ప్రేమిస్తున్నాడా కామిస్తున్నాడా అర్థం కావట్లేదు. ఎటూ నిర్ణయించుకోలేక సతమతమవుతున్నాను. స్కైలౌంజ్ లో మేమిద్దరమే మిగిలాం. మేమెప్పుడు వెళ్తామా, ఎప్పుడు దుకాణం కట్టేసుకుందామా అని ఏకాకి వెయిటరు నిద్రమొహంతో దోమలు కొట్టుకుంటున్నాడు.

“నడుమ్మీద చెయ్యి తియ్యి.”

“మల్లెతీగవంటి నీ ఒంటిని లేలిహానమునై అంటుకోనా!”

“నీ తెలుగు ముదిరింది.”

“నీ పిచ్చి కూడా.”

ఫ్రెంచిలో ముద్దు పెట్టాడు. నెట్టేద్దామని ఫిక్సయినదాన్ని దగ్గరికి లాక్కున్నాను.

నా పట్టులోని గట్టిదనం గమనించినట్టున్నాడు. నవ్వుతూ నా కళ్లలోకి చూసి “పద, ఇంటికెళ్దాం” అన్నాడు.

నాకు సిగ్గు ముంచుకొచ్చి నన్ను ముంచి అతని తోడుందని గమనించి నన్ను విడిచి మంచిదనిపించుకుంది. కాలం కౌగిలింతలుగా కరిగిపోయింది.

దూరం తీరం తెలియని స్నేహం-

ఆదీ అంతం లేనీ మోహం-

ఏదీ లేని ఏకాంతం-

మా సొంతం.

తీపిమూటలు కట్టిన అనుభూతి అనుభవమై తృప్తిపరాకాష్ఠకు చేరుకుంది. తను మోసం చేసేవాడు కాదని తెలిసినా అడిగాను –

“పెళ్లెప్పుడు చేసుకుందాం?”

“పెళ్లి అవసరమా? మీ ఇండియన్ సిస్టమ్ ప్రకారమే చూసినా, ఒక భాగస్వామికి కట్టుబడటం కోసమే వివాహవ్యవస్థను ఏర్పరచారు. మనం ఒకరికొకరం కట్టుబడే ఉంటాం. ఆ నమ్మకం నాకుంది. నేనయితే ఉంటాను. నీకు కావాలంటే వేరే సంబంధాలను చూసుకో. ప్రేమ స్వేచ్ఛనిస్తుంది.”

అదిరిపడ్డాను. ఏమంటున్నాడు? నేను ‘పెళ్లి’ అనే పేరుతో పిలిచే బంధాన్ని తను ఏ పేరుతోనూ పిలవట్లేదు. మరి ప్రేమిస్తున్నాడని నమ్మవచ్చా? కావాలంటే వెళ్ళిపో అంటున్నాడు. అదే నా భయం. పెళ్లి ఈ భయంనుంచి దూరంగా ఉంచుతుందని నా నమ్మకం.

“నీతో గడిపింది వేరేవాళ్లని పెళ్లి చేసుకోవటానికి కాదు.”

“I know. నువ్వు వెళ్లవు. వెళ్ళలేవు. కాని నీకు ఆ స్వేచ్ఛ ఉందని గమనించు. ఇద్దరు మనుషుల్ని కలిపేది ప్రేమే. పెళ్లి కాదు. ప్రేమించుకున్నాం. మనకి ఆ ప్రేమ చాలు కదా.”

“చాలదు. ప్రేమకు గుర్తింపు పెళ్ళితోటే వస్తుంది. మన ప్రేమను ప్రపంచం గుర్తించాలన్నది నా కోరిక.”

“సమాజంకోసం బతుకుతున్నావా?”

“నాకోసం నేనే బతుకుతున్నాను. కాని చట్టపరమైన గుర్తింపు కావాలి. సమాజం భార్యకిచ్చే విలువ ప్రియురాలికిచ్చే దానికంటే ఖచ్చితంగా ఎక్కువ. భార్య భర్త అనే బంధం ఒక విశ్వాసాన్ని ఇస్తుంది. అది నేను అనుభవించాలి. నాకు పిల్లలు కావాలి. వారికి ఒక సక్రమమైన కుటుంబాన్ని ఇవ్వాలి.”

“il matrimonio non è tutto” అంటూ ఇటాలియన్లో గొణిగాడు.

 

ఇప్పుడు అమెరికా వెళ్తే తిరిగి వస్తాడా? ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏమిటి? వెతలు కలిసిన గాలులు వీచి, దిగులు కమ్మిన మబ్బులు ముసిరి, కన్నీటి చీకటిని మిగిల్చాయి.

 

సలు మా ఇద్దరి మధ్యా గొడవ వచ్చిందే డబ్బు విషయంలో.

ఈవిడగారికి కమిటయ్యాక ఏమి చెప్పమంటారు నా కష్టాలు? రాను రాను ప్రశ్నలు పెరిగిపోయాయి. ఆర్ధర్ ఆరోన్ అని ఎవరో సైకాలజిస్టుట. ‘ప్రేమలో బద్ధకించకూడదు’ అని చెప్పిన మహానుభావుడట. కాబోయే భార్యాభర్తలకి పరస్పర అవగాహన పెంచటానికి ముప్ఫై ఆరు ప్రశ్నలు చెప్పాడుట. సమయం సందర్భం లేకుండా అవన్నీ నన్నడిగి చావగొడుతుందండీ. ఎప్పుడు మాట్లాడినా ఏది మాట్లాడినా అటు తిప్పి ఇటు తిప్పి ఆవు వ్యాసంలాగా ‘నీ జీతమెంత? నీ సంపాదనెంత?’ అనే ప్రశ్నతో పొడుస్తూ ఉంటుంది. అలా అని డైరెక్టుగా అడగదు. మా మేడమ్ గారి అతితెలివి మీకు తెలిసిందే కదా. మొన్నొక రోజు ముద్దు పెడుతున్నా. వ్హొ పెనుగులాడింది.

“ఏంటి?”

“చెర్రీస్ తినాలంటే చెప్పు, ఫ్రిజ్జులో ఉన్నాయి. లిప్ స్టిక్ మాత్రం తినకు. ఇది సిగ్నేచర్ సిరీస్. నీ ఒక నెల జీతం పెట్టినా ఇవి వంద కూడా రావు.”

ఉష్. లిప్ స్టిక్ ని మెచ్చుకుందా? నన్ను తక్కువ అంచనా వేస్తోందా? ఏమండీ, మనలో మన మాట – డబ్బుతో చెల్లుబాటయ్యే వ్యక్తిత్వమా అండీ నాది? My Queen knows this. అయినా అడుగుతుంది. మొదట్లో తెలీక బాగా తగవులాడేవాణ్ణి.

“నేనెంత సంపాదిస్తే నీకెందుకు? నీకెంత కావాలో ఎప్పుడంటే అప్పుడు చెప్పు. ఇస్తాను. పండగ చేస్కో.”

“ఆఁ, అది కాదు. సాధారణంగా సంపాదన బట్టే ఎంత గౌరవించాలో నిర్ణయిస్తుంటారు.”

బొంబోడి థియరీ. మనిషిని మనిషిలాగా గౌరవించడం మాత్రమే నాకు తెలుసు.

“నా సంపాదన బట్టి నన్ను ప్రేమిస్తావా హ్యానకో?” ఆశ్చర్యంగా అడిగాను.

“ఛ! అలా కాదు. మా గర్ల్స్ గ్రూపులో వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ గురించి అందరూ చాల గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేనెప్పుడూ చెప్పనని కావాలని ఈ విషయాన్నే కెలుకుతుంటారు. ‘నాకు తెలిస్తేగా చెప్పటానికి’ అన్నా అబద్ధం చెబుతున్నానుకుంటారు.”

“ఈసారి అడిగితే ‘నా హీరో చాలా సమర్థుడు, నన్ను అల్లారుముద్దుగా చూసుకుంటాడు’ అని చెప్పు.”

“అయినా ఎవరేమనుకుంటే నాకెందుకులే. మరీ….ఇప్పుడు నేను ఇంత కావాలీ అన్నాననుకో, అది నీకు చాలా చిన్నమొత్తమనుకో, నా గురించి తక్కువగా అనుకుంటావు కదా?” అంది అమాయకంగా రెప్పలు కొడుతూ.

“అలా ఏమీ అనుకోను. అవసరాన్నిబట్టి అడిగావు అనుకుంటాను. నువ్వు ఎంత పొదుపుగా ఉంటావో కదా అనుకుంటాను.”

“ఒకవేళ నేను అడిగేది నీకు ఎక్కువమొత్తం అనుకో…. అప్పుడు?”

“అప్పుడు రిక్షా తొక్కి… సారీ, కాలం మారింది కదూ! క్యాబులు నడిపి అయినా సరే, నీకెంత కావాలో అంతా ఇస్తాను.”

“నా డబ్బులు నువ్వెప్పుడూ అడక్కూడదు.”

“మహాతల్లీ, నీ డబ్బులతో నాకేమీ పని లేదు. ఇంకీ విషయం వదిల్తే భూగోళంలా వేడెక్కిన నా బుర్రని కాస్త షవర్ కింద పెట్టుకుంటాను. దయ తలుచు.”

పోనీ ఇలా అని ఊరుకుంటుందా? బిల్స్ పంచుకుందాం అంటుంది. వెయిటర్ రాగానే ‘ఇక్కడ ఇక్కడ’ అంటుంది. నెలకిందట పానీపూరివాడు పేటీఎమ్ తీసుకోనన్నాడు. నాదగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పినా, ఏటిఎంకి పరుగెత్తుకెళ్లి పావుగంట తర్వాత వచ్చింది. ఈలోపు నేను అతనిదగ్గర ఉన్న అన్ని వెరైటీలు ట్రై చేశాననుకోండి, అది వేరే విషయం. క్రేజీ గర్ల్!!

 

కూతురి పెళ్లి అయిందన్న ఆనందంలోంచి తేరుకోకముందే “ఆశీర్వదించండి అట్టగారూ” అన్నాడు ఒకింత హుందాగా, దర్పంగా, ధీమాగా పంచె సర్దుకుంటూ వచ్చి.

గతుక్కుమన్నాను. అట్టగారా? నేను సరిగానే విన్నానా?

నా బెదురుని ఆశ్చర్యంగా భావించి “నేను పలికేది కరెక్టే కదా!? మదరిన్లా అని కొడితే గూగుల్ ఎ టి టి ఎ జి ఎ ఆర్యూ అని చూపించింది.”

“అలాగా అల్లుడుగారు!” అన్నాను ఏడవలేక నవ్వుతూ. ఇంకా నయం నా కూతురుగానీ ఇది వినుంటే ఇంగ్లిష్ టి హాజ్ త్రీ సౌండ్స్ అని మొదలు పెట్టేది.

“మీరు పెట్టిన ఈ డ్రెస్ చాలా బాగుంది. మీ అమ్మాయిని కూడా ఇంత విలువైనదిగానే చూసుకుంటాను. మీరు ఏమీ దిగులు పడకండి. నేను అన్ని ఏర్పాట్లు చేసి మీకు కబురు చేస్తాను. మా ఆవిడతో బాటు మీరు కూడా వచ్చేయండి. మనవళ్లతో ఆడుకుంటూ అక్కడే హాయిగా ఉండచ్చు.”

ఓరి నీ స్పీడు అదర ! అట్ట అంటే అన్నావు, ఆవిడా? తలతిప్పి చూశాను. నడుములు పడిపోయేలా అందరికీ వంగి వంగి దణ్ణాలు పెడుతూ నవ్వుతోంది చిన్నూ. ఇప్పుడు ఒకరి భార్య. ‘పెళ్లికళ వచ్చింది’ అన్న ఒక్క మాట అని మాత్రం ఊరుకుంటా. కన్నతల్లి దిష్టి కూడా నా కూతుర్ని తాకనివ్వను. మనవళ్ళుట ! బహువచనమే వాడాడు కదా, ఈ రోజుల్లో పిల్లల్లాగా ‘ఒక నలుసు చాలు, అర నలుసు చాలు’ అని సుకుమారాలు పోకుండా?!!!! నా చేతిలో పసుపు అక్షింతలు అల్లుడుగారి పసుపు జుట్టులో కలిసిపోయాయి.

 

వీసా ఇంటర్వ్యూ చేస్తున్నాను. నా ఎదురుగా గాజుపలక అవతల ఉన్న అందమైన అమ్మాయి లెవెలు ఎచ్ ఫోర్ వీసాకి తగ్గదాయె! భర్తగారు అమెరికా పౌరుడు కాబట్టి తను కూడా పౌరసత్వం తీసుకుంటుందట. కాని ఇండియాలో ఉండి తను ఉద్ధరించాల్సిన పనుల వల్ల మా దేశంలో పర్మనెంటుగా ఉండనులే అని భరోసా ఇస్తోంది.

“అసలు మీ పెళ్లి అయిందని ఏంటి గ్యారంటీ???” కనుబొమ ఎగరేస్తూ కూపీ లాగాను.

“ఇదిగో మ్యారేజ్ సర్టిఫికెట్. ఇదిగో మా ఆయనదీ, నాదీ మ్యారేజ్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. ఇవిగో పెళ్ళిలో తీసుకున్న సెల్ఫీల ప్రింట్లు. విడియోగ్రాఫర్ ఇంకా ఆల్బమ్ ఇవ్వలేదు, లేకపోతే అది కూడా తెచ్చేదాన్ని. ఇదిగో మా శుభలేఖ.”

ఆ అమ్మాయి ఇచ్చిన కాగితాలతో మంచు కప్పేసిన హిమాలయ పర్వతంలా అయ్యాను. జెన్యూన్ కేసే.

“చాలా సింపుల్ గా చేసుకున్నట్టున్నారు?”

“అవును, ఘనంగా చేసుకుందామని మాకిద్దరికీ లేదు. జస్ట్ ఐదు వేలు. ఇద్దరం చెరి సగం పెట్టుకున్నాం” ఉత్సాహంగా  చెప్పింది.

ఉలిక్కిపడ్డాను. ఈమధ్య ఏ పెళ్లి చూసినా కోట్లలో ఖర్చు ఉంటోంది. అలాంటిది, ఇద్దరు వేర్వేరు దేశీయుల మధ్య జరిగిన పెళ్లి ఖర్చు జస్ట్ ఐదు వేలు అంటే ఎలా నమ్మాలి?

“Just five thousand rupees?”

“మూడొందల మందిమి రక్తదానం చేశాము కదా. ఒక యూనిట్ రక్తం వెయ్యి రూపాయలనుకుంటే సుమారు మూడు లక్షల రూపాయలు పోగయినట్టు.”

“నీ మొహం, పెళ్లంటే ఖర్చు చేయాలి. పోగు చేయకూడదు.”

“మాది స్పెషల్ మ్యారేజ్ లే.”

“Convince me.”

“అసలు ఇండియాలో ఎన్ని కోట్ల రూపాయలు పెళ్లిళ్ల కారణంగా వృథా అవుతున్నాయో తెలుసా?” అంటూ చిట్టా విప్పింది చిట్టితల్లి.

ఒక నిముషం సాంతం విన్నాను. రెండో నిముషం ఆమె భాషాసౌందర్యం గమనించాను. మూడో నిముషంలో ఆమె చేతులు, కళ్లు తిప్పుతున్న విధానం పట్ల శ్రద్ధించాను. ఐదు నిముషాలు గడిచాక ఇంకేమీ బుర్రలోకి పోవడంలేదని గ్రహించాను.

అసలే ట్రంప్ గారు వేరే దేశాలవాళ్ళు మాకొద్దు మొర్రో అంటున్నారు, ఈ అమ్మాయికి ఏడు బిలియన్ల జనాభాలో మా దేశపు పిల్లాడు తప్ప దొరకలేదా? ఇప్పుడు మాంఛి క్రేజ్ ఉన్న కెనడావాణ్ణో చైనావాణ్ణో చేసుకోవచ్చుగా.

ఐదు వేల రూపాయల సంగతిని కాసేపు కాఫీ తాగటానికి పంపించి, తలాడించి, “నువ్వు నడిచే న్యూస్పేపర్లా ఉన్నావే. తెలివి కూడా ఎక్కువే అనుకుంటా. ఇంత తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని, ఇంత తక్కువ వ్యవధిలో అమెరికా వెళ్లటానికి బానే ప్లాన్ వేశావ్ ! వీసా ఇవ్వడం కుదర్దు” అనేశాను.

దెబ్బతిన్నట్టు మొహం పెట్టి, “అదేంటి? వై? కారణం చెప్పు బే” అంది ఎంతో మర్యాద ఉట్టిపడే పదాలతో.

నేనూ అంతే మర్యాదగా “మీ పెళ్లి పీనట్స్ తో జరిగిందంటే నమ్మకం కలగటం లేదు. కనీసం పది లక్షలైనా ఖర్చు పెట్టకుండా భారతీయ పెళ్లి వేడుక జరగదని నాకు బాగా తెలుసు. నువ్వు చెబుతున్నది అసాధ్యం” అన్నాను.

“ఇదిగో బాంకెట్ హాలు బిల్లు. ఇదిగో పెళ్లికోసం నేను కొనుక్కున్న నగల హాల్మార్క్ సర్టిఫికెట్.”

సాగదీయకమ్మా. ఈమె తర్వాత ఇంకో ఇంటర్వ్యూ ఉంది. ఓపిగ్గా అన్నీ చూసి, అంతా విని, అన్నీ కూడి ‘ఖర్చు చేయబడిన సొమ్ము మొత్తము’ ఐదు లక్షల దాకా లాగాను. ఇంత తక్కువా? ఉహూఁ. అసలే లంచ్ టైం అవుతోంది. “డిన్నర్లో ఎన్ని ఐటెమ్స్ పెట్టారు?” అని అడిగాను. నోరు ఊరిపోయింది తెలుగువారి విందు భోజనం తల్చుకోగానే.

వేళ్లమీద లెక్కేసుకుంటూ మొదలెట్టింది- “అమ్మ ఇంట్లో పొద్దున్నే పాయసం చేసింది. ఆన్ లైన్లో ఖుబ్బానీ కా మీఠా, కద్దూ కా ఖీర్ తెప్పించుకున్నాము. స్వగృహ ఆంటీ పప్పుండలు, గోంగూర పచ్చడి, నిమ్మకాయ పులిహోరా చేసిచ్చారు. నెయ్యి కరగక్కుండా దోశె మాడకుండా కరకర లాడుతుండాలని ముగ్గురం కలిసి పిల్లర్ నెంబర్ నూట ఇరవై దగ్గరుండే హోటల్ కి వెళ్ళాము. మొత్తం కలిపి ఏడు వందల రూపాయల తొంభైమూడు పైసలు – including GST అయింది.”

ఇది వేస్ట్ కేసు మామా. వదిలేయ్. తల అడ్డంగా ఊపుతుంటే చూపు ‘హ్యానకో వెడ్స్ హీరో’ అని రాసున్న శుభలేఖ మీద పడింది. పల్చగా ఉంది. పది రూపాయలుంటుందేమో.

“ఎన్ని కార్డులు వేయించారు?”

“కార్డులా? అహహహ్హహ్హహ్హ. ఫేస్బుక్ ఇన్విటేషన్స్ ఓన్లీ. వాట్సాప్లో ఇంట్లో తీసిన వీడియో పోస్ట్ చేశాం. ఇది మీకు చూపిద్దామని తీసుకొచ్చిన ప్రింటవుట్. Hey, I forgot. ఇదిగో ఇన్ స్టగ్రామ్ పిక్. ఎంత బాగా కుదిరిందో. ఎన్ని వేల లైకులొచ్చాయో.”

హీరో బుగ్గమీద చుక్కని చూస్తే గుర్తొచ్చింది-

“మీ ఆయనకి టాట్టూలు ఉన్నాయా?”

“హ్యానకో అని ఈ మధ్యే కొంచెం ఇంటీరియర్ ఏరియాలో వేయించుకున్నాడు.”

“అయినా సరే, నీకు వీసా ఇవ్వను.”

“అన్ని డాకుమెంట్లూ ఉన్నాయి కదా. మా హనీమూన్ ట్రిప్పు ఖర్చులతో సహా అన్నీ కలిపి లెక్క వేస్తే ఇరవై లక్షలు అవుతుంది.”

“అయితే, అవన్నీ పట్టుకుని మళ్ళీ రా. ఇప్పటికైతే ఈ రెడ్డు స్టాంపు ఉంచుకో. అయినా హనీమూన్ ఖర్చుల్ని, పెళ్లి ఖర్చుల్లో కలపరు.”

“పోనీ, ఈ వీసా, ఇమ్మిగ్రేషన్ ఖర్చులు కలుపుదామా?”

“మోకాలికీ బోడిగుండుకీ ముడెయ్యకు. మీ పెళ్లిలోకి మా ట్రంపునెందుకు లాగుతావు?”

“నా మొగుణ్ణీ నన్నూ విడదీసిన పాపం ఊరికే పోదురా.”

“మరేం ఫరవాలేదు.”

 

కడుంటాడు! ప్రతివాళ్ళ జీవితం దొబ్బించటానికి ఒకడుంటాడు, ఈ విలియం లాగా! వీసా ఆఫీసర్ల వీరంగం గురించి చిలవలు పలవలు విన్నాను గానీ, ప్రత్యక్షంగా ఆ తాండవం చూడటం ఇదే మొదటిసారి. ఒకసారి కాదంటే, ఇక ఎంత బతిమిలాడినా ఆ సెషన్లో ఇవ్వరు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఒకడుంటాడు ఉంటాడు అనుకున్నాను. పెళ్లి చేసుకుని కూడా అమెరికాలో నా మొగుడు ఒక్కడే ఉండాల్సి వస్తుందనుకోలేదు. అంతా ఈ విలియంగాడి వల్లే. కొన్ని సంవత్సరాలుగా మెరికల్లాంటి వాళ్లందరినీ ఏరి అమెరికా పంపించుకున్నారు. నేను వీడి దేశంలో ఎప్పటికీ ఉండను, ఉద్యోగం చేయను, ఊరికే చూడటానికి వెళ్తాను అన్నా టూరిస్ట్ వీసా కూడా ఇవ్వలేదు. వీసా లేకుండా వెళ్లేందుకు బోలెడు దేశాలున్నాయి. అయినా, నియంత నియమాల అమెరికా లాంటి దేశానికి వెళ్ళటానికి పెళ్లి చేసుకుని కుట్ర పన్నాలా ఏమిటి? ఈ విలియం ‘గాడ్’ గాడికి ఇండియా అంటే ఏంటో చూపిస్తా. నేను నా మొగుడు ఆరునెలలు తిరక్కుండా అరవై ఆరు దేశాలు తిరక్కపోతే, నా పేరు హ్యానకోనే కాదు!

 

క ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కి వెళ్ళాలి.

 

కన్నుల్లో వానాకాలం

గబుక్కున మోకాళ్ళ మీద కూలబడి తల పైకెత్తి “అమ్మా తల్లే! నేను నిన్ను ఆరునెలలు వదిలేసి వెళ్తున్నానే. కాస్త ఏడవ్వే. నీకు దణ్ణం పెడతా” అన్నాను వీరభక్తుడిలా చేతులు జోడించి.

పగలబడి నవ్వింది. నేను పడ్డానని తను నవ్వింది. తను నవ్వాలనే నేను పడ్డాను.

“నువ్విలా నా కాళ్లదగ్గరుంటే ఎంటైర్ అమెరికా ఇండియా ముందు మోకరిల్లినట్టుంది” అంది కసిగా.

కోపంలో హ్యానకో సూపర్ ఉంటుంది. ఫ్రెంచ్ కిస్ ఇద్దామనుకున్నాను కానీ అట్టగారి చేతిని నా పెళ్ళాం వదలడంలేదు. ఆవిడ ఇప్పటివరకు హ్యానకో కన్నీళ్లతో తడిసిన తన కొంగుని పిండుకుంటున్నారు. అటుగా వెళ్తున్న జానిటోర్ని పిలిచి వెట్ ఫ్లోర్ కాషన్ పెట్టమని చెప్పి హ్యానకోకి ఓ జర్మన్ కాంప్లిమెంటిచ్చి బయలుదేరాను. హమ్మయ్య, నా ప్రేమఋతుషష్ఠి పూర్తయింది!

“Come back soon!” అని అరిచింది.

ఎందుకో అర్థమైందిగా. ఇంకా, మా విదేశీ పర్యటన షష్టి మిగిలే ఉంది మరి.

 

*              *              *

చయిత రంగప్రవేశం. ఆఁ, క్లైమాక్స్ లో వచ్చి ఉపన్యాసాలు ఏమి చెప్తాంలే. అన్ని పాత్రలూ వచ్చి తలా ఓ ముక్కా చెబుతున్నాయి కాబట్టి నేనూ నాలుగు ముక్కలు చెప్దామని, అంతే. అమెరికా వాళ్లకి తెలుగొస్తుందా,  ఈవిడ రాయటమూ మరీనూ అనుకోకుండా సావధానచిత్తులై ఆలకించండి. ఇప్పుడు నేను ఇంగిలీషులో రాసి, దాన్ని మీరు చదువుకునేటప్పుడు అమెరికన్ యాసలో కూర్చుకుంటూ కూడబలుక్కోడం కంటే హీరోకి, విలియంకి  తెలుగు నేర్పించేస్తే పోలా. అదన్నమాట సంగతి ! ఆరునెల్లు పోయాక మన హీరో హీరోయిన్గారికి అమెరికా వీసా కష్టాలు తప్పించడానికి ఇక ఇండియాలోనే సెటిల్ అయిపోయాడు. హ్యానకో వీసా లేని దేశాల లిస్టుని ముందేసుకుని టిక్కులు కొట్టుకుంటూ ఉంది. అట్టగారికి ఇప్పుడు మనవలతో బోలెడు కాలక్షేపం!

*

 

మోహిత

12 comments

Leave a Reply to Laxmi Radhika Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చివరివరకూ చదివానండి. నిజంగా అర్థం కాలేదు. బహుశః నేను కొత్తచూపుతో చదవడం నేర్చుకోవాలేమో. ఏదేమైనా కథ రాసిన మీకు అభినందనలు.

  • ” ఒక మనిషి డ్రైవింగ్ స్కిల్ ని బట్టి అతని మనస్తత్వం తెలుసుకోవచ్చని ఎక్కడో చదివాను. ఇతను జీవితంలో ఎదురైన సమస్యల్ని రోడ్డు మీద ఎదురైన స్పీడు బ్రేకర్లు తప్పించినట్టు తప్పిస్తాడని అర్థం చేసుకున్నాను.”
    కథ అర్థం కాకపోతే పోయింది గానీ .. పై వాక్యం మాత్రం చాలా బాగుందండి. ఎంత సరిగ్గా చెప్పారో !

  • ముఖ్యమయిన మూడు పాత్రల కథనం ఆసక్తికరంగా ఉండి చదివించింది. అభివందనాలు!

    కొన్ని వాక్యాలు అలవోకగా అందాన్ని అద్దుకుని ఒలికిపోయాయి.

    “నాకు సిగ్గు ముంచుకొచ్చి నన్ను ముంచి అతని తోడుందని గమనించి నన్ను విడిచి మంచిదనిపించుకుంది. కాలం కౌగిలింతలుగా కరిగిపోయింది.”

    “మోస్తున్న మోహాలు చాలక వీడొకడు నా ప్రాణానికి. ఎదురుగా ఉరుముతాడు, కల్లో తరుముతాడు.”

    “వెతలు కలిసిన గాలులు వీచి, దిగులు కమ్మిన మబ్బులు ముసిరి, కన్నీటి చీకటిని మిగిల్చాయి.”
    “ఆ నింగిని వంచి.. నెలవంకని తుంచి…..”, ““మల్లెతీగవంటి నీ ఒంటిని లేలిహానమునై అంటుకోనా!”” అన్న తెలుగు వాక్యాలని పలికినతను “అట్టగారు” అనడం కావాలని అన్నాడో తెలియక అన్నాడో తెలియలేదు.

    చివర్లో రచయిత రంగప్రవేశం అనవసరం అనిపించింది. కథకు శీర్షిక హీరో గూర్చి గాక అడ్డంపడ్డ విలియమ్ కు వర్తింపజేయడం ఆశ్చర్య మనిపించింది.

    • Ha ha ha. ధన్యవాదాలు. ఆ వాక్యం పలికింది హీరోయిన్ తో మరి. అందుకే జాగ్రత్తగా నేర్చుకున్నాడు. అట్టగారి పక్కన భార్య లేదు కాబట్టి తనకి వచ్చీ రాని భాషలో చెప్పాడు. భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి లెండి! 😀
      వాళ్లు ఎలా ఉన్నారో చెప్పాడనికే తప్ప రచయిత మాట మీరు అన్నట్టు అవసరం లేదు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు