ఏ చట్రమూ లేదనుకోవడం భ్రమ: లక్ష్మీ నరసయ్య

తెలుగు సాహిత్యరంగంలో  గుంటూరు లక్ష్మీనరసయ్య   పేరు తెలియని వారు ఉండరు.   లక్ష్మీనరసయ్య 1995లో సంకలనపరచిన ‘చిక్కనవుతున్న పాట’ అప్పట్లో ఒక సంచలనం. దళిత, బహుజన మైనారిటీ కవులను ఒక గొడుగుక్రిందకు తెచ్చి తెలుగు సాహిత్య చరిత్రను కొత్తపుంతలు తొక్కించారు.  ‘పదునెక్కిన పాట’ తో దళితబహుజన వాదం పదును తేలింది.

‘దళితసాహిత్యం-తాత్విక దృక్పథం’ అనే గ్రంధం ద్వారా లక్ష్మినరసయ్య  దళితబహుజన సాహిత్య దృక్పథానికి తాత్విక నేపథ్యాన్ని అందించారు.  ఈ క్రమంలో దళితబహుజన వాదాన్ని, మార్క్సిజాన్ని, “దేశీయమార్క్సిజం” పేరుతో సమన్వయపరచటానికి చేసిన ప్రయత్నం గొప్పది.  ఇవన్నీ ఒక ఎత్తు అయితే లక్ష్మీనరసయ్యను ఆధునిక సాహిత్యవిమర్శకునిగా నిలబెట్టినవి 1994 నుంచి 99 వరకూ ఆంధ్రజ్యోతిలో కాలమ్స్ గా వ్రాసిన “కవిత్వ నిర్మాణ పద్దతులు”, “సామాజిక కళావిమర్శ” వ్యాసాలు.  వీటిని ఆ పేర్లతోనే ఇటీవల పుస్తకాల రూపంలో తీసుకొనివచ్చారు.

వ్యక్తిగత కారణాలతో లక్ష్మీనరసయ్య దాదాపు రెండు దశాబ్దాలపాటు “పెన్ను మూసినా”  ఆధునిక కవిత్వ ధోరణుల అధ్యయనాన్ని ఆయన కొనసాగించారనే విషయానికి “కవిసంగమం” లో రెండు సంవత్సరాలుగా రాస్తున్న “కవిత్వంలో చర్చనీయాంశాలు” వ్యాసపరంపరే సాక్ష్యం.  తెలుగు సాహిత్యానికి, విమర్శకు కొత్త టానిక్ ఎక్కించిన లక్ష్మినరసయ్యతో  మాటామంతి……

***

ప్రశ్న:  లక్ష్మీనరసయ్యగారు నమస్తే.   తెలుగుయూనివర్సిటీ పురస్కారం లభించటం పట్ల ముందుగా మీకు  హృదయపూర్వక అభినందనలు. విమర్శకునిగా, కవిగా తెలుగు సాహిత్యాన్ని మీరు సుసంపన్నం చేసారు.  కొన్ని కీలక మలుపులకు మీరు కేంద్రబిందువుగా, సాక్షిగా ఉన్నారు.  మీ నేపథ్యాన్ని, సాహితీప్రస్థానాన్ని వివరించండి.

జ:       మాది తెనాలి దగ్గర మండూరు అనే గ్రామం. కవి శివారెడ్డి గారి ఊరికి మైలు దూరం. పేద మంగలి కులంలో పుట్టాను.  నాన్న లోకల్ సీపీఐ నాయకుడు. బాబాయ్ సీపీఎం కార్డుహోల్డర్.

మండూరులోనూ, పక్కనే ఉన్న కూచిపూడిలోనూ స్కూల్ విద్య పూర్తయింది. స్కూల్లో చదువుకుంటూనే కులవృత్తి చేసేవాడ్ని. ఆ అనుభవాల అవమానాలు ఇప్పటికీ కలుక్కుమంటూనే ఉంటాయి. క్లాస్మేట్లకు క్షవరాలు చేసిన అనుభవాలు మరీనూ. తెనాలి VSR కాలేజీలో ఇంటర్ పూర్తయింది. అక్కడే విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడ్ని అయ్యాను.  గురువు గారు వర్ధనరావు గారు నా విప్లవ కార్యాచరణకు దారులు వేసినా ముందునుంచే మా ఊళ్ళో, మా యింట్లో ఉన్న కమ్యూనిస్ట్ వాతావరణం అందుకు కావాల్సిన పునాదులు వేసింది.

అక్కడినుంచీ యూనివర్శిటీ చదువు వరకూ మావోయిస్టు ఉద్యమాల్లో పాలు పంచుకున్నాను.  యూనివర్సిటీ రోజుల్లోనే కవిత్వం రాయటం మొదలు పెట్టాను.

నిదురపోవడం కోసం ఆయుధం అనవరతం మేలుకొని ఉండాలి

విశ్రాంతి కోసం ఆయుధం వినమ్రంగా శ్రమించాలి

నీడకోసం ఆయుధం ఎండల వర్షాన్ని కురిపించాలి

ఇలా సాయుధపోరాటాన్ని సమర్థిస్తూ శ్రీశ్రీ, శివసాగర్, చెరబండ రాజు, శివారెడ్డి ల ప్రభావంతో కవిత్వం రాయటం మొదలు పెట్టాను. అన్ని పత్రికల్లోనూ కవిత్వం అచ్చయ్యేది.

విప్లవ పార్టీల చీలికలు, దేశవ్యాపిత అంబేడ్కరిస్టు ఉద్యమాలూ, కారం చేడు మారణహోమం నుంచి పెల్లుబికిన దళిత ఉద్యమాలూ, ప్రత్యేకించి నా మిత్రుడు ఇంగిలాల రామచంద్ర రావు(RC) ప్రభావం  నన్ను అంబేడ్కరిస్టుగా , దళిత వాదిగా మార్చాయి.  దళితవాదకోణం నుంచి సామాజిక, సాహిత్యవ్యాసాలు రాయడం మొదలు పెట్టాను.  కవిత్వాన్ని తగ్గించి సాహిత్య సిద్ధాంతాల గురించీ, సాహిత్య విశ్లేషణ గురించీ రాస్తున్న నాకు త్రిపురనేని శ్రీనివాస్ తోడు గొప్ప ఊతాన్ని ఇచ్చింది. ఈ పరిణామంతో దళిత సాహిత్య ఉద్యమాన్ని పాదుకొల్పే పని మొదలెట్టాం.  దాని ఫలితమే 1995లో ‘చిక్కనవుతున్న పాట’ దళిత కవితా సంకలన ఆవిర్భావం.  తెలుగు సాహిత్య చరిత్రలో పీడిత కులస్తులూ, ముస్లింలూ ఒకటిగా గుమిగూడి అగ్రకుల హిందూ ఆధిపత్యాన్ని కవిత్వపరంగా  బోనులో నిలదీసిన పుస్తకమది.  అది లేవ దీసిన చర్చా, సృష్టించిన సంచలనం ఒక ప్రత్యామ్నాయ సాహిత్యానికి దారితీసింది.  అదే సంవత్సరం మద్దూరి నగేష్ బాబు, తెరేష్ బాబు, ఖాజాలతో కలిసి ‘నిశాని’   అనే పేరుతో ఒక పుస్తకం తెచ్చాం.  1996లో ‘పదునెక్కిన పాట’ ను మరింత లోతునీ విస్తృతినీ పొందుపరచి తీసుకొచ్చాం.  విజయవాడ, నల్గొండ, హైద్రాబాద్ ల కేంద్రంగా ఈ ఉద్యమం కనీ వినీ ఎరుగని స్థాయిలో  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సాహితీవేత్తల్ని ఒక వేదిక మీదికి తెచ్చింది.  ఇవ్వాళ ప్రముఖ దళిత బహుజన కవులుగా పేరుగాంచిన వారందరినీ ఆనాడు ఈ ఉద్యమం ప్రభావితం చేసింది.  తెలుగు సాహిత్యంలో అంబేడ్కరిజాన్ని నెలకొల్పింది.  ఇలాంటి ఉద్యమానికి నేను సెంటర్ పాయింట్ గా వుండే అవకాశం నాకు దక్కింది.  దళిత సాహిత్యోద్యమంలో పనిజేసే వ్యవధి కోసం హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్న PhD ని సంతోషంగా వదిలేశా. దళిత సాహిత్య దిక్సూచిగా పని చేశా.

ఇదిలా ఉంటే నేను విప్లవ కవిత్వాన్ని సొంతపేరు తోనే రాసినా, దళితకవిత్వాన్ని మాత్రం వరదయ్య అనే కలం పేరుతో రాశా.  వరదయ్య కవిత్వాన్ని సాధారణ పాఠకులు మనసారా ఆహ్వానిస్తే, పండితులు మాత్రం బెత్తాలతో దాడులు చేశారు.  దళిత సాహిత్య సిద్ధాంతాన్నీ, దళిత ఈస్థటిక్స్ భావజాలాన్నీ నిర్మించే క్రమంలో నేను పూర్తిగా సాహిత్య విమర్శకు షిఫ్టయిపోయి కవిత్వాన్ని తగ్గించాను.  ఆ తరవాతి చరిత్ర అందరికీ తెలిసిందే.  నేను PhD వదిలేసినా ఎన్నో PhD లకు సరిపడా వర్క్ చేయగలిగాననే సంతృప్తి పొందగలిగాను.

1999 లో ‘దళిత సాహిత్యం- తాత్విక దృక్పధం’ పుస్తకం తెచ్చాను.  దాదాపు అన్ని పత్రికల్లో వందల సంఖ్యలో వ్యాసాలు రాశాను. ఆంధ్రజ్యోతిలో’  కాలమ్’ రాశాను.  ఆ రోజుల్లో అదొక సంచలన ‘కాలమ్’.   నేను రాసిన వ్యాసాలను సమర్థిస్తూనో , విమర్శిస్తూనో వచ్చిన వ్యాసాలూ ఎక్కువే. అలాంటి వ్యాసాల్ని నా వ్యాసాలతో సహా  ‘దళితవాద వివాదాలు’ అనే పేరుతో  ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీ VC గా ఉన్న SV సత్యన్నారాయణ గారు ఒక పుస్తకంగా తీసుకొచ్చారు.

ప్రస్తుతం నా సాహిత్యాచారణా సామాజిక ఆచారణా అందరికీ తెలిసిందే. విమర్శతో పాటు కవిత్వమూ ఒక పక్క రాస్తున్నాను.

ప్రశ్న:  ఒక మామూలు వచనం కవిత్వంగా మారటానికి దోహదపడే అంశాలలో ముఖ్యమైనవి ఏమిటని మీరు భావిస్తారు?

జ. కవి ఆలోచనలన్నీ, భావాల్నీమామూలు వచనం అనుభవాలుగానో అనుభూతులుగానో ఉద్వేగాలుగానో రూపొందించగలిగినపుడు కవిత్వమౌతుంది. వచనం ఈ పని చేసే క్రమంలో ఎదో ఒక కవిత్వ నిర్మాణ కళా వ్యూహాన్నీ, ఊహనీ ఆశ్రయిస్తుంది. భాష అక్కడ నామినల్ పాత్రనే నిర్వర్తిస్తుంది.

“నిద్రపోతున్నా కూడా

ఒక కాలూపుతూనే వున్నాను

లేదంటే చచ్చిపోయిన మనిషనుకొని

ఇక్కడ అవతలికి విసిరికొడతారు”

ఈ వ్యక్తీకరణలో ఉన్నది మామూలు వచనమే. కవిత్వభాషగా చలామణిలో ఉన్నదేదీ ఇక్కడ లేదు. ఐనా ఇది కవిత్వం అయ్యింది. హృదయాన్ని చెమ్మగిల్లించే అనుభవాన్ని లేక ఉద్వేగాన్నీ రూపొందించింది. ఎదో ఒక పని చేస్తూనో చేస్తున్నట్లు నటించుతూనో కనపడాల్సిన దుస్థితి తెచ్చిన వత్తిడిని పాఠకుల్లో పలికించగలిగింది. మామూలు వచనం ఆ పని ఎందుకు చేయగలిగింది. కవి ఆలోచనని తదనుగుణమైన నిదర్శనం ద్వారా చూపించటం వలన. నిద్రపోతూ కూడా కాళ్ళూపటం పనిచేస్తున్నట్లుగా కనబడటానికి చెందిన వత్తిడికి నిదర్శనం అని వేరే చెప్పక్కర్లేదు. ఇందులోని నిదర్శనాత్మకతని తీసేస్తే ఇది కవిత్వం అయ్యే అవకాశం లేదు. ఈ నిదర్శనాత్మకతనే మనమిక్కడ కవిత్వనిర్మాణ పద్ధతి అంటున్నాం. ఇలాంటి విభిన్న నిర్మాణాలు అనేక మంది కవుల కవిత్వంలో అనేకంగా కనిపిస్తాయి.ఇక్కడ నిదర్శనాత్మకత ఉన్నట్లే మరొకచోట విరోధభాసాత్మకత ఉండొచ్చు. ఇంకొక చోట misplacement ఉండొచ్చు, అపరిచయీకరణాత్మకత ఉండొచ్చు. ఇలా అసంఖ్యాకంగా నిర్మితమయ్యే కళా వ్యూహాలు వచనాన్ని కవిత్వంగా నిలబెడతాయి. ఇక ఈ నిర్మాణాల్ని నిర్మించటంలో కవి ఊహా, కళాత్మకతా తరగని వనరులుగా వుంటాయని మీకు తెలుసు.

నా చీకటితో సూర్యుడికళ్లకు గంతలు కట్టాను

 పచ్చని కండువాతో

చెట్ల కళ్ళకు గంతలుకట్టి

నన్ను కనుక్కోమన్నాను

మేఘాల ముక్కలతో పక్షులకు గంతలు కట్టి

నన్ను కనిపెట్టమన్నాను

 ఒక నవ్వుతో

నా బాధకు గంతలు కట్టాను

ఇలా సాగిన కవితలోని ఊహా బలం , personification (మానవ గుణారోపణ) ఫక్తు వచనాన్ని ఎలా కవిత్వం చేసిందీ తెలుసుకోవటం కష్టం కాదు.

మీరు వ్రాసిన కవితానిర్మాణ పద్ధతులు, సామాజిక కళా విమర్శ పుస్తకాలు వచ్చినపుడు ఒక ఉద్యమ నేపథ్యం చాలా బలంగా ఉండింది. ఇప్పుడు కవిత్వ  వ్యక్తీకరణ, వస్తువు మారాయి.  అప్పటికీ ఇప్పటికీ మీ అభిప్రాయాలలో వచ్చిన మార్పులేమైనా చెపుతారా?

జ.  ఉద్యమాలు వున్నా ఉద్యమాలు లేకపోయినా కవిత్వం కవిత్వం కావటానికిచెందిన కళా కారణాలు నిర్మాణపద్ధతులకు చెందినవే. భాషా పాండిత్యం కవిత్వానికి అదనపు వనరేకానీ అసలైన వనరు కాదని నిరూపిస్తూ ఇప్పటికే ఒక పుస్తకానికి సరిపడ వ్యాసాలు నేను రాశానని మీకు తెలుసు.

ఉద్యమాలు ఇప్పుడు లేవనే మాట కూడా కరెక్ట్ కాదు. మనకలవాటైన పద్ధతిలో లేకపోవచ్చు. కొత్త కొత్త రూపాల్లో ఊపిరి పీలుస్తూనే ఉన్నాయ్.  GST కి వ్యతిరేకంగా, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా, కుల హత్యలకు వ్యతిరేకంగా, విషవాయువుల కర్మాగారాలకు వ్యతిరేకంగా, బిగ్ డ్యామ్ రాజకీయాలకు వ్యతిరేకంగా, జెండర్ వివక్షకు వ్యతిరేకంగా, అక్రమ మైనింగ్లకు వ్యతిరేకంగా, గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా ,  మతోన్మాద మూకుమ్మడి దాడులకు వ్యతిరేకంగా, హిందూత్వ బూటకపు దేశభక్తికి వ్యతిరేకంగా  అభివృద్ధి పేరుతో జూలు విప్పిన విధ్వంసంకూ, నిర్వాసిత్వానికీ వ్యతిరేకంగా  జరుగుతున్న పోరాటాలూ, ఆందోళనలూ ఉద్యమాలు కావని ఎలా అనగలం. మునుపటి ఉదృతి లేని మాట నిజమేగానీ అసలు ఉద్యమాలే లేవని అసలేం. ప్రస్తుత కవిత్వంలో పైన నేను ప్రస్తావించిన అన్ని అంశాల ప్రతిఫలనం ఉంది. కొంత నిరాశ ఉంది. కొంత ఆశ ఉంది. రెండిటి మధ్య ఊగిసలాట కూడా ఉంది. కన్నీళ్ళు పెనవేసుకున్న కోపం ఉంది. దిక్కుతోచని తనమూ ఉంది, దిక్కులు పిక్కటిల్లే ఆక్రోశమూ ఉంది. ఫాల్స్ ఆశల హడావిడి తగ్గింది.

వ్యక్తీకరణ రీత్యా కూడా ఈ ద్వైదీయత కొట్టొచ్చినట్లు కనబడుతుంది.  ఒకపక్క విపరీత రూప శ్రద్ధ, మరొక పక్క విషయాన్ని కవిత్వం చేయడంలోని అశ్రద్ధ చూడొచ్చు.  అన్సెంటిమెంటల్ అల్లిక తో , వింత వ్యూహాలతో నూతన తరహా నిర్మాణాల్ని ముందుకు తీసుకురావడమూ చూడొచ్చు.  అకళా, అతికళా పక్కపక్కనే నడవటమూ గమనిస్తాం. స్ట్రీట్ ఇడియమ్ తో, నేలబారు పలుకుబడితో ఒక ప్రాక్టికల్ ఆదర్శవాదాన్ని అనుభవాల్లోకి తర్జుమా చేయడం, చట్రాల్లో ఇమడని చిత్ర వ్యక్తీకరణను పండించటం ఈనాటి కవిత్వంలో  అందరితోపాటు నేను చూస్తున్నా.

ప్రశ్న:  పోస్ట్ మోడర్నిజం అంతమై మెటా మోడర్నిజం ప్రారంభమయింది అని ప్రపంచం గుర్తిస్తోంది. అన్ని రంగాల్లో ఒక పారాడిమ్ షిఫ్ట్ మొదలైంది.   తెలుగు సాహిత్యంలో   మెటా మోడర్నిజం ధోరణులను మీరెలా గుర్తిస్తున్నారు ?

జ:  మెటామోడర్నిజం మీరు చెబుతున్నట్లుగా ప్రపంచం గుర్తించే స్థాయికి ఇంకా రాలేదు.  పోస్ట్ మోడర్నిజం అన్నిటినీ నిరాకరిస్తే మెటా మోడర్నిజం గోడమీద పిల్లివాటాన్ని తత్వం అంటుంది. ఊగిసలాటనే (oscillation) పరమ సత్యంగా ప్రచారం చేస్తుంది.  డిజిటల్ సంస్కృతీ ప్రభావంతో, ఆక్యుపై, బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమాల నేపథ్యంలో ముందుకొచ్చిన ప్రాక్టికల్ ఐడియలిజెమ్ ని ఆహ్వానిస్తోంది.  నిజానికి ఈ ప్రాగ్మాటిక్ ఆదర్శవాదం ఆధునికతలోని ఒక పాయ. John Dewey ఈ వాదానికి ఆద్యుడు.  ఆ పేరుతో పిలవలేదు గానీ మన దేశంలో పూలే, Dewey కంటే ముందే దీన్ని ప్రతిపాదించాడు.  అంబేడ్కర్ సిద్ధాంతం ఆచారణా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ ప్రాక్టికల్ ఆదర్శవాదాన్ని వాటిలో గమనిస్తారు.  పూలె, అంబేడ్కర్లు  పిడి వాదం లేని ఆధునిక వాదులు.  ఇలా 2010 తరువాత బయలుదేరిన ఈ మెటామోడర్నిజమ్ 19 వ శతాబ్దంలొనే పురుడుపోసుకున్న ఆధునికతలోని ఒక పాయను  తనే కనిపెట్టినట్లు చెబుతుంది. ఇది గమనించకుండా అదేదో కొత్త తాత్వికతను మోసుకొచ్చినట్లు భ్రమపడి దాన్ని తెలుగులో అనువర్తింపజేసే పాట్లు మనం పడక్కర్లేదు. మెటామోడర్నిజం ప్రతిపాదిస్తున్నట్లుగా కొంతమంది భ్రమపడే ఊగిసలాట తత్వం కూడా కొత్తదీ కాదు, పురోగామీ కాదు. లిక్విడ్ మోడెర్నిటీ పోస్ట్ మోడెర్నీటీలో భాగమైనట్లే మెటామోడర్నిజం మోడ్రనిజంలోని ఒక చిన్న పాయను పునఃప్రతిష్టించే బలహీన ప్రయత్నం చేసింది. Timotheus Vermuelen, రాబిన్ వాన్ డెన్ అక్కర్, Luke Turner లు పోస్టుమోడెర్నిజమ్ తో తలపడిన క్రమంలోనే ఈ మెటామోడెర్నిజమ్ ను ప్రతిపాదించారని తెలిస్తే దానిగురించిన భ్రమలు ఎగిరిపోతాయ్.

ప్రశ్న:  ఒక కవి దళితునిగానో, బహుజనుడిగానో లేదా మార్క్సిజ అభిమానిగానో ఉంటే ఆ చట్రంలోనే కవిత్వం వ్రాయాలా? తన జీవితంలో ఉండే సమాజము, ప్రకృతి, మానవసంబంధాలు, మనో వేదనల పట్ల రాయటం వల్ల ముందుగా తనకు తాను విముక్తుడు అవుతున్నాడు అనుకోవచ్చు కదా?

జ:  ఏ చట్రంలో లేకుండా రాస్తున్నామనుకోవటమూ ఒక భ్రమే. అన్ని చట్రాలకూ అతీతంగా వుండాలనుకునేవారూ, వుంటున్నామనుకునేవాళ్ళూ ఆధిపత్య చట్రాల్లో, పాలక చట్రాల్లో ఇరుక్కుని వుంటారు. ఆ చట్రాల్లో కంఫర్ట్ కూడా పొందుతూ వుంటారు. కనుక చట్రాలకతీతం అనుకోవడంలో పురోగామీ ధోరణి కానీ తిరుగుబాటుకానీ ఏమీలేదు. పోస్ట్ మోడర్ణిస్టులకూ, మెటామోడర్నిస్టులకూ ఇది వర్తిస్తుంది. ప్రజల పక్షాన, బలహీనుల పక్షానా, అణచబడుతున్న వాళ్ళ పక్షాన ఉండటం చట్రాల్లో ఇరుక్కోడం కాదు. ఏ చట్రాల్లో లేమనే భ్రమతో అణచివేత శక్తుల వలలో ఉండటమే పెద్ద చట్రంలో ఇరుక్కోవడమవుతుంది.

ఏ కవైనా రచయితైనా తన కుల వర్గ మత లైంగిక ప్రాంత నేపథ్యాలకు ఆరోగ్యకర ప్రతినిధిగా రాయటం సహజ విషయమే కానీ అసహజ విషయమేమీ కాదు. వాటికి చెందిన వాస్తవికతని చూడనట్లుగా నటించటంలో, వాటికి సంబంధించిన అసమానత్వాల అన్యాయాల మకిలిని ఉపేక్షించటంలో వంచనైనా ఉండాలి, ఆత్మ న్యూనతయినా ఉండాలి. కవులూ రచయితలూ మనుషులుగా విముక్తిపొందటమంటే మానవ సంబంధాలను పట్టి పీడిస్తున్న కల్మషాలను కడిగే ప్రక్రియల్లో భాగమై, భాగమయ్యామనే సంతృప్తిని అనుభవించడం.

అలా అని వ్యక్తివాద ధోరణిలో రాయడం, ఆధ్యాత్మిక సందిగ్ధాల్లో నలగడం, అనుభూతి ప్రధానంగా సృజన చేయడం నేరమని నేను అనను. అలా రాసి గొప్ప సాహిత్యాన్ని సృష్టించటం అసాధ్యం. మన తీరికకీ, ఓపికకీ, బతుకుతెరువుకీ కారణమైన సమాజ అల్లకల్లోలాల్నీ, అసమంజసతనీ పట్టించుకోవడంలోనే మన అసలైన విముక్తి ఉంది. దాన్ని పక్కన బెట్టి ఎంత confess చేసినా అది విముక్తి అనే భ్రమనే తప్ప విముక్తి కాజాలదు.

ప్రశ్న:  తెలుగు సాహిత్యవిమర్శనా రంగాన్ని భూమార్గం పట్టించటంలో మీరు పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది. దళితబహుజన సాహిత్యోద్యమనిర్మాణానికి పునాదిని ఏర్పరచారు.  ఎంతో మానసిక దృఢత్వం లేకపోతే ఇది సాధ్యం కాదు.  అప్పట్లో మీరు కొంతకాలం రాయకపోతే,   అస్త్రసన్యాసం చేసారా అని మేమంతా అనుకొన్నాం.  మళ్ళీ నేడు మీరు రెట్టించిన బలంతో ఉత్సాహంతో యువకవులతో పోటీపడుతున్నారు. ఫీనిక్స్ పక్షిలా పైకి లేచారు.   ఈ మీ ప్రయాణంలో మీకు సహాయపడిన వ్యక్తులను గురించి, మీకు అభ్యంతరం లేకపోతే మీ మౌనానికి కారణమైన పరిస్థితులను గురించి చెప్పండి.

జ:  కొన్ని పరిస్థితుల్ని జీర్ణించుకోలేకపోయాను.కొన్ని వత్తిడుల్ని(లోపలివీ, బయటివీ) తట్టుకుని నిలబడలేకపోయాను. నాలోని పోరాడే స్వభావాన్నీ ఫీలయ్యే స్వభావం తాత్కాలికంగా కొంతకాలం మింగేసి ఉండొచ్చు. అందుకే కొన్నాళ్ళు రాయలేదు. సామాజిక సాహిత్య కార్యాచరణల్ని తెలియకుండానే బంద్ చేశాను. చదువుతూ, పరిశీలిస్తూ ఉండిపోయాను. నేను నిశ్శబ్దంగా ఉండటం చాలామందికి నచ్చలేదు. కొంతమందికి అది చాలా అనందాన్నీ పెద్ద రిలీఫ్ నీ ఇచ్చింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రసాదమూర్తి నన్ను వెతికి పట్టుకొని రాయమని ప్రాధేయపడేవాడు. మొదట్నుంచీ మిత్రుల్ని అంటిపెట్టుకుని వుండే తత్వం నాకు ఉండేది కాదు. నేను తప్పిపోయిన ప్రతిసారీ నన్ను వెతికి పట్టుకునే స్నేహితులు కొంతమంది ఉండేవారు. వారిలో ప్రసాదమూర్తి ముఖ్యుడు. వాడు నన్ను వెంటాడి వేధించి ఒప్పించి ఉత్తేజపరిచి మళ్లీ రంగంలోకి దింపాడు. తాను పనిజేసే 10tv లో దాదాపు వంద సాహిత్య ఎపిసోడ్లలో నన్ను మాట్లాడించాడు. దళిత బహుజన కవులూ, రచయితలమీదే కాక మిగిలిన ప్రగతివాద రచయితలమీద నాచేత మాట్లాడించాడు. ఆ ఎపిసోడ్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్.  మరో పక్కనుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్స్ నన్ను ఇలాగే వెతికి పట్టుకొని తరచూ కలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా గంధం అరుణ, రవీంద్ర బాబు నాపుస్తకాలు వేస్తామనీ, అనుమతి ఇవ్వాల్సిందనీ పదే పదే అడుగుతూ ఉండేవారు. మొదట్లో నేను పట్టించుకునేవాడ్ని కాదు.  రాను రానూ వాళ్లలో చిత్తశుద్ధి, సీరియస్ నెస్ నాకు నచ్చి సరే అన్నాను. వెనువెంటనే  పూనుకొని 2015 లో నావి రెండు పుస్తకాలు వాళ్ళు పబ్లిష్ చేశారు. 1. కవిత్వ నిర్మాణ పద్ధతులు, 2. సామాజిక కళావిమర్శ.  నేను గతంలో కొన్ని సంవత్సరాలపాటు ఆంధ్ర జ్యోతి దినపత్రికలో  కాలంగా ప్రతి ఆదివారం రాసిన వ్యాసాలనుంచే వారు ఆ పుస్తకాలు తెచ్చారు. నా పుస్తకాలు వచ్చిన సందర్భంగా నా పునరాగమనాన్ని ‘లక్ష్మీనరసయ్య రెండవరాకడ ‘అని అభివర్ణిస్తూ ఆంధ్రజ్యోతిలో కే. శ్రీనివాస్ నా ఇన్టర్వ్యూ ప్రచురించారు. 10 టీవీ లో స్వయంగా ప్రసాదమూర్తే నన్ను ఇంటర్వ్యూ చేశాడు. సాక్షి లో పూడూరి రాజిరెడ్డి నా రచన గురించి ఒక  రైట్ అప్ కూడా వేశారు. అలా మళ్లీ రాయడం మొదలుపెట్టాను. తిరగటం మొదలుపెట్టాను. దాదాపు అన్ని పత్రికల్లోనూ నా రచనలు, కవితలూ ముమ్మరంగా  రావటం మొదలయ్యింది. పత్రికల్లోనే గాకుండా  ఫేస్బుక్ లో కూడా ముమ్మరమయ్యాను. పాత మిత్రులు తిరిగి దగ్గరయ్యారు. కొత్త మిత్రులూ, యువ మిత్రులూ పరిచయమయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే నా మిత్రుడు స్కైబాబా నన్ను కవి యాకూబ్ నడిపే కవిసంగమంలో రిజిస్టర్ చేశాడు. నిజానికి 1990లలోనే నాకు యాకూబ్ తో పరిచయం  ఉండేది. కవి సంగమంలో మళ్లీ కలిశాం. ఎప్పట్లాగే యాకూబ్ నన్ను అక్కునజేర్చుకుని ప్రోత్సహించాడు.  నన్ను ఒప్పించి కవి సంగమం లో  నాచేత  కాలం రాయించేదాకా వదల్లేదు. తరువాతి ఆచరణ అందరికీ తెలుసు.

కవి సంగమం తరవాత సారంగ కూడా ఇప్పుడు నాకొక వేదికయ్యింది. అఫ్సర్ తో నాకు దరిదాపు పాతికేళ్ల అనుబంధం. తాను విజయవాడ ఆంధ్రభూమిలో పనిచేసేప్పటినుంచీ. బహుశా కవిగా, విమర్శకుడిగా నా ప్రయాణంలోని అన్ని దశలూ తెలిసిన తక్కువ మంది మిత్రుల్లో అఫ్సర్ ఒకడు. అప్పట్లో విజయవాడలో త్రిపురనేని శ్రీనివాస్, అఫ్సర్, ఖాదర్,  కె.శ్రీనివాస్, ప్రసేన్, తిరుపతిరావు మొదలైనవాళ్ళం ఎక్కువగా కలుస్తుండే వాళ్ళం. విపరీతమైన చర్చలు జరుగుతూ ఉండేవి. అఫ్సర్ నా ఆలోచనల్ని బాగా ప్రోత్సహించేవాడు. కట్ చేస్తే, మళ్లీ సారంగ మలి ప్రయాణం నాటికి ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ లోకి  వచ్చాం.ఫేస్బుక్ అనేకంటే కవి యాకుబ్ నేతృత్వంలోని కవిసంగమం అనడం మేలు.హైదరాబాద్లో కలిశాం.’కధా నిర్మాణపద్ధతులు’మీద నేను కాలం మొదలుపెట్టేవరకూ ఊరుకోలేదు. ఫలితంగా కథా నిర్మాణపద్ధతులు ‘కథలోపలి కథ’గా ఇప్పటికి 5 భాగాలు సారంగలో వచ్చాయి.ఇంకా వస్తాయి.

ప్రశ్న:  ఇప్పుటి యువకులు వ్రాస్తున్న కవిత్వంలో మీరు గుర్తించిన, నిలిచిపోయే లక్షణాలు ఏమిటి అని మీరు భావిస్తున్నారు.   యువకవులకు మీరు ఏం సూచించ దలచుకొన్నారు.

జ: యువకవులు చాలామంది సీనియర్ కవులకంటే బాగానే రాస్తున్నారు. సీనియర్ కవులకు అలవాటులేని, సీనియర్ కవులు అలవాటు పడని పద్ధతుల్లో కవిత్వం చేస్తున్నారు. వేగంగా  సమాజంలో వస్తున్న మార్పుల్లోని వైరుధ్యాల్ని పట్టుకోవడంలో యువకవులు సక్సెస్ అవుతున్నారు. రోల్ మోడల్స్ లేని జీవితాల్ని జీర్ణించుకోలేని బాధనీ అగ్రహాన్నీ వ్యక్తంచేస్తున్నారు. ఫలితంగా విషాదాన్నీ విదూషకత్వాన్నీ కలగలిపిన కవితా స్వరాల్ని పూరిస్తున్నారు. ఆర్డినరీ అనుభవాల్ని ఆధ్యాత్మిక పజిల్స్ గా రూపొందించే ధోరణి గూడా కొంతమందిలో కనబడుతుంది.

అయితే ఫేస్ బుక్ అవసరాల రీత్యా రోజూ ఏదో ఒక కవిత రాయాలానే టెంప్టేషన్ నుంచి కొంత మంది బయటపడాల్సుంది. విషయం కవితగా మారే క్రమాన్ని తుదికంటా కొనసాగించకపోవడం వల్ల ఉడకని అన్నం మెతుకుల్లాంటి కవితలు రాస్తున్నారు కొంతమంది. పచ్చి కాయల్నే పండ్ల లా పాఠకులికి పంచితే ఏం జరుగుతుందో వీరు తెలుసుకోవాలి. అలాగే గుచ్చుకుంటున్న ముల్లుని  ఉపేక్షించి ముల్లే కానిదాన్ని ముల్లుగా  గుచ్చుకుంటున్నట్లు విలపించే తత్వాన్ని కొంతమంది యువకవులు వదులుకోవాలని నా అభిప్రాయం.

ఇంటర్వ్యూ  : బొల్లోజు బాబా

సారంగలో లక్ష్మీనరసయ్య పేజీ ఇక్కడ

బొల్లోజు బాబా

7 comments

Leave a Reply to Devarakonda Subrahmanyam Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి ఇంటెర్వూ . చాలా విరాత్మకంగా ఉంది

  • చాలా మంచి ఇంటర్వ్యూ..లక్ష్మీ నరసయ్య గారితో మంచి విషయాలు చెప్పించారు…బాబా గారు..

  • Excellent interview sir. This is very useful every literature philosophical lover. Very glad to hear your story – very inspiring..

  • మంచి ప్రశ్నలు వేసా‌రు.కవులకు మంచి విషయాలను అందించారు

  • సముద్రాన్ని కాదని నదులే గొప్పని చెప్పినట్టు ఉంది. అయితే అది ఇప్పటి అవసరమేమో… జగతంతా అంతర్జాలం లో ఇమిడ్చే ప్రయత్నం చేస్తుంటే మా ఊరు మా వీధి.. మా ఇల్లు లోంచి ఇంకా నేను నా చుట్టూ తిరగడం… ఏదో వింతగా ఉంది.. అంతర్ముఖ ప్రయాణం వినువీధుల్లో…
    చిన్న సందేహం అంతర్జాలం లేని రోజుల్లో సోషలిజం కమ్యూనిస్ట్ విజయం ఇవి ఆ రోజుల్లో ఏలా ఊపునందుకున్నాయో ఎవరైనా వివరిస్తే బాగుండేది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు