ఎవరి యుద్ధమిది?!

రాబోవు యుద్ధాలు ఆర్థిక యుద్ధాలే తప్ప బాంబు మోతలతో యుద్ధాలు కాదు.

పుడు దేశంలో ఎవరిని కదిపినా పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను బలంగా వ్యక్తపరుస్తారనేది వాస్తవం. మీడియా సృష్టించే వార్తలవలన పాకిస్థాన్ లో కూడా బహుశా ఇటువంటి కోరికనే అక్కడి ప్రజలు వ్యక్తపరచవచ్చు. ఇరు దేశాల్లో ఎక్కడ ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా దాని వెనుక ఐఎస్ఐ హస్తముందని మన పత్రికలు, రా హస్తముందని అక్కడి పత్రికలూ వార్తలు వండి వడ్డించి పెడుతూనే ఉన్నాయి. ఐతే ప్రజలు ఎంతగా యుద్ధ పిపాసులై ప్రతీకారేఛ్ఛను వ్యక్త పరుస్తున్నారో ఇరు వైపులా యుద్ధ సైనికులు మాత్రం వాళ్ళ మనసుల్లో శాంతి మంత్రాన్ని జపించడం చేస్తుండవచ్చు.

యుద్ధ గాయాల్ని మొట్టమొదట మోయాల్సినవాడు సైనికుడే కదా!. ఐతే ఇరువైపులా ఉండే ప్రజలకు యుద్ధమంటే అసలు తెలుసునా అనిపిస్తూ ఉంటుంది. అక్కడెక్కడో హిమాలయ పర్వత సానువుల్లో ఇటువైపు సైనికులూ అటువైపు సైనికులూ బాంబులు వేసుకుని చంపుకోవటమే యుద్ధమనుకునేంత అమాయకంగా ఉండటం కనిపిస్తూ ఉంటుంది. కానీ యుద్ధమనేది సరిహద్దుల వరకే సమసిపోదనీ అది మనుషుల జీవితాల్లోకి కూడా చొచ్చుకుని వచ్చి అతలాకుతలం చేస్తుందనీ తెలియదేమో. తెలియకపోవటానికి అవకాశం కూడా ఉంది. ఇండియా, పాకిస్థాన్ నిజానికి పూర్తి స్థాయి యుద్ధాన్ని ఇంతవరకూ చేయలేదు. కానీ అణ్వాయుధాలు కలిగిన ఈ దేశాలు ఇపుడు చేసే యుద్ధం హిమాలయాలవరకే పరిమితమై ఉండిపోతుందని అనుకోవటానికి వీలులేదు. అంతేకాక మారుతున్న ప్రపంచ రాజకీయ ఆర్థిక వాతావరణం లో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఈ రెండు దేశాలకే కాక ప్రపంచానికి కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఫ్యూడల్ కాలపు యుద్ధ కథల్లో వీరులూ, మూష్కరులూ ఉంటారు. రాజులూ, సైనికులూ ఉంటారు. ఇప్పటి యుద్ధ కథల్లో చచ్చిపోయిన మనుషులూ, ఆకలితో అలమటించే పిల్లలూ ఉంటారు. సైనికులనబడే జీతగాండ్లు, నాయకులనబడే‌ కోటీశ్వరులూ ఉంటారు.

భారత పాకిస్తాన్ దేశ ప్రజలే కాదు మొత్తం ఆసియా ఖండం లోని దేశాలు ఏ మాత్రం ఆలోచించలేని మనుషులతో నిండిపోయివుండటానికి కారణం, మనమింకా ఫ్యూడల్ భావజాలాలనుండి బయట పడలేక పోవటం. వెస్టర్న్ యూరోపియన్ దేశాల ప్రజలూ, అమెరికన్లు మన కంటే ఎక్కువ ఐక్యూ కలిగి ఉంటారనటంలో సందేహం లేదు. ముఖ్యంగా యుద్ధాల విషయంలో వాళ్ళు మనకంటే విశాలంగా ఆలోచించగలరని చెప్పాలి. వాళ్ళు నిజానికి యుద్ధ రూపు రేఖలనూ, తీరూ తెన్నులను చాలా దగ్గరగా చూచి ఉండటం వలన, యుద్ధోన్మాదాలవలన ఎంతగానో కోల్పోయి ఉండటం వలన వాళ్ళు మరో యుద్ధం కావాలని కోరుకోవటం దాదాపుగా జరగదు. ఉదాహరణకు గత శతాబ్దంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లీష్ దేశాలు రెండు ప్రపంచ యుద్ధాలలో ముఖాముఖి పోట్లాడుకున్నాయి. ఈ శతాబ్దంలో ఈ మూడు దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరైనా అసలు ఊహించగలరా?. అంతగా పోట్లాడుకున్న ఈ యురోపియన్ దేశాలు ఇప్పుడెందుకు కలిసి పోయాయి.

ఎందువలన వాటి మధ్య యుద్ధం అనే ప్రశ్నే తలెత్తదు. ఆగర్భ శత్రువులుగా ఉన్న దేశాలు ఎప్పటికీ శత్రువులుగానే ఉండిపోవచ్చు కదా..అవిప్పుడు మిత్ర దేశాలుగా ఎందుకయ్యాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సరికే ఈ దేశాలు రెండు ప్రపంచ యుద్ధాలలో పాల్గొంటూ శత్రువులుగా ఉన్నవి. భారత దేశ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడిన పాకిస్థాన్ తో మనం నేటికీ శత్రుత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. బ్రిటీష్ వలస వాదం వెళ్తూ వెళ్తూ ఇండియా పాకిస్థాన్ లను విడగొట్టి పోయింది. వలస వాదం చేసిన ఎన్నో కార్యాలు విభజించు పాలించు అనే తరహాలో ఉంటాయి. ఇండియా పాకిస్థాన్ లను విడదీసి రెంటినీ బలహీనం చేసి పోయింది బ్రిటిష్ ప్రభుత్వం.  బ్రిటీష్ వారి కోరిక మేరకు మనం ఇంకా శత్రు దేశాలుగానే మిగిలిపోయాం. డెభ్భై ఏళ్ళ తరువాత కూడా యుద్ధం ఎపుడెపుడు వస్తుందా, ఎపుడెపుడు శత్రు దేశాన్ని ప్రపంచ పటం లో లేకుండా చేద్దామా అనే ఉబలాటం లో ఉన్నాం. మన ఈ పిచ్చి ఫండమెంటల్ పిడివాద మెదడులంటే అమెరికాకు కూడా చాలా ఇష్టం. దానికి ఇండియా పాకిస్థాన్ లు యుద్ధాలు చేసుకోవటమే కావాలి. ఎందుకంటే ఈ రెండు దేశాలూ యుద్ధానికి కావాల్సిన ఆయుధాల్ని ఎక్కువమటుకు అమెరికా నుండే కొనుగోలు చేస్తాయి.

ఇండియా పాకిస్థాన్ మాత్రమే కాకుండా , ఇండియా చైనా, నార్త్ కొరియా, సౌత్ కొరియా వంటి ఆసియా దేశాలు మొత్తం యుద్ధం లో కొట్టుమిట్టాడటం అమెరికా తక్షణావసరం. ఈ దేశాలన్నీ యుద్ధాలతో బలహీన పడే కొలదీ అమెరికా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతూ ఉంటుంది. యుద్ధమనేది ఇపుడు సైనికుల మధ్య జరిగే బాంబుల మోత కాదు. యుద్ధం అనేది ఒక రాజకీయ చర్య. దేశానికి సంబంధించిన రాజకీయ చర్య కూడా కాదు. అంతర్జాతీయ రాజకీయ చర్య. గెలుపు ఓటములు చనిపోయిన సైనికుల సంఖ్య మీదో ఆక్రమించుకున్న భూభాగాల విస్తీర్ణాల మీదో నిర్ణయింపబడవు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఆ దేశం నిర్వహించబోయే పాత్ర మీద గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. లక్షల కోట్ల ఖర్చుతో కూడుకున్న యుద్ధం చేసి , ఓ వందమంది సైనికులను   మట్టుబెట్టడం, ఓ వంద గజాల భూభాగాన్ని సొంతం చేసుకోవటం, యుద్ధం కాజాలదు. యుద్ధం చేసి అంతర్జాతీయంగా ఏమి బావుకున్నామనేదానిమీద యుద్ధం గెలుపోటములు నిర్ణయమౌతాయి. వందలమంది శత్రు సైనికులను పొట్టన పెట్టుకున్నా అంతర్జాతీయ సమాజం ముందు మనకెలాంటి లాభమూ చేకూరకపోతే ఇంత యుద్ధం చేసి నిరుపయోగమే.  దీన్నే బైఫర్కేషనల్ విజయం అంటున్నాం.

ఐతే ఇపుడు పాకిస్థాన్ ను ప్రపంచ దేశాలముందు దోషిగా నిలబెట్టి, ఒంటరిని చేసినంత మాత్రాన, భారతదేశానికి ఒనగూరే ప్రత్యేక లాభమంటూ ఏదీ లేదు. ఒక దేశాన్ని ఎంతోకాలం పాటు దోషిగా నిలబెట్టడం అనేది జరగదు.  పాకిస్థాన్ మీద భారత దేశం పైచేయి సాధించటం అటు చైనాకూ ఇటు అమెరికా కూ ఇష్టం ఉండదు. ఈస్ట్ ఆసియా దేశాలలో ప్రవేశించటానికి, ముఖ్యంగా అఫ్ఘానిస్థాన్ లోకి ప్రవేశించటానికి పాకిస్థాన్ ను మించిన సైనిక స్థావరం అమెరికాకు లేదు. సౌదీ అరేబియా, పాకిస్థాన్ ల సహాయంతో అఫ్ఘానిస్థాన్, ఇరాన్, ఇరాక్, యెమన్ల పై పట్టు సాధించటం అమెరికా లక్ష్యం. ఒకప్పుడు రష్యాకు వ్యతిరేకంగా అల్ ఖైదా ను ఇక్కడ సృష్టించిన అమెరికా, ఇపుడు ఇరాన్ కు వ్యతిరేకంగా వహాబీ భావజాలాన్ని పోషిస్తూ తూర్పు ఆసియా పెట్రో నిధులమీద పూర్తి పట్టు సాధించాలని చూస్తోంది. వహాబీ ఫండమెంటలిజానికి  నిధులు సమకూర్చి పెట్రో డారల్ల విలువలను పెంచుకుంటూ ఒపెక్ దేశాల మీద సౌదీ అజమాయిషీ చేస్తోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ దేశానికి అనుకూలంగా కూడా అమెరికా ప్రవర్తిస్తూ ఉంటుంది. బైబిల్ లో చెప్పిన “గ్రేటర్ ఇజ్రాయెల్” కల పండాలన్నా సిరియా, యెమెన్, ఇరాన్ లను అడ్డు తొలగించక తప్పదు. ఇజ్రాయెల్ ఎప్పుడూ తన తూర్పు సరిహద్దును ముందుకు జరుపుకోవాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఇరాన్ తో పాటు అఫ్ఘానిస్థాన్ నూ, పాకిస్థాన్ నూ కూడా కలుపుకుని హిమాలయాలదాకా విస్తరించుకుంటే, పెట్రోలియం అంతా అమెరికా, ఇజ్రాయెల్ చేతిలోకి వచ్చేసినట్లే. ఇదంతా జరగాలంటే ఇండియా పాకిస్థాన్ బలహీన పడితేనే సాధ్యమౌతుంది. ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనా పాకిస్థాన్ ను బలహీన పడటాన్ని ఒప్పుకోదు. ఇటువంటి తరుణంలో ఇండియా ముందు ఉన్న పరిష్కారం ఏంటి?.

పాకిస్థాన్ ఏర్పడి డెభ్భై యేళ్ళు అయింది. అది మన శత్రు దేశంగా మారి కూడా డెభ్భై యేళ్ళే అయింది. మతం పేరుతో, దేశం పేరుతో సెంటిమెంటల్ గా ఊగిపోతూ యుద్ధాలు చేసుకోవటం తప్ప ఈ డెభ్భై యేళ్ళలో ఈ రెండు దేశాలూ చేయగలిగిందేమీ లేదు. ఒక యుద్ధం చేసి మొత్తానికే యుద్ధం లేకుండా చేసుకోగలం అనుకోవడమంతటి మూర్ఖత్వం మరోటి లేదు. ఏ యుద్దాన్నీ “ఇదే చివరి యుద్ధం” అనుకోవటానికి లేదు. అందుకే ఇండియా పాకిస్థాన్ లు కాశ్మీర్ వంటి లోకల్ విషయాలను పక్కకు పెట్టి అంతర్జాతీయ విషయాలమీద దృష్టి పెట్టాలి. అమెరికా పెట్రో డాలర్ సూప్రమసీని తట్టుకుని నిలబడటానికి రెండు ప్రపంచ యుద్ధాలలో జుట్లు పట్టుకుని పోట్లాడుకున్న యురోపియన్ దేశాలు సైతం, అన్ని విద్వేషాలనూ మరచి ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా ప్రయత్నించాయి. యూరో ని అంతర్జాతీయ విపణిలోకి తీసుకుని వచ్చాయి. దేశాల మధ్య ఎంతటి అంతరాలు ఉన్నా ఉమ్మడి ఆర్థిక శక్తిగా ఉంటే ఏం చేయవచ్చో అవి తెలుసుకున్నాయి. ఎందుకంటే రాబోవు యుద్ధాలు ఆర్థిక యుద్ధాలే తప్ప బాంబు మోతలతో యుద్ధాలు కాదు.

కానీ ఇండియా, పాకిస్థాన్ లలో ప్రజలకు రాజకీయ నాయకులకు ఇది పట్టదు. ప్రపంచం నుంచి వేరు చేయబడి తమకు తాము ఏదో లోకంలో ఉన్నట్టు ఉండటం వలననే డెభ్భై యేళ్ళ శత్రుత్వాన్ని, బ్రిటీష్ వాళ్ళు సృష్టించిన శత్రుత్వాన్ని మరవలేక పోతున్నారు. ఇంకా యుద్ధాలను తమ లోకల్ రాజకీయ లాభాలకోసం ఉపయోగించుకుని ఎలక్షన్లలో వోట్లు దండుకోవాలనుకునే అల్ప దృష్టిని కలిగి ఉంటున్నారు. ఒక వైపు అమెరికన్ పెట్రో డాలర్, మరో వైపు యూరో, మరో వైపు చైనా ఆర్థిక శక్తులు గా విజృంభిస్తున్న తరుణంలో ఒకే సివిలైజేషన్ కి చెందిన ఇండియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లు ఉమ్మడి ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. కలుపుకోగలిగితే ఇరాన్  ని కూడా కలుపుకోవాలి. అలెగ్జాండర్ బాబిలోనియా నుండి ఇండియా వరకు దండెత్తి వచ్చిన ఈ ప్రాంతం, ఆర్యన్ నాగరికత పరిఢవిల్లిన ఈ ప్రాంతం ఎప్పటినుంచో ఒకటిగానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్రస్తుత శత్రుత్వం కేవలం కొన్ని సంవత్సరాల కిందటిదే. వీళ్ళ మూలాలు ఒకటే, పూర్వికులు ఒకటే.

కాబట్టి ప్రపంచ ఆర్థిక యుద్ధాలలో మళ్ళీ ఈ ప్రాంతం ఒకటిగా కాగలిగితే, ప్రపంచాన్ని శాశించగల ప్రబల శక్తిగా ఎదగటం తథ్యం. కానీ మన బానిస మెదళ్ళు అంత విస్తృత పరిధిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించగలవా, ఆలోచించినా ఆచరణలోకి తేగలవా?. అంత ముందుచూపు ఉన్న నాయకులు మనకు ఉన్నారా?. సోషల్ మీడియా ద్వారా తమ ఆకాంక్షలను పాలకులకు చేరవేయగల స్థితిలో ఉన్న మనమైనా ఆలోచించి గలిగి , దేశాన్ని ప్రబల ఆర్థిక శక్తిగా మార్చగలమా?. ప్రయత్నిద్దాం.

*

Avatar

విరించి విరివింటి

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • యంత బాగా రాశారు డాక్టర్ !! సలామ్….
    జపాన్ ని చూసి ఐనా నేర్చికోవాల్సింది సార్ .

  • Dear sir all the wars are fought for political ends. The core issue is kashmir not been solved because there must be an issue to campaign that particular party could Only save the contry n its pelple to come into power. Indian young people most of them ignorant of historical facts want some kind of excitement or sensational situations to celebrate n to prove their patriotism n entertain tbe ideology of their Political heroes. George bush fought Iraq war n came to power 2nd time spent 4 trillion US dollars for war caused recession in 2008.Hope peace will prevail.

  • ఇండియా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ లు ఉమ్మడి ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. వీళ్ళ మూలాలు ఒకటే, పూర్వికులు ఒకటే. ఈ ప్రాంతం ఒకటిగా కాగలిగితే, ప్రబల శక్తిగా ఎదగటం తథ్యం. కానీ అంత ముందుచూపు ఉన్న నాయకులు మనకు ఉన్నారా? అంటున్న యీ డాక్టర్ విరించి మేధావికి సలాం.

    యుద్ధ వాతావరణం ప్రేరిపించనప్పుడు సరిహద్దుల్లో ఇరు దేశాల సామాన్య సైనికుల మధ్య స్నేహ భావాలు, ఇచ్చి పుచ్చుకోవటాలు కూడా చూసాము కదా. విద్వేషాలనూ రెచ్చగొట్టని సందర్భాలలో యీ ప్రాంత ప్రజలు తమ మూలాలను తలుచుకుని సోదరభావంతో మెలిగిన సందర్భాలు ఎన్నో.

    డాక్టర్ విరించి విరివింటి : ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు. ‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన ‘ఇక్కడి చెట్ల గాలి’కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు