ఎర్ర గళ్ళ చొక్కా

తననేమీ అనదు. నవ్వుతూ మొహంతోనే ఉంటుంది. తను బాధ పడతాడేమో అని కాబోలు సరైన పని లేదని ఎన్నడూ నోరెత్తదు.

“నా చావుకి ఎవరూ కారణం కాదు. ఎవరూ బాధ్యులు కాదు. ఈ జీవితం నన్ను తన్నే తన్నులు మామూలుగా లేవు.  అలసి పోయాను. నేను లేక పోతే కనీసం నా భార్యను, పిల్లలను పుట్టింటి వాళ్ళు ఆదరిస్తారని చిన్న ఆశ ఉంది. ఎంత కష్టపడ్డా ఇంట్లో ముగ్గురికీ ఇంత అన్నం పెట్టలేని చవటనై పోయాను. ఇంద్ర ధనుసు లాంటి కలలు కన్నాను. మెహెర్ నాతో ఉంటే చాలనీ, ఏదో ఒక పని చేసుకుని ఇద్దరం సంతోషంగా ప్రేమ సామ్రాజ్యంలో బతుకుతామనీ ఆశించాను

నేను చనిపోయాక నా భార్య మెహరున్నీసాని, నా ఇద్దరు బిడ్డలను ఆమె తండ్రి ఖాసిం వలీ గారు జాగర్తగా చూసుకోవాలని కోరుతున్నాను. ఇదే నా చివరి కోరిక”

ఒకసారి మొత్తం చదివాడు మూర్తి. చదువుతుంటే నెమ్మదిగా  కళ్ళలో నీళ్ళు నిలిచాయి.  రచయిత కావాలనీ, పేరు తెచ్చుకోవాలనీ ఎన్నో కలలు కాలేజీ రోజుల్లో ? చావు ఉత్తరం కూడా ఇంత పొయెటిగ్గా రాశాడు తను. మెహెర్ చదివితే? నవ్వుతుందా?

కాలేజీ లో ఏ కథా సీరియస్ గా రాయలా! సగం రాసి వదిలేసేవాడు తను. అసలు కథలేంట్లే? ప్రతిదీ సగం సగమే

చదువు వదిలేసి నాటకాల వెంట తిరిగాడు. ఎవరెంత చెప్పినా విన్లేదు

ఎన్ని  నాటకాలు రాశాడో స్టూడెంట్స్ కోసం. ఎన్ని నాటకాలు వేశారో అందరూ కల్సి. గుంటూర్లో తెనాల్లో, చిలకరూరి పేట లో ఎక్కడ నాటకాల పోటీలు జరిగినా కాలేజీ ఎగ్గొట్టి వెళ్ళిపోవడమే

ఏంజెల్ టాకీస్ పక్క సందులో ఒక స్టూడెంట్స్ రూము లో రిహార్సల్స్ .

డాబా మీద రూము కావడంతో డాబా అంతా తమదే

కోమలా విలాస్ నుంచీ, దుర్గా భవన్ నుంచీ రెడ్డి

తెప్పించే టిఫిన్లూ భోజనాలూ.. ఇదే జీవితమన్నట్టు గడిపారు

తనతో నాటకాలు వేసే స్నేహితులందరికీ డబ్బుందనీ, తనే ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉందనీ ఆ క్షణంలో గుర్తించలేక పోయాడు

అప్పుడేగా ఫైనలియర్ లో ఉండగా కల్సింది మెహెర్! వేరే  కాలేజీ నుంచి వచ్చి చేరింది. నాటకాలు వదిలేసి మెహెర్ వెంట తిరిగాడు.  పిల్ల వెనక కనపడితే తాట తీస్తానని ఖాసిం వలీ బెదిరించినా విన్లేదు. వాళ్ల బంగారు నగల షాపు దగ్గర్లో ఫ్రెండ్ షాపు లో కూచుని సైట్ కొట్టేవాడు.

మెహెర్ కీ ఇష్టమే కాబట్టి రాకుమారి లా డాబా మీద ఉన్న స్టాండ్ ఉయ్యాల లో కూచుని చదువుకునే నెపంతో తనని చూడ్డానికి వచ్చేది

చదువు పూర్తి చెయ్యమని నాన్న ఎంత చెప్పినా విన్నాడా? ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ మత్తు ఎంత గొప్పది?

ప్రతి క్షణమూ మధురోహలే

ప్రపంచమంతా అందమే

“జంధ్యమేసుకు చచ్చావు గా? కనీసం నాతో రారా,  దానాలకైనా పనికొస్తావ్! ఎలాగూ నువ్వు దరిద్రుడివే కాబట్టి ఏ దానాలు పట్టినా పర్లేదు” నాన్న తిట్లేవీ చెవికెక్కలా

పాప ఏదో కలవరిస్తూ వాళ్లమ్మ మీద కాలేసి పడుకుంది. అటు చూశాడు

ఏం కలవరించిందో స్పష్టంగా తెలీలేదు. కానీ తను కొనలేక పోయిన ఏ బొమ్మో, చాక్లెట్టో అయ్యుంటుంది. పిల్లల మొహంలో దీనత్వమో నిరాశో చూడటం ఇంత కష్టంగా ఉంటుందేం?

మెహెర్  ఏమీ అడగదు. ఆ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా నాలుగు రాళ్ళు తెస్తూనే ఉంది. తన మీద ఏదైనా కంప్లైంట్ ఉందో లేదో ఎమీ తెలీదు. అంత స్థిరంగా ఎలా ఉంటుందో తెలీదు

అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకుని వాళ్ల పుట్టింటికి వెళ్ళొస్తుంది. పాపం బూబమ్మ కి మనవలంటే ప్రాణం. ఊరికే చూపించి కాస్త మటనో చికెనో తినిపించి తీసుకొస్తుంది. తను బ్రాహ్మడు కాబట్టి ఇంట్లో వండదు. తను తినడం ఎప్పుడో మానేసింది. పుట్టింటికి వెళ్ళినా పిల్లలే తప్ప తను తినదు.

“పిల్లలంటే ఇక్కడ అడగచ్చు అక్కడ అడక్కూడదనే విషయం తెలీదు. అదీ మా అమ్మ బలవంతం చేస్తది పిల్లలంటే ప్రాణమిస్తది కాబట్టి వూరుకుంటా !   ఆ ఇంటి తిండి నాకెందుకు? మనకున్నదే తిందాం” అంటుంది

గల గల పారే సెలయేరల్లే ఉండే మెహెర్ రాను రాను ఎండాకాలంలో సాగర్ కృష్ణ లా కాసింత జీవాన్ని మిగుల్చుకుని చిరునవ్వుని పోనీకుండా చూసుకుంటుంది .

తననేమీ అనదు.  నవ్వుతూ మొహంతోనే ఉంటుంది. తను బాధ పడతాడేమో అని కాబోలు సరైన పని లేదని ఎన్నడూ నోరెత్తదు.

ఒక్కోసారి ఇందిర గుర్తొస్తుంది. అదే,సీతారామారావు భార్య. ఆమె కూడా ఇంతే

ఆ నిశ్శబ్దం భయంగా ఉంటుంది. తాను కూడా సీతారామారావల్లే ఘోరంగా తననితాను చంపుకునే పరిస్థితి వస్తుందా అనిపిస్తుంది

ఎలాగో డిగ్రీ పూర్తయ్యింది గానీ ఉద్యోగాలేవీ తనకు రావని అర్థమైంది.  తన ఫ్రెండ్ గుప్తా మెడికల్ కార్పొరేషన్ లో అకౌంట్స్ చూడ్డానికి పిలిచాడు

సాయంత్రం పూట మరో చోట లాయర్ గారి పని.

తన స్నేహితులంతా ఉద్యోగాల్లో,వ్యాపారాల్లో సెటిలయ్యారు.  మెడికల్ కార్పొరేషన్ మూత  పడటం తో పోయిన నెలతో  ఒక ఉద్యోగం ఊడింది .

ఆ పని తప్ప మరోటి చేతకాక పోవడం తో , అకస్మాత్తు గా కాళ్ళు చేతులు విరిగినట్టయింది .లాయర్  ఎప్పుడో తప్ప డబ్బు ఇవ్వడు

ఇదంతా మెహెర్ తెచ్చిన దరిద్రమే అని నాన్నంటాడు

ఆ తురక దాని చెయ్యి పట్టుకుని వంశ నాశనం చేసావన్నాడు. తను మెహెర్ ని పెళ్ళి చేసుకునే సరికి గుడి అర్చకత్వం నాన్న తోనే ఆగిపోయింది. తమ్ముడికి రాలేదు . దాని మీద ఆశ పెట్టుకున్న వాడెన్ని  శాపనార్థాలు పెట్టాడో

తాత ఇచ్చిన పొలం ఉండబట్టి కుటుంబం బతికి పోయింది. లేక పోతే ఇంకా ఎన్ని శాపాలు పెట్టేవాడో నాన్న

తనని ఎన్ని తిట్టినా పర్లేదు గానీ పిల్లలను కూడా అసహ్యించుకోవడం భరించలేక పోయాడు తను. ఎవరో బురద లో ఆడుకునే పిల్లల్ని చూసినా ముద్దు చెయ్యాలనిపిస్తుందే తనకి

స్కూలు నుంచి వస్తూ కనపడ్డా, ఇంటి ముందుగా పోతున్నా “పో పో” అని చీదరించుకుంటారు అమ్మా నాన్నా ఇద్దరూ

అమ్మకి కాస్త ప్రేమ ఉంటుందనుకున్నాడు.

నాన్న కంటే అమ్మ పిల్లలని ఎక్కువ చీదరించుకుంటుంది. కులమేదైనా హిందువుల పిల్లను చేసుకుని ఉంటే ఇలాగే ఉండేదా? ఏమో

“బామ్మ గారెందుకు  నానా నన్ను చూసి పో పో” అన్నదీ ?”  అని కూతురు అడిగినపుడు నిజంగానే కడుపు రగిలి పోయింది.

“మీ ఇంటికి నా పిల్లలు రారు. ఈ రోడ్డు మీ సొంతం  కాదు. వాళ్ళు స్కూలుకు వెళ్ళే దారి ఇది. మీకు వాళ్ళు కనపడితే లోపలికి పోయి దాక్కోండి. పో పో అని తరిమి కొడితే కేసు పెడతాను జాగర్త ”

చెప్పేశాడు

“నువ్వే చచ్చావనుకున్నాం, నీ పిల్లలు మాకు బతికున్నోళ్ళు కాదు. మా లెక్క లో మీరెవరూ లేరు కేసు పెడతావూ కేసు? పెట్టు చూస్తాను  ” అమ్మ ఇంత కఠినంగా మాట్లాడుతుందనుకోలేదు

కానీ మెహెర్  తండ్రికి  పిల్లలంటే ప్రాణమే! మెహెరే చేరనివ్వదు.  పెళ్లి చేసుకుని వచ్చిన రోజు  ఆయన తనని  కొట్టాడని కోపం. “నిన్ను కొడతాడా ఆయన ? కోపముంటే నన్ను కొట్టాలి “అంటుంది ఈ రోజుకీ

అపురూపంగా పెంచుకున్న కూతుర్ని తీసుకెళ్ళి మంత్రాలు చదూకునే ఒక పేద బాపడు పెళ్ళి చేసుకుంటే కొట్టడా?

ఆ రోజు నుంచి తండ్రి మొహమే చూడలేదుమెహెర్

చెంపలు తడిసి పోతున్నయని తెలిసొచ్చింది మూర్తికి. చాప మీద వేసిన గుడ్డ పరుపు మీద  ముగ్గురూ నిద్ర పోతున్నారు.

మెహెర్ మెడ విరిగి పోతుందేమో అన్నంత గట్టిగా మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్నారు పిల్లలిద్దరూ

రేపటి నుంచీ ముగ్గురే ఉంటారు ఈ గదిలో. అసలు ఈ గదిలో కూడా ఉండరు. రెండు గదులకు అద్దె ఎలా కడతారు? ఒక చిన్న గది తీసుకుని అందులో ఉంటారు.

అయినా మెహర్ ని , పిల్లలని వాళ్ళ నాన్న తీసుకెళ్లాలని కదా తను రాశాడు?

రాస్తే?

వాళ్లు తీసుకెళ్తామన్నా మెహర్ వెళ్లద్దూ? ఒక్క మాట కూడా పడే రకం కాదు

తొమ్మిదేళ్ళ క్రితం తనని కొట్టాడన్న బాధ మనసులో పెట్టుకుని ఇంతవరకూ తండ్రి మొహం చూడలేదు. బజార్లో కనపడ్డా తలొంచుకుని నడిచి పోతుంది తప్ప ఆయనకేసి చూడదు

ఆయన ఎంతో ఏడుస్తాట్ట, వాళ్లమ్మ చెప్పింది

తూగుటుయ్యాల లో పుస్తకం పట్టుకుని ఊగుతూ వాళ్లమ్మ చేత ముద్దలు నోట్లో పెట్టించుకుంటూ విలాసంగా చదువుకునే మెహర్ అదే మేడ ముందు కూరల బండి మీద పావు కిలో దొండకాయలు కొంటూ  కనపడిన రోజు ఆయన అన్నం తినకుండా నిద్ర పోకుండా కూచున్నాడని బూబమ్మ చెప్పింది

అలాటి మెహర్ పస్తులతో చావనైనా చస్తుంది కానీ ఆయన డబ్బుల్ని లెక్క చెయ్యదు.

“ఉంటే తింటాం, లేక పొతే పస్తులుంటాం. మనకి డబ్బులేక పోతే కాదు, మన మధ్య ప్రేమ లేనప్పుడు మనం మాట్లాడుకోవాలి. అలాటి పరిస్థితి మనకి రాదు” అని ఎప్పుడో చెప్పింది

ఉదయం లేస్తూనే దూలానికి వేలాడుతున్న తనని చూస్తారు .  కెవ్వుమని కేకలు పెట్టి అందర్నీ పిలుస్తారు కాబోలు . కిందకు దించి పడుకోబెట్టి గోలు గోలున ఏడుస్తారు . అమ్మా నాన్న వస్తారో రారో

దరిద్రం వదిలి పోయింది పొమ్మనుకుంటారేమో ! మరి అపర కర్మలు ఎవరు చేస్తారు ? తురక పిల్లను చేసుకుని వాళ్లలో కల్సి పోయిన వాడికి ఇంకా అపర కర్మలేంటి అంటార్లే !

తర్వాత మెహర్ , పిల్లలు ఏమై పోతారు ??

సాయంత్రం కాగానే తను వస్తాడని ఎదురు చూసే పిల్లలైద్దరూ ఇక ఎదురు చూడరు. వాళ్లమ్మ ఉన్నదేదో పెడితే తిని చదువుకుంటారేమో

లేక ఎనిమిదేళ్ళ కొడుకు ఏదైనా పనికి పోతానంటాడా? సుబ్బారావు కొట్లో టీ కప్పులు కడగడానికో, లేక ప్లేట్లు ఎత్తడానికో వెళ్తానంటాడా?

రాసి రాసి వాడి చేతికి పెన్సిల్ నొక్కుకుంటేనే తను భరించలేడే

చావొచ్చి చావడం , తెచ్చుకుని చావడం ఒకటేనా?

మెహర్ ఏం చేస్తుంది? పిల్లల్ని చంపి…తనూ

తలని నీళ్లలో ముంచి లేవకుండా పట్టుకున్నట్టయింది. ఊపిరాడ లేదు

దుఖం ఉప్పెనై ముంచెత్త బోయింది. దాన్ని మింగే ప్రయత్నంలో ఉండకట్టి గొంతులో అడ్డం పడింది .

నొప్పి

“జీవితాన్ని గౌరవించలేని వాడు చావు ని కౌగిలించుకోవడం విజయమేమీ కాదు.  జీవితం  ముడ్డి మీద తంతే ముందుకు పడ్డా, లేచి నిల్చోవాలి

దులుపుకుని వెనక్కి తిరిగి దాన్ని చూసి పరిహాసంగా నవ్వాలి. నీ ముందే నేను పరిగెత్తి చూపిస్తా చూడు” అని సవాలు చేయాలి. పడుతూనో లేస్తూనో పరిగెత్తాలి. ఎదుర్రాళ్ళు తగిలి రక్తం చిందితే  చిందనీ కాసింత ఇసకో మట్టో పోసి నాటు వైద్యాన్ని అలవాటు చేయాలి. గమ్యం చేరి విశ్రాంతి గా కూచుని, నిన్ను తన్నిన జీవితాన్నే “ఓయ్! చూశావా?” అన్ని వెక్కిరించాలి

ఇవి తను రాసిన నాటకం లో డైలాగ్స్!

ఎవరి కోసం రాశాడివి? తనకు పనికి రానివి ఎవరికో చెప్పాలని తాపత్రయ పడ్డాడు

ఊరికే చేతిలో పనే కదాని రాసి పడేశాడు  గానీ తనక్కూడా వర్తిస్తాయేమో అని సందేహం రాలేదు.

“ఏం రాస్తున్నావు మూర్తీ”

ఉలిక్కి పడి పేపర్ మీద పుస్తకం పెట్టాడు

మెహర్!

“ఏంటి?”

“ఏంటేంటి? టైము చూశావా? రెండున్నర. ఇంత రాత్రి వేళ ఏం రాస్తున్నావ్?”

“ఏం లేదు. ఏదో కాసేపు  రాసుకోవాలనిపించి, మొదలు పెట్టాను”

“కథా? సరే రేపు రాసుకుందు గాన్లే! పడుకో” బాత్ రూము వైపు నడిచింది

చావు ఉత్తరం పుస్తకంలోనే పెట్టి మర్చిపోతే , రేపు  మెహెర్ చూసిందంటే చచ్చేంత గొడవవుతుంది

గబ గబా దాన్ని నాలుగు మడతలు పెట్టి , హాంగర్ కి వేసున్న ఎర్ర గళ్ళ చొక్కా జేబులో పెట్టాడు

కొబ్బరి చేంతాడు ని కాల్తో బల్ల కిందికి నెట్టాడు. చేత బకెటు నుంచి విప్పి మరీ తెచ్చాడు దాన్ని

“ఏదైనా సరే చేసి , నా డైలాగ్ నేనే రుజువు చేస్తా” అనుకున్న తర్వాత ఎందుకో చాలా ఖాళీగా, తేలిగ్గా అనిపించింది.

ఆకలీ దాహమూ వేశాయి.

“ఏం చూస్తున్నావ్?” మెహర్

“ఆకలేస్తోంది”

ఒక్క క్షణం నిశ్చలం గా  చూసింది . లోపలి గదిలోకి పోయి రెండు అరటి పళ్ళు తెచ్చి ” తిను.” అని చేతికిచ్చి ఏమనుకుందో ఏమో, జుట్టు నిమిరి వెళ్ళి పడుకుంది

##                                                           ##                                                            ##

“జోజన్నా ! కార్పొరేషన్ మూత పడింది. ప్రస్తుతానికి పని కావాలి. ఉజ్జోగం వెతుక్కుంటున్నా. దొరికే లోపు పని చేస్తే కానీ కుదిరేలా లేదన్నా ” ఇది వరకు లాగా మొహమాట పడి భేషజాలు పోకుండా వివరంగా చెప్పేశాడు

జోజి ఆశ్చర్యం గా చూశాడు

“కరెంట్ పని చేస్తావా?  ఏంది పొంతులూ?”

“చేస్తానన్నా! వచ్చు గదా నాకు . ఏదొ సరదాకి నేర్చుకున్నా. ఇప్పుడు పనికొస్తదంటే చెయ్యనా ఏంది?”

“మీ నాన నన్ను తిట్టడు గదా, అసలే పెద్ద పొంతులు. శాపాలు తగుల్తై”

“నా కడుపు కు నేను పని చేసుకుంటే ఆయనేందన్నా శాపాలు పెట్టేది ?  ఆయనకీ  నాకు ఏ సంబంధం లేదు లే,  నువ్వు పనియ్యి చాలు ”

“ఓయబ్బ , కరెంట్  పనికేందబ్బాయ్, బోల్డు పన్లుండై.  రేపు డేసారం ప్రెబ కి డెకరేటింగ్ చెయ్యాల. పోతావా వూరికి?”

“పోతా అన్నా”

“సరే, రేప్పొద్దున్నే రా, మాయిటేలకో , ఎల్లుండి పొద్దునకో పనై పోవాల. గురువారం  శివరాత్తిరి గదా! పొద్దున్నే ప్రెబ బయల్దేరి కొండకి పోవాల”

“సరే అన్నా! లైట్లన్నీ నేను పెడతాగా”

“ఒక్కడి వొల్ల ఏమైద్ది లేబ్బాయ్! ఇంకా మడుసులుండారు . నువ్ బొయ్యి అక్కడ రఫీ అనుంటాడు. ఆయబ్బాయిని కలువు. ఏం జెయ్యాలో జెప్తాడు

ఇదిగో , అయ్యగారివి గదా, వాళ్లతో నువ్వు తిన్లేవు తిండి. ఇదిగో ఈ డబ్బులుంచు. కాస్త మంచి ఓటల్ చూస్కోని, అక్కడ అన్నం తిను” డబ్బులు మూర్తి చేతిలో పెట్టాడు జోజి

గుండె కింద తడి గా అనిపించింది. “సరేన్నా” అనబోయాడు కానీ మాట రాలేదు

తలూపి బయట పడి బస్టాండ్ లో నిల్చున్నాడు దేసారం బస్ కోసం

###                                                           ###                                                         ###

“అది గాదన్నా, నువ్వు పొంతులువి గదా, నువ్వు బొయ్యి బూబమ్మని చేసుకుంటివి. మరి మీ నానోళ్ళు వొత్తరా మీ ఇంటికి” కుతూహలంగా అడిగాడు పదిహేనేళ్ళ సీను

“రారు. రాక పోతే పోనీరా! మన బతుకు మనం ఇష్టంగా బతకాలి గానీ ఒకరొస్తారనో, ఒకళ్ళు రాలేదనో బతుకుతామా? మనం ఏదెంచుకుంటే అదే మన బతుకు. వెనకడుగు వెయ్యరాదు” స్పష్టంగా చెప్పాడు మూర్తి నోట్లో వైరు పెట్టుకుని దాని రబ్బరు కోటింగ్ పళ్ళతో లాగేస్తూ

“ఏందో అనా, నీ మాటలు నా కర్దం గావు” బల్బుల కట్ట తెచ్చి పడేశాడు  సీను

“నా? నువ్వు పొంతులు గోరబ్బాయి గదా, మాతో కూసోని తింటావా? అన్నం తెచ్చుకున్నావా?” సీను గాడి ప్రశ్నలతో బుర్ర వాచి పోతోంది మూర్తికి

“తెచ్చుకోలేదురా! మీ అందరూ తలా కొంచెం పెట్టండి, తినేస్తాను”

“నిజ్జంగా తింటావా?”

“తింటాన్రా! కడుపు నిండాలి గానీ, ఎవరు పెడితే ఏంటి?”

“ఒట్టెయ్యి”

“ఒట్టు”

“సరే పా! ఆ పైన పెద్ద లైట్లు పెట్టాలన్నా! ఒక పూల గుత్తీ, దాని చుట్టూ సిన్న సిన్న టూబు లైట్లూ పెట్టాల. ఆ శివుడి బొమ్మ పెడతాం గదా, దాని చుట్టూ సీరియల్ బల్బులు పెట్టాల” సీను వివరంగా చెప్పాడు

“రఫీ చెప్పాడు రా నాకు” బల్బులు తీసుకుని కదిలాడు మూర్తి

“జాగర్తన్నో! పోయిన సారి ఇక్కుర్తి ప్రెబ కడతా ఉంటే ఒకాయన పై నుంచి పడ్డాడు తెల్సా! యాబై వేలిచ్చారు లే ఆయనకి పాపం”

వెనక్కి తిరిగాడు మూర్తి “బతికుండి సంపాదించుకుందాం లేరా . చచ్చేదెందుకు దీనికి” బల్బుల కట్ట భుజానికి వేసుకుని పైకి ఎక్కుతూ అనుకున్నాడు

“ఈ పనికి వస్తున్నానని తెలిస్తే మెహెర్ ఒప్పుకునేదే కాదు”

శివుడి పోస్టర్ లో  తల చుట్టూ సీరియల్ బల్బులు పెట్టడం అయింది. ఆ పైన ప్రభ చివర ఒక పూల గుత్తి ఆకారంలో ఉన్న బల్బులను బిగించడానికి ముందుకు కదిలాడు. నిజానికి చాలా వరకూ బల్బులన్నీ ప్రభ ని పడుకోబెట్టి ఉన్నపుడే చెయ్యాలి . కొన్ని బల్బులు దొరక్క పోవడం తో ఎక్కి మరీ పెట్టాల్సి వచ్చిందివాళ

పదే పది నిమిషాలు.  వంద ఆలోచనలు

“పర్లేదు. ఇవాళ వచ్చే డబ్బులతో  వారం పది రోజులు సుఖంగా గడిచి పోతాయి. ఇలాటి పనే నాలుగైదు రోజులు దొరక్క పోదు. ఈ లోపు ఏదో ఒకటి ఉద్యోగం కోసం ప్రయత్నించాలి . రెక్కల్లో శక్తీ, జీవితం మీద ఆసక్తీ ఉన్నంత కాలం, ఏ లోటూ రాదు

ఇంటికి వెళ్ళాక, మెహెర్ కి నెమ్మది గానే ఈ విషయం చెప్పాలి. గొడవ చేస్తుందంతేగా అలాటి పన్లు వద్దని

అర్థం చేసుకుంటే మరీ మంచిది. వాళ్ళ బంగారం షాపు ముందే నిలబడి పావు కిలో దొండకాయలు కొన్నపుడు కూడా అభిమానం ఫీలవని మెహర్ మేరు నగ ధీర.

తనని అర్థం చేసుకుంటుంది. పాప వారం క్రితం సాఫ్టీ రబ్బరు బొమ్మేదో కావాలంది. ఇవాళ పట్టుకెళ్తే సరి..

భుజాన వేసుకున్న బల్బుల కట్ట జారి పోవడంతో దాన్ని పట్టుకుందామని వంగిన మూర్తి  కాలు ప్రభ ఫ్రేమ్ తాలూకూ బొంగు మీద నుంచి జారి పొవడానికి రెండు సెకన్ల కంటే ఎక్కువ పట్టలేదు

ముప్ఫై అడుగుల ఎత్తు నుంచీ కింద తలకిందులుగా పడి పోవడానికి మరో అర మూడు సెకన్లంతే

“అయ్యో, పొంతులు పొంతులు ” కేకలు గోల గోల గా

అందరూ చుట్టూ మూగడం తెలుస్తోంది. తల పక్క నుంచి ఏదో వెచ్చగా పాకుతోంది. రక్తం కాబోలు

నొప్పి తెలీడం లేదు గానీ, ఏదో అయోమయంగా ఉంది. దూరంగా మెహెర్ నిల్చుని నవ్వుతోంది

పిల్లలిద్దరూ చెరో బొమ్మా పట్టుకుని చూస్తున్నారు అమ్మ వెనక నిలబడి

“యాబై వేలిచ్చారన్నా ఆయనకి” సీను మాటలు చెవుల్లో గింగురుమన్నాయి.

నవ్వు రాబోయింది. యాభై వేలంటే… తను చచ్చి పోయినా, పెళ్ళాం పిల్లలు బతికి పోవచ్చు

ఈ లోపే ఎవరో అన్నారు “రేయ్, పొంతులు జేబులో ఏదో ఉత్తరముంది సూడండి. ఓయమ్మో, ఈయన పళ్ళేదయ్యా, దూకినాడు, మన ప్రేబే దొరికిందా దూకి సచ్చేకాడికి ?”

అదే మూర్తికి వినపడ్డ ఆఖరు  మాట . ఎర్ర గళ్ళ చొక్కా కిందికి రక్తం చిక్కగా పాకింది

*

 

సుజాత వేల్పూరి

సుజాత వేల్పూరి

26 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • అబ్బా..మరీ ఇంత విషాదమా.. హు..మూర్తీ మెహర్ లను బ్రతకనిచ్చే సమాజం కోసం ఏం చెయ్యాలో మనం..అని ఆలోచిస్తూ..
  మంచి కథ అని వేరే చెప్పాలా..సుజాతా..
  గుండెల్ని పిండేసే కథ బాబూ.

  వసంత లక్ష్మి.

  • కథ నచ్చింది. పల్నాడు పరిసరాల్లో తిరిగినట్టు అనిపించింది.

   పదిహేనేళ్ల సీను గాడి సందేహాలు భలే ఉన్నాయ్.

   మూర్తి చివరి క్షణాల్లో ఆశ వెలిగి అంతలోనే కొడిగట్టటం అయ్యో..అనిపిస్తుంది.
   ముగింపు అనూహ్యంగా ఉంది. ఈ కథకు పెట్టిన టైటిల్ చాలా ఆప్ట్!

  • వసంత గారూ, అపుడపుడూ విషాదాంత కథలు కూడా ఉండాలి కదూ ? 🙂

   Thank you so much

  • వసంత గారూ, అపుడపుడూ విషాదాంత కథలు కూడా పడాలి కదా మరి ?

   Thank you , కథ నచ్చినందుకు

 • పల్నాడు వాకిట్లోనే కాక ప్రపంచంలో ఏ మూలనైనా జరగగలిగే కథ. ఒక విశ్వజనీనత ఉంది కథకు. లోకల్ ఫ్లేవర్ తక్కువ అయింది .

  • కళ్యాణి గారూ,

   లోకల్ ఫ్లేవర్ నింపడానికి.వచ్చే నెల దాకా టైమివ్వండి 🙂

 • ఆసాంతం చదివించింది కానీ…నేను పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ యాస, మాండలీకం కోసం! ఆ గుంటూరు ‘ఖారం’ బాగా తగ్గిపోయింది! చి న
  మరీ ఎక్కువగా చదివితే ఉన్న ఇబ్బంది ముగింపుని ఊహించగలగడం!

  • అనిల్ గారూ
   కథ కోసం మాండలికమే తప్ప, మాండలికం కోసం కథ కాదు కదా

   ఎనీ నే, వచ్చే నెల అటువంటి కథే ఎంచుకుంటాను

   Thank you so much

 • అయ్యో! విషాదాంతం కానివ్వకుండా రాయాల్సింది. “చూసారా! తురక పిల్లని చేసుకొని మా వాడు చచ్చిపోయేడు” అనే అమ్మనాన్నలకి ఏం సమాధానం వుంటుంది? అదేదో విధి గొప్పదన్నట్లు గొప్ప కథని మెలో డ్రామతో నిలువునా ముంచేసారు. ఒక మహా సంకల్పాన్ని చావుతో నీరు గార్చటానికి ఇదేమీ వేదాంతపరమైన దృక్పథంతో రాసిన కథ కాదు కదా! మీ మీద కోపంగా వుంది సుజాతగారూ! ముగింపుని మార్చి రాయండి దయచేసి. లేకుంటే కోపం తగ్గదు మరి. అంతగా ఇన్వాల్వ్ చేసారు మరి నన్ను. – ఇట్లు మీ అభిమాని.

  • అరణ్య కృష్ణ గారూ

   ప్రతి కథా సుఖాంతమవ్వాలని లేదు కదా

   విధి గొప్పదని కాదు, కొన్ని యాధృచ్చికంగా జరిగి పోతాయంతే

   కోపం కాస్త తగ్గించండీ, వచ్చే నెల మంచి ముగింపు ఉండే కథ రాస్తాను 🙂

   Thank you

 • అయ్యో, పంతుల్ని రెంటికీ చెడ్ద రేవడిని చేసేసేరేంటండీ.. ఇటు బతికించనూలేదు, అటు 50,000 ఇప్పించనూ లేదు. అన్యాయమండీ..

 • వర్ణాంతర వివాహం కారణంగా పేదరికం తో, నిరాశలతో చచ్చిపోతారనే సందేశం( మీ ఉద్దేశ్యం ఏదైనా చదివింతర్వాత అనిపించేది అదే) ఈ తరానికి ఇవ్వటం మాని, కాస్త ఆశ, ధైర్యంతో కూడిన పాజిటివ్ దృక్పథం తో రచనలు చేయండి. విమర్శ ఘాటుగా ఉన్నా స్వీకరిస్తారని ఆశిస్తూ….

  • రాఘవరావు గారూ

   నా కథల్లో సందేశాలు ఉండవండీ! జీవిత సజీవ చిత్రం అన్ని వేళలా రంగులీనుతూ ఉండదు

   వెలిసి పోయి చిరిగి పోయిన కథలెన్నో ! అందులో ఇదొక చిత్రం

   ఇలా జరగడానికి అవకాశాలున్న జీవితాలు బోలెడు . అవి వర్ణాంతరాలు కాకుండానే

   మీ విమర్శ కు ధన్యవాదాలండీ

 • చదివాక చాలా స్వాంతనగా చాలా ఖాళీగా అనిపించింది. చాలా బాగా నచ్చింది.. ఇలాంటి ఇతివృత్తం ఎంచుకున్నందుకు ధన్యవాదాలు..

 • ఎర్రగళ్ళ చొక్కా అని పేరు పెట్టి _ కథ సుఖాంతం అయినట్టు నడుస్తూ ఉన్నా_ నాకేదో అనుమానం వెంటాడుతూనే ఉంది _ మీరు ఇంత దుర్మార్గం చేస్తారని ! మూర్తి గారిని బతికిస్తే బాగుణ్ణు కదండీ !!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు