ప్రతి తుఫానుకు ఒక నిగూఢమైన రూపము, పేరు వున్నాయి
దాని ధాటికి నీ మల్లెపూల పందిరి కూలి, పూలన్నీ రక్త నక్షత్రాలై రాలిపోయాకే
ఎంతో ఆలస్యంగా నువ్వు కనుగొన్నావు ఆ బీభత్స, విలయ,భయానక
మానవ తుపాను అసలు పేరు *1 కోవర్ట్ నార్సిజం అని
నీ జీవితంపై కూలిన చీకటి రంగుల ఇంద్రధనుస్సులు
ఇనుప బాణాలై గుచ్చుకుని, నిలువెల్లా గాయపడిన నీ దేహానికీ
హృదయానికీ అంటిన రక్తపు మరకలను తుడిచే నెపంతో
నీ ముంగిట వచ్చి వాలతాయి కొన్ని *2 ఎగిరే రెక్కల కోతులు
వాటి రెక్కలు అతడి అబద్దాలతో అల్లిన పట్టు కుచ్చుల్లా మృదువుగా మెరుస్తాయి
నీ స్నేహితులు, రక్త బంధువులు, నీ జ్ఞాపకాలు, ఆనంద,విషాదాలు
విఫల స్వప్నాలు, ప్రేమాన్విత భ్రమలు అన్నీ కలిసి, నిన్ను వణికించే
ఒకే అద్భుత, భయానక చిరపరిచిత మొఖంగా మారాయి
నీ ఉద్దరణకై, అతడు ఒంపిన పరమపావన నార్సిస్ట్ విషంలో నానిన
అతడి చూపుల్ని ధరించి, అబద్దాల ఊపిరి విషపు శ్వాసని నింపుకుని
ఓదార్పుల పూలమాలల కిరీటాలతో, అమృతం తెచ్చిన
మోహినుల్లా, నీ గుమ్మం ముందు వాలుతాయి ఎగిరే కోతులు
వాటి అద్భుత మాయా దర్పణంలో నీ వేదన, నీ రూపు పరావర్తనం చెంది
రక్త పిశాచ క్రూర హంతక, నేరస్థురాలి వలే నీకు నువ్వు అగపడతావ్
“అవును, అది నేనని” చేయని తప్పులన్నీ నీకై నీవు ఒప్పుకుంటావ్
ఆత్మనింద, లొంగుబాట్ల నల్లటి మసి నీ అంతః చేతనలోకి ఇంకుతుంది
శాశ్విత అపరాధ భావనల ఉరితాటికి నిన్ను వేలాడదీసాక
నీ బాధను, పరాజయాన్ని, భయాలను నిశ్చింతగా జలగల్లా
ఆనందంగా పీల్చుకుని, ఉబ్బిన ఆ ఎగిరే కోతులు
నీ “ఒప్పుకోళ్ళ” పంచామృతంతో అతని పాదాల్ని అభిషేకిస్తాయి
నీ కన్నీళ్ళ ముత్యాల దండలతో అతడి మెడను అలంకరించి
అతడి అహానికి నిన్ను పరిశుద్ద విందుగా అర్పించాక
చుట్టూ కొలువుదీరిన ఎగిరే కోతుల దూతల్ని అతడు ముద్దాడతాడు
నిన్ను మళ్ళీ, మళ్ళీ గెలిచిన ఆనందంతో అతడు వెర్రిగా నవ్వుతాడు
వాటి రెక్కల చిక్కటి చీకటి గూళ్ళలో చిక్కిన నీ ఆత్మా అద్దంలో
ఇంకా అతని మొఖాన్నే నీకవి పదే, పదే చూపుతాయి
నీ చుట్టూ చేరి నీకు తెలియకనే నిన్ను అతడికి అమ్మేస్తాయి
“నీ మేలుకోరే” అనే వాటి చీలిన నాలుకల మాటల గారడీని ధిక్కరించు
ఏదో ఒక రాత్రి నీ గాయాల నుండి మొలకెత్తిన ఒక చిన్ని మల్లె తీగ
తలెత్తి ఆకాశంలోని సూర్యుడి కేసి నిదానంగా పాకుతుంది
అచ్చంగా,నీ రక్తం నుండి పుట్టిన ఆ మల్లె పూవుల తెల్లటి రెక్కలకి
నీ వేదనాభరిత గాథ తెలుసు, నీ బాధలకు అవి ప్రత్యక్ష సాక్షులు
నీవు కనుగొన్న మల్లెల సువాసన నీ చుట్టూ
కోతులు ఎగరలేని ఒక కాంతి వలయాల గోడలను కడుతుంది
వాడిన పూల రెక్కల పాన్పు పై ఎన్నో ఏళ్లుగా శాపగ్రస్థ
రాణివలే నిదురించిన నువ్వు, ఎట్టకేలకు తప్పక మేల్కొంటావు
అతడు అతికించిన నార్సిస్ట్ రెక్కలు, వాటి కళ్లలో అతడి ప్రతిబింబము
నీ బాధాకర జ్ఞాపకాలతో సహా అన్నీ రాలి భళ్ళున పగిలిపోతాయి
స్వప్నాలు నిండిన మేఘమై నువ్వు ఆకాశంలో ఎగురుతావు
ఎగిరే కోతులకన్నా ఎంతో ఎత్తుకు, దూరానికి, వేటికీ అందనంత స్వేచ్ఛగా
ఎగిరే కోతులు ఎంతో కాలంగా మోసుకు తిరిగిన
అతడి అబద్దాలు,ద్వేషాలు,పుకార్లు చివరికిక
ఏ నేలా, ఏ ఆధారమూ,ఊపిరీ దొరక్క
ఉక్కిరిబిక్కిరై , కృశించి,కృశించి అంతరిస్తాయి
కోవర్ట్ నార్సిస్టు ప్రేమల విషపు ఇనుప సంకెళ్ళ కపట కౌగిళ్ళు
ఖాళీ నీడల ఊబి వంటి ఎగిరే కోతుల గుంపులు
ఇక నిన్ను మోసంతో, వంచనలతో బంధించ లేవు
నీ ఆత్మ విశ్వాస పునర్జీవన సముద్రంలో మునిగి అవి మరణిస్తాయి
నువ్విక విముక్తవై, నీలోని గాయపడిన మల్లె పూలకి కొంచెం
ప్రేమని, ఆశని, కలలను,జీవితేచ్ఛల ప్రాణవాయువు నొసగి
నిన్ను నువ్వు కనుగొని , నీదైన శాంతి నిండిన కొత్త లోకం వైపు
నీ స్వప్నాలకు మల్లె పూల గాలి రెక్కలు తొడిగి ఎగురు!
*
ఇటీవల కాలంలో రాస్తున్న “The Gray shades of Love and Lust “ కొత్త సీరీస్ ఆఫ్ poems లో భాగంగా ఈ కవిత
నోట్ :
- 1. వోవర్ట్,కోవర్ట్ నార్సిస్ట్ లు అన్ని రకాల మానవ సంబంధాలలోనూ వుంటారు. వీరిలో, పైకి ఎంతో ఉత్తమంగా,దయార్ద హృదయులు గా,ఒక ఫేక్ ఇమేజ్ తో కనబడే, మైయిన్డ్ గేమ్ ఆడే కోవర్ట్ నార్సిస్ట్ లు అత్యంత ప్రమాదకరమైన మానసిక వైకల్యం కలవారు. ఏళ్ల తరబడి ఆ రకపు మనుష్యులతో, వివిధ రూపాలలో సంబంధాల్లో వున్నా, వారి ముసుగు కారణంగా, వాళ్ళని కనుగొనడం ఎంతో కష్టం. ఈ లోగా వీళ్ళు టార్గెట్ చేసిన విక్టిమ్స్, భయానక హింసకి,ఎమోషనల్ డామేజ్ కి గురై తమ జీవితాన్నే కోల్పోతారు. స్త్రీ పురుషుల సంబంధాల్లో ఈ స్థితి మరింత బాధాకరంగా,దుర్భరంగా వుంటుంది.
* 2. ఎగిరే కోతులు (Flying Monkeys) : నార్సిసిస్ట్ లు తమ టార్గెట్ ను తన నియంత్రణ లోకి తెచ్చుకునేందుకు, వాళ్ళు ఉపయోగించే, వాళ్ళని నమ్మే మనుష్యలు. సహాయం చేసే పేరిట బాధితులను గిల్ట్ లోకి నెట్టడం, వారే తప్పని ఒప్పించడం,పుకార్లు వ్యాప్తి చేయడం వంటి పనులతో పాటూ, బాధితులు తిరిగి నార్సిస్ట్ అబ్యూజర్స్ వద్దకు వెళ్ళేలా చేస్తారు.








వెంటాడే కవిత విమలగారు.హృదయంతరాల లోకి చేసిన ఈ వేదనా మయ అంతః శోధన ఫలితం విముక్త అయి ప్రేమ ఆశ శాంతి దిశగా పయనించటం ముదావహం. ఎగిరే కోతులు అనగానే నాకు ఎందుకో రామాయణం, కొన్ని పంక్తులు చదివితే సీత అగ్నిప్రవేశం, ఊర్మిళ నిద్ర వంటివి గుర్తుకి వచ్చాయి. కేవలం నా భ్రమ. పాపం సమించు గాక!
నీ కన్నీళ్ళ ముత్యాల దండలతో అతడి మెడను అలంకరించి…
విరుచుకు పడ్డారంతే! excellent