ఉద్యమ ద్రోహుల గుండెల్లో మందు పాతర

తెలుగులో ఉద్యమాన్ని చిత్రించిన కథలు చాలానే వచ్చినా ఈ కథలో కథకుడే ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తన వాదనను బలంగా వినిపిస్తాడు.

తెలుగు సాహిత్య యవనికపై కథకుడిగా, కవిగా తనదైన ముద్ర వేసి కొన్ని నెలల పాటు మృత్యువుతో పోరాడి సెప్టెంబర్ 22, 2018న నిశ్శబ్దంగా ఈ లోకాన్ని వీడి పోయిన చైతన్య ప్రకాశ్ రాసింది తక్కువ కథలే ఐనా చెమట చుక్కల్లాంటి కథల్ని రాశాడు. ఈయన కథలన్ని ‘రేణ’ పేరుతో 2001లోనే సంపుటిగా వచ్చాయి.  మరికొన్ని కథల్ని చేర్చి  2015లో ‘మట్టి ముద్రణలు’ ప్రచురణ సంస్థ ‘రేణ మరికొన్ని కథలు’ పేర ద్వితీయ ముద్రణ తీసుకొచ్చింది.

ఈ సంపుటిలోని ఒక్కో కథ ఒకనాటి తెలంగాణ సమాజాన్ని X Ray తీసి చూపిస్తుంది. 2001లో The Indian Express పత్రిక ‘రేణ’ కథల్ని సమీక్షిస్తూ “They are distinctive in terms of theme, style and treatment. Some of the stories display a blend of precepts of Gudipati Chalam and Charu Mazundar. A piteous picture of certain Muslim families is presented with understanding. With indignation, the writer derides the high headedness of the affluent classes over down-trodden sections of the society.” అని రాసింది.

తెలుగు కథ పుట్టి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురించిన 121 మంచి కథల సంకలనంలో ‘రేణ’ కథ చోటుచేసుకోవడం గమనార్హం. చైతన్య ప్రకాష్ కథ‘రేణ’ కథ ఒక్కటి చాలు చైతన్య ప్రకాశ్ కీర్తిని మరో నూరేళ్ళ పాటు నిలబెట్టడానికి. ఉద్యమ చైతన్యంతో పాటు ఉద్యమానికి వెన్నెముకలాగా నిలబడిన సామాన్యుల త్యాగాన్ని ఎత్తి చూపిన కథ ఇది. ఈ కథ మొదటి సారి జూలై 1998 లో ప్రజాసాహితి మాస పత్రికలో ప్రచురింపబడింది.

దళిత దంపతులైన వీరయ్య, లక్ష్మిల ఏకైక కుమార్తెనే రేణ. 1980ల దాకా ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసిపడిన భూమి-భుక్తి-విముక్తి పోరాటాల ప్రభావంతో వీరయ్య నక్సలైట్ ఉద్యమంలో చేరి ఎంకౌంటర్ లో అమరుడవుతాడు. వీరయ్యకు ఉద్యమాన్ని పరిచయం చేసి ఉద్యమంలో చేరేలా ప్రోత్సహించిన నాయకులు నారాయణ, రాజనర్సయ్యలు మాత్రం మోకా చూసుకొని ప్రభుత్వానికి లొంగిపోయి వారు ప్రకటించిన రివార్డు తీసుకొని, ఉద్యోగాలు సంపాదించుకొని హాయిగా భద్రమైన జీవితం గడుపుతుంటారు. ఉద్యమానికి తన భర్తను ధార పోసిన లక్ష్మి ఆమె కూతురు రేణ వీరయ్య ఆశయాలను రక్తంలో నిలుపుకొని, పోలీసులు ఆమె భూమిని ఊళ్ళో ఎవరూ కౌలుకు దున్నొద్దని శాసించినా, చివరికి ఇంటిని కూలగొట్టినా కాయ కష్టం చేసుకొని బతుకీడుస్తుంటారు. అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చి ఎల్లారెడ్డి పేటలో అమ్ముకొని పొట్టపోసుకుందామని లక్ష్మి, రేణ ఇద్దరూ ఎర్రటి ఎండలో బయలుదేరుతారు.

ఒక చెట్టు కింద కొన్ని కట్టెలు కుప్ప వేసి అలసట అనిపించడంతో లక్ష్మి దగ్గర్లోని బావి దగ్గరికి పోయి కుండలో నీళ్ళు తీసుకొస్తుంది. ఇద్దరూ కాసిన్ని తాగి సేదతీరుతారు. అక్కడే నీడకు కూర్చుంటారు. లక్ష్మికి నడిచొచ్చిన తొవ్వంతా యాదికొస్తుంది. “ప్రపంచంల పని జేసెటోళ్ళమంతా ఒకటి. పని జెయ్యక మెక్కి తినే వాళ్ళంతా ఒకటి, మెక్కి తినే వాళ్ళ మక్కెలిరగ్గొట్టి మన రాజ్జెం, కష్ట జీవుల రాజ్జెం రావాలంటివి. ఇగో.. వీరయ్యా.. మేమింకా కష్టంలనే ఉన్నం. అయ్యా..! నీ తెలివి మాకియ్యవా… పది మంది కోసం పాణమిచ్చిన నీ తోవ జూపెట్టావా? నీ తొవ్వలెంకుతున్నం… మాకు దొర్కుతదా? మన రాజ్జెం ఎప్పుడొత్తదో… అయ్యా… నువ్వు జెప్పినట్టి రొండు వర్గాల నడుమ ఎడతెగని కొట్లాట. ఇది బాధ, ఇది ఆకలి. దేనిగ్గూడా ఎనుకాడని సావుసం. ఎంతో ఉంటే తప్ప తెల్వని లోక బాధ.” ఇట్లా లక్ష్మి మనసు పరిపరి విధాలా పరితపిస్తుంది.

ఇంతలో ఎండ చల్లబడిందని గ్రహించి మళ్ళీ కొన్ని నీళ్ళు తాగి చెరో కట్టెల మోపు ఎత్తుకొని చీకటి పడేసరికి ఇంటికి చేరుకుంటారు. తెల్లవారి అదే మోపులను ఎత్తుకొని అమ్మడానికి ఎల్లారెడ్డి పేటకు బయలుదేరుతారు. ఏదో వాడకట్టులో తిరుగుతుంటే ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరుగుతారు. చూస్తే షేవింగ్ చేసుకుంటూ రాజనర్సు కనిపిస్తాడు. ఎంతకో కొంతకు కొంటాను కానీ ముందు మీరైతే కట్టెల మోపులు దించుండ్రి అని గతాన్ని తల్చుకొని “మీరు మాత్రం విపరీతంగా నష్టపోయిండ్రు. నాకు చాలా బాధగా ఉంది… చూడు లక్ష్మి! నేను పదిహేనేళ్లు పార్టీ కోసం అజ్ఞాతంలో తిరిగాను. ఉద్యోగాన్ని, భార్యా పిల్లల్ని వదులుకొని. ఎవడు గుర్తించాడు? నేనెంత నష్టపోయాను. మా తోటి పోరాటంలోకి వచ్చిన ఎంత మంది రత్నాల్లాంటి యువకులు బుగ్గి పాలయ్యారు. తల్చుకుంటే దుఃఖమొస్తుంది. ఈ పోరాటాల వల్ల బతుకును గెల్చుకోవడం నేర్చుకోలేం. ఓడిపోవటాన్నే నేర్చుకుంటాం… చల్లటి చావు కబురులాగా చచ్చినవాడికి అమరుడని పేరెట్టి, దేవుణ్ణి చేసి పాటలు గడ్తే తిరిగొస్తాడా?” అని మొసలి కన్నీరు కారుస్తూ బాధ పడుతాడు.

రాజనర్సు నటన చూసి లక్ష్మికి, రేణకు రక్తం ఉప్పొంగుతుంది. లోలోపల అణచుకున్న అనేక ప్రశ్నలు మరిగి మరిగి లేస్తుంటే…

“మమ్ముల జూత్తే మీకేం బాధ సారూ…?

మిమ్ముల జూత్తే మాకే బాధ అన్పిత్తుంది. గన్నేండ్లు పార్టీ రహస్య నిర్మాణంల పనిజేసి, ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా ఉండి, గింత దరిద్రంగా దిగజారి పోయిండ్రని, దానికివన్నీ సాకులూ, జాలి జూపెడ్తూ బాకాలూ. మాకు మిమ్ముల్ని చూస్తే చాలా బాధగా ఉంది సారూ.. ఎంత పతనమైపోయిండ్రో” అంటుంది లక్ష్మి.

“మమ్ముల జూస్తే మీకేం బాధ? మాకే బాధ. మాలాంటి కోట్ల మందికి బాధ-బాధిత ప్రజానీక విముక్తి ఉద్యమాల్లోంచి పిరికిగా పరుగెట్టుకొచ్చిన మీకేం బాధ?… ఎవరికీ ఉపయోగపడని బతుకు… చచ్చినా ఒకటే. బతికినా ఒకటే. ప్రపంచమంతా పరచుకున్న గబ్బు పేదరికాన్ని చూసి, భరించే శక్తి లేక, పోరాడే చేవ లేక, పక్క దారులు వెతుక్కొని… మీదే గందరగోళ జీవితం… పీడితులు, దళితులు, స్త్రీలు ఉద్యమాల వల్ల నష్టపడ్తరా? కొనసాగుతున్న నికృష్ట వ్యవస్థ వల్ల నష్టపడ్తరా? ఉద్యమ నాయకుల  కోసం, కార్య కర్తల రహస్య జీవితమా? రాక్షస రాజ్య యంత్రాంగం కోసం – ఆత్మ రక్షణ కోసం ఉద్యమం ఆసాంతం రహస్య  జీవితమా? ఏంటో చెప్పండి సార్! ఏదో… ఏంతోస్తే అదే చెబితే ఎట్లా సార్?” అంటుంది కోపంగా రేణ.

వీళ్లతో మాట్లాడి ఎందుకురా తలనొప్పి తెచ్చుకున్నాను. నేనేదో సానుభూతి చూపిస్తే, వీళ్లింకా ఆ మూస నుండి బయటకే రానట్టున్నారు అని రాజనర్సు లోలోపల అనుకుంటాడు. ఇంతలో లోపల్నుండి రాజనర్సు భార్య విసుగుతో వచ్చి “ఏ.. తియ్ నీకు ముచ్చట్లంటే పాణం… ఎవలెట్లా జెడిపోతే నీకేంది? గా కట్టెలమ్ముకొని బతికేటోళ్ళ తోటి ఏందిదంతా…?” అని ముఖం అసహ్యంగా చిట్లించుకుంటుంది. భార్య మాటలకు ఇంతెత్తు ఎగిరి పడిన రాజనర్సు నోర్మూసుకొని ఇంట్లోకి పొమ్మని ఆమెపై అరుస్తాడు. ఆ గొడవకు బిత్తర పోయిన రేణ స్త్రీలకోసం ప్రత్యేక ఉద్యమాల మాట గుర్తొచ్చి నవ్వుకుంటుంది. ఇగ మేం పోతం సారూ!  అని చేతులు జోడించి అక్కడి నుంచి బయలుదేరి అంగడికి పోయి కూరగాయలు, ఇతర సామాన్లు కొనుక్కుని ఇంటికి చేరే సరికి వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న ఇద్దరు అండర్ గ్రౌండ్ వ్యక్తులు కలుస్తారు. క్షేమ సమాచారాలు అడుక్కోవడం పూర్తయ్యాక “అసలు విషయం ఏమిటంటే మిమ్మల్నిద్దర్నీ పార్టీ అజ్ఞాత కార్యక్రమాల్లో పనిచేయాల్సిందిగా తీర్మానించి, మీ అభిప్రాయం కోసం మా ఇద్దరినీ పంపింది.” అని ఆ విషయమే రాసి ఉన్న లెటర్ను ఒకదాన్ని చూపిస్తారు… వర్షాకాల ప్రారంభ వేళ గరిక పచ్చ నేలలో లోతు నుంచి నాలుగు మానవ వృక్షాలు బలిష్టంగా నించుని, అస్తిత్వం కోసం వాయువులు వీస్తున్నట్టు అయింది అక్కడి వాతావరణం. అవ్వా! తొందరగా బువ్వండు! తిని పోదాం!” అంటుంది రేణ.

బూటకపు ఎన్కౌంటర్లలాగా బూటకపు ఉద్యమకారుల్ని నిప్పుతో కడిగేసిన కథ ఇది. అర్బన్ నక్సలైట్లను, రాజ్యపు తాయిలాలకు ఆశ పడి ఉద్యమాన్ని నిలువు నిత్తారం అమ్మేసి, పీడితుల మూలుగను మరింత పీల్చుకుతినే వ్యవస్థతో అంట కాగే ఉద్యమ ద్రోహుల్ని బోనులో నిలబెట్టే కథ ఇది. 1970ల నుండి 1990ల దాకా తెలంగాణ పల్లెలు, అడవులు, గోడలు రక్తంతో, నినాదాలతో ఎరుపెక్కిపోయినై. మూతి మీద మీసం మొలిచిన యువకులంతా పోలీసుల నిర్భందాన్ని ఎదుర్కోలేక వలసలు పోయేవారు. తలలకు వెలలు, రైతు కూలి ఉద్యమాలు, నకిలీ నక్సలైట్ల విజృంభణ, ఆధిపత్య వర్గాల దోపిడి, దౌర్జన్యాలు… అంతా ఒక ఉక్కపోత వాతావరణం. ఇంత అణచివేతలో కూడా నక్సలైట్ ఉద్యమానికి క్యాడర్ రిక్రూట్ మెంట్ జోరుగా సాగేది. అట్లాంటి ఒక మందు పాతర పేలిన తరువాతి వాతావరణం లాంటి వాతావరణంలో పుట్టిన కథ ఇది. రచయితకున్న ఉద్యమ సానుభూతి, పీడిత జన పక్షపాత వైఖరి కథంతా నిండి ఉంది. ఉద్యమం ఎవరినీ పిలవదు. అలాగని కోరి వచ్చిన వారిని వదులుకోదు.

స్వార్థం పెరిగిన కుహనా ఉద్యమకారులే ఎప్పటికీ ఉద్యమానికి ద్రోహం చేస్తూనే ఉంటారు. ఉద్యమాలకు వ్యాఖ్యానాలు రాస్తూ తమను తాము ఉద్యమకారులుగా చిత్రీకరించుకుని, తాము మాత్రమే ఉద్యమ నాయకులుగా మిగిలిపోయి తమ వారసులను డాలర్ల వేటలో విదేశాలకు పంపించే ‘బతక నేర్చిన’ ఉద్యమకారులకు చెంపపెట్టులాంటి కథ ఇది. ఏ ప్రజా ఉద్యమానికైనా వెన్నుదన్నుగా నిలిచేది దళిత, బహుజనులేనని నిరూపించిన కథ కూడా. ముఖ్యంగా కింది కులాల స్త్రీలు ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకుంటారో, ఉద్యమంతో ఎలా మమేకమవుతారో ఈ కథ తన శక్తి మేరా నిరూపిస్తుంది. అందరి ఆకలి తీరి అందరూ సమానంగా ఉండే రోజొకటి రావాలని కలగనే కథ. ఏదో సుఖ లాలస కోసం అతి కొద్ది మంది మాత్రమే అవకాశాల్లోకి జొరబడి అదే భద్రమైన జీవితమని భ్రమపడే అమాయకులను చూసి విరగబడి నవ్వే కథ.

తెలుగులో ఉద్యమాన్ని చిత్రించిన కథలు చాలానే వచ్చినా ఈ కథలో కథకుడే ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తన వాదనను బలంగా వినిపిస్తాడు. కథ ప్రారంభంలోనే లక్ష్మి తన కూతురు రేణను నిద్ర లేపి కట్టెల కోసం అడవికి పోదామంటుంది. ఇలాంటి విలక్షణమైన ఎత్తుగడతో కథకుడు సమాజంలో రావాల్సిన మార్పును, చైతన్యాన్ని, భవిష్యత్ కథా సూచనను ధ్వన్యాత్మకంగా చెప్తాడు. తెలంగాణ కథా సాహిత్యంలో ‘రేణ’ కథ నిత్యం జ్వలించే ఒక కాగడా. పులితోలు కప్పుకున్న మేకల్లాంటి నిజాయితీ లేని దగుల్బాజీ ఉద్యమకారుల మెదళ్లపై కర్రు కాల్చి వాత పెట్టే నిప్పుల కటారు.

                                                (చైతన్య ప్రకాశ్ కు అశ్రు నివాళి)

 

 

 

 

 

 

 

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

16 comments

Leave a Reply to Dr. Veldandi Sridhar Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తన రచన ఏది అచ్చయినా చెప్పేటోడు,నా కవిత ఏది అచ్చయినా మెచ్చుకునేటోడు చైతన్య ప్రసాద్. “మూయని దర్వాజ” సభ మా మిత్రబృందంతో మియాపూర్ లో ఆవిష్కరింప చేసుకొని పొంగి పోయిండు.నిఖార్సయిన కవి,రచయిత, మాత్రమే కాదు కడు పేద. ఆఖరు రోజుల ముందు కాలంలో కష్టంగా వుంది ఏదైనా పని చూడండన్నా అని దీనంగా అడగటం ఇంకా చెవుల్లో మోగుతూనే వుంది

    • ఎప్పుడు కనిపించినా ఆకలితోనే కనిపించేవాడు. తెల్సినవాళ్ళం అప్పుడప్పుడు ఆదుకున్నా, జీవితం మీద భరోసా ఇవ్వలేకపోయాం. చివరి రోజుల్లో మృత్యువుతో కొట్లాడి కొట్లాడి కాల గర్భంలో కలిసిపోయాడు. సాహిత్యకారులెవ్వరూ కనీసం ఒక నివాళి సభ పెట్టలేకపోయారు.

  • నలుగురికీ మేలు చేయాలనే ఒక ఆశయం కోసం జీవితాంతం శ్రమించి, జీవితాన్ని ధారపోసిన చైతన్య ప్రకాశ్ లాంటి మంచి సాహిత్య కారులు, ఉద్యమకారులు అజ్ఞాతంగా చరిత్ర లోకి కనుమరుగైపోతున్నారు. చైతన్య ప్రకాశ్ గారి కథ పరిచయం చేయడం ఒకరకంగా నివాళి అర్పించడమే. థాంక్యూ శ్రీధర్ సార్

  • మంచి సమీక్ష వెల్దండ సార్. చైతన్య ప్రకాష్ గారి పూర్తి సాహిత్యం పైన లోతైన అధ్యయనం అవసరమే. ఈ పని ముందు తరాల మీద ఉన్నది. ఆయన మరణం తర్వాత ఎన్నీల ముచ్చట్లు కరీంనగర్ లోని ఆయన స్నేహితుడి ఇంటిలో చేసుకుంటూ స్మరించుకున్నం. బహుశా వచ్చే ఎన్నీల ముచ్చట్లు సంచిక ఆయన ముఖ చిత్రం తో వేసే విషయం ఎన్నీల ముచ్చట్లు పెద్దలతో మాట్లాడుతాను.

  • రేణ గొప్ప కథ..చైతన్య ప్రకాశ్ ఏది రాసిన జీవ కళ ఉట్టిపడేది. మాటైనా, రాతైనా నిక్కచ్చిగా, నిర్భీతిగానే. కథను విశ్లేషిస్తూ కథాంశం వైపు నిలిచి నీవు నేటి పరిస్థితులను నిలదీయడం బాగుంది. ప్రత్యేకంగా మీ కథల ఎంపిక గుణాత్మకమైనది.

  • సందర్భోచితమైన కథను విప్పి చెప్పినందుకు, నిరంతరం కాలమ్ రాస్తూ సాహిత్య సేవ చేస్తున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు మిత్రమా….

  • చైతన్య ప్రకాష్ గారికి మీరు సమర్పించిన నివాళి చాల బాగుంది . రేణ కథ పూర్తి కత ను పెడితే బాగుంటుంది .దయచేసి పూర్తి కథను పెట్టగలరని మనవి . నాలాంటి ఎందఱో చదివితే చైతన్య ప్రకాష్ గారి ఆత్మ కు సంతృప్తి కలుగుతుంది.
    మీకు అభినందనలు .ఇంకా ముందు ముందు మంచి మంచి విమర్శలు విశ్లేషణలు రాయాలని కోరుకుంటున్నాం

    • నా వ్యాసంలో “చైతన్య ప్రకాష్ కథ” అని బ్లూ కలర్ లో ఉన్న చోట టచ్ చేయండి మీకు కథ PDF కాపీ డౌన్ లోడ్ అవుతుంది.

  • చైతన్య ప్రకాష్ గారి సాహిత్య చరిత్ర జీవితం గురించి విపులంగా రాయాల్సిన అవసరం వుంది .దయచేసి పూర్తి సమాచారంతో రానున్న తరానికి అందించగలరని ప్రార్థన .

  • చైతన్య ప్రకాష్ కి గొప్ప నివాళి శ్రీధర్ ! కధా కచేరీకి వన్నె తెచ్చిన వ్యాసం. అభినందనలు.

  • ఒక మహోన్నతమైన ఆశయం కోసం జీవితాన్ని ధారపోసిన చైతన్య ప్రకాశ్ కు అశ్రు నివాళి అర్పిస్తూ;
    వారి ‘రేణ’ కధను ( తెలంగాణ కథా సాహిత్యంలో నిత్యం జ్వలించే ఒక కాగడా ‘రేణ’ కథను )
    పరిచయం చేసిన శ్రీధర్ వెల్దండి గారికి నెనర్లు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు