ఈ కిక్కిరిసిన ఏకాంతం మనందరిదీ!

Any text is constructed as a mosaic of quotations; any text is the absorption and transformation of another.

– Julia Kristeva

1.

వి ఏకాంతం ఎంత సాంద్రంగా కిక్కిరిసి ఉంటే తన కవితలో లోకం అంత గొప్పగా ప్రతిఫలిస్తుంది. కవి ఏకాంతం ఎంత నాజూగ్గా ఉంటే తన కవిత అంత సరళంగా ఉంటుంది. కవి ఏకాంతం ఎంత చిక్కగా ఉంటే తన కవిత అంత సులువుగా జాలువారుతుంది. ఇవీ కవులకు వర్తించే ఇవాళ్టి axioms.

పసునూరు శ్రీధర్ బాబు గారు గత ముప్ఫయ్యేళ్ళుగా కవిత్వం రాస్తున్నారు. ఈ కవి కవిత్వమంతా అతని తండ్రి అతనికి పెట్టిన భిక్ష. ముఖ్యంగా “జీవితాన్ని/చాలా విశాలం చేసుకోవాలి/ …………/లోపల్లోపలికి దారులు చేసుకోవాలి/లోపలి జాగాను/కోసుల కొద్దీ పెంచుకోవాలి/లోపలికి నాలుగడుగులు వేస్తేగానీ/బయటకు ఓ అడుగు వేయలేం” (ఎంతెంత దూరం?) అన్నప్పుడు కవి కన్నా కవి కన్నతండ్రే బాగా కనిపిస్తారు.

పల్లెటూరు, పిల్ల కాలువ, పంటపొలం ఇటువంటి అన్నిటి మధ్యనా గడిచిన బాల్యమీ కవిది. అయితే బాల్యాన్తే శోకం ధ్రువమ్! అప్పుడు మొదలయిన అనుభవాల ఆటుపోటుల అంతరార్భాటమే ఈయన కవిత్వం. ఈ కవికి ప్రపంచం స్తబ్దుగా ఉంటే కవిత్వం పుట్టదు. “కొందరు మాటనూ ఇవ్వరు/మౌనాన్నీ ఇవ్వరు/నిరర్థకంగా వెళ్ళిపోతారు/వచ్చిన జాడల్ని కూడా తుడిచేసుకుని -” అన్నప్పుడు ఈ కవి కదలిక కోసం ఎంత తపించిపోతాడో అర్థమౌతుంది. ప్రతి మనిషీ పరిచయం కావాలి. ప్రతి అనుభవమూ ఒక గాయాన్నో ఓ చిటికెడు ఉపశమనాన్నో ప్రసాదించాలి. కదిలేవీ కదిలించేవీ పెను నిద్దుర వదిలించేవీ ఎక్కడున్నా వాటికోసం ఈ కవి వెతుకులాడతారు. ప్రతి మాటా ఈయన అంతరంగంలో తిష్ఠ వేసుక్కూర్చుంటుంది.

ప్రతి సౌందర్యశకలానికీ ప్రతి బాధాసందర్భానికీ ఈయన అమ్ములపొదిలో చోటు ఉంది. వాటి transformative power ఈ కవి కవితోద్భవానికి తల్లి వేరు. “నువ్వెవరో నాకు తెలియదు/నేనెవ్వరో నీకు తెలియదు/ఎప్పుడైనా ఏ వీథి మలుపులోనో/మనం ఒకరికొకరు తారసపడినప్పుడు/చెరోదారిన పట్టనట్టు వెళ్ళిపోకుండా/పరిచయం చేసుకుందాం/నాలుగు మాటలు మాట్లాడుకుందాం/అప్పుడిక మనం ఏ దారిన ఎంత దూరం పోయినా దిగుల్లేదు/” (ఓ పాఠకుడా!) అన్నప్పుడు ఈ కవికి మనిషి పరిచయమూ తదనుభవస్పర్శా అణుపరిమాణమయినవైనా హిమవత్ శృంగంలా ఎత్తుగా నిలిచిపోతాయని మనకు తెలుస్తుంది.

2.

ఎక్కడ చూసినా తనకు తనే కనిపించడమనే భావన మన సంస్కృతిలో తొలి నుండీ ఉన్నదే. శ్రీధర్ బాబు రెండో కవితా సంపుటి “నిదురపోని మెలకువ చెప్పిన కల”లో తొలి కవిత “అనేక వచనం 2.0″లో ఎత్తుగడ తరువాత కవి “నేనే ఈ జలారణ్యంలో అన్ని వైపులా అసంఖ్యాకంగా/నన్ను నేనే చూసుకుంటూ పోల్చుకుంటూ చీల్చుకుంటూ ఈదుకుంటూ…” అన్నప్పుడు ఒక అనాది అనుభవం పరిణతమై అద్వైతాన్ని ఎరుకపరుస్తూ మనసుకు చేరువ కావడం ఎవర్నీ దాటిపోదు. అష్టావక్ర మహర్షి తన శిష్యుడైన జనకుడితో ఇలా అన్నాడు:

యత్త్వం పశ్యసి తత్రైకః త్వమేవ ప్రతిభాససే
కిం పృథక్ భాసతే స్వర్ణాత్ కటకాంగదనూపురమ్ [అష్టావక్ర సంహిత:139] [నువ్వు ఎటు చూసినా నీవే భాసిస్తూ నీకు నువ్వు కనిపిస్తావు. స్వర్ణం కన్నా వేరుగా కటకాంగదనూపురాది స్వర్ణాభరణాలు మెరుస్తాయా?]

మహర్షుల మూల వాక్కులు కవుల ఆధునిక భావాలకు ఆటపట్టులవడం కద్దు. కవిత్వం నాకొక spiritual activity అన్న ఈయన కవితలో ఇటువంటి భావనలు కనిపించడం వడ్లగింజలో బియ్యపుగింజ కనిపించడమే. ఇంకా, “నీ లోకి దారి తెలియక…”లోనూ ఇదే అద్వైతస్థితి. ఈ సంపుటి “వెన్నులోంచీ సన్నని సెగలా పెల్లుబికే గానం” ఎందుకయిందంటే, కవి మాటల్లోనే చెప్పాలంటే, ఈ కవికి దొరికిన “కొత్త భారం” తననెంతో తేలిక చెయ్యడం మూలాన.

ఇటువంటి కవితాత్మక పంక్తులు ఇందులో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. నీషే చండతీక్ష్ణ వాక్కులవలెనూ మలార్మే ప్రహేళికలవంటి ఊహల్లానూ ఇవి పాఠకులను ఓదార్చి, వారిలో బోలెడు జీవనోత్సాహన్నీ కలిగిస్తాయి. “శిథిలమై పోవడం కన్నా తగలబడి పోవడం మంచిదని/దావానలంతో దాహం తీర్చుకోవాలని తెగిస్తాను” అన్నది నిజానికి నీషేను పోలిన తెగువ. ఈ సంపుటిలో గళమెత్తిన కవి “కొత్త ఆయుధం కోసం అక్షరాన్ని మోహించాను” అని చెప్పుకోడానికి ముందే ఆయనకా పదునైన ఆయుధమేదో దొరికేసింది.

ఈ సంపుటికొచ్చేటప్పటికి ఈయన కవితావాక్యం చిక్కనిదై చిన్నదై అదే అన్వేషణను కొనసాగించింది. సముద్రంలోకి వల విసిరి వేచి చూస్తున్న జాలరి మాదిరి ఈ కవి సత్యార్థియై కవితాస్త్రాలని సంధించాడు. ఆ పరమసత్యమేదో చిక్కిందా అంటే అది దొరికేది కాదు, అలా దొంగాటలాడి తప్పించుకొనేది. మూడో సంపుటిలోనున్న గాఢమైన సరళత అనుభవిస్తే పాఠకుడికి స్వపరభేదాల స్పృహ సన్నగిల్లిన తాదాత్మ్యపు స్థితిలో కవిలోకి తను పరకాయప్రవేశం చెయ్యక్కర్లేదనీ ఆ పని కవే బాగా చేశాడని రెండూ అభేదాలనీనూ పూర్తిగా అవగతమైపోతుంది.

3.

“ఏకాంతం ఒక అతిథి”, అన్నారీ కవి, ముచ్చటగా తన మూడో కవితా సంపుటికి నామకరణం చేస్తూ.

ఎంత గౌరవప్రదమైన భావన! అతిథి దేవో భవ అనే గురుకులంలో విద్య ముగించుకునే విద్యార్థులను దీవిస్తారు. ఏకాంతంలోనే కదా ఈ చరాచరవస్తుజగత్తూ ఈ మానవాళీ ఈ బంధానుబంధాలూ కవికి ఒక అర్థంలోకి నిర్మించుకునే అవకాశాన్నిచ్చేది. ఇతని My Dear Joker అనే soliloquy చదవండి. తన ఆత్మచ్ఛాయతో తనే జరిపిన యుద్ధభాషణమీ poem. “లేజర్ మిరుమిట్లతో” వెలుగొందే టెక్నిక్‌తో రాశారీయన.

లోగడ రాసిన “అనేకవచనం” అనే సంపుటిలో Seamus Heaney (“The poem is a drop of water that has become a crystal….a point of rest in a world of flux.”) అన్నట్టుగా జలకణం స్ఫటికమైనట్టూ, చలనశీలతగల లోకవాస్తవాలు ఓ క్షణం స్తంభించినట్టూ ఇతని కవితలు రూపు దిద్దుకున్నాయి. ఎంతగా లోపలి గదిలో పుటం పెట్టి పరీక్షించినా నిజం ఏదో నీడ ఏదో ఎప్పటికీ తెలీదు. ఇదీ మన అసలు విషాదం. “ఒక కన్నీటి చుక్కలో ముంచి/నాకు సప్తసముద్రాలు చూపించావ్” అనుకోవడంలోనే చుక్కాని దొరుకుతుంది, ఆవలి తీరాన్ని చేరుకునేందుకు. “మనిద్దరమూ విదూషకులమే జోకర్” అన్న స్వపరాభేదపరిణతి కూడా ఈ తృష్ణకు full stop పెట్టదు.

జీవితమంటే జీవించడమే, అర్థం కోసం, స్వచ్ఛాశ్రువుల కోసం పడే వెంపర్లాట అనంతంగా సాగుతూనే ఉంటుంది. “వాక్యానికి ప్రాణాన్నిచ్చే గాయం” అనుక్షణం పునర్జన్మను పొందుతుంది. “సంతోషమూ/దుఃఖమూ లేని గది ఒకటి/లోపల ఉందట” అని కవి జ్ఞానం, అయితే, ఆ గది మంత్రకవాటం తెరిచే నేర్పూ, ఆ గదిలో ఏముందో తెలుసుకునే చక్షువులూ మనకెలా కలుగుతాయి? ఎంతైనా కవితను ఏర్పరచడమే ఒక అన్వేషణ, ఒక బృహత్ప్రయాణం.

కనుక, శ్రీధర్ బాబు గారు చెప్పినట్లుగా, “కవిత్వంలోకి దిగే ముందు/ఓ తోలు సంచీని కూడా/వెంటతెచ్చుకోవడం” (కవిత్వంలో ఏముంది)” మరిచిపోకుండా ఉంటే, కనీసం కొన్ని గుణపాఠాలైనా నేర్చుకుంటాం.

కిక్కిరిసిన ఈ కవి ఏకాంతంలోకి మనమందరమూ “తప్పకుండా కలిసే వెళదాం”. అక్కడ ఒక “శిథిలవల్మీకంలోంచి అశ్రుసర్పం తొంగిచూస్తే” మాత్రం, ఆ “దుఃఖాశ్రువులతో కళ్ళను శుభ్రంగా కడుక్కొని”, తలపై చల్లుకొని పునీతులమౌదాం.

*

వాసు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.