ఈ-కాలంలో ఒక శృంగార కావ్యం “వన్నెపూల విన్నపాలు” !

ఇప్పటి తరంలో రాధ హృదయంపై ఇంత పట్టును సాధించిన రచనలు లేవనే చెప్పొచ్చు. ద్వాపర యుగాన్ని ఈ యుగానికి లాక్కొని వచ్చింది. చిత్రలేఖ శైలి సరళ గంభీరంగా సాగింది.

‘రాణీ చిత్రలేఖ’ కవిత్వం తెలుగు సాహిత్యంలో కొత్త. ‘ వన్నెపూల విన్నపాలు’ పేరుతో రాసిన శృంగార కావ్యం ఇది. రాధాకృష్ణుల ప్రేమ కథ ఇది.

చిత్రలేఖకు కవిత్వం , సంగీతం, నృత్యం, నటన ఇష్టమయిన విషయాలు. కవిత్వంలో ఇది తొలి పుస్తకం. ఇక ‘యాంకర్ ‘గా ప్రారంభమయిన ఆమె మంచి ఇంటర్వ్యూవర్ గా పేరు తెచ్చుకుంది.సినిమాల్లో కూడా కొంతకాలం నుంచీ నటిస్తోంది. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తుంది.ఇలా ఇతర రంగాలలోపేరు తెచ్చుకున్న చిత్రలేఖ కవిత్వాన్ని పరిచయం చేద్దామనిపించింది. ప్రస్తుతం చిత్రలేఖ హైదరాబాద్ లో వుంటోంది. రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని, రాణీ చిత్రలేఖ ఎంతో ఉద్వేగ భరితంగా ఈ దీర్ఘ కవితను రాసింది. 125 చిట్టి చిట్టి ఖండికలున్నాయి. ప్రస్తుతకాలానికి ఇది విలక్షణమయినదే. భక్తి, రక్తి, ముక్తి మార్గాల అన్వేషణ ఆద్యంతమూ కనిపిస్తుంది.

‘ముద్దుపళని’ ఆ రోజుల్లోనే ‘రాధికాసాంత్వనాన్ని’ రాసి, అనేక విమర్శలకు గురయింది. స్త్రీలకు శృంగారకావ్యం రాసే అర్హత లేదన్న వాదనను ఎదుర్కొంది. అసలు పళని స్త్రీనే కాదు పురుషుడే రాసుండొచ్చు అన్నంతవరకు ఆ విమర్శల స్థాయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ‘బెంగుళూరు నాగరత్నమ్మ’ తన నగలన్నీ అమ్మి ఆ పుస్తకాన్ని ముద్రించింది. శృంగారజీవితమనేది మానవ జీవితంలో ఒక భాగం. అది తప్పే అయినట్లయితే స్త్రీలే కాదు పురుషులు రాసినా తప్పే కదా!

వీరేశలింగం గారి లాంటి గొప్ప సంఘసంస్కర్త కూడా ఇది, ఒకతె లాంటి న్యూనత పదాలతో తక్కువచేసి  మాట్లాడారని ఆ పుస్తకం ముందుమాటలో నాగరత్నమ్మ రాసింది. ఇదంతా ఎందుకు చెబ్తున్నానంటే, ఆనాడే కాదు ఈ నాటికీ విమర్శలు అలాగే కొనసాగుతున్నాయని.

స్త్రీలు రాయగూడదన్న ఆంక్షల్ని చిత్రలేఖ బ్రేక్ చేసింది. చాలా స్వచ్ఛమైన మనసుతో , ప్రేమోద్విగ్నతతో, ఒకానొక ఉన్మత్తతతో, సమ్మోహనభరితంగా రాసింది.స్త్రీల చుట్టూ అల్లబడిన ‘మిత్ ‘ ను ఛేదించింది. ఏ సెన్సారింగ్ కి లోబడకుండా తనకు నచ్చిన విషయాన్ని ఎంతో ఇష్టంతో రాసింది.

ఇప్పటి తరంలో రాధ హృదయంపై ఇంత పట్టును సాధించిన రచనలు లేవనే చెప్పొచ్చు. ద్వాపర యుగాన్ని ఈ యుగానికి లాక్కొని వచ్చింది. చిత్రలేఖ శైలి సరళ గంభీరంగా సాగింది. ఆహ్లాదకరమైన రచనా నైపుణ్యం. చాలా అలవోకగా పదాల్ని పేర్చుకుంటూ పోయింది. చదువరులంతా ఇంచుమించుగా ఆ ప్రేమమయలోకంలోకి వెళ్ళి పోతారు. ఆ ట్రాన్స్ ను కలిగించిన ప్రతిభ ఆమెదే. కొన్ని కొన్ని చిత్రమైన ఊహలు, అనుభూతులూ, లేఖలూ కలగలిసి రచనకు కొత్త రూపాన్ని ఇచ్చాయి. రాధప్రేమ , హృదయావిష్కరణ జరిగింది. ఒక్క రాధే కాదు 16 వేలమంది గోపికల ప్రేమనూ, వారందరికీ కృష్ణుడి పట్ల గల ఆరాధనను చెబ్తూనే, రాధ ఎందుకు ప్రత్యేకమో చెబ్తుంది. ఆధ్యాత్మక చింతనతో వారి మధ్య నున్నది అత్యున్నతమైన’విశ్వమానవ ప్రేమ ‘ సుమా అంటుందొకచోట. ఇలా రకరకాల అర్ధాలను, భావాలను కలిగించినప్పటికీ’ ప్రేమ ఉత్కృష్టతనే పదే పదే వర్ణిస్తూ పోయింది.

తనకు, తన ప్రేమికుడు దూరమైపోతాడేమోనన్న భయంతో , అభద్రతాభావంతో, తల్లడిల్లి పోతూ తన ప్రేమను రకరకాలుగా వ్యక్తీకరించిన తీరులో కొత్త కొత్త పోలికలు ,ఉపమానాలతో కవిత్వం చిక్కగా సాగింది. విహ్వల స్థితినీ, స్త్రీల అంతరంగాన్నీ , విదేహ స్థితినీ, స్త్రీల ప్రేమలోని నిజాయితీని, ఉన్మత్తతనూ , అమాయకత్వాన్ని పదాల సౌందర్యంతో వ్యక్తీకరించింది.

‘విచ్చుకున్న కలువలను చూస్తే కృష్ణుడే చంద్రుడై వచ్చాడని, విరగబడి నవ్వుతున్న తామరలను చూస్తే , సూర్యుడై వున్నాడని, ఇలా చుట్టూవున్న ప్రకృతంతా అతడే నిండిపోయివున్నాడని ,తనను తన శరీరాన్ని , ఊహల్ని మరిచి దేహరహిత ప్రేమోన్మాదస్థితిలో కవిత్వమై పలవరించడం చాలా చోట్ల కనిపిస్తుంది
‘కనురెప్పల్ని కసురుకుంటుంది వాలిపోవద్దని, – ఆ ఒక్క క్షణంలో కూడా అతడి రూపు మరుగున పడిపోకూడదని, తనూ కృష్ణుడూ ఏకశరీరులమనీ , ఏకాత్మలమనీ, విశ్వప్రేమకు సంకేతాలమనే కలవరిస్తుంటుంది. రాధ హృదయం, లయ తప్పిన గుండె అలజడి అక్షరాల్లో కన్పిస్తుంది.

స్త్రీలల్లో వుండే మానసిక సాన్నిహిత్యాన్ని, ప్రేమనూ, స్నేహాన్నీ, కలుపుగోలు తనాన్ని, ఉన్నతీకరించబడిన ప్రేమ తత్వాన్ని, రాధాకృష్ణుల ప్రేమ ఔన్నత్యాన్ని అద్భుతంగా చెప్పింది చిత్రలేఖ. ఇలా రాయడానికి ధైర్యం కావాలి. భాషా పరిజ్ఞానం మెండుగా వుండాలి. తనకు నచ్చిన ఇతివృత్తాన్ని తీసుకుని రాసే చొరవ వుండాలి. స్వేచ్ఛగా వ్యక్తీకరించగలిగే గుణం వుండాలి. నిబంధనల చట్రంలో ఇమడని తనం వుండాలి. ఇవన్నీ రాణీ చిత్రలేఖ కవిత్వంలో పుష్కలంగా వున్నాయి. అందుకే ఇదొక ఆధునిక శృంగార కావ్యమైంది.

*

శిలాలోలిత

1 comment

Leave a Reply to రాజేశ్వరి రామాయణం Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు