ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడుమ సాగే జీవిత సంఘర్షణను ఛేదించేలా చేస్తుంది ఈ కథ. కాలంతో పాటు వేగంగా పరిగెడుతున్న జీవితాలను హిమ పాత్ర ద్వారా పరిచయం చేసారు రచయిత్రి.
జీవితంలో ఏమి కావాలి ? నెమ్మది, సెల్ఫ్ టైమ్, ఇప్పుడున్న వాతావరణం నుంచి కాస్త ఉపశమనం, మనసుకు కావాల్సినంత ప్రశాంతత, నన్ను నేను తెలుసుకోవాలి అనే సందిగ్ధ స్థితి. వీటిలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు ఒక గైడ్ లాంటిది ఈ “ఊర్ధ్వతలం” కథ.
“ఈ జీవితానికి ఇంతే” అని కాకుండా “ఇంకేదో చేయాలి” అని అనునిత్యం వెంటాడే సృష్టించుకున్న కమిట్మెంట్స్. అదొక నిరంతర అంతుచిక్కని సంఘర్షణ…మధ్యలో కొన్ని బ్రేకులు వేస్తాం. మళ్లీ ఆక్సిలరేటర్ గట్టిగా నొక్కుతూ ముందుకు సాగిపోతాం. మనమందరం ఆ చదరంగంలో చిక్కుకున్న వాళ్లమే అనిపించక మానదు! ఈ కథలో హిమ పాత్రలాగా.
కథలోకి వెళ్తే, “ఊర్ధ్వతలం” అనే కథ ఝాన్సీ పాపుదేశి గారు రాసిన “దేవుడమ్మ” కథా సంకలనంలోనిది.
హిమ బెంగళూరులో పుట్టి, చిన్నప్పుడే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడింది. హిమకి సమయపాలన, పరిపూర్ణత (Perfection), కెరీర్‌లో పైస్థాయికి వెళ్లడం, డబ్బు సంపాదించడం అనేవి తన టాప్ ప్రియారిటీస్.
ఈ కథ తన జీవితంలోని అసంతృప్తి, ఒత్తిడి, నిజమైన ఆనందం కోసం చేసే అన్వేషణను వివరిస్తుంది. Hima lives in a successful independent woman era. అయినప్పటికీ ఆమెకు మనసులో ఒక అలజడి. ప్రశాంతత లేని జీవితం. మానసిక కారణాలు ఎన్నైనా వెంటాడే దుఃఖం తనలో ఇమిడిపోయింది.
ఆమెతో నాలుగేళ్లు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్న బాయ్‌ఫ్రెండ్ ఎరిక్ ఉద్యోగాలపై పెద్దగా ఆసక్తి చూపించకుండా, సంపాదించిన కొద్దిపాటి డబ్బును దానాలు చేస్తూ ఉండటంతో అతనితో జీవితం సాధ్యం కాదని హిమ బ్రేకప్ చెబుతుంది. ఎరిక్ తనంత ఆర్గనైజ్డ్ పర్సన్ కాదు. పోను పోను ఇద్దరి లైఫ్ స్టైల్కి పొంతన లేకుండా పోయింది.
ఈ బ్రేకప్ వల్ల కలిగిన మానసిక అశాంతి నుంచి, అన్నిటి నుండి కాస్త దూరం జరగాలని ఆమె నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో తన స్నేహితుడు నికోలస్ (నిక్) నడిపే స్వచ్ఛంద సంస్థ కోసం టెక్నికల్ హెల్ప్ చేయడానికి భూటాన్ ప్రయాణమవుతుంది.
భూటాన్ చేరుకున్న హిమకు అక్కడి ఇమిగ్రేషన్ ఆఫీసులో పని నెమ్మదిగా సాగడం, ప్రజలు ఎంతో తీరిగ్గా ఉండటం మొదట్లో అసహనాన్ని కలిగిస్తుంది. అన్ని క్రమంగా జరగాలి అనుకుంటుంది కాబట్టి.
అక్కడ ఆమెకు పది రోజుల పాటు గైడ్‌గా వ్యవహరించడానికి యాంగ్ చెన్ అనే లోకల్ టూరిస్ట్ గైడ్ పరిచయమవుతాడు. యాంగ్ చాలా ప్రశాంతమైన వ్యక్తి. ప్రకృతిని ప్రేమిస్తూ, ఉన్నదానితో సంతృప్తిగా బతికే వ్యక్తిత్వం. భూటాన్ పర్యటనలో యాంగ్ ప్రవర్తన, మాటలు హిమ ఆలోచనా విధానంలో మార్పులు తెస్తాయి.
కథలో నాకు నచ్చిన సన్నివేశం – హాట్ స్టోన్ బాత్ : నది నీటితో నింపిన టబ్‌లో మూలికలు కలిపి, వేడి రాళ్లతో సిద్ధం చేసే సాంప్రదాయ స్నానాన్ని హిమ కేవలం పది నిమిషాల్లోనే ముగించి బయటకు వచ్చేస్తుంది. ప్రకృతి సహజసిద్ధమైన వాటిని కూడా ఆస్వాదించలేనంతగా తన కమిట్‌మెంట్లు తనను పరుగులు పెట్టించడం.
కొండపై ఉన్న ప్రముఖ బౌద్ధ గుడికి ఎక్కే క్రమంలో తీవ్రంగా అలసిపోతుంది. ఆ సమయంలో యాంగ్ ఆమెకు “ట్రీ హగ్గింగ్” (చెట్టును హత్తుకోవడం) ప్రయత్నించమని చెబుతాడు. చెట్టును కౌగిలించుకున్నప్పుడు హిమ తనలో ఎన్నడూ లేని ప్రశాంతతను అనుభవిస్తుంది.
యాంగ్ ట్రిప్ గైడ్ అయినప్పటికీ హిమకు ఒక కేర్‌టేకర్‌లా అన్ని విధాలా తోడుంటాడు. జీవితంలో గుర్తున్న పది సంతోషకరమైన విషయాలను ఒక కాగితంపై రాయమంటాడు. జర్నల్ రాసే అలవాటును కూడా నేర్పుతాడు.
హిమ పర్యటిస్తున్నప్పుడు మనలో కూడా ఒక తెలియని అన్వేషణ మొదలవుతుంది. నిజమే కదా అనిపించే సత్యాలు బోధపడుతాయి. పరవశించే ప్రకృతి సౌందర్యం మనసుకు సొంతమవుతుంది. చలి వాతావరణం, కొండలు ఎక్కేటప్పుడు పడే శ్రమ, యాంగ్ చెప్పే తీపి కబుర్లు, కొన్ని జీవిత సత్యాలు వింటే అందరికీ ఉండాల్సిన గైడ్ అనిపిస్తుంది. There starts a quite self-exploring journey.
భూటాన్ దేశాన్ని కేవలం ఒక పర్యాటక ప్రాంతంగా కాకుండా, హిమ కోసం ఒక జ్ఞానోదయ హిమాలయ పర్వతంగా రచయిత్రి నిర్మించారు. పాఠకులకు అక్కడి సాంప్రదాయ దుస్తులు, బౌద్ధ సంస్కృతి, హాట్ స్టోన్ బాత్, చిమీ లఖాంగ్ గుడి ఆచారాలు కథకు ఎంతో వైవిధ్యాన్ని, ఎస్తేటిక్ అప్పీల్ ని తెచ్చిపెట్టాయి.
హిమ ప్రకృతిలో మమేకమవుతున్న కొద్దీ యాంగ్ ఆమెకు మరింత దగ్గరవుతాడు. తన చిన్న ఇంటికి మధ్యాహ్న భోజనానికి తీసుకెళ్లి, హిమపై తనకున్న ప్రేమను ఎంతో నిజాయితీగా వ్యక్తపరుస్తాడు. ఎక్కువ డబ్బు లేదని, ఈ గైడ్ ఉద్యోగమే తన జీవనాధారమని చెబుతూ, ఈ కాలుష్యం లేని ప్రకృతిలో తనతో కలిసి ఉండిపోవాలని తనని రిక్వెస్ట్ చేస్తాడు.
హిమ స్పందించే తీరును ఊహించని విధంగా చిత్రీకరించారు రచయిత్రి. తనకి ఆలోచించుకోడానికి సమయం కావాలంటూ తిరిగి అమెరికాకు వెళ్ళిపోతుంది. అక్కడి యాంత్రిక జీవితం తనని ఊపిరాడనివ్వదు.
మళ్లీ తన పాత జీవితాన్ని ఆహ్వానించాలా ? తిరిగి వెళ్లి యాంగ్ ప్రేమని అంగీకరించి, అక్కడే స్థిరపడాలా అని ఇప్పుడు ఇంకో రకమైన సంఘర్షణ – Self-Questioning. ఈ ప్రశ్నలకు సమాధానలు కోసమై హిమలాంటి అన్వేషణ మొదలు పెట్టాల్సిందే. కథలోకి వెళ్లి సంపూర్ణత పొందాల్సిందే. కొత్తగా మళ్లీ అనుభూతి పొందాల్సిందే.
కథ ముగింపు ఓపెన్ ఎండెడ్‌గా ఉంటుంది. యాంత్రిక జీవితంలో పడి నలిగిపోతున్న ప్రతి ఒక్కరూ చదవదగ్గ కథ.
ప్రతి ఒక్కరూ ఒక్కసారి తమ జీవితాన్ని తిరిగి ఆత్మ పరిశీలన (Self-Awareness) అవసరాన్ని “ఊర్ధ్వతలం” గుర్తు చేస్తుంది. ఝాన్సీ పాపుదేశి రచనా శైలి లోతుగా అధ్యయనం చేసేవిధంగా ఉంటుంది. చిన్న సంఘటనల ద్వారా పెద్ద జీవిత సత్యాలను ఆవిష్కరించడంలో ఈ రచయిత్రి దిట్ట.
- కథ సమీక్ష: ఊర్ధ్వతలం
- పుస్తకం: దేవుడమ్మ
- కథ రచయిత్రి: ఝాన్సీ పాపుదేశి








ఆ కథ నేను చదివాను. మనసుని తాకే కొన్ని కథల్లో అదొకటి. నువ్వు పరిచయం చేసిన తీరు క్లుప్తంగా, స్పష్టంగా బాగుంది తేజ. మంచి ప్రారంభం All the best.
Thank you so much అన్న గారు 🙏🤝
సమీక్ష బావుంది సర్. 👏
కథ తాలూకు కబుర్లను పక్కన కూర్చొని చెప్పినట్లే ఉంది మీ సమీక్షా తీరు. వెంటనే కథను చదవాలన్న ఉత్సుకతను కలిగించారు. హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి కథ చదివాను కూడా. చాలా బాగుంది. సమీక్షించిన మీకు, కథ రాసిన ఝాన్సీకి, ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త కొత్త శీర్షికలతో ‘సారంగ’ను ఆసక్తికరంగా చదివిస్తున్న ఆఫ్సర్ గారికి థ్యాంక్స్.
బాగుంది.
సమీక్ష చాలా బాగుంది అభినందనలు తేజా 👌👍💐