ఇనాకుమ‌య్య బ‌జ్జ‌య్య‌…

ఇనాకుమ‌య్య మెర‌వ‌న రోజే ఏదో స‌మ‌యంలో వాన ప‌డేది. ధ‌ర్మ‌ముంది సోమీ ఇంగా అంటూ ఆకాశాన్ని చూసి మాయ‌మ్మ దండంపెట్టేది.

నాకుమ‌య్య పండ‌గొచ్చాందంటే.. ఇనాక్క అలివిగాకుండా ఎగుర్తాంటిమి.
పండ‌క్కు ప‌దిరోజులుముందే మాదిగోళ్ల రోశ‌ప్ప ఇనాకుమ‌య్య బొమ్మ మొద‌లుపెడ్తాండె. ఎవుర‌న్నా బొమ్మ చేయ‌మ‌ని  లెక్కిచ్చే వాళ్లు కొంత‌మంది కాపోళ్లు. బంకమ‌ట్టి తెచ్చుకునేవాడు. రంగులు కొన‌క్క‌చ్చుకోని.. అన్నీ రెడీబెట్టుకోని ఊత‌క‌డ్డీలు ముట్టిచ్చి సోమిని ముక్కోని ఇనాకుమ‌య్య ప‌నిలోకి దిగుతాండ‌.  రోజుకు రోంత బొమ్మ అయితాండ‌.  మేం అంకేన‌ప‌ల్లిసారు కాన్వెంటుకు పోయి ఇంటికి వ‌చ్చా.. మ‌ధ్యానం ప‌న్నెండున్న‌ర‌ప్పుడు రోశ‌ప్ప ఇంటికాడ నిల‌బ‌డేవాళ్లం. నాతో పాటు మా చెల్లెలు ర‌జియా, మా ప‌క్కింటి గొల్లోల్ల పిల్లోళ్లు హ‌రిత‌, అమ‌ర‌నాథ‌, గంగిరెడ్డి ఉంటాండిరి. ఆయ‌ప్ప వొనారుగా బంక‌మ‌ట్టితో ఇనాకుమ‌య్య చేచ్చాండ‌.  గోనెసంచులు, పేప‌ర్లు, వ‌ట్టి వ‌ర‌గ‌డ్డి ఆయ‌ప్ప ద‌గ్గ‌ర ఉండేది. ఇనాకుమ‌య్య బొమ్మ‌ను చేస్తాంటే.. అట్ల‌నే నిగీత సూచ్చాంటిమి. అస‌లు తొండం ఎప్పుడు పెడ్తాడు, కండ్లు ఎట్టుంటాయి.. చేతులు ఎప్పుడొచ్చాయి.. కిరీటం ఎట్ల పెడ్తాడో.. అనుకుంటా ఆశ‌తో అక్క‌డే బొమ్మ‌ప‌ని జ‌రిగిన‌న్నాళ్లూ మ‌ధ్యాహ్నంపూట రోంత సేపు కుర్చుండేవాళ్లం. *మ‌ళ్ల రాపోల్లిప్పో* అని రోశ‌ప్ప అనేవ‌ర‌కు ఆయ‌ప్ప ఇంటికాడే ఉంటాంటిమి. ఆన్నుంచి పోలేక పోలేక బాధ‌తో.. ఇనాకుమ‌య్య బ‌జ్జ‌య్య‌.. ఏడుకుడుములు తిన‌వ‌య్య‌.. అంటా పాట‌పాడుతా.. కుంటగ‌ట్టున బుర‌ద‌నీళ్ల‌లో న‌డుచుకుంటా పోతాంటిమి.  అట్ల‌ ఇనాకుమ‌య్య  అంటే మాకు నెర్లున్యాది. సూచ్చాండ‌గానే ఇనాకుమ‌య్య బొమ్మ త‌యారైతాండ‌. రంగులేసేవాడు. సోమి.. మెరిసిపోయేవాడు.  ఊత‌క‌డ్డీలు ముట్టిచ్చి పూజ‌చేసేవాడు రోశ‌ప్ప‌. ఆయ‌ప్ప ఇంటికాడ ప‌ల్ల‌కీమీద కూర్చున్న ఇనాకుమ‌య్య బొమ్మ‌ను  ఆంజ‌నేయ సోమి దేలంకాడ లోప‌లాకిలి ఆనుకోని ఎడంప‌క్క‌న కూకోబెట్టేవాళ్లు.

ఇనాకుమ‌య్య పండ‌గ ప‌ద్ద‌న అనంగా రాత్రి నిద్ర‌ప‌ట్టేది కాదు. ప‌ద్ద‌న్న ఎప్పుడ‌యితాదా.. అనుకుంటా దంతెలు తిక్కు సూచ్చా నిద్ద‌ర‌పోతాంటి. ప‌ద్ద‌న్నే బెరిక్క‌న లేచి బొగ్గ‌ల గూటికాడికిపోయి మాంచి క‌రుంక‌రుం అనే బొగ్గు తీసుకోని.. బండ‌మీద పెడ్తాంటి. దాంట్లోకి రాతిప్పు వేసి మెత్త‌గా గుండ్రాయితో న‌ల‌గ్గొడ్తాంటి. గ‌బ‌గ‌బా పండ్లు తోముకోని మ‌గం క‌డుక్కోని మూతిని  ఏసుకున్న స‌క్కాతో తుడుచుకోని దేలంకాడికి ప‌రిగెత్తేవాణ్ణి. ఆటికిపోతే పెద్దోళ్లు, ఫ్రెండ్సు అంతా నాకంటే ముందుంటాండిరి. దేలంకాడ ఉండే బోరింగు ద‌గ్గ‌ర బాగా మెడాలు త‌డిచేట్లు కాళ్లు క‌డుక్కుంటాంటి.  మైకులో దేవుని పాట‌లొచ్చాండె. సూచ్చే ఇనాకుమ‌య్య క‌ల‌రుఫుల్‌గా ఎలిగిపోతాండె. ఆయ‌ప్ప చేతిలో గ‌రిక‌, ఎల‌క్కాయ‌లు ఉంటాండె. అర‌టికాయ‌ల్లో ఎలిగించిన ఊత‌క‌డ్డీ పెట్తాండిరి మా గ‌రుగుమింద ఉండే మ‌ల్లిడ్డితాత‌, ప‌క్కిడ్డితాత‌. ఎవ‌రోక‌రు పెద్దోళ్లు ఇనాకుమ‌య్య‌ను బాగా సూసుకుంటాండిరి. ఆంజ‌నేయ‌సోమికి ఆకుపూజ చేయిచ్చాండ్రి పండ‌గ పూట కొంద‌రు. ఆంజ‌నేయ‌సోమికీ, ఇనాకుమ‌య్య సోమికీ ఆరిపోయినాక‌.. ఊత‌క‌డ్డీలు ముట్టిచ్చుకుంటా.. అక్క‌డ ఎవ‌రైనా టెంకాయి కొడితే.. దాన్ని తింటా.. కొంద‌రు కాయిలుంటాండిరి. ఏందో.. దేలం పైన మైకులో ఇన‌ప‌డే పాట‌లు, ఇనాకుమ‌య్య బొమ్మ‌, ఊత‌క‌డ్డీల పొగకు ఆంజ‌నేయ‌సోమి దేలం గొప్ప‌గా క‌న‌ప‌డేది. ఆనందంతో ప‌చ్చి కొబ్బెర తింటాంటె.. మ‌న‌సు పుల‌కిచ్చాండె. దేలం చుట్టూ ఇనాకుమ‌య్య సోమీ.. అని తిరుగుతాంటిమి. *ఇనాకుమ‌య్య సోమి ఎవురికీ భ‌య‌ప‌డ్డు. ఎవురొచ్చినా సంపిదెం.. *అంటా పిల్ల‌గాళ్లం మాట్లాడుకునేవాళ్లం. *పాండి.. పాండి.. నీళ్లు పోసుకోని రాపోండి* అనేవాళ్లు పెద్దోళ్లు. ఇంటికి ర‌య్‌.. పీపీప్‌.. అని అరుచ్చా ప‌రిగిత్తాంటిమి.

ఇంటికి పోయినాక బెర‌బెరా నీళ్లు దిగ‌బోసుకుంటాంటి. చిన్న‌న్న తాతో, సిమాప‌ల్లెలోని చాక‌లి నారాయ‌ణో కొత్త చొక్క‌, కొత్త ప్యాంటు కుట్టేవాడు. మా నాయిన ప‌ద్ద‌న్నే పోయి బ‌ట్ట‌ల్ని తీస‌క‌చ్చాండె. చొక్కా, ప్యాంటు ఏసుకుని ఒక‌టి రెండు సార్లు కిందికీ, పైకి చూసుకోని *బాగుండాయ‌మ్మా చ‌క్కా, నిక్క‌ర‌* అని మాయ‌మ్మ‌ను అడుగుతాంటి. మాయమ్మ ఓలిగ‌లు సేచ్చా.. *బెరీన రా* ఇంటికి అంటాండె. దేలంకాడికి ప‌రిగ‌త్త‌పోయి అక్క‌డే కుచ్చుంటాంటి. క‌డుపు కాల్తానే ఇంటికొచ్చే మాయమ్మ అర‌ల ప‌ళ్లెంలో  నాలుగైదు ఓలిగ‌లు పెట్టేది. బెర‌బెరా తింటాంటి. పొప్పూబువ్వ తిన్నాక బువ్వ‌లో శెన‌క్క‌ట్లు శారు పోసుకుని తింటాంటి. శారు బాగుందిమా అంటా ప‌ల్లెంలో తాగుతాంటి. గ‌డ్డ‌పెరుగేసుకోని తింటాంటి.  అంద‌రం బువ్వ తిన్యాక  ప‌క్కిడ్డిగారి చందుడు ఇంటికి టీవీ చూడ‌టానికి వీధిలోని ఆడిపిల్లోళ్లు పోతాండిరి. మేం పోతాంటిమి.. ఇనాకుమ‌య్య సినిమాలు టీవీలో వ‌చ్చాండె. సినిమా సూచ్చా.. ఇనాకుమ‌య్య అంటే ఏమ‌నుకున్యావు.. అనుకుంటా పిల్ల‌గాళ్ల‌మంతా ప‌తాపాలు ప‌లుకుతాంటిమి. అట్ల ఇనాకుమ‌య్య పండ‌గ‌నాడు పైటాల‌య్యేది. సాయంత్రంపూట చానామంది దేలంకాడికి వ‌చ్చాన్యారు.  రోజంతా పాట‌లు మైకులో ఇన‌ప‌డ్తాండె.

ఇనాకుమ‌య్య పండ‌గ మ‌ర్స‌నాడు బొమ్మ‌ను బెరీన ఎత్తుతాండిరి. పిలగాళ్ల‌మంతా పైటుముంచే సూపెట్టుకోని ఉంటాంటిమి. పైటాల రెండున్న‌ర క‌ల్లా నాలుగైదు మంది మాదిగోళ్లు ట‌ప్పెట్ల‌తో వ‌చ్చాండ్రి.  ప్యాకిట్ల‌లో ఉండే సారాయి తాగుతాండ్రి.  *ఇంగ పాండిరా..* అని కాపోళ్లు అదిలిచ్చానే..  దేలంకాడి చెట్టుకింద వ‌ర‌గ‌డ్డితో మంట పెట్టి త‌ప్పెట్లు బాగా కాపుకుంటాండిరి మాదిగోళ్లు. అగ్గి శాకం త‌గిలితే ట‌ప్పెట గ‌న‌గ‌న‌మ‌ని ప‌లుకుతాద‌ని అట్ట చేచ్చాండ్రి. ట‌ప్పెట వాంచ‌డం మొద‌లైతానే.. ఇనాక్క ఊర్లోవాళ్లు, గ‌రుగుమిందోళ్లు, మాదిగోళ్లు.. తేనీగ‌లొచ్చిన‌ట్లు గుంపులు గుంపులు వ‌చ్చాండిరి. కాపోళ్లు లెవ‌లు ప‌డ‌తా.. హుందాగా పంచ‌లు క‌ట్టుకోని ఉంటాండిరి. కొంద‌రు క‌లిసిపోతాన్యారు. గొల్లోల్లు, వ‌డ్డివాళ్లు, త‌లారోళ్లు, ఉప్ప‌రోళ్లు, బ‌లిజోళ్లు, మాదిగోళ్లంద‌రినీ.. ఏనుగు తొండం సోమి ఒక్క‌చాట‌నే క‌లిపే అద్భుత‌మైన టైమ‌ది.  జెగ్గినాక్ జెగ్గినాక్ అంటూ ట‌ప్పెట్లు మోగుతాంటే.. దేలంలోనుంచి బ‌య‌ట ఉండే టైరు బండికాడికి బిందెల‌తో లైనుగా నీళ్లు పోసేవాళ్లు. దేలంలోని దేవున్ని ఐదారుమంది మంచులు ఎత్తుకోని.. మెల్ల‌గా నీళ్ల  జాడ‌మీద‌నే ఇనాక‌మ‌య్య‌ను ఎత్త‌క‌చ్చాండ్రి.  అంత‌లోకే దీప‌స్థంబం రెడీ చేసి ఆ గురిగ‌లో చ‌మురు పోసి దూదిని బాగా త‌డిపి అగ్గిపుల్ల ముట్టిచ్చి ఎలిగిచ్చాండ్రి. ఇంగ‌పా అంటానే..  నీళ్ల జాడ‌లో టైరుబండి పోతాండె.

సోమి కంటే ముందు దీప‌స్థంభం న‌డుస్తాండె.  ఎవురంత‌కు వాళ్లు వాళ్ల ఇంటికాడినుంచి నీళ్ల జాడ‌ను క‌లిపేట్లు బిందెల‌తో నీళ్లు పోసుకుంటాండిరి.  ట‌ప్పెటోళ్లు మెల్ల‌గా వ‌చ్చాండ్రి. జెజ్జినాక్ జెజ్జినాక్ అని కొడ‌తాంటే.. త‌ల‌కాయికి అద్దురూపాయి, రూపాయి బిళ్ల‌లు ట‌ప్పెట కొడుతూ క‌రిపిచ్చుకోని మెల్ల‌గా లేచి .. ట‌ప్పెట‌ను గ‌ట్టి వాయిచ్చాండిరి వ‌య‌సోళ్లు.  కొంద‌రు క‌ట్టెలు తిప్పుతాండ్రి, డ్యాన్సులేచ్చాండ్రి. పిల్ల‌గాళ్లంతా కుంకుమ, బుర‌ద‌, ఎనుము పేడ‌, కోడిగుడ్లతో కొట్టుకుంటా.. ప‌రిగిత్తాన్యారు. కొంద‌రు ఆడోళ్లు, చిన్న పిల్లోళ్లు చెంప‌ల‌కు కుంకుమ‌ను ప‌ట్టిచ్చుకునేవాళ్లు.  దీప‌స్థంభం తీసుకోని పోయినోళ్ల‌కు బిందెడు నీళ్లు నెత్తిమీద పోసేవాళ్లు. ఇంట్లోవాళ్లు కుంకుమ‌బొట్టు పెట్టేవాళ్లు.  దీపం ఎత్తుకున్నేవాడు *గోవింద‌.. * అంటే ప‌క్క‌నుండేవాళ్ల‌మంతా గోవింద‌.. అనేవాళ్లం.  అట్ల ప్ర‌తి ఇంటికి దీప‌స్థంభం పోతాంటే.. ప‌దిమంది పిల్ల‌గాళ్లు ఎన‌క‌ల ప‌రిగిత్తాండ్రి.  ఒక‌డు దీపం  ఆరిపోకుండా వంచిన డ‌బ్బారేకుతో చూసుకునేవాడు. కొంద‌రు సిల్ల‌ర ఇచ్చే ఓ డ‌బ్బాలో ఏసుకునేవాడు ఒక‌డుండేవాడు. అట్ల దీప‌స్థంభం బెరీన  హుషారుగా పోతాంటే..  ఇనాకుమ‌య్య సోమి ఇంటింటికాడ నిల‌బ‌డి మెల్ల‌గా వ‌చ్చాంటాడు.  ఇంటిముందు బండి నిల‌బ‌డ‌తానే.. ఇంట్లోని ఆడోళ్లు ప‌ల్లెంలో టెంకాయ‌, ఆకులు, వ‌క్క‌, దేవునికి దక్షిణ పెట్టుకోని వ‌చ్చేవాళ్లు. ఎవ‌రోక‌రు టెంకాయ అందుకోని దేవునికాడ ఉండే ఆయ‌ప్ప‌కి ఇచ్చే గుండ్రాయిమీద టెంకాయ కొట్టేవాడు ఆయ‌ప్ప‌. నీళ్ల‌ను చుట్టుప‌క్క‌న చ‌ల్లుతాండె. ఆ ఇంటోళ్ల‌కు గలాసులో ప‌ట్టిచ్చాన్యారు.  ఇంట్లోవాళ్లంతా ముక్కునేవాళ్లు. అట్ల వీధిలో పోతాంటే.. కుడిప‌క్క‌, ఎడం ప‌క్క ఇళ్లోళ్లు టెంకాయ‌లు కొడ‌తాండ్రి.  ఊర్లో.. ఒక‌టే ట‌ప్పెట శ‌బ్ధాలు ఇన‌ప‌డేవి.  వ‌య‌సోళ్లు.. లచ్చిమీ ప‌టాకులు, వంకాయ బాంబులూ పేలుచ్చాన్యారు. ట‌ప్పెట్లు, ప‌టాకుల శ‌బ్ధంతో ఊరంతా ఊరిగిపోయేది. ఇండ్ల‌ల్లో క‌ట్టేసిన ఎనుములు, ఎద్దులు బెత్తురుకుంటాండె. కుక్క‌ల‌యితే కండ్ల‌కు క‌న‌ప‌రాకుండా దూరంగా ప‌రిగిత్తాండె.

ఇనాకుమ‌య్య మెల్ల‌గా రాముడి గుడితిక్కు పోయి కుప్పాలోళ్ల ఇంటిమింద  పొయ్యేది. బండి ఇట్లనే పోవాల‌ని, ఆగ‌మ‌ని  చెప్పేవాళ్లు ఒక‌రుంటారు. అబ్బా.. ఇనాకుమ‌య్య సోమిని ఊరేగిచ్చాంటే.. ఊర్లోని చెట్లూ, గాలి కూడా డ్యాన్సేసేది. పెద్ద గోపీ, వ‌డ్డివాల్ల ప‌సాదు ఇట్ల ఒక‌రిద్ద‌రు గ‌స్స‌యి మారిపోయేవాళ్లు. వాళ్ల బ‌దులు నేను ఎప్పుడు దీప‌స్థంభం ఎత్తుకోవాల‌ని ఎదురు సూచ్చాంటి. రోంత ఖాళీ దొర‌కుతానే.. *నేను ఎత్తుకుంటా బ్యా* అంటాంటి. అట్ల దీప స్థంభం ఎత్తుకోడానికి పోటీ ప‌డ్తాంటిమి. సోమికి అట్ల చేచ్చే పుణ్యం వ‌చ్చాద‌ని పెద్దోళ్లు చెబుతాన్యారు. అది ఇని నేనెంటే నేను అని  ముందుంటాంటిమి.  దీప‌స్థంభం ఎత్తుకోవాల‌నే చెప్పులు ఇంటికాడ వ‌దిలేసి ఉత్త‌కాళ్ల‌తో  ప్లానుగా పోతాంటిని.  దీప‌స్థంభం ఎత్తుకోని పోతానే.. ఇంటింటికాడ నిండు బిందె నెత్తిమీద పోచ్చాండిరి. నీళ్లుమింద ప‌డ‌తానే చ‌లిపెట్టి వ‌ణుకొచ్చేది. ఆంజ‌నేయవ‌ర్ధ గోవింద‌.. గోవింద‌.. అంటాంటే.. ఎన‌కుండే పిల్ల‌గాళ్లు గోవింద‌.. అని గ‌ట్టిగా అరుచ్చాన్యారు. మేం బొట్టుపెట్టుకోం. అయినా దీప‌స్థంభం ప‌ట్టుకున్యా కాబ‌ట్టి బొట్టు పెట్టేవాళ్లు. నా ఎన‌క‌న మా ర‌ఫీ, అమీరు ఉంటాండిరి. గొల్లోల్ల అమ‌ర‌నాథ ఉంటాండె. ఇంటింటికాడికి దీప‌స్థంభం తీస‌క‌పోతా.. *గోవింద *అనే మాట‌ ఇంటాంటె.. వొళ్లంతా వ‌ణిక‌ట్ట‌య్యేది. గుండె ఝ‌ల్లుమ‌నేది. అమ్మ‌వారికి పూన‌క‌మొచ్చిన‌ట్లు ఊగిపోతాంటి.

ఊర్లో మ‌ల్లాడ్డిగారి ఇంటికాన్నుంచి రెడ్డిగారి ఇంటిమీద నుంచి గుండం తిక్కు, పెద్ద‌మ్మ బోట్రాయికాడ‌నుంచి మ‌గేశ‌ర ఇంటితిక్కు పోతాంటిమి. అట్ల‌నే బండ‌ల బ‌జారు తిక్కు పోతానే దీప‌స్థంభం వేరేవాళ్ల‌కు ఇచ్చాంటి. చ‌క్కా, నిక్క‌ర ఆర‌కపోతే మాయ‌మ్మ కొడ్తాద‌నే బ‌య‌ముండేది. బండ‌ల బ‌జారుకాడికి దేవుడొచ్చానే.. ఆ బండల చ‌ప్పుడికి త‌ప్పెట ప‌ల‌క‌లు ఇంకా గ‌ట్టిగా ప‌లుకుతాండె. చిన్న‌గంగ‌న్న తాత వ‌చ్చి ఎగిరి ఎగిరి డ్యాన్సులేచ్చాండె.  ట‌ప్పెటోళ్లు కైపులో ట‌ప్పెట్ల‌ను గ‌ట్టిగా వాంచుతాండిరి. గంగ‌న్న తాత మెల్ల‌గా అడుగేచ్చా నాలిక బ‌య‌ట బెట్టి *డ్లే* అనుకుంటా చిందు తొక్కేవాడు. ల‌య‌గా ఉండే ఆ డ్యాన్సు చూడ‌టానికి జ‌నాలు చుట్టుకుంటాండిరి.  ప‌దైదు నిమిషాలు గంగ‌న్న తాత చిందు తొక్కుతాండె. ఊర్లోనుంచి దేలంమీద మా గ‌రుగుమీద‌కు ఇనాకుమ‌య్య వ‌చ్చేవాడు. మా ఇంటికాడికి వ‌చ్చానే సైగ్గాకుండా నేను ఇంట్లోకి దూరేవాణ్ణి. మాయ‌మ్మ వ‌చ్చి టెంకాయ ఇచ్చాంటే.. ట‌ప్పెట్ల‌కు బ‌య‌ప‌డి మా చెల్లెలు ఏడుచ్చా ఇంట్లో దూరుకునేది. సావాస‌గాళ్ల‌తో మ‌ళ్లొచ్చా బ్యా.. అని ఇంట్లోకి పోయేటోణ్ణి.  నిక్క‌ర‌జోబిలోని కొబ్బ‌ర‌ను ఇంట్లో ప‌ల్లెంలో వెసి.. *ఒమా మ‌ళ్లొచ్చామా* అని అంటాంటి. *నీళ్లు నెత్తిమీద పోయిచ్చుకున్యాక‌. స్థంభం ప‌ట్టుకున్యావంట‌. భ‌యం లేకుండా పోయింది. గూగూడు కుళ్లాయ‌సోమిని కొల్చే మ‌న కుల‌పోళ్లు గోవింద నామాలు ఇన‌కూడ‌దు. నువ్వు గోవింద అని అర్సినావ‌ని చెప్తానారు పిల్లోల్లు. గోవింద అని ఇనకుండా చెవులు మూసుకోవ‌ల్ల అనేది.  *పోమా.. యాడ‌న్నా. నువ్వు చూసినావా. ఎవురో ఏందో చెప్తే న‌మ్ముతావా..* అంటా సింగ‌రిచ్చుకోని చెప్పులు తొడుక్కుంటాంటి. *రాజావ‌లీ.. ఇనాకుమ‌య్య‌ను యాడ ఇడుచ్చారో. కుంట‌లోక‌యినా, వంక‌లోక‌యినా దిగాకు. ఇనాకుమ‌య్య‌ను ఎత్తుకున్నోళ్లు పిల్లోల్ల‌ను చూడ‌రు. తాగింటారు. ఇనాకుమ‌య్య‌ను నీళ్ల‌ల్లోకి ఎత్త‌క‌పోయి స‌చ్చిపోయినోళ్లుండారు.. ఇంటికాడ‌నే ఉండు* అని బ‌తిమాలాడేది మాయ‌మ్మ‌. ఇన‌కుండా ప‌రిగెత్తాంటి.  మాదిగోళ్ల రోశ‌ప్ప చేసిన ఇనాకుమ‌య్య సోమి మాదిగోళ్ల ఇంటితిక్కు పోయేవాడు కాదు.  ఎందుకంటే మా ఊర్లో కాపోళ్ల‌దే న‌డిచేది (రాయ‌ల‌సీమ‌లో రెడ్ల‌ను కాపోళ్లు అని పిలుచ్చారు).  మాదిగోళ్లంతా గ‌రుమీద‌కు వ‌చ్చి టెంకాయ కొట్టి మొక్కొనేవాళ్లు.  బడికాడ పైన ఉండే వ‌డ్డివాళ్ల ఇండ్ల‌కాడికి పోయినాక ఇనాకుమ‌య్య మెర‌మ‌న అయిపోయేది. (ఇనాకుమ‌య్య మెర‌వ‌న రోజే ఏదో స‌మ‌యంలో వాన ప‌డేది. ధ‌ర్మ‌ముంది సోమీ ఇంగా అంటూ ఆకాశాన్ని చూసి మాయ‌మ్మ దండంపెట్టేది.)

బ‌డికాడ‌నుంచి ప‌డ‌మ‌ర‌తిక్కుండే తూమురాళ్ల‌దిక్కు అందరం పోయేవాళ్లం. పిల్లాపిచికా, వ‌య‌సుపిల్లోల్లు, పెద్దోళ్లు పోయేవాళ్లం. ముసిలోళ్లు వ‌చ్చేవాళ్లు కాదు. ట‌ప్పెట్లు చ‌ల్ల‌బ‌డేవి. కుంకుమ‌, బుర‌ద పూచుకుండేవాళ్లు గ‌మ్మ‌గ‌య్యేవారు. అంద‌రూ యాల‌బ‌డిపోయేవాళ్లు. ఊరంతా ఎగిరినేవాళ్ల‌కు మ‌గంలో న‌త్త‌ర చుక్క ఉండేది కాదు.  దూరంగా తూమురాళ్లు ( రెండు పొడ‌వైన రాతి శిల‌లు మీట‌రు దూరంలో భూమిలో పాతి పెట్టి ఉంటాయి. ఆ రెండు శిల‌ల‌పైన ఇంకో పొడ‌వాటి శిల‌ను ఉంచుతారు. అది వాకిలి లాగా ఉంటుంది.) మాకు పాణం లేచొచ్చేది. తూమురాళ్ల‌కాడికి పోతానే.. వ‌యిసోళ్లు నిచ్చెన‌లేసుకోని సోమిని తూమురాళ్ల‌పైన మ‌ధ్య‌లో కూకోపెట్టేవారు. ఆయ‌ప్ప… ఆ గ‌ణ‌ప‌తి సోమి.. ఎచ్చ‌లుగా తూమురాళ్ల మింద కూర్చోనేవాడు. ఆ ఠీవిని చూసి పొంగిపోయేవాణ్ణి. అంత‌లోనే అంద‌రూ ప‌రిగెత్తేవాళ్లు.  ఊర్లోని ఓ పెద్ద‌త‌రా మంచి కొత్త జొల్ల(వెదురుతో చేసిన పెద్ద గంప‌)లో బొరుకులు, పొప్పులు, బెల్లం క‌లిపిన ప‌సాదం పెట్టేవాళ్లు. ఒన్నా మాకిన్నా.. అంటూ అంద‌రూ ఆయ‌ప్ప మీద ప‌డేవాళ్లు. *యాటికి దెంకోని పోమురా.. అంద‌రం తిందాం. రోంత మెల్ల‌గా* అనేవాడాయ‌ప్ప‌. అయినా ఊరుకుండేవాళ్లు కాదు జ‌నం. నేను జ‌నాల్లో దూరి రెండు చేతుల‌తో బొరుగుల్ని పెట్టించుకోని గ‌బ‌గ‌బా తింటా.. *ఒన్న‌.. నాకు పెట్ట‌లేదున్నా* అంటూ మ‌ళ్లా పోయి.. రెండు నిక్క‌ర జోబీల‌కు ఏసుకునేవాడ్ని. అంద‌రం ఇనాకుమ‌య్య బ‌జ్జ‌య్య .. పాట పాడుకుంటా అరుచ్చా ఇంటికొచ్చేవాళ్లం. నిక్క‌ర జోబీలోని బొరుగులు, పొప్పుల మ‌ధ్య ఉండే బెల్లంముక్క పండ్ల‌కింద ప‌డి న‌లిగేది.. నోరు తియ్య‌గ‌య్యేది. ఆ తీపితో *ఇనాకుమ‌య్య బ‌జ్జ‌య్య‌* అని గ‌ట్టిగా అరిచేవాడ్ని.

*

(మా ఊరు పులివెందుల ద‌గ్గ‌ర హిమ‌కుంట్ల‌. మాదిగోళ్ల రోశ‌ప్ప‌కి చందాలేసుకోని కాపోళ్లు కొంద‌రు లెక్కిచ్చే ఇనాకుమ‌య్య‌ను నాలుగైదేండ్లు చేసినాడు. 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత ఊర్లో చ‌దువులు, నాగ‌రికం రెండూ ఎక్కువ‌యినాయి. పులింద‌ల‌, క‌డ‌ప‌, అనంత‌పురం కాడ‌నుంచి ప్లాస్ట‌రాఫ్ పారిస్ బొమ్మ‌లు క‌ల‌రుఫుల్‌గా ఉండేయి కాపోళ్లు తెప్పించేవాళ్లు. మాదిగోళ్ల‌ రోశ‌ప్ప ఆర్టుప‌ని వ‌దిలేసి త‌న‌కు బాగా వ‌చ్చిన టైలరింగు ప‌నిలోకి దిగినాడు. ఆ రోశ‌ప్ప ఇప్పుడు ఊర్లో లేడు.  అప్ప‌టిలా రాసుకుపూసుకుని అంద‌రూ క‌లిసి మంచి వాతావ‌ర‌ణం ఊర్లో లేదిప్పుడు. ఇంటికి రెండు వాకిల్లున్న‌ట్లు మా ఊరికి రెండు ఇనాకుమ‌య్య‌లుండాయి. అప్ప‌ట్లా ఇనాకుమ‌య్య లేడు.. ఆయ‌ప్ప న‌గూలేదు. తూమురాళ్ల క‌థే లేదు. బొరుగులూ, పొప్పులూ, బెల్లం క‌లిపిన ప‌సాదాల్లేవిప్పుడు.  ఇనాకుమ‌య్య‌ను పండ‌గ రోజే తీచ్చానారు.. ఎందుకంటే ప‌ద్ద‌న్నే పార్ణం చేసుకోవ‌చ్చ‌ని. ఇనాకుమ‌య్య.. ఏంద‌య్యా.. నా ప‌ల్లె ఇట్ల‌యిపాయ‌)

రాళ్ల‌ప‌ల్లి రాజావ‌లి

17 comments

Leave a Reply to rajavali Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • 👌🙏🏻….ఇనాకమయ్య పండగ లైఫ్ సైకల్ చుసినట్టు ఉంది

  • మీ ఊరంతా తిప్పుతూ నాకు మీ ఇనాక మయ్య పండగ చూపించానట్టు అనిపించింది అన్న.. చదువుతూ ఉంటే స్టోరీ…. !

  • I have got immersed myself reading everyword with curiosity and interest.The simple narration with rich memories of the past has made me feel better and better while reading it.It has taken me back to my past.
    The writer has also mentioned the curiosity and enthusiasm of the children of his age during the festival with accurate memory.
    The writer has broken the restrictions imposed by his religion chanting Govinda like ..That shows his secular attitude at the young age itself.At the same time mentioned discrimination towards down trodden people of his village.
    The story depicts the village culture and its practices during festival season..
    Above all,I must appreciate Rajavali Garu for his simple narrating and captivating writing style.His writings make us visualise the incidents and events with his live writing style.
    He has great future in store..All the best Rajavali Bro

  • Nijame appati rojulu Baagundevi. Maa child hood days gurthu vachai. Appude vinayaka chavithi chala baagundedi. Ippudu antha commercial aindi. Okkokka Uriki no of ganeshudu. Evari prestige ku thaggatlu Vaallu. Ippudu bhakthi ledu. Janala madya unity ledu. Ippudu festival ante ne Intrest poindi. Anni chala chakkaga gurthu pettukuni rasav thammudu. Great Nuvvu…

    • Chinnappude Vinayaka chavithi bavundedhi akka. Ippudu ego ki Oka vinayakudu vunnadu. Chaduvukunekoddi manushulam duram avuthunnam . Thanks akka

  • Manishi sontham ga anubhavisthe thappa.. kaadu jeevisthe thappa ila rayaleru madhura smruthulu. Nijam okappati pandugalu unte 10 rojula mundu nunde hadavudi modalayyedi. Nakaithe nidrochedi kadu. Pandaga epudosthunda, school holidays istharu, chuttalu vastharu, adukovachu edooo anandam. Ipudu “ayoo repu pandaga kada , shit forgot yaar, I need to make arrangements ” Ani parugulette yanthrika jeevanam aipoyindi. Mee raatha chaduvuthunte,na gatham kalla mundu thirugadindi. Mee Kalam padi kalala patu haiyiga rasthune undali. All the best.

  • ఇనాకమయ్యబజ్జయ్య లో ఆనాటి గ్రామజీవితం,ఆచారాలు ,ఆలోచనలుకనిపిస్తాయి.*మాదిగోళ్ళరోశప్ప తయారుచేసినదేవున్నే మెరవణిజరిగేటపుడు వాళ్ళఇండ్లలోకిపోనీరు*అంటుంటేఎందుకీ వి”నాయకు”లనుపూజించినా సమానత్వంరాదు అనేభావనకలుగుతుంది.అందరిఇండ్లకు దేవుని మెరవణి జరుగుతాంది అని చెప్పుకునేరోజులురావాలి. నేడునేనుగమనించినదిఏమిటంటే ఎవరిసందుల్లోవాళ్ళు ఇనాకమయ్యనుపెట్టుకుని మాకుమేమే అని జనారణ్యంలో ఒంటరిప్రయాణం సాగుతోంది. *కథగమనంకనులకుకట్టినదృశ్యకదంబం*లాఉంది

  • ..పండుగలన్నీ జరుపుకుని దేవతలందరూ నా వాళ్ళే అని నమ్మినాను నేను …కాదు నీది దూదేకులమ్ అన్నారు…

  • అన్నా..మీ కత సదవతా ఉంటె “మనసు జగ్గినాక్ జగ్గినాక్ అని అంటా ఉంటే… గుండె “”డ్లే””అని కేకేస్తా ఉంది…
    ఎక్సలెన్ట్ అన్నా…మళ్లీ పిల్లప్పటి దినాల్లోకి తీసక పోయినారు…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు