ఇక్కడే, ఇప్పుడే…

నిద్రరాని రాత్రులలో నిట్టూరుస్తూ

నువ్వు లెక్కపెట్టిన చుక్కలన్నీ

ఒక్కసారిగా మాయమవుతాయి –

భళ్లున నీ బతుకు తెల్లారగానే.

 

జీవితాంతం నెత్తినపెట్టుకు తిరిగిన నీ పేరుని

మొదట నీ వాళ్లే మర్చిపోతారు.

అందరి నోటా ఒకే రసహీన, నిర్జీవ ప్రశ్న –

‘బాడీ ఎప్పుడు తీసుకెళ్తారు?’

 

అడ్డగోలుగానో, కష్టాల రెక్కల మీదో

నువ్వు కూడబెట్టిన ఆస్తి –

నలుగురూ నిన్ను వీధిగుమ్మం దాటించగానే

బజారు పాలవుతుంది.

 

బతుకంతా శ్రమించి

పోగుచేసిన నీ ప్రతిష్ఠ –

చిటపటమంటూ

చితిమంటతో బాటు ఎగసిపోతుంది.

 

కపాలమోక్షం ప్రాప్తించిందని సరిపెట్టుకొని

అంతా జారుకొనే వేళకి –

చంపుకున్నా మిగిలిఉన్న కోరికలు కాలి బూడిదవుతాయి,

మర్చిపోలేక దాచుకున్న జ్ఞాపకాలు మాడి మసవుతాయి.

 

ఏం చెప్పాలన్నా, ఏం చెయ్యాలన్నా,

దేన్ని వొదులుకోవాలనుకున్నా,

ఎవర్ని హత్తుకోవాలనుకున్నా –

ఇక్కడే, ఇప్పుడే.

*

ఉణుదుర్తి సుధాకర్

3 comments

Leave a Reply to G Padmanabham Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు