ఇంకోసారీ ఇదే కథ

నేను నీ మోచెయ్యి సందులోంచి నా చెయ్యిని దూర్చి, నిన్నల్లుకున్నప్పుడు? కాకపోవచ్చు కదా! మరెప్పుడు చిక్కుకొని ఉండాలి?

పరిచయం:

 కాగితం పడవలు. నేను ఇవన్నీ రాశాకే, అంటే అన్నీ రాసి పెట్టుకున్నాకే పుట్టిందీ పేరు. ఇవన్నీ అంటే ఏమేమున్నాయి ఇందులో? నాకు నేను రాసుకున్న ఉత్తరాలు ఉన్నాయి. నాకు అప్పటికప్పుడు అనిపించినవి, నేను ప్రేమించిన వాళ్లకు చెప్పాలనిపించినవి (చెప్పినవీ!) రాసుకున్నాను. నేను చూసిన ప్రపంచాన్నీ పరిచయం చేయాలనుకున్నాను. వీటన్నింటికీ మించి నా ఆలోచనలను ఈ కాగితాల్లో ఎక్కించాను. అవి నాతోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా వాటిని వదిలెయ్యాలి. సారంగ పత్రిక నామీద వర్షంలా కురిసి, ఇదిగో ఇక్కడో దారిని చూపించింది. బాల్యం గుర్తొచ్చింది. ఆ కాగితాలను పడవలు చేశా. ఇక్కడ వదిలేస్తున్నా. మీరు ఇదే దార్లో ఉంటే నేనే పంపించానని తెల్సుకొని తీసుకొని అందుకోండి. చదివాక మళ్లీ వదిలెయ్యడం మర్చిపోవద్దు.! 

 ‘కాగితం పడవలు’లో మొదటిది ఇవ్వాళ..

‘ఇంకోసారీ ఇదే కథ’..  

టైమ్‌ అప్పుడు 1:23. మధ్యాహ్నమైనా ఎండ అస్సలు లేదు. నా హుడీ తీసి, డెస్క్‌ దగ్గర పెట్టి అప్పటికి సరిగ్గా రెండు గంటల ఇరవై నిమిషాలు. క్యాంటీన్‌లో ఫ్రెండ్స్‌ నాకోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. నేనక్కడే బ్యాగ్‌ పడేసి, ఫోన్‌ వస్తే, బిల్డింగ్‌ ముందుకొచ్చి నిలబడ్డా.

వస్తాన్నవాడు ఇంకా రాలేదు. ఒక్కో నిమిషం గడుస్తోంది. ముందుకొచ్చి ఆగిన ప్లెజర్‌లో ఉన్నాడనుకున్నా. కానీ కాదు. పల్సర్‌ మీదొచ్చినవాడు కూడా కాదు. ఆ పక్కన్నుంచే వెళ్లిపోయిన ప్యాషన్‌ వాడు కూడా కాదు. అందరూ హెల్మెట్‌ పెట్టుకుంటే, వాడొచ్చి బ్రేకేసే దాకా మనకు వాడే అన్న విషయం తెలియదు.

నా గడ్డం బాగుందన్న నువ్వు గుర్తొచ్చావ్‌! వాట్సాప్‌లో ఉన్న ఒకే ఒక్క మెసేజ్‌. నీది. ‘ఓకే’.

నీకేమైనా చెప్పొచ్చా ఇప్పుడు? వాడొచ్చేలోపు, ఈ ఓకేకి తగ్గది, ఏం చెప్పాలి? ఆ పొద్దున చదివిన స్టోరీ గురించి? కలిసినప్పుడు చెబ్దాం అనుకున్నా కదా, ఇప్పుడే చెప్పేస్తే?

టైమ్‌ 1:34.

నీకు మెసేజ్‌ పంపించాక మళ్లీ ఫోన్‌ జేబులో పడేశా. ఇప్పుడు ఆ గడ్డం మళ్లీ గుర్తొచ్చింది. ఆ గడ్డాన్ని ఇష్టంగా నా వేళ్లతో ప్యాంపర్‌ చేయడం మొదలుపెట్టా.

ఒకటేదో తగిలింది. పెద్దది. ఇంత పెద్దదా? వెంట్రుకా? వెంట్రుకే! ఇంత పెద్దదా? అర్రే! ఎక్కడ్నుంచి వచ్చిందిది?

చేతిలోకి తీసుకొని చూశా. బ్లాండ్‌ హెయిర్‌. బ్లాండ్‌ అంటే నాకు పోర్న్‌ గుర్తొస్తుంది. సారీ కొట్టొద్దూ! ఫ్రెండ్‌ వచ్చేశాడు. ఫోన్‌ చేసి, ‘‘చూడు అపోజిట్‌లో ఉన్నా..’’ అన్నాడు.

‘‘అవునా! చూశా చూశా!! నేనే క్రాస్‌ చేసి వస్తా. అక్కడే ఉండు..’’ అన్నా.

క్రాస్‌ చేయాలంటే, కేర్‌ వరకూ వెళ్లి, సర్వీ దగ్గరకు వెళ్లి, ముందుకెళ్లి, వాడిని కలవాలి. ఆ వెంట్రుక నా చేతిలోనే ఉంది. ఫోన్‌ జేబులో పెట్టుకొని, ఆ వెంట్రుకతో ఆడుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్లా.

ఇది నా దగ్గర ఎప్పుడు చిక్కుకొని ఉండాలి?

పొద్దున్నే ఓ దగ్గర నాకోసం చాలాసేపు కూర్చున్నావ్‌. నేను రాగానే చిన్న హగ్‌ ఇచ్చావ్‌.. అప్పుడా? కాకపోవచ్చు.

నడుస్తున్నప్పుడేమో?

నేను నీ మోచెయ్యి సందులోంచి నా చెయ్యిని దూర్చి, నిన్నల్లుకున్నప్పుడు? కాకపోవచ్చు కదా! మరెప్పుడు చిక్కుకొని ఉండాలి?

హుడీకి చిక్కుకున్నది అది విప్పేసేప్పుడు టీషర్ట్‌ను పట్టుకొని ఉండాలి. బైదవే నాకు నీ జుట్టంటే ఎంత ఇష్టమో తెల్సారా!

ఫ్రెండ్‌ చెయ్యి చాపాడు. ‘‘ఎలా ఉన్నావ్‌ మామా?’’ అంటూ.

‘‘బాగున్నా..’’ వాడికి కావాల్సిన సర్టిఫికెట్‌ చేతిలో పెడుతూ చెప్పా. రెండే మాటలు. నాకోసం అక్కడ క్యాంటీన్‌లో ఫ్రెండ్స్‌ ఉంటారు. వెళ్లాలి. అవును, వాడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన టైమ్‌కి ఆ వెంట్రుకను చేతిలో పట్టుకొని ఎలా ఉండి ఉండాలి? వాడేం చూసి ఉండడు కదా!!

మళ్లీ రోడ్‌ క్రాస్‌ చేస్తున్నప్పుడు నీకు టెక్స్ట్ చేశా ఇదే విషయం. 1:53 కి చెప్పావ్‌.. ‘‘ఐ నో వెన్‌!’’ అని.

అప్పుడు అనిపించింది. కదా! నాకూ అర్థమైపోయింది. నేన్నీకు రాసిన లెటర్‌ చదివేప్పుడు ఒకసారి నామీద తల వాల్చి దగ్గరకొచ్చావ్‌. అప్పుడు.. యస్‌.. అప్పుడు చిక్కుకొని ఉండొచ్చు.

ఎలా తెగి ఉండొచ్చు నీ దగ్గర్నుంచి అది. నన్నెలా పట్టుకొని ఉండొచ్చు. నవ్వొచ్చింది. దూరం నుంచి ఆ ఫ్రెండ్‌ మరోసారి చూసి చెయ్యి ఊపాడు. నేనూ ఊపా. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు ముందుకు వస్తూ, బొటన వేలు, చూపుడు వేలిని అంతసేపు అంటిపెట్టుకొని ఉంచి, ఒక్కసారి ఎందుకో దూరం చేశా. వెంట్రుక ఎగిరింది. ఆ తర్వాత అది ఎక్కడికి ఎగిరిపోయిందో తెలీదు. చూడలేదు.

నువ్వంతా ఫ్లాష్‌లా గుర్తొచ్చావ్‌. చాలా కొత్తగా అనిపించింది. నేనెప్పుడు సంతోషంగా ఉన్నా ఆ ఫీలింగ్‌ను ఎప్పటికీ డిఫైన్‌ చెయ్యలేను. మళ్లీ నీతోనే చెప్పుకోవాలి. నీ జుట్టు నుంచి నాతో పాటొచ్చేసిన ఆ వెంట్రుక ఆ నీ జుట్టునే మళ్లీ మళ్లీ గుర్తు చేసింది. నువ్‌ మళ్లీ మళ్లీ గుర్తొచ్చావ్‌. నీకిది చెప్పడానికి నేను అప్పటికప్పుడు బయలుదేరాలి. ఎందుకంత దూరంగా ఉంటావ్‌ కొన్నిసార్లు, నేను అనుకున్నప్పుడల్లా పక్కనే ఉండొచ్చుగా! అవును, ఆ వెంట్రుక ఎందాకా ఎగిరిపోయి ఉండొచ్చు? నేనసలు దాన్ని ఎందుకొదిలేసి ఉంటా? నీకేమైనా తెల్సా? నేను చెప్పేశా కదా? నవ్వకు ప్లీజ్‌. తెలుసని చెప్పు. తెలుసు కదూ? వెల్‌.. ఇంకోసారి ఇంకో వెంట్రుక చిక్కుకున్నప్పుడు ఇంకో కథ చెప్తా. మళ్లీ ఇదే కథ.. కొత్తగా! వింటావ్‌ కదూ!!

*

వి. మల్లికార్జున్

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • వెంట్రుకని వెంట్రుకలా తీసిపడేస్తాం మనం…”నువ్‌ నా వెంట్రుక కూడా పీకలెవ్ ” అంటూ వార్నింగ్లు ఇచ్చేస్తాం. భావకుడి కలానికి ప్రియురాలి వెంట్రుక కూడా విలువైనదే. బావుందీ కాలం. మరో పాత కథ కోసం ఎదురుచూస్తుంట

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు