ఇంకొన్ని అప్పటి ప్రేమ కథలు!

కేవల మోహంలో చంచలత ఉంటుందేమో దానికి స్నేహం కలిస్తేనే ప్రేమగా మారుతుందేమో అనిపింపజేసే మాట అది.

ప్రేమ కథలు ఎన్నిసార్లు ఎంతమంది రాసినా చెయ్యి తిరిగిన వాళ్ళు రాస్తే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఉంటాయి. మళ్ళీ మళ్లీ చదవాలనిపిస్తాయి.
అయితే గొప్ప కవులూ రచయితలూ ప్రేమ కథల్లో సత్యాలు ఆవిష్కరిస్తారు.
చూడండి కాళిదాసే ఏమంటున్నాడో.
మనుషులు ప్రేయసుల పట్ల చంచల హృదయంతోనూ స్నేహితుల పట్ల స్థిరచిత్తంతోనూ ఉంటారట.
శివుడు తన మీద బాణం వెయ్యబోయిన మన్మథుడిని మూడవ కంటి అగ్నితో భస్మం చేశాడు. పక్కనే నిలబడి ఉన్న భార్య రతీదేవి కళ్లముందే మన్మథుడు నేలమీద అదే ఆకారంతో భస్మరాశిగా మిగిలాడు. అపుడు విలపించే రతీదేవి మాట ఇది.
అయి సంప్రతి దేహి దర్శనం స్మర
పర్యుత్సుక ఏష మాధవః
దయితా స్వనవస్థితం నృణాం
నఖలు ప్రేమ చలం సుహృజ్జనే
ఓ స్మరా!! తొందరగా కనిపించు. వసంతుడు నీ కోసం ఆగలేకుండా ఉన్నాడు అంది. స్మరుడు అంటే స్మరించగానే ప్రత్యక్షమయ్యేవాడనే కదా అర్థం. అంత దుఃఖంలోనూ ఆమె ”ప్రేమ మనుషులకు ప్రేయసుల పట్ల అనవస్థితం. అంటే అస్థిరం. పోనీ నా కోసం రావద్దు కానీ మిత్రుల పట్ల ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది కదా! అందువల్ల నీ మిత్రుడైన ఆ వసంతుడి కోసం రా”- అని ఆక్రోశంగా అడుగుతోంది.
ఆమె దుఃఖాన్ని, విలాపాన్ని ఒక సర్గ అంతా రాస్తాడు కాళిదాసు కుమార సంభవ కావ్యంలో. అంతా కరుణ రస పూరితం. కానీ అంతటి దయాపూరిత సందర్భం మధ్యలో ఇంతటి సత్యం పురుషుడై ఉండీ రాయకుండా ఉండలేకపోయాడు.
ప్రేమని కాస్త తగ్గించి స్నేహానికి పట్టాభిషేకం చేసాడా!
 అదలా ఉంచితే కుమార సంభవం కావ్యం లో శివుడూ పార్వతీ తప్పిపోయి మరో జన్మలో కలుసుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో ఆ ఒడిదుడుకులన్నీ శ్లోకాలమయంగా ఉంటాయి.
సతీదేవి దక్షయజ్ఞం తర్వాత ఆత్మాహుతి చేసుకోగా శివుడు స్త్రీ దృష్టి లేనివాడై తపస్సుకి వెళ్ళిపోయాడు. సతీదేవి హిమవంతుడికి పార్వతిగా పుట్టింది
ఎంతటి అందగత్తె!! ఆమె!!! సృష్టిలో ఉన్న అందాలన్నీ ఒకేచోట చూడాలనే కాంక్షతో బ్రహ్మ ఆమెను సృష్టించాడుట.
“సా నిర్మితా విశ్వసృజా ప్రయత్నాదేకస్థ సౌందర్య దిదృక్ష ఏవ.”
‘దిదృక్ష’ అంటాడు. ద్రష్టుం ఇచ్ఛా దిదృక్ష అని వ్యుత్పత్తి. చూడాలనే గాఢమైన ఇచ్ఛ. ఇచ్ఛకి తెలుగు లేదు. కోరిక అన్న పదం సరిపోదు.
 అంత అందంగా ఉంది నాయిక.
అటేమో నాయకుడు ఘోర తపస్సులో ఉన్నాడు. మన్మథుడి వల్ల కాకపోయినా పార్వతి వల్ల అవుతుంది ఆయన తపో భంగం. ఎందుకంటే మన్మథుని విల్లు కంటే అందమైన ఒంపు తిరిగిన పార్వతి కనుబొమల కాంతిది ఆ శక్తి.
“తస్యాః శలాకాంజన నిర్మితేవ కాన్తిద్భ్రువో రాయత లేఖయోః ఆర్యాః”
శలాకాంజనంతో తయారుచేసినంత కాంతితో పొడుగ్గా ఉన్న ఆమె కనుబొమలు చూసి మన్మథుడు ”స్వచాప సౌందర్యం మదం ముమోచ” అంటాడు కవి.
తన వింటి అందం గురించి మహా గర్వంతో ఉంటాడుట మన్మధుడు. అందంతోపాటు పవర్ (శక్తి) కూడాను. ఆ గర్వమంతా దిగిపోయిందిట ఆమె కనబొమల అందం ముందు. కానీ ఇవి రెండూ కూడా శివుడి ముందు పనిచెయ్యలేదు. శివుడి లాంటి నాయకుడికి అందాలు పనిచెయ్యవు – సరిపోవు కూడా అనుకుంటాను.
కానీ పార్వతి తపోనిష్టలో ఉన్న శివుడికి సేవలు కూడా చేసింది. తండ్రి అలా ఆమెను నియమించాడు. నిత్యమూ సేవలు చేస్తూ ఉంది. ఏమిటా సేవలు?!
అపచిత బలి పుష్పా వేది సమ్మార్గ దక్షా
నియమిత విధి జలానాం బర్హిషాం చోపనేత్రీ
గిరిశ ముపచచార ప్రత్యహం సాసుకేశీ
నియమిత పరిఖేదా తత్ఛిరశ్చంద్రపాదైః
కాసిని పూలు కోసి తేవడం, అరుగును తుడవడం, దర్భలను, నీటిని అమర్చడం – వీటికే అలసిపోతోంది. కానీ ఆ శివుడి నెత్తి మీదున్న వెన్నెలరాజు వెలుగులలోని చల్లదనానికి సేద తీరుతోంది.
ఈ సౌకుమార్యాన్నీ, సౌందర్యాన్నీ శివుడు కన్ను విప్పి కూడా చూడలేదు సరికదా వారిద్దరినీ లెక్కచెయ్యకుండా తన నిష్టలో మునిగిపోయాడు. మన్మథుడు చొరవచేసి బాణం వెయ్యబోతే కాల్చిపారేశాడు కంటితో.
అంతే కమండలమూ పులిచర్మమూ పట్టుకుని మరో చోటుకి తపస్సుకి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో పార్వతీదేవి సౌందర్యం అతన్ని ఒక క్షణం కిందామీదా చెయ్యకపోలేదు. కానీ మరుక్షణం సర్దుకున్నాడు. ప్రపంచంలో మోహభావమే లేకుండా చేసి చక్కాపోయాడు.
పార్వతి అభిజాత్యానికి ఇది అవమానమే. ఆమె అతులిత సందర్యానికి కూడా అవమానం. కానీ సౌందర్యం ఎంత పాటిది? కనుబొమ్మల వంపు ముందు మన్మథుడి గర్వం అణగినా శివుడికి ఆననే లేదు.
లోకంలో శరీర సౌందర్య స్థాయి అది అని చెప్పకనే చెప్పేడు కవికుల గురువు కాళిదాసు.
తక్షణమే ఆమె అన్నీ వదిలి కఠోర తపస్సుకు సిద్ధమయింది.
మన్మథుడి కోసం రతీదేవి ఏడుస్తూనే ఉంది.
 ఒకపక్క శివుడు ఎక్కడో ఆయన నిష్టలో ఉన్నాడు. పార్వతి ఆమె దారిన ఆమె దీక్ష వహించింది. చుట్టుపక్కల వసంతుడు కూడా లేడు.
మోహాలు మనుషుల్ని తలకిందులు చేస్తాయి. తట్టుకోలేరు. ఎప్పుడో ఒకప్పుడు తమ జీవితంలో మోహం తాలూకు గడబిడ తెలిసినవాళ్ళకి అర్థమవుతుంది ఇది.
కానీ ఇవి చంచలం అంటుంది రతీదేవి. స్నేహమొక్కటే అచంచలం అని మొదట్లో అందుకే అంటుంది.
శివపార్వతుల పై ప్రేమ కథలో మోహమారుతం వీచడానికే అవకాశం దొరకలేదు. అంతా యాంటీ క్లైమాక్స్ అయింది. దీన్ని ప్రేమకథగా మార్చడం ఎలా?
ప్రేమకు ఉత్త శరీర సౌందర్యం, సేవాతత్పరత మాత్రమే చాలవు. మనోబలం, ఆత్మనిగ్రహం – ఇంకెన్నో కావాలనుకుంటాను.
ఆమె తపస్సు ఎలా చేసిందో ఇలా రాస్తాడు. తన విలాసచేష్టను, విలోల దృష్టిని లతలకు, లేళ్ళకు ఇచ్చేసి అవసరమైతే తర్వాత తీసుకుంటాను అందట.
”లతాసు తన్వీసు విలాస చేష్టితం
విలోల దృష్టిం హరిణాంగనాసుచ”
ఈమె శరీరం బహుశా కాంచన పద్మంతో తయారయి ఉండాలి.అందుకే అప్పుడు పద్మంలా సుకుమారంగా ఉంది. ఇప్పుడు కాంచనంలా కఠినంగా ఉంది అంటాడు.
చుట్టూ అగ్నులు పైన సూర్యాగ్నితో పంచాగ్ని మధ్యంలో తపస్సు.
 చెట్లలాగ సూర్యచంద్రుల కాంతి నుంచి మాత్రమే ఆహారం తీసుకుంటోంది.
తపించిన ఆమె శరీరం మీద మొదటి చినుకు పడితే పృథ్వీగంథం లాంటి గంథం ఆమె నుంచి కూడా వస్తోంది. అంతగా కాలి ఉంది శరీరం.
అసలు వాన పడుతున్నా ఆమె నిశ్చలంగా తపస్సమాధిలోనే ఉందని అనేక విధాలుగా అర్థాలు చెప్పుకునే వీలున్న ఈ శ్లోకం రాస్తాడు.
స్థితాః క్షణం పక్ష్మసు తాడితాధరాః
పయోధరోత్సేక నిపాత చూర్ణితాః
వళీషు తిర్యక్చలనం ప్రపేదిరే
చిరేణ నాభిం ప్రధమోద బిందవః
పద్మాసనంలో కూర్చున్నవారి నిటారుతనం ఎలా ఉంటుందో ఆమె తల మీంచి జారిన వాన నీటి బిందువులు చెప్తాయి.
ఆమె శరీర సౌష్టవాన్ని చెప్తాయి.
ఆమె నిశ్చలతను కూడా చెప్తాయి.
మొదటి వర్షపు చినుకులు ఆమె కంటి పక్ష్మముల మీద పడ్డాయి. పక్ష్మాలంటే పై రెప్ప చివర ఉండే వెంట్రుకల కుచ్చు. అది వెనక్కి విరిగి ఉంటే ఆ కళ్ళు విప్పారినట్టు ఉంటాయి. నీటి బిందువు ఆ పక్ష్మముల మీద పడి అక్కడ క్షణం ఆగిందంటే అవి ఎంత చక్కగా వంపు తిరిగి ఉన్నాయో తెలుస్తోంది.
అక్కడ నుంచి అధరాన్ని అంటే కింది పెదవిని కొట్టేయి. పయోధరాల మీద పడి చిట్లేయి. ఇలా వాటి ప్రయాణం రాస్తాడు. ఇక్కడ స్థిర సౌందర్యం, చలత్ సౌందర్యమూ రెండింటినీ కలగలిపి రాయగల కవితాకళ కనిపిస్తుంది.
సందర్భం నుంచి కాస్త పక్కకి వస్తే మధుబాల పోయినప్పుడు స్మైల్ గారు ఆమె మీంచి వాన చినుకులు పడే పాట గురించి చెప్తూ రాసినది చదివితే ఈ శ్లోకమే గుర్తొచ్చింది.
ఇక్కడ ఈ ప్రేమ కథ తిరస్కారం నుంచి తిరిగి అనురాగానికి చేరడానికి పార్వతి చేసినదేమిటో మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు.
కవి తపస్సు అన్నాడు. తపస్సంటే మానసిక శక్తులను దృఢతరం చేసేది. ఎవరమైనా గమనించవలసినది అదే.
శివుడు దిగివచ్చాడు.  మారు వేషంతో, అదే వేషంతో వచ్చే ధైర్యం లేక. ఎందుకీ తపస్సు అన్నాడు. రకరకాల ప్రశ్నలు అడిగేడు. నీవంటిదానిని అవమానించడానికి గానీ తిరస్కరించడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది.
”పరాభి మర్శో న తవాస్తి కః కరం
ప్రసారయేత్ పన్నగరత్న సూచయే”
అంటాడు. పాము పడగ మీదున్న మణి కోసం ఎవరైనా చెయ్యి చాపగలరా?
దేవతానుగ్రహం కోసమా ఈ తపస్సు. దేవతలంతా మీ వాళ్ళే కదా. మీ తండ్రి హిమాలయం మీదే తిరుగుతూ ఉంటారు కదా! అని ఇలాంటి గడుసుమాటలాడి చివరకు ప్రేమ కబురు వెచ్చగా ఇలా చెప్తాడు.
మంచి వరుడి కోసమా తపస్సు – అరే! ఎక్కడేనా రత్నం వెతుకుతుందా? వెతకబడుతుంది గానీ- అంటాడు.
”న రత్నం అన్విష్యతి, మృగ్యతేహి తత్”
నర్మగర్భం అంటే ఇదే. అన్విష్యతి – మృగ్యతే – అనే రెండు బలమైన క్రియలతో తన ప్రేమ ప్రకటన చేసేసాడు. అందులోంచి నువు వెతకడమేమిటి – నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చేనన్నాడు –
 ఎటువంటివాడు? ఒకనాడు కాదన్నవాడు. లోకంలో ప్రేమ అన్న భావాన్నే బూడిద చేసేసి కాదన్నవాడు.
ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చానన్నాడు.
”అయ్ లవ్ యూ” అనగానే ”అయ్ టూ” అనే చచ్చు సంభాషణల చెత్త ప్రేమ కథలు చదవలేకా మానలేకా ఉన్న మనకి ఈ మాట ఎంత హాయి గొలుపుతోంది.
“శివుడి కోసం తపస్సు” అని చెలికత్తెచేత చెప్పించింది.
 ఇక శివుడిని రకరకాలుగా తక్కువ చేస్తూ ఆమె చేతే అతడు చాలా గొప్పవాడని అనిపించాడు టక్కరి శివుడు.
 చివరకు అదంతా అయితే కావచ్చు కానీ అతనంటే నాకిష్టం అనీ చెప్పించాడు.
”అలం వివాదేన యధాశ్రుతస్త్వయా
తథావిధ స్తావదశేష మస్తు సః”
నీవాదన చాలు. అతను నువ్వన్నట్టే భస్మమాత్రదరిద్రుడే. కానీ “మమాత్రభావైకరసం మన స్థితః -” నా మనసు అతని యందే రససిద్ధి పొంది వుంది. నా ఇష్టం నాది. అంది.
ఈ మాట దొంగశివుడు మాయదారి వేషంలో ఉండి ఆమె చేత చెప్పించుకుని – అప్పుడు ”నేనే వాడు” అన్నాడు.
అనేలోపు అతను ఇంకా ఏమంటాడో – తన ప్రియుడి గురించి ఏ నిందలు వినాలో అని లేవబోయింది. కొంగు జారింది. వెంటనే ”తాం కృత స్మితః సమాలలంబే” అంటాడు కవి. చిరునవ్వుతో శివుడు ఆమెను పట్టుకున్నాడు. కాదు, పట్టేసుకున్నాడు.
కంగారు పడింది. వెళ్ళలేదు. ఉండలేదు.
”శైలాధిరాజ తనయా నయాయౌ, నతస్థౌ” – అంటే అర్థం అదే.
ఇవాళనుంచీ నీ దాసుడనన్నాడు. అందానికి దాసుడవలేదు. ఆమె చేసిన కఠోర శ్రమకు, సంపాదించిన మనశ్శక్తికి దాసుడయ్యాడు. నిజమైన ప్రేమలకు అందాలు ఎంతవరకూ అక్కరకొస్తాయి.
కానీ పార్వతి వచ్చి మా పెద్దవాళ్ళతో మాట్లాడు అని చెప్పింది. ఆమె ఆభిజాత్యగౌరవం ఆమెది. అప్పుడు శివుడు అతి కష్టం మీద ఆమెను వదిలి మధ్యవర్తులను పంపడానికి వెళ్ళాడట. ”కథమపి ఉమాం విసృజ్య” అంటే ఎలాగో చివరికి వదిలి – అని.
ఒక సర్గంతా పెళ్ళిమాటలు అయ్యాయి. ఆనాటికి నాలుగో రోజు పెళ్ళి నిశ్చయించారు.
‘పశుపతి రపి తాని అహాని కృచ్ఛ్రాత్ అగమయత్” అంటాడు కాళిదాసు. పశుపతి కూడా ఆ మూడు రోజులు అతి కష్టం మీద గడిపాడు – అని.కృచ్ఛ్రాత్ అన్న ఉచ్చారణక్లిష్టమైన పదం వాడతాడు. అంత కష్టం మీద ట గడిచాయట మూడు రోజులు.
రతీదేవి మొదట్లో చెప్పిన మాటల్లో” ప్రియుల పట్ల మనుషులు చంచలంగా ఉంటారు స్నేహితుల పట్ల మాత్రం స్థిరచిత్తులై ఉంటారు” అన్నమాట మరోసారి గుర్తు చేసుకోతగ్గది.
కేవల మోహంలో చంచలత ఉంటుందేమో దానికి స్నేహం కలిస్తేనే ప్రేమగా మారుతుందేమో అనిపింపజేసే మాట అది.
శివపార్వతుల ప్రేమ కథకి కాళిదాసు కుమారసంభవమని పేరు పెట్టడంలో వేరే ప్రత్యేక అంతరార్థం ఉంది. దాన్ని అలా ఉండనిద్దాం.
 ప్రస్తుతానికి మనం ఈ ప్రేమ కథని ఇంతవరకూ రుచి చూద్దాం. ఏదైనా కుదిరితే ఇందులోంచి నేర్చుకుందాం
ఏం స్నేహమంటే ఏమేనా నేలమీద విషయమా!
 దివిలో విరిసిన పారిజాతం కాక!!
 ఆ పూవు కోసుకోవద్దా మనం!!!
*
వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • లక్ష్మీ! క్లిష్టమైన పదాలతో కూడుకొన్న కాళిదాసు కుమారసంభవంలోని పార్వతీ పరమేశ్వరుల కలయికను రసవత్తరంగ నగిషీ చెక్కినట్లు చెక్కి ముందుంచారు.అర్థాలను పనసపండు ఒలిచినట్లు ఒలిచి తొనలు అందించారు! పార్వతీదేవి అందాలు కళ్ళకు ,మనసుకు ఆనటం లేదు.మన్మధుని వింటి అందాన్ని ఊహకు తెచ్చుకొంటే!
  “సందర్భం నుంచి కాస్త పక్కకి వస్తే మధుబాల పోయినప్పుడు స్మైల్ గారు ఆమె మీంచి వాన చినుకులు పడే పాట గురించి చెప్తూ రాసినది చదివితే ఈ శ్లోకమే గుర్తొచ్చింది.”ఆ పాట ఏది అని ఆ మాటలు కొన్ని ఇక్కడ కోట్ చేసింటె గంధలేఫనంలాఉండేది. ” బర్సాత్ కి రాత్” లో జిందగీ బర్ భూలేగనహి బర్సాత్ కి రాత్ “ఆ పాట ఉండాలని!
  ” ప్రియుల పట్ల మనుషులు చంచలంగా ఉంటారు స్నేహితుల పట్ల మాత్రం స్థిరచిత్తులై ఉంటారు” అన్నమాట గోపుర శిఖరాగ్రంపై కళసం!
  “అందానికి దాసుడవలేదు. ఆమె చేసిన కఠోర శ్రమకు, సంపాదించిన మనశ్శక్తికి దాసుడయ్యాడు. నిజమైన ప్రేమలకు అందాలు ఎంతవరకూ అక్కరకొస్తాయి.” ఇది రెండవ కళసం”!
  మంచి వరుడి కోసమా తపస్సు – అరే! ఎక్కడేనా రత్నం వెతుకుతుందా? వెతకబడుతుంది గానీ- అంటాడు.”ఇది మూడవ కళసం!
  “అయ్ లవ్ యూ” అనగానే ”అయ్ టూ” అనే చచ్చు సంభాషణల చెత్త ప్రేమ కథలు చదవలేకా మానలేకా ఉన్న మనకి ఈ మాట ఎంత హాయి గొలుపుతోంది.I love you !Me too పదాలు ఎంత నీరసంగా !రసవిహీనంగా ! అస్థిపంజరం లా! ప్రేమను గంధం తీసినట్లు తీశారు!
  “స్నేహమంటే ఏమేనా నేలమీద విషయమా!”
  “దివిలో విరిసిన పారిజాతం కాక!!”
  తాంబూలం పండినట్లు పండించారు ప్రేమను! మీకు 🙏🙏🙏! ఇనుప గుగ్గిళ్ళు అంటారు. వాటిని పారిజాతాలుచేసి దోసిలిలో నింపారు!

  • ధన్యురాలిని. సుశీల నామంతో పార్వతీ దేవి అనుగ్రహం లభించింది

   • ధన్యత నాది లక్ష్మీ! మీరు రాసినవి చదివి నేను పొందే అనుభూతి అనంతం! ఏం వెలకట్టగలను! మీ పరిచయాలు ,మీరు రాసినవి చదివే అవకాశం లభించింది. అదే నాకెంతో సంతోషం! లేకపోతే నేను నా జీవితంలో ఎంతో కోల్పోయేదానిని! ధన్యవాదాలు మీకు!!💐💐💐

 • Madam,
  For me, the write up has a great educational value. I have never practiced the art of expressing Love, though I taught it as a teacher, for decades.
  Thank you, for a good article.
  Kamaraju Pulugurtha

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు