ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి

బల్దేర్ బండి మీద జొన్న రొట్టెల్ని పట్టుకొని ఢావ్లో గీతాల్ని పాడుకుంటూ, కేసులా పూల రంగు నీళ్లని చల్లుతూ చక్ మక్  వెలుగుల్ని టాండో నుండి మోసుకొస్తున్న రమేష్ కార్తీక్ నాయక్‌తో వాతె చితె…

టాండో పుస్తకంలో కవిత పాదాల మధ్య బంజారా పదాలు ఇమడ్చడం వల్ల కవితలు తమ సహజత్వాన్ని కోల్పోతాయని అనిపించలేదా? ( మాట్లా, సలోయి)
సహజత్వాన్ని కోల్పోవాలంటే అంతకుముందు చాలా సాహిత్యం వచ్చి ఉండాలి. లెక్కలేనంత సాహిత్యం ఉండి, ప్రజాధరణ పొంది అప్పటికే ఒక ఒపీనియన్ ఏర్పడి ఉండాలి. ఉందో లేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. చదివే అలవాటు ఉన్న పాఠకుడు, లిపిలేని, గుర్తింపులేని భాషా పదాలను సాహిత్యంలో చదివినప్పుడు ఇబ్బందికి గురవుతారని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే చదవాలన్న ఆసక్తి ఉన్నవాడికి అవి పెద్దగా ఇబ్బందిగా అనిపించవు. ఒకరకంగా వారు ఎడ్యుకేట్ అవుతున్నామని అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో బంజారాలతో బంజారేతరులకి ఉన్న అనుబంధం మరే తెగకి లేదంటే  అతిశయోక్తి లేదు. కాబట్టి ఎంతో కొంత గోర్ బోలి పదాలు వాళ్లకు తెలిసే ఉంటాయి.
 బంజారా సంస్కృతిని తెలుగు భాషలో వ్యక్తీకరించేటప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి?
 రాసే వాడికి ఏమీ తెలియకపోతే కచ్చితంగా సవాళ్లే ఎదురవుతాయి. ఏదో చెప్పాలనుకుని మొదలైన కథ ఇంకెక్కడికో ఎలాగో వెళ్ళిపోతుంది. తలా ఏదో తోక ఏదో అంత గందరగోళం అయిపోతుంది. ఆ ప్రయత్నం కేవలం “నేను కూడా రచయితనే” అని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం మాత్రమే, నిజం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసి గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో, వారి ప్రతి పండగ ఎంతోకొంత తెలుగు పండగలతో ప్రభావితం  అయిందని కచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి రాసే వాడికి తన అస్తిత్వం పట్ల, తన పండగలు, పబ్బాల పట్ల అవగాహన ఉంటే, అప్పటికే ఎంతోకొంత సాహిత్య అధ్యయనం ఉంటే ఎంతో కొంత నిజాయితీగా చెప్పాలనుకున్నది చెప్పగలుగుతాడని నేను నమ్ముతాను.
 ఇతర భాషలు, సంస్కృతులపై దాడి బయటి నుంచి కనిపిస్తుంది. కానీ బంజారాల భాష, సంస్కృతి కనుమరుగవడానికి బంజారాలే కారణమా? మీరేమంటారు?
 కారణమా? కాదా? అనేది మనం కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే మన వాళ్ళ గురించి, నా గురించి, నా కుటుంబ చరిత్ర గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. మన వాళ్ళను కొందరిని చూసినప్పుడు, విన్నప్పుడు కొంత భయంగాను,అసంతృప్తిగాను నడిపిస్తూ ఉంటుంది. వారి మాటలో, వారి నడకలో రాజకీయ నాయకుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విషయానికి వస్తే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు వ్యతిరేకంగా మాట్లాడేవారు, ప్రతి దానికి వంకలు పెట్టేవారు కచ్చితంగా ఉంటారు. దీనినే మనం సమాజానికి కూడా అనువదించుకోవాలి. మన పూర్వీకులు చేసిన వర్తకం పనుల ప్రభావం వల్ల మనం కొంతవరకు socialise అయ్యాం. ఒకరిని చూసి ఒకరు చదువుకోవడం. పోటీపడి బతికేందుకు వలసలు వెళ్లడం. ఇలా చాలా కారణాల చేత మనం కొంచెం (కొంచెం అంటే కొంచమే) బాగుపడ్డాం. ఈ మాట ఎవరు నమ్మరు. సూర్యుడి కాంతి చిన్నదైనా అద్దంలో అది దూర తీరాలకి ప్రతిబింబిస్తుంది. మన విషయంలో కూడా అదే జరిగింది. జరుగుతుంది. SC, ST లు కొందరు జనరల్ కేటగిరీలో ఉద్యోగాలు సంపాదించినా వాటిని కొందరు కేవలం రిజర్వేషన్ వల్లే వచ్చింది అని జమ కట్టేస్తున్నారు. చెప్పుకుంటూ పోతే చాలా రకాల సమస్యలున్నాయి. ఒక పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది. నేను చెప్పింది అంతా అనవసరం అనిపించవచ్చు. సరిగ్గా ఆలోచిస్తే, ప్రశ్నకి సమాధానం ఇక్కడే దొరుకుతుంది.
 సంచార జీవితం నుంచి స్థిర జీవితానికి వచ్చిన బంజారాలు, మళ్లీ వలసలు వెళ్లాల్సిన పరిస్థితులు తండాల్లో ఎందుకు ఏర్పడుతున్నాయి?
 ఇది ఒక సంచార సమూహాల సమస్య మాత్రమే కాదు. ముందు ముందు మన దేశం కూడా వలస వెళ్లే పరిస్థితి రావచ్చు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నో కుటుంబాలు వ్యవసాయం, పశువుల పెంపకం, అడ్డా కూలి, కూర కాయలమ్మడం ఇలాంటివి ఎన్నో రకాల పనులు చేస్తూ జీవనం గడిపే వారు. గడుపుతున్నారు. గడుపుతారు. చేయడానికి ఏ పనులు లేకపోతే, పుట్టిన చోట అయిన ఎవరైనా ఎందుకుంటారు? రాజకీయ నాయకులు ఎన్నో రకాల విషయాలు చెబుతూనే ఉంటారు. పథకాల హామీలు ఇస్తూనే ఉంటారు. కానీ ఏ నాయకుడు కూడా తమకున్న ఆస్తుల నుండి సంపాదన నుండి కొంత ఖర్చు పెట్టి బాగు చేసి ఉపాధి కల్పించాలని అనుకోరు. అదేమో జనాలకి అర్థం కాదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసి, చివరాఖరికి ఇట్ల వలస బాట పట్టి ఎటు కాకుండా ఉండిపోతారు.
 సలోయి కవితను చాలా బాగా చెప్పారు. బంజారా సంస్కృతిలో మాంసాహారం కూడా ఒక భాగంగా ఉంది. అయితే, గత కొన్నేళ్లుగా మాంసాహారానికి వ్యతిరేకంగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంజారాల ఆహార సంస్కృతిని మీరు ఎలా చూస్తారు? ఇలాంటి వాదనలు బంజారా సంస్కృతిపై ఎలాంటి ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు?
 నేను తినే ఆహారం మీకు నచ్చకపోవచ్చు. మీరు తినే ఆహారం నాకు నచ్చకపోవచ్చు. ఈ నచ్చక పోవడం అనే విషయం మీద ఎన్నో రకాల పోరాటాలు జరగొచ్చు. పోరాటాలు కాస్త యుద్ధాలుగా కూడా మారిపోవచ్చు. ఈ అవకాశాన్ని ఇతరులు వాళ్లకు అనువుగా మార్చుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనకి ఎదుటివాడి ఆహారం గురించి ఏమి అవగాహన లేనప్పుడు దాని గురించి మాట్లాడడం అనేది పెద్ద అపరాధంగా నేను భావిస్తాను. ఆహారానికి సంబంధించిన వాదనలు ఒక రకమైన ప్రభావాన్ని చూపుతాయని చెప్పడానికి లేదు. ప్రభావాలనేవి లేయర్స్ గా ఉంటాయి. ప్రతి లేయర్ కి ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉంటుంది.
గతంలో వచ్చిన బల్దేర్ బండి కవితా సంపుటి, ఇప్పుడు వచ్చిన టాండో రెండూ బంజారా నేపథ్యం నుంచి వచ్చినవే. అయితే, ఈ రెండు సంపుటాల మధ్య ఉన్న ప్రధాన తేడా ఏమిటి? బంజారా జీవితం, సంస్కృతి, అస్తిత్వాన్ని చిత్రించడంలో టాండో ఏ విధంగా భిన్నంగా నిలుస్తుంది?
 బల్దేర్ బండి నా మొదటి కవిత్వ పుస్తకం. టాండో నా రెండో కవిత పుస్తకం. రెండింటికి మధ్య 8 ఏళ్ల తేడా ఉంది. రెండు కూడా రాసింది నేనే కాబట్టి ఏది ఎందుకు భిన్నంగా నిలుస్తుందో, ఏది ఎందుకు ప్రత్యేకమో చెప్పే అంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా నా అస్తిత్వాన్ని, నా వాళ్ళని అర్థం చేసుకునే దగ్గరే ఆగిపోయాను. ముందు ముందు రాసే రచనలు, ముందు ముందు నేను చేసే ప్రయాణాలు, వీటివల్ల ఇంకొంచెం లోతుల్లోకి వెళ్లి ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటానేమో అని నమ్ముతున్నాను.
 తెలుగు సాహిత్యంలో బంజారా జీవితాల గురించి ఇది ఎలాంటి చేర్పు? వారి జీవితాల గురించి ఇంకా రావాల్సిన అవసరం ఉందా?
 ప్రస్తుతానికి గిరిజన ఆదివాసుల్లో బంజారా, సవర, గోండి, ఎరుకల వారి గురించి ఎంతో కొంత సాహిత్యం వచ్చిందని, నేను చదివిన పుస్తకాల ద్వారా నాకు కొంత అవగాహన ఉంది. కేవలం ఈ నాలుగు తెగలే కాదు, ఇంకా మనకి దాదాపుగా 30కి పైచిలుకు తెగలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా సాహిత్యంలో రావాలి. రాకపోతే వాళ్ళ అస్తిత్వమే నామరూపాలు లేకుండా పోతుంది. అది మనకు తెలియందేమి కాదు. ఇక బంజారాల విషయానికొస్తే, ఈ మధ్యకాలంలో కొంతవరకు కధకులు, కవులు పుట్టుకొచ్చారు. వీళ్ళ మీద లెక్కపెట్టదగ్గిన పుస్తకాలు వచ్చాయి. వీటన్నింటిలో సాహిత్యాన్ని సాహిత్యంగా రాస్తున్న వాళ్లు ఇంకా తక్కువ. తిప్పి కొడితే ఒక నలుగురు ఉన్నారు, అంతే. ఇప్పుడిప్పుడే ఒక వేదిక ఏర్పడుతుంది. వచ్చే ప్రతి కవితా, కథ కూడా ఎంతో కొంత జీవితాన్ని చెప్తుందని తెలుసు, ఇంకా విస్తృతంగా సాహిత్యం రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. అప్పుడే బంజారాలు ఏంటి? వాళ్ళ జీవితాలు ఏంటి? సామాజిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇలాంటి వెన్నో అర్థం చేసుకోవడానికి సాహిత్యం తోడ్పడుతుంది.
 బంజరాలకు ప్రత్యేక సంస్కృతి ఉంది కానీ ఇప్పుడు అది పరాధినం అవుతుంది. దానిపై మీ స్పందన?
 బంజారాలతో పాటు ప్రతి ఒక్కరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఇలా అన్ని మతాల వాళ్ళు వాళ్లకే తెలియకుండా కొంత ప్రభావితం అయి తమని తాము కోల్పోతున్నారు ఏమో అనేది నా భావన. మనవాళ్లు మన సంస్కృతి గొప్పదని చాటి చెప్పడం కోసం, మన పండగలని, సంస్కృతిని పబ్లిక్ సెలబ్రేషన్స్ గా మార్చేశారు. ఒక్కసారి ఏదైనా పబ్లిక్ అయిందనుకోండి అది మళ్ళీ ప్రైవేట్ కావడం కష్టం.
*

హాథిరామ్ సభావట్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.