ఆ కందులూరు ‘ఇండ్ల’లోకి వెళ్లి…!

నాకు తెలియని జీవితాన్ని చూపించడానికి కథల స్టేజీ ఎక్కినందుకు, కథకి ఇంకాసిని రంగుల చీకట్లని అద్దినందుకు చంద్రశేఖర్ రేపటి కథకుడు!

ఇండ్ల చంద్రశేఖర్ కథల సంపుటి “రంగుల చీకటి” ఆవిష్కరణ ఈ నెల యేడున జరుగుతోంది. ఈ కథలకు అఫ్సర్ రాసిన ముందు మాట ఇది.

*

రోజువారీ బతుకులో చాలా నాటకీయత వుంది. కాని, నాటకీయత వొక లక్షణంగా బతికే కథకి బతుకు తక్కువ. అమాసకో పున్నమకో వొక కథ చదివే సాధారణ చదువరికి కూడా నాటకీయత అంతగా ఆకట్టుకోదు. ఎందుకంటే, నాటకీయమైన మలుపులు తిప్పడంలో రచయితకి బోలెడు శిల్ప సౌకర్యమూ సౌలభ్యమూ వుంది. కథలోపలి నగ్నసత్యాలేమీ తేల్చకుండానే మరీ ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా చివరి వాక్యంలోకి వెళ్ళిపోవచ్చు.

ఇప్పుడు మీరు మరోసారి చదవబోయే ఇండ్ల చంద్రశేఖర్ కథల్లో నాటకీయతకి చాలా అవకాశమే వుంటుంది. కాని, చంద్రశేఖర్ ఆ తేలికైన శిల్ప సాధనాన్ని పెద్దగా పట్టించుకోడు, అతనికి నాటకరంగమే ప్రధాన వ్యాపకం అయినప్పటికీ—

డ్రామా, మెలోడ్రామా—ఇవి రెండూ కాని అద్భుతమైన వ్యక్తీకరణ సాధనం ఇంకోటి వుంది- అది performativity. ఇది చూపించడానికి రచయిత తన కథని స్టేజీ ఎక్కించక్కర్లేదు. పాత్రలకి నాటకాలు నేర్పక్కర్లేదు. మెలోడ్రామా అసలే అక్కర్లేదు. అమెరికన్ కవి విలియం కార్లోస్ విలియమ్స్ వొక చోట అంటాడు: “ఈ కాయితమ్ముక్క వుందే, ఇదే పెద్ద field of action.” కొత్త సాహిత్య సన్నివేశంలో కేవలం పదాలే కాదు, వొట్టి సన్నివేశాలే కాదు. మనిషి శరీరమూ, దాని చుట్టూరా వుండే space కూడా చాలా మాట్లాడుతుంది. అదంతా performativity. చంద్రశేఖర్ కథన శిల్పంలో ఈ performativity అనే లక్షణం అందంగా సహజంగా వొదిగి పోయింది, డప్పు మీది చెయ్యిలా- చేతిలోని చిర్రా చిటికెలా! ఆ కుడి ఎడమ చేతుల మధ్య వుండే internal rhythm. బహుశా, అదే అతన్ని ఇతర సమకాలీన కథకుల నించి విడిగా ప్రత్యేకంగా నిలబెడుతోందని నాకు చాలా ఆలశ్యంగా అర్థమైంది, మొత్తం కథల్ని రెండు సార్లు చదివాక!

సాధారణంగా ఈ సైజు పుస్తకాన్ని అంటే పది చిన్న కథల పుస్తకాన్ని చదవడానికి నాకు వొక రోజు కూడా ఎక్కువే. చంద్రశేఖర్ ఈ కథల ప్రెస్ కాపీ పంపి, చాలా కాలమే అయ్యింది. మధ్యలో చంద్రశేఖర్ గుర్తు చేస్తూనే వున్నాడు. కాని, అతనికి తెలియనిదేమంటే నేను తన కథల్ని మరచిపోలేదని..మరచిపోలేనని!

మరచిపోవడం కష్టమవుతోందని గట్టిగా చెప్పగలను. Cultural memory ని అంత కచ్చితంగా చెక్కినట్టు చూపిస్తాడు చంద్రశేఖర్. చదివాక, ఈ సాంస్కృతిక స్మృతిని ఎట్లా అర్థం చేసుకోవాలన్న ప్రశ్న వస్తుంది. అదీ కాని అంతకంటే పెద్ద ఇబ్బంది ఎదో వుంది అతని కథల్లో! అదేమిటో నేను తేల్చుకోలేకపోతున్నాను. ఇప్పటికీ తేలిందని అనలేను. కాని, చంద్ర శేఖర్ కథల్లోనే మునిగి వుండలేను కాబట్టి, నేనే బలవంతంగా బయటికి తేలి, ఎదో వొకటి చెప్పాలి. అది నేను అంత సునాయాసంగా చేయగలిగే పని కాదు. మొత్తంగా ఎంతో కొంత తృప్తి వుండాలి నాకు- చదువుతున్న కథల మీద! అవి నాకు అర్థమవుతున్నాయనో, లేదనో నాకు నేను చెప్పుకోవాలి. లేకపోతే, నాలుగు మాటలు కాదు, వొక్క మాటా పలకలేను. ఇదీ వొక చదువరిగా నేను ఎదుర్కొన్న సంఘర్షణ. ఇట్లాంటి సంఘర్షణ కచ్చితంగా మీరు కూడా ఎదుర్కొంటారు, ఈ కథలు చదువుతున్నప్పుడు. అంతకంటే ఎక్కువగా, చదవడం అయ్యాక-

కథకి ఏది పనికొస్తుంది ఏది పనికిరాదు అన్న విషయం మీద చాలా సేపు వాదులాడుకోవచ్చు. నిజమే కాని, కథా హృదయం తెలిసిన రచయిత అదేమిటో తేల్చుకునే లోపే మంచి కథతో ప్రత్యక్షమైపోతాడు. మహా కథకుడు రేమండ్ కార్వర్ అంటాడు: బతుకు చిందరవందరగా వుంటే, వొక ఏకాగ్రతని వెతుక్కోడానికి కథలు రాశాను- అని. నాకు తెలిసి, మంచి కథకులు చాలా మంది అట్లాంటి చిందర వందరలోనే వుండి వుంటారు, బతుకు తెరిపినివ్వదు కాబట్టి- చంద్రశేఖర్ తో సహా, అతనికిష్టమైన కథకులనే తీసుకుంటే, వాళ్ళెవ్వరికీ బతుకు అంత తేలిక కాదు. చంద్రశేఖర్ కి అటూ ఇటూ ఏడూ తరాల్లో ఎవరూ సాహిత్యజీవులు కాదు. సాహిత్యమనే ప్రత్యేకమైన కాగితమ్ముక్క అనేదొకటి వాళ్ళ బతుకుల్లో వుందో లేదో కూడా తెలీదు.

నాకూ చంద్రశేఖర్ కి వొక పోలిక వుంది. నా బాల్యం గడిచిన చింతకానికీ, చంద్రశేఖర్ వాళ్ళ వూరు కందులూరు లానే నాటకాల పిచ్చి. మా దొరగారి ఇంటి ముందు నాటకాలాడే వాళ్ళు. దాని కోసం ముందు రోజులు వూళ్ళో పంచే రంగు కాగితాల నాటకం కరపత్రాలతోనో, పీర్ల చావిడి దగ్గిర పాటలతోనో మొదలయింది సాహిత్యం అంటే నా అసలు fascination. చంద్రశేఖర్ కి కూడా అంతే. డప్పు మోత, నాటకాల రంగులు—అవి మా చీకట్లని వెలిగించిన రంగుల కాంతులు. చంద్ర శేఖర్ ఆ కందులూరు అనే చిన్న వూరు తయారుచేసిన మనిషి. అట్లా తన బొమ్మ ఎట్లా తయారయిందో స్పష్టమైన అంచనా వున్న కొద్దిమంది పల్లె రచయితల్లో తనూ వొకడు. జీవితం మాత్రమే చుట్టూరా వుండి, దాన్ని గురించి చెప్పే వ్యక్తీకరణ సాధనాలన్నీ non-verbal గా మిగిలి వున్నప్పుడు, అక్కడి నించి పుట్టుకొచ్చే రచయిత ఎట్లాంటి vebal paradigms ని సృష్టిస్తాడో అన్న వూహ నిజమైనప్పుడు నాకు కాస్త వుక్కిరిబిక్కిరిగా వుంటుంది.

అయితే, చంద్రశేఖర్ కథల్లోకి అతని వూరు కేవలం ఎంట్రీ పాయింట్ మాత్రమే.

వొకే వొక్క కథ చదవడం వేరు. కొన్ని కథలన్నీ వొక్కసారిగా చదవడం వేరే అనుభవం. చంద్రశేఖర్ కథలు విడిగా ఏ పత్రికలోనో చదివినప్పుడు నాకు చంద్రశేఖర్ వొక్కడే కనిపించే వాడు. అతని స్వరం వొక్కటే వినిపించేది. ఇప్పుడు పుస్తకంగా చదువుతున్నప్పుడు చంద్రశేఖర్ వొక్కడు కాదు, అతని స్వరమూ అతనొక్కడిదే కాదు. అనేక పాత్రల మధ్య వినిపించే బృందగానంలో చంద్రశేఖర్ అందంగా లీనమైపోయాడు. ఈ పాత్రల మధ్య చదువరి తనూ పాత్ర అవుతాడు. కొన్ని పాత్రలు పరిచయమవడం, అవి మరోసారి ప్రత్యక్షమవడం మాత్రమే కాకుండా, ఇన్ని పాత్రల మధ్య పోలికలు వెతుక్కోవడం అనే సహజమైన ఆసక్తికి సానబట్టినట్టు వుంటుంది.

వొక్కో కథా చదువుతూ, ఇంతకుముందు పేజీల్లోకి వెళ్తున్నప్పుడు చంద్రశేఖర్ మన ముందు ఎంత జీవితాన్ని పరిచి చూపించాడో గమనిస్తే ఆశ్చర్యంగా అనిపించింది. మొదటి విషయం: నాకు చాలా మంది దళిత క్రైస్తవులూ, వాళ్ళ కుటుంబాలతో సన్నిహిత బంధమే వున్నప్పటికీ, ఆ ప్రపంచంలో నాకు అపరిచితమైన కోణాలు చాలా వున్నాయి. అయితే, కథని కేవలం సన్నివేశాల మధ్య వూపిరాడకుండా చేయడం కాకుండా, వొక స్థితిని మన చూపులో ప్రాణప్రతిష్ట చేయడం ఎట్లానో చంద్రశేఖర్ కి తెలుసు. ఉదారహణకు చాలా కథలు చూపించవచ్చు కాని, ముఖ్యంగా రెండు కథలు “బోర చెక్కు” “దినం” చదువుతున్నప్పుడు ఇంతకుముందు రేమండ్ కార్వర్ అన్నాడే ఆ “ఏకాగ్రత” అనేది వెంటనే గుర్తొచ్చింది. వొక్కో పేరాగ్రాఫ్ చదువుతున్నప్పుడు వొక్కో పెయింటింగ్ ఎదురుగా నిలబడి అట్లా చూస్తూనే వుండాలనే అనుభూతిని కలిగిస్తాడు భాష ద్వారా!

రెండో విషయం: చంద్రశేఖర్ వాడిన అనుదిన సాంస్కృతిక ప్రతీకలు. అవి ఎంత గాఢమైన ముద్ర వేస్తాయంటే, ఈ కథలు చంద్రశేఖర్ మాత్రమే రాయాలి అని ముమ్మారు అనిపిస్తాయి.

ఇక మూడో విషయం: ఆ రెండీటి మధ్య లయ కుదరడం. సహజమైన పొంతన.

Visualization అన్నది కొంతమందికి పుట్టుకతోనే అబ్బే గొప్ప విద్య కావచ్చు. దృశ్యమానం చేయడం అనే భావనని గురించి మనం చాలా సార్లు చెప్పుకుంటాం. కాని, కేవలం దృశ్యమే కనిపించే పెయింటింగ్ లో insight లేదు. వూరికే చెట్లూ పూలూ మనుషుల్ని చూసి మురిసిపోయే romanticization ని చంద్రశేఖర్ దరిచేరనివ్వడు. దృశ్యం చూపిస్తున్నాడంటే అందులోంచి బతుకు తడీ, ఎండా రెండూ చదువరి కళ్ళల్లో మెరవాల్సిందే. కొత్త కథ స్థానికతని చెప్పాలి, ఆ స్థానికతలో కూడా నిర్దిష్టమైన కోణం మీద కెమెరా పడాలి. కెమెరా వెలుగు ఎక్కడ పడాలో నిర్దేశించుకోవడంలో కథకుడి ఫ్రేం బతుకుతుంది. దీన్ని నేను performativity అనుకుంటున్నాను.

చంద్రశేఖర్ కథలకూ కచ్చితంగా కొన్ని నిర్దిష్ట స్థలాలు వున్నట్టే, కాలాలు కూడా వున్నాయి. ఆ స్థలంలో ఆ కాలంలో స్త్రీపురుష శరీరాలు ఎట్లా సంచరిస్తాయో చెప్పే నేర్పులో కూడా అతనిలోని దృక్పథ సౌందర్యం వుంది. కథకి ముందు ఈ రచయిత ఎట్లాంటి హోం వర్క్ చేస్తాడా అన్న ప్రశ్న పుట్టిస్తుంది ఆ దృక్పథ సౌందర్యం. మొదటి కథ “జనారణ్యం” నించి చివరి కథ “మాతమ్మ అలియాస్ స్టెల్లా మేరీ” దాకా చంద్రశేఖర్ కథ వెంట మనల్ని తరుముకుంటూ వెళ్ళేది ఈ దృక్పథ సౌందర్యమే. తనకో జీవితం వుందని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, తను చెప్తున్న జీవితానికో దారీ తెన్నూ వున్నాయని చెప్పడంలో రచయిత credibility వుందని నేను నమ్ముతాను. ఆ దారీ ఆ తెన్నూ స్థిమితంగానో, స్థిరంగానో వుండాలని కాదు, వొకానొక uncertainty వున్నా పర్లేదు. Uncertainty దృక్పథం కాదని అనలేం కదా! ఉండక తప్పదు, అన్ని విశ్వాసాలూ ఉద్యమాలూ వాదాలూ ఎంతో కొంత బతకనేర్చిన తనంలోకి జారిపోతున్నప్పుడు ఈ క్షణం అనే కత్తిమొన మీద నిలబడిన రచయితకి uncertainty తప్పదు.

నా కొద్దిపాటి జీవితంలో నేను చూసిన విషాదాల్లో నాగప్పగారి సుందర్రాజు మరణం వొకటి. అనంతపురంలో అతని ఇరుకు గదిలోకి వెళ్లి దగ్గిరగా చూసిన మరణం. ఎప్పటికీ అర్థం కాని అనిశ్చిత మరణం. ఇప్పటికీ ఆ దృశ్యాన్ని చెప్పడానికి మాటలు రాని uncertainty. ఆ క్షణంలో జీవితాన్ని గురించి నాకేమీ తెలియదని కచ్చితంగా అర్థమైంది. ఇవాళ చంద్రశేఖర్ కథలు చదివాక కూడా అదే అంటున్నాను. నాకు తెలియని జీవితాన్ని చూపించడానికి కథల స్టేజీ ఎక్కినందుకు, కథకి ఇంకాసిని రంగుల చీకట్లని అద్దినందుకు చంద్రశేఖర్ రేపటి కథకుడు!

– సెప్టెంబర్ ఎనిమిది రెండువేల పద్దెనిమిది

ఫిలడెల్ఫియా

Avatar

అఫ్సర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అప్సర్ గారు నా పుస్తకానికి ముందుమాట రాసినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • Very good mundu Mata, which is a rare occurrence in present day Telugu literature. This has Afsar Gari trademark. Since I am a theatre activist first I will read these stories.

  • మనకు తెలియని జీవితాన్ని చూపించడానికి కథల స్టేజీ ఎక్కిన, కథకి ఇంకాసిని రంగుల చీకట్లని అద్దిన రేపటి కథకుడు డా. ఇండ్ల చంద్రశేఖర్ మరచిపోలేని కథల సంపుటి “రంగుల చీకటి” ని ఇంత ఆర్తితో పరిచయం చేసిన కవి అఫ్సర్ గారికి కృతజ్నతలు అని పొడి పొడి మాటలతో చెప్పలేను; ఇక నువ్వే దిక్కు గొరుసన్నా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు